05-12-1983 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
'' సంగమ యుగము తండ్రి, పిల్లలు కలుసుకునే యుగము. ''
ఈ రోజు అందరూ మిలన మహోత్సవము జరుపుకునేందుకు చేరుకున్నారు. ఇది తండ్రి మరియు పిల్లల మధురమైన కలయిక. ఈ మిలన మేళా కొరకు అనేకమంది ఆత్మలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, ఇది అంతం లేనిది, అసంభవము లేక కష్టము అని అంటూ ఎదురు చూస్తూనే ఉండిపోయారు. ఈ మిలనము ఎప్పుడు జరుగుతుంది అనే ఆశల పైనే నడుస్తూ వచ్చారు, ఇప్పుడు కూడా అలాగే నడుస్తూ ఉన్నారు. ఇలాగే ఇతర ఆత్మలు కూడా ఉన్నారు. ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు వస్తారు? ఎప్పుడు కలుస్తాము? అని వియోగ గీతాలు పాడుతూ ఉంటారు. వాళ్ళందరు ఎప్పుడు అని అనే వాళ్ళు, కాని మీరు ఇప్పుడే అనేవారు. వాళ్ళు వియోగులు, మీరు సహజ యోగులు. సెకండులో మిలనాన్ని అనుభవం చేయువారు. ఇప్పుడు కూడా ఎవరైనా మిమ్ములను తండ్రితో కలుసుకోవడం ఎప్పుడు? మరియు ఎంత సమయంలో జరుగుతుంది అని అడిగినట్లయితే ఏమని చెప్తారు? నిశ్చయం మరియు ఉత్సాహం ఉంటే తండ్రిని కలుసుకోవడం పిల్లల కొరకు ఎప్పుడూ కష్టమనిపించదు అని చెప్తారు కదా! సహజంగా మరియు సదాకాలం కొరకు కలుసుకోవడం అవుతుంది. సంగమ యుగము అంటేనే తండ్రి, పిల్లలు కలుసుకునే యుగము. నిరంతరము మిలనంలోనే ఉంటున్నారు కదా! ఇది అయ్యిందే మేళా. మేళా అనగా కలయిక. కావున చాలా నషాతో మీరు కలుసుకోవడము అని అంటున్నారు కానీ మేము సదా వారితో పాటు అనగా తండ్రి జతలో తింటూ, త్రాగుతూ, నడుస్తూ, ఆడుకుంటూ, పాలింపబడుతున్నాము అని చెప్తారు. ఇంత నషా ఉంటుందా? పరమాత్మ తండ్రితో స్నేహం ఎలా జరుగుతుంది, మనసు ఎలా నిమగ్నం అవుతుంది అని వారు అడుగుతారు. మీ హృదయం నుండి ఇవే మాటలు వెలువడ్తాయి - మనసును ఎలా జోడించాలి అనేది వదిలేయండి. కానీ మా మనసే వారిదైపోయింది. మనసుని ఎలా జోడించాలి అని అనేందుకు అసలు మా మనసు అనేది ఉందా? మనసును తండ్రికి ఇచ్చేస్తే మనసు ఎవరిది? మీదా లేక తండ్రిదా? మనసు తండ్రిదే అయితే ఎలా జోడించాలి అన్న ప్రశ్నయే రాజాలదు. ఎలా ప్రేమిస్తారు అనే ప్రశ్న కూడా రాదు. ఎందుకంటే సదా ప్రేమలో లీనమయ్యే ఉంటారు. ప్రేమ స్వరూపంగా అయిపోయారు. మాస్టర్ప్రేమ సాగరులుగా అయ్యారు. కావున ప్రేమించాల్సిన అవసరం ఉండదు. ప్రేమ స్వరూపంగా అయిపోయారు. రోజంతా ఏమి అనుభవం చేస్తారు? ప్రేమ అలలు స్వతహాగానే ఉప్పొంగుతూ ఉంటాయి కదా! ఎంతెంతగా జ్ఞాన సూర్యుని కిరణాలు లేక ప్రకాశము పరుగుతూ ఉంటుందో అంత ఎక్కువగా ప్రేమ అలలు ఉప్పొంగుతూ ఉంటాయి. అమృతవేళలో జ్ఞాన సూర్యుని జ్ఞాన మురళి ఏం చేస్తుంది? అలలు బాగా పొంగుతూ ఉంటాయి కదా! అందరూ అనుభవీలుగా ఉన్నారు కదా! జ్ఞాన అలలు, ప్రేమ అలలు శాంతి మరియు సుఖమునిచ్చే అలలు, శక్తి అలలు ఉప్పొంగుతాయి. మీరు అవే అలలలో ఇమిడిపోతారు. ఈ అలౌకిక వారసత్వాన్ని ప్రాప్తి చేసుకున్నారు కదా! ఇదే బ్రాహ్మణ జీవితము. అలలలో ఇమిడిపోతూ, ఇమిడిపోతూ సాగరుని సమానంగా అయిపోతారు. ఇలాంటి మేళా జరుపుకుంటూ ఉన్నారా? లేక ఇప్పుడు జరుపుకునేందుకు వచ్చారా? బ్రాహ్మణులుగా అయ్యి సాగరంలో ఇమిడిపోయే అనుభవం చేయకపోతే, బ్రాహ్మణ జీవితంలో విశేషత ఏముంది? ఈ విశేషతనే వారసత్వ ప్రాప్తి అని అంటారు. మొత్తం విశ్వంలోని బ్రాహ్మణులు ఈ అలౌకిక ప్రాప్తిని అనుభవము చేసేందుకు ఛాత్రకులుగా ఉన్నారు.
ఇప్పుడు కూడా ఛాత్ర పిల్లలందరూ బాప్దాదా ఎదురుగా ఉన్నారు. బాప్దాదా ముందు బేహద్హాలు ఉంది. ఈ హాలులోకి కూడా అందరూ రాలేరు. పిల్లలందరూ దూరదర్శిని(టెలిస్కోప్) తీసుకొని కూర్చున్నారు. సాకారంలో కూడా దూర దృశ్యాలను ఎదురుగా చూసే అనుభవంలో బాప్దాదా కూడా పిల్లల సహజమైన శ్రేష్ఠమైన సర్వ ప్రాప్తులను చూసి సంతోషిస్తారు. మరి మీరందరూ కూడా ఇంతగా సంతోషిస్తున్నారా? లేక అప్పుడప్పుడు సంతోషిస్తూ మరియు మాయకు ఆకర్షితులుగా అవుతున్నారా? మాయ వలన సందిగ్ధ స్థితిలో ఉండడం లేదు కదా? సందిగ్ధము ఊబిని తయారు చేస్తుంది. ఇప్పుడు ఊబి నుండి బయటికి వచ్చి హృదయ సింహాసనాధికారులుగా అయ్యారు కదా! ఆలోచించండి, ఎక్కడ ఊబి? ఎక్కడ హృదయ సింహాసనము? అరవడమా లేక హృదయ సింహాసనము పై కూర్చోవడమా, ఏది ఇష్టము? సింహాసనం ఇష్టం కదా! మళ్లీ ఊబి వైపు ఎందుకు వెళ్తున్నారు? ఊబికి సమీపంగా వెళ్తే దూరం నుండే ఊబి తన వైపుకు లాక్కుంటుంది.
కొత్తవారమని భావించి వచ్చారా? లేక కల్ప-కల్పానికి అధికారులమని భావించి వచ్చారా? కొత్తవారు వచ్చారు కదా. పరిచయం కొరకు కొత్తవారని అంటారు కానీ గుర్తించడంలో అయితే కొత్తవారు కాదు కదా? కొత్తవారిగా అయ్యి గుర్తించేందుకు రాలేదు కదా! గుర్తించే మూడవ నేత్రం ప్రాప్తించిందా? లేక ఇప్పుడు ప్రాప్తి చేసుకునేందుకు వచ్చారా?
వచ్చిన పిల్లలందరికి బ్రాహ్మణ జన్మ కానుక పుట్టిన రోజున లభించిందా లేక ఇక్కడ పుట్టిన రోజు జరుపుకునేందుకు వచ్చారా? పుట్టిన రోజు కానుక తండ్రి ద్వారా మూడవ నేత్రం లభిస్తుంది. తండ్రిని గుర్తించే నేత్రం లభిస్తుంది. జన్మ తీసుకుంటూనే, నేత్రము లభిస్తూనే అందరి నోటి నుండి మొదటి మాట ఏమి వచ్చింది? ''బాబా''. గుర్తించారు కనుకనే బాబా అని అన్నారు కదా! అందరికీ పుట్టిన రోజు కానుక లభించిందా? లేక ఎవరికైనా లభించలేదా? అందరికి లభించింది కదా! కానుకను సదా సంభాళించి ఉంచుకుంటారు. బాప్దాదాకు అయితే పిల్లలందరు ఒకరికంటే మరొకరు ప్రియమైనవారు. మంచిది.
ఇటువంటి సర్వ అధికారీ ఆత్మలకు, సదా సాగరుని రకరకాల అలలలో ఓలలాడే అనుభవీ మూర్తులైన పిల్లలకు, సదా హృదయ సింహాసనాధికారులుగా ఉన్న పిల్లలకు, సదా మిలన మేళా జరుపుకునే శ్రేష్ఠ ఆత్మలకు, జత జతలో విదేశాల నుండి దూరదర్శినితో చూస్తున్న పిల్లలకు, విశ్వంలోఎవ్వరికీ తెలియని పిల్లలందరికి బాప్దాదా ప్రియస్మృతులు తెలుపుతున్నారు. సర్వ ఆత్మలకు యథా స్నేహం, తథా స్నేహ సంపన్న ప్రియ స్మృతులు మరియు వారసులకు నమస్తే.
దాదీజీతో :- తండ్రి సాంగత్య రంగు అంటుకుంది. తండ్రి సమానంగా అయిపోయారు. మీలో సదా ఏమి కనిపిస్తుంది? తండ్రి కనిపిస్తారు కావున సాంగత్యము అంటుకుంది కదా. మిమ్ములను ఎవరు చూసినా తండ్రి జ్ఞాపకం వస్తారు. ఎందుకంటే మీరు ఇమిడిపోయి ఉన్నారు, ఇమిడిపోయి సమానంగా అయ్యారు. అందువలన విశేషమైన స్నేహ, సహయోగాల ఛత్రఛాయ ఉంది. విశేషమైన పాత్ర ఉంది అంతేకాక విశేషమైన ఛత్రఛాయ ముఖ్యంగా వతనంలో తయారై ఉంది. అందుకే సదా తేలికగా ఉన్నావు. ఎప్పుడైనా భారంగా అనిపిస్తుందా? ఛత్రఛాయ లోపలే ఉన్నారు కదా! చాలా బాగా నడుస్తోంది(యజ్ఞము). బాప్దాదా చూసి చూసి సంతోషిస్తున్నారు.
పార్టీలతో అవ్యక్త బాప్దాదా వ్యక్తిగత మిలనం :- 1. మొత్తం విశ్వంలో విశేష ఆత్మలమనే స్మృతి సదా ఉంటుందా? విశేష ఆత్మలు ఒక్క సెకండు, ఒక్క సంకల్పము, ఒక్క మాట అయినా సాధారణంగా మాట్లడలేరు. కనుక ఈ స్మృతి సదా సమర్థంగా తయారు చేస్తుంది. సమర్థ ఆత్మలుగా ఉన్నాము, ఈ నషా మరియు సంతోషము సదా ఉండాలి. సమర్థులు అనగా వ్యర్థాన్ని సమాప్తం చేసేవారు. ఎలాగైతే సూర్యుడు చీకటిని మరియు మురికిని సమాప్తం చేసేస్తాడో, అలా సమర్థమైన ఆత్మలు వ్యర్థాన్ని సమాప్తం చేసేస్తారు. వ్యర్థ ఖాతా సమాప్తి. శ్రేష్ఠ సంకల్పాలు, శ్రేష్ఠ కర్మలు, శ్రేష్ఠమైన మాటలు, శ్రేష్ఠ సంపర్కము, సంబంధాల ఖాతా సదా పెరుగుతూ ఉండాలి. ఇలాంటి అనుభవం ఉందా? మేము సమర్థ ఆత్మలము, ఈ స్మృతి వస్తూనే వ్యర్థం సమాప్తమైపోతుంది. విస్మృతి జరిగినట్లయితే లేక మర్చిపోయినట్లయితే వ్యర్థం మొదలవుతుంది. స్మృతి స్థితిని స్వతహాగానే తయారు చేస్తుంది. కావున స్మృతి స్వరూపులుగా అయిపోండి. స్వరూపాన్ని ఎప్పుడూ మర్చిపోలేరు. మీ స్వరూపము స్మృతి స్వరూపుల నుండి సమర్థ స్వరూపులు. ఇదే అభ్యాసము మరియు ఇదే లగనము ఉంటే చాలు. ఇదే లగనములో సదా నిమగ్నమై ఉండటమే జీవితము.
ఎప్పుడూ ఏ పరిస్థితిలోనూ ఎలాంటి వాయుమండలంలో అయినా ఉల్లాస-ఉత్సాహాలు తక్కువయ్యేవారు కాదు. సదా ముందుకు వెళ్లేవారు. ఎందుకంటే సంగమ యుగమే ఉత్సాహ- ఉల్లాసాలను ప్రాప్తి చేయించే యుగము. ఒకవేళ ఈ సంగమ యుగములోనే ఉత్సాహ-ఉల్లాసాలు లేకుంటే మొత్తం కల్పంలో ఉండజాలవు. ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు. బ్రాహ్మణ జీవితమే ఉత్సాహ-ఉల్లాసాల జీవితము. ఏది లభించిందో అది అందరికీ పంచండి. ఏది లభించిందో అది అందరికి పంచండి - ఈ ఉత్సాహం ఉండాలి. ఉత్సాహము సదా సంతోషానికి గర్తు. ఉత్సాహంగా ఉన్నవారు సదా సంతోషంగా ఉంటారు. పొందాల్సినదంతా పొందేశాము అనే ఉత్సాహం ఉంటుంది.
సదా అచంచలంగా స్థిరమైన స్థితిలో ఉండు అంగద సమానమైన శ్రేష్ఠ ఆత్మలము అనే నషా మరియు సంతోషంలో ఉండండి. ఎందుకంటే సదా ఒక్కరి రసంలో ఉండేవారు, ఏకరస స్థితిలో ఉండేవారు సదా అచంచలంగా ఉంటారు. ఎక్కడ ఒక్కటే ఉంటుందో అక్కడ ఏ గొడవా ఉండదు. రెండు ఉంటే సందిగ్ధం ఉంటుంది. ఒక్కరిలో సదా అతీతంగా మరియు ప్రియంగా ఉండండి. ఒక్కరికి బదులు బుద్ధి ఇతరం పై ఎక్కడా వెళ్లరాదు. ఒక్కరిలోనే అన్ని ప్రాప్తిస్తున్నప్పుడు ఇంకొక వైపు ఎందుకు వెళ్లాలి? ఎంత సహజమైన మార్గం లభించింది, ఒక్కటే ఆశ్రయము, ఒక్కరితోనే సర్వ ప్రాప్తులు, ఇంకేం కావాలి. అన్నీ లభించాయి చాలు. తండ్రిని పొందాలనే ఏ కోరిక ఉండేదో అది ప్రాప్తించింది. కావున ఇదే సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి. సంతోషంగా పాటలు పాడుకుంటూ ఉండండి. సందిగ్ధంలో ఉంటే ఏమీ ప్రాప్తించదు. అందువలన ఒక్కరిలోనే మొత్తం ప్రపంచాన్నంతా అనుభవం చేయండి.
స్వయాన్ని సదా హీరో పాత్రధారిగా భావిస్తూ ప్రతి కర్మ చేయండి. ఎవరైతే హీరో పాత్రధారిగా ఉంటారో, వారికి ఎంతో సంతోషం ఉంటుంది. అది హద్దులోని పాత్ర. మీ అందరికీ బేహద్పాత్ర ఎవరితో పాటు పాత్రను అభినయిస్తున్నారో, ఎవరికి సహయోగిగా ఉన్నారో, ఏ సేవకు నిమిత్తంగా ఉన్నారో - ఈ స్మృతి సదా ఉన్నట్లయితే సదా సంతోషంగా, సదా సంపన్నులుగా, సదా డబల్లైట్గా ఉంటారు. ప్రతి అడుగులో ఉన్నతి జరుగుతూనే ఉంటుంది. ఎలా ఉండేవారము? ఎలా తయారయ్యాము? 'ఓ¬ నేను' మరియు 'ఓ¬ నా భాగ్యం' సదా ఇవే పాటలు బాగా పాడండి అంతేకాక ఇతరులకు కూడా పాడడం నేర్పించండి. 5 వేల సంవత్సరాలు సుదీర్ఘమైన రేఖలు గీయబడ్డాయి. కావున సంతోషంగా నాట్యం చేయండి. మంచిది.
2. మీరు సదా ఒక్క బాబా స్మృతిలో ఉండేవారు ఏకరస స్థితిలో స్థితమై ఉండే శ్రేష్ఠ ఆత్మలు కదా. ఎల్లప్పుడూ ఏకరస ఆత్మలుగా ఉన్నారా? లేక వేరే ఏదైనా రసం తనవైపుకు ఆకర్షిస్తోందా? ఏదైనా ఇతర రసము తనవైపు ఆకర్షించడం లేదు కదా? మీ అందరికీ ఉండేదే ఒక్కరు. ఒక్కరిలోనే అన్నీ ఇమిడి ఉన్నాయి. ఉన్నదే ఒక్కరైనప్పుడు, ఇంకెవ్వరు లేకుంటే వేరే ఎక్కడకు వెళ్తారు? ఎవరైనా మామ, బాబాయి అయితే లేరు కదా? మీరందరూ ఏం ప్రతిజ్ఞ చేశారు? మాకు సర్వస్వమూ మీరే అని ప్రతిజ్ఞ చేశారు కదా. కుమారీలు పక్కాగా ప్రతిజ్ఞ చేశారా? పక్కాగా ప్రతిజ్ఞ చేశారు, వరమాల మీ కంఠంలో పడింది. ప్రతిజ్ఞ చేశారు, వరుడు లభించాడు. వరుడు కూడా లభించాడు, ఇల్లు కూడా లభించింది. కావున వరుడు మరియు ఇల్లు లభించాయి కదా. కుమారీల కొరకు తల్లి-తండ్రి ఏమి ఆలోచించాల్సి ఉంటుంది? వరుడు మరియు ఇల్లు మంచిగా లభించాలని ఆలోచిస్తారు. మీకైతే ఎలాంటి వరుడు లభించాడంటే, మొత్తం ప్రపంచమంతా వారిని మహిమ చేస్తుంది. ఇల్లు కూడా అటువంటిదే లభించింది. ఇక్కడ అప్రాప్తి అనే వస్తువు ఏదీ లేదు కావున దృఢమైన వరమాల ధరించారు కదా! ఇలాంటి కుమారీలను తెలివిగలవారని అంటారు. కుమారీలు అంటేనే తెలివిగలవారు. బాప్దాదాకు కుమారీలను చూసి సంతోషమవుతుంది ఎందుకంటే రక్షింపబడ్డారు. ఎవరైనా పడిపోవడం నుండి రక్షింపబడితే సంతోషంగా ఉంటుంది కదా. మాతలు ఎవరైతే పడిపోయారో, వారినైతే పడిపోయినవారిని రక్షించారని అంటారు. కానీ కుమారీల కొరకు పడిపోవటం నుండి రక్షింపబడ్డారని అంటారు. కావున మీరందరూ ఎంతో అదృష్టవంతులు. మాతలకు వారి అదృష్టం వారికి ఉంది. కుమారీలకు వారి అదృష్టం వారికి ఉంది. మాతలు కూడా అదృష్టవంతులే. ఎందుకంటే గోపాలుని గోవులు కదా.
3. సదా మాయాజీతులుగా ఉన్నారా? ఎవరైతే మాయాజీతులుగా ఉంటారో, వారికి విశ్వకళ్యాణకారులమనే నషా తప్పకుండా ఉంటుంది. ఇలాంటి నషా ఉందా? బేహద్సేవ అనగా విశ్వ సేవ. మనము బేహద్యజమానికి బాలకులము. ఈ స్మృతి సదా ఉండాలి. ఎలా తయారయ్యాము? ఏమి లభించింది? అనే స్మృతి ఉంటుంది కావున ఇదే సంతోషంలో సదా ముందుకు వెళ్తూ ఉండండి. ఇలా ముందుకు వెళ్లేవారిని చూసి బాప్దాదా సంతోషిస్తారు.
సదా తండ్రి స్మృతి అనే ఆనందంలో మునిగి ఉండండి. ఈశ్వరీయ ఆనందం ఎలా తయారు చేస్తుంది? ఒక్కసారిగా ధరిత్రి(ఫర్ష్) వాసుల నుండి ఆకాశ(అర్ష్) నివాసులుగా తయారు చేస్తుంది కావున సదా ఆకాశంలో ఉంటారా? లేక భూమి పైన ఉంటారా? ఎందుకంటే ఉన్నతోన్నతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు కావున క్రింద ఎలా ఉంటారు? భుమి అయితే క్రిందనే ఉంటుంది. ఆకాశం ఉన్నతంగా ఉంటుంది. క్రిందికి ఎలా వస్తుంది? ఎప్పుడూ బుద్ధి అనే పాదాన్ని భూమి పై పెట్టకండి, పైన పెట్టండి. అటువంటి వారిని ఉన్నతోన్నతమైన తండ్రికి ఉన్నతమైన పిల్లలు అని అంటారు. ఇదే నషా ఉండాలి. సదా అచంచలంగా, స్థిరంగా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండండి. ఏ కొంచెమైనా మాయతో కదిలిపోయినట్లయితే సర్వ ఖజానాల అనుభవం అవ్వదు. తండ్రి ద్వారా ఎన్ని ఖజానాలు లభించాయో ఆ ఖజానాలన్నిటిని సదా స్థిరంగా ఉంచుకునే సాధనము - సదా అచంచలంగా, స్థిరంగా ఉండండి. అచంచలంగా ఉన్నందున ఎల్లప్పుడూ సంతోషం అనుభవమవుతూ ఉంటుంది. వినాశీ ధనానికి కూడా సంతోషం ఉంటుంది కదా! వినాశీ నాయకత్వపు కుర్చీ లభిస్తుంది, ఈ పేరు గౌరవం లభించినా, ఎంత సంతోషం ఉంటుంది! కాని ఇది అవినాశీ సంతోషము. ఎవరైతే అచంచలంగా, స్థిరంగా ఉంటారో, వారికే ఈ సంతోషం ఉంటుంది.
బ్రాహ్మణులందరికి స్వరాజ్యం లభించింది. మొదట బానిసలుగా(దాసులుగా) ఉండేవారు. నేను బానిసను(దాసుడను). నేను బానిసను(దాసుడను) అని పాటలు పాడేవారు. ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అయ్యారు. బానిసల నుండి రాజులుగా అయిపోయారు. ఎంత తేడా వచ్చింది! రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది కదా. తండ్రిని స్మృతి చేయాలి, బానిస నుండి రాజుగా అవ్వాలి. ఇలాంటి రాజ్యం మొత్తం కల్పంలో ప్రాప్తింపజాలదు. ఈ స్వరాజ్యం ద్వారానే విశ్వ రాజ్యం లభిస్తుంది. కావున ఇప్పుడు మేము స్వరాజ్య అధికారులము అనే నషాలో సదా ఉండండి. అప్పుడు ఈ కర్మేంద్రియాలు స్వతహాగా శ్రేష్ఠమైన దారిలో నడుస్తాయి. సదా పొందాల్సినదంతా పొందేశాము,... ఎలా ఉండేవారము ఎలా అయ్యాము అని సంతోషంగా ఉండండి. ఎక్కడ పడి ఉండేవారము! ఎక్కడకు చేరుకున్నాము! అచ్ఛా.
Comments
Post a Comment