18-06-1973 అవ్యక్త మురళి

* 18-06-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“విశేష ఆత్మల విశేషత.”

           అందరూ ఈ సమయంలో తమ శ్రేష్ఠ స్వమానపు సింహాసనంపై స్థితులై ఉన్నారా? శ్రేష్ఠ స్వమాన రూపమును గూర్చి మీకు తెలుసా? ఈ సమయంలో విశ్వరచయిత యొక్క డైరెక్ట్ రచన, మొదటి రచన, సర్వశ్రేష్ఠ రచన మరియు రచయిత యొక్క బాలకులు మరియు యజమానులు ఎవరైతే బాప్ దాదాల ఆత్మిక రత్నాలుగా ఉన్నారో, హృదయ సింహాసనాధికారులుగా ఉన్నారో, మస్తక మణులుగా ఉన్నారో, బాప్ దాదాల కర్తవ్యంలో సహాయకులుగా ఉన్నారో మరియు ఎవరైతే విశ్వకళ్యాణకారులుగా, విశ్వం యొక్క ఆధారమూర్తులుగా, విశ్వం ముందు శ్రేష్ఠ ఉదాహరణ రూపంలో ఉన్నారో అటువంటి సర్వస్వమానాలు స్మృతిలో ఉంటున్నాయా? సదా స్వమానమనే సింహాసనంపై స్థితులై ఉంటున్నారా లేక సింహాసనంపై నిలువలేకపోతున్నారా? దీని పేరే సింహాసనము. దీని అర్థం ఏమిటి? దీనిపై ఎవరు నిలిచి ఉండగలరు? సర్వశక్తి సంపన్నులే ఈ ఆసనంపై అనగా ఈ స్థితిలో స్థితులై ఉండగలరు. సింహాసనంలో సింహము ఉంది. సింహంగా అవ్వకపోతే ఆసనంపై స్థితులవ్వలేరు. సింహాసనము ఎవరి కొరకు? అది సర్వశక్తువంతుల మొదటి రచన. మొదటి రచనలో రచయిత సమానంగా సర్వశక్తులూ స్వరూపంలో కనిపిస్తున్నాయా? మొదటి రచన విశేషత ఏదైతే ఈ సమయంలో ఉందో దానిని గూర్చి మీకు తెలుసా? ఆ విశేషత కారణంగా విశ్వరచయితకు కూడా మీరు యజమానులుగా అవుతారు. బాబా కన్నా కూడా విశేష పూజ్యయోగ్యులుగా అవుతారు. బాబా కూడా ఇటువంటి రచన గుణగానము చేస్తారు మరియు వందన చేస్తారు, అది ఏ విశేషత? తండ్రి గాయనమును ఆత్మలే చేస్తారు. కాని, ఇటువంటి సర్వశ్రేష్ఠ ఆత్మల గాయనమును స్వయంగా సర్వశక్తువంతుడైన తండ్రి చేస్తారు! అనగా పరమాత్మ ద్వారా ఆత్మల గాయనము జరుగుతుంది. స్వయంగా తండ్రియే ఇటువంటి ఆత్మలను ప్రతిరోజూ పదే పదే స్మరిస్తారు. ఇటువంటి ఆత్మల ఏ ముఖ్య విశేషత కారణంగా వారు ఇంతటి శ్రేష్ఠంగా అయ్యారు? మీ ఆ విశేషతను గూర్చి మీకు తెలుసా? తప్పకుండా మీలో బాబా కన్నా ఏదో విశేషత ఎక్కువగా ఉంది. అదేమిటో తెలుసా? ఏ విషయంలో బాబా కన్నా ముందు ఉన్నారు? ఆ విశేషతను వినిపించండి. ఏ విషయంలో మీరు బాప్ దాదా కన్నా ముందు ఉన్నారు? అష్టరత్నాలలో కేవలం శక్తులే ఉన్నారా లేక పాండవులు కూడా రాగలరా? ఎప్పుడైతే మీరు సోదరులుగా ఉన్నారో, అప్పుడిక ఆత్మిక రూపపు స్థితిలో స్థిరమై ఉన్న ఆత్మ అష్టరత్నంగా అవ్వగలదు. ఇందులో శక్తులు లేక పాండవుల విషయమేమీలేదు. ఇది ఆత్మిక స్థితి యొక్క విషయము. ఇందులోకి ఇరువురూ రావచ్చు. పాండవుల సీటు కూడా అష్టరత్నాలలో ఉంది.

           అచ్ఛా! ఆత్మలను తండ్రిపై కూడా యజమానులుగా చేసే మొట్టమొదటి విశేషత ఏమిటి? వారు బాబా కన్నా కూడా శ్రేష్ఠంగా అవుతారు. ఆ విశేషత - తండ్రిని ప్రత్యక్షం చేయడం, బాబా సంబంధంలో సమీపంగా తీసుకురావడం, బాబాకు వారసులుగా తయారుచేయడం. ఇది మొటమొదటి రచన అయిన మీ కర్తవ్యము. బాబా పిల్లలైన మీ ద్వారానే ప్రత్యక్షమవుతారు. నిరాకార తండ్రి మరియు సాకార బ్రహ్మాబాబా ఇరువురికీ తమ నిశ్చయము, తమ బ్రాహ్మణ జీవితపు ఆధారంతో, తమ అనుభవం ఆధారంతో విశ్వం ముందు ప్రఖ్యాతము చేశారు, అప్పుడే విశేషంగా అవుతారు. కావున తండ్రిని ప్రత్యక్షం చేసే విశేషత పిల్లలది. కావుననే బాబా ప్రతిఫలంగా విశ్వం ముందు స్వయం గుప్తరూపంగా ఉంటూ శక్తి సైన్యమును లేక పాండవ సైన్యమును ప్రఖ్యాతం చేస్తారు. కావున ఇది పిల్లల విశేషత, కావుననే బాబా కన్నా ఎక్కువగా పూజింపబడతారు. ఇటువంటి మీ విశేషత మీ స్మృతిలో ఉంటోందా లేక మీరు మర్చిపోతారా? సంగమయుగ బ్రాహ్మణుల విశేషత సదా స్మృతి స్వరూపపు విశేషత. కావున బ్రాహ్మణత్వపు విశేషతను అనుభవం చేసుకుంటున్నారా? శూద్రత్వము అనగా విస్మృత స్వరూపము. బ్రాహ్మణులుగా అయి కూడా విస్మృతిలోకి వచ్చినట్లయితే శూద్రులకు మరియు బ్రాహ్మణులకు మధ్య అంతరం ఏమిటి? మరజీవా జన్మలోని అలౌకికత ఏమిటి? విస్మృతి లౌకికత అనగా అది ఈ లోకపు ఆచార వ్యవహారాలకు సంబంధించినది. బ్రాహ్మణుల ఆచారము సదా స్మృతి స్వరూపము. ఎప్పుడూ మీ లౌకిక కులపు ఆచార వ్యవహారాలను, మర్యాదలను ఎవరైనా మర్చిపోతారా? బ్రాహ్మణ కులపు ఆచార వ్యవహారాలను లేక మర్యాదలను బ్రాహ్మణులు మర్చిపోవడమన్నది సంభవమా? బ్రాహ్మణుల ఆచార వ్యవహారములు అలౌకికములైనవి. ఈ ఆచార వ్యవహారములలో నడవడము సాధారణము మరియు సహజమైన విషయము. మీరు ఉన్నదే బ్రాహ్మణులుగా, ఇతర కులముల ఆచార వ్యవహారములను ధారణ చేయడం కష్టమవ్వవచ్చు. కాని, ఇదైతే మీ ఆది  ఆచారము, సహజ జీవితపు విషయము. ఇది బ్రాహ్మణ జన్మలోని సంస్కారాలకు సంబంధించిన విషయము, ఇందులో కష్టమేముంది? బ్రాహ్మణ జీవితపు సంస్కారము లేక స్వభావము ఏమిటి? సర్వదివ్య గుణాలే బ్రాహ్మణుల స్వభావము, దానినే దివ్యస్వభావము అని అంటారు. కావున దివ్యగుణాలు బ్రాహ్మణుల స్వాభావికమైన వస్తువులు. అనగా బ్రాహ్మణ జీవితపు స్వభావమే సర్వ దివ్యగుణాలు, గంభీరత, రమణీకత, హర్షితముఖత, సహనశీలత, సంతోషము - ఇవి బ్రాహ్మణ జీవితపు స్వభావాలు మరియు విశ్వసేవాధారిగా అవ్వడం బ్రాహ్మణ జీవితపు సంస్కారము. బ్రాహ్మణ జీవితపు స్వభావము మరియు సంస్కారమే ఇది అయినప్పుడు ఏ గుణమైనా ధారణ చేయడము లేక సేవాధారిగా అయ్యేందుకు స్వయమును అనగా నేను అన్నదానిని త్యాగం చేయడము లేక నిరంతర తపస్వీ స్వరూపముగా లేక సృతిస్వరూపంగా అవ్వడము సహజమైన మరియు సాధారణమైన విషయమే కదా! ఎవరికైనా ఏ జన్మ సంస్కారమైనా ఉన్నప్పుడు లేక జన్మించినప్పటి నుండే ఏదైనా స్వభావం ఉన్నప్పుడు దానిని పరివర్తన చేయడం కష్టమా లేక దాని అనుసారంగా నడవడం సహజంగా ఉంటుందా? ఏ విధంగా మీరు కూడా మీ బలహీనతకు వశమైనప్పుడు నా స్వభావము లేక సంస్కారము అని సాకులు చెబుతారు కదా! అలాగే బ్రాహ్మణ జీవితపు ఆది స్వభావము మరియు సంస్కారమేదైతే ఉందో అందులో బ్రాహ్మణులు నడవడము సహజమా లేక కష్టమా? ఈ దివ్యగుణాల సంస్కారాలకు విరుద్ధంగా ఏదైనా కార్యమును చేయమని ఎవరైనా అంటే, అది బ్రాహ్మణులకు కష్టమవ్వాలి. ఇప్పుడు ప్రాక్టికల్ లో ఎలా ఉంది? శూద్రత్వపు సంస్కారాలు మరియు స్వభావాలు నేచురల్ రూపంలో ఉన్నాయా లేక బ్రాహ్మణత్వపు స్వభావాలు మరియు సంస్కారాలు నేచురల్ రూపంలో ఉన్నాయా? ఇందులో పురుషార్థం చేయవలసిన అవసరం లేదు. ఇవి జీవితపు నిజ సంస్కారాలైనప్పుడు పురుషార్థం చేయవలసిన అవసరం లేదు. తమ స్వమానపు సింహాసనంపై స్థితులవ్వలేకపోతారు మరియు తమ సింహాసనమును వదిలేస్తారు మరియు తమ తయారై ఉన్న భాగ్యమును మర్చిపోతారు అని ఇంతకుముందు కూడా వినిపించాము కదా! కావుననే నిజ సంస్కారము మరియు స్వభావములను కష్టమైనవిగా అనుభవం చేసుకుంటారు. అర్థమైందా? బాబా యొక్క ఈ విషయంపై ఒక గాయనం కూడా ఉంది. అది పిల్లల గాయనం కూడా “కష్టమైనదానిని సహజం చేయువారు”. కావున కష్టమైనదానిని సహజం చేయువారు, పర్వతమును ఒక ఆవగింజలా చేసేవారు లేక ఒక దూదిపోగులా చేసేవారు అన్న గాయనము బాబాకు ఉంది కదా! దూది ఎంత తేలికగా మరియు స్వచ్చంగా ఉంటుంది మరియు పర్వతము ఎంత కష్టముగా మరియు భారముగా ఉంటుంది? పర్వతము ఎక్కడ, ఆవగింజ లేక దూదిపోగు ఎక్కడ? మరి బాబా గాయనం ఏదైతే ఉందో అది మీ గాయనం కాదా! కష్టమైనదానిని సహజంగా చేసే బ్రాహ్మణులకు ఏదైనా విషయం కష్టముగా అనిపించడము జరుగగలదా? కావున మీ స్వమానంలో స్థితులై మీ విశేషతలను అన్నివేళలా స్మృతిలో ఉంచుకోండి. విశేష ఆత్మలు ప్రతి సంకల్పమును మరియు ప్రతి కార్యమును విశేషంగా చేస్తారు అనగా శ్రేష్ఠంగా చేస్తారు.

           అచ్ఛా! ఈ విధంగా సదా కష్టమైనదానిని సహజంగా చేసేవారికి, సదా స్మృతి స్వరూపులకు, బాబా సమానంగా ప్రతి సంకల్పమును, ప్రతి క్షణమును విశ్వకళ్యాణపు విశేష కర్తవ్యంలో వినియోగించే విశ్వకళ్యాణకారులకు, బాప్ దాదాల హృదయ సింహాసనాధికారులైన శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments