18-01-1994 అవ్యక్త మురళి

18-01-1994         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘బ్రాహ్మణ జన్మ యొక్క ఆది వరదానము - స్నేహము యొక్క శక్తి’’

ఈ రోజు నలువైపులా ఉన్న సర్వ పిల్లల యొక్క స్నేహంతో నిండిన స్మృతులు సమర్థుడైన బాప్ దాదా వద్దకు స్నేహ సాగరము సమానంగా చేరుకున్నాయి. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో హృదయాభిరాముడు ఇమిడి ఉన్నారు మరియు హృదయాభిరాముడి హృదయంలో సర్వ స్నేహీ పిల్లలు ఇమిడి ఉన్నారు. స్నేహము చాలా పెద్ద శక్తి.

స్నేహం యొక్క శక్తి శ్రమను సహజము చేస్తుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. శ్రమ మనోరంజనముగా అయిపోతుంది. ఆటలా అనిపిస్తుంది.

స్నేహం యొక్క శక్తి దేహాన్ని మరియు దేహం యొక్క ప్రపంచాన్ని క్షణంలో మరపింపజేస్తుంది. స్నేహంలో ఏది మర్చిపోవాలనుకుంటే దానిని మర్చిపోగలరు, ఏది గుర్తు పెట్టుకోవాలనుకుంటే దానిలో ఇమిడిపోతారు.

స్నేహం యొక్క శక్తి సహజంగా సమర్పణ చేయిస్తుంది.

స్నేహం యొక్క శక్తి తండ్రి సమానంగా చేస్తుంది.

స్నేహం సదా ప్రతి సమయంలో పరమాత్మ తోడును అనుభవం చేయిస్తుంది.

స్నేహం సదా స్వయంపై తండ్రి ఆశీర్వాదాల హస్తాన్ని ఛత్రఛాయ సమానంగా అనుభవం చేయిస్తుంది.

స్నేహం అసంభవాన్ని ఎంత సహజంగా సంభవం చేస్తుందంటే కార్యము జరిగే ఉందని అనిపిస్తుంది.

స్నేహము ప్రతి సమయము నిశ్చింతతను అనుభవం చేయిస్తుంది.

స్నేహము ప్రతి కర్మలో నిశ్చిత విజయీ స్థితిని అనుభవం చేయిస్తుంది. ఇటువంటి స్నేహం యొక్క శక్తిని అనుభవం చేస్తున్నారు కదా?

బాప్ దాదాకు తెలుసు, అనేక జన్మలు, అనేక రకాలుగా శ్రమించి అలిసిపోయిన ఆత్మలు మీరు. భిన్న-భిన్న బంధనాలలో బంధించబడి ఉన్న ఆత్మలైన కారణంగా శ్రమ చేస్తూ ఉన్నారు, అందుకే బాప్ దాదా శ్రమ నుండి ముక్తులుగా అయ్యేందుకు సహజ విధి అయిన స్నేహం యొక్క శక్తిని పిల్లలందరికీ వరదానముగా ఇస్తారు. తమ బ్రాహ్మణ జీవితం యొక్క ఆది కాలాన్ని గుర్తు తెచ్చుకోండి. జన్మించడంతోనే అందరికీ స్నేహం యొక్క శక్తియే కొత్త జీవితాన్ని ఇచ్చింది. స్నేహం యొక్క అనుభూతి కోసం శ్రమ చేసారా? శ్రమ చేయవలసి వచ్చిందా? సహజంగా అనుభవం చేసారు కదా. మరి ఈ ఆది జన్మ యొక్క అనుభూతియే వరదానము. ప్రేమలోనే మీరు మైమరచిపోయారు. సదా ఈ స్నేహం యొక్క వరదానాన్ని స్మృతిలో ఉంచుకోండి. శ్రమ అనిపించే సమయంలో ఈ వరదానం ద్వారా శ్రమను పరివర్తన చేయగలరు. బాప్ దాదాకు పిల్లలు శ్రమను అనుభవం చేయడము మంచిగా అనిపించదు. స్నేహపు శక్తి యొక్క విస్మృతి శ్రమను అనుభవం చేయిస్తుంది.

ఎంత పెద్ద పరిస్థితి అయినా గానీ, ఎటువంటి పరిస్థితి అయినా గానీ, ప్రేమతో, స్నేహంతో పరిస్థితి రూపీ పర్వతము కూడా పరివర్తన అయి నీటి సమానంగా తేలికగా అవ్వగలదు. రాయిని నీటిలా చేయగలరు. మాయ యొక్క ఎటువంటి భయంకర రూపమైనా లేక రాయల్ రూపమైనా ఎదుర్కున్నప్పుడు క్షణంలో స్నేహ సాగరంలో ఇమిడిపోతే, అప్పుడు ఎదుర్కొనే మాయ యొక్క శక్తి సమాప్తమైపోతుంది. మీ ఇముడ్చుకునే శక్తి ఛూ-మంత్రంగా కాక శివ-మంత్రంగా అయిపోతుంది. అందరి వద్ద శివ-మంత్రపు శక్తి ఉంది కదా లేక పోగొట్టుకున్నారా? శివ స్నేహంలో ఇమిడిపోండి, కేవలం మునకలు వేసి బయటకు రాకండి. కొద్ది సమయం స్మృతిలో ఉంటారు - మధురమైన బాబా, ప్రియమైన బాబా,అని మునకలు వేసి మళ్ళీ బయటకు వచ్చేస్తారు, అప్పుడు మాయ దృష్టి పడుతుంది. ఇమిడిపోండి, అప్పుడు మాయ యొక్క దృష్టి నుండి దూరమైపోతారు. ఏమీ రాకపోయినా కూడా స్నేహం యొక్క శక్తి జన్మ యొక్క వరదానము. ఆ వరదానంలో నిమగ్నమైపోండి. నిమగ్నమైపోవడము రాదా? స్నేహమైతే సహజమైనది కదా! అందరికీ అనుభవమే కదా! బ్రాహ్మణ జీవితంలో ఆత్మిక స్నేహం యొక్క అనుభవం లేనివారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా?

స్నేహమే సహజ యోగము, స్నేహంలో ఇమిడిపోవడమే సంపూర్ణ జ్ఞానము.

ఈ రోజు యొక్క మహత్వము కూడా స్నేహమే.

అమృతవేళ నుండి విశేషంగా ఏ అలలో తేలి ఆడుతున్నారు? బాప్ దాదా యొక్క స్నేహంలోనే తేలి ఆడుతున్నారు. ఆత్మలందరిలో ఒక్క తండ్రి తప్ప ఇంకేమైనా గుర్తుందా? సహజ స్మృతి ఉంది కదా? లేక శ్రమించవలసి వచ్చిందా? మరి సహజంగా ఎలా అయింది? స్నేహం కారణంగా. మరి కేవలం ఈ రోజు మాత్రమే స్నేహపూరితమైనదా? సంగమయుగం ఉన్నదే పరమాత్మ స్నేహం యొక్క యుగము. కావున యుగం యొక్క మహత్వాన్ని తెలుసుకొని స్నేహం యొక్క అనుభూతులను అనుభవం చేసుకోండి. స్నేహ సాగరుడు స్నేహం యొక్క వజ్రాలను-ముత్యాలను పళ్ళాలలో నింపి ఇస్తున్నారు. కావున స్వయాన్ని సదా నిండుగా చేసుకోండి. కొద్దిపాటి అనుభవంలోనే సంతోషపడిపోకండి. సంపన్నంగా అవ్వండి. భవిష్యత్తులోనైతే స్థూల వజ్రాలు-ముత్యాలతో అలంకరించబడతారు. పరమాత్మ ప్రేమ యొక్క ఈ వజ్రాలు-ముత్యాలు అమూల్యమైనవి, కావున వీటితో సదా అలంకరించబడి ఉండండి.

నలువైపులా ఉన్న పిల్లల యొక్క స్మృతి, స్నేహం యొక్క పాటలను బాప్ దాదా సదా వింటూనే ఉంటారు కానీ ఈ రోజు విశేషంగా స్నేహ స్వరూపులైన పిల్లలకు స్నేహానికి రిటర్న్ గా సదా స్నేహీ భవ, సదా స్నేహపు వరదానం ద్వారా సహజంగా ఎగిరే కళ యొక్క వరదానాన్ని విశేషంగా మళ్ళీ ఇస్తున్నారు. సదా ఎలాగైతే చిన్న పిల్లలు ఎటువంటి కష్టమైన విషయం వచ్చినా లేక ఎటువంటి పరిస్థితి వచ్చినా ఏ విధంగా మాతా-పితల ఒడిలో ఇమిడిపోతారో, అలాగే క్షణంలో స్నేహపు ఒడిలో ఇమిడిపోయినట్లయితే శ్రమ నుండి విముక్తులవుతారు. క్షణంలో ఎగిరే కళ ద్వారా బాప్ దాదా వద్దకు చేరుకున్నట్లయితే ఎటువంటి స్వరూపంలో వచ్చే మాయ అయినా దూరం నుండి కూడా మిమ్మల్ని ముట్టుకోలేదు ఎందుకంటే పరమాత్మ ఛత్రఛాయ లోపలకే కాదు, కానీ దూరం నుండి కూడా మాయ యొక్క ఛాయ రాజాలదు. కావున పిల్లలుగా అవ్వడము అనగా మాయ నుండి సురక్షితులుగా అవ్వడము. పిల్లలుగా అవ్వడమైతే మంచిదే కదా. పిల్లలుగా అవ్వడము యొక్క అర్థమే స్నేహంలో ఇమిడిపోవడము. అచ్ఛా!

నలువైపులా ఉన్న హృదయాభిరాముని హృదయంలో ఇమిడిపోయి ఉండే పిల్లలకు, సదా శ్రమను ప్రేమలోకి పరివర్తన చేసే శక్తిశాలి ఆత్మలకు, సదా పరమాత్మ స్నేహపు సంగమయుగమును మహాన్ గా అనుభవం చేసుకునే శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్నేహం యొక్క శక్తితో తండ్రి తోడును మరియు ఆశీర్వాదాల చేతిని అనుభవం చేసుకొని ఇతరులకు కూడా అనుభవం చేయించే విశేష ఆత్మలకు, సదా స్నేహ సాగరంలో ఇమిడిపోయి ఉండే సమాన పిల్లలకు స్నేహ సాగరుడైన బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో కలయిక:- ఈరోజు ఏమేమి గుర్తుకు వచ్చాయి? విశేషంగా విల్ పవర్ యొక్క చేయి గుర్తుకు వచ్చిందా? విల్ పవర్ అన్ని కార్యాలను సహజం చేసేస్తుంది. బ్రహ్మా తండ్రి ఎక్కువగా గుర్తుకు వచ్చారా లేక బాప్ దాదా ఇరువురూ గుర్తున్నారా? అయినా కూడా బ్రహ్మా తండ్రి స్మృతి యొక్క చరిత్రలు విశేషంగా అందరికీ గుర్తుకు వచ్చాయి. ఎప్పుడైతే బాప్ దాదా ఇరువురూ కంబైండ్ గా అయ్యారో, అప్పుడే బ్రహ్మా బ్రహ్మాతండ్రిగా అయ్యారు. పరమాత్మ ప్రవేశించినప్పుడే బ్రహ్మా యొక్క కర్తవ్యము కూడా ప్రారంభమయ్యింది. ఈ అవ్యక్త స్వరూపం యొక్క అవ్యక్త రూపం యొక్క చరిత్రలు కూడా అతీతమైనవి మరియు ప్రియమైనవి. 25 సంవత్సరాల సేవ యొక్క చరిత్రను ఆది నుండి గుర్తు చేసుకోండి, ఎంతటి తీవ్ర గతితో కూడిన చరిత్ర అది. అవ్యక్తమవ్వడము అనగా తీవ్ర గతితో సర్వ కార్యాలు జరగడము. సమయం యొక్క పరివర్తన కూడా తీవ్ర గతితో మరియు సేవ యొక్క వృద్ధి కూడా తీవ్ర గతితో జరిగింది. వేగంగా జరిగింది కదా! అందుకే అవ్యక్తమవ్వడం ద్వారా సమయానికి కూడా తీవ్ర గతి కలిగింది, అలాగే సేవకు కూడా తీవ్ర గతి లభించింది. అవ్యక్త పాత్రలో వచ్చే ఆత్మలకు కూడా పురుషార్థంలో తీవ్ర గతి యొక్క భాగ్యము సహజంగానే లభించి ఉంది. అవ్యక్త పాత్రలో వచ్చిన ఆత్మలకు లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ అన్న వరదానము ప్రాప్తించింది. (సభతో)

వరదానాన్ని కార్యంలో వినియోగించండి, కేవలం స్మృతి వరకే పెట్టుకోకండి. సమయానుసారంగా వరదానాన్ని స్వరూపంలోకి తీసుకురండి. వరదానాన్ని స్వరూపంలోకి తీసుకురావడం ద్వారా స్వతహాగానే తీవ్ర గతిని అనుభవం చేస్తారు. అవ్యక్త పాలన సహజంగానే శక్తిశాలిగా తయారుచేస్తుంది, అందుకే ఎంతగా ముందుకు వెళ్ళాలనుకుంటే అంతగా ముందుకు వెళ్ళగలరు. బాప్ దాదాకు మరియు నిమిత్త ఆత్మలకు మీ అందరిపైనా విశేషంగా సదా ముందుకు ఎగురుతూ ఉండాలి అన్న ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇలా ఉంది కదా? దాదీల ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. కేవలం లాభాన్ని తీసుకోండి. లభించడమైతే చాలా లభిస్తోంది, తక్కువగా ఉపయోగిస్తున్నారు. కేవలం బుద్ధిలో పక్కకు పెట్టుకుంటూ ఉండకండి, తినండి, ఖర్చు చేయండి. ఉపయోగించడం వస్తుందా, ఖర్చు చేయడం వస్తుందా లేక కేవలం సంభాళించి పెట్టుకుంటున్నారా? చాలా బాగుంది, చాలా బాగుంది అని అనడము - ఇది సంభాళించి పెట్టుకోవడము. మంచిని స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల కార్యంలో వినియోగించండి. ఇక్కడ ఖర్చు పెట్టడము అంటే పెంచుకోవడము. ఎలాగైతే ఈ రోజుల్లో ఫ్యాషన్ కదా, అమూల్యమైన వస్తువు ఏదైతే ఉంటుందో, దానిని ఎక్కడ పెడతారు? (లాకరులో). వాటిని ఉపయోగించరు, లాకరులో పెట్టుకొని సంతోషిస్తూ ఉంటారు. కావున అనేక సార్లు పాయింట్లు చాలా బాగున్నాయి, విధి చాలా బాగుంది అంటూ కేవలం బుద్ధి యొక్క లాకరులో చూసుకుంటూ సంతోషిస్తూ ఉంటారు. మరి మీరందరూ లాకరులో ఉంచుకుంటున్నారా లేక ఉపయోగిస్తున్నారా? అచ్ఛా!

పాండవ సైన్యం యొక్క స్థితి ఎలా ఉంది? (బాగుంది). కేవలం బాగుంది-బాగుంది అనేవారిగా అయితే లేరు కదా. ఎటువంటి సైన్యం తయారవ్వాలంటే క్షణంలో ఏ ఆర్డర్ అయితే లభిస్తుందో దానిని చేసేయాలి. ఇలా సిద్ధంగా ఉన్నారా? శక్తి సైన్యం సిద్ధంగా ఉందా? శక్తుల సేవ శక్తులది, పాండవుల సేవ పాండవులది. పాండవుల సహయోగము లేకుండా కూడా శక్తులు నడవలేరు, శక్తుల సహయోగము లేకుండా కూడా పాండవులు నడవలేరు.

(దాదీజీ మెక్సికో కాన్ఫరెన్స్ యొక్క సమాచారాన్ని బాప్ దాదాకు వినిపించారు)

బాగుంది, సైన్సువారు పనిలో నిమగ్నమయ్యే ఉన్నారు. ప్రయోగాలు చేయడంలో సైన్స్ వారు తెలివైనవారు కదా. వారిలో ఒక్కరైనా మంచిగా, యోగిగా మరియు ప్రయోగిగా అయినా చాలా పెద్ద మైక్ యొక్క పని చేస్తారు.

(లాస్ ఏంజిలిస్ లో భూకంపం వచ్చింది) ఈ సమయం యొక్క తీవ్ర గతికి గుర్తులను ఎప్పటికప్పుడు ప్రకృతి చూపిస్తుంది. అచ్ఛా!

అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత మిలనము:- ఫలము యొక్క కోరికను విడిచి దయార్ద్ర హృదయులుగా అయి శుభ భావన యొక్క బీజాన్ని వేస్తూ వెళ్ళండి

బాప్ దాదా ద్వారా సర్వ పిల్లలకు ఈ సంగమయుగంలో విశేషంగా ఏ ఖజానా లభించింది? ఖజానాలైతే చాలా ఉన్నాయి కానీ విశేష ఖజానా సంతోషమనే ఖజానా. కావున సంతోషమనే ఖజానా ఎంత శ్రేష్ఠమైనది లభించింది. ఇది సదా తోడుగా ఉంటుందా లేక అప్పుడప్పుడు పక్కకు కూడా తప్పుకుంటుందా? లెక్కలేనంతగా లభించినప్పుడు అన్నివేళలా ఖజానాను కార్యంలో వినియోగించాలి కదా. అవసరమైనప్పుడు పనికి వస్తుందని మనుష్యులు పక్కకు తీసి పెట్టుకుంటారు. కానీ మీ వద్దనైతే అపారంగా ఉంది. ఈ జన్మ విషయం విడిచిపెట్టండి, కానీ అనేక జన్మలు ఈ సంతోషపు ఖజానా తోడుగా ఉంటుంది. లెక్కలేనంతగా ఉంది కాబట్టి ఉపయోగించండి కదా. బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు, ప్రాణాలు పోయినా కానీ సంతోషం పోకూడదు అందుకే, సంతోషాన్ని ఎప్పుడూ పక్కకు పెట్టకండి, ఇంకా మహాదానులుగా అవ్వండి ఎందుకంటే వర్తమాన సమయంలో ఏదైనా లభించగలదు కానీ సత్యమైన సంతోషము లభించలేదు. అల్పకాలికమైన సంతోషాన్ని ప్రాప్తించుకునేందుకు మనుష్యులు ఎంత సమయాన్ని లేక ధనాన్ని ఖర్చు చేస్తారు, అయినా కూడా సత్యమైన సంతోషము లభించదు. కావున ఇటువంటి అవసరమైన సమయంలో ఆత్మలైన మీరు మహాదానులుగా అవ్వాలి. ఎటువంటి అశాంత ఆత్మ అయినా, దుఃఖిత ఆత్మ అయినా ఒకవేళ వారికి సంతోషం యొక్క అనుభూతిని కలిగించినట్లయితే ఎంతగా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను ఇస్తారు. మీరు దాత పిల్లలు, కావున విశాలహృదయంతో పంచండి, పంచడమైతే వస్తుంది కదా? మరి ఎందుకు పంచడం లేదు? సమయాన్ని చూస్తున్నారా? హృదయపూర్వకంగా దయ కలగాలి. ఎవరైతే అశాంతిలో, దుఃఖంలో భ్రమిస్తున్నారో వారు మీ పరివారమే కదా. పరివారానికి సహయోగము ఇవ్వడం జరుగుతుంది కదా. కావున వర్తమాన సమయంలో మహాదానులుగా అయ్యేందుకు విశేషంగా దయార్ద్ర హృదయులుగా అయ్యే గుణాన్ని ఇమర్జ్ చేయండి. మీ జడ చిత్రాలు వరదానాలను ఇస్తున్నాయి. కావున మీరు కూడా చైతన్యంలో దయార్ద్ర హృదయులుగా అయి పంచుతూ ఉండండి ఎందుకంటే వారు పరవశ ఆత్మలుగా ఉన్నారు. వీరైతే వినేవారు కాదు, వీరైతే నడిచేవారు కాదు అని ఎప్పుడూ భావించకండి. అలా కాదు, మీరు దయార్ద్ర హృదయులుగా అవ్వండి, ఇస్తూ ఉండండి. భావనకు తగినట్లుగా ఫలము లభిస్తుందని గాయనం చేయబడింది. కావున ఆత్మలకు జ్ఞానము పట్ల, యోగము పట్ల శుభ భావన లేకపోయినా కానీ మీ యొక్క శుభ భావన వారికి ఫలమును ఇస్తుంది. ఇంత సేవ చేసాము కానీ ఫలమైతే లభించనే లేదు అని ఈ విధంగా ఆలోచించకండి. కానీ ఫలాలు ఒకే విధంగా ఉండవు. కొన్ని సీజన్ల ఫలాలు ఉంటాయి, మరికొన్ని సదా పండే ఫలాలు ఉంటాయి. కావున సీజన్ యొక్క ఫలము సీజన్ లోనే ఫలము ఇస్తుంది కదా. మరి మీరు శుభ భావన యొక్క బీజాన్ని వేసారు, ఒకవేళ సీజన్ యొక్క ఫలమైతే సీజన్ లోనే వెలువడుతుంది కదా. మామూలుగా చూస్తే, ఎవరైతే వ్యవసాయం చేస్తారో, వారు ఏదైతే సీజన్ లో వెలువడేది ఉంటుందో దాని కోసం, ఇది 6 నెలల తర్వాత వెలువడుతుంది, అందుకే బీజాన్ని వేయనే వద్దు అని ఈ విధంగా ఆలోచించరు. కావున మీరు కూడా బీజాలను వేస్తూ వెళ్ళండి. సమయానికి సర్వ ఆత్మలు మేల్కోవలసిందే. మీ దయా భావన, శుభ భావన ఫలమును తప్పకుండా ఇస్తుంది. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకిస్తున్నా కూడా మీరు మీ దయా భావనను వదలకూడదు, ఇంకా ఈ వ్యతిరేకత లేక అవమానము, నిందలు, ఇవి ఎరువులా పని చేస్తాయి అని భావించాలి. కావున ఎరువులు పడడం ద్వారా మంచి ఫలము వెలువడుతుంది. ఎంతగా నిందిస్తారో, అంతగా మీ గుణాలను గానం చేస్తారు, అందుకే ప్రతి ఆత్మకు దాతగా అయి ఇస్తూ ఉండండి. మంచిగా ఉన్నారని భావిస్తేనే ఇస్తాము, అలా కాదు. అలా అయితే తీసుకునేవారిగా అయ్యారు? తీసుకునే కోరికను పెట్టుకోకండి - వారు మంచిగా మాట్లాడాలి, మంచివారిగా భావించాలి అప్పుడు ఇస్తాము. అలా కాదు. వీరినే దాత పిల్లలైన మాస్టర్ దాతలు అని అంటారు. వృత్తి ద్వారా కానీ, వైబ్రేషన్ల ద్వారా కానీ, వాణి ద్వారా కానీ ఇస్తూ ఉండండి. ఇంతగా నిండుగా ఉన్నారు కదా? అన్ని ఖజానాలు ఉన్నాయా?

డబుల్ విదేశీయులను చూసి బాప్ దాదా డబుల్ సంతోషిస్తారు, ఎందుకు? డబుల్ పురుషార్థం చేస్తారు. ఒకటేమో, తమ ఆచార-వ్యవహారాలను పరివర్తన చేసేందుకు పురుషార్థము కూడా చేస్తారు. బాప్ దాదా చూస్తారు, ఉల్లాస ఉత్సాహాలు మెజారిటీలో మంచిగా ఉన్నాయి. ఒకవేళ ఎప్పుడైనా ఉల్లాస-ఉత్సాహాలు మధ్య-మధ్యలో పైకి కిందికి అయినట్లయితే ఈ రోజు విధి వినిపించారు - ఇమిడిపోండి, స్నేహము యొక్క ఒడిలో దాగిపోండి, అప్పుడు మాయ రానే రాదు. ఇదైతే సహజమే కదా. బీజ రూపంగా అవ్వడంలో శ్రమ ఉంది, దీనిలో శ్రమ ఉండదు. ఇంకేమీ రాకపోయినా కానీ స్నేహంలో ఇమిడిపోవడమైతే వస్తుంది కదా లేక ఇది కష్టమా? (కాదు) కావున ఇది చేయండి. ఇప్పుడు కష్టము అన్న పదాన్ని అనకండి. కిందికి వచ్చినట్లయితే చిన్న వస్తువు కూడా పెద్దగా అనిపిస్తుంది. పైకి వెళ్ళినట్లయితే పెద్ద వస్తువు కూడా చిన్నగా అనిపిస్తుంది. మీరు ఫరిశ్తాలా లేక సాధారణ మనుష్యులా? (ఫరిశ్తా). ఫరిశ్తాలు ఎక్కడ ఉంటారు? పైన ఉంటారా లేక క్రింద? (పైన). మరి కింద ఎందుకు ఉంటున్నారు, మంచిగా అనిపిస్తుందా? అప్పుడప్పుడు కిందకు రావాలని మనసుకు అనిపిస్తుందా? లేదు, మరి ఎందుకు వస్తారు? తండ్రి తోడును విడిచిపెడతారు అప్పుడు కిందకు వస్తారు.

మరి డబుల్ విదేశీయులకు డబుల్ పురుషార్థం యొక్క ప్రత్యక్ష ఫలము డబుల్ అవకాశము ఉంది. దీని లాభాన్ని తీసుకోండి. ఈ సంవత్సరం ఏం చేస్తారు? డబుల్ సేవ. మహాదానిగా-వరదానిగా అవుతారా లేక స్వయం తండ్రి ఎదురుగా శక్తిని ఇవ్వండి, ఇతరులకు కూడా శక్తులను ఇవ్వండి అని అంటారా. బాగుంది, ధైర్యము పెట్టడంలో నంబరు తీసుకున్నారు ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేసి ముందుకు ఎగురుతూ ఉండండి.

Comments