30-11-1992 అవ్యక్త మురళి

 30-11-1992         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 ‘‘సర్వ ఖజానాలతో సంపన్నంగా అవ్వండి - ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి’’

ఈ రోజు సర్వ ఖజానాల యజమాని తమ సంపన్న పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరికీ అనేక రకాల అవినాశీ తరగని ఖజానాలు లభించాయి మరియు ఆ ఖజానాలు ఎటువంటివంటే, ఆ సర్వ ఖజానాలు ఇప్పుడు కూడా ఉన్నాయి మరియు ఇక ముందు కూడా అనేక జన్మలు ఆ ఖజానాలతో పాటు ఉంటారు. ఏ-ఏ ఖజానాలు మరియు ఎన్నెన్ని లభించాయి అన్నది తెలుసా? ఖజానాల ద్వారా సదా ప్రాప్తి కలుగుతుంది. ఖజానాలతో సంపన్నంగా ఉన్న ఆత్మ సదా నిండుతనం యొక్క నషాలో ఉంటుంది. సంపన్నత యొక్క మెరుపు వారి ముఖంపై మెరుస్తుంది మరియు ప్రతి కర్మలో సంపన్నత యొక్క మెరుపు స్వతహాగానే కనిపిస్తుంది. ఈ సమయంలోని మనుష్యాత్మలకు వినాశీ ఖజానాల ప్రాప్తి ఉంది, అందుకే కొంత సమయం నషా ఉంటుంది, సదా ఉండదు. అందుకే ప్రపంచంలోని వారు ‘ఖాళీ అయి వెళ్ళాలి’ అని అంటారు మరియు మీరు ‘నిండుగా అయి వెళ్ళాలి’ అని అంటారు. మీ అందరికీ బాప్ దాదా అనేక ఖజానాలు ఇచ్చారు. అన్నింటికన్నా శ్రేష్ఠమైన మొదటి ఖజానా - జ్ఞాన రత్నాల ఖజానా. అందరికీ ఈ ఖజానా లభించింది కదా. ఎవరూ వంచితులుగా ఉండిపోలేదు కదా. ఈ జ్ఞాన రత్నాల ఖజానా ద్వారా విశేషంగా ఏ ప్రాప్తిని పొందుతున్నారు? జ్ఞాన ఖజానా ద్వారా ఈ సమయంలో కూడా ముక్తి-జీవన్ముక్తిని అనుభూతి చేస్తున్నారు. ముక్తిధామములోకి వెళ్తారు మరియు జీవన్ముక్త దైవీ పదవిని ప్రాప్తి చేసుకుంటారు - ఇది భవిష్యత్తుకు సంబంధించిన విషయము. కానీ ఇప్పుడు కూడా ముక్త జీవితాన్ని అనుభవం చేస్తున్నారు. ఎన్ని విషయాల నుండి ముక్తులుగా ఉన్నారో తెలుసా? దుఃఖము మరియు అశాంతి యొక్క కారణాలుగా ఏవైతే ఉన్నాయో, వాటి నుండి ముక్తులుగా అయ్యారా లేక ఇప్పుడింకా ముక్తులుగా అవ్వాలా? ఇప్పుడు ఏ వికారము రాదా? ముక్తులుగా అయిపోయారు. ఒకవేళ వచ్చినా కానీ విజయులుగా అవుతారు కదా. కనుక ఎన్ని విషయాల నుండి ముక్తులుగా అయ్యారు! లౌకిక జీవితము మరియు అలౌకిక జీవితము - రెండింటిని పక్కపక్కన పెడితే ఎంత తేడా కనిపిస్తుంది! కనుక ఇప్పుడు ముక్తిని కూడా ప్రాప్తి చేసుకున్నారు మరియు జీవన్ముక్తిని కూడా అనుభవం చేస్తున్నారు. అనేక వ్యర్థ సంకల్పాలు మరియు వికల్పాలు, వికర్మల నుండి ముక్తులుగా అవ్వడము, ఇదే జీవన్ముక్త అవస్థ. ఎన్ని బంధనాల నుండి ముక్తులుగా అయ్యారు? మనుష్యాత్మలు ఎన్ని బంధనాల తాళ్ళతో బంధింపబడి ఉన్నారు అన్నది చిత్రంలో చూపిస్తారు కదా! ఇది ఎవరి చిత్రము? మీరైతే వారు కాదు కదా. మీరైతే ముక్తులుగా ఉన్నారు కదా. కావున జీవితంలో ఉంటూ జీవన్ముక్తులుగా అయ్యారు. కనుక జ్ఞాన ఖజానా ద్వారా విశేషంగా ముక్తి-జీవన్ముక్తుల ప్రాప్తిని అనుభవం చేస్తున్నారు. రెండవది - స్మృతి అనగా యోగం ద్వారా సర్వ శక్తుల ఖజానాను అనుభవం చేస్తున్నారు. ఎన్ని శక్తులున్నాయి? చాలా ఉన్నాయి కదా! అష్ట శక్తులనైతే ఒక శ్యాంపుల్ రూపంలో చూపిస్తారు కానీ సర్వ శక్తుల ఖజానాలకు యజమానులుగా అయ్యారు. మూడవది - ధారణా సబ్జెక్టు ద్వారా ఏ ఖజానా లభించింది? సర్వ దివ్య గుణాల ఖజానా. గుణాలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. కావున సర్వ గుణాల ఖజానా. ప్రతి గుణం మరియు ప్రతి శక్తి యొక్క విశేషత ఎంత గొప్పది! ప్రతి జ్ఞాన రత్నం యొక్క మహిమ ఎంత గొప్పది! నాల్గవ విషయము - సేవ ద్వారా సదా సంతోషం యొక్క ఖజానాను అనుభూతి చేస్తారు. ఏ సేవ చేసినా దాని ద్వారా విశేషంగా ఏం అనుభవమవుతుంది? సంతోషం కలుగుతుంది కదా. కనుక అన్నింటికన్నా పెద్ద ఖజానా అవినాశీ సంతోషము. కావున సంతోషపు ఖజానా సహజంగా, స్వతహాగా ప్రాప్తిస్తుంది. ఐదవది - సంబంధ-సంపర్కాల ద్వారా బ్రాహ్మణ పరివారం యొక్క సంపర్కంలోకి కూడా వస్తారు, సేవ యొక్క సంబంధంలోకి కూడా వస్తారు. కనుక సంబంధ-సంపర్కం ద్వారా ఏ ఖజానా లభిస్తుంది? సర్వుల ఆశీర్వాదాల ఖజానా లభిస్తుంది. ఈ ఆశీర్వాదాల ఖజానా చాలా పెద్ద ఖజానా. ఎవరైతే సర్వుల ఆశీర్వాదాల ఖజానాతో నిండుగా ఉంటారో, సంపన్నంగా ఉంటారో, వారెప్పుడూ పురుషార్థంలో శ్రమ చేయాల్సిన అనవసరం ఉండదు. మొదటగా మాత-పిత యొక్క ఆశీర్వాదాలు, మరియు దానితో పాటు సర్వుల సంబంధంలోకి రావడంతో సర్వుల ద్వారా లభించే ఆశీర్వాదాలు. అన్నింటికన్నా అత్యంత పెద్ద, తీవ్ర వేగంతో ముందుకు ఎగిరేందుకు వేగవంతమైన యంత్రము - ‘ఆశీర్వాదాలు’. ఏ విధంగానైతే సైన్స్ లో అన్నింటికన్నా అత్యంత ఎక్కువ తీవ్ర వేగం కలిగినది - రాకెట్. కానీ ఆశీర్వాదాల రాకెట్ దాని కన్నా శ్రేష్ఠమైనది. విఘ్నము కొద్దిగా కూడా స్పర్శించదు, విఘ్న ప్రూఫ్ గా అవుతారు. యుద్ధం చేయాల్సిన అవసరముండదు. ప్రతి కర్మ, మాట, సంకల్పము యోగయుక్తంగా, యుక్తియుక్తంగా సహజంగా స్వతహాగానే అవుతాయి. ఈ ఆశీర్వాదాల ఖజానా అటువంటిది. అన్నింటికన్నా పెద్ద ఖజానా ఈ సంగమయుగ సమయం యొక్క ఖజానా.

వాస్తవానికి ఖజానాలైతే చాలా ఉన్నాయి. కానీ ఏ ఖజానాలనైతే వినిపించానో, కేవలం ఈ ఖజానాలను మీ లోపల ఇముడ్చుకునే శక్తిని ధారణ చేస్తే, సదా సంపన్నంగా ఉన్న కారణంగా కొద్దిగా కూడా అలజడి ఉండదు. ఖాళీగా ఉన్నప్పుడే అలజడి కలుగుతుంది. నిండుగా ఉన్న ఆత్మ ఎప్పుడూ చలించదు. కనుక సర్వ ఖజానాలను స్వయంలో ఇముడ్చుకున్నానా అని ఈ ఖజానాలను చెక్ చేసుకోండి. ఈ అన్ని ఖజానాలతో నిండుగా ఉన్నారా? లేక కొన్నింటిలో నిండుగా ఉండి, కొన్నింటిని ఇప్పుడింకా కొద్దిగా నింపుకోవాలా? ఖజానాలైతే అందరికీ లభించాయి కదా. ఒక్కరి ద్వారా ఒకే విధమైన ఖజానాలు అందరికీ లభించాయి. వేర్వేరుగా అయితే పంచలేదు కదా. ఒకరికి లక్ష, మరొకరికి కోటి ఇవ్వడము - ఇలా అయితే కాదు కదా? మొదటి రకం వారు - కేవలం తీసుకునేవారు. ఏది లభిస్తే అది తీసుకుంటారు కూడా, కానీ లభిస్తూనే తింటారు, తాగుతారు, ఆనందపడతారు, సమాప్తం చేసేస్తారు. రెండవ వారు - లభించిన ఖజానాలను జమ చేసుకునేవారు - వారు తింటారు, తాగుతారు, ఆనందపడతారు మరియు జమ కూడా చేసుకుంటారు. మూడవ వారు - జమ కూడా చేసుకుంటారు, తింటారు, తాగుతారు కూడా కానీ లభించిన ఖజానాలను ఇంకా పెంచుకుంటూ వెళ్తారు. తండ్రి ఖజానాలను తమ ఖజానాలుగా చేసుకుని పెంచుకుంటూ వెళ్తారు. కావున ‘నేను ఎవరు’ అన్నది చూసుకోవాలి - మొదటి నంబరువారినా, రెండవ నంబరువారినా లేక మూడవ నంబరువారినా?

ఎంతగా ఖజానాలను స్వయం యొక్క కార్యంలో లేక ఇతరుల పట్ల సేవా కార్యంలో ఉపయోగిస్తారో, అంతగా ఖజానాలు పెరుగుతాయి. ఖజానాలను పెంచుకునే తాళంచెవి - వాటిని ఉపయోగించడము. మొదట స్వయం పట్ల. ఏ విధంగానైతే జ్ఞానం యొక్క ఒక్కొక్క రత్నాన్ని సమయానికి స్వయం పట్ల ఉపయోగిస్తే, ఆ ఖజానాను ఉపయోగించడంతో అనుభవీలుగా అవుతారు. ఖజానాల ప్రాప్తి ఏదైతే ఉందో, అది జీవితంలో అనుభవం యొక్క ‘అథారిటీ’ గా అవుతుంది. కనుక అథారిటీ యొక్క ఖజానా అదనంగా (జమ) అవుతుంది. కనుక పెరిగాయి కదా. కేవలం వినడము వేరే విషయము. వినడము అంటే తీసుకోవడము కాదు. ఇముడ్చుకోవడము మరియు సమయానికి కార్యంలో ఉపయోగించడము - ఇది తీసుకోవడము. వినేవారు ఏం చేస్తారు మరియు ఇముడ్చుకునేవారు ఏం చేస్తారు - ఇరువురిలో చాలా గొప్ప వ్యత్యాసముంది.

వినేవారి దృశ్యాన్ని చూసినప్పుడు బాప్ దాదా చిరునవ్వు నవ్వుతారు. వినేవారు ఆ సమయానికి పరిస్థితి అనుసారంగా లేక విఘ్నం అనుసారంగా, సమస్య అనుసారంగా పాయింట్లను గుర్తు చేసుకుంటారు - బాప్ దాదా ఈ విఘ్నాన్ని దాటేందుకు ఈ-ఈ పాయింట్లు ఇచ్చారు అని. ఇలా చేయాలి, ఇలా చేయకూడదు - రిపీట్ చేస్తూ, గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒక వైపు పాయింటును రిపీట్ చేస్తూ ఉంటారు, మరోవైపు వశీభూతులుగా కూడా అవుతూ ఉంటారు. ఏమని అంటూ ఉంటారంటే - ఇలా చేయకూడదు, ఇది జ్ఞానం కాదు, ఇది దివ్య గుణం కాదు, ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయాలి, ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు అని. రిపీట్ కూడా చేస్తూ ఉంటారు కానీ ఫెయిల్ కూడా అవుతూ ఉంటారు. ఒకవేళ ఆ సమయంలో కూడా, వారిని - ఇది కరక్టేనా అని అడిగితే, కరెక్ట్ కాదు కానీ జరిగిపోతుంది అని జవాబిస్తారు. చెప్తూ కూడా ఉంటారు, మర్చిపోతూ కూడా ఉంటారు. మరి వారిని ఏమంటారు? వినేవారు. వినడం చాలా బాగా అనిపిస్తుంది. పాయింట్ చాలా శక్తిశాలి అయినది అని అంటారు. కానీ ఉపయోగించే సమయంలో ఒకవేళ శక్తిశాలి పాయింటు విజయీగా చేయకపోతే లేక సగం విజయీగా చేస్తే, అటువంటివారిని ఏమంటారు? వినేవారు అని అంటారు కదా.

ఇముడ్చుకునేవారు ఏదైనా పరిస్థితి లేక సమస్య ఎదురుగా వస్తే త్రికాలదర్శి స్థితిలో స్థితులై స్వ-స్థితి ద్వారా పర-స్థితిని అసలేమీ లేనే లేదు అనే విధంగా దాటేస్తారు. దీనినే ఇముడ్చుకోవడము అనగా సమయానికి కార్యంలో ఉపయోగించడము, సమయమనుసారంగా ప్రతి శక్తిని, ప్రతి పాయింటును, ప్రతి గుణాన్ని ఆజ్ఞానుసారంగా నడిపించడము అని అంటారు. ఏ విధంగా ఏదైనా స్థూల ఖజానా ఉంటే, ఆ ఖజానాను ఖజానా స్వయానికి ఉపయోగించదు, ఆ ఖజానాను ఉపయోగించేది మనుష్యాత్మలు. వారు ఎప్పుడు కావాలో, ఎంత కావాలో, ఎలా కావాలో, అలా ఉపయోగించుకోగలరు. అదే విధంగా ఈ సర్వ ఖజానాలన్నీ ఏవైతే వినిపించామో, వాటికి యజమాని ఎవరు? మీరా లేక ఇతరులా? యజమాని కదా. యజమాని పని ఏమిటి? ఖజానా వారిని నడిపిస్తుందా లేక వారు ఖజానాను నడిపిస్తారా? కనుక ఇలా ప్రతి ఖజానాకు యజమానిగా అయి సమయానికి జ్ఞానిగా అనగా వివేకవంతులుగా, జ్ఞాన సంపన్నులుగా, త్రికాలదర్శులుగా అయి ఖజానాలను కార్యంలో ఉపయోగించండి. అంతేకానీ, సమయానికి సహనశక్తిని ఆజ్ఞాపిస్తే ఆ కార్యం పూర్తయిన తర్వాత సహనశక్తి రావడము కాదు. ఇముడ్చుకునే శక్తి ఏ సమయంలో, ఏ విధితో అవసరమో ఆ సమయంలో ఆ విధితో తన పని చేయాలి. అంతేకానీ, బాగానే ఇముడ్చుకున్నాను, అయినా కానీ కొద్ది-కొద్దిగా నోటి నుండి వచ్చేసింది, అర్ధగంట ఇముడ్చుకున్నాను కానీ ఆ ఒక్క సెకండు ఇముడ్చుకునేందుకు బదులుగా మాట్లాడేసాను. మరి ఇటువంటివారిని ఏమంటారు? ఖజానాకు యజమానులా లేక బానిసలా?

సర్వ శక్తులు తండ్రి అధికారం యొక్క ఖజానా, వారసత్వము, జన్మ సిద్ధ అధికారము. కనుక జన్మ సిద్ధ అధికారం యొక్క నషా ఎంతగా ఉంటుంది! ఒక చిన్న రాకుమారుడు ఉన్నారనుకోండి, ఏ ఖజానా ఉంది అన్నది అతనికి తెలియను కూడా తెలియదు కానీ కొద్దిగా స్మృతిలోకి వచ్చినా - నేను రాజు కొడుకును అని ఎంత నషా ఉంటుంది! మరి ఇది యజమానత్వపు నషా కదా. కనుక ఖజానాలను కార్యంలో ఉపయోగించండి. కార్యంలో తక్కువగా ఉపయోగిస్తారు. నిండుగా ఉన్నాము, అన్నీ లభించాయి అని సంతోషంగా ఉంటారు. కానీ కార్యంలో ఉపయోగించడము - దీని ద్వారా స్వయానికి ప్రాప్తి చేయించడము మరియు ఇతరులకు ప్రాప్తి చేయించడంలో నంబరువారుగా అవుతారు. లేదంటే నంబరు ఎందుకు తయారవుతుంది? ఇచ్చేవారూ ఒక్కరే, ఇవ్వడము కూడా అందరికీ ఏకరసంగా ఇస్తారు, మరి నంబరు ఎందుకు? కనుక బాప్ దాదా చూసారు - ఖజానాలైతే చాలా లభించాయి, అన్నీ నిండుగా కూడా ఉన్నాయి, కానీ నిండుదనం యొక్క లాభం తీసుకోరు. ఏ విధంగానైతే లౌకికంలో కూడా చాలామందికి ధనం ద్వారా ఆనందాన్ని లేక లాభాన్ని ప్రాప్తి చేసుకునే పద్ధతి వస్తుంది మరియు కొంతమంది వద్ద చాలా ధనం ఉంటుంది కానీ ఉపయోగించే పద్ధతి రాదు, అందుకే ఉన్నా లేనట్లే ఉంటారు. కావున దేనిని అండర్ లైన్ చేయాలి? కేవలం వినేవారిగా అవ్వకండి, ఉపయోగించే విధి ద్వారా ఇప్పుడు కూడా సిద్ధిని ప్రాప్తి చేసుకోండి మరియు అనేక జన్మలకు సద్గతిని ప్రాప్తి చేసుకోండి.

దివ్య గుణాలు కూడా తండ్రి యొక్క వారసత్వము. కావున ప్రాప్తించిన వారసత్వాన్ని కార్యంలో ఉపయోగించడంలో కష్టమేముంది. ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపించడం రాదా? యజమానులకే ఆజ్ఞాపించడము వస్తుంది. బలహీనులకు ఆజ్ఞాపించడం రాదు. వారు - చెప్పాలా, వద్దా, సహాయం లభిస్తుందో, లభించదో తెలియదు... అని ఆలోచిస్తారు. మీ ఖజానా కదా. తండ్రి ఖజానా అంటే మీ ఖజానా. లేదా ఇది తండ్రిదేనా, మనది కాదా? తండ్రి దేని కోసం ఇచ్చారు? మీదిగా చేసుకునేందుకు ఇచ్చారా లేక కేవలం చూసి సంతోషించేందుకు ఇచ్చారా? కర్మలో ఉపయోగించేందుకు లభించింది. రిజల్టులో ఖజానాలన్నింటిని జమ చేసుకునే విధి తక్కువగా వస్తుందని గమనించారు. జ్ఞానమంటే పాయింటును రిపీట్ చేయడము లేక బుద్ధిలో ఉంచుకోవడము అని అర్థం కాదు. జ్ఞానం అనగా తెలివి, త్రికాలదర్శిగా అయ్యేటువంటి తెలివి, సత్య-అసత్యాల గురించి తెలివి, సమయమనుసారంగా కర్మలు చేసే తెలివి. దీనిని జ్ఞానము అని అంటారు.

ఒకవేళ ఎవరైనా అంత తెలివైనవారిగా ఉండి కూడా సమయానికి తెలివితక్కువ పని చేస్తే వారిని జ్ఞాని అని అంటారా? మరియు తెలివైనవారు ఒకవేళ తెలివిహీనులుగా అయితే వారిని ఏమని అంటారు? తెలివిహీనులను ఏమీ అనరు. కానీ తెలివైనవారికి - ‘ఇది తెలివేనా’ అని అందరూ సూచనను ఇస్తారు. కనుక జ్ఞాన ఖజానాను ధారణ చేయడము, జమ చేసుకోవడము అనగా ప్రతి సమయము, ప్రతి కార్యంలో, ప్రతి కర్మలో తెలివితో నడుచుకోవడము. అర్థమయిందా? మరి మీరు ఎంతో తెలివైనవారు కదా. ‘జ్ఞానయుక్త ఆత్మలా’ లేక ‘జ్ఞానం వినే ఆత్మలా’? ప్రాక్టికల్ కర్మలలో, మాట్లాడడంలో... ఇలాంటి జ్ఞానయుక్త ఆత్మలుగా ఎంతవరకు అయ్యారు అన్నది చెక్ చేసుకోండి. వాస్తవానికి అందరిచేత చేతులు ఎత్తిస్తే, అందరూ మేము లక్ష్మి-నారాయణులుగా అవుతాము అని అంటారు. మేము రాముడిగా, సీతగా అవుతామని ఎవరూ అనరు. కానీ ఎవరో ఒకరైతే అవుతారు కదా. అందరూ, మేము విశ్వ మహారాజుగా అవుతామని అంటారు. మంచిది, లక్ష్యము ఇలాగే ఉన్నతంగా ఉండాలి. కానీ కేవలం లక్ష్యము పెట్టుకోవడం వరకే కాదు, లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉండాలి. లక్ష్యమేమో విశ్వ-మహారాజుగా అవ్వడము మరియు కర్మలో ఒక్క గుణము లేక ఒక్క శక్తి కూడా ఆజ్ఞను పాటించకపోతే, వారు విశ్వమహారాజుగా ఎలా అవుతారు? తమ ఖజానా తమకే ఉపయోగపడకపోతే విశ్వ ఖజానాను ఏం సంభాళిస్తారు? అందుకే సర్వ ఖజానాలతో సంపన్నంగా అవ్వండి మరియు విశేషంగా వర్తమాన సమయంలో ఏ సహజ పురుషార్థము చేయండంటే - సర్వుల నుండి, బాప్ దాదా నుండి ప్రతి సమయము ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండాలి.

ఆశీర్వాదాలు ఎవరికి లభిస్తాయి? ఎవరైతే సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టపరుస్తారో వారికి. ఎక్కడైతే సంతుష్టత ఉంటుందో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. ఇంకేమీ రాకపోయినా పర్వాలేదు. భాషణ చేయడం రాకపోయినా పర్వాలేదు. సర్వ గుణాలను ధారణ చేయడంలో శ్రమ అనిపించినా, సర్వశక్తులను కంట్రోల్ చేయడములో శ్రమ అనిపించినా దానిని కూడా వదిలేయండి. కానీ ఈ ఒక్క విషయాన్ని ధారణ చేయండి - ఆశీర్వాదాలను అందరికీ ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఇందులో ఎలాంటి శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. చేసి చూడండి. ఒక రోజు అమృతవేళ నుండి రాత్రి వరకు కేవలం ఈ పని మాత్రమే చేయండి - ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. మరియు రాత్రికి చార్ట్ చెక్ చేసుకోండి - అది సహజ పురుషార్థంగా అనిపించిందా లేక కష్టము అనిపించిందా? ఇంకేమీ చేయకండి కానీ ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. దివ్య గుణాలు, శక్తులు వాటంతటవే వచ్చేస్తాయి. ఎవరైనా మీకు దుఃఖమిచ్చినా కానీ మీరు ఆశీర్వాదాలు ఇవ్వాలి. అప్పుడు సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి ఉంటాయి కదా, సహనశీలతా గుణం ఉంటుంది కదా. ఇది అర్థమవుతుంది.

ఆశీర్వాదాలు తీసుకోవడము మరియు ఆశీర్వాదాలు ఇవ్వడము - ఇది బీజము, ఇందులో వృక్షము స్వతహాగానే ఇమిడి ఉంది. దీనికి విధి - రెండు పదాలను గుర్తుంచుకోండి. ఒకటేమో ‘శిక్షణ’ మరియు రెండవది ‘క్షమ’, దయ. శిక్షణ ఇవ్వడానికి చాలా ప్రయత్నిస్తారు, కానీ క్షమించడం రాదు. కనుక క్షమించాలి, క్షమించడమే శిక్షణ ఇవ్వడము అవుతుంది. శిక్షణ ఇచ్చేటప్పుడు క్షమించడాన్ని మర్చిపోతారు. కానీ క్షమించినట్లయితే శిక్షణ స్వతహాగా వచ్చేస్తుంది. శిక్షకులుగా అవ్వడము చాలా సహజము. వారం రోజుల కోర్సు తర్వాత శిక్షకులుగా అయిపోతారు. కనుక క్షమించాలి, దయార్ద్రహృదయులుగా అవ్వాలి. కేవలం శిక్షకులుగా అవ్వకూడదు. క్షమిస్తే, ఇప్పటి నుండే ఆ సంస్కారాన్ని ధారణ చేస్తే ఆశీర్వాదాలను ఇవ్వగలరు. మరియు ఇప్పటి నుండి ఆశీర్వాదాలు ఇచ్చే సంస్కారాన్ని పక్కా చేసుకుంటేనే, మీ జడ చిత్రాల నుండి కూడా ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. చిత్రాల ఎదురుగా వెళ్ళి ఏమంటారు? ఆశీర్వాదాలు ఇవ్వండి, దయ చూపించండి... మీ జడ చిత్రాల నుండి ఆశీర్వాదాలు లభిస్తున్నప్పుడు చైతన్యములో ఆత్మల నుండి ఎన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి! ఆశీర్వాదాల తరగని ఖజానా బాప్ దాదా నుండి ప్రతి అడుగులో లభిస్తుంది, తీసుకునేవారు తీసుకోవాలి. మీరు చూడండి, ఒకవేళ శ్రీమతమనుసారంగా ఏదైనా అడుగు వేస్తే, ఏం అనుభవమవుతుంది? తండ్రి ఆశీర్వాదాలు లభిస్తాయి కదా. మరియు ఒకవేళ ప్రతి అడుగు శ్రీమతమనుసారంగా నడిస్తే ప్రతి అడుగులో ఎన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి, ఆశీర్వాదాల ఖజానా ఎంత నిండుగా అవుతుంది!

ఎవరు ఏమిచ్చినా కానీ మీరు వారికి ఆశీర్వాదాలు ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా క్రోధం చేసినా కానీ, అందులో కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. క్రోధంలో ఆశీర్వాదాలు ఉన్నాయా లేక యుద్ధము ఉందా? ఎవరెంత క్రోధం చేసినా కానీ, వారు మీకు స్మృతిని ఇప్పిస్తారు - నేను పరవశమై ఉన్నాను కానీ మీరు మాస్టర్ సర్వశక్తివంతులు అని. కనుక ఆశీర్వాదాలు లభించాయి కదా. మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, మీరు శీతల జలాన్ని వేసేవారు అని మీకు స్మృతిని ఇప్పించారు. కనుక క్రోధం చేస్తున్న వారు ఆశీర్వాదాలు ఇచ్చారు కదా. వారు ఏం చేసినా కానీ, మీరు వారి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి. వినిపించాము కదా, గులాబి పుష్పంలో కూడా చూడండి, ఎంత విశేషత ఉంది, ఎంతో మురికిగా ఉండే ఎరువు నుండి, దుర్గంధము నుండి ఏం తీసుకుంటుంది? సుగంధాన్ని తీసుకుంటుంది కదా. గులాబి పుష్పము దుర్గంధము నుండి సుగంధాన్ని తీసుకోగలిగినప్పుడు, మీరు క్రోధం చేసేవారి నుండి ఆశీర్వాదాలు తీసుకోలేరా? విశ్వ-మహారాజుగా గులాబి పుష్పము అవ్వాలా లేక మీరు అవ్వాలా? వీరు సరిగ్గా ఉంటే నేను సరిగ్గా ఉంటాను, ఈ సిస్టం సరిగ్గా ఉంటే నేను సరిగ్గా ఉంటాను అని ఎప్పుడూ అనుకోకండి. ఎప్పుడైనా సాగరం ముందుకు వెళ్ళి ఇలా అంటారా - ‘‘ఓ కెరటమా! నీవు పెద్దగా రావద్దు, చిన్నగా రా, వంకరగా రావద్దు, తిన్నగా రా’’ అని. ఈ ప్రపంచం కూడా సాగరము. అన్ని అలలు చిన్నవిగానూ ఉండవు, వంకరగానూ ఉండవు, తిన్నగానూ ఉండవు, పెద్దవిగానూ ఉండవు. కనుక వీరు సరి అయితే నేను సరి అవుతాను అన్నటువంటి ఆధారాన్ని ఉంచుకోకండి. పరిస్థితి పెద్దదా లేక మీరు పెద్దవారా? బాప్ దాదా వద్దకైతే అన్ని విషయాలు చేరుకుంటాయి కదా. దీనిని సరి చేస్తే నేను కూడా సరి అవుతాను, ఈ క్రోధం చేసేవారిని శీతలంగా చేస్తే నేను కూడా శీతలంగా అవుతాను, ఈ గొడవ చేసేవారిని పక్కకు తీస్తే సెంటరు బాగవుతుంది - ఇలాంటి ఆత్మిక సంభాషణ చేయకండి. మీ స్లోగన్ ఏమిటంటే - ‘‘ప్రతీకారం తీసుకోకండి, పరివర్తనై చూపించండి.’’ వీరిలా ఎందుకు చేస్తారు, ఇలా చేయకూడదు, వీరు మారాల్సిందే... అని అంటారు. కానీ మొదట స్వయాన్ని మార్చుకోండి. స్వపరివర్తనతో విశ్వపరివర్తన మరియు ఇతరుల పరివర్తనా? లేక ఇతరుల పరివర్తనతో స్వపరివర్తనా? స్లోగన్ ను తప్పుగా అయితే తయారుచేయలేదు కదా? ఏం చేస్తారు? స్వయాన్ని మార్చుకుంటారా లేక ఇతరులను మార్చడంలో సమయం పోగొట్టుకుంటారా? ‘‘కావాలంటే ఒక సంవత్సరం పాటు చూడండి - స్వయాన్ని మార్చుకోకండి కానీ ఇతరులను మార్చే ప్రయత్నం చేయండి, సమయం మారిపోతుంది కానీ మీరూ మారరు, వారూ మారరు.’’ అర్థమయిందా! సర్వ ఖజానాలకు యజమానులుగా అవ్వడం అనగా సమయానికి ఖజానాలను కార్యంలో ఉపయోగించడము. అచ్ఛా!

సర్వ ఖజానాలతో సంపన్న ఆత్మలకు, సర్వ ఖజానాలను కార్యంలో ఉపయోగించేవారికి, పెంచుకునే ‘జ్ఞానయుక్త ఆత్మలైన’ పిల్లలకు, సర్వ ఖజానాలకు యజమానులుగా అయి సమయానికి విధిపూర్వకంగా కార్యంలో ఉపయోగించే శ్రేష్ఠ ఆత్మలకు, ప్రతి శక్తి, ప్రతి గుణం యొక్క అథారిటీగా అయి స్వయంలో మరియు సర్వులలో నింపే విశేష ఆత్మలకు, సదా ఆశీర్వాదాల ఖజానాతో సహజ పురుషార్థాన్ని అనుభవం చేసే సహజయోగీ ఆత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments