18-02-1993 అవ్యక్త మురళి

   18-02-1993         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస - సదా ఉల్లాసము మరియు ఉత్సాహము’’

ఈ రోజు త్రిమూర్తి శివబాబా పిల్లలందరినీ విశేషంగా మూడు సంబంధాలతో చూస్తున్నారు. అన్నింటికన్నా మొట్టమొదటి ప్రియమైన సంబంధము - సర్వ ప్రాప్తులకు అధికారులైన వారసులు, వారసులతో పాటు ఈశ్వరీయ విద్యార్థులు, అలాగే ప్రతి అడుగులో ఫాలో చేసేటువంటి సద్గురువుకు ప్రియమైనవారు. త్రిమూర్తి శివబాబా పిల్లల యొక్క ఈ మూడు సంబంధాలను విశేష రూపంలో చూస్తున్నారు. ఆ మాటకొస్తే సర్వ సంబంధాలను నిర్వర్తించడంలో అనుభవీ ఆత్మలే కానీ ఈ రోజు విశేషంగా మూడు సంబంధాలను చూస్తున్నారు. ఈ మూడు సంబంధాలు అందరికీ ప్రియమైనవి. ఈ రోజు విశేషంగా త్రిమూర్తి శివ జయంతిని జరుపుకునే ఉల్లాసముతో అందరూ పరుగుపరుగున చేరుకున్నారు. తండ్రికి శుభాకాంక్షలు ఇచ్చేందుకు వచ్చారా లేక తండ్రి నుండి శుభాకాంక్షలు తీసుకునేందుకు వచ్చారా? రెండు పనులు చేయడానికి వచ్చారు. పేరే శివ జయంతి లేక శివరాత్రి అని అన్నప్పుడు త్రిమూర్తి అనే పదము దేనిని ఋజువు చేస్తుంది? ప్రజాపిత బ్రహ్మా ద్వారా ఏం చేస్తారు? బ్రాహ్మణులైన మీ రచనను రచిస్తారు కదా. తర్వాత వీరి పాలన జరుగుతుంది. కనుక త్రిమూర్తి అన్న పదము ఏమి ఋజువు చేస్తుందంటే - తండ్రితో పాటు బ్రాహ్మణ పిల్లలైన మీరు కూడా తోడుగా ఉన్నారు. తండ్రి ఒంటరిగా ఏం చేస్తారు! అందుకే తండ్రి జయంతి అనగా బ్రాహ్మణ పిల్లలైన మీ జయంతి కూడా. కనుక తండ్రి పిల్లలకు ఈ అలౌకిక దివ్య జన్మకు లేక ఈ వజ్రతుల్య జయంతికి పదమాపదమాల రెట్లు శుభాకాంక్షలను ఇస్తున్నారు. మీ అందరి శుభాకాంక్షలతో కూడిన ఉత్తరాలు, కార్డులు తండ్రి వద్దకు చేరుకున్నాయి మరియు ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు, దూరంగా ఉన్నా లేక సమ్ముఖంలో ఉన్నా, అందరూ హృదయపూర్వకంగా శుభాకాంక్షల పాటను పాడుతున్నారు. దూరంగా ఉన్నవారి శుభాకాంక్షల పాట కూడా చెవులకు వినిపిస్తుంది. దానికి బదులుగా బాప్ దాదా కూడా దేశ-విదేశాలలోని పిల్లలందరికీ పదమాపదమాల అభినందనలను ఇస్తున్నారు.

పిల్లలందరికీ తెలిసిన విషయమేమిటంటే, బ్రాహ్మణ జీవితంలో ఏదైనా ఉత్సవాన్ని జరుపుకోవడం అనగా సదా ఉల్లాస-ఉత్సాహాలు నిండిన జీవితాన్ని తయారుచేసుకోవడము. బ్రాహ్మణుల అలౌకిక డిక్షనరీలో జరుపుకోవడము అనగా తయారవ్వడమని అర్థము. మరి కేవలం ఈ రోజు మాత్రమే ఉత్సవాన్ని జరుపుకుంటారా లేక సదా ఉత్సాహభరిత జీవితాన్ని తయారుచేసుకుంటారా? ఏ విధంగానైతే ఈ స్థూల శరీరంలో శ్వాస ఉంటే జీవితముంది. ఒకవేళ శ్వాస ఆగిపోతే జీవితం ఏమవుతుంది? సమాప్తమవుతుంది. అలాగే బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస - సదా ఉల్లాసము మరియు ఉత్సాహము. బ్రాహ్మణ జీవితంలో ప్రతి క్షణము ఉల్లాస-ఉత్సాహాలు లేకపోతే అది బ్రాహ్మణ జీవితం కాదు. శ్వాస యొక్క వేగం కూడా సామాన్యంగా ఉండాలి. ఒకవేళ శ్వాస యొక్క వేగం ఎక్కువ ఉన్నా సరే జీవితం యథార్థమైనదిగా ఉండదు మరియు తక్కువగా ఉన్నా సరే అది యథార్థమైన జీవితమని అనబడదు. హై ప్రెషర్ లేక లో ప్రెషర్ అవుతూ ఉంటుంది కదా, దానిని సామాన్యమైన జీవితము అని అనరు. కనుక ఇక్కడ కూడా చెక్ చేసుకోండి - ‘‘నా బ్రాహ్మణ జీవితంలో ఉల్లాస-ఉత్సాహాల వేగం సామాన్యంగా ఉందా? లేదా ఒకసారి చాలా వేగంగా, ఒకసారి చాలా నెమ్మదిగా అవుతుందా? ఏకరసంగా ఉంటుందా?’’. ఏకరసంగా ఉండాలి కదా. ఒకసారి ఎక్కువగా, ఒకసారి తక్కువగా ఉండడం, ఇది మంచిది కాదు కదా. అందుకే సంగమయుగం యొక్క ప్రతి ఘడియ ఉత్సవమే. ఇదైతే విశేషంగా మనోరంజనం కోసం జరుపుకుంటారు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో ఇంకెక్కడికి వెళ్ళి మనోరంజనాన్ని జరుపుకుంటారు! ఇక్కడే జరుపుకుంటారు కదా! విశేషంగా ఏదైనా సముద్ర తీరానికి లేక తోటకు లేక క్లబ్బుకు అయితే వెళ్ళరు కదా. ఇక్కడే సముద్ర తీరం కూడా ఉంది, తోట కూడా ఉంది, అలాగే క్లబ్ కూడా ఉంది. ఈ బ్రాహ్మణుల క్లబ్ బాగుంది కదా! కనుక బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస - ఉల్లాస-ఉత్సాహాలు. శ్వాస యొక్క వేగం సరిగ్గా ఉంది కదా లేక అప్పుడప్పుడు కిందా-మీదా అవుతుందా? బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ చెక్ చేస్తూ ఉంటారు. ఇది చెవుల్లో (స్టెతస్కోప్) పెట్టుకుని చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ రోజుల్లో సైన్స్ కూడా అన్నీ ఆటోమేటిక్ వి తయారుచేస్తుంది.

శివ జయంతి లేక శివరాత్రి, రెండింటి రహస్యాన్ని బాగా తెలుసుకున్నారు కదా! ఈ రెండింటి రహస్యాన్ని స్వయం కూడా తెలుసుకున్నారు మరియు ఇతరులకు కూడా స్పష్టంగా వినిపించగలరు ఎందుకంటే ఇది తండ్రి జయంతితో పాటు మీది కూడా. మీ జన్మదిన రహస్యాన్ని అయితే వినిపించగలరు కదా! స్మృతి చిహ్నాన్ని అయితే భక్తులు కూడా చాలా భావనతో జరుపుకుంటారు. కానీ తేడా ఏమిటంటే వారు శివరాత్రి నాడు ప్రతి సంవత్సరం వ్రతం పెట్టుకుంటారు మరియు మీరేమో పిక్నిక్ చేసుకుంటారు ఎందుకంటే మీరందరూ జన్మ తీసుకుంటూనే సదా కాలానికి అనగా సంపూర్ణ బ్రాహ్మణ జీవితం కోసం ఒకేసారి వ్రతాన్ని ధారణ చేసారు, అందుకే పదే-పదే చేయాల్సిన అవసరం లేదు. వారు ప్రతి సంవత్సరం వ్రతం పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్రాహ్మణ ఆత్మలైన మీరందరూ జన్మ తీసుకుంటూనే ఏ వ్రతం చేపట్టారంటే - మేము సదా తండ్రి సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా ఉంటాము. ఈ వ్రతాన్ని పక్కాగా తీసుకున్నారా లేక కొద్దిగా కచ్చాగా (అపరిపక్వంగా) ఉందా...? ఆత్మ మరియు పరమ-ఆత్మ యొక్క సంబంధము అవినాశీ అన్నప్పుడు వ్రతము కూడా అవినాశీగా ఉంటుంది కదా. ప్రపంచం వారు కేవలం ఆహార-పానీయాల వ్రతం పెట్టుకుంటారు. దీని ద్వారా కూడా ఏం ఋజువవుతుంది? మీరు బ్రాహ్మణ జీవితంలో సదా కొరకు ఆహార-పానీయాల వ్రతం కూడా పెట్టుకున్నారు కదా. లేక ఏది కావాలంటే అది తినవచ్చు అని ఆహార-పానీయాల విషయంలో స్వేచ్ఛ ఉందా? పక్కా వ్రతం ఉందా లేక ‘‘అప్పుడప్పుడు అలసిపోతే వ్రతాన్ని భంగపర్చడమా? ఎప్పుడైనా సమయం లభించకపోతే ఏం తయారుచేసుకుంటాలే, ఏదో ఒకటి తెప్పించుకుని తినేద్దాము’’ అని అనుకుంటారా? కొద్ది-కొద్దిగా ఢీలా చేస్తారా? చూడండి, మీ భక్తులు వ్రతం పెట్టుకుంటున్నారు. సంవత్సరంలో ఒక్క సారే పెట్టుకున్నా కానీ మర్యాదను పాలన అయితే చేస్తున్నారు కదా. మరి మీ భక్తులు వ్రతంలో పక్కాగా ఉన్నప్పుడు మీరెంత పక్కాగా ఉన్నారు? పక్కాగా ఉన్నారా? అప్పుడప్పుడు కొద్దిగా ఢీలా చేస్తారా - సరేలే, భోగ్ రేపు పెడదాములే, ఈ రోజు వద్దులే అని అనుకుంటారా? ఇది కూడా బ్రాహ్మణాత్మలైన మీరు మీ జీవితంలో తీసుకున్న అనంతమైన వ్రతానికి స్మృతిచిహ్నముగా తయారై ఉంది.

విశేషంగా ఈ రోజున పవిత్రతా వ్రతం కూడా పెట్టుకుంటారు. ఒకటేమో పవిత్రతా వ్రతం పెట్టుకుంటారు, రెండవది ఆహార-పానీయాల వ్రతం పెట్టుకుంటారు, మూడవది మొత్తం రోజంతటిలో ఎవ్వరికీ ఏ రకమైన దుఃఖమివ్వరు లేక మోసం చేయరు, ఈ వ్రతం కూడా పెట్టుకుంటారు. కానీ మీ ఈ బ్రాహ్మణ జీవితం యొక్క వ్రతము అనంతమైనది, వారి వ్రతము ఒక్క రోజుది. పవిత్రతా వ్రతాన్ని అయితే బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే ధారణ చేసారు కదా! కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు, పంచ వికారాలపై కూడా విజయులుగా అవ్వాలి - దీనినే పవిత్రతా వ్రతమని అంటారు. కనుక ఆలోచించండి, పవిత్రతా వ్రతంలో ఎంతవరకు సఫలురుగా అయ్యాము? ఏ విధంగానైతే బ్రహ్మచర్యము అనగా కామమనే మహాశత్రువును జయించేందుకు విశేషమైన అటెన్షన్ పెడతారో, అదే విధంగా కామమనే మహాశత్రువు యొక్క నాలుగు సహచరులు ఏవైతే ఉన్నాయో, వాటి పట్ల కూడా అంతే అటెన్షన్ ఉంటుందా? లేదంటే కొద్ది-కొద్దిగా క్రోధం చేసినా పర్వాలేదు అని దాని కోసం అనుమతి ఉందా? వాస్తవానికి అలాంటి అనుమతి లేదు కానీ మీకు మీరే అనుమతిని ఇచ్చుకుంటారు. క్రోధం యొక్క పిల్లా-పాపలు ఏవైతే ఉన్నాయో, వాటికి మీరు అనుమతినిచ్చారని చూడడం జరిగింది. క్రోధమనే మహా భూతాన్ని అయితే పారద్రోలారు కానీ దాని పిల్లాపాపలు ఏవైతే ఉన్నాయో, వాటి పట్ల కాస్త ప్రీతిని ఇప్పటికీ పెట్టుకున్నారు. ఏ విధంగానైతే చిన్నపిల్లలు మంచిగా అనిపిస్తారు కదా, అలా క్రోధం యొక్క పిల్లలు అప్పుడప్పుడు ప్రియంగా అనిపిస్తాయా! వ్రతము అనగా సంపూర్ణ పవిత్రతా వ్రతము. చాలామంది పిల్లలు చాలా మంచి-మంచి విషయాలను వినిపిస్తారు. ‘‘క్రోధం రాలేదు కానీ క్రోధం తెప్పించారు, మరి ఏం చేయాలి? నాకు రాలేదు కానీ ఇతరులు తెప్పిస్తారు’’ అని అంటారు. చాలా మజా కలిగించే విషయాలను మాట్లాడుతారు. ఆ సమయంలో మీరు ఉంటే మీకు కూడా వచ్చేది అని అంటారు. అప్పుడు బాప్ దాదా ఏమంటారు? బాప్ దాదా కూడా - అచ్ఛా, మిమ్మల్ని క్షమించాను కానీ ఇకముందు మళ్ళీ చేయవద్దు అని అంటారు.

శివరాత్రి అంటే అర్థమే - అంధకారాన్ని తొలగించి ప్రకాశాన్ని తీసుకొచ్చే రాత్రి. మాస్టర్ జ్ఞాన-సూర్యులు ప్రత్యక్షం అవ్వడము, ఇదే శివరాత్రి. మీరు కూడా మాస్టర్ జ్ఞాన-సూర్యులుగా అయి విశ్వంలో అంధకారాన్ని తొలగించి ప్రకాశాన్ని ఇచ్చేవారు. ఎవరైతే విశ్వానికి ప్రకాశము ఇస్తారో వారు స్వయం ఎలా ఉంటారు? స్వయం అంధకారంలో అయితే ఉండరు కదా. దీపం వలె అయితే లేరు కదా? దీపం కింద అంధకారం ఉంటుంది, పైన వెలుగు ఉంటుంది. మీరు మాస్టర్ జ్ఞాన-సూర్యులు. కనుక మాస్టర్ జ్ఞాన-సూర్యులు స్వయం కూడా ప్రకాశ-స్వరూపులు, లైట్-మైట్ రూపులు మరియు ఇతరులకు కూడా లైట్-మైట్ ఇచ్చేవారు. ఎక్కడైతే సదా ప్రకాశముంటుందో అక్కడ అంధకారం యొక్క ప్రశ్నే ఉండదు, అంధకారం ఉండనే ఉండజాలదు. కనుక సంపూర్ణ పవిత్రత అనగా ప్రకాశము. అంధకారాన్ని తొలగించే ఆత్మల వద్ద అంధకారం ఉండదు. ఉండగలదా? రాగలదా? సరే ఉండదు, కానీ వచ్చి వెళ్ళిపోవడము అనేది జరగగలదా? ఒకవేళ ఏ వికారం యొక్క అంశమైనా ఉంటే దానిని ప్రకాశమని అంటారా లేక అంధకారమని అంటారా? అంధకారం సమాప్తమైపోయింది కదా. శివరాత్రి చిత్రం కూడా చూపిస్తారు కదా. అందులో ఏం చూపిస్తారు? అంధకారం పారిపోతూ ఉందా లేక కొద్ది-కొద్దిగా ఉండిపోయిందా? ఈ శివరాత్రికి విశేషంగా ఏం చేస్తారు? ఏమైనా చేస్తారా లేక కేవలం జెండా ఎగరేస్తారా? మేము ఇది చేయము, ఇది చేయము... అని సదా ప్రతిజ్ఞ చేస్తారు, కానీ మళ్ళీ అలాగే చేస్తూ ఉంటారు... ఇలా అయితే కాదు కదా? ఇంతకుముందు కూడా వినిపించాము కదా - ప్రతిజ్ఞ అంటే అర్థమే ప్రాణం పోయినా ప్రతిజ్ఞ పోకూడదు. ఏదైనా త్యాగం చేయాల్సి వచ్చినా, ఏదైనా వినాల్సి వచ్చినా కానీ ప్రతిజ్ఞ పోకూడదు. అంతేకానీ ఏ సమస్యా లేనప్పుడు ప్రతిజ్ఞను పాటించడము, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య శక్తిశాలిగా అవ్వటము మరియు ప్రతిజ్ఞ దాని ముందు బలహీనంగా అవ్వటము కాదు. దీనిని ప్రతిజ్ఞ అని అనరు. మాట అంటే మాటే. మరి ఇటువంటి ప్రతిజ్ఞను మనసు ద్వారా చేయాలి, నోటి ద్వారా కాదు. చెప్పటం వలన చేసేవారు ఆ సమయానికైతే శక్తిశాలి సంకల్పము చేస్తారు. చెప్పటం వలన చేసేవారిలో శక్తి అయితే ఉంటుంది కానీ సర్వ శక్తులు ఉండవు. మనసుతో ప్రతిజ్ఞ చేసేటప్పుడు ఎవరితో చేస్తారు? తండ్రితో. కావున తండ్రితో మనసు ద్వారా ప్రతిజ్ఞ చేయడం అనగా మనసును ‘మన్మనాభవ’ గా కూడా చేసుకోవడము మరియు మన్మనాభవ యొక్క మంత్రము సదా ఎలాంటి పరిస్థితిలోనైనా యంత్రంగా అవుతుంది. కానీ మనసు ద్వారా చేసినప్పుడే ఇలా అవుతుంది. నేను ఇలా చేయకూడదు అని మనసులో రావాలి. ఒకవేళ మనసులో ఈ సంకల్పాలు వస్తే - ప్రయత్నిస్తాను, చేయాల్సిందే కదా, అవ్వాల్సిందే కదా, ఇలా చేయకపోతే ఏమవుతుంది, ఏం చేస్తాను, అందుకే చేద్దాములే... ఈ సంకల్పాలు వస్తే దీనిని తప్పదు కదా అని చేయడమని అంటారు. ఎవరైతే మనసుతో చేస్తారో వారు - చేయాల్సిందే కదా అని ఆలోచించరు. వారు ఎలా ఆలోచిస్తారంటే - తండ్రి చెప్పారంటే అది అయ్యే ఉంది. నిశ్చయము మరియు సఫలతలో ఖచ్చితంగా ఉంటారు. ఇది మొదటి నంబరు ప్రతిజ్ఞ. రెండవ నంబరు ప్రతిజ్ఞ - అవ్వాల్సిందే కదా, చేయాల్సిందే కదా, ఎప్పుడవుతుందో తెలియదు. ఇలా ‘కదా, కదా’ అని అనడమంటే చిలుక వలె అయినట్లు కదా. బాప్ దాదా వద్ద ప్రతి ఒక్కరూ ఎన్ని సార్లు ప్రతిజ్ఞ చేసారు అన్న ఆ ఫైల్ అంతా ఉంది. ఫైల్స్ చాలా పెద్దవి అయిపోయాయి. ఇప్పుడిక ఫైల్స్ నింపకండి, ఫైనల్ చేయండి. చీటిపై ప్రతిజ్ఞ రాయించండి అని ఎవరైనా బాప్ దాదాతో అంటే, బాప్ దాదా ఎదురుగా మొత్తం ఫైల్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అలాగే చేస్తారా? ఫైల్లో మరొక కాగితాన్ని చేరుస్తారా లేక ఫైనల్ ప్రతిజ్ఞ చేస్తారా?

ప్రతిజ్ఞ బలహీనమయ్యేందుకు ఒకే ఒక్క కారణాన్ని బాప్ దాదా చూసారు. ఆ ఒక్క పదము రకరకాల రాయల్ రూపాలలో వస్తుంది మరియు బలహీనంగా చేస్తుంది. ఆ ఒక్క పదము ఏమిటంటే - దేహాభిమానము యొక్క ‘నేను.’ ఈ ‘నేను’ అన్న పదమే మోసం చేస్తుంది. ‘నేను’ ఇలా భావిస్తున్నాను, ‘నేనే’ ఇది చేయగలను, ‘నేను’ ఏదైతే చెప్పానో అదే కరెక్ట్, ‘నేను’ ఏదైతే ఆలోచించానో అదే కరెక్ట్. ఇలా రకరకాల రాయల్ రూపాలలో ఈ ‘నేను’ అనేది ప్రతిజ్ఞను బలహీనం చేస్తుంది. చివరికి బలహీనమైపోయి నిరాశతో కూడిన మాటలు ఆలోచిస్తారు - నేను ఇంత సహనం చేయలేను; స్వయాన్ని ఒక్కసారిగా ఇంత నిర్మానంగా చేసుకోవడమా, ఇంత చేయలేను; ఇన్ని సమస్యలను దాటలేను, కష్టము. ఈ ‘నేను’ అనేది బలహీనంగా చేస్తుంది. దీనికి చాలా మంచి రాయల్ రూపాలు ఉన్నాయి. మీ జీవితంలో చూసుకోండి - ఈ ‘నేను’ అనేది సంస్కారం రూపంలో, స్వభావం రూపంలో, భావం రూపంలో, భావన రూపంలో, మాటల రూపంలో, సంబంధ-సంపర్కాల రూపంలో మరియు ఇంకా ఎన్నో మధురమైన రూపాలలో వస్తుందా? శివరాత్రి రోజున ఈ ‘నేను-నేను’ అనేది బలి ఇవ్వబడుతుంది. భక్తులు పాపం ‘మే, మే’ అనే మేకను బలి ఇచ్చారు. కానీ వాస్తవానికది ఈ ‘మై, మై’ (నేను, నేను అనేది), దీనిని బలి ఇవ్వండి. స్మృతిచిహ్నమైతే మీదే కానీ దానిని మరొక రూపంలో జరుపుకుంటున్నారు. బలి అయ్యారా లేక ఇప్పుడింకా కొద్దిగా ‘నేను’ అనేదాని బలి మిగిలి ఉందా? రిజల్టు ఏమిటి? ప్రతిజ్ఞ చేయాలనుకుంటే సంపూర్ణ ప్రతిజ్ఞను చేయండి. తండ్రి పట్ల ప్రేమ ఉన్నప్పుడు, ప్రేమలో అయితే అందరూ పాస్ అయ్యారు. తండ్రి పట్ల 75% ప్రేమ ఉంది, 50% ప్రేమ ఉంది అని ఎవరైనా అంటారా? ప్రేమ విషయంలో అందరూ 100% కంటే ఎక్కువ ప్రేమ ఉంది అని అంటారు. తండ్రి కూడా ఏమంటారంటే - అందరూ ప్రేమించేవారే, ఇందులో పాస్ అయ్యారు. మరి ప్రేమలో త్యాగం చేయడమనేది ఏపాటి విషయము! కనుక ప్రతిజ్ఞను మనసుతో చేయండి మరియు దృఢంగా చేయండి. పదే-పదే స్వయాన్ని చెక్ చేసుకోండి - ప్రతిజ్ఞ శక్తిశాలిగా ఉందా లేక పరీక్ష శక్తిశాలిగా ఉందా? ఏదో ఒక పరీక్ష ప్రతిజ్ఞను బలహీనం చేసేస్తుంది.

డబల్ విదేశీయులైతే ప్రతిజ్ఞ చేయడంలో తెలివైనవారు కదా. భంగపర్చడంలో కాదు, జోడించడంలో తెలివైనవారు. బాప్ దాదా డబల్ విదేశీయులందరి భాగ్యాన్ని చూసి హర్షిస్తారు. తండ్రిని గుర్తించారు, ఇదే మీరు చేసిన అన్నిటికంటే గొప్ప అద్భుతము! రెండవ అద్భుతము - వెరైటీ వృక్షంలోని కొమ్మలు అయినప్పటికీ ఒక్క తండ్రి యొక్క చందన వృక్షానికి కొమ్మలుగా అయ్యారు! ఇప్పుడు అందరూ ఒకే వృక్షం యొక్క కొమ్మలు. భిన్నతలో ఏకతను తీసుకొచ్చారు. దేశాలు వేరు, భాషలు వేర్వేరు, సంస్కృతులు వేర్వేరు, కానీ మీరు భిన్నతలో ఏకతను తీసుకొచ్చారు. ఇప్పుడు అందరి కల్చర్ (సంస్కృతి) ఏమిటి? బ్రాహ్మణ కల్చర్. కనుక ఎప్పుడూ - మా విదేశీ కల్చర్ ఇలా ఉంటుంది అని అనకండి, అలాగే భారతవాసులు కూడా - మా భారత్ కల్చర్ ఇలా ఉంటుంది అని అనకూడదు. భారత్ కల్చర్ కాదు, విదేశీ కల్చర్ కాదు - బ్రాహ్మణ కల్చర్. కనుక భిన్నతలో ఏకత - ఇదే కదా అద్భుతము! ఇంకా ఏ అద్భుతం చేసారు? తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత అన్ని రకాల వేర్వేరు ఆచార-పద్ధతులు, దినచర్య మొదలైనవన్నీ కలిపి ఒకటిగా చేసారు. అమెరికాలో ఉన్నా, లండన్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ బ్రాహ్మణుల దినచర్య ఒక్కటే. లేక వేర్వేరుగా ఉంటుందా? విదేశాలలో దినచర్య వేరు, భారత్ లో దినచర్య వేరు, ఇలా కాదు. అందరిదీ ఒక్కటే. కనుక ఈ భిన్నతను త్యాగం చేయడము కూడా అద్భుతము. ఏయే అద్భుతాలు చేసారో అర్థమయిందా? ఎలాగైతే - తండ్రి అద్భుతం చేసారు అని మీరు తండ్రి కోసం పాడుతారు కదా, అలా తండ్రి కూడా - పిల్లలు అద్భుతం చేసారు అని పాడుతారు. బాప్ దాదా చూసి-చూసి హర్షిస్తారు. తండ్రి హర్షిస్తారు మరియు పిల్లలు సంతోషంలో నాట్యం చేస్తారు.

నలువైపులా దేశ-విదేశాలలోని సేవ గురించి వింటూ ఉంటారు. ఇరువురూ సేవలో రేస్ చేస్తున్నారు. అన్ని ప్రోగ్రామ్ లు బాగా జరిగాయి మరియు ఇకముందు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ దృఢ సంకల్పాన్ని ఉపయోగించడమంటే సఫలం అయినట్లు. ఎంతగా దృఢ సంకల్పాన్ని సఫలం చేస్తూ ఉంటారో, అంతగా సహజ సఫలతను అనుభవం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా - ఇది ఎలా అవుతుంది అని ఆలోచించకండి. ‘ఎలా’ అని ఆలోచించేందుకు బదులుగా ‘ఇలా’ అవుతుంది అని ఆలోచించండి. సంగమములో ఉన్న విశేషమైన వరదానమే - అసంభవాన్ని సంభవం చేయడము. కనుక ‘ఎలా’ అన్న పదము రానే రాదు. ఇది అవ్వడం కష్టము, ఇలా కాదు. ఈ నిశ్చయం పెట్టుకుని ముందుకు వెళ్ళండి - ఇది అయ్యే ఉంది, కేవలం ప్రాక్టికల్ లోకి తీసుకురావాలి. ఇది కేవలం రిపీట్ అవ్వనున్నది. ఇది తయారై ఉంది, తయారై ఉన్నదానిని తయారుచేయడం అనగా రిపీట్ చేయడము. సహజ సఫలతకు ఆధారము - దృఢ సంకల్పాల ఖజానాను సఫలం చేయండి అని దీనినే అంటారు. అర్థమయిందా! ఏమవుతుంది, ఎలా అవుతుంది అని కాదు. అవుతుంది మరియు సహజంగా అవుతుంది! సంకల్పాలలోనే అలజడి ఉంటే అది సఫలతను అలజడిలోకి తీసుకొస్తుంది. అచ్ఛా!

నలువైపులా ఉన్న సదా ఉత్సవం జరుపుకునేవారు, సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఎగిరేవారు, సదా సంపూర్ణ ప్రతిజ్ఞకు పాత్రులైన అధికారీ ఆత్మలు, సదా అసంభవాన్ని సహజంగా సంభవం చేసేవారు, సదా అన్ని రకాల పరీక్షలను బలహీనం చేసి ప్రతిజ్ఞను శక్తిశాలిగా చేసేవారు, సదా తండ్రి ప్రేమకు రిటర్న్ లో దేనినైనా త్యాగం చేసే ధైర్యం కలవారు, ఇటువంటి త్రిమూర్తి శివబాబాకు జన్మ-సహచరులైన బ్రహ్మణాత్మలకు అలౌకిక జన్మదినం యొక్క ప్రియస్మృతులు మరియు శుభాకాంక్షలు. బాప్ దాదా యొక్క విశేషమైన శ్రేష్ఠ ఆత్మలకు నమస్తే.

Comments