26-11-1994 అవ్యక్త మురళి

     26-11-1994         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

పరమాత్మ పాలన మరియు పరివర్తనా శక్తి యొక్క ప్రత్యక్ష స్వరూపం - సహజయోగి జీవితం.

ఈరోజు బాప్ దాదా ప్రతీ ఒక్క బిడ్డ మస్తకంలో విశేషంగా మూడు శ్రేష్ట భాగ్యరేఖలను చూస్తున్నారు. పిల్లలందరి భాగ్యం అయితే సదా సర్వ శ్రేష్టమైనదే కానీ ఈ రోజు విశేషంగా మూడు రేఖలు మెరుస్తున్నాయి. 1.పరమాత్మ పాలన యొక్క భాగ్య రేఖ 2.బేహద్ ఉన్నతోన్నత చదువు యొక్క భాగ్యరేఖ 3. శ్రేష్టమతం యొక్క భాగ్యరేఖ. లౌకికంలో అయినా, అలౌకికంలో అయినా ప్రతి ఒక్కరికీ జీవితంలో ఈ మూడు ప్రాప్తులుంటాయి. పాలన లభిస్తుంది, చదువు లభిస్తుంది మరియు మతం కూడా లభిస్తుంది. ఈ మూడింటి ద్వారానే ప్రతీ ఆత్మ తన వర్తమానం మరియు భవిష్యత్తుని తయారు చేసుకోవడానికి నిమిత్తం అవుతుంది. శ్రేష్ట ఆత్మలైన మీ అందరికీ ఎవరి పాలన లభిస్తూ ఉంది? ప్రతీ సెకనూ పరమాత్మ పాలనలో పాలింపబడుతున్నారు. పరమాత్మ ఎలా అయితే ఉన్నతోన్నతుడో అలాగే పరమాత్మ పాలన కూడా ఎంతో శ్రేష్టమైనది! ఈ పరమాత్మ పాలనకి ఎవరు పాత్రులు అయ్యారు మరియు ఎంతమంది అయ్యారు? విశ్వంలోని ఆత్మలందరూ కూడా తండ్రీ! అంటారు కానీ పాలన మరియు చదువుకి పాత్రులు అవ్వరు. కొద్దిమంది ఆత్మలైన మీరే ఈ భాగ్యానికి పాత్రులు అవుతున్నారు. కల్పమంతటిలో ఈ కొంచెం సమయమే పరమాత్మ పాలన లభిస్తుంది. దైవీ పాలన, మానవ పాలన అయితే అనేక జన్మలు లభిస్తాయి కానీ ఈ శ్రేష్ట పాలన ఇప్పుడు లేకున్నా మరెప్పుడు దొరకదు. ఇటువంటి శ్రేష్ట భాగ్యం యొక్క శ్రేష్టరేఖ సదా మీ మస్తకంలో మెరుస్తునట్లు అనుభవం చేసుకుంటున్నారా? లేక అప్పుడప్పుడు చేసుకుంటున్నారా? ఏదైనా ప్రాప్తిని సదా కావాలనుకుంటారా లేక అప్పుడప్పుడు కావాలనుకుంటారా? అయితే ప్రాప్తి కొరకు పురుషార్థం కూడా సదా ఉండాలా లేక అప్పుడప్పుడు ఉండాలా? మరియు సదా తీవ్రంగా ఉండాలా లేక ఒకసారి సాధారణంగా, మరోసారి తీవ్రంగా ఉండాలా? ఇప్పుడు ప్రత్యక్షంలో ఏమి ఉంది? కోరిక మరియు ప్రత్యక్షంలోకి తీసుకురావటంలో తేడా వచ్చేస్తుంది కదా! ఆలోచించడం అయితే చాలా ఆలోచిస్తున్నారు కానీ స్మృతిలో తక్కువ ఉంచుకుంటున్నారు. ఆలోచనాస్వరూపంగా అవ్వాలా లేక స్మృతి స్వరూపంగా అవ్వాలా? స్మృతి స్వరూపంగా అయ్యేవారే కదా! అయితే ఒక విషయాన్ని స్మతిలో ఉంచుకోండి - అమృతవేళ మిమ్మల్ని మేల్కొలిపేవారు ఎవరు? బాబా ప్రేమ మేల్కొల్పుతుంది కదా! రోజుని ఎంత శ్రేష్టంగా ప్రారంభిస్తున్నారు! బాబా స్వయంగా కలుసుకోవడానికి పిలుస్తున్నారు, ఆత్మిక సంభాషణ చేస్తున్నారు, శక్తులు నింపుతున్నారు. అందువలన ప్రతిరోజు యొక్క ఆది ఎంత శ్రేష్టమైనది! బాబాపై ప్రేమతో మేల్కొంటున్నారా? లేక అప్పుడప్పుడు కష్టంగా మేల్కొంటున్నారా? యదార్ధంగా అయితే ప్రేమ యొక్క పాటయే మిమ్మల్ని మేల్కొల్పుతోంది. అమృతవేళ నుండి బాబా మధురమైన పిల్లలూ! ప్రియమైన పిల్లలూ! రండి! అని ఎంత స్నేహంతో పిలుస్తారు లేదా మేల్కొల్పుతారు. ఇలా ఆదియే ఇంత శ్రేష్టంగా ఉంటే మధ్య మరియు అంతిమం ఎలా ఉంటాయి? శ్రేష్టంగా ఉంటాయి కదా! 

బాప్ దాదా చూస్తున్నారు - పాలన యొక్క భాగ్యం వర్తమాన సమయంలో పిల్లలకి ఎంత లభించింది? ఎంత లభించిందో అంత లాభం పొందుతున్నారా? ఇటువంటి భాగ్యానికి పాత్రులు అవుతాం అని స్వప్నంలో కూడా సంకల్పమాత్రంగా కూడా లేదు, ఆలోచించలేదు. కానీ ఎంత సహజంగా లభించింది. బాబా ప్రేమ యొక్క పాలనకి ప్రత్యక్ష స్వరూపం "సహజ యోగీ జీవితం” ఎవరిపై ప్రేమ ఉంటుందో వారి కష్టవిషయం వినలేరు, చూడలేరు. అలాగే బాబా కూడా కష్టాన్ని సహజంగా చేశారు కదా! సదా సహజం. సదా పురుషార్ధం యొక్క వేగం తీవ్రంగా ఉండాలి. ఈ రోజు చాలా మంచి పురుషార్థం ఉండి మరలా రేపు కొంచెం శాతం తక్కువగా అయిపోతే సదా సహజం అని అంటారా? సదా కష్టంగా ఎవరు తయారు చేసుకుంటున్నారు? స్వయమే తయారు చేసుకుంటున్నారు కదా! కారణం ఏమిటి? ఆలోచించే అలవాటు ఉంది. కానీ స్మృతి స్వరూపం యొక్క సంస్కారం ఒకసారి ప్రత్యక్షం అవుతుంది, ఒకసారి గుప్తం అయిపోతుంది. ఎందుకంటే స్మృతి స్వరూపం నుండి సమర్ధస్వరూపంగా అవుతారు. ఆలోచించటం అనేది సమర్థస్వరూపం కాదు. స్మృతి అనేది సమర్ధమైనది. 

విస్మృతిలోకి ఎందుకు వచ్చేస్తున్నారు? అలవాటులో కష్టం అయిపోతుంది. గట్టిగా లేకపోతే కష్టం అని అనిపిస్తుంది. ఎక్కడ మనం గట్టిగా ఉంటామో అక్కడ కష్టం ఉండదు. మీ వాస్తవిక అలవాటు విస్మృతి కాదు. ఆదిలో స్మృతి స్వరూపం యొక్క ప్రాలబ్దాన్ని పొందే దేవాత్మలు. యోగం జోడించే పురుషార్ధం చేయరు కానీ స్మృతి స్వరూపం యొక్క ప్రాలబ్దాన్ని పొందుతారు. ఆదిలో కూడా స్మృతి స్వరూపం యొక్క ప్రత్యక్ష జీవితం ఉంది మరియు అనాది ఆత్మ పరంధామం నుండి వచ్చినప్పుడు విశేషాత్మలైన మీ సంస్కారం స్వతహాగానే స్మృతి స్వరూపం ఉంటుంది. మరియు అంతిమంలో సంగమయుగంలో కూడా స్మృతిస్వరూపులుగా అవుతున్నారు కదా! అంటే ఆది, అనాది మరియు అంత్యం మూడు కాలాలలోనూ స్మృతి స్వరూపులు. విస్మ్మతి అయితే మధ్యలో వచ్చింది. ఆది, అనాది స్వరూపం సహజంగా ఉంటుందా లేక మధ్యకాలం యొక్క స్వరూపం సహజంగా ఉంటుందా? నేను ఆత్మను అని అనుకుంటున్నారు కానీ స్మృతి స్వరూపులుగా అయ్యి నడవటం, మాట్లాడటం, చూడటంలో తేడా వచ్చేస్తుంది. అందువలన పరమాత్మ పాలనకి అధికారి ఆత్మలం అనేది స్మృతిలో ఉంచుకోండి. 

