09-03-1994 అవ్యక్త మురళి

 09-03-1994         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘అతీతమైన-ప్రియమైన, అద్భుతమైన, స్నేహమయమైన మరియు సుఖభరితమైన అవతరణ - శివ జయంతి’’

ఈ రోజు త్రిదేవ రచయిత అయిన తండ్రి తమ పూజ్య సాలిగ్రామ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఎలాగైతే జ్యోతిర్బిందు స్వరూపుడైన తండ్రి పూజ జరుగుతుందో, స్మృతిచిహ్నాన్ని జరుపుకుంటారో, అలాగే తండ్రితో పాటుగా సాలిగ్రామ ఆత్మలైన మీకు కూడా పూజ జరుగుతుంది. తండ్రి ఒక్క త్రిమూర్తి శివునిగా గాయనం చేయబడతారు మరియు పూజించబడతారు మరియు సాలిగ్రామ ఆత్మలైన మీరు అనేకమంది ఉన్నారు. పూజ ఇరువురికీ జరుగుతుంది ఎందుకంటే తండ్రి పిల్లలందరినీ తమ సమానంగా పూజ్యులుగా తయారుచేసారు. ఎప్పుడైనా సాలిగ్రామాలను చూస్తే ఏమి అనుభవం చేస్తారు? ఇది మేమే అని అనిపిస్తుందా? మరి తండ్రి పిల్లలను సమానంగానే కాక, తమ కన్నా కూడా శ్రేష్ఠంగా, పూజ్యులుగా తయారుచేసారు. పిల్లల పూజ డబల్ రూపంలో జరుగుతుంది. తండ్రికి పూజ ఒక్క శివలింగం రూపంలోనే జరుగుతుంది. పిల్లలైన మీకు సాలిగ్రామ రూపంలో కూడా పూజ జరుగుతుంది మరియు దేవాత్మల రూపంలో కూడా జరుగుతుంది. తండ్రి కన్నా కూడా ఎక్కువగా డబుల్ రూపంలో పూజకు అధికారీ ఆత్మలు మీరు. ఎలాగైతే డబుల్ విదేశీయులు అని పిలవబడతారో, అలాగే డబుల్ పూజ్యులు కూడా. డబుల్ కిరీటధారులుగా కూడా మీరు అవుతారు. నిరాకార తండ్రి అలా అవ్వరు. అక్కడక్కడ భక్తులు శివుని ప్రతిమకు కిరీటం పెడతారు ఎందుకంటే వారు కిరీటధారులుగా చేసారు, అందుకే అక్కడక్కడ కిరీటం చూపిస్తారు. కానీ తండ్రి ఎప్పుడూ కూడా రత్నజడిత బంగారం-వెండి కిరీటధారిగా అవ్వరు ఎందుకంటే కిరీటం ప్రాక్టికల్ గా మస్తకంపై ధరించడం జరుగుతుంది. మరి నిరాకార తండ్రికి మస్తకం ఉంటుందా! శరీరమే లేకపోతే కిరీటాన్ని ఏం ధరిస్తారు! కానీ స్నేహం కారణంగా కిరీటం చూపిస్తారు. మరి తండ్రి పిల్లలను తమ కన్నా కూడా ముందు పెట్టారు. ఇంతటి సంతోషం మరియు ఇంతటి శ్రేష్ఠ స్మృతి ఉంటుందా? బాప్ దాదాకు తమ జయంతిని జరుపుకోవాలనే సంతోషం ఉండదు కానీ ఇది మీ అందరి జయంతి కూడా, కావున పిల్లల జయంతి యొక్క సంతోషం ఉంటుంది ఎందుకంటే తండ్రి ఒంటరిగా ఏమీ చేయలేరు మరియు మీరు కూడా ఒంటరిగా ఏమీ చేయలేరు. అక్కడక్కడ కొంతమంది పిల్లలకు, నేనే చేసేవాడిని అని కొంచెం అనిపిస్తుంది, కానీ తండ్రి లేకుండా సఫలత లభించదు. మరి తండ్రి ఒంటరిగా ఏమీ చేయలేరు, అలాగే పిల్లలు ఒంటరిగా ఏమీ చేయలేరు. ఒకవేళ తండ్రి పిల్లలతో సాకారంలో కానీ లేదా ఆకారంలో కూడా కానీ మిలనం జరుపుకోవాలనుకున్నా కూడా, బ్రహ్మాను ఆధారంగా తీసుకోవాల్సే ఉంటుంది. బ్రహ్మా లేకుండా కూడా ఏమీ చేయలేరు. మాధ్యమము లేకుండా సాకార మిలనం చేసుకోలేరు. మరి తండ్రికి పిల్లలపై మరియు పిల్లలకు తండ్రిపై ఎంత ప్రేమ ఉంది! ఒకరు లేకుండా మరొకరు ఏమీ చేయలేరు. ఒకవేళ తండ్రిని పక్కకు పెట్టారు, తోడుగా పెట్టుకోలేదు, అప్పుడు ఒంటరిగా ఏమైనా చేయగలరా? తండ్రి చేయగలరా? తండ్రి కూడా చేయలేరు. కనుక ఈ తండ్రి మరియు పిల్లలు కలిసి దివ్య జన్మ తీసుకోవడము, కలిసి విశ్వ పరివర్తన చేయడము మరియు కలిసి తమ మధురమైన ఇంటికి వెళ్ళడము - ఇది డ్రామా యొక్క అవినాశీ నిర్ణయము. దీనిని ఎవరూ మార్చలేరు. మరి ఈ నిర్ణయం బాగుంది కదా! ప్రియమనిపిస్తుంది కదా! ఈ రోజు అందరూ తండ్రి యొక్క జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారా లేక మీది జరుపుకునేందుకు వచ్చారా? తండ్రి, మీది జరుపుకునేందుకు అని అంటారు మరియు పిల్లలు, మీది జరుపుకునేందుకు వచ్చామని తండ్రితో అంటారు.

ఈ దివ్య అవతరణ, దేనినైతే శివ జయంతి లేక శివ రాత్రి అని అంటారో, ఎంతగా ఆత్మల కోసం స్నేహభరితమైన, సుఖభరితమైన అవతరణ. సత్యయుగంలో కూడా ఈ విధమైన జన్మదినాన్ని జరుపుకోరు. ఆత్మలు, ఆత్మల జన్మదినాన్ని జరుపుకుంటారు కానీ ఈ సమయంలో ఆత్మలు పరమ ఆత్మ జన్మదినాన్ని జరుపుకుంటారు. కల్పమంతటిలో ఇది అతీతమైన మరియు ప్రియమైన, అద్భుతమైన జన్మదినము, ఒక్క సమయంలోనే తండ్రిది కూడా జరుగుతుంది మరియు పిల్లలది కూడా జరుగుతుంది. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? ఒకవేళ తేదీ ఒకటే అయినా కూడా, సంవత్సరం లేదా నెల లేదా తారీఖు తేడా ఉంటుంది. కానీ ఈ అవతరణ దినోత్సవం ఎంత అద్భుతమైనది, తండ్రి మరియు పిల్లలది కలిసే జరుగుతుంది.

ఈ స్మృతిచిహ్నం రోజున విశేషంగా భక్తులు కూడా రెండు విశేషతలతో ఈ రోజును జరుపుకుంటారు. రెండు విశేషతలు ఏమిటి? ఒకటి, విశేషంగా వ్రతాన్ని ధారణ చేస్తారు మరియు రెండవది, స్వయాన్ని సమర్పితము చేసుకోకుండా ఇంక దేనినైనా బలి ఇస్తారు. కావున బలి ఇవ్వడము మరియు వ్రతం ధారణ చేయడము, ఈ రెండు విశేషతలు ఈ రోజుకు సంబంధించినవి. అనేక రకాల వ్రతాలను ధారణ చేస్తారు. కొంతమంది భోజనం యొక్క వ్రతం చేస్తారు, కొంతమంది జాగరణ యొక్క వ్రతం చేస్తారు, కొంతమంది దూర-దూరాల నుండి నడుస్తూ వెళ్ళే వ్రతం పెట్టుకుంటారు, ఎంత అలసిపోయినా కానీ తమ వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఎన్ని రోజులు పట్టినా సరే, ఎంత సమయం పట్టినా సరే, వ్రతాన్ని విడిచిపెట్టరు. మరి ఈ స్మృతిచిహ్నాన్ని ఎవరి నుండి కాపీ చేసారు? మీది బ్రాహ్మణ జీవితం యొక్క వ్రతం మరియు భక్తులది ఒక రోజు యొక్క వ్రతం. మీరు కూడా ఎప్పుడైతే బ్రాహ్మణ జన్మ లేదా దివ్య జన్మ తీసుకున్నారో, అప్పుడు ఏం వ్రతం తీసుకున్నారు? సదా అజ్ఞాన నిద్ర నుండి జాగరణ అనే వ్రతాన్ని తీసుకున్నారు కదా లేదా కొద్ది-కొద్దిగా నిద్రపోతాము అన్న వ్రతం తీసుకున్నారా? లేదా కొంచెం-కొంచెం తూగుతూ ఉంటాము, ఇటువంటి వ్రతాన్ని అయితే తీసుకోలేదు కదా? మీరందరూ కూడా శివ జయంతి లేదా దివ్య జన్మ దినాన జాగరణ యొక్క వ్రతాన్ని తీసుకున్నారు, అందుకే భక్తులు కూడా స్మృతిచిహ్న రూపంలో జాగరణ చేస్తారు. మరియు మీరందరూ కూడా శుద్ధ భోజనం యొక్క వ్రతం తీసుకున్నారు, అందుకే భక్తులు కూడా, ఏమైనా కానీ, అనారోగ్యంగా ఉన్నా గానీ, అన్నం యొక్క వ్రతాన్ని ఉల్లంఘించరు. మరి మీరందరూ కూడా మనసుకు ఎదురుగా, తనువుకు ఎదురుగా ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, వ్రతాన్ని ఉల్లంఘిస్తారా ? ఎప్పుడైనా ఏదైనా మిక్స్ అయినదానిని తినేయడం, ఇలా చేస్తారా ? ఎవరూ చూడడమైతే లేదు, ఇక తినేసాము! మీ నియమాన్ని పక్కాగా ఉంచుకుంటారు కదా? లేక కచ్చాగా ఉన్నారా? అప్పుడప్పుడు వాటిని చూసి కొంచెం తినాలనిపిస్తుందా? ఒకే విధమైన ఆహారాన్ని తింటూ-తింటూ అప్పుడప్పుడు వేరేది కూడా తినాలని మనసుకి అనిపిస్తుందా? అచ్ఛా, ఇందులో అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, ఆసియా లేక రష్యా, అందరూ పక్కాయే కదా? లేదా కొద్ది-కొద్దిగా కచ్చాగా ఉన్నారా?

డబుల్ విదేశీయులందరూ పాస్ అయ్యారు! మరియు భారత్ వారైతే పాస్ అయ్యే ఉన్నారు కదా! భారత్ వారికి ఎంతైనా సహజము. డబుల్ విదేశీయులకు ఇందులో డబుల్ శ్రమ కూడా ఉంది. కానీ పాస్ అయ్యారు, దీనికి శుభాకాంక్షలు. మరి ఒకటేమో, జన్మదిన శుభాకాంక్షలు, రెండవది పాస్ అయినందుకు శుభాకాంక్షలు మరియు మూడవది, ఎప్పుడూ కూడా అలజడిలోకి రాకుండా సదా స్థిరంగా ఉండడము, దీనిలో పాస్ అయ్యారా? ఇందులో, ఏం చేయాలి! అప్పుడప్పుడు ఉంటాము అని అంటారు. ఈరోజు బాప్ దాదా డబుల్ విదేశీయుల కోసం చాలా రమణీకమైన భాషను ఇమర్జ్ చేసారు ఎందుకంటే డబుల్ విదేశీయులు ఎంజాయ్ చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు కదా! ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలి, ఇలా శాంతి, శాంతిగా ఎలా ఉంటాము! కనుక బాప్ దాదా శివరాత్రికి ఈ పదాల విషయంలో అందరి చేత దృఢ వ్రతం చేయిస్తున్నారు. వ్రతాన్ని తీసుకోవడం కోసం తయారుగా ఉన్నారా? లేక ఎప్పుడైతే వింటారో, అప్పుడు, ఇదైతే కొంచెం-కొంచెం కష్టము అంటారా! మొదట ‘కష్టం’ అన్న పదాన్ని సంకల్పంలోకి కూడా తీసుకురాము అని ఈ వ్రతాన్ని తీసుకోవడం కోసం తయారుగా ఉన్నారా? మరి బాప్ దాదా చూసారు, ఎప్పటివరకైతే సంకల్పంలో దృఢత ఉండదో, అప్పటి వరకు సఫలత ఉండదు. సంకల్పం ఉంటుంది కానీ దృఢంగా లేకపోతే బలహీనత వస్తుంది. చాలావరకు బలహీనతతో కూడిన ఈ పదాలనే అంటారు - ఏం చేయాలి! వాట్ (ఏమిటి). మరి ఇప్పుడు వాట్ అని అనకండి, కానీ వాట్ కు బదులుగా ఏమంటారు? ఫ్లై (ఎగరాలి). కావున ఎప్పుడు వాట్ అన్న పదం వచ్చినా, బ్రాహ్మణ డిక్షనరీలో వాట్ కు బదులుగా ఫ్లై అన్న పదం ఉండాలి. ఇంకో పదం ఏం మాట్లాడుతారు? వై(ఎందుకు), మరి వై (ఎందుకు) అనే పదాన్ని ఏం చేస్తారు? బై-బై. సదా కోసం బై-బై చేస్తారా లేక కొద్ది సమయం కోసమా? మరియు మూడవ పదం ఏం మాట్లాడుతారు? హౌ (ఎలా). మరి హౌ(ఎలా) అని కాదు, నో(ఇలా) అంటే, తెలుసు, ఎలా కాదు, నో అంటే తెలిసినవారు. ఎప్పుడైతే త్రికాలదర్శిగా అవుతారో, తెలిసినవారిగా అవుతారో, అప్పుడు ఎలా అని అంటారా? ఎలా అని అనడము అంటే భూతం రావడము. మరి భూతం మంచిగా అనిపిస్తుందా ? అందుకే ఈ పదాలే బలహీనతను తీసుకువస్తాయి. ఈ పదాలే వ్యర్థ సంకల్పాల ద్వారాన్ని తెరుస్తాయి. ఆలోచించండి! ఎప్పుడైతే వ్యర్థ సంకల్పాల క్యూ మొదలవుతుందో, అప్పుడు ఏ పదాలతో మొదలవుతుంది? ఈ పదాలతోనే మొదలవుతుంది కదా! లేదా ఎందుకు జరిగింది, ఏం జరిగింది లేదా ఎలా జరిగింది. ఇది ఎలా జరిగింది! వీరు ఎలా అన్నారు! వీరు ఎందుకు అన్నారు! ఇప్పుడు ఏమి చేయాలి!... ఎలా చేయాలి! కావున బలహీనతకు లేదా వ్యర్థ సంకల్పాలకు ద్వారాలు ఈ పదాలే. వీటిని డిక్షనరీలో మార్చండి. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు కూడా మారిపోతారు కదా! మరి భక్తులు మిమ్మల్నే కాపీ చేస్తున్నారు. మీది అనంతమైన విషయము మరియు వారు హద్దు రూపంలో స్మృతిచిహ్నాన్ని పెట్టుకున్నారు. మరి ఈ దృఢ వ్రతాన్ని పెట్టుకోవడము, ఇదే శివజయంతిని లేదా శివరాత్రిని జరుపుకోవడము. జరుపుకోవడము అంటే తయారవ్వడము. అంతేకానీ, కేవలం కేక్ కట్ చేసాము, లైట్లు వెలిగించాము, దీపాలు వెలిగించాము, ఇది జరుపుకోవడము కాదు, ఈ మనోరంజనం కూడా అవసరమే కానీ దీనితో పాటు కొన్ని కట్ చేయాలి మరియు కొన్ని వెలిగించాలి కూడా.

ఒక వైపు దీపాలను లేదా క్రొవ్వొత్తులను వెలిగిస్తారు, మరొక వైపు కేక్ కట్ చేస్తారు, మూడవది, జెండా ఎగురవేస్తారు, నాలుగవది, పాటలు పాడుతారు, ఐదవది, డాన్స్ కూడా చేస్తారు. ఇంకేం చేస్తారు? మిఠాయిని పంచుతారు మరియు తింటారు. మరి ఇప్పుడు ఈ 6 విషయాలనే చేయాల్సి ఉంటుంది. మొదట అయితే మీ మనసులో ధృఢ సంకల్పమనే దీపాన్ని వెలిగించండి - ఇప్పటి నుండి దృఢత ద్వారా సఫలతను పొందవలసిందే. చూస్తాములే, తెలియదు, తెలియదు, ఇలా కాదు. అవ్వాల్సిందే, చేయాల్సిందే, చేస్తాములే అన్న పదం కాదు, చేయాల్సిందే. మరియు రెండవది, ఏం కేక్ ను కట్ చేస్తారు? కేకును ఒక్కసారిగా తినడం జరగదు, కట్ చేసి తినడం జరుగుతుంది. మరి ఏం కట్ చేస్తారు? సంపన్నంగా అవ్వడములో లేదా సంపూర్ణంగా అవ్వడంలో సంకల్పమాత్రమైనా ఏదైనా ఆటంకం వస్తే, దానిని ఇప్పటి నుండి కట్ చేయండి, సమాప్తము చేయండి. మరియు ఏదైతే బలహీనత ఉందో దానికి బదులుగా శక్తిని ధారణ చేసే కేకును నోట్లో వేసుకోండి. మొదట కట్ చేయండి, తర్వాత నోటి ద్వారా తినండి. అర్థమైందా! ఏ జెండాను ఎగురవేస్తారు? ఇదైతే స్మృతిచిహ్న రూపంలో జెండాను ఎగురవేస్తున్నారు, కానీ మీ మనసులో ప్రతి సంకల్పం, మాట మరియు కర్మల ద్వారా సదా తండ్రిని ప్రత్యక్షం చేసే జెండాను ఎగురవేయండి. ఏ సంకల్పం, మాట మరియు కర్మ అయినా, తండ్రిని ప్రత్యక్షం చేయని విధంగా ఉండకూడదు ఎందుకంటే అందరి మనసులలో తండ్రిపై స్నేహం ఉన్న కారణంగా తండ్రిని ప్రత్యక్షం చేయాలి అన్న సంకల్పమే ఉంది. మరి ఎలా చేస్తారు? సదా మీ సంకల్పం, మాట మరియు కర్మల ద్వారా మనసులో ప్రత్యక్షం చేసే జెండాను ఎగురవేయండి మరియు సదా సంతోషంగా ఉండే డాన్స్ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు సంతోషంగా, అప్పుడప్పుడు ఉదాసీనంగా, ఇలా కాదు. ఎప్పుడైనా ఉదాసీనంగా అయినప్పుడు ఆ సమయంలో కూడా మీ ఫోటో ఒకటి తీసుకోండి. మరియు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో, అప్పుడు కూడా ఫోటో తీసుకోండి. మళ్ళీ రెండు ఫోటోలను ఒక దగ్గర పెట్టుకోండి. అప్పుడు చూడండి, ఏది బాగుందో? నేను ఇలా ఉన్నానా లేక అలా ఉన్నానా? మరి సదా హర్షితంగా ఉండే, సంతోషంగా ఉండే డాన్స్ చేయండి. ఏం జరిగినా కానీ, ఎవరు ఎంతగా సంతోషాన్ని దొంగలించడానికి ప్రయత్నించినా, ఎందుకంటే మాయ ఎవరో ఒకరి ద్వారా అయితే చేయిస్తుంది కదా! ఏది జరిగినా కానీ, ఎవరు ఎంతగానైనా ఏ రకంగానైనా సంతోషం తక్కువ చేయడానికి లేదా సంతోషం మాయం చేయడానికి ప్రయత్నించినా కానీ, ఎప్పటివరకైతే జీవించనున్నారో, అప్పటి వరకు సంతోషంగా ఉండాలి. ఈ వ్రతాన్ని పక్కాగా తీసుకున్నారు కదా. మీరు ఇది చేయలేరా! విల్ పవర్ ఉంది కదా! మరి ఎవరి వద్ద విల్ పవర్ ఉంటుందో వారు చేయలేనిది ఏముంటుంది! ఒకవేళ మాస్టర్ సర్వశక్తివంతులైన మీరే చేయలేకపోతే ఇంకెవరు చేస్తారు! ఇంకా మరెవరైనా జన్మించాల్సినవారు ఉన్నారా లేక మీరేనా? మాలలో మణులుగా మీరే అవ్వాలా లేక ఇతరుల కోసం ఎదురుచూస్తున్నారా? ఫస్ట్ డివిజన్ లోకి రావాలి కదా! లేదా సెకెండ్ కూడా నడుస్తుందా? మరి ఈ దృఢ సంకల్పాన్ని అనగా వ్రతాన్ని తీసుకోండి - ఎప్పటివరకైతే జీవించనున్నామో అప్పటి వరకు సంతోషంగా ఉండాలి. మరియు ఎవరైతే సంతోషంగా ఉంటారో, వారు సంతోషమనే మిఠాయిని పంచుతూ ఉంటారు. ఆ మిఠాయితోనైతే కేవలం నోరు తీపి అవుతుంది మరియు దీనితో మనసు, తనువు, హృదయం అన్నీ సంతోషంగా అవుతాయి. కనుక ఈ మిఠాయిని పంచాలి. మరియు ఏ పాటను సదా పాడుతారు? మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ఈ పాటనే పాడుతారు కదా! సదా ఈ పాట స్వతహాగా మోగుతూ ఉండాలి. అంతేకానీ, బ్యాటరీ స్లో అయితే పాట ఆగిపోవడం కాదు. బ్యాటరీ స్లో అవ్వకూడదు. అలా కాదు. బ్యాటరీ స్లో అయినప్పుడు ఏ పాటను పాడుతారో తెలుసా? అందరికీ అనుభవమైతే ఉంది కదా. అప్పుడు ఏం జరుగుతుంది? నాకైతే బాబాయే, అయితే-అయితే అని వచ్చేస్తుంది. కేవలం నా బాబా అని అనరు, నాకైతే బాబాయే. ఇది మిక్స్ అయినట్లు కదా. బ్యాటరీ స్లో అయినప్పుడు శబ్దం స్లో అయిపోతుంది మరియు అందులో పదాలు కలిసిపోతాయి. నా బాబా అని నషాతో కాదు, నాకైతే ఉన్నదే బాబా.

మరి శివరాత్రిని జరుపుకోవడము అనగా ఈ దృఢ వ్రతాన్ని తీసుకోవడము. ఇటువంటి శివరాత్రిని జరుపుకున్నారు కదా? లేదా ఆలోచించి తర్వాత జవాబు చెప్తారా! అచ్ఛా, చాలా తెలివైనవారు, ఇప్పుడిప్పుడే ఆలోచించారు. డబుల్ విదేశీయులు, అందుకే డబుల్ తెలివైనవారు. అచ్ఛా!

డబుల్ విదేశీయులు మధుబన్ లో ఏ విశేష సేవను చేసారు? ఏం చేసారు? బ్రహ్మా బాబాను ప్రత్యక్షం చేసారు. స్టాంప్ కు సంబంధించిన ఫంక్షన్ ను జరిపారు. విశేష యోగం కూడా పెట్టుకున్నారు కదా. శక్తిశాలి యోగం పెట్టుకున్నారు, అందుకే విఘ్న వినాశకులుగా అయ్యారు కదా. మధుబన్ నివాసుల యోగం కావచ్చు, డబుల్ విదేశీయుల యోగం కావచ్చు, నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల యోగం కావచ్చు, అద్భుతం చేసింది కదా ఎందుకంటే నలువైపులా అందరికీ ఈ ఒక్క సంకల్పమే ఉండేది - బ్రహ్మా తండ్రిని ప్రత్యక్షం చేయాల్సిందే. కొంతమంది పరుగులు పెట్టే సేవను చేసారు, కొంతమంది మనసా సేవ చేసారు, కొంతమంది వాచా సేవ చేసారు, కానీ ఎవరైతే యోగయుక్తులుగా అయ్యి సేవ చేసారో, అటువంటి సేవాధారులకు సఫలత యొక్క శుభాకాంక్షలు. ఎంత సంతోషం కలిగింది! ఎందుకంటే బ్రహ్మా తండ్రి అంటే అందరికీ హృదయపూర్వకమైన అతి సూక్ష్మమైన ప్రేమ ఉంది. అందరూ బ్రహ్మా తండ్రిని చూసారా లేదా తెలుసుకున్నారా? ఏమంటారు, చూసారా లేక తెలుసుకున్నారా? ఎవరైతే, మేము చూసాము అని అంటారో వారు చేతులెత్తండి. ఎవరైతే, తెలుసుకున్నాము కానీ ఇప్పుడు చూడాలి అని అంటారో వారు చేతులెత్తండి. (కొద్దిమంది చేతులెత్తారు) అచ్ఛా, అనుభవం చేసారా? బ్రహ్మా మా తండ్రి అన్న అనుభవం చేసుకున్నారా? ఎందుకంటే అనుభవం కూడా ఒక నేత్రం వంటిది, ఎలాగైతే స్థూల నేత్రాలతో చూడడం జరుగుతుందో, అలాగే అన్నింటికన్నా పెద్ద నేత్రము అనుభవము. అనుభవమనే నేత్రంతో చూసినా కూడా చూసామనే అంటారు. ఒకవేళ అనుభవం కూడా చేసుకోలేదు మరియు అవ్యక్త రూపంతో, అవ్యక్త స్థితి ద్వారా చూడలేదు అంటే, మీ పేర్లు దాదీ దగ్గర నోట్ చేయించండి, అప్పుడు వారు అనుభవం చేయిస్తారు. అనుభవం చేయకుండా ఉండిపోవద్దు ఎందుకంటే స్టాంప్ ద్వారా ఇతరులకు బ్రహ్మా తండ్రి యొక్క అనుభవం చేయిస్తున్నారు మరియు స్వయం అనుభవం చేసుకోకపోతే మంచిగా ఉండదు కదా. ఎప్పుడైతే బ్రహ్మా తండ్రి చిత్రం ఎదురుగా కూర్చుంటారో, అప్పుడు చిత్రం ద్వారా చైతన్యతతో మిలనం, అనుభవం యొక్క అనుభూతి అవ్వడం లేదా! ఆత్మిక సంభాషణకు రెస్పాన్స్ లభించడం లేదా? లభిస్తుంది కదా. తండ్రి ఉన్నారు, అందుకే వింటారు మరియు జవాబు ఇస్తారు. అయినా కూడా ఈ అనుభవం నుండి వంచితమవ్వకూడదు. అర్థమైందా! మరి అందరూ ఏ సేవనైతే చేసారో, విశేషంగా భారతవాసులు సేవలో ఎక్కువ ఛాన్స్ తీసుకున్నారు, మరి బాప్ దాదా పేర్లు తీసుకోరు కానీ అందరూ తమ సేవకి రిటర్న్ లో పేరు సహితంగా శుభాకాంక్షలను స్వీకరించండి. డబుల్ విదేశీయులకు కూడా సేవా అవకాశం లభించింది. మంచిగా అనిపించింది కదా! నాట్యం చేస్తున్నారు కదా! అచ్ఛా!

నలువైపులా ఉన్న బ్రాహ్మణ జన్మ అనే దివ్య జన్మకు అధికారి ఆత్మలకు, సదా తండ్రి మరియు మీరు కలిసి తోడు తోడుగా ఉండే సమీపాత్మలకు, సదా డబుల్ పూజ్య స్వరూపం యొక్క స్మృతిలో ఉండే సమర్థ ఆత్మలకు, సదా దృఢ సంకల్పం లేదా దృఢ వ్రతాన్ని నిర్వర్తించే సఫలత యొక్క అధికారి ఆత్మలకు, సదా సంతోషంగా ఉండేవారు మరియు ఇతరులను కూడా సంతోషపరిచే అదృష్టవంతులైన పిల్లలకు, త్రిదేవ రచయిత అయిన తండ్రి మరియు బ్రహ్మా తండ్రి నుండి విశేషంగా జన్మదిన శుభాకాంక్షలు కూడా మరియు ప్రియస్మృతులు కూడా. దానితో పాటు సర్వ శ్రేష్ఠ ఆత్మలకు నమస్తే.

Comments