31-12-1992 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు సాధనము - అన్నింటినీ సఫలము చేయండి’’
ఈ రోజు కొత్త-జీవితాన్ని ఇచ్చే రచయిత అయిన తండ్రి తమ కొత్త-జీవితాన్ని తయారుచేసుకునే పిల్లలను చూస్తున్నారు. ఈ కొత్త-జీవితము అనగా శ్రేష్ఠమైన బ్రాహ్మణ జీవితము ఉన్నదే కొత్త యుగాన్ని రచించడానికి. కావున ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క కొత్త జీవితము, కొత్త యుగాన్ని తీసుకురావడానికే ఉంది, ఆ యుగంలో అన్నీ కొత్తవే కొత్తవి ఉంటాయి. ప్రకృతి కూడా సతోప్రధానంగా అనగా కొత్తగా ఉంటుంది.
ప్రపంచం లెక్కలో వారు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు, కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలను ఇస్తారు మరియు పరస్పరం ఒకరికొకరు కొత్త సంవత్సరానికి గుర్తుగా కానుకలను కూడా ఇస్తారు. కానీ తండ్రి మరియు మీరు కొత్త యుగం యొక్క శుభాకాంక్షలను ఇస్తారు. సర్వాత్మలకు ఏ శుభవార్తను వినిపిస్తారంటే - ఇప్పుడు కొత్త యుగం అనగా బంగారు ప్రపంచమైన ‘సత్యయుగము’ లేక ‘స్వర్గము’ రానే వచ్చింది అని! ఈ సేవనే చేస్తారు కదా. ఈ శుభవార్తనే వినిపిస్తారు కదా. కొత్త యుగం యొక్క బంగారు కానుకను కూడా ఇస్తారు. ఏ కానుకను ఇస్తారు? అనేక జన్మలలో ప్రతి జన్మకు విశ్వ రాజ్య భాగ్యము. ఈ బంగారు కానుకలో అనేక కానుకలన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ ఈ నాటి ప్రపంచంలో ఎవరైనా అతి పెద్ద కానుకను లేక అతి గొప్ప కానుకను ఇచ్చినా కూడా, ఏమిస్తారు? ఒకవేళ ఎవరైనా ఎవరికైనా ఈ రోజుల్లోని కిరీటము లేక సింహాసనము ఇచ్చినా కూడా, అది మీ సతోప్రధాన బంగారు కానుక ఎదురుగా ఏపాటిది? అదేమైనా పెద్ద విషయమా?
నవ జీవన రచయిత అయిన తండ్రి పిల్లలైన మీ అందరికీ ఈ అమూల్యమైన అవినాశీ కానుకను ఇచ్చారు. అధికారులుగా అయ్యారు కదా. బ్రాహ్మణాత్మలు సదా తరగని నిశ్చయం యొక్క నషాతో ఏమంటారంటే - ఈ విశ్వ రాజ్య-భాగ్యము మా జన్మసిద్ధ అధికారము! ఇంతటి నషా ఉంది కదా లేక అప్పుడప్పుడు తగ్గుతుంది మరియు అప్పుడప్పుడు పెరుగుతుందా? ‘‘నిశ్చయముంది మరియు అది నిశ్చితము’’ - ఈ నిశ్చిత అధికారాన్ని ఎవ్వరూ తప్పించలేరు. నిశ్చయబుద్ధి కల ఆత్మల కొరకు ఇది నిశ్చితమైన విధి. నిశ్చితమే కదా లేక లభిస్తుందో లేదో అంటూ కొద్దిగా చింత ఉందా? ఎప్పుడైనా ఇటువంటి సంకల్పం వస్తుందా? ఒకవేళ బ్రాహ్మణులుగా అయ్యారంటే బ్రాహ్మణుల నుండి ఫరిశ్తాలుగా, ఫరిశ్తాల నుండి దేవతలుగా అవ్వడం నిశ్చితము. పక్కా నిశ్చయం ఉంది కదా లేక కొద్దిగా అలజడి ఉంటుందా? అచలంగా, స్థిరంగా ఉన్నారా? కనుక ఇటువంటి బంగారు కానుకను తండ్రి మీకు ఇచ్చారు, మరి మీరేమి చేస్తారు? ఇతరులకు ఇస్తారు. అల్పకాలికమైన కానుకైతే ఆ సమయం సమాప్తమవుతూనే కానుక కూడా సమాప్తమవుతుంది. కానీ ఈ అవినాశీ కానుక ప్రతి జన్మలో మీతో పాటు ఉంటుంది.
వాస్తవికంగా జరుపుకోవడమంటే కొత్త యుగాన్ని జరుపుకోవడము. కానీ ఈ సంగమయుగంలో ప్రతి రోజు జరుపుకునే రోజే, ప్రతి రోజు ఆనందంలో ఉండే రోజు, ప్రతి రోజు సంతోషమనే ఊయలలో ఊగే రోజు లేక సంతోషంలో నాట్యం చేసే రోజు, అవినాశీ పాటను పాడే రోజు, అందుకే బ్రాహ్మణ జీవితంలో ప్రతి రోజును జరుపుకుంటూ ఉంటారు. బ్రాహ్మణులకు ప్రతి రోజు ఉల్లాస-ఉత్సాహాలను పెంచే ఉత్సవము, అందుకే స్మృతిచిహ్న రూపంలో కూడా భారత్ లో అనేక ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటారు. భారత్ లో సంవత్సరంలోని అన్ని రోజులు జరుపుకునే రోజులే అన్నది ప్రసిద్ధము. భారత్ లో ఎన్ని ఉత్సవాలైతే ఉన్నాయో, అన్ని ఇంకెక్కడా ఉండవు. కావున ఇది బ్రాహ్మణులైన మీరు ప్రతి రోజు ఉత్సవం జరుపుకున్నందుకు స్మృతిచిహ్నము, అందుకే కొత్త సంవత్సరం యొక్క రోజును కూడా జరుపుకుంటున్నారు. కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. మరి కేవలం ఒక్క రోజే జరుపుకుంటారా? మొదటి తారీఖు సమాప్తమైతే జరుపుకోవడం కూడా సమాప్తమవుతుందా?
శ్రేష్ఠ ఆత్మలైన మీ కొత్త జన్మ యొక్క అనగా ఈ బ్రాహ్మణ జన్మ యొక్క శ్రేష్ఠ రాశి ఏమిటంటే - ప్రతి రోజు జరుపుకోవడము, ప్రతి రోజు ఉత్సవము. ప్రతి రోజు సదా శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా ఉంటుందని మీ జన్మపత్రిలో రాసి ఉంది. బ్రాహ్మణులైన మీ శ్రేష్ఠ రాశియే సదా ఎగిరే కళ. రెండు రోజులు చాలా బాగుండటము, మళ్ళీ రెండు రోజుల తర్వాత కాస్త తేడా ఉండటము, ఇలా ఉండకూడదు. మంగళవారం బాగుంటుంది, గురువారం అంతకన్నా బాగుంటుంది, శుక్రవారం మళ్ళీ విఘ్నం వస్తుంది - మీ రాశి ఇలాంటిదా? ఏదైతే జరుగుతూ ఉందో అది కూడా మంచిది మరియు ఏదైతే జరగబోతుందో అది ఇంకా మంచిది! దీనిని బ్రాహ్మణుల ఎగిరే కళ యొక్క రాశి అని అంటారు. బ్రాహ్మణ జీవితం యొక్క రాశి మారిపోయింది ఎందుకంటే కొత్త జన్మ కలిగింది కదా. కనుక ఈ సంవత్సరం ప్రతి రోజు మీ శ్రేష్ఠ రాశిని చూసి ప్రాక్టికల్ లోకి తీసుకురండి.
ప్రపంచం లెక్కలో ఇది కొత్త సంవత్సరం మరియు బ్రాహ్మణులైన మీ లెక్కలో విశేషంగా అవ్యక్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు. కొత్త సంవత్సరాన్ని అనగా అవ్యక్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నారు. కావున ఈ కొత్త సంవత్సరం లేక అవ్యక్త సంవత్సరం యొక్క విశేషమైన స్లోగన్ గా సదా ఇదే గుర్తుంచుకోండి - సదా సఫలతకు విశేషమైన సాధనం ఏమిటంటే ప్రతి సెకెండును, ప్రతి శ్వాసను, ప్రతి ఖజానాను సఫలం చేసుకోవడము. సఫలం చేసుకోవడమే సఫలతకు ఆధారము. ఏ రకమైన సఫలత కావాలన్నా, సంకల్పాలలోనైనా, మాటలలోనైనా, కర్మలలోనైనా, సంబంధ-సంపర్కంలోనైనా అన్ని రకాల సఫలతను అనుభవం చేయాలనుకుంటే సఫలం చేసుకుంటూ వెళ్ళండి, వ్యర్థంగా పోకూడదు. స్వయం పట్లనైనా సఫలం చేయండి, ఇతర ఆత్మల పట్లనైనా సఫలం చేయండి. అప్పుడు స్వతహాగా సఫలత యొక్క సంతోషాన్ని అనుభూతి చేస్తూ ఉంటారు ఎందుకంటే సఫలం చేయడం అనగా వర్తమానం కోసం సఫలత మరియు భవిష్యత్తు కోసం జమ చేసుకోవడము.
ఈ జీవితంలో ఎంతగా ‘సమయాన్ని’ సఫలం చేసుకుంటారో, సమయం యొక్క సఫలతకు ఫలస్వరూపంగా రాజ్య-భాగ్యం యొక్క పూర్తి సమయమంతా రాజ్యాధికారిగా అవుతారు. ప్రతి శ్వాసను సఫలం చేసుకుంటారు, దీని ఫలస్వరూపంగా అనేక జన్మలు సదా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడూ నడుస్తూ-నడుస్తూ ఉండగా శ్వాస ఆగిపోదు, హార్ట్ ఫెయిల్ అవ్వదు. ఒకటికి వేల రెట్ల సఫలత యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఈ విధంగానే అన్ని ఖజానాలను సఫలం చేసుకుంటూ ఉంటారు. అందులోనూ విశేషంగా జ్ఞాన ఖజానాను సఫలం చేసుకుంటారు. జ్ఞానము అనగా వివేకము. దీని ఫలస్వరూపంగా ఎంత వివేకవంతులుగా అవుతారంటే భవిష్యత్తులో అనేక మంత్రుల సలహాలను తీసుకోవాల్సిన అవసరం ఉండదు, స్వయమే వివేకవంతులుగా అయి రాజ్య భాగ్యాన్ని నడిపిస్తారు. రెండవ ఖజానా - సర్వ శక్తుల ఖజానా. శక్తుల ఖజానాను ఎంతగా కార్యంలో ఉపయోగిస్తారో, సఫలం చేసుకుంటారో అంతగా మీ భవిష్య రాజ్యంలో ఏ శక్తి యొక్క లోటూ ఉండదు. సర్వ శక్తులు స్వతహాగానే అఖండంగా, స్థిరంగా, నిర్విఘ్నంగా కార్యం యొక్క సఫలతను అనుభవం చేయిస్తాయి. ఏ శక్తి యొక్క లోటూ ఉండదు. ధర్మ సత్తా మరియు రాజ్య సత్తా రెండూ కలిసి-కలిసి ఉంటాయి. మూడవది - సర్వ గుణాల ఖజానా. దీని ఫలస్వరూపంగా ఎలాంటి గుణమూర్తులుగా అవుతారంటే నేడు చివరి సమయంలో కూడా మీ జడ చిత్రాలకు ‘సర్వగుణ సంపన్న దేవతలు’ అన్న రూపంలో మహిమ జరుగుతూ ఉంది. ఇలా ప్రతి ఖజానా యొక్క సఫలతకు ఫలస్వరూపం ఏమిటో మననం చేయండి. అర్థమయిందా? పరస్పరంలో ఈ విషయంపై ఆత్మిక సంభాషణ చేయండి. కావున ఈ అవ్యక్త సంవత్సరంలో సఫలం చేసుకోండి మరియు సఫలతను అనుభవం చేస్తూ ఉండండి.
ఈ అవ్యక్త సంవత్సరాన్ని విశేషంగా బ్రహ్మాబాబా స్నేహంలో జరుపుకుంటున్నారు. మరి స్నేహానికి గుర్తు ఏమిటంటే - స్నేహీకి ఏది ప్రియమో, స్నేహం చేసేవారికి కూడా అదే ప్రియమనిపించాలి. మరి బ్రహ్మాబాబాకు దేని పట్ల స్నేహముండేది? మురళి పట్ల. అన్నింటికన్నా ఎక్కువ ప్రేమ మురళి పట్ల ఉండేది కదా, అందుకే మురళీధరునిగా అయ్యారు. అందుకే భవిష్యత్తులో కూడా మురళీధరునిగా అయ్యారు. మురళి పట్ల ప్రేమ ఉంది కావున భవిష్య శ్రీకృష్ణుని రూపంలో కూడా ‘మురళి’ని గుర్తుగా చూపిస్తారు. కనుక తండ్రికి దేనిపై ప్రేమ ఉందో, దానిపై ప్రేమ ఉండడము, ఇదే ప్రేమకు గుర్తు. అంతేకానీ బ్రహ్మాబాబాపై మాకు చాలా ప్రేమ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది అని కేవలం చెప్పేవారిగా అవ్వకూడదు. ప్రేమకు గుర్తు ఏమిటి? బ్రహ్మాబాబాకు దేనిపై ప్రేమ ఉండేదో మరియు ఇప్పుడు కూడా ఉందో, దాని పట్ల ప్రేమ సదా కనిపించాలి. అటువంటివారినే బ్రహ్మాబాబాకు ప్రియమైనవారని అంటారు. లేదంటే నంబరువారుగా ప్రియమైనవారని అంటారు. నంబరువన్ అని అనరు, నంబరువారు అని అంటారు. అవ్యక్త సంవత్సరం యొక్క లక్ష్యము ఏమిటంటే - తండ్రిపై ప్రేమకు గల గుర్తులను ప్రాక్టికల్ లో చూపించాలి. ఇదే జరుపుకోవడము. దీనినే మీరు మరో మాటలో తండ్రి సమానంగా అవ్వడము అని అంటారు.
ఏ కర్మ చేసినా విశేషంగా అండర్లైన్ చేసుకోండి - కర్మ కన్నా ముందు, మాట కన్నా ముందు, సంకల్పం కన్నా ముందు - ఇది బ్రహ్మాబాబా సమానంగా ఉందా, ఇది ప్రేమకు గుర్తుగా ఉందా? అని చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఆ సంకల్పాన్ని స్వరూపంలోకి తీసుకురండి, మాటను నోటి ద్వారా మాట్లాడండి, కర్మలు కర్మేంద్రియాల ద్వారా చేయండి. మొదట చెక్ చేసుకోండి, ఆ తర్వాత ప్రాక్టికల్ గా చేయండి. అంతేకానీ అనుకోలేదు కానీ జరిగిపోయింది అన్నట్లు ఉండకూడదు. అలా కాదు. బ్రహ్మాబాబా యొక్క విశేషమైన విశేషత ఏమిటంటే - ఏది ఆలోచించారో అదే చేసారు, ఏది చెప్పారో అదే చేసారు. కొత్త జ్ఞానము అయిన కారణంగా ఎంతగా అపోజిషన్ ఉన్నా కానీ, తమ స్వమానం యొక్క స్మృతితో, తండ్రి తోడు యొక్క సమర్థతతో మరియు దృఢత, నిశ్చయం అనే శస్త్రాలతో, శక్తితో తమ పొజిషన్ అనే సీటుపై సదా అచలంగా, స్థిరంగా ఉన్నారు. కావున ఎక్కడైతే పొజిషన్ ఉంటుందో అక్కడ అపోజిషన్ ఏం చేస్తుంది. అపోజిషన్ అనేది పొజిషన్ ను దృఢంగా చేస్తుంది. అది కదిలించదు, మరింత దృఢంగా చేస్తుంది. విజయులుగా అయ్యారు అన్నందుకు ప్రాక్టికల్ ఋజువు స్వయంగా మీరే, నలువైపులా జరుగుతున్న సేవ కూడా ఋజువుగా ఉంది. ఎవరైతే మిమ్మల్ని మొదట్లో - వీరు అల్లకల్లోలం చేసేవారు అని అన్నారో, వారే ఇప్పుడు అద్భుతం చేసి చూపించారు అని అంటున్నారు! మరి ఇది ఎలా జరిగింది? అపోజిషన్ ను శ్రేష్ఠ పొజిషన్ ద్వారా సమాప్తం చేసారు.
కావున ఇప్పుడీ సంవత్సరంలో ఏం చేస్తారు? ఏ విధంగానైతే బ్రహ్మాబాబా నిశ్చయం ఆధారంగా, ఆత్మిక నషా ఆధారంగా నిశ్చితమైన విధి యొక్క జ్ఞానిగా అయి సెకండులో అంతా సఫలం చేసారు, తమ కోసం అంటూ ఏమీ ఉంచుకోలేదు, సఫలం చేసేసారు. దీని ప్రత్యక్ష ఋజువు ఏమి చూసారంటే - చివరి రోజు వరకు తనువు ద్వారా ఉత్తరాల ద్వారా సేవ చేసారు, నోటి ద్వారా మహావాక్యాలు ఉచ్చరించారు. చివరి రోజున కూడా సమయాన్ని, సంకల్పాలను మరియు శరీరాన్ని సఫలం చేసారు. కనుక స్నేహానికి గుర్తు - సఫలం చేయడము. సఫలం చేయడమంటే అర్థమే శ్రేష్ఠం వైపు ఉపయోగించడము. కావున ఎప్పుడైతే సఫలత యొక్క లక్ష్యం పెట్టుకుంటారో అప్పుడు వ్యర్థం స్వతహాగానే సమాప్తమవుతుంది. ఏ విధంగానైతే ప్రకాశంతో అంధకారం స్వతహాగా సమాప్తమవుతుంది. ఒకవేళ అంధకారాన్ని తొలగించాలి అని అదే ఆలోచిస్తూ ఉంటే సమయం కూడా వ్యర్థమవుతుంది, శ్రమ కూడా వ్యర్థమవుతుంది. ఇలాంటి శ్రమ చేయకండి. ఈ రోజు క్రోధం వచ్చింది. ఈ రోజు లోభం వచ్చింది. ఈ రోజు వ్యర్థం విన్నాను, మాట్లాడాను, ఈ రోజు వ్యర్థంగా గడిచిపోయింది... ఇలా ఆలోచిస్తూ-ఆలోచిస్తూ శ్రమ చేస్తూ నిరాశ చెందుతారు. కానీ ‘‘సఫలం చేయాలి’’ - ఈ లక్ష్యంతో వ్యర్థం స్వతహాగానే సమాప్తమవుతుంది. సఫలం చేసుకోవాలనే లక్ష్యం పెట్టుకోవడమనగా ప్రకాశాన్ని తీసుకురావడము. అప్పుడు అంధకారం స్వతహాగానే సమాప్తమవుతుంది. అవ్యక్త సంవత్సరంలో ఏం చేయాలో అర్థమయిందా? నంబరువన్ ప్రియమైనవారిగా అవుతారా లేక నంబరువారు ప్రియమైనవారిగా అవుతారా అని బాప్ దాదా కూడా చూస్తారు. అందరూ నంబరువన్ గా అవుతారా? డబల్ విదేశీయులు ఏమవుతారు? నంబరువన్ గా అవుతారా? ‘నంబరువన్’ అని అనడం చాలా సులభము! కానీ లక్ష్యము దృఢంగా ఉంటే లక్షణాలు తప్పకుండా వస్తాయి. లక్ష్యము అనేది లక్షణాలను ఆకర్షిస్తుంది. ఇప్పుడు పరస్పరంలో ప్లాన్ తయారుచేయండి, ఆలోచించండి. బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఒకవేళ అందరూ నంబరువన్ గా అయితే చాలా సంతోషము. ఫస్ట్ డివిజన్ అయితే చాలా పెద్దది, అలా తయారవ్వచ్చు. ఫస్ట్ డివిజన్ లో అందరూ ఫస్ట్ లో ఉంటారు. కనుక కొత్త సంవత్సరంలో అందరూ నంబరువన్ గా అవ్వబోతున్నందుకు శుభాకాంక్షలు.
వ్యర్థంపై విన్ అయితే (విజయం పొందితే) వన్ లోకి వస్తారు. వ్యర్థంపై విన్ అవ్వకపోతే వన్ గా అవ్వలేరు. ఇప్పటికీ వ్యర్థం యొక్క ఖాతా ఉంది - కొందరికి సంకల్పాలలో, కొందరికి మాటలలో, కొందరికి సంబంధ-సంపర్కంలో వ్యర్థ ఖాతా ఉంది. ఇప్పుడింకా పూర్తి ఖాతా సమప్తమవ్వలేదు, అందుకే అప్పుడప్పుడు బయటకు వస్తుంది. కానీ లక్ష్యమనేది మీ గమ్యాన్ని తప్పకుండా ప్రాప్తి చేయిస్తుంది. వ్యర్థానికి స్టాప్ అని చెప్పగానే అది స్టాప్ అవ్వాలి. ఎప్పుడైతే స్టాప్ చేసే శక్తి వస్తుందో, అప్పుడు పాత ఖాతా యొక్క స్టాక్ ఏదైతే ఉందో, అది సమాప్తమవుతుంది. అంతటి శక్తి ఉండాలి. ఇది పరమాత్మ-సిద్ధి. రిద్ధి-సిద్ధి వారు అల్పకాలికమైన చమత్కారాన్ని చూపిస్తారు మరియు పరమాత్మ-సిద్ధి కలవారు సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. పరమాత్మ-సిద్ధి ఏం చేయలేదు! ‘స్టాప్’ అని ఆలోచించగానే స్టాప్ అవుతుంది. ఇంతటి శక్తి ఉందా? లేదా స్టాప్ అని అన్న తర్వాత కూడా స్టాప్ అయ్యేందుకు 1-2 రోజులు పడుతుందా, లేక ఒక గంట లేక 10 గంటలు కూడా పడుతుందా? స్టాప్ అంటే స్టాప్, అంతే. ఈ గుర్తును బాబాకు చూపించాలి. అర్థమయిందా?
సేవ యొక్క సఫలత లేక ప్రత్యక్షత అయితే డ్రామానుసారంగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పెరుగుతూ ఉంది కదా. ఇంతకుముందు మీరు ఆహ్వానించేవారు, ఇప్పుడు వారు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. కనుక సేవా సఫలత యొక్క ప్రత్యక్షత జరుగుతుంది కదా. మీకు ఎటువంటి స్టేజు లేక డిగ్రీ లభించాల్సిన అవసరం లేదు, ఇది సేవ యొక్క ప్రత్యక్షత. భగవంతుడు ఇచ్చే డిగ్రీ ముందు ఈ డిగ్రీ ఏపాటిది. (ఉదయపూర్ విశ్వవిద్యాలయం వారు దాదీజీకి గౌరవనీయ డాక్టరేట్ డిగ్రీ ఇచ్చారు). కానీ ఇది కూడా ప్రత్యక్షత యొక్క సాధనము. సాధనము ద్వారా సేవ యొక్క ప్రత్యక్షత జరుగుతూ ఉంది. అంతా రెడీగా ఉన్న స్టేజు లభించేదే ఉంది. ధర్మ నేతలు మిమ్మల్ని ఆహ్వానించి మిమ్మల్నే ముఖ్య అతిథిగా చేసే రోజు కూడా వచ్చేదే ఉంది. ఇప్పుడు కొద్దిగా బాహ్య రూపురేఖల కోసం వారు ముఖ్య అతిథిగా ఉండాల్సి వస్తుంది, కానీ లోపల వారు అనుభూతి చేస్తారు - ఈ పవిత్ర ఆత్మలకు సీటు లభించాలి అని. రాజకీయ నేతలైతే ఇలా అంటారు కూడా - మీరు మమ్మల్ని ముఖ్య అతిథిగా చేస్తున్నారు కానీ మీరే ముఖ్య అతిథిగా అయితే చాలా బాగుంటుంది అని. కానీ డ్రామాలో పేరు వచ్చేది వారికి, పని జరిగేది మీది.
ఎలాగైతే సేవలో ప్రత్యక్షత జరుగుతూ ఉందో, విధి మారుతూ ఉందో, అలా ప్రతి ఒక్కరూ స్వయంలో సంపూర్ణతను మరియు సంపన్నతను ప్రత్యక్షం చేయండి. ఇప్పుడు దీని అవసరం ఉంది మరియు తప్పకుండా సంపన్నమయ్యేదే ఉంది. కల్ప-కల్పము సఫలత అయ్యే ఉంది అని మీ గుర్తు ఋజువు చేస్తుంది. ఈ విజయ మాల ఏమిటి? విజయులుగా అయ్యారు, సఫలతా మూర్తులుగా అయ్యారు, అందుకే ఈ గుర్తు ఉంది కదా! ఈ విధిని తప్పించలేరు. ఇప్పుడింకా అంతగా తయారవ్వలేదు, ఇప్పుడింకా ఘర్షణ జరుగుతూ ఉంది అని ఎవరెంతగా అనుకున్నా కానీ, ఇందులో భయపడాల్సిన అవసరం లేదు. కల్ప-కల్పపు సఫలత యొక్క గ్యారంటీ ఈ స్మృతి చిహ్నము. ‘ఏమవుతుంది’, ‘ఎలా అవుతుంది’ అనే ప్రశ్నార్థకాల అవసరం కూడా లేదు. అవ్వాల్సిందే. ఇది నిశ్చితమై ఉంది కదా. నిశ్చితమైన విధిని ఎవ్వరూ కదిలించలేరు. ఒకవేళ నావ మరియు నావికుడు దృఢంగా ఉంటే ఎలాంటి తుఫాను అయినా ముందుకు తీసుకువెళ్ళేందుకు సాధనంగా అవుతుంది. తుఫాను కూడా కానుకగా అవుతుంది, అందుకే మధ్యమధ్యలో ఇలాంటి ఉపకథలు జరుగుతూ ఉంటాయి. కానీ ఖచ్చితమైన విధి నిశ్చితమై ఉంది. ఇంతటి నిశ్చయముందా? లేదా ఎప్పుడైనా కొద్దిగా కింద-మీద అవ్వడం చూస్తే ‘ఎలా అవుతుందో, ఎప్పుడవుతుందో తెలియదు’ అని భయపడతారా? ప్రశ్నార్థకం వస్తుందా? ఈ తుఫానే కానుకగా అవుతుంది. అర్థమయిందా? ఇటువంటి వారిని నిశ్చయబుద్ధి విజయీ అని అంటారు. కేవలం ఫాలో ఫాదర్ చేయండి. అచ్ఛా!
స్థిరమైన నిశ్చయబుద్ధి కల విజయీ ఆత్మలందరికీ, సదా ప్రతి ఖజానాను సఫలం చేసుకునే సఫలతామూర్త్ ఆత్మలకు, సదా ప్రతి అడుగులో బ్రహ్మాబాబాను సహజంగా ఫాలో చేసేవారికి, సదా కొత్త జీవితము మరియు కొత్త యుగము యొక్క స్మృతిలో ఉండే సమర్థ ఆత్మలకు, సదా స్వయంలో తండ్రి స్నేహం యొక్క గుర్తులను ప్రత్యక్షం చేసే విశేష ఆత్మలకు, శ్రేష్ఠ పరివర్తన మరియు అవ్యక్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు, ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో మిలనము - డ్రామా దృశ్యాన్ని చూసి హర్షిస్తున్నారు కదా. ‘‘వాహ్ డ్రామా వాహ్! వాహ్ బాబా వాహ్!...’’ ఈ పాటయే అనాదిగా, అవినాశీగా నడుస్తూ ఉంటుంది. పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు మరియు తండ్రి శక్తిసేనను ప్రత్యక్షం చేస్తారు. మంచి సేవ జరిగింది. కొత్త రూపురేఖలు రావాల్సిందే. ఇలాగే అందరి నోటి నుండి ‘‘బాబా- బాబా’’ అన్న మాట వెలువడుతూ ఉండాలి ఎందుకంటే వారు విశ్వపిత. కనుక బ్రాహ్మణాత్మల హృదయం నుండి, నోటి నుండి అయితే ‘బాబా’ అని వెలువడుతూనే ఉంటుంది, కానీ సర్వాత్మల హృదయం నుండి మరియు నోటి నుండి ‘‘బాబా’’ అని వెలువడాలి, అప్పుడే సమాప్తి జరుగుతుంది కదా. ‘‘ఓహో ప్రభూ’’ అన్న రూపంలో వెలువడినా లేక ‘‘వాహ్ బాబా’’ అన్న రూపంలో వెలువడినా కానీ ‘బాబా’ అనే పదం యొక్క పరిచయమైతే లభించాల్సిందే. ఒక మైక్ ఎంత సేవ చేయగలరు అన్న సేవా సాధనాన్ని ఇప్పుడు అనుభవం చేసారు. సందేశమిచ్చే కార్యమైతే తప్పకుండా జరుగుతుంది కదా. కావున ఇప్పుడు మైక్ లను తయారుచేయాలి. వీరు (రాజస్థాన్ గవర్నర్ డాక్టర్.ఎమ్.చెన్నారెడ్డి) ఒక శ్యాంపుల్ వంటి వారు. మైక్ ను తయారుచేయడంలోనైతే భారత్ నంబరును తీసుకున్నారు. ఇప్పుడు ఇలాంటివారిని తయారుచేయాలి! రాజస్థాన్ యొక్క మైక్ ను ఆబూ తయారుచేసింది, రాజస్థాన్ కాదు. బాణమైతే ఆబూ నుండి తగిలింది కదా. అచ్ఛా!
Comments
Post a Comment