బాప్ దాదా చార్ట్ ని పరిశీలిస్తున్నారు - రేఖ ఒకసారి ఉన్నతంగా, ఒకసారి నీచంగా, ఒకసారి ఏదొక మచ్చ ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి జీవితం అనే కాగితంపై మచ్చ ఏర్పడటం లేదు. కానీ ఒక్కొక్కసారి మచ్చలే మచ్చలు. ఒకదాని తర్వాత రెండవది రెండవదాని తర్వాత మూడవది ఇలా మచ్చలే కనిపిస్తున్నాయి. ఎందుకు? ఒక పొరపాటు జరుగుతుంది కానీ ఆ పొరపాటు అయిపోయిన తర్వాత ఆ పొరపాటు గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకు, ఏమిటి, ఎలాగ, ఈవిధంగా కాదు. ఆవిధంగా ... ఇలా ఏదొక రూపంలో విషయాన్ని వదలటం లేదు. ఆ విషయం వదిలేసి వెళ్ళిపోతుంది కానీ స్వయం మాత్రం ఆ విషయాన్ని వదలటం లేదు. ఎంత సమయం ఆలోచనా స్వరూపంగానే ఉంటూ యదార్ధస్మృతి స్వరూపంగా అవ్వరో అంత వరకు ఇలా మచ్చపై మచ్చ పడుతూనే ఉంటుంది. పరీక్షా సమయం తక్కువే కానీ వ్యర్థం ఆలోచించే సంస్కారం కారణంగా పరీక్షా సమయం పెంచుకుంటున్నారు. సెకను పూర్తి కాగానే నిర్వికల్పస్థితి తయారైపోవాలి ఈ సంస్కారాన్ని తయారుచేసుకోండి. నిర్వికల్పంగా అవ్వటం వస్తుంది కదా! మీ శ్రేష్ట భాగ్యాన్ని స్మృతిలో తెచ్చుకుని సదా హర్షితంగా ఉండండి. మీకు లభించిన పరమాత్మ పాలనను మాటిమాటికి స్మృతిలోకి తెచ్చుకోండి. వినటం వస్తుంది, ఆలోచించటం వస్తుంది కానీ తేడా ఏమి వస్తుంది? బాప్ దాదా పిల్లల యొక్క ఆట చూస్తూ ఉంటారు. రోజంతటిలో ఏమేమి ఆటలు ఆడుతున్నారు అని రాత్రి పరిశీలిస్తారు కదా! మాయ అనే ఆటబొమ్మ చాలా ఆకర్షించేదిలా ఉంది. ఇక ఆ ఆటబొమ్మతో ఆడుకుంటున్నారు. మొదట అయితే చాలా ప్రేమతో మాయ ఆడిస్తుంది. ఆడిస్తూ, ఆడిస్తూ ఓడించేస్తుంది అప్పుడు తెలివిలోకి వస్తున్నారు. ఎక్కువమందిలో ఒక విశేషశక్తి లోటుగా ఉంది. ఒకసారి చాలా మంచిగా నడుస్తున్నారు. ఒకసారి నడుస్తున్నారు. ఒకసారి ఎగురుతున్నారు. ముందుకి వెళ్తున్నారు కానీ మరలా క్రిందకి ఎందుకు వచ్చేస్తున్నారు? దీనికి విశేష కారణం ఏమిటి? పరివర్తనాశక్తి బలహీనంగా ఉంది. ఇది యదార్ధం కాదు అని అర్ధం చేసుకుంటున్నారు కూడా కానీ పరివర్తన అవ్వటంలో లోపం ఉంది. బ్రాహ్మణ జీవితంలోకి, పరివర్తనలోకి వచ్చేశారు. లేక ఇంకా ఎవరైనా నేను బ్రాహ్మణుడుని కాదు అని అంటారా? అందరూ బి.కె. అని వ్రాస్తారు కదా? మేం బ్రాహ్మణులం అని భావిస్తున్నారు కదా? బ్రాహ్మణ జీవితంలో ఏవైతే పరీక్షలు వస్తున్నాయో వాటిలో పరివర్తనాశక్తి చాలా అవసరం. వ్యర్దసంకల్పాలు వస్తే ఇది వ్యర్ధం అని అనుకుంటున్నారు కానీ వ్యర్థ సంకల్పాల యొక్క ప్రవాహం తనవైపు ఆకర్షించుకునేటంత వేగంగా ఉంటుంది. ఎలాగైతే నది లేదా సాగరం చాలా శక్తితో (ఫోర్స్) ఉంటాయి. స్వయాన్ని ఎంతగా ఆపుకోవాలని ప్రయత్నించినా కానీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతారు. ఇది సరైనది కాదు, దీని ద్వారా నష్టం అని అర్థం చేసుకుంటున్నారు కూడా, ఆలోచిస్తున్నారు కూడా అయినా కానీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు, ఎందువలన? దానికి కారణం ఏమిటి? పరివర్తనాశక్తి యొక్క లోపం. మొదటి విశేష పరివర్తన - స్వరూపం యొక్క పరివర్తన. నేను శరీరాన్ని కాదు, ఆత్మను - ఇదే స్వరూపం యొక్క పరివర్తన, ఇది ఆది పరివర్తన. దీనిలో కూడా పరిశీలించండి. దేహ అభిమానం యొక్క ఫోర్స్ లో ఆత్మాభిమాని స్వరూపంలో స్థితులు అవ్వగల్గుతున్నారా లేక దానిలో కొట్టుకునిపోతున్నారా? ఒకవేళ సెకనులో పరివర్తనాశక్తి కార్యంలోకి వస్తే సమయం, సంకల్పాలు ఎంత పొదుపు అవుతాయి. వ్యర్ధం నుండి సమర్థంలో జమ అవుతాయి. 

మొదట పరివర్తనాశక్తి - స్వరూపం యొక్క పరివర్తన మరియు స్వభావం యొక్క పరివర్తన. పాత స్వభావం పురుషార్ధ జీవితంలో మోసగిస్తుంది. నా ఈ స్వభావం యదార్థమైనది కాదు, ఈ స్వభావం ప్రతీ సమయం మోసగిస్తుంది అని అనుకుంటారు కానీ మరలా స్వభావానికి వశం అయిపోతారు. మరలా తమని రక్షించుకునేటందుకు అంటారు నా భావం ఇది కాదు. నా స్వభావమే ఇంత, నేను కావాలనుకోవటం లేదు కానీ అది నా స్వభావం అని అంటారు. బ్రాహ్మణులుగా అయిపోయారు అంటే జన్మ మారిపోయింది, సంబంధం మారిపోయింది. తల్లి,తండ్రి మారిపోయారు పరివారం మారిపోయింది కానీ స్వభావం మారలేదు. మరలా ఇది నా స్వభావం అని రాయల్ మాటలతో చెప్తున్నారు. అందువలన మొదట బలహీన స్వరూపం యొక్క పరివర్తన. రెండు - స్వభావం యొక్క పరివర్తన, మూడు - సంకల్పాల యొక్క పరివర్తన. సెకనులో వ్యర్థాన్ని సమర్ధంలోకి పరివర్తన చేయండి. కొందరు ఆలోచిస్తున్నారు. తుఫాను, అరగంట లేదా పావుగంట నడిచింది అంతే అని కానీ ఆ అరగంట లేదా పావుగంట యొక్క బలహీనత అనేది సంస్కారాన్ని తయారుచేస్తుంది. పావుగంటలో బలహీనం చేసేస్తుంది కదా! ఎలాగైతే శరీరంలో మాటిమాటికి బలహీనత వచ్చేస్తే అది సదాకాలికంగా బలహీనంగా చేసేస్తుంది కదా! అందువలన పావుగంట అంటే తక్కువేమీ కాదు. సంగమయుగం యొక్క ఒక్కొక్క సెకను సంవత్సరాలతో సమానం. అందువలన ఈ విధంగా సోమరితనంగా అవ్వవద్దు. కొంచెం సమయమే నడిచింది కానీ పోగొట్టుకున్నది ఎంత? అడుగు అడుగులో కోటానుకోట్లు అని అంటారు కదా! అయితే పావుగంటలో ఎన్ని అడుగులు వేశారు, ఎన్ని కోట్లు పోగొట్టుకున్నారు? జమాలో అయితే లెక్క బాగా పెడతారు. అడుగులో కోట్లు సంపాదన అయ్యాయి అని కానీ పోగొట్టుకునేది కూడా లెక్క పెట్టుకోండి. సంస్కారం అనేది వద్దనుకున్నా లాగుతూ ఉంటుంది. ఏ విషయం మాటిమాటికి జరుగుతుందో అది సంస్కార రూపంలో నిండిపోతుంది. అందువలన సంకల్పాన్ని పరివర్తన చేయండి. 

చేయకూడదు. కానీ అయిపోయింది ఏమి చెయ్యను? అని ఆలోచించటం కాదు. ఆలోచించండి మరియు చేసి చూపించండి. జరిగిపోయిన దానికి బిందువు పెట్టండి అని అంటారు. ఒకరికొకరు జ్ఞానం ఇచ్చుకుంటారు కదా! ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే అలాగే బిందువు పెట్టేయండి అంటున్నారు. కానీ స్వయం బిందువు పెడుతున్నారా? బిందువు పెట్టడానికి ఏ శక్తి కావాలి? పరివర్తనా శక్తి. పరివర్తనా శక్తి గలవారు సదా నిర్మలంగా మరియు నిర్మాణంగా ఉంటారు. ఇంతకు ముందు కూడా బాప్ దాదా చెప్పారు - మలుచుకునేవారే సత్యమైన బంగారం. సత్యమైన బంగారానికి గుర్తు అది మలవబడుతుంది. అందువలన పరిశీలించండి - పరివర్తనా శక్తి సమయానుసారం కార్యంలోకి వస్తుందా లేక సమయం గడిచిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటున్నారా? పరివర్తనాశక్తిని పెంచుకోవాలి. ఎవరిలో పరివర్తనా శక్తి ఉంటుందో వారు అందరికీ ప్రియం అనిపిస్తారు. ఆలోచనలో కూడా సహజంగా ఉంటారు. ముందు ముందు సేవలో ఉంటారు కదా? సేవలో కూడా విఘ్న రూపం ఏమిటి? నా ఆలోచన, నా ప్లాన్, నా సేవ ఇంత మంచిగా ఉన్నా కానీ నన్ను ఎందుకు అంగీకరించరు? అంటారు. అలాంటి వారిని సత్యమైన బంగారం అంటారా? నాది అనే భావం వచ్చేసింది నాది అనేది రావటం అంటే కల్తీ కలవటం. సత్యమైన బంగారంలో కల్తీ కలిస్తే సత్యంగా ఉంటుందా? దానికి విలువ ఉంటుందా? ఎంత తేడా వచ్చేస్తుంది. అందువలన సమయం మరియు వాయుమండలాన్ని పరిశీలించి స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. అది ఇప్పుడు అవసరం. పెద్ద పెద్ద విషయాలలో పరివర్తన అవ్వటం సహజమే కానీ ప్రతీ పరిస్థితిలో, ప్రతీ సంబంధ సంపర్కంలో సమయం మరియు వాయు మండలాన్ని అర్థం చేసుకుని స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. ఇదే నెంబర్‌ వన్‌గా అవ్వటం. ఫలానా వారు ఉన్నారు కదా! వారు పరివర్తన అవ్వాలి కదా! కేవలం నేనే అవ్వటమా? అని ఆలోచించకండి. ఎవరు చేస్తే వారు అర్జునులు. దీనిలో మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకుంటే ఈ పరివర్తనయే విజయీగా అవ్వటానికి గుర్తు. అర్థమైందా? 

నలువైపుల ఉన్నటువంటి సదా స్మృతి స్వరూప ఆత్మలకు, సదా సెకనులో పరివర్తనా శక్తి ద్వారా స్వయాన్ని పరివర్తన చేసుకునే ఆత్మలకు, సదా సహజ యోగిగా అనుభవం చేసుకునే అనుభవీ ఆత్మలకు, సదా బాబాకి సమీపంగా మరియు సమానంగా అయ్యే ఉత్సాహ ఉల్లాసాలలో ఉండే సర్వాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments