31-12-2002 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘ఈ కొత్త సంవత్సరములో సర్వ ఖజానాలను సఫలము చేసుకుని సఫలతామూర్తులుగా అయ్యే విశేషతను చూపించండి’’
ఈ రోజు నవయుగ రచయిత, నవ జీవనదాత అయిన బాప్ దాదా కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. మీరందరూ కూడా కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారా లేక కొత్త యుగాన్ని జరుపుకునేందుకు వచ్చారా? కొత్త సంవత్సరాన్ని అయితే అందరూ జరుపుకుంటారు కానీ మీరందరూ నవ జీవితము, నవ యుగము మరియు నవ సంవత్సరము, ఈ మూడింటినీ జరుపుకుంటున్నారు. బాప్ దాదా కూడా త్రిమూర్తి శుభాకాంక్షలను ఇస్తున్నారు. కొత్త సంవత్సరము సందర్భముగా ఒకరికొకరు శుభాకాంక్షలను తెలుపుకుంటారు, అలాగే దానితో పాటు ఏదో ఒక కానుకను కూడా ఇస్తారు. కానుకను ఇస్తారు కదా! కానీ బాప్ దాదా మీ అందరికీ ఏ కానుకను ఇచ్చారు? స్వర్ణిమ ప్రపంచము అనే కానుకను ఇచ్చారు. అందరికీ స్వర్ణిమ ప్రపంచము అనే కానుక లభించేసింది కదా! ఆ స్వర్ణిమ ప్రపంచములో, నవ యుగములో సర్వ ప్రాప్తులు ఉన్నాయి. గుర్తుందా మీ రాజ్యము? ఎటువంటి అప్రాప్తి యొక్క నామ-రూపాలు లేవు. ఇటువంటి కానుకను బాప్ దాదా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మొత్తము ప్రపంచములో ఒకవేళ ఎవరైనా అతి పెద్ద కానుకను ఇచ్చినా కూడా ఏం ఇస్తారు? అతి పెద్ద కిరీటాన్ని లేక సింహాసనాన్ని ఇస్తారు. స్థాపన జరిగినప్పుడు (స్థాపన సమయములో ఉన్నవారు ముందు కూర్చుని ఉన్నారు) ఆదిలోనే బ్రహ్మాబాబా పిల్లలను ఇలా అడిగేవారు - ఒకవేళ మీకు ఈ రోజుల్లోని రాణి ఎవరైనా కిరీటాన్ని మరియు సింహాసనాన్ని ఇస్తే మీరు వెళ్తారా? గుర్తుంది కదా! అప్పుడు పిల్లలు అనేవారు - ఈ కిరీటాన్ని, సింహాసనాన్ని ఏం చేసుకుంటాము. బాబానే లభించినప్పుడు ఇక ఇవన్నీ ఏమిటి! కనుక ఈ స్వర్ణిమ ప్రపంచమనే కానుక ముందు వేరే ఏ కానుకా గొప్పది కాలేదు. అక్కడ ఏయే ప్రాప్తులు ఉంటాయి అని కొంతమంది పిల్లలు అడుగుతారు. దానికి బాప్ దాదా అంటారు, ప్రాప్తుల లిస్టు అయితే చాలా పెద్దది, కానీ సార రూపములో ఏమంటారు! ఏ వస్తువు యొక్క అప్రాప్తి ఉండదు. జీవితములో ఏమేమి కావాలో, ఆ ప్రాప్తులన్నీ ఉంటాయి. మీరు అటువంటి బంగారు కానుకకు అధికారీ ఆత్మలు. అధికారులే కదా! డబుల్ విదేశీయులు అధికారులేనా? (చేతులు ఊపుతున్నారు) అందరూ రాజులుగా అవుతారా? అయితే అన్ని సింహాసనాలను తయారుచేయవలసి ఉంటుంది. బాప్ దాదా అంటారు, ఆ సింహాసనము సింహాసనమే, సర్వ ప్రాప్తులు ఉంటాయి, కానీ ఈ సంగమయుగ స్వరాజ్యము దానికంటే తక్కువేమీ కాదు. మీరు ఇప్పుడు కూడా రాజులే కదా! మీరు ప్రజలా లేక రాయల్ కుటుంబమువారా? ఎవరు? నా ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ అని నషాతో చెప్పగలిగే తండ్రి ఒక్కరే ఉన్నారు. మీరు రాజులు కదా! రాజయోగులా లేక ప్రజాయోగులా? ఈ సమయములో అందరూ హృదయ సింహాసనాధికారీ, స్వరాజ్య అధికారీ రాజా పిల్లలు, ఇంతటి ఆత్మిక నషా ఉంటుంది కదా? ఎందుకంటే ఈ సమయములోని స్వరాజ్యము ద్వారానే భవిష్య రాజ్యము ప్రాప్తిస్తుంది. ఈ సంగమయుగము చాలా, చాలా, చాలా అమూల్యమైనది, శ్రేష్ఠమైనది. సంగమయుగము గురించి బాప్ దాదాకు మరియు పిల్లలందరికీ తెలుసు, చాలా సంతోషముతో సంగమయుగానికి ఏ పేరు పెట్టారు? ఆనందాల యుగము. ఎందుకని? ఇక్కడ సంగమములో ఉన్నంత ఆనందము మొత్తము కల్పములో ఎప్పుడూ ఉండదు. కారణమేమిటి? పరమాత్మ మిలనము యొక్క ఆనందము మొత్తము కల్పములో ఇప్పుడే లభిస్తుంది. సంగమయుగములోని ఒక్కొక్క రోజు ఎలా ఉంటుంది? ఆనందమే ఆనందము. ఆనందము ఉంది కదా? ఆనందము ఉంది, అంతేకానీ తికమకపడటం లేదు కదా! ప్రతిరోజూ ఉత్సవమే ఎందుకంటే ఉత్సాహము ఉంది. మీ సోదర, సోదరీలందరినీ పరమాత్మ తండ్రికి చెందినవారిగా తయారుచెయ్యాలి అన్న ఉల్లాసము ఉంది, ఉత్సాహము ఉంది. సేవ చెయ్యాలన్న ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయి కదా! ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి... అని ప్లాన్లు తయారుచేస్తారు కదా! ఎందుకంటే ఏదైనా శ్రేష్ఠ ప్రాప్తి లభిస్తున్నప్పుడు దానిని ఇతరులకు వినిపించకుండా ఉండలేరు. ఈ సంగమయుగ ప్రాప్తియే స్వర్ణిమ ప్రపంచములో కూడా ఉంటుంది. ఇప్పటి పురుషార్థము యొక్క ప్రారబ్ధము భవిష్యత్తులోని స్వర్ణిమ ప్రపంచము. మరి సంగమయుగము బాగా అనిపిస్తుందా లేక సత్యయుగము బాగా అనిపిస్తుందా? ఏది బాగా అనిపిస్తుంది? సంగమయుగము బాగుంది కదా? కేవలం మధ్యమధ్యలో మాయ వస్తుంది. కొద్ది-కొద్దిగా అప్పుడప్పుడు తికమకపడతారు. కొంతమంది పిల్లలు సహజయోగాన్ని కష్టతరమైన యోగముగా తయారుచేసుకుంటారు. వాస్తవానికి అది కష్టమేమీ కాదు కానీ అలా తయారుచేసుకుంటారు. వాస్తవానికి అది చాలా సహజము. కష్టమనిపిస్తుందా? ఎవరికైతే కష్టమనిపిస్తుందో వారు చేతులెత్తండి. సదా కాదు కానీ అప్పుడప్పుడు కష్టమనిపిస్తుందా? లేక సహజమేనా? ఎవరైతే కష్టపడే యోగులో వారు చేతులెత్తండి. మాతలు కష్టపడే యోగులా లేక సహజయోగులా? ఎవరైనా కష్టపడే యోగులు ఉన్నారా? (ఎవ్వరూ చేతులెత్తటం లేదు) మొత్తం సభ మధ్యన చేతులెలా ఎత్తుతారు!
పిల్లలందరూ ‘మేరా బాబా (నా బాబా)’ అని నషాతో అంటారు. నా బాబానా లేక దాదీల బాబానా? నా బాబా కదా! ‘మొదట నా బాబా’ అని ప్రతి ఒక్కరూ అంటారు. అంతేనా? సింధ్ దేశము వారందరూ కూర్చుని ఉన్నారు కదా! ‘నా బాబానా’ లేక జానకి దాది బాబానా? ప్రకాశమణి దాది బాబానా? ఎవరి బాబా? నా బాబాయేనా? మొత్తము రోజంతటిలో ఏం గుర్తుంటుంది? మేరా (నా) అనేదే కదా! బాబా అంటారు, ఇది చాలా సహజ యుక్తి, ఎన్నిసార్లు మేరా, మేరా (నా, నా) అని అంటారు, మొత్తము రోజంతటిలో ఎన్ని సార్లు ‘నా’ అన్న పదాన్ని ఉపయోగిస్తారు? ఒకవేళ లెక్క పెట్టినట్లయితే చాలా సార్లు ‘నా’ అన్న పదాన్ని ఉపయోగిస్తారు. నా అన్న పదాన్ని ఉపయోగించినప్పుడు నా అనబడేవారు ఎవరు? నా బాబా, కష్టమా? అప్పుడప్పుడు మర్చిపోతారా? బాప్ దాదా ఏమీ కొత్త మాట చెప్పటం లేదు. నేను మరియు నాది అనే పదాలను ఎప్పుడూ కార్యములో ఉపయోగిస్తూనే ఉంటారు, మరి నేను ఎవరిని మరియు నా వారు ఎవరు! చాలామంది పిల్లలు కష్టమైన పురుషార్థాన్ని ఎందుకు చేస్తారు? కేవలం బిందువు ఎదురుగా రావాలి అని అనుకుంటారు, బిందువు, బిందువు, బిందువు... అని అనుకుంటారు కానీ బిందువు జారిపోతుంది. బిందువే కానీ ఎటువంటి బిందువు? నేను ఎవరిని, ఈ మీ స్వమానాన్ని స్మృతిలోకి తెచ్చుకోవటం ద్వారా రమణీక పురుషార్థమవుతుంది, కేవలం జ్యోతిర్బిందువు అని అంటే కష్టమైపోతుంది. సహజ పురుషార్థాన్ని, ఆనందము కల పురుషార్థాన్ని చెయ్యండి.
ఈ కొత్త సంవత్సరములో పురుషార్థము కూడా శ్రేష్ఠముగా ఉండాలి కానీ శ్రేష్ఠముగా ఉండటం కంటే ముందు సహజముగా ఉండాలి. సహజముగా కూడా ఉండాలి మరియు శ్రేష్ఠముగా కూడా ఉండాలి, ఇది వీలవుతుందా? రెండూ కలిపి వీలవుతుందా? డబుల్ విదేశీయులు చెప్పండి, వీలవుతుందా? మరి బాప్ దాదా చూస్తారు. బాప్ దాదా అయితే చెక్ చేస్తూ ఉంటారు కదా! అయితే కష్టపడే యోగులుగా ఎవరెవరు అవుతారు! సహజయోగీ అంటే నిర్లక్ష్యపు పురుషార్థము ఉండడమని కాదు. పురుషార్థము శ్రేష్ఠముగా కూడా ఉండాలి మరియు సహజముగా కూడా ఉండాలి. మరి పాండవులు సహజ యోగులేనా? ఎవరైతే సహజయోగులో వారు చేతులెత్తండి. టి.వి.లో వస్తూ ఉంది చూడండి. అభినందనలు. ఈ సంవత్సరము ఎవరి ముందుకూ ఏ కష్టమూ రాదు ఎందుకంటే సహజ యోగులు. నిర్లక్ష్యము కలవారిగా అవ్వవద్దు.
సమయమనుసారముగా ఈ కొత్త సంవత్సరములో అందరూ విశేషముగా ఈ లక్ష్యాన్ని పెట్టుకోవాలి - ఏయే ఖజానాలైతే ప్రాప్తించాయో, సమయము, సంకల్పాలు, గుణాలు, జ్ఞానము, శక్తులు... అన్నింటికంటే పెద్ద ఖజానా సంకల్పాలు - శ్రేష్ఠ సంకల్పాలు, శుద్ధ సంకల్పాలు. ఈ ఖజానాలన్నింటినీ ప్రతిరోజూ సఫలము చేసుకోవాలి. బాగా పంచండి. దాత పిల్లలు, మాస్టర్ దాతలుగా అవ్వండి. బాగా పంచండి. ఎందుకని? సఫలము చేయటము అనగా సఫలతను ప్రాప్తి చేసుకోవటము. కావున ఈ సంవత్సరము యొక్క ఈ విశేషతను సదా నిలుపుకోండి. సఫలము చేసుకోవాలి మరియు సఫలత లభించే ఉంది. సఫలత మా జన్మసిద్ధ అధికారము అని అందరూ అంటారు కూడా కదా. ఉందా అధికారము? అయితే సఫలము చెయ్యండి మరియు సఫలతను ప్రాప్తి చేసుకోండి. ఏ కార్యము చేసినా, ఏదో ఒక ఖజానాను సఫలము చేస్తూ వెళ్ళండి మరియు సఫలతను అనుభవము చేస్తూ వెళ్ళండి. ఆలోచించండి - సఫలత యొక్క అధికారము బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప మరెవరికైనా ప్రాప్తించగలదా! ఎందుకని? ఎందుకంటే బాబా మీకు సఫలతా భవ అన్న వరదానాన్ని ఇచ్చారు. ఒక్కొక్క బ్రాహ్మణ ఆత్మ సఫలతా సితారలు, సఫలతా స్వరూపులు అని బాప్ దాదా సదా అంటారు. సఫలతా సితారలు కదా లేక కష్టపడే సితారలా? బాప్ దాదా పిల్లలందరినీ సఫలతా సితారలు అన్న ఈ స్వరూపములోనే చూస్తారు. బ్రహ్మాబాబా ఆదిలో ఎంత సమయములో అంతా సఫలము చేశారో గుర్తుందా? అంతిమము వరకు తమ సమయాన్ని సఫలము చేసుకున్నారు, కర్మాతీతముగా కూడా అయిపోయారు, అయినా కూడా ఎన్ని ఉత్తరాలను వ్రాశారు! సమయాన్ని సఫలము చేసుకున్నారు కదా! చివరి రోజు కూడా నోటి నుండి మహావాక్యాలను ఉచ్చరించారు. చివరి రోజు వరకు అంతా సఫలము చేసారు, అందుకే సఫలతను పొందారు. కనుక ఫాలో ఫాదర్. వాస్తవానికి సంగమయుగములో ఒక్కొక్క సంకల్పాన్ని, ఒక్కొక్క క్షణాన్నీ సఫలము చేయటమే సఫలతామూర్తులుగా అవ్వటము. బ్రహ్మాబాబా పట్ల మాకు చాలా ప్రేమ ఉంది అని అందరూ నిశ్చయముతో అంటారు కదా. మరి ప్రేమకు గుర్తు ఏమిటంటే - బాబాకు ఏది ప్రియమో, అది పిల్లలకు ప్రియముగా ఉండాలి. సమయము, సంకల్పాలు మరియు సర్వ ఖజానాలు సఫలమవ్వాలి, వ్యర్థమవ్వకూడదు. ప్రేమకు గుర్తు ఫాలో ఫాదర్. బ్రహ్మాబాబా ఏ విశేషతను చూపించారు? ఏది ఆలోచించారో, దానిని క్షణములో చేసారు. కేవలము ఆలోచించలేదు, కేవలము ప్లాన్ ను తయారుచెయ్యలేదు, ప్రాక్టికల్ లో చేసి చూపించారు. మరి మీరు అటువంటివారేనా? బాబాను ఫాలో చేసేవారే కదా? మంచిది.
ఈ రోజు కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు చాలామందే వచ్చారు. మంచిది. ఒకవేళ హాల్ చిన్నదైపోయినా కానీ మనసైతే పెద్దదే కదా. చూడండి, మనస్సు పెద్దది కావున ఇందులో ఇమిడిపోయారు కదా? (ఈ రోజు సభలో 18-19 వేలమంది సోదర-సోదరీలు కూర్చుని ఉన్నారు). బయట కూర్చుని ఉన్నవారంతా కూడా వింటున్నారు కదా? బయట కూర్చుని ఉన్నవారు వింటున్నారు, వారు కనిపించరు. బాప్ దాదా విన్నారు, విదేశాలలో అందరికంటే ఎక్కువగా ఆస్ట్రేలియావారు రాత్రి 12 గంటలకు కూర్చుని వింటారు మరియు 4 గంటలకు అమృతవేళ చేసి లేస్తారు. కావున బాప్ దాదా కూడా ఈ రోజు ఆస్ట్రేలియావారిని గుర్తు చేసుకున్నారు. వింటున్నారు. ఇక్కడ ఉన్న ఆస్ట్రేలియావారు చేతులెత్తండి. త్రిమూర్తి శుభాకాంక్షలు మొదట ఆస్ట్రేలియావారికి, ఆ తర్వాత అందరికీ.
ఈ సంవత్సరము యొక్క లక్ష్యాన్ని అయితే తెలియజేశారు - సఫలము చేయండి, సఫలత లభించే ఉంది. దీనిని అందరూ పక్కా చేసుకున్నారా? సఫలము చెయ్యాలి, వ్యర్థము కాదు. సంగమయుగము సమర్థ యుగము, సఫలతా యుగము, వ్యర్థముగా పోనిచ్చేది కాదు. వ్యర్థము యొక్క 63 జన్మలు సమాప్తమైపోయాయి. ఇప్పుడు ఈ చిన్నపాటి యుగము సఫలము చేసుకునే యుగము. ఒకవేళ సమయాన్ని సఫలము చేసుకుంటే భవిష్యత్తులో కూడా అర్ధకల్పములో పూర్తి సమయము రాజ్యాధికారులుగా అవుతారు. ఒకవేళ అప్పుడప్పుడు సఫలము చేసుకుంటే రాజ్యాధికారులుగా కూడా అప్పుడప్పుడు అవుతారు. సమయము సఫలమైనందుకు ప్రారబ్ధము ఇది. శ్వాసను సఫలము చేసుకుంటూ ఉంటే 21 జన్మలూ ఆరోగ్యముగా ఉంటారు. నడుస్తూ, నడుస్తూ గుండె ఆగిపోదు. కొందరికి గుండె ఆగిపోతుంది, కొందరికి రక్త నాళాలు మూసుకుపోతాయి, అలా జరగదు.
జ్ఞాన ఖజానాను కూడా సఫలము చేసుకోండి, జ్ఞానము అంటే అర్థము వివేకము, అక్కడ ఎంతటి వివేకవంతులుగా అవుతారంటే ఇక మంత్రుల అవసరమేమీ ఉండదు. ఈ రోజుల్లో చూడండి, ప్రమాణ స్వీకారము చేయగానే వెంటనే మంత్రిమండలిని తయారుచేస్తారు. అక్కడ సహచరులు ఉంటారు కానీ మంత్రులు ఉండరు. రాయల్ ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరూ దర్బారులో కూర్చునే కిరీటధారులుగా ఉంటారు. రాయల్ ఫ్యామిలీవారు తక్కువైనవారు కారు, వారు సింహాసనముపై కూర్చోకపోయినా సరే పదవి అయితే ఒకేలా ఉంటుంది, అందుకే సింహాసనాధికారులుగా కొద్దిమందే అవుతారు కదా అని ఇలా ఆలోచించకండి. మీ తలపై కూడా కిరీటము ఉంటుంది మరియు మీకు పూర్తి అధికారాలు ఉంటాయి. మరి ఎవరిగా అవుతారు? నంబర్ వన్ గానా లేక నంబరువారుగానా, ఎవరిగా అవుతారు? నంబరువారుగా అవుతారా లేక నంబర్ వన్ గా అవుతారా? మరి ఏం చెయ్యాల్సి వస్తుందో తెలుసా? ధైర్యాన్ని చూపించారు, ఇది చాలా మంచిది. కానీ వన్ నంబరువారిగా అయ్యేందుకు ముందు విన్ అవ్వాల్సి (జయించాల్సి) ఉంటుంది. అవుతున్నారు కదా! చేస్తాము అని ఇలా అనటం కాదు, చేస్తున్నాము అనాలి. ఇతరులు కూడా వింటున్నారు. ఈ రోజు సింధ్ ప్రాంతములోని పాతవారు, బ్రహ్మాబాబా సహచరులు చాలామంది వచ్చారని విన్నాము. చేతులెత్తండి. చిన్నపిల్లలు లేచి నిలబడండి, కుటుంబాలు కుటుంబాలే వచ్చాయి. మంచిది. ఏదైనా అద్భుతాన్ని చూపిస్తారు కదా! ఏమి చూపిస్తారు? (సందేశాన్ని ఇస్తాము). అదైతే చేస్తూనే ఉన్నారు. అచ్ఛా, 38 మంది వచ్చారు, మరి ఏ అద్భుతాన్ని చేస్తారు? సరే, ఎక్కువ ఏమీ చెప్పము, చిన్న విషయాన్ని చెప్తాము, చేయడానికి సిద్ధముగా ఉన్నారా? పిల్లలు కూడా అద్భుతము చేస్తారు కదా? (38 లక్షల మందిని తయారుచేస్తాము) పదమాల రెట్లు అభినందనలు. మీరైతే చాలా ఎక్కువ చెప్పారు కానీ బాప్ దాదా చిన్న విషయము చెప్తున్నారు, అదేమిటంటే, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకురండి. తీసుకువస్తారా? ఒకరు ఒకరిని తీసుకురండి. పిల్లలైతే పిల్లలను తీసుకురండి. మాతలైతే సోదరులను లేక సోదరీలను తీసుకురావాలి, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకురావాలి. ఈ గ్రూప్ ను చూడండి, మీరు వీరికి గైడ్ చేయండి, మరుసటి సంవత్సరానికి తీసుకునే రావాలి, డబుల్ గ్రూప్ ను తీసుకురావాలి. ఎక్కడి నుండైతే ఆది జరిగిందో, అక్కడే ప్రత్యక్షత జరగాలి, బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు. దయ కలుగుతుంది కదా! మీరు బ్రహ్మాబాబా దేశవాసులు కనుక దేశవాసులపై ప్రేమ ఉంటుంది.
మీ వద్ద చాలా ఖజానాలు ఉన్నాయి, గుణాల ఖజానా ఎంత పెద్దది, శక్తుల ఖజానా ఎంత పెద్దది. కనుక గుణ దానాన్ని, శక్తుల దానాన్ని చేసే మాస్టర్ దాతలుగా అవ్వండి. ఎవరు వచ్చినా కానీ, సంబంధములోకి వచ్చినా, సంపర్కములోకి వచ్చినా, వారికి ఏదో ఒక గుణాన్ని లేక శక్తిని కానుకగా ఇవ్వండి. ఎవ్వరూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. వేరే ఏమీ లేకపోయినా కానీ బాబా సందేశము యొక్క మధురమైన మాటలైనా, ఆ మధురమైన మాటలనైనా కానుకగా ఇవ్వండి. ప్రపంచములోని వారు ఏదైనా ఉత్సవము జరిగితే ఒకరికొకరు నోరు తీపి చేసుకుంటారు. కానీ బాప్ దాదా అంటున్నారు, నోటినైతే తీపి చేయవలసిందే కానీ మీ మధురమైన ముఖాన్ని కూడా చూపించాలి. కేవలం నోటిని తీపి చెయ్యటం కాదు, ముఖాన్ని కూడా మధురంగా చేసుకోవాలి. అంతటి మధురత జమ అయ్యి ఉంది కదా! దానిని పంచుతూ ఉన్నా కూడా అది నిండుగా ఉండాలి. అంతేకాక ఈ ఖజానాలనైతే ఎంతగా పంచుతారో, అంతగా పెరుగుతాయి, తక్కువ అవ్వవు. కనుక ఈ సంవత్సరము ఇది నోట్ చేసుకోండి, ఏ ఆత్మ వచ్చినా సరే, వారికేమైనా ఇచ్చారా? ఒకవేళ వారు వినేవారు కానట్లయితే మధురమైన శక్తిశాలీ దృష్టిని ఇవ్వండి. కానీ ఇవ్వటమైతే తప్పకుండా ఇవ్వండి. వారు ఖాళీగా వెళ్ళకూడదు. ఇది సహజమే కదా! లేక కష్టమా?
అచ్ఛా - ఒక్క క్షణములో మనస్సు యొక్క డ్రిల్ గుర్తుందా? ప్రతి ఒక్కరూ మొత్తము రోజంతటిలో ఎన్ని సార్లు ఈ డ్రిల్ చేస్తారు? ఇది నోట్ చేసుకోండి. ఈ మనసు డ్రిల్ ను ఎన్ని సార్లు చేస్తే అంతగానే సహజయోగులుగా, సరళయోగులుగా అవుతారు. ఒకవైపు మనసా సేవ, మరొకవైపు మనసా ఎక్సర్సైజ్. ఇప్పుడిప్పుడే నిరాకారీ, ఇప్పుడిప్పుడే ఫరిశ్తా. బ్రహ్మాబాబా ఫరిశ్తాలైన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఫరిశ్తాలుగా అయ్యి బ్రహ్మాబాబాతోపాటు మీ ఇంటికి నిరాకార రూపములో వెళ్ళాలి, ఆ తర్వాత దేవతగా అవ్వాలి. అచ్ఛా.
నలువైపుల నుండి కార్డుల రూపములో, ఉత్తరాల రూపములో చాలా-చాలా ప్రియస్మృతులు బాప్ దాదా వద్దకు చేరుకున్నాయి. పిల్లలు ప్రతి ఒక్కరూ నా స్మృతిని బాబాకు ఇవ్వండి అనే కోరుకుంటారు అన్నది బాప్ దాదాకు తెలుసు, అందరిదీ లభించింది. ప్రియస్మృతులను ఇచ్చే చాలా ప్రియమైన పిల్లలు బాప్ దాదా ఎదురుగా ఉన్నారు, అందుకే బాప్ దాదా అంటున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరూ తమ-తమ పేరు సహితముగా అభినందనలను మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను స్వీకరించండి.
మీ అందరికీ కూడా నవ జీవితము, నవ యుగము మరియు నవ సంవత్సరము సందర్భముగా చాలా-చాలా పదమాల, పదమాల, పదమాల, పదమాల రెట్లు అభినందనలు మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు, ప్రియస్మృతులు మరియు నమస్తే.
బాప్ దాదా పిల్లలందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలను ఇలా తెలిపారు:
నలువైపులా ఉన్న చాలా మధురమైన, చాలా ప్రియమైన పిల్లలకు పదమాల, పదమాల రెట్ల కొత్త సంవత్సర శుభాకాంక్షలు. గడిచిపోయిన ఈ క్షణము వీడ్కోలు మరియు శుభాకాంక్షల క్షణము. ఒకవైపు వీడ్కోలు ఇవ్వాలి, స్వయము సంపన్నముగా అవ్వటములో ఏ లోటునైతే అనుభవము చేస్తున్నారో, దానికి వీడ్కోలు. దానికి సదా కొరకు వీడ్కోలు ఇవ్వండి మరియు ముందుకు ఎగిరేందుకు అభినందనలు. అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా - ఓం శాంతి.
Comments
Post a Comment