07-03-1986 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“చదువులోని నాలుగు సబ్జెక్టుల యథార్థ స్మృతిచిహ్నము - మహా శివరాత్రి”
ఈరోజు జ్ఞానదాత, భాగ్య విధాత, సర్వ శక్తుల వరదాత, సర్వ ఖజానాలతో నిండుగా చేసే భోళానాథుడైన తండ్రి తమ అతి స్నేహీ, సదా సహయోగీ, సమీప పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. ఈ మిలనమే సదాకాలము కోసం ఉత్సవము జరుపుకునేందుకు స్మృతిచిహ్నంగా అయిపోతుంది. భిన్న-భిన్న పేర్లతో ఎప్పటికప్పుడు ఏ ఉత్సవాలైతే జరుపుకుంటారో - అవన్నీ ఈ సమయంలో తండ్రి మరియు పిల్లల మధుర మిలనము, ఉత్సాహంతో నిండిన మిలనము, భవిష్యత్తు కోసం ఉత్సవ రూపంగా తయారవుతాయి. ఈ సమయంలో సర్వ శ్రేష్ఠ పిల్లలైన మీ ప్రతి రోజూ, ప్రతి ఘడియ సదా సంతోషంలో ఉండే ఘడియలు మరియు సమయము. మరి ఈ చిన్న సంగమయుగపు అలౌకిక జీవితాన్ని, అలౌకిక ప్రాప్తులను, అలౌకిక అనుభవాలను ద్వాపరం నుండి భక్తులు భిన్న-భిన్న పేర్లతో స్మృతిచిహ్నంగా తయారుచేసారు. ఈ జీవితము, అనగా మీ ఈ ఒక్క జన్మ, భక్తుల 63 జన్మలకు స్మృతికి సాధనంగా అయిపోతుంది. మీరు ఇంతటి మహాన్ ఆత్మలు! ఈ సమయంలో ఎంతో అద్భుతమైన విషయం ఏమిటంటే - ఇది మీరు ప్రాక్టికల్ గా కూడా జరుపుకుంటున్నారు మరియు నిమిత్తంగా ఉన్న ఆ స్మృతిచిహ్నాన్ని కూడా జరుపుకుంటున్నారు. చైతన్యంగా కూడా ఉన్నారు మరియు చిత్రాలు కూడా తోడుగా ఉన్నాయి.
5 వేల సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరూ ఏమేమి ప్రాప్తి చేసుకున్నారు, ఎలా తయారయ్యారు, ఏ విధంగా అలా అయ్యారు, ఈ 5 వేల సంవత్సరాల మీ పూర్తి స్మృతిచిహ్న చిత్రము మరియు జన్మపత్రికను మీరు స్పష్టంగా తెలుసుకున్నారు. ఇది మీరు వింటున్నారు. వీరు మా గాయనం చేస్తున్నారు, పూజ చేస్తున్నారు మరియు మా జీవిత కథలనే వర్ణిస్తున్నారని చూసి హర్షిస్తున్నారు. ఒరిజినల్ గా మీ చిత్రాన్ని తయారుచేయలేరు కనుక భావనాపూర్వకంగా ఏదైతే టచ్ అవుతుందో దానినే చిత్రంగా తయారుచేసారు. మరి ప్రాక్టికల్ గా శివ జయంతిని రోజూ అయితే జరుపుకుంటున్నారు ఎందుకంటే సంగమయుగమే అవతరణ యుగము, శ్రేష్ఠ కర్తవ్యము, శ్రేష్ఠ చరిత్రను తయారుచేసే యుగము. ఈ అనంతమైన యుగం మధ్యలో ఈ స్మృతిచిహ్న రోజును కూడా జరుపుకుంటున్నారు. మీరందరూ జరుపుకోవడము అంటే మిలనము జరుపుకోవడం మరియు వారు జరుపుకోవడము అంటే ఆహ్వానించడము. వారిది పిలవడము మరియు మీది పొందడము. వారు "రండి" అని అంటారు మరియు మీరు "వచ్చేసారు", "లభించేసారు" అని అంటారు. స్మృతిచిహ్నానికి మరియు ప్రాక్టికల్ కి రాత్రికీ-పగలుకున్నంత తేడా ఉంది. వాస్తవానికి ఈ రోజు భోళానాథుడైన తండ్రి రోజు. భోళానాథుడు అంటే లెక్క పెట్టకుండా లెక్కలేనంత ఇచ్చేవారు. నిజానికైతే ఇంతకు ఇంత అని లెక్క ఉంటుంది, ఎవరు ఎంత చేస్తే అంతే పొందుతారు. ఇది లెక్క. కానీ భోళానాథుడు ఏం చేస్తారు? ఎందుకంటే ఈ సమయంలో ఇవ్వడంలో ఇంతకు ఇంత అని వారు లెక్క పెట్టరు. ఒకటికి పదమాలరెట్ల లెక్క ఉంటుంది అంటే లెక్కలేనంత అయింది కదా. ఎక్కడ ఒకటి, ఎక్కడ పదమాలు! పదమ్ అన్నది కూడా ఆఖరి మాట, అందుకే పదమ్ అంటున్నాము. లెక్కలేనంత ఇచ్చే భోళా భండారీ దివసమును స్మతిచిహ్న రూపంలో జరుపుకుంటున్నారు. మీకైతే ఎంత లభించిందంటే, మీరైతే నిండుగా ఉండనే ఉన్నారు, 21 జన్మలు, 21 తరాలు సదా నిండుగా ఉంటారు.
ఇన్ని జన్మల గ్యారంటీ ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఎంత పెద్ద దాత అయినా కానీ అనేక జన్మలకు భండాగారాన్ని నిండుగా చేసే గ్యారంటీని ఎవ్వరూ ఇవ్వలేరు. మరి భోళానాథుడే కదా. నాలెడ్జ్ ఫుల్ అయి ఉండి కూడా భోళా అవుతారు... కనుక భోళానాథుడు అని అంటారు. అయితే లెక్క వేయాలంటే, ఒక్కొక్క సంకల్పం యొక్క లెక్కను కూడా వారు తెలుసుకోగలరు. కానీ తెలిసి కూడా, ఇవ్వడంలో భోళానాథుడిగా అవుతారు. మరి మీరందరూ భోళానాథుడైన తండ్రికి భోళానాథ పిల్లలు కదా! ఒకవైపు భోళానాథుడు అంటారు, మరోవైపు నిండు భాండాగారము అంటారు. స్మృతిచిహ్నాన్ని కూడా చూడండి, ఎంతో చక్కగా జరుపుకుంటారు. జరుపుకునేవారికి తెలియదు కానీ మీకైతే తెలుసు. ఈ సంగమయుగంలో ముఖ్యమైన చదువులో విశేషంగా నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి, ఆ నాలుగు సబ్జెక్టులను స్మృతిదివసము నాడు జరుపుకుంటున్నారు. ఎలా? విశేషంగా ఈ ఉత్సవం నాడు బిందువు మరియు నీటి బొట్టు యొక్క మహత్వము ఉంటుందని ముందు కూడా వినిపించారు. బిందువు, ఈ సమయంలో స్మృతి అనగా యోగమనే సబ్జెక్టుకు గుర్తు. స్మృతిలో బిందువు స్థితిలోనే స్థితులవుతారు కదా! కావున బిందువు స్మృతికి గుర్తు అయితే నీటి బొట్టు - జ్ఞానపు భిన్న-భిన్న చుక్కలకు గుర్తు. ఈ జ్ఞానమనే సబ్జెక్టుకు గుర్తుగా నీటి బొట్టు రూపంలో చూపించారు. ధారణకు గుర్తుగా ఈ రోజున విశేషంగా వ్రతం పెట్టుకుంటారు. ఆ వ్రతాన్ని ధారణ చేయండి. ధారణలో కూడా మీరు దృఢ సంకల్పం చేస్తారు. ఇలా సహనశీలిగా మరియు అంతర్ముఖులుగా తప్పకుండా అయ్యి చూపించాలి అన్న వ్రతాన్ని పెట్టుకుంటారు. మరి ఈ వ్రతాన్ని ధారణ చేస్తారు కదా! ఈ వ్రతము ధారణకు గుర్తు మరియు సేవకు గుర్తు - జాగరణ. సేవను చేస్తూనే ఉన్నారు కానీ ఎవరిని మేలుకొల్పడానికి! అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పడము, జాగరణ చేయించడము, జాగృతి కలిగించడము - ఇదే మీ సేవ. కనుక ఈ జాగరణ సేవకు గుర్తు. మరి నాలుగు సబ్జెక్టులు వచ్చేసాయి కదా. కేవలం వాటి రూపురేఖలను వారు స్థూల రూపంలోకి మార్చేసారు. అయినప్పటికీ భక్తులు భావన కలవారిగా ఉంటారు, సదా సత్యమైన భక్తుల గుర్తు ఏమిటంటే - వారు ఏ సంకల్పం చేస్తారో అందులో దృఢంగా ఉంటారు, అందుకే భక్తులపై కూడా తండ్రికి స్నేహము ఉంది. మీ స్మతిచిహ్నాలను ద్వాపరం నుండి పరంపరగా నడిపిస్తున్నారు మరియు విశేషంగా ఈ రోజు ఎలా అయితే ఇక్కడ సంగమయుగంలో మీరు సమర్పణ సమారోహము మళ్ళీ-మళ్ళీ జరుపుకుంటారో, వేరు-వేరుగా కూడా జరుపుతారో, అలాగే మీ ఈ ఫంక్షన్ కు కూడా స్మృతిచిహ్నంగా, వారు స్వయాన్ని సమర్పితం చేయరు కానీ మేకను సమర్పితం చేస్తారు. మేకను బలి ఇస్తారు. ఈ నేను-నేను అన్నది సమర్పణ అయినప్పుడే సమర్పణ అనగా సంపూర్ణంగా అయినట్లు అని బాప్ దాదా కూడా నవ్వుతూ అంటారు. తండ్రి సమానంగా అవ్వండి. బ్రహ్మాబాబా మొట్టమొదటగా ఏ అడుగును వేసారు? నేను మరియు నాది యొక్క సమర్పణ సమారోహాన్ని జరుపుకున్నారు అనగా ఏ విషయంలోనైనా, నేను అనేదానికి బదులుగా సదా నేచురల్ భాషలో, సాధారణ భాషలో కూడా తండ్రి అన్న మాటనే మనం విన్నాము. నేను అన్న పదమే లేదు.
బాబా చేయిస్తున్నారు, నేను చేస్తున్నాను అని కాదు. బాబా నడిపిస్తున్నారు. నేను చెప్తున్నాను అని కాదు, బాబా చెప్తున్నారు. హద్దులోని ఏ వ్యక్తిపై లేక వైభవంపై ఆకర్షణ ఉండటమంటే నాది అన్న భావం ఉన్నట్లు. కనుక నాది మరియు నేను అన్నవాటిని సమర్పణ చేయడము, దీనినే బలి అవ్వడము అని అంటారు. బలి అవ్వడము అనగా మహాబలి అవ్వడము. కనుక ఇది సమర్పణ అయ్యేందుకు గుర్తు.
మరి బాప్ దాదా భక్తులకు ఒక విషయంలో థాంక్స్ చెప్తారు - ఏదో ఒక రూపంలో భారతదేశంలో మరియు ప్రతీ దేశంలోనూ ఉత్సాహపు అలను వ్యాపింపజేయడానికి ఉత్సవాలు చేసారంటే మంచిదే కదా. రెండు రోజుల కోసం కావచ్చు, ఒక రోజు కోసం కావచ్చు కానీ ఉత్సాహపు అల అయితే వ్యాపిస్తుంది కదా, అందుకే ఉత్సవం అని అంటారు. అయినా అల్పకాలం కోసం విశేష రూపంలో తండ్రి వైపు మెజారిటీ వారి అటెన్షన్ వెళ్తుంది కదా. మరి ఈ విశేష రోజున విశేషంగా ఏమి చేస్తారు? ఎలాగైతే భక్తిలో కొంతమంది సదాకాలము కోసం వ్రతం పెట్టుకుంటారు, మరి కొందరిలో ధైర్యం లేకపోతే ఒక నెల కోసం, ఒక రోజు కోసం లేదా కొంత సమయం కోసం వ్రతాన్ని పెట్టుకుంటారు. ఆ తర్వాత వ్రతాన్ని విడిచిపెడతారు. మీరైతే అలా చేయరు కదా! మధుబన్ లో ఉంటే పాదాలు భూమిపై ఉండవు కదా, మళ్ళీ విదేశానికి వెళ్ళినప్పుడు భూమిపైకి వస్తారా లేకపోతే పైనే ఉంటారా! ఎప్పుడూ పై నుండి క్రిందకు వచ్చి కర్మలు చేస్తారా లేక క్రింద ఉండి కర్మలు చేస్తారా? పైన ఉండడం అనగా ఉన్నత స్థితిలో ఉండడం. పైన అంటే మేడ మీద వ్రేలాడడం కాదు. ఉన్నతమైన స్థితిలో స్థితులై ఏదైనా సాధారణ కర్మను చేయడం అనగా క్రిందకు రావడం, కానీ సాధారణ కర్మలు చేస్తూ కూడా స్థితి పైన అనగా ఉన్నతంగా ఉండాలి. ఎలాగైతే తండ్రి కూడా సాధారణ తనువును తీసుకుంటారు కదా. కర్మలైతే సాధారణమైనవే చేస్తారు కదా, మీరెలా మాట్లాడుతారో అలాగే మాట్లాడుతారు, అలాగే నడుస్తారు, అంటే కర్మ సాధారణమైనదే, తనువు కూడా సాధారణమైనదే అయినాగానీ సాధారణ కర్మను చేస్తూ కూడా స్థితి ఉన్నతంగా ఉంటుంది. అలాగే మీ స్థితి కూడా సదా ఉన్నతంగా ఉండాలి.
ఎలాగైతే ఈ రోజును అవతరణ దివసము అని అంటారో, అలాగే రోజూ అమృతవేళ, నిద్ర నుండి కాదు, శాంతిధామం నుండి కర్మ చేయడం కోసం అవతరించాను అని భావించండి. మరియు రాత్రి వేళ కర్మలు చేసి శాంతిధామానికి వెళ్ళిపోండి. అవతారమూర్తులు అవతరించేదే శ్రేష్ఠ కర్మలు చేయడానికి. వారిది జన్మ అని అనరు, అవతరణ అని అంటారు. ఉన్నతమైన స్థితి నుండి క్రిందకు వస్తారు - ఇదే అవతరణ. మరి ఇటువంటి స్థితిలో ఉంటూ కర్మలు చేయడం వలన సాధారణ కర్మ కూడా అలౌకిక కర్మలోకి మారిపోతుంది. వేరేవారు భోజనం చేస్తారు, కానీ మీరు బ్రహ్మా భోజనం తింటున్నాము అని అంటారు. తేడా ఉంది కదా. నడుస్తున్నా కానీ మీరు ఫరిశ్తాల వలె నడుస్తారు, డబల్ లైట్ స్థితిలో నడుస్తారు. మరి అలౌకిక నడవడిక, అలౌకిక కర్మ అయినట్టు కదా. మరి కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే అవతరణ రోజు కాదు, కానీ సంగమయుగమే అవతరణ దివసము.
ఈరోజున మీరు బాప్ దాదాకు అభినందనలు తెలుపుతారు, కానీ బాప్ దాదా “ముందు మీరు” అని అంటారు. ఒకవేళ పిల్లలు లేకపోతే తండ్రి అని ఎవరు అంటారు. పిల్లలే తండ్రిని తండ్రి అంటారు కనుక ముందు పిల్లలకు అభినందనలు. మీరందరూ పుట్టినరోజు పాటను పాడుతారు కదా - హ్యాపీ బర్త్ డే టు యూ... బాప్ దాదా కూడా పిల్లలకు చెప్తున్నారు, హ్యాపీ బర్త్ డే టు యూ. పిల్లలు తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. తండ్రి పిల్లలకు తెలిపారు. అభినందనలతోనే పాలింపబడుతున్నారు. మీ అందరి పాలన ఏమిటి? తండ్రి మరియు పరివారము యొక్క అభినందనలతోనే పాలింపబడుతున్నారు. అభినందనలతోనే నాట్యం చేస్తున్నారు, పాడుతున్నారు, పాలన తీసుకుంటున్నారు, ఎగురుతూ వెళ్తున్నారు. ఈ పాలన కూడా అద్భుతమైనది. ఒకరికొకరు ప్రతి క్షణము ఏమి ఇచ్చుకుంటారు? అభినందనలు, ఇదే పాలనకు విధి. ఎవరు ఎలా ఉన్నా కానీ నంబరువారుగానే ఉంటారు, అదైతే బాప్ దాదాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. ఒకవేళ నంబరువారుగా లేకపోతే సత్యయుగంలో కనీసం ఒకటిన్నర లక్షల సింహాసనాలు తయారు చేయించవలసి వస్తుంది కనుక నంబరువారుగా ఉండవలసిందే. కావున నంబరువారుగా ఉన్నారు, కానీ ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేసారు, వీరు సరిగా చేయడం లేదని మీకనిపిస్తే, రాంగ్ ను రైట్ గా చేసే విధి లేదా యథార్థ కర్మ చేయనివారికి యథార్థ కర్మను నేర్పించే విధి - ఎప్పుడూ వారికి నేరుగా మీరు రాంగ్ చేస్తున్నారని చెప్పకండి. ఇలా చెప్పడం వలన వారు ఎప్పటికీ మారరు. ఉదాహరణకు నిప్పును ఆర్పడానికి నిప్పును వెలిగించకుండా, దానికి చల్లని నీటిని వేయడం జరుగుతుంది, కనుక ఎప్పుడూ వారితో ముందే నువ్వు తప్పు, నువ్వు తప్పు అని అంటే వారు మరింత నిరాశ చెందుతారు. ముందు వారిని బాగుంది, బాగుంది అని అంటూ నిలబెట్టండి, ముందు నీటిని వేసిన తర్వాత వారికి నిప్పు ఎందుకు అంటుకుందో వినిపించండి. నువ్విలా ఉన్నావు, నువ్విలా చేసావు, ఇలా చేసావు అని ముందే ఇలా అనకండి. ముందు చల్లని నీటిని వేయండి. ఆ తర్వాత నిప్పు అంటుకోవడానికి కారణము ఏమిటి మరియు నిప్పును ఆర్పేందుకు సాధనమేమిటో వారికి కూడా అర్థమవుతుంది. ఒకవేళ చెడుగా ఉన్నవారిని మీరు చెడుగా ఉన్నారు అని అంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. కనుక చాలా మంచిది, చాలా బాగుంది అని అంటూ తర్వాత మీరు చెప్పవలసింది చెప్తే, వారిలో వినడానికి, ధారణ చేయడానికి ధైర్యం వస్తుంది, అందుకే వినిపించాము కదా, చాలా బాగుంది, చాలా మంచిది, ఇవే అభినందనలు. బాప్ దాదా కూడా ఎప్పుడూ ఎవ్వరికీ డైరెక్ట్ గా నువ్వు రాంగ్ చేసావు అని చెప్పరు, రైట్ ఏమిటో, రాంగ్ ఏమిటో మురళిలో వినిపిస్తారు. కానీ ఎవరైనా నేరుగా వచ్చి నేను తప్పా! అని అడిగితే, లేదు, నువ్వు చాలా రైట్ అనే అంటారు ఎందుకంటే ఆ సమయంలో వారికి ధైర్యం ఉండదు. ఎలా అయితే పేషెంట్ మరణిస్తున్న క్షణాల్లో కూడా, చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు కూడా, నేను వెళ్ళిపోతున్నానా అని డాక్టరును అడిగితే, అవును వెళ్ళిపోతున్నావు అని డాక్టరు ఎప్పుడూ చెప్పరు, ఎందుకంటే ఆ సమయంలో వారికి ధైర్యము ఉండదు. ఎవరి హృదయమైనా బలహీనంగా ఉంటే, వారికి మీరు అటువంటి విషయమేదైనా చెప్తే, వారికి హార్ట్ ఫెయిల్ అయిపోతుంది అనగా పురుషార్థంలో పరివర్తన తీసుకువచ్చేందుకు శక్తి ఉండదు. కనుక సంగమయుగమే అభినందనలతో వృద్ధిని పొందే యుగము. ఈ అభినందనలే శ్రేష్ఠ పాలన. అందుకనే మీ ఈ అభినందనల పాలనకు స్మృతిచిహ్నంగా, ఎప్పుడైనా ఏ దేవీదేవతల దివసాన్ని జరుపుకున్నా, దానిని పెద్ద రోజు అని అంటారు. దీపావళి అయినా, శివరాత్రి అయినా, ఈ రోజు పెద్ద రోజు అని అంటారు. ఏ ఉత్సవాలు జరిగినా వాటిని పెద్ద రోజులు అని అంటారు, ఎందుకంటే మీకు పెద్ద మనసుంది కనుక వారు పెద్ద రోజు అని అన్నారు. మరి ఒకరికొకరు అభినందనలు తెలపడమే పెద్ద మనసు ఉండడము. అర్థమయిందా - తప్పును తప్పు అని అర్థం చేయించవద్దు అని అనడం లేదు, కానీ కాస్త ఓపిక వహించండి, సూచన అయితే ఇవ్వవలసి ఉంటుంది కానీ సమయాన్ని కూడా చూడండి. వారు మరణిస్తున్నారు, మీరు మరణించూ, మరణించూ అని అంటే.... కనుక సమయాన్ని చూడండి, వారి ధైర్యాన్ని చూడండి. చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటూ ఉంటే వారిలో ధైర్యం వస్తుంది. కానీ మనస్ఫూర్తిగా అనండి - అంతేకానీ బయటకు మాత్రమే అంటే, వీరు ఊరికే అంటున్నారు అని వారికి అనిపిస్తుంది. ఇది భావన విషయము. మనసులోని దయతో కూడిన భావము ఉన్నట్లైతే, అప్పుడు వారి మనసుకు ఆ దయా భావన అనుభవం అవుతుంది. అందుకే సదా అభినందనలు ఇస్తూ ఉండండి. అభినందనలు తీసుకుంటూ ఉండండి. ఈ అభినందన, వరదానము. ఈ రోజు గురించి గాయనము ఉంది కదా - శివుని భండాగారము నిండుగా ఉంది...... మరి ఇది మీ గాయనము, కేవలం తండ్రిది కాదు. సదా భండాగారము నిండుగా ఉండాలి. దాత పిల్లలు దాతలుగా అవ్వండి. వినిపించాము కదా - భక్తులు లేవతా (తీసుకునేవారు) మరియు మీరు ఇచ్చేవారు, 'దేవత', అంటే దాత అనగా ఇచ్చేవారు. ఎవరికైనా ఏదైనా కాస్త ఇచ్చి తర్వాత మీరు వారి నుండి తీసుకున్నట్లైతే వారికి ఫీల్ అవ్వదు. తర్వాత వారికి మీరేమైనా నచ్చజెప్పవచ్చు. కానీ ముందు మీరు వారికి ఇవ్వండి. ధైర్యము ఇవ్వండి, ఉల్లాసాన్ని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, ఆ తర్వాత ఏదైనా విషయం నచ్చజెప్పాలనుకున్నా చెప్పవచ్చు, రోజూ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉండండి. రోజూ తండ్రితో మిలనం జరుపుకోవడమే ఉత్సవం జరుపుకోవడము. మరి రోజూ ఉత్సవమే కదా. అచ్ఛా.
నలువైపుల ఉన్న పిల్లలకు, సంగమయుగంలో ప్రతి రోజూ అవతరణ దివసము యొక్క అవినాశి అభినందనలు. సదా తండ్రి సమానంగా దాత మరియు వరదాతలుగా అయ్యి ప్రతి ఆత్మను నిండుగా చేసేవారికి, మాస్టర్ భోళానాథుని పిల్లలకు, సదా స్మృతిలో ఉంటూ ప్రతి కర్మను స్మృతిచిహ్నంగా చేసే పిల్లలకు, సదా స్వ ఉన్నతి మరియు సేవ ఉన్నతిలో ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్ళే శ్రేష్ఠ పిల్లలకు, విశేషంగా ఈనాటి స్మృతిచిహ్న దివసము శివ జయంతి సో బ్రాహ్మణ జయంతి వజ్రతుల్య జయంతి, సదా సర్వులను సుఖమయంగా చేసే, సంపన్నంగా చేసే జయంతి యొక్క అభినందనలు మరియు ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment