18-01-2004 అవ్యక్త మురళి

 18-01-2004         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము 

వరల్డ్ అథారిటీ (విశ్వాధికారి) బాబా యొక్క డైరెక్ట్ పిల్లలం అనే స్మృతిని ప్రత్యక్షంగా ఉంచుకుని సర్వ శక్తులను ఆజ్ఞతో నడిపించండి.

ఈరోజు నలువైపుల ఉన్న పిల్లలందరు స్నేహ సాగరంలో లీనమై ఉన్నారు. అందరి మనస్సులో విశేషంగా బ్రహ్మాబాబా యొక్క స్మృతి ప్రత్యక్షంగా ఉంది. అమృతవేళ నుండి సాకారపాలన పొందిన రత్నాలు మరియు వెనువెంట అలౌకిక పాలన పొందిన రత్నాలు ఇద్దరి మనస్సు యొక్క స్మృతి మాలలు బాప్ దాదా దగ్గరికి చేరుకున్నాయి. అందరి మనస్సులో బాప్ దాదా స్మృతి యొక్క చిత్రం కనిపిస్తుంది. మరియు బాబా యొక్క మనస్సులో పిల్లలందరి స్నేహంతో నిండిన మనస్సు ఇమిడి ఉంది. అందరి మనస్సు నుండి ఒకే స్నేహగీతం వినిపిస్తుంది - నా బాబా! అని. మరియు బాబా యొక్క మనస్సు నుండి ఇదే పాట వస్తుంది - నా మధురాతి మధురమైన పిల్లలూ! అని. స్వతహాగా వచ్చే ఈ పాట, అనంతమైన ఈ పాట ఎంతో ప్రియంగా ఉంటుంది! బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లల యొక్క స్నేహ స్మృతికి రిటన్ గా మనస్సు యొక్క స్నేహంతో నిండిన కోటానుకోట్ల రెట్లు ఆశీర్వాదాలు ఇస్తున్నారు.

బాప్ దాదా చూస్తున్నారు - ఇప్పుడు కూడా దేశం లేక విదేశం యొక్క పిల్లలు స్నేహ సాగరంలో లవలీనమై ఉన్నారు. ఈ స్మృతి దినోత్సవం విశేషంగా పిల్లలను సమర్ధంగా చేసే రోజు. ఈరోజు విశేషంగా పిల్లలకు బ్రహ్మాబాబా ద్వారా కిరీటధారణ జరిగిన రోజు. బ్రహ్మాబాబా నిమిత్తపిల్లలకు విశ్వ సేవాభాద్యత అనే కిరీటాన్ని పెట్టారు. స్వయం గుప్తం అయ్యారు మరియు పిల్లలను సాకారస్వరూపంలో నిమిత్తంగా చేసి స్మృతితిలకం పెట్టారు. తన సమానంగా అవ్యక్త ఫరిస్తా స్వరూపం యొక్క, ప్రకాశకిరీటాన్ని పెట్టారు. తను చేయించేవారిగా అయ్యి పిల్లలను చేసేవారిగా తయారుచేశారు. అందువలనే ఈ రోజుని స్మృతిదినోత్సవం మరియు సమర్ధ దినోత్సవం అంటారు. కేవలం స్మృతియే కాదు సర్వ స్మృతులు పిల్లలకు వరదాన రూపంలో బాబా ఇచ్చారు. బాప్ దాదా పిల్లలందరినీ సర్వ స్మృతి స్వరూపంగా చూస్తున్నారు. మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో చూస్తున్నారు. శక్తివంతులుగా కాదు, మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో చూస్తున్నారు. సర్వశక్తులు బాబా ద్వారా ప్రతి పిల్లవానికి వరదాన రూపంలో లభించాయి. దివ్యజన్మ తీసుకుంటూనే బాప్ దాదా వరదానం ఇచ్చారు - సర్వశక్తివాస్ భవ! ఈ శక్తులను వరదాన రూపంతో కార్యంలో ఉపయోగించండి. ప్రతి పిల్లవానికి వరదానం లభించింది కానీ కార్యంలో ఉపయోగించడంలో నెంబర్ వార్ అవుతున్నారు. ప్రతి శక్తి యొక్క వరదానాన్ని సమయానుసారం ఆజ్ఞ చేయగలుగుతున్నారా!

వరదాత యొక్క వరదాన స్వరూపంగా అయ్యి సమయానుసారం ఏ శక్తిని ఆర్డర్ చేసినా ఆది హాజరవ్వవలసిందే. వరదాన ప్రాప్తి యొక్క స్మృతి స్వరూపంగా అయ్యి మీరు ఆర్డర్ చేస్తే సమయానికి శక్తి కార్యంలోకి రాకపోవటం అనేది జరగదు. కానీ యజమానిగా అయ్యి మాష్టర్ సర్వశక్తివాన్ స్మృతి యొక్క సీట్ పై సెట్ అవ్వాలి. సీట్ పై సెట్ అవ్వకుండా ఏదీ మీ ఆజ్ఞను అంగీకరించదు. పిల్లలు అంటుంటారు - మేము బాబాని స్మృతి చేయగానే బాబా హాజరవుతారు. భగవంతుడైన యజమాని హాజరైపోతున్నారు అయితే ఇక శక్తులు ఎందుకు హాజరవ్వవు? విధిపూర్వకంగా యజమానిగా అయ్యి అధికారంతో ఆర్థర్ చేయండి. సంగమయుగంలో విశేషంగా పరమాత్మ యొక్క సంపదయే ఈ సర్వశక్తులు. ఆస్తి ఎవరికోసం ఉంటుంది? పిల్లల కోసమే ఆస్తి ఉంటుంది. కనుక అధికారం యొక్క స్మృతి స్వరూప సీట్ పై సెట్ అయ్యి ఆర్డర్ చేయండి, శ్రమ ఎందుకు చేస్తున్నారు? "విశ్వానికి అధికారి అయిన బాబా యొక్క డైరెక్ట్ పిల్లలం" అనే స్మృతి యొక్క నషాను ప్రత్యక్షం చేయండి.

మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి - విశ్వాధికారానికి అధికారి ఆత్మను అనే ఈ స్మృతి స్వతహాగా ఉంటుందా? సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా? ఈ సమయంలో అయితే అధికారం తీసుకోవడానికే గొడవలు జరుగుతున్నాయి మరియు మీ అందరికీ పరమాత్మ అధికారం జన్మతోనే లభించింది. కనుక మీ అధికారం యొక్క సమర్థతలో ఉండండి. స్వయం కూడా సమర్ధంగా ఉండండి మరియు సర్వాత్మలకు కూడా సమర్ధత ఇప్పించండి. సర్వాత్మలు ఈ సమయంలో సమర్థత అంటే సర్వశక్తులతో బికారీగా ఉన్నారు, మీ జడచిత్రాల ముందు అడుగుతున్నారు. కనుక బాబా అంటున్నారు - ఓ సమర్ధ ఆత్మలూ! సర్వాత్మలకు శక్తి, సమర్థతను ఇవ్వండి. దీనికొరకు కేవలం ఒక విషయం యొక్క ధ్యాన ప్రతి పిల్లవానికి చాలా అవసరం - దాని కొరకు బాప్ దాదా సైగ కూడా చేశారు, బాబా ఫలితంలో చూస్తే చాలా మంది పిల్లల యొక్క సంకల్పం మరియు సమయం వ్యర్ధంగా పోతున్నాయి. ఏవిధంగా అయితే కరెంట్ యొక్క కనక్షన్ కొద్దిగా లూజ్ అయినా లేక లీక్ అయినా కాంతి సరిగా రాదు అదేవిధంగా ఈ వ్యర్ధ లీకేజ్ సదాకాలికంగా సమర్ధంగా ఉండనివ్వదు అందువలన వేస్ట్  ని బెస్ట్ లోకి మార్చుకోండి. పొదుపు యొక్క స్కీమ్ తయారుచేయండి.

మొత్తం రోజంతటిలో సమయం, సంకల్పం ఎంత వేస్ట్ (వ్యర్థం) అయ్యాయి? బెస్ట్ (సమర్ధం) ఎంత అయ్యాయి? అని శాతం పరిశీలన చేసుకోండి. ఒకవేళ 40%, 20% వ్యర్ధం ఉన్నా దానికి కూడా రక్షించుకోండి. కొద్దిగానే వేస్ట్ అవుతుంది మొత్తం రోజంతా మంచిగానే ఉంటుంది అని అనుకోకండి. కానీ ఈ వ్యర్ధం అనే అలవాటు చాలా సమయం నుండి  అలవాటైపోయిన కారణంగా చివరి సమయంలో మోసపోతారు. ఈ వ్యర్థం నెంబర్ వన్ గా అవ్వనివ్వదు, నెంబర్ వార్ చేస్తుంది. బ్రహ్మాబాబా ప్రతిరోజూ రాత్రి తన పరిశీలన యొక్క దర్బార్ పెట్టుకునేవారు. ఎవరి దర్బార్ పెట్టేవారు? పిల్లల యొక్క దర్బార్ కాదు, తన కర్మేంద్రియాలు యొక్క దర్బార్ పెట్టుకునేవారు. ఆర్డర్తో నడిపించేవారు - ఓ మనస్సు ముఖ్యమంత్రి! నీ నడవడిక మంచిగా లేదు, ఆర్డర్లో నడు. ఓ సంస్కారమా! ఆర్డర్లో నడు. పైకి, క్రిందకి (అలజడి) ఎందుకు అవుతున్నావు, కారణం చెప్పు, నివారణ చేయి ఇలా బాబా అఫీషియల్ గా ప్రతి రోజు దర్బార్ పెట్టుకునేవారు. ఇలా మీ యొక్క దర్బార్ పెట్టుకోండి. స్వరాజ్యం యొక్క దర్బార్ పెట్టుకోండి. కొంతమంది పిల్లలు బాప్ దాదాతో మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. వ్యక్తిగతంగా చేస్తున్నారు. చెప్పమంటారా! కొంతమంది వ్యక్తిగతంగా అడుగుతున్నారు. మేము భవిష్యత్తులో ఏమౌతాము? మా యొక్క చిత్రం ఏమిటో చెప్పండి? అని. ఆదిలో జగదంబ మాతని పిల్లలందరు తమ యొక్క చిత్రం అడిగేవారు, మా చిత్రం ఎలా ఉంటుందో ఇవ్వండి అని. ఇది ఆది రత్నాలకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. అలాగే బాబాతో కూడా ఆత్మిక సంభాషణ చేస్తూ తమ యొక్క చిత్రం అడుగుతున్నారు. మీ అందరికీ కూడా మా చిత్రం ఏమిటో తెలిస్తే బావుంటుంది అనిపిస్తుంది కదా! కానీ బాప్ దాదా చెప్తున్నారు. బాబా ప్రతి ఒక పిల్లవానికి ఒక విచిత్ర దర్పణం ఇచ్చారు, ఆ దర్పణం ఏమిటి? వర్తమాన సమయంలో మీరు స్వరాజ్యాధికారులు కదా! స్వరాజ్యాధికారులేనా? అయితే చేతులు ఎత్తండి! కొద్ది మంది ఎత్తడం లేదు అంటే కొద్దిగా ఏమైనా ఉందా? మంచిది, స్వరాజ్యాధికారులే కదా, శుభాకాంక్షలు. స్వరాజ్యాధికారం యొక్క చార్ట్లో మీ భవిష్య పదవి యొక్క ముఖం చూపించే దర్పణం.

ఈ దర్పణం ఉందా? అందరికీ లభించింది కదా? క్లియర్ గా (స్పష్టంగా) ఉందా? ఏవిధమైన నల్లమచ్చలు లేవు కదా! నల్ల మచ్చలు అయితే ఉండవు కానీ అప్పుపడ్పుడు అద్దం వేడినీటి దగ్గర పెడితే మంచులా అవిరి పట్టేస్తుంది. అప్పుడు అద్దం సరిగా కనిపించదు. స్నానం చేసే సమయంలో ఈ విషయం గురించి అందరికీ అనుభవం ఉంటుంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైనా ఒక కర్మేంద్రియం అయినా పూర్తి కంట్రోల్లో లేకపోతే కంట్రోల్లో ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఉండకపోతే అది ఏ కర్మేంద్రియం అయినా కళ్ళు అయినా, నోరు అయినా, చెవులు అయినా, పాదాలు అయినా అప్పుడప్పుడు పాదాలు కూడా చెడు సాంగత్యం వైపు వెళ్ళిపోతాయి, కాళ్ళు కూడా కంట్రోల్లో ఉండవు కదా! అందరు కలిసి కూర్చున్నప్పుడు రామాయణ, భాగవత కథలు వింటూ ఉంటారు. వ్యర్ధమైనవి, మంచి విషయాలు కూడా కాదు. ఇలా సంకల్పం మరియు సమయం సహితంగా ఏ కర్మేంద్రియం అయినా కంట్రోల్లో లేకపోతే స్వరాజ్యంలోనే కంట్రోల్ లేకపోతే విశ్వరాజ్యాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? రాజుగా ఎలా అవుతారు? అక్కడైతే అన్నీ యాక్యురేట్ గా (విధిపూర్వకంగా) ఉంటాయి. కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ అన్నీ స్వతహాగా సంగమ యుగం యొక్క పురుషార్ధానికి ప్రాలబ్ధ రూపంలో లభిస్తాయి. కనుక సంగమయుగం అంటే వర్తమాన సమయంలో ఒకవేళ కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ తక్కువగా ఉంటే, పురుషార్ధం తక్కువగా ఉంటే ప్రాలబ్ధం ఏమి లభిస్తుంది? లెక్క పెట్టటంలో తెలివైనవారు కదా! ఈ దర్పణంలో మీ ముఖాన్ని చూసుకోండి. రాజాగా అయ్యే ముఖం కనిపిస్తుందా? రాయల్ ఫ్యామిలోకి వచ్చే ముఖం వస్తుందా? రాయల్ ప్రజలుగా అయ్యే ముఖం వస్తుందా? సాధారణ ప్రజలుగా అయ్యే ముఖం వస్తుందా ఏ ముఖం వస్తుంది? అనేది చూసుకోండి. చిత్రం లభించిందా? ఈ చిత్రంతో పరిశీలన చేసుకోవాలి. ప్రతి రోజు పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే చాలా సమయం యొక్క పురుషార్ధం చాలా సమయం యొక్క రాజ్యభాగ్యాన్ని ఇస్తుంది. మీరు ఒకవేళ అంతిమ సమయంలో బేహద్ వైరాగ్యం వచ్చేస్తుంది అని ఆలోచిస్తే అప్పుడది చాలా సమయం యొక్క పురుషార్ధం అవుతుందా లేక కొద్ది సమయం యొక్క పురుషార్ధం అవుతుందా? చాలా సమయం అని అనరు కదా! 21 జన్మలు పూర్తి రాజ్యాధికారి అవుతారా? సింహాసనంపై కూర్చోకపోయినా కానీ రాజ్యాధికారి అవుతారు కదా! ఇక్కడ చాలా సమయం యొక్క పురుషార్థానికి అక్కడ చాలా సమయం యొక్క ప్రాలబ్ధానికి సంబంధం ఉంది. అందువలన ఇప్పుడు ఇంకా వినాశనం యొక్క తారీఖు నిర్ణయం అవ్వలేదు ఎప్పుడవుతుందో తెలియదు అని సోమరిగా అవ్వవద్దు. 8 సంవత్సరాలలో అవుతుందో, 10 సంవత్సరాలలో అవుతుందో తెలియదు మున్ముందు తయారైపోతాము ఇలా ఆలోచించకండి. విశ్వం యొక్క అంతిమ సమయం గురించి ఆలోచించే ముందు మీ జన్మ యొక్క అంతిమ సమయం గురించి ఆలోచించండి. ఈ సమయంలో నాకు మృత్యువు వస్తుంది అని ఎవరి దగ్గరైనా తారీఖు ఉందా! ఎవరి దగ్గరైనా ఉందా? లేదు కదా! విశ్వం యొక్క అంతిమం అనేది సమయానికి అయిపోతుంది కానీ మొదట మీ అంతిమ సమయం గురించి ఆలోచించుకోండి.|జగదంబ సరస్వతి యొక్క స్లోగన్ స్మృతి తెచ్చుకోండి ఆ స్లోగన్ ఏమిటి? ప్రతి ఘడియ అంతిమ ఘడియగా భావించండి. అకస్మాత్తుగా జరుగుతుంది. తారీఖు చెప్పరు. విశ్వం యొక్క వినాశనానికి మరియు మీ యొక్క అంతిమ సమయానికి తారీఖు చెప్పరు. అన్నీ అకస్మాత్తుగా జరిగే ఆటలు. కనుక స్వరాజ్యాధికారి రాజులూ! మీ యొక్క దర్బార్ పెట్టుకోండి. ఆర్డర్తో నడిపించుకోండి.

భవిష్యత్తులో లా అండ్ ఆర్డర్ రాజ్యం నడుస్తుంది అని మహిమ ఉంది. అక్కడ స్వతహాగానే ఉంటుంది. లవ్ మరియు లా రెండు బ్యాలెన్స్ ఉంటాయి. స్వతహాగా ఉంటాయి. రాజు ఇది లా అని లా పాస్ చేయరు. ఈరోజులలో అందరు లా తయారు చేస్తున్నారు పోలీస్ వారు కూడా లా (నియమం) తీసుకుంటున్నారు కానీ అక్కడ లవ్ మరియు లా బ్యాలెన్స్ ఉంటాయి. ఇప్పుడు సర్వశక్తివాస సీట్ పై సెట్ అయ్యి ఉండండి. ఈ కర్మేంద్రియాలు, శక్తులు, గుణాలు అన్నీ మీకు చిత్తం ప్రభూ! అంటూ హాజరవుతాయి. మోసం చేయవు. ఇప్పుడేమి చేస్తారు? మరలా స్మృతిదినోత్సవం సమయానికి ఏ సమారోహం జరుపుకుంటారు? ప్రతి జోన్ వారు సమారోహం జరుపుకుంటున్నారు కదా! సన్మానం యొక్క సమారోహాలు చాలా జరుపుకున్నారు. ఇప్పుడు సదా ప్రతి సంకల్పం మరియు సమయం యొక్క సఫలత సమారోహం జరుపుకోండి. వ్యర్థం సమాప్తి అవ్వాలి ఎందుకంటే మీరు సఫలతామూర్తి అవ్వటం ద్వారా ఆత్మలకు తృప్తి యొక్క సఫలత లభిస్తుంది. నిరాశతో ఉన్న నలువైపుల ఆశాదీపం వెలుగుతుంది. దేనిలోనైనా సఫలత వస్తే జ్యోతి వెలిగిస్తారు కదా! ఇప్పుడు విశ్వంలో ఆశాదీపం వెలిగించండి. ప్రతి ఆత్మలో ఏదోక నిరాశ ఉంది. నిరాశల కారణంగా అలజడిలో, భయంలో ఉన్నారు. కనుక ఓ అవినాశి దీపాలు! ఇప్పుడు ఆశా దీపాల దీపావళి జరుపుకోండి. మొదట స్వయం తర్వాత సర్వుల సేవ చేయాలి. విన్నారా! బాప్ దాదా పిల్లల యొక్క స్నేహం చూసి సంతోషిస్తున్నారు. స్నేహం విషయంలో శాతం బావుంది. మీరు ఇంత శ్రమ చేసి ఇక్కడకి ఎందుకు చేరుకున్నారు మిమ్మల్ని రైలు తీసుకువచ్చిందా? విమానం తీసుకువచ్చిందా? స్నేహం తీసుకు వచ్చింది. స్నేహం అనే విమానం ద్వారా చేరుకున్నారు. స్నేహంలో అయితే పాస్ అయిపోయారు. ఇప్పుడు సర్వశక్తివాస్ స్థితిలో మాస్టర్ గా అవ్వాలి దానిలో పాస్ అవ్వాలి. ఈ ప్రకృతి, ఈ మాయ, ఈ సంస్కారాలు మీకు దాసీ అయిపోతాయి. యజమాని ఏ ఆజ్ఞ ఇస్తారు అని ఎదురు చూస్తాయి. బ్రహ్మాబాబా కూడా యజమాని అయ్యి లోలోపలే సూక్ష్మ పురుషార్ధం చేశారు ఆయన ఎలా సంపన్నంగా అయ్యారు అనేది మీకు తెలిసిందా? చిలుక ఎగిరిపోయింది. పంజరం ఎలా తెరుచుకుంది. సాకార ప్రపంచం యొక్క సాకారు తనువు యొక్క పంజరం తెరుచుకుంది చిలుక ఎగిరిపోయింది. ఇప్పుడు బ్రహ్మాబాబా కూడా చాలా దయ మరియు ప్రేమతో పిల్లలను తొందరగా రండి! ఇప్పుడే రండి! ఇప్పుడే రండి!! అని ఆహ్వానం చేస్తున్నారు. రెక్కలైతే లభించాయి కదా! అందరు ఒక సెకనులో మీ మనస్సులో ఈ డ్రిల్ చేయండి. ఇప్పుడిప్పుడే చేయండి. అన్ని సంకల్పాలు సమాప్తి చేయండి. ఓ బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా మేము నీ సమానంగా అవ్యక్త రూపధారి అయిపోయాము అని ఈ డ్రిల్ చేయండి. (డ్రిల్ చేయించారు)

నలువైపుల ఉన్నటువంటి స్నేహి నుండి సమర్థులైన పిల్లలకు, నలువైపుల ఉన్నటువంటి సరాజ్యాధికారి నుండి విశ్వరాజ్యాధికారి పిల్లలకు, నలువైపుల ఉన్నటువంటి మాష్టర్ సర్వశక్తివాన్ సీట్ పై సెట్ అయ్యి ఉండే తీవ్ర పురుషార్ధి పిల్లలకు, లేదా యజమాని ఆయ్యి ప్రకృతిని, సంస్కారాలకు,శక్తులను, గుణాలను ఆర్డర్ చేసే విశ్వ రాజ్యాధికారి పిల్లలకు, బాబా సమానంగా సంపూర్ణత మరియు సంపన్నత తీసుకువచ్చే దేశ, విదేశాలలో ప్రతి స్థానంలో కోనకోనల్లో ఉండే పిల్లలకు సమర్ధ దినోత్సవం యొక్క బాప్ యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments