18-01-2003 అవ్యక్త మురళి

18-01-2003        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము 

బ్రాహ్మణజీవితం యొక్క స్మృతుల ద్వారా సమర్ధంగా తయారయ్యి సర్వులను సమర్ధంగా తయారుచేయండి.

ఈరోజు నలువైపుల ఉన్న సర్వస్నేహి పిల్లలు స్నేహంతో కూడిన స్మృతి యొక్క మధురాతి మధురమైన రకరకాల మాటలు మరియు స్నేహం యొక్క, ముత్యాల మాలలు బాదాదాదా దగ్గరికి అమృతవేళ నుండి ముందుగానే చేరుకున్నాయి. పిల్లల యొక్క స్నేహం బాప్ దాదాని కూడా స్నేహసాగరంలో ఇమిడేలా చేస్తుంది. బాప్ దాదా చూసారు - ప్రతి ఒక్క పిల్లవానిలో స్నేహశక్తి తెగిపోనివిధంగా ఉంది. ఈ స్నేహశక్తియే ప్రతి పిల్లవానిని సహజయోగిగా తయారు చేస్తుంది. స్నేహం యొక్క ఆధారంతో సర్వ ఆకర్షణలకు అతీతంగా అయ్యి మున్ముందుకు వెళ్తున్నారు. బాప్ దాదా ద్వారా లేదా విశేషాత్మల ద్వారా లభించే అతీత మరియు అతి ప్రియమైన స్నేహం యొక్క అనుభవం లేని పిల్లవాడు ఒక్కరు కూడా లేరు. ఆదిలో ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ యొక్క బ్రాహ్మణజీవితం స్నేహశక్తి ద్వారానే లభించింది. స్నేహశక్తి బ్రాహ్మణజీవితం యొక్క వరదానమై ముందుకు తీసుకువెళ్తుంది. కనుక ఈరోజు విశేషంగా తండ్రి మరియు పిల్లల యొక్క స్నేహదినం. ప్రతి ఒక్కరు హృదయంతో స్నేహం యొక్క ముత్యాల మాలలను బాప్ దాదా కి ధరింపచేసారు. ఈరోజు శక్తులు గుప్తంగా ఉన్నారు కానీ స్నేహశక్తి ప్రత్యక్షంగా ఉంది. పిల్లల యొక్క స్నేహసాగరంలో బాప్ దాదా కూడా లవలీనమై ఉన్నారు.

ఈరోజుని స్మృతిదినోత్సవం అని అంటారు కానీ ఈరోజు కేవలం బ్రహ్మాబాబా యొక్క స్మృతిదినోత్సవమే కాదు కానీ బాప్ దాదా  చెప్తున్నారు ఈరోజు మరియు సదా మీకు ఇదే - జ్ఞాపకం ఉండాలి- బ్రాహ్మణజన్మ తీసుకుంటూనే ఆది నుండి ఇప్పటి వరకు బాప్ దాదా  ఏయే స్మృతులను ఇచ్చారో ఆ స్మృతుల యొక్క మాలను సదా స్మరించండి. ఆ స్మృతుల యొక్క మాలను జ్ఞాపకం చేసుకోండి. చాలా పెద్ద మాల తయారవుతుంది. అందరికీ అన్నింటికంటే ముందు ఏ స్మృతి లభించింది? మొదటి పాఠం జ్ఞాపకం ఉంది కదా? నేనెవరు? ఈ స్మృతియే క్రొత్తజన్మనిచ్చింది. వృత్తి, దృష్టి మరియు స్మృతిని పరివర్తన చేసింది. ఇటువంటి స్మృతులు రావటంతోనే ఆత్మిక సంతోషం యొక్క మెరుపు నయనాలలోకి, ముఖంలోకి రానే వస్తుంది. మీరు స్మృతులను స్మరిస్తారు, భక్తులు మాలను స్మరిస్తారు.

అమృతవేళ నుండి కర్మయోగిగా అయ్యే సమయంలో కూడా ఒక స్మృతిని మాటిమాటికి స్మృతి చేసుకుంటూ ఉన్నట్టైతే ఆ స్మృతి సమర్థ స్వరూపాన్ని తయారుచేస్తుంది ఎందుకంటే ఎటువంటి స్మృతియో అటువంటి సమర్ధత స్వతహాగానే వచ్చేస్తుంది. అందువలన ఈరోజు స్మృతిదినోత్సవంతో పాటు సమర్థ దినోత్సవం అని అంటున్నారు. బ్రహ్మాబాబా ఎదురుగా రావటంతోనే మరియు బాబా యొక్క దృష్టి పడటంతోనే సమర్ధత వచ్చేస్తుంది. అందరూ అనుభవీలు. అవును కదా! సాకారరూపంలో చూసినా లేదా అవ్యక్తరూపం యొక్క పాలన ద్వారా పాలింపబడుతూ అవ్యక్తస్థితిని అనుభవం చేసుకుంటున్నా కానీ హృదయంతో ఒక్క సెకనులో బాప్ దాదా  అని అన్నారు అంటే సమర్థత స్వతహాగానే వచ్చేస్తుంది. అందువలన ఓ సమర్థ ఆత్మలూ! మీ యొక్క సమర్ధత ద్వారా ఇతరాత్మలను నమర్ధవంతంగా తయారుచేయండి. ఉల్లాసం ఉంది కదా! ఉందా ఉల్లాసం, అసమర్థులను సమర్థంగా తయారుచేయాలి కదా! బాప్ దాదా  చూసారు నలువైపుల ఉన్న - పిల్లలందరికీ బలహీన ఆత్మలను సమర్థంగా తయారుచేసే ఉల్లాసం బాగా ఉంది. శివరాత్రి కార్యక్రమాన్ని అట్టహాసంగా తయారుచేసుకుంటున్నారు. అందరికీ ఉత్సాహం ఉంది కదా! ఉందా ఉత్సాహం? ఈ శివరాత్రికి మేము అద్భుతం చేస్తాము అనే ఉత్సాహం ఉన్నవారు చేతులెత్తండి! అలజడి సమాప్తి అయిపోయే విధంగా అద్భుతం చేసి చూపించాలి. ఓహో. సమర్థఆత్మలూ! ఓహో! అనే జయజయకారాలు రావాలి. అన్ని జోన్ల వారు కార్యక్రమాన్ని తయారుచేసుకున్నారు కదా! పంజాబ్ వారు కూడా తయారుచేసుకున్నారు కదా! మంచిది. 

భ్రమించే ఆత్మలకు, దప్పికగా ఉన్న ఆత్మలకు, అశాంతి ఆత్మలకు సేవ చేయండి. వారు ఎలా ఉన్నా కానీ మీ సోదరి, సోదరులే కదా! అయితే మీ సోదరులపై, సోదరీలపై దయ వస్తుంది కదా! చూడండి - ఈరోజుల్లో పరమాత్మను ఆపద సమయంలో మాత్రమే జ్ఞాపకం చేస్తున్నారు.కానీ శక్తులను లేదా దేవతలను వారిలో విఘ్నేశ్వరుడు, హనుమంతుడు మరియు ఇతర దేవతలను కూడా ఎక్కువగా జ్ఞాపకం చేస్తున్నారు. అయితే వారు ఎవరు? మీరే కదా! అంటే వారు మిమ్మల్ని రోజూ జ్ఞాపకం చేస్తున్నారు. దయాళూ! కృపాళూ! దయ చూపించండి, సుఖ, శాంతి యొక్క ఒక్క బిందువు ఇవ్వండి..... అంటూ పిలుస్తున్నారు. మీ ద్వారా లభించే ఒక్క బిందువు కొరకు వారు దాహంతో ఉన్నారు. దు:ఖీ ఆత్మలు, దప్పికగొన్న ఆత్మలు ఓ శక్తులూ! ఓ దేవా అంటూ పిలుస్తున్నారు. ఆ ధ్వని మీకు చేరటంలేదా? చేరుతుంది కదా! బాప్ దాదా అయితే ఈ పిలుపులు వింటున్నప్పుడు దేవతలను లేదా శక్తులను జ్ఞాపకం చేసుకుంటారు. అయితే దాదీ మంచి కార్యక్రమాన్ని తయారుచేసారు. బాబాకి ఇష్టంగా ఉంది - రేపటి నుండి అనగా స్మృతిదినోత్సవం అంటే సదా స్మృతిదినోత్సవమే కానీ ఈరోజు విశేషంగా సర్వ సమర్థతలను ప్రాప్తింప చేసుకున్నారు. కనుక రేపటి నుండి శివరాత్రి వరకు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలందరికీ చెప్తున్నారు - ఈ విశేష దినమున ఇదే లక్ష్యం పెట్టుకోండి ఏమిటంటే, మనస్సు ద్వారా లేదా వాచా ద్వారా లేదా సంబంధ,సంపర్కాల ద్వారా అంటే ఏదోక విధి ద్వారా ఎక్కువలో ఎక్కువ ఆత్మలకు బాబా యొక్క సందేశాన్ని తప్పక ఇవ్వాలి. మీ పై నిందను తొలగించుకోండి. పిల్లలు ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఇంకా వినాశనం యొక్క తారీఖు కనిపించటంలేదు కనుక ఎప్పుడో అప్పుడు నిందను తొలగించుకుంటాము అని కానీ అలా కాదు, ఒకవేళ మీరు ఇప్పుడే నిందను తొలగించు కోలేదనుకోండి - ముందే మాకు ఎందుకు చెప్పలేదు, మేము కూడా తయారుచేసుకునేవాళ్ళం, ఇప్పుడు కేవలం ఓహో ప్రభూ! అని అనటం అంతే అని మరలా నిందిస్తారు. అందువలన వారిని కూడా కొంచెం అయినా వారసత్వాన్ని తీసుకోనివ్వండి. వారికి కూడా కొంచెం సమయాన్ని ఇవ్వండి. ఒక్క బిందువు ద్వారానైనా దప్పికను తీర్చండి. దప్పికగా ఉన్నవారికి ఒక్క బిందువు అయినా చాలా గొప్పగా ఉంటుంది. కనుక కార్యక్రమం ఇదే కదా! బాప్ దాదా కూడా పచ్చజెండా ఊపటం కాదు, నగాఢాను మ్రోగిస్తున్నారు - ఓ తృప్తి ఆత్మలూ! రేపటి నుండే సందేశాన్ని ఇవ్వండి, సందేశాన్ని ఇవ్వండి. తక్కువలో తక్కువ శివరాత్రికి అనగా బాబా యొక్క పుట్టినరోజున బాబా యొక్క నోటిని మధురం చేయండి, మాకు సందేశం లభించింది అని అనాలి. ఈ మనస్సు యొక్క సంతోషం యొక్క మిఠాయిని అందరికీ తినిపించండి. బాబా సందేశాన్ని వినిపించండి. శివరాత్రిని సాధారణంగా జరుపుకోవటం కాదు. ఏదోక అద్భుతం చేసి చూపించాలి. ఉత్సాహం ఉంది కదా? మొదటి వరసలో కూర్చున్నవారికి ఉత్సాహం ఉందా? చాలా సందడి చేయండి. శివరాత్రికి ఇంత గొప్ప మహత్యం ఉందా అనేది వారికి అర్ధం అవ్వాలి. మా తండ్రి యొక్క జన్మదినం అనేది విని సంతోషపడాలి. మంచిది, ఎంతమంది ఇక్కడ కూర్చున్నారో, నలువైపుల వెళ్ళాల్సిందే కానీ ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు? (12-13 వేలమంది) మంచిది, ఎవరైతే కూర్చున్నారో వారందరూ అయితే మధువనం వారు అంటారు మేము ఎక్కడ సందేశం ఇవ్వాలి అని. మధువనం చుట్టుప్రక్కల ఇప్పుడు చాలా గ్రామాలు ఉన్నాయి. పైన లేదా క్రింద కూడా చాలా మంది ఉన్నారు. వారందరికీ సందేశం ఇవ్వాలి కానీ ఒక్క ఆత్మను అయినా తన యొక్క వారసత్వాన్ని తీసుకునే యోగ్యంగా తయారుచేయండి.

అందరు ఒక్కొక్కరిని తయారుచేస్తే 9 లక్షల మంది పూర్తి అయిపోతారు. సరేనా? చేస్తారా లేదా కేవలం చెప్తారు అంతేనా? కేవలం చేతులెత్తడం కాదు, హృదయంతో చేయండి. చేస్తారా? (నారాయణ అన్నయ్యని అడుగుతున్నారు) చేస్తారా? అయితే బాప్ దాదా చెప్పినట్లుగా 9 లక్షల జాబితా తయారయిపోతుంది కదా! అయితే, వచ్చే సీజన్లో లో 6 లక్షల మంది కాదు, 9 లక్షల మంది తయారయ్యారు లేదా అంతకంటే ఎక్కువమందే తయారయ్యారు అనే శుభవార్త బాప్ దాదా వినాలనుకుంటున్నారు. సరే. శక్తులు, టీచర్స్ సరేనా? టీచర్స్ అయితే బాప్ దాదాకి కంకణం తయారుచేయాల్సి ఉంటుంది. పంజాబ్ మరియు రాజస్థాన్ యొక్క టీచర్స్ చేతులెత్తండి! టీచర్స్ అయితే చాలా మందిని తయారుచేయగలరు కానీ ఇతరులకు కూడా తయారుచేయాలనే ప్రేరణ ఇవ్వాలి. మంచిది, టీచర్స్ ఎంతమంది ఉన్నారు? ఒకొక్కరు 9 మందిని తయారుచేసినా కానీ 9 లక్షల మంది తయారైపోతారు. వచ్చే సీజన్ కి ఈ శుభవార్త చెప్తారా? ఏమనుకుంటున్నారు? నిర్వైర్ (అన్నయ్య) చెప్పండి. శుభవార్త చెప్తారా? జరుగుతుందా? ఇదైతే పెద్ద విషయమేమీ కాదు. 6 లక్షల మంది ఉన్నారు ఇక 3 లక్షలు తయారుచేయాలి. జరుగుతుంది కానీ అందరు మేము చేయాల్సిందే అనే ధైర్యం పెట్టుకోండి చాలు. ఏమంటారు? చేయాల్సిందే అని అనండి. సంకల్పశక్తి చాలా గొప్పశక్తి. బ్రాహ్మణాత్మలైన మీ సంకల్పం చేయలేనిది ఏముంది? ప్రతి ఒక్కరు తమ శ్రేష్ట సంకల్పం యొక్క గొప్పతనాన్ని స్మృతిలో ఉంచుకోవాలి.

బాప్ దాదా చూసారు-మెజార్టీ ఆత్మల యొక్క స్మృతి మరియు ఈశ్వరీయ ప్రాప్తుల యొక్క నషా అమృతవేళ బాగా ఉంటుంది కానీ కర్మయోగి యొక్క స్థితిలో అమృతవేళలో ఉన్నంత నషా ఉండటంలేదు. కారణం ఏమిటి? కర్మ చేస్తూ ఆత్మాభిమానిస్థితి మరియు కర్మాభిమానిస్థితి రెండూ ఉంటున్నాయి. దీని కొరకు విధి- కర్మ చేస్తూ నేను ఆత్మను, ఎటువంటి ఆత్మను అనేది మీకు తెలుసు అంటే ఏవైతే ఆత్మ కొరకు భిన్న, భిన్న స్వమానాలు లభించాయో వాటిని స్మృతిలో ఉంచుకోండి. ఉదాహరణకి నేను ఆత్మను, కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించేవాడిని, అతీతమైన ఆత్మను..... ఇలా స్మృతిలో ఉంచుకోవాలి. లౌకికంలో కూడా వైద్యుడు తన యొక్క సహయోగులతో, సేవ చేయడానికి నిమిత్తమైన వారితో సేవ చేయిస్తారు. సలహా ఇస్తారు ఇలా విధిని నిర్వర్తిస్తూ నేను వైద్యుడిని అనే విషయం మర్చిపోతారా? అదేవిధంగా మిమ్మల్ని మీరు చేయించేటువంటి శక్తిశాలి ఆత్మగా భావించాలి. ఆత్మ మరియు శరీరం. ఆత్మ అంటే చేయించేది, శరీరం చేసేది ఈ స్మృతి గుప్తం అయిపోతుంది. మీ అందరికీ అంటే పాత పిల్లలకు తెలుసు కదా - బ్రహ్మాబాబా ఆదిలో ఏ అభ్యాసం చేసేవారు? ఒక డైరీ చూసారు కదా! మొత్తం డైరీలో నేను ఆత్మను, యశోద ఆత్మ, ఫలానా వారు ఆత్మ, ఆత్మ.... ఈ ఒక్క మాటయే ఉండేది. ఈ పునాది స్థితిని సదా అభ్యాసం చేసేవారు. నేను ఎవరు? అనే మొదటి పాఠం యొక్క అభ్యాసం మాటిమాటికి చేయాలి. పరిశీలన ఉండాలి. నేను ఆత్మనే, శరీరాన్ని కాదు అని అనుకోవటం కాదు. నేను ఆత్మను, చేయించేవానిగా అయ్యి కర్మ చేస్తున్నాను అని అనుభవం చేసుకోవాలి. చేసేది వేరు, చేయంచేవారు వేరు. బ్రహ్మాబాబా యొక్క రెండవ అనుభవం కూడా విన్నారు కదా! రెండవ అభ్యాసం ఏమిటంటే ఈ కర్మేంద్రియాలు కర్మచారులు రోజూ రాత్రి కచేరి పెట్టుకునే విషయం విన్నారు కదా! అంటే యజమానిగా అయ్యి ఈ కర్మేంద్రియాలనే కర్మచారుల పరిస్థితిని అడిగేవారు కదా! బ్రహ్మాబాబా ఈ పునాది అభ్యాసాన్ని పక్కాగా చేసుకున్నారు. అందువలనే చివరి సమయంలో బాబాతో వెంట ఉన్న పిల్లలు ఏమి అనుభవం చేసుకున్నారు? బాబా కర్తవ్యం చేస్తూ కూడా శరీరంలో ఉంటూ కూడా, నడుస్తూ, తిరుగుతూ అశరీరీ స్థితిలో ఉన్నట్లు అనుభవం అవుతూ ఉండేది. కర్మలఖాతా పూర్తి చేసుకోవల్సి వచ్చినా కానీ సాక్షి అయ్యి స్వయం కర్మలఖాతాకి వశం అవ్వలేదు మరియు కర్మలఖాతాను పూర్తి చేసుకున్న అనుభవం ఇతరులకు కూడా కలగనివ్వలేదు. బ్రహ్మాబాబా అవ్యక్తం అవుతున్నారు అని మీకు తెలిసిందా? తెలియలేదు కదా! ఇంత అతీతమైన, సాక్షి, అశరీరీస్థితి అనగా కర్మాతీతస్థితి చాలా కాలం నుండి అభ్యాసం చేసారు కనుకనే అంతిమంలో కూడా అదే స్వరూపం అనుభవం అయ్యింది. చాలా కాలం యొక్క అభ్యాసమే అంతిమంలో పనికి వస్తుంది. అంతిమంలో దేహాభిమానం వదిలేస్తాము అని ఆలోచించకండి. చాలా కాలం యొక్క అశరీరీస్థితి, దేహానికి అతీతంగా మరియు చేయించే ఆత్మ స్థితి యొక్క అనుభవం ఉండాలి. అంతిమ సమయమనేది యువకులకైనా, వృద్ధులకైనా, ఆరోగ్యవంతులకైనా, రోగులకైనా ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. అందువలన చాలా కాలం సాక్షిస్థితి యొక్క అభ్యాసంపై ధ్యాస పెట్టండి. ఎన్ని ప్రకృతి యొక్క ఆపదలు వచ్చినా కానీ ఈ అశరీరీస్థితి అనేది మిమ్మల్ని సహజంగా, అతీతంగా మరియు బాబాకి ప్రియంగా చేస్తుంది. అందువలనే చాలాకాలం అనే మాటని బాప్ దాదా అండర్లైన్ చేయిస్తున్నారు. ఏది ఏమైనా, మొత్తం రోజంతటిలో సాక్షిస్థితి, చేయించేస్థితి, అశరీరీస్థితి యొక్క అనుభవం మాటిమాటికి చేస్కోండి. అప్పుడు అంతిమంలో ఫరిస్తా నుండి దేవతగా అయ్యే స్థితి నిశ్చితం అయిపోతుంది. బాబా సమానంగా అవ్వటం అంటే బాబా నిరాకారి మరియు బ్రహ్మాబాబా సమానంగా అవ్వటం అంటే ఫరిస్తాస్థితిలో ఉండాలి. ఫరిస్తా రూపాన్ని సాకార బ్రహ్మాబాబాలో చూసారు కదా! అనేక విషయాలను వింటూ, మాట్లాడుతూ, కార్యవ్యవహారాలు చేస్తూ, శరీరంలో ఉంటూ అతీతంగా ఉండే అనుభవం చేయించారు. కార్యం వదిలేసి అశరీరీగా కొంచెం సమయమే ఉండగలరు కానీ కార్యం చేస్తూ అశరీరీస్థితికి సమయాన్ని తీసి, శక్తిశాలి స్థితిని అనుభవం చేసుకుంటూ ఉండండి. మీరందరు ఫరిస్తాలు, బాబా ద్వారా ఈ బ్రాహ్మణ జన్మ యొక్క ఆధారం తీసుకుని సందేశం ఇవ్వడానికి సాకారంలో కార్యం చేస్తున్నారు. ఫరిస్తా అంటే దేహంలో ఉంటూ దేహానికి అతీతంగా ఉండటం. దీనిలో బ్రహ్మాబాబాని ఉదాహరణగా చూసారు కదా! కనుక ఇది అసంభవం కాదు. అనుభవం చేసుకోవటం చూసారు కదా! ఇప్పుడైతే విస్తారం ఎక్కువగా ఉంది. కానీ బ్రహ్మాబాబాకి ఉన్నంత బాధ్యత అనగా క్రొత్తజ్ఞానం యొక్క, క్రొత్త జీవితం యొక్క, క్రొత్త ప్రపంచాన్ని తయారుచేసేటంత బాధ్యత ఇప్పుడు ఎవరికీ లేదు. అందువలన అందరి లక్ష్యం - బ్రహ్మాబాబా సమానంగా అవ్వటం అంటే ఫరిస్తాగా అవ్వటం. శివబాబా సమానంగా అవ్వటం అంటే నిరాకారి స్థితిలో స్థితులవ్వటం. కష్టమా? బాబా మరియు దాదా అంటే మీ అందరికీ ప్రేమ ఉంది కదా! అయితే ఎవరితో ప్రేమ ఉంటుందో వారిలా అవ్వటంలో శ్రమ ఉండదు  మరియు బాబా సమానంగా అవ్వవలసిందే అనే సంకల్పం ఉన్నప్పుడు కూడా కష్టమనిపించదు. సాధారణ జీవితం జీవించేవారు చాలా మంది ఉన్నారు. గొప్ప, గొప్ప కార్యక్రమాలు చేసేవారు చాలా మంది ఉన్నారు కానీ మీ వంటి కార్యం బ్రాహ్మణాత్మలైన మీరు తప్ప ఎవరూ చేయలేరు. కనుక ఈ స్మృతిదినోత్సవమున బాప్ దాదా సమానంగా అవ్వటంలో సమీపంగా రండి. సమీపంగా రండి! రండి! అనే వరదానాన్ని ఇస్తున్నారు. సంకల్పం యొక్క, మాట యొక్క, కర్మ యొక్క, సంబంధ, సంపర్కాల యొక్క హద్దు యొక్క తీరాలన్నింటినీ వదిలేయండి. మీ మనస్సు అనే నావను ఈ హద్దు యొక్క తీరాల నుండి ముక్తులు చేయండి. ఇప్పటి నుండి జీవితంలో ఉంటూనే ముక్తులుగా అనగా జీవన్ముక్తి యొక్క అలౌకిక అనుభవాన్ని చాలా కాలం నుండి చేయండి. మంచిది. నలువైపుల ఉన్న పిల్లల నుండి చాలా ఉత్తరాలు వచ్చాయి మరియు మధువన నివాసీయులు క్రోధముక్తస్థితి యొక్క ఫలితం, సమాచారం బాప్ దాదా దగ్గరికి చేరుకుంది. ధైర్యం చూసి బాప్ దాదా  సంతోషిస్తున్నారు మరియు ఇక ముందు కొరకు కూడా సదా ముక్తులుగా ఉండేటందుకు సహనశక్తి యొక్క కవచాన్ని ధరించి ఉండండి. అప్పుడు ఎవరు ఎంత ప్రయత్నం చేసినా మీరు రక్షణగా ఉంటారు.

ఈవిధంగా ధృడసంకల్పధారులందరికీ, సదా స్మృతిస్వరూప ఆత్మలందరికీ, సదా సర్వ సమర్థతలను సమయానుసారంగా కార్యంలోకి తీసుకువచ్చే విశేషాత్మలకు, సదా సర్వాత్మల పట్ల దయాహృదయం కలిగి ఉండే ఆత్మలకు, సదా బాప్ దాదా సమానంగా కావాలనే సంకల్పాన్ని సాకారరూపంలోకి తీసుకువచ్చేవారికి చాలా- చాలా చాలా ప్రియమైన మరియు అతీతమైన పిల్లలకు బాప్ దాదా  యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments