05-10-1971 అవ్యక్త మురళి

* 05-10-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"సంపూర్ణతకు గుర్తు 16 కళలు" 

            అందరి పురుషార్థపు లక్ష్యము ఏమిటి? (సంపూర్ణంగా అవ్వడం). సంపూర్ణతా స్థితి అని దేనిని అంటారు? మీ ముందు ఉన్న ఏ చిత్రమును మీరు సంపూర్ణ స్థితిగా భావిస్తున్నారు? బాబా కూడా ఏ సంపూర్ణ స్థితినైతే ధారణ చేశారో అందులో ఏ విషయాలు ఉన్నాయి? ఇతరులకు వినిపించేటప్పుడు సంపూర్ణ స్థితిని గూర్చి ఏమేమి వర్ణన చేస్తారు? ఈ జ్ఞానము ద్వారా సర్వగుణ సంపన్నంగా, 16 కళా సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వికారులుగా అవుతారు అని వారికి వివరిస్తారు కదా! ఈ సంపూర్ణ స్థితిని వర్ణిస్తారు కదా! భవిష్యత్తులో ప్రాప్తి ఉంటుంది, కాని సంపూర్ణ స్థితి అని దీనినే అంటారు కదా! ఆత్మలో శక్తిని ఇప్పటినుండే నింపుకోవాలి కదా! 16 కళా సంపూర్ణులు అని అంటారు, మరి కళలను ఇప్పుడే నింపుకుంటారు కదా! సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు, 16 కళా సంపూర్ణులు అన్న పదాలను ఇక్కడే వాడతారు కదా! ఇది సంపూర్ణ స్థితి. సర్వగుణాలు ఏమిటి అన్నదైతే మీకు తెలుసు కదా! గుణాల లిస్ట్ అయితే ఉంది కాని ఈ 16 కళలు అని దేనినైతే అంటారో దాని భావార్థం ఏమిటి? ఇది సంపూర్ణ స్థితి యొక్క గుర్తు. ఎవరిలోనైనా ఏదైనా విశేషత ఉంటే, వీరిలో ఈ కళ ఉంది అని అంటారు కదా! కొందరిలో ఏడిచేవారిని నవ్వించే కళ అనగా విశేషత ఉంటుంది, కొందరిలో ఇంద్రజాలపు కళ ఉంటుంది, మరికొందరిలో చమత్కారీ బుద్ధి అనే కళ ఉంటుంది కదా! కావున ఈ 16 కళా సంపూర్ణులు అనగా వాటి కర్మలేవైతే జరుగుతాయో ఆ కర్మలన్నీ కళా సంపన్నంగా కనిపిస్తాయి. వారి ప్రతి నడవడిక, చూడడము, మాట్లాడడము, నడవడము అన్నీ కళాత్మకంగా కనిపిస్తాయి. ఏ విధంగా ఎవరి కళనైనా చూసేందుకు ఎంత ఆసక్తితో వెళతారు! అదేవిధంగా సంపూర్ణ స్థితిని ప్రాప్తించుకున్న ఆత్మల ప్రతి నడవడిక కళాత్మకంగా ఉంటుంది మరియు అవి చరిత్ర రూపంగా కూడా అయిపోతాయి. మరి అది విశేషతయే కదా! ఏ విధంగా సాకార బాబా యెక్క మాట్లాడడము, నడవడము అన్నింటిలోను విశేషతను చూశారు కదా! మరి అది కళయే కదా! లేచే కళ, కూర్చొనే కళ, నడిచే కళ ఉండేవి. అన్నీ అతీతంగా మరియు విశేషతతో కూడుకున్నవై ఉండేవి. ప్రతి కర్మను కళారూపకంలో ప్రత్యక్షంగా చూశారు. కావున 16 కళలు అనగా ప్రతి నడవడిక సంపూర్ణ కళారూపంలో కనిపించాలి, అటువంటివారినే 16 కళా సంపూర్ణులు అని అంటారు. కావున సంపూర్ణతకు గుర్తు వారి ప్రతి కర్మ కళాత్మకంగా కనిపిస్తుంది అనగా వారిలో విశేషత ఉంటుంది, దానినే సంపూర్ణ స్థితి అని అంటారు.

            కావున 16 కళా సంపూర్ణులుగా అయ్యే లక్ష్యమునేదైతే ఉంచారో దాని స్పష్టీకరణ ఇదే. నాకు చూడడంలో కళ ఉందా? నా మాట్లాడడంలో కళ నిండి ఉందా అని గమనించుకోవాలి. కళాకాంతులు అంతమైపోయాయి అని అంటూ ఉంటారు. కళ ఒకటేమో మంచిగా ఉంటుంది. అలాగే కళాకాంతులు అంతమైపోయాయి అనగా కర్మలో ఆకర్షించే శక్తి, విశేషత ఏదైతే ఉండాలో అది అంతమైపోయింది అని అర్థము. కావున ప్రతి కర్మ కళావంతంగా ఉందా, లేదా అన్నది పరిశీలించుకోవాలి. ఎవరైనా ఇంద్రజాలికులు తమ ఇంద్రజాలమును చూపించే సమయంలో ఆ సమయమంతా ప్రతి కర్మ కళాత్మకంగా కనిపిస్తుంది. వారు ఎలా నడుస్తారు, ఏదైనా వస్తువును ఎలా పట్టుకుంటారు..... వాటన్నింటిలోను కళారూపము ఉన్నట్లుగా కనిపిస్తుంది. కావున ఈ సంగమ యుగం కూడా విశేషంగా కర్మరూపీ కళను చూపించే సమయం. మేము స్టేజీపై కూర్చున్నాము అనే సదా అనిపించాలి. ఈ విధంగా 16 కళా సంపూర్ణంగా అవ్వాలి. ఎవరి ప్రతి కర్మ కళారూపంగా ఉంటుందో వారి ప్రతి కర్మ అనగా గుణాల యొక్క గాయనము జరుగుతుంది. దీనినే వేరే పదాలలో ప్రతి కర్మ చరిత్ర సమానంగా ఉంటుంది అని అంటారు. ఆ కళారూపమును చూసి ఇతరులలో కూడా ప్రేరణ నిండుతుంది. వారి కర్మలు కూడా సేవ చేస్తాయి. ఎవరైనా కళను చూపించినప్పుడు ఆ కళ సంపాదనకు సాధనమైపోతుంది అదేవిధంగా ఎవరైతే ప్రతి కర్మను కళారూపంగా చేస్తారో వారి ఆ కర్మలు తరగని సంపాదనా సాధనాలుగా అయిపోతాయి మరియు ఇతరులను ఆకర్షిస్తాయి. ప్రతి కర్మ కళారూపంగా ఉన్నట్లయితే వారు ఒక అయస్కాంతంలా అయిపోతారు. ఈ రోజుల్లో కొన్ని చిన్న చిన్న కళలను చూపించేవారు కూడా రోడ్డుపై దారిలో కళను చూపిస్తే అందరూ పోగైపోతారు. ఇది శ్రేష్ఠమైన కళ, మరి ఈ కళను చూసి ఆత్మలు ఆకర్షితం అవ్వవా? ఇప్పుడు ఇదంతా పరిశీలించుకోవాలి. ఎవరైతే శ్రేష్ఠ ఆత్మలుగా అవుతారో వారి ప్రతి కర్మ పైనా ప్రతి ఒక్కరి అటెన్షన్ ఉంటుంది ఎందుకంటే వారి ప్రతి కర్మలోను కళ నిండి ఉంటుంది. కావుననే ప్రతి కర్మ యొక్క కళామందిరాలలో పూజ జరుగుతుంది. పెద్ద పెద్ద మందిరాలలో వారి కూర్చొనే దర్శనం వేరుగా, నిదురించే దర్శనం వేరుగా, తినే దర్శనం వేరుగా, స్నానం చేసే దర్శనం వేరుగా ఉంటుంది. చాలా కొద్ది మందిరాలలో అన్ని కర్మల దర్శనము జరుగుతుంది, దాని కారణం ఏమిటి? ఎందుకంటే ప్రతి కర్మను కళారూపంగా చేశారు, కావున వాటి స్మృతి చిహ్నాలు కొనసాగుతాయి. సాకారంలో కూడా ప్రతి కర్మను చూసే ఆసక్తి ఎందుకు ఉంటుంది? ఇన్ని సంవత్సరాలు తోడుగా ఉంటూ, తెలిసి ఉంటూ, అర్థం చేసుకుంటూ, చూస్తూ కూడా మళ్ళీ మళ్ళీ చేసే ఆసక్తి ఎందుకు ఉంటుంది? ఒక్క కర్మను కూడా మిస్ అవ్వాలనుకునేవారు కాదు. ఏ విధంగా ఇంద్రజాలికులు కళ చూపించేటప్పుడు ఒక్క విషయాన్ని కూడా మిస్ చేసినా కూడా ఎంతో మిస్ చేశామని భావిస్తారు, ఎందుకంటే వారి ప్రతి కర్మ కళాత్మకంగా ఉంటుంది. అదేవిధంగా వీరు ఎలా పడుకుంటారో చూడాలి అనే కోరిక ఉండేది, అలా పడుకోవడంలో కూడా కళ ఉండేది, ప్రతి కర్మలోను కళ ఉండేది, దీనినే 16 కళా సంపూర్ణము అని అంటారు. అచ్ఛా, ఇటువంటి స్టేజ్ తయారైందా? లక్ష్యమైతే ఈ స్టేజ్ ను పొందాలనే ఉంది కదా! లక్ష్యము ద్వారా లక్షణాలను ధారణ చేయవలసి ఉంటుంది. ప్రతి కర్మ కళారూపకంగా ఉన్నట్లయితే 16 కళా సంపూర్ణులుగా అవ్వడం ద్వారా సర్వ గుణాల ధారణ కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అచ్ఛా!

Comments