13-04-2011 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
జ్వాలాముఖి అగ్ని స్వరూప యోగశక్తి ద్వారా సంస్కారాల యొక్క సంస్కారం చేయండి, మీ నడవడిక, ముఖం, దృష్టి, వృత్తి మరియు సంకల్పం ద్వారా బాబాని ప్రత్యక్షం చేయండి.
ఈరోజు పిల్లల యొక్క ప్రేమ ప్రేమ సాగరుడిని కూడా తన దగ్గరకి పిలిచింది. బాప్‌దాదాకి సంతోషంగా ఉంది, పిల్లలకు తండ్రిపై మనస్ఫూర్వకమైన ప్రేమ బావుంది మరియు సదా ఈ ప్రేమ ఆధారంగానే బాబా సమానంగా అయిపోతారు. మామూలుగా కూడా బాప్‌దాదా ప్రేమ అనే సబ్జెక్టులో పిల్లలను ముందుంచారు. ఈరోజు పిల్లలు తమ ప్రేమ యొక్క త్రాడుతో బంధించి ప్రేమ సాగరుడిని విశేషంగా మధువనం పిలిచారు. ఈ ప్రేమ సదా ప్రత్యక్ష రూపంలో ఉండాలి. మనోభిరాముడైన బాబాకి కూడా మనస్ఫూర్వక ప్రేమ సదా చేరుతూ ఉంటుంది నెంబరువారీ తప్పుడు. బాబా అనుకుంటున్నారు, ప్రేమకు గుర్తు ఏమిటంటే సదా ప్రతి ఒక్కరి హృదయంలో మనోభిరాముడు లీనమై ఉండాలి. ఏ బిడ్డ కూడా ఒంటరివారు కాదు, కలిసి ఉన్నారు. అయితే పరిశీలించుకోండి, సదా కలిసే ఉంటున్నారా లేక అప్పుడప్పుడు ఒంటరివారు కూడా అవుతున్నారా? ఒంటరితనంలో మాయ అవకాశం తీసుకుంటుంది అందువలన బాప్‌దాదా సదా చెప్తారు, మనోభిరాముడిని మనస్సులో కొలువుంచుకోండి. దీనినే సత్యమైన మరియు సదా ప్రేమ అని అంటారు. అయితే ఎప్పుడైనా ఒంటరిగా అవుతున్నారా లేక సదా కలిసి ఉంటున్నారా? మీ ప్రతి ఒక్కరి ప్రతిజ్ఞ ఏమిటి? విశేషంగా మధువన నివాసీయులకు నషా ఉంది, కలిసి ఉన్నాము, కలిసి వెళ్తాము, కలిసి రాజ్యం చేస్తాం అని. అదేవిధంగా ఎవరైతే విశేష మధురాతి మధుర నిమిత్త పిల్లలు కూర్చున్నారు. వారు బాబాతో చేసిన మనస్ఫూర్వక ప్రతిజ్ఞ ఇదే మరియు ఎక్కువమంది ప్రత్యక్షంగా కూడా ఆవిధంగానే ఉంటున్నారు. సదా కంబైండ్ రూపంలోనే ఉంటున్నారు కానీ నెంబరువారీ. బాబా అనుకుంటున్నారు, ప్రతి ఒక్క మహారథి, నిమిత్త పిల్లలు తమ ముఖం ద్వారా ఇతరులకు బాబాలను సాక్షాత్కారం చేయించేవారని. వారి యొక్క ముఖం మరియు నడవడిక ద్వారా బాబా యొక్క ప్రకాశమయ ముఖం మరియు దాంతోపాటు బాబావంటి అతీత మరియు ప్రియమైన నడవడిక యొక్క సాక్షాత్కారం అవుతూ ఉండాలి.
బ్రహ్మాబాబాని చూశారు, బ్రహ్మాబాబా అంతిమం వరకు బాబా యొక్క శ్రీమతానుసారంగా ప్రతి మురళీలో ఎన్నిసార్లు బాబా, బాబా అని అనేవారు! లెక్కించండి. ప్రతి మురళీలో బాబా, బాబా అని ఎన్నిసార్లు అనేవారు? మరియు బాబావంటి ముఖం ద్వారా, మూర్తి ద్వారా, వచనం ద్వారా, విశేషంగా నయనాలు మరియు మస్తకం ద్వారా బాబాని ప్రత్యక్షం చేశారు! పిల్లలైన మీరు అనుభవీలు కదా, బ్రహ్మాబాబాను చూస్తుంటే ఏమి అనుభవం అయ్యేది? బాప్‌దాదా అనుభవం అయ్యేవారు. కేవలం బాప్ అనే మాట ఎవరూ అనేవారు కాదు, సదా ప్రతి ఒక్కరి నోటి నుండి బాప్‌దాదా, బాప్‌దాదా అని కలిసి అనేవారు మరియు అనుభవమయ్యేది. ఈవిధంగా తండ్రిని అనుసరించండి. మీ ముఖం ద్వారా, మాట ద్వారా, నడవడిక ద్వారా, దృష్టి ద్వారా బాబా యొక్క స్మృతి స్వతహాగానే రావాలి చూసినవారికి. ఇప్పుడు బాబా చూశారు, మీ అందరికీ, ఎక్కువమంది ఉన్న సంకల్పం ఏమిటంటే మేము మా ముఖం, మాట లేదా కర్మ ద్వారా బాబాని ప్రత్యక్షం చేయాలని. కనుక తండ్రిని అనుసరించండి. ఏవిధంగానైతే బ్రహ్మాబాబా తన నడవడిక, ముఖం ద్వారా, దృష్టి ద్వారా, వృత్తి ద్వారా, సంకల్పం ద్వారా సదా బాబాని ప్రత్యక్షం చేశారో మీ అందరికీ అనుభవం ఉంది కదా! బ్రహ్మాబాబా ఒక్కరినే చూసేవారు కాదు, బాప్‌దాదాయే కనిపించేవారు. కారణం ఏమిటి? బ్రహ్మాబాబా సదా తన నయనాలలో, మస్తకంలో బాబాని నింపుకున్నారు. కనుక మీ ముఖం, నడవడిక బాప్‌దాదాని ప్రత్యక్షం చేయాలి. 1. ప్రతి మాటలో నేర్పించేవారు అనుభవమవ్వాలి. వీరు ఏదైతే మాట్లాడుతున్నారో వీరికి నేర్పించినవారు, వీరిలో శక్తినింపేవారు సర్వశక్తివంతుడైన తండ్రి, భగవంతుడు అని తెలియాలి. వీరు భగవంతుని పిల్లలు, భగవంతుని విద్యార్థులు, భగవంతుడిని అనుసరించే అనుచరులు కాదు, ఒక అడుగులో కోటానుకోట్ల సంపాదన చేసుకునేవారు. ఇప్పుడు సమయం కూడా మీకు సహాయోగి అవ్వడానికి తయారుగా ఉంది. పరిస్థితులు మారుతున్నాయి. ఆ పరిస్థితులు భగవంతుని స్మృతిని ఇప్పిస్తున్నాయి. 1. సమయం మరియు 2. నిమిత్తమైన మీ రెండు గ్రూపుల విశేషత. విశేషంగా నిమిత్తంగా తయారైన గ్రూపు మీటింగ్‌కి వచ్చారు.
బాప్‌దాదా చూశారు, వచ్చినటువంటి పిల్లలలో ఎక్కువమంది మనస్సులో మేము బాబాని ప్రత్యక్షం చేసి తీరవలసిందే అని ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నాయి. ముఖం ద్వారా లేదా మూర్తి ద్వారా, వాణి ద్వారా, ఏ ఆత్మలు సంబంధ సంప్రదింపుల్లోకి వచ్చినా కానీ ఈరోజుల్లో మీరు చేసే మనసు యొక్క కల్యాణ భావన ద్వారా ఆత్మలు మీ సంబంధంలోకి వస్తున్నారు మరియు రావాలనుకుంటున్నారు కూడా. బాప్‌దాదా మనసాసేవ యొక్క పనిని అప్పగించారు, దానిలో కూడా చూసిందేమిటంటే యోగయుక్తంగా అయ్యి మనసాసేవ యొక్క అభ్యాసం చేస్తున్నారు; ఇప్పుడు ఆ తరంగాలు నలువైనూల ఎవరికోకరికి చేరుతున్నాయి. మాకు ఎక్కడి నుండో ప్రకాశ కిరణాలు, సుఖ శాంతి అలలు వస్తూ ఉన్నాయి కానీ ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది వారికి స్పష్టం కాలేదు. వస్తున్నాయి అంటున్నారు కానీ భారతదేశంలో ఉన్న బాప్‌దాదా యొక్క పిల్లల నుండి వస్తున్నాయి అనేది స్పష్టం కాలేదు. స్పష్టం అయితే పరుగున వచ్చేస్తారు. ఇప్పుడు ఇటువంటి ఆత్మలపై మరింత శక్తిశాలి కిరణాలను ప్రసరింపచేయండి దాని ద్వారా వారికి ఇది స్పష్టంగా తెలియాలి. చేరుతున్నాయి, మొదలైంది కానీ ఇప్పుడు కొంచెం కొంచెం కొన్ని కిరణాలు చేరుతున్నాయి ఇప్పుడు దీనిని మరింత శక్తిశాలిగా చేయండి. వారికి చేరటంలో, స్పష్టం అవ్వటంలో ఏవైతే విఘ్నాలు వస్తున్నాయో, ఏవి కారణమవుతున్నాయో వాటిని తొలగించండి, 2. యోగం జోడిస్తున్నారు, అమృతవేళ కూర్చుంటున్నారు కానీ జ్వాలాముఖి యోగం ఉండాలి; అది తక్కువగా ఉంది. దీని కారణంగా ఏ భక్తులకు లేదా ఆత్మలకు మీరు కిరణాలు పంపిస్తున్నారో ఆ కిరణాలు అంత స్పష్టంగా ఉండటం లేదు. మరియు జ్వాలాముఖి అగ్ని స్వరూప యోగశక్తి లేని కారణంగా లేదా తక్కువగా ఉన్న కారణంగా మధ్యలో విఘ్నం వేసే సంస్కారాలు సమాప్తి అవ్వటం లేదు. పరివర్తన అయిపోవాలి అని పురుషార్థం చేస్తున్నారు, అవి చనిపోతున్నాయి కానీ వాటిని కాల్చటం లేదు. రావణుడిని కేవలం చంపరు, చంపిన తర్వాత కాల్చేస్తారు ఎందుకంటే చంపిన తర్వాత శరీరం అయితే మిగిలిపోతుంది కదా! అదేవిధంగా 3. మీరు అమృతవేళ బాబా స్మృతిలో కూర్చుంటున్నారు కానీ యోగం అగ్ని రూపంలో, జ్వాలా రూపంలో తక్కువగా ఉంటుంది. బాబాని కలుసుకుంటున్నారు, ఆత్మిక సంభాషణ చేస్తున్నారు, తమ తమ జీవితంలోని విషయాలను కూడా చెప్తున్నారు. కానీ యోగం నిరంతరం అగ్ని రూపంలో ఉండాలి. సంస్కారాలను తప్పకుండా చంపుతున్నారు కానీ మధ్యమధ్యలో అవి లేస్తున్నాయి. కాల్చేస్తే ఇక నామరూపాలు సమాప్తి అయిపోతాయి. ఇప్పుడు పిల్లలందరు ఆత్మిక సంభాషణలో చెప్తున్నారు; ఎంత కావాలనుకుంటున్నామో అంత ఉండటం లేదని; కనుక బాప్‌దాదా ఈరోజు మీకు సూచన ఇస్తున్నారు ఎందుకంటే విశేష మహావీర్ పిల్లలు మీటింగ్‌కి వచ్చారు కదా మరియు మధువననివాసీయులు అంటే మధువనంలో ఏమి ఉంది? మధువనం అంటే బాబా. మధువనం అని అంటే అందరికీ ఏమి గుర్తు వస్తుంది? మధువనంలోని బాబా. అందువలన మధువనం వారు విశేషంగా ఈ ధ్యాన పెట్టుకోవాలి, ఎలాగైతే మధువనం అని అంటే మధువనంలోని బాబా గుర్తు వస్తారో, అందరు మధువనం వారిని ఏ దృష్టితో చూస్తారు? మధువనం వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. క్రింద ఉండేవారు అయినా, పైన ఉండేవారు అయినా ఈనాటి ఈ సభలో అందరికంటే ఎక్కువమంది మధువన నివాసీయులు ఉన్నారు. బాప్‌దాదాకి సంతోషంగా ఉంది, మధువన నివాసీయులు ఈ అద్భుతం తప్పక చేసి చూపిస్తారని. మధువననివాసీయుల యొక్క ముఖం మరియు మూర్తి ద్వారా బాబాయే బాబా కనిపించాలి. మాట ద్వారా బాబా కనిపించాలి ఎందుకంటే మధువనంలో యజ్ఞసేవకు బలం మరియు ఫలం చాలా లభిస్తుంది. తీసుకునేవారు తీసుకోవాలే కానీ లభిస్తూనే ఉంటుంది. సంస్కారాలను చూడటం లేదా సంస్కారాలను కలుపుకోవటంలో సదా ధ్యాన పెట్టవలసిన అవసరం ఉంది. 4. మధువనంలో ఉండే ప్రతి బిడ్డపై బాప్‌దాదాకి విశేష ప్రేమ ఉంటుంది, ఎందువలన? బాబా స్థాపన చేసిన యజ్ఞం యొక్క సేవలో స్వయాన్ని సమర్పితం చేసుకున్నారు. మధువనం వారికి 1. తమ పురుషార్థం యొక్క ఫలం లభిస్తూ ఉంది మరియు 2. మధువనానికి వచ్చే బ్రాహ్మణులు లేదా కొత్తఆత్మలకి సేవ చేస్తారు, యజ్ఞ సేవ ఇది, సాధారణ సేవ కాదు కనుక ఆ యజ్ఞసేవకు కూడా అదనపు పుణ్యం లభిస్తుంది. ఏ మధువన నివాసీ అయినా కానీ అమృతవేళ నుండి రాత్రి వరకు బాప్‌దాదా యొక్క శ్రీమతానుసారంగా నడిస్తే దానికి అదనపు పుణ్యం లభిస్తుంది, అది వారికి తెలిసినా తెలియకపోయినా, ఈ విషయంలో సోమరిగా ఉన్నా కానీ మధువన సేవ యొక్క పుణ్యం తప్పక లభిస్తుంది. మధువననివాసి అవ్వటం సాధారణ విషయం కాదు. ఎవరు ఏ పని చేస్తున్నా కానీ, శుభ్రం చేయిస్తున్నా కానీ ఆ సాధారణ పని యొక్క పుణ్యం కూడా ఎక్కువే లభిస్తుంది ఎందుకంటే స్వయంగా బాబా రచించిన యజ్ఞం కనుక. ఈ యజ్ఞం ద్వారానే మధువనంలో అందరికీ పరమాత్మ ప్రేమ ప్రాప్తిస్తుంది. అందువలన మధువనంలో తప్ప బాబా మరెక్కడా రారు. బాబా రావటం, కలుసుకోవటం అనే పాత్ర మధువనానికే నిర్ణయం అయ్యి ఉంది. కనుక మధువనంలో ఉండే ప్రతి ఒక్కరు మీ పుణ్యఖాతా గురించి తెలుసుకోండి, గ్రహించండి మరియు ఆ మహాన్ ప్రాప్తి స్వరూపులు అవ్వండి. ఇక్కడ ఏది జరిగినా కానీ మీ పని ఏమిటంటే అది పెద్దవారికి చెప్పటం. పెద్దవారికి చెప్పేశారు అంటే మీ మనస్సు నుండి తీసేశారు. మీ బాధ్యత పూర్తి అయిపోయింది. ఏదైనా సరిగ్గా జరగటం లేదు అని మీకుఅనిపిస్తే దానిలో మీకు పాపం తయారువ్వదు. ఎవరు భాధ్యులో వారికి తయారవుతుంది. మీరు నిశ్చింతగా ఉండండి. పెద్దవారికి చెప్పటం మీ పని, కానీ ఆ తర్వాత ఏమి జరిగింది, ఏమి జరగలేదు, ఇలా ఎందుకు అవ్వలేదు, అలా ఎందుకు అవ్వలేదు వీటి గురించి మీకు అవసరం లేదు, వీటి వలన మరిన్ని వ్యర్థ సంకల్పాలు వస్తాయి. మీ బాధ్యత మీరు నెరవేర్చండి. విషయం పెద్దవారికి వరకు చేర్చండి, అది కూడా పద్ధతి ప్రకారం మధువననివాసి బ్రాహ్మణులు మీరు, ఉన్నతమైన వారు మీరు కనుక మీ కర్తవ్యం ఏమిటో తెలుసుకుని ఆ కర్తవ్యాన్ని చేయండి. మీ కర్తవ్యం గురించి విని అందరు నేర్చుకునేవిధంగా ఉండాలి. బాప్‌దాదాకి తెలుసు, మధువనం వారిలో కొందరు చాలా మర్యాదాపూర్వకంగా స్వ పురుషార్థంతో బాబాకి స్నేహి అయ్యి సహాయోగం ఇచ్చే పిల్లలు కూడా ఉన్నారు. కానీ బాప్‌దాదా కోరుకునేది, మధువనం వారి గురించి బాప్‌దాదా యొక్క కోరిక ఏమిటి? మధువన నివాసీ అయిన ప్రతి బాబా బిడ్డ యజ్ఞ స్నేహి, సహాయోగియై తమ నడవడిక ద్వారా అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి. మధువన నివాసీలైన మీకు ఎంత గొప్ప భాగ్యం! కనుక మీ భాగ్యాన్ని ప్రసిద్ధి చేయండి ఎందుకంటే యజ్ఞ నివాసులు. పరమాత్మ మొదట ఏమి రచించారు? యజ్ఞాన్ని రచించారు. యజ్ఞభూమిగా మధువనం నిమిత్తమైంది. మధువనం యొక్క మహిమ తెలుసు కదా, మధువనం యొక్క మహిమ తెలిసినవారు చేతులెత్తండి. బాప్‌దాదా ఇక్కడ చూస్తారు. మంచిది, చాలా మంచిది.
బాప్‌దాదా ప్రతి మధువన నివాసికి చాలా చాలా శక్తిశాలి మనస్ఫూర్వక ప్రేమ మరియు మనస్ఫూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు. మరియు మహారథీలను, మీటింగ్‌కి వచ్చిన వారిని చూసి ఓహో పిల్లలూ ఓహో అని మనస్సులో పాడుకుంటున్నారు. 5. ఎవరైతే మీటింగ్‌కి వచ్చారో వారందరు ఒక విషయంలో ముందుకు వెళ్ళాలి. ఎవరు, ఎంతమంది మీకు సేవ కోసం సహాయోగిగా ఉన్నారో వారిని సదా మీ సంతోషం మరియు ప్రాప్తి ద్వారా సంతుష్టంగా ఉంచాలి. ఒకవేళ వారికి శిక్షణ ఇస్తున్నా కానీ శిక్షణతో పాటు స్నేహాన్ని కూడా ఇవ్వండి. ఆ స్నేహం ఆధారంగా వారు తమని తాము ముందుకు తీసుకువెళ్ళగలరు. మీ స్నేహాన్ని వారు లోకువగా తీసుకునేటంత ఇవ్వకండి, స్నేహం కారణంగా ఏది చేసినా కానీ క్షమించేయటం లాంటి స్నేహం ఇవ్వకండి. బాప్‌దాదాకి సంతోషంగా ఉంది, నిమిత్తమైన వారు ధ్యాన పెడుతున్నారు, ధ్యాన పెట్టి సంతుష్టం కూడా చేయండి మరియు విశ్వానికి సంతుష్టత యొక్క కిరణాలు చేరాలి. నిమిత్తమైనవారు ఈ పని కూడా చేయాలి. నిమిత్తమైనవారు తమ తమ సహాయోగుల సంస్కారాలను పరివర్తన చేయటంలో కొంచెం శ్రమించవలసి ఉంటుంది. సేవ చేయిస్తున్నారు, ఉండడానికి, తినడానికి సౌకర్యాలు సెంటర్లో కల్పిస్తున్నారు కానీ వారిలో ఎంత శక్తి నింపాలంటే వారు బాబా నుండి శక్తిని తీసుకుని మీ సేవాస్థానం యొక్క వాయుమండలాన్ని బాగా తయారుచేయాలి దాని ద్వారా అక్కడికి ఎవరు వచ్చినా కానీ మొదట ఆ వాయుమండలం యొక్క ఆకర్షణలోకి వచ్చేయాలి. ఎందుకంటే ఈరోజుల్లో అందరు ఇదే కోరుకుంటున్నారు రాగానే ఏదో అనుభవం అయ్యేవిధంగా ఉండాలనుకుంటున్నారు. చూడగానే ఏదో అనుభవం అవ్వాలి. వినే అనుభవం అయితే అవుతుంది, యోగం యొక్క అనుభవం కూడా అవుతుంది కానీ వాయుమండలం యొక్క అనుభవమవ్వాలి. ఈ ధ్యాన నిమిత్త ఆత్మలు పెట్టుకోవాలి, వారికి ఇది విశేష సేవ. స్వయం యోగయుక్తంగా అయ్యి వాయుమండలంలో మంచి స్థితిలో ఉంటే కనుక ఆ ప్రభావం సేవాస్థానంపై స్వతహాగానే పడుతుంది. 6. ఎలాగైతే బాప్‌దాదా లేదా నిమిత్తమైన ఉన్నత ఆత్మల యొక్క వాయుమండలం, తరంగాలు ప్రభావం వేస్తాయి కదా! బాప్‌దాదా వచ్చినప్పుడు వాయుమండలం మారిపోతుంది కదా! అలాగే ప్రతి బిడ్డ వాయుమండలాన్ని తయారుచేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీ సేవాకేంద్రాల యొక్క వాయుమండలం మారినప్పుడే విశ్వం యొక్క వాయуమండలం మారుతుంది. మీ సేవాస్థానాలే నిమిత్తం. పురుషార్థం ఉంది, లక్ష్యం ఉంది కానీ ఈ లక్ష్యాన్ని మరింత శక్తిశాలిగా తయారుచేసుకోండి. ఎవరిని చూసినా కానీ ప్రజలు ముఖం ద్వారా, తరంగాల ద్వారా తెలుసుకుంటున్నారు ఈరోజుల్లో ఎందుకంటే వారి బుద్ధిలో ఆసురీ శక్తి యొక్క ప్రభావం కూడా ఉంది, జ్ఞానం యొక్క ప్రభావం కూడా ఉంది అందువలన మీటింగ్‌కి వచ్చిన ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది. బాప్‌దాదాకి తెలుసు అలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు కూడా కానీ మీ ప్రయత్నాన్ని మరి కొంచెం పెంచండి. అర్థమైందా!
ఈరోజు ప్రత్యేకంగా పిలిచారు. ప్రేమ పాఠంలో అయితే గెలిచారు. మధువనం వారి సంకల్పం కావచ్చు వారి సంకల్ప శక్తి, మిమ్మల్ని పిలిచిన ప్రత్యక్ష శక్తి, ప్రేమతో, నషాతో మాట్లాడారు. మధువనం వారి పిలుపే కానీ మీరు కలవటం వలన డబల్ అయ్యింది. మంచిది. ఇప్పుడు చెప్పాల్సింది మరేమైనా ఉందా! ఇప్పుడు బాప్‌దాదా అందరి ఫలితాన్ని చూడాలనుకుంటున్నారు. మధువనం వారి యొక్క మరియు మీటింగ్ వారి యొక్క ఇద్దరి ఫలితాన్ని చూడాలనుకుంటున్నారు. జగదాంబ యొక్క విశేష పురుషార్థం ఏమిటంటే బాబా చెప్పటం మరియు జగదాంబ చేయటం. మీ దాదీ యొక్క మాట కూడా ఇదే – ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. మీ దాదీ యొక్క సంకల్పం ఇదే–ఇప్పుడు కర్మాతీతంగా అవ్వాలి, కర్మాతీతంగా అయ్యేటందుకు క్లాస్ చేయటం, కర్మాతీతం యొక్క ఉల్లాసాన్ని ఇవ్వటం. ఎవరైతే పాండవులు వెళ్ళిపోయారో వారి మనస్సులో కూడా ఇదే సంకల్పం – మేము పాండవులం, పాండవులను విజయీలు అని అంటారు, మీ మహిమ విజయీ పాండవులు, పాండవులు అనగానే ఏమి గుర్తు వస్తుంది? విజయం. అక్షోణీసైన్యం ఉన్నా కానీ పాండవులు అనే మాట అనగానే విజయం గుర్తు వస్తుంది. పాండవులు అయిదుగురే కానీ విజయీలు. ఎటువంటి వాయుమండలం అయినా కానీ, అక్షోణీ సైన్యం యొక్క వాయుమండలం ఉన్నా కానీ పాండవులు, పాండవపతి యొక్క శ్రీమతంతో విజయీగా అయ్యారు మరియు విజయం యొక్క పేరు ప్రసిద్ధం చేశారు. ఇప్పుడు ఆ పాండవులే విజయీలై ఇతరులకు కూడా విజయాన్ని ఇచ్చేవారు. అందువలన పాండవులను చూసి బాప్‌దాదా సంతోషిస్తారు. ఏ విషయంలో సంతోష పడతారు? శక్తులకు తోడుగా ఉంటారు.శక్తులకు సహాయోగాన్నిచ్చి ముందుకి తీసుకెళ్ళడంలో తోడుగా ఉంటారు. బాబా శక్తులకు శివశక్తి అనే మంత్రాన్నిచ్చి కంబైండ్‌గా తయారుచేశారు, అదేవిధంగా పాండవులు కూడా శక్తులకు సహాయోగమిచ్చి వారిని ముందుపెట్టే మంచివారు మరియు సదా ఇంకా మంచివారిగా అయ్యి ముందుకి వెళ్ళేవారు. మంచిది.
బాప్‌దాదా ఈరోజు మీ స్నేహాన్ని చూసి మీ అందరికీ కూడా స్నేహ హారాన్ని వేస్తున్నారు. అలాగే మీరు కూడా అందరికీ స్నేహం సహాయోగం అనే హారాన్ని వేయండి చాలు. చేతులతో హారాన్ని వేయటం కాదు, మనస్సుతో సహాయోగం అనే హారాన్ని వేయండి. బాప్‌దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు, 7. ప్రతి ఒక్క బిడ్డ యొక్క జేబులో సహాయోగం అనే నోటు ఉండాలి. పొరపాట్లు అనే నోటు కాదు, సహాయోగం అనే నోట్లతో జేబు నిండి ఉండాలి. ఎక్కడ చూసినా కానీ సహాయోగం ఇవ్వండి అంటున్నారు కనుక సహాయోగమనే నోటు ఇవ్వండి. ఉందా జేబులో? సహాయోగం అనే నోటు ఉందా? నిండి ఉందా? నిండి ఉంది కదా, ఖాళీ లేదు కదా? మీరు సహాయోగం అనే నోటు ఇవ్వండి మరియు వారు మీకు ఆశీర్వాదాలు అనే హారం వేస్తారు. తర్వాత సీజన్‌లో వచ్చేటప్పుడు ఏ సంతోషకర వార్త వినిపిస్తారు? సంస్కారాల యొక్క సంస్కారం అయిపోయింది. తయారేనా? అందరూ తయారేనా? రెడీయేనా? మొదటి వరుసలోని వారు చేయి ఎత్తడం లేదు. చేయి ఎత్తారు. వెనుక ఉన్నవారు ఎత్తారు. ముందుగానే ఈ సంతోషకరవార్త వినిపిస్తారు కదా! సంస్కారాలను తొలగించుకుంటున్నారు కానీ కాల్చడం లేదు అందువలన తిరిగి మరలా వచ్చేస్తున్నాయి. అందువలనే చెప్పాను సంస్కారాలను సంస్కారం చేయాలని. ఎందుకంటే సమయాన్ని మీరే సమీపంగా తీసుకురావాలి. మీ అడ్వాన్స్ పార్టీ యొక్క డిపార్ట్‌మెంట్లు కూర్చునేవారు కూడా చాలా ఎదురుచూస్తున్నారు. మీకు వారి యొక్క సంకల్పం చేరుతుందా? వారు తారీఖు అడుగుతున్నారు. మీ యొక్క పెద్ద పెద్ద దాదీలు మరియు దాదాలు అక్కడ తారీఖు గురించి ఎదురుచూస్తున్నారు. మరియితే వారికి తారీఖు చెప్తారా? చెప్తారా? మొదటి వరుసలోని వారు చెప్పండి. తారీఖు చెప్తారా? లేక నీవే చూసుకో అని చెప్తారా? ప్రతి ఒక్కరు దీనిలో ఏది చేస్తారు? ప్రతి ఒక్కరు మీలో మిగిలిపోయిన సంస్కారాలను సంస్కారం చేయండి. అప్పుడు సమయం సమీపంగా వచ్చేస్తుంది. సమయాన్ని సమీపంగా తీసుకువచ్చే శక్తి ఇది. మిగిలిపోయిన సంస్కారాలే విఘ్నం వేస్తున్నాయి. మరలా సీజన్ మొదలయ్యేటప్పటికి చాలా రోజులు ఉన్నాయి కనుక ప్రతి రోజు ఏదో ఒక సంస్కారాన్ని సంస్కారం చేయాలి. ఇన్ని రోజులున్నాయి కనుక ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళండి. అయితే ఎవరు చెప్తారు, మరలాసారి బాప్‌దాదా వచ్చినప్పుడు మేము సంస్కారాల యొక్క సంస్కారం చేశాం అని చేతులెత్తుతాం అనే వారు ఇప్పుడు చేయి ఎత్తండి. అయిపోయిందా? చేయి అయితే ఎత్తుతున్నారు, బాప్‌దాదా ముందుగానే చాలా చాలా చాలా శుభాకాంక్షలు ఇస్తున్నారు. మంచిది. బాబా తన ప్రతిజ్ఞ నిలుపుకున్నారు కదా. మీరు కూడా ప్రతిజ్ఞను నిలుపుకోవడంలో తెలివైనవారు. తండ్రికి ప్రతి పిల్లవాడు ప్రియమే. బాప్‌దాదాకి మేమెక్కడ ప్రియమవుతాం, మేము వెనుక ఉన్నాం, మేము అలాంటి వాళ్ళం ఇలా ఎవరూ అనుకోకండి. వెనుక ఉన్నవారు కూడా బాబాకి అతి అతి ప్రియమైనవారు ఎందుకంటే బాబాని నా బాబా అని అన్నారు కదా!
నలువైపుల ఉన్న పిల్లలందరికీ, ఎవరికైతే తెలిసిందో, అలా దూరంగా కూర్చున్న పిల్లలకు కూడా బాప్‌దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు మరియు ముందుగానే విజయీలుగా అయ్యాం అనే సంతోషకరవార్త చెప్తారని హృదయంలో ఇముడ్చుకుంటున్నారు. ఆ తర్వాత ప్రాక్టికల్‌గా చూస్తాను. మంచిది. ఈరోజు ఒకే టేబులుంది ఏమీ లేదు. ఈనాటి పార్టీ కలయిక చాలా కోలాహలం మరియు సంతోషకరమైనది. బాప్‌దాదాకి సంతోషంగా ఉంది.
Comments
Post a Comment