23-04-1993 అవ్యక్త మురళి

  23-04-1993         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘నిశ్చయబుద్ధి భవ, అమర భవ’’ 

ఈ రోజు బాప్ దాదా సర్వ అతి స్నేహీ, ఆది నుండి యజ్ఞ స్థాపనకు సహయోగి అయిన, అనేక రకాలుగా వచ్చిన భిన్న-భిన్న సమస్యలనే పేపర్లలో నిశ్చయబుద్ధి విజయీగా అయి దాటేటువంటి ఆది స్నేహీ, సహయోగులైన, స్థిరమైన, అచంచలమైన ఆత్మలతో మిలనం జరుపుకునేందుకు వచ్చారు. నిశ్చయం అనే సబ్జెక్టులో పాస్ అయ్యేటటువంటి పిల్లల వద్దకు వచ్చారు. నిశ్చయమనేది ఈ పాత జీవితంలో కావచ్చు, రాబోయే జీవితంలో కూడా కావచ్చు, సదా విజయాన్ని అనుభవం చేయిస్తూ ఉంటుంది. ‘నిశ్చయం’ యొక్క వరదానం, ‘అమర భవ’ యొక్క వరదానం సదా తోడుగా ఉండాలి. విశేషంగా ఈ రోజు చాలాకాలం యొక్క అనుభవజ్ఞులైన పెద్దవారు ఎవరైతే ఉన్నారో, వారి స్మృతి మరియు స్నేహ బంధనంలో బంధింపబడి తండ్రి వచ్చారు. నిశ్చయానికి అభినందనలు!

ఒక వైపు యజ్ఞము అనగా పాండవుల కోటకు పునాదిగా ఉన్న అనగా ఫౌండేషన్ గా ఉన్న ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారు కూడా అందరూ ఎదురుగా ఉన్నారు మరియు రెండవ వైపు అనుభవజ్ఞులైన ఆది ఆత్మలైన మీరు ఈ పాండవుల కోట గోడకు మొదటి ఇటుకలు. పునాది కూడా ఎదురుగా ఉన్నారు మరియు ఆది ఇటుకలు, ఎవరి ఆధారంపైన అయితే ఈ కోట దృఢంగా అయి విశ్వానికి ఛత్రఛాయ అయ్యిందో, వారు కూడా ఎదురుగా ఉన్నారు. కనుక ఎలాగైతే తండ్రి పిల్లల స్నేహంలో ‘‘జీ హజూర్, హాజిర్’’ అని చేసి చూపించారో, అలాగే సదా బాప్ దాదా మరియు నిమిత్త ఆత్మల శ్రీమతము లేక డైరెక్షన్ కు సదా ‘జీ హాజిర్’ చేస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా వ్యర్థమైన మన్మతాన్ని లేక పరమతాన్ని కలపకూడదు. హాజరుగా ఉన్న ప్రభువును తెలుసుకొని శ్రీమతముపై ఎగురుతూ వెళ్ళండి. అర్థమయిందా? అచ్ఛా!

మధుబన్ నివాసులకు సేవ కొరకు అభినందనలు ఇస్తూ బాప్ దాదా మాట్లాడారు

అచ్ఛా, విశేషంగా మధుబన్ నివాసులకు చాలా-చాలా అభినందనలు. మొత్తం సీజన్ మీ మధురత మరియు అలసటలేని సేవతో సర్వుల సేవకు నిమిత్తంగా అయ్యారు. కనుక అన్నింటికన్నా మొదట మొత్తం సీజన్ లో నిమిత్తమైన సేవాధారులకు, విశేషంగా మధుబన్ నివాసులకు చాలా-చాలా అభినందనలు. మధుబన్ ఉన్నదే మధువు (తేనె) అనగా మధురత. మధురత సర్వులను తండ్రి స్నేహంలోకి తీసుకొస్తుంది, అందుకే హాలులో ఉన్నవారికి, వెళ్ళిపోయినవారికి కూడా అందరికీ విశేషంగా ఒక్కొక్క డిపార్టుమెంట్ కు బాప్ దాదా సేవ కొరకు విశేషమైన అభినందనలు ఇస్తున్నారు మరియు ‘‘సదా అలసటలేనివారిగా కండి, మధురంగా కండి’’ అనే వరదానాలతో ముందుకు వెళ్తూ ఎగురుతూ ఉండండి.

అవ్యక్త బాప్ దాదా వ్యక్తిగత మిలనము

1. నిర్లక్ష్యము బలహీనతను తీసుకువస్తుంది, అందుకే అలెర్ట్ గా ఉండండి

అందరూ సంగమయుగీ శ్రేష్ఠ ఆత్మలే కదా! ఏ యుగానికి లేనటువంటిది, సంగమయుగపు విశేషత ఏమిటి? సంగమయుగం విశేషత - ఒకటేమో, ప్రత్యక్ష ఫలం లభిస్తుంది మరియు ఒకటికి పదమారెట్ల ప్రాప్తి యొక్క అనుభవం ఇదే జన్మలో జరుగుతుంది. ప్రత్యక్ష ఫలం లభిస్తుంది కదా. ఒకవేళ ఒక్క క్షణమైనా ధైర్యం పెట్టినట్లయితే ఎంత సమయం వరకు సహాయం లభిస్తూ ఉంటుంది! ఏ ఒక్కరికి సేవ చేసినా కూడా ఎంత సంతోషం లభిస్తుంది! కనుక ఒకటికి పదమారెట్ల ప్రాప్తి అనగా ప్రత్యక్ష ఫలం ఈ సంగమములోనే లభిస్తుంది. మరి తాజా ఫలాలు తినడము మంచిగా అనిపిస్తుంది కదా. కనుక మీరందరూ ప్రత్యక్ష ఫలాన్ని అనగా తాజా ఫలాన్ని తినేవారు, అందుకే శక్తిశాలిగా ఉన్నారు. బలహీనంగా అయితే లేరు కదా. అందరూ శక్తిశాలిగా ఉన్నారు. బలహీనతను రానివ్వకండి. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో, అప్పుడు బలహీనత స్వతహాగానే సమాప్తమవుతుంది. సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా సదా శక్తి లభిస్తూ ఉంటుంది, మరి బలహీనులుగా ఎలా అవుతారు. బలహీనత రాగలదా? ఎప్పుడైనా పొరపాటుగా వచ్చేస్తుందా? ఎప్పుడైతే కుంభకర్ణుని నిద్రలో నిర్లక్ష్యులుగా అయి నిద్రపోతారో, అప్పుడు వస్తుంది, లేదంటే రాలేదు. మీరైతే అలెర్ట్ గా ఉన్నారు కదా. నిర్లక్ష్యులుగా ఉన్నారా? అందరూ అలెర్ట్ గా ఉన్నారా? సదా అలెర్ట్ గా ఉన్నారా? సంగమయుగంలో తండ్రి లభించారు, అన్నీ లభించాయి. కనుక అలెర్ట్ గానే ఉంటారు కదా. ఎవరికైతే చాలా ప్రాప్తులు జరుగుతూ ఉంటాయో, వారు ఎంత అలెర్ట్ గా ఉంటారు! సాధారణంగా బిజినెస్ మ్యాన్ కు బిజినెస్ లో ప్రాప్తులు జరుగుతూ ఉంటే నిర్లక్ష్యులుగా ఉంటారా లేక అలెర్ట్ గా ఉంటారా? మరి మీకు ఒక్క క్షణంలో ఎంత లభిస్తుంది! మరి నిర్లక్ష్యులుగా ఎలా ఉంటారు? తండ్రి సర్వ శక్తులను ఇచ్చేసారు. ఎప్పుడైతే సర్వ శక్తులు తోడుగా ఉన్నాయో, అప్పుడు నిర్లక్ష్యం రాదు. సదా తెలివైనవారిగా, సదా అప్రమత్తంగా ఉండండి!

యు.కె. నైతే బాప్ దాదా ఓ.కె అనే అంటారు. మరి ఎవరైతే ఓ.కె.గా ఉంటారో (పూర్తిగా బాగుంటారో), వారు ఎప్పుడైతే అలెర్ట్ గా ఉంటారో, అప్పుడే ఓ.కె. గా ఉంటారు కదా. పునాది శక్తిశాలిగా ఉంది, అందుకే ఏవైతే కొమ్మలు-రెమ్మలు వెలువడ్డాయో, అవి కూడా శక్తిశాలిగా ఉన్నాయి. విశేషంగా బాప్ దాదా, బ్రహ్మా తండ్రి తమ హృదయపూర్వకంగా లండన్ యొక్క మొదటి పునాదిని వేసారు. అది బ్రహ్మా తండ్రికి విశేషమైనది, ప్రియమైనది. కనుక మీరు ప్రత్యక్ష ఫలానికి సదా అధికారి ఆత్మలు. కర్మ చేసేందుకు ముందే ఫలం తయారుగా ఉండనే ఉంది. ఇలాగే అనిపిస్తుంది కదా. లేక శ్రమ అనిపిస్తుందా? నాట్యం చేస్తూ-పాడుతూ ఫలం తింటూ ఉన్నారు. మామూలుగా కూడా డబల్ విదేశీయులకు ఫలాలు మంచిగా అనిపిస్తాయి కదా. బాప్ దాదా కూడా యు.కె. అనగా సదా ఓ.కె.గా ఉండే పిల్లలను చూసి హర్షిస్తారు. తమ ఈ టైటిల్ ను సదా గుర్తుంచుకోండి, ఓ.కె. ఇది ఎంత గొప్ప టైటిల్! అందరూ సదా ఓ.కె.గా ఉండేవారు మరియు ఇతరులను కూడా తమ ముఖము ద్వారా, వాణి ద్వారా, వృత్తి ద్వారా ఓ.కె.గా తయారుచేసేవారు. ఈ సేవనే చేయాలి కదా! మంచిది. సేవ యొక్క అభిరుచి కూడా బాగుంది. ఎవరు ఎక్కడి నుండి వచ్చినా కానీ, అందరూ తీవ్ర పురుషార్థులు మరియు ఎగిరే కళ కలవారు. అందరికన్నా ఎక్కువ సంతోషంగా ఎవరుంటారు? నేను అని నషాతో చెప్పండి! సంతోషం తప్ప ఇంక ఉన్నదేమిటి! ‘సంతోషము’ బ్రాహ్మణ జీవితానికి ఔషధము. ఔషధం లేకుండా ఎలా నడుస్తారు. నడుస్తున్నారు అంటే, మరి ఔషధం లభిస్తుంది, కనుకనే నడుస్తున్నారు కదా. స్థానాలు కూడా పెరుగుతున్నాయి. చూడండి, మొదట మూడు అడుగుల పృథ్విని తీసుకోవడము పెద్ద విషయంగా అనిపించేది మరియు ఇప్పుడు ఏమనిపిస్తుంది? సహజమనిపిస్తుంది కదా. మరి లండన్ అద్భుతం చేసింది కదా (ఇప్పుడు 50 ఎకరాల భూమి లభించింది). ధైర్యమిప్పించేవారు కూడా మంచిగా ఉన్నారు మరియు ధైర్యం పెట్టేవారు కూడా మంచిగా ఉన్నారు. చూడండి, మీ అందరి వేలు లేకపోతే ఎలా జరుగుతుంది. కనుక యు.కె. వారందరూ అదృష్టవంతులు మరియు వేలును ఇవ్వడంలో ధైర్యవంతులు.

2. తమ సర్వ బాధ్యతలను తండ్రికి ఇచ్చి నిశ్చింతా చక్రవర్తులుగా అవ్వండి

సదా స్వయాన్ని నిశ్చింతా చక్రవర్తిగా అనుభవం చేస్తున్నారా? లేక కొద్ది-కొద్దిగా చింత ఉందా? ఎందుకంటే తండ్రి ఎప్పుడైతే మీ బాధ్యతను తీసుకున్నారో, మరి బాధ్యత యొక్క చింత ఎందుకు? ఇప్పుడు కేవలం తండ్రితో పాటు నడుస్తూ ఉండాలి అన్న బాధ్యత మాత్రమే ఉంది. అది కూడా తండ్రితో పాటు ఉండాలి, ఒంటరిగా కాదు. కనుక ఏం చింత ఉంది? రేపు ఏమవుతుంది, ఈ చింత ఉందా? ఉద్యోగం గురించి చింత ఉందా? ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్న ఈ చింత ఉందా? ఎందుకంటే మీకు తెలుసు, మా కోసం ఏదైతే జరుగుతుందో అది మంచిదే జరుగుతుంది. నిశ్చయముంది కదా. పక్కా నిశ్చయముందా లేక అప్పుడప్పుడు కదులుతుందా? ఎక్కడైతే నిశ్చయం పక్కాగా ఉంటుందో, అక్కడ నిశ్చయంతో పాటు విజయం కూడా నిశ్చితమై ఉంది. విజయం అయ్యే ఉంది అన్న నిశ్చయం కూడా ఉంది కదా. లేదా జరుగుతుందో లేదో తెలియదు అని అప్పుడప్పుడు ఆలోచిస్తారా? ఎందుకంటే కల్ప-కల్పపు విజయులు మరియు సదా విజయులుగానే ఉంటారు. ఈ తమ కల్పక్రితపు స్మృతిచిహ్నాన్ని ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారు. కల్ప-కల్పపు విజయులము అని ఇంతటి నిశ్చయం ఉంది కదా. ఇంతటి నిశ్చయముందా? కల్ప క్రితము కూడా మీరే ఉన్నారా లేక ఇంకెవరైనా ఉన్నారా? కనుక సదా ఇదే గుర్తుంచుకోండి, మేము నిశ్చయబుద్ధి విజయీ రత్నాలము. మీరు ఎటువంటి రత్నాలంటే ఈ రత్నాలను బాప్ దాదా కూడా గుర్తు చేసుకుంటారు. ఈ సంతోషం ఉంది కదా? చాలా ఆనందంలో ఉంటారు కదా. ఈ అలౌకిక దివ్య శ్రేష్ఠ జన్మకు మరియు తమ మధుబన్ ఇంటికి చేరుకున్నందుకు అభినందనలు.

3. తండ్రి మరియు మీరు - ఎంత కంబైండ్ గా ఉండాలంటే ఎప్పుడూ ఎవ్వరూ వేరు చేయలేకపోవాలి

అందరూ స్వయాన్ని సదా తండ్రి మరియు మీరు కంబైండ్ గా ఉన్నారు - ఇలా అనుభవం చేస్తున్నారా? ఎవరైతే కంబైండ్ గా ఉంటారో, వారిని ఎప్పుడూ కూడా ఎవ్వరూ వేరు చేయలేరు. మీరు అనేక సార్లు కంబైండ్ గా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు మరియు ఇకముందు కూడా సదా ఉంటారు. ఇది పక్కా కదా? కనుక ఇంతటి పక్కా కంబైండ్ గా ఉండండి. మరి సదా గుర్తుంచుకోండి, కంబైండుగా ఉండేవారము, కంబైండుగా ఉన్నాము మరియు కంబైండుగా ఉంటాము. అనేక సార్ల కంబైండ్ స్వరూపాన్ని వేరు చేయగలిగే శక్తి ఎవ్వరికీ లేదు. మరి ప్రేమకు గుర్తు ఏముంటుంది? (కంబైండ్ గా ఉండాలి) ఎందుకంటే శరీరంతోనైతే తప్పనిసరి పరిస్థితులలో కూడా అక్కడక్కడ వేరుగా ఉండాల్సి వస్తుంది. ప్రేమ కూడా ఉంటుంది కానీ తప్పనిసరి పరిస్థితుల వలన అక్కడక్కడ వేరుగా ఉండాల్సి వస్తుంది కూడా. కానీ ఇక్కడైతే శరీరం విషయమే లేదు. ఒక్క క్షణంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా చేరుకోగలరు! ఆత్మ మరియు పరమాత్మ తోడుగా ఉన్నారు. పరమాత్మ అయితే ఎక్కడైనా తోడును నిర్వర్తిస్తారు మరియు ప్రతి ఒక్కరితో కంబైండ్ రూపంలో ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించేవారు. ప్రతి ఒక్కరు ఏమంటారు, నా బాబా. లేక నీ బాబా అని అంటారా? ప్రతి ఒక్కరు నా బాబా అని అంటారు! మరి నా అని ఎందుకంటారు? అధికారముంది, అందుకే అంటారు కదా. ప్రేమ కూడా ఉంది మరియు అధికారం కూడా ఉంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ అధికారం కూడా ఉంటుంది. అధికారం యొక్క నషా ఉంది కదా. ఎంత గొప్ప అధికారం లభించింది! ఇంత గొప్ప అధికారము సత్యయుగంలో కూడా లభించదు! ఏ జన్మలోనూ పరమాత్మ-అధికారం లభించదు. ప్రాప్తి ఇక్కడ ఉంది. ప్రారబ్ధం సత్యయుగంలో ఉంటుంది, కానీ ప్రాప్తి యొక్క సమయము ఇప్పుడే. కనుక ఏ సమయంలో ప్రాప్తి ఉంటుందో, ఆ సమయంలో ఎంత సంతోషం ఉంటుంది! ప్రాప్తి లభించేసింది అంటే ఆ తర్వాత అది సాధారణ విషయమైపోతుంది. కానీ ఎప్పుడైతే ప్రాప్తి కలుగుతూ ఉంటుందో, ఆ సమయంలోని నషా మరియు సంతోషం అలౌకికంగా ఉంటుంది! కనుక ఎంత సంతోషం మరియు నషా ఉంది! ఎందుకంటే ఇచ్చేవారు కూడా అనంతమైనవారు. మరి దాత కూడా అనంతమైనవారు మరియు లభించడము కూడా అనంతముగానే లభిస్తుంది. మరి మీరు దేనికి యజమానులు - హద్దుకా లేక అనంతమైనదానికా? మూడు లోకాలను తమవిగా చేసుకున్నారు. మూలవతనము, సూక్ష్మవతనము, మన ఇళ్ళు మరియు స్థూలవతనంలోనైతే మన రాజధాని వచ్చేది ఉంది. మూడు లోకాలకు అధికారులుగా అయ్యారు! మరి ఏమంటారు - అధికారి ఆత్మలు అని అంటారు. ఏదైనా అప్రాప్తి ఉందా? కనుక ఏ పాటను పాడుతారు? (ఏది పొందాలో అది పొందేసాము) ఏది పొందాలో అది పొందేసాము, ఇప్పుడిక పొందేందుకు ఏమీ లేదు. మరి ఈ పాటను పాడుతారా? లేక ఏదైనా అప్రాప్తి ఉందా - ధనం కావాలి, ఇల్లు కావాలి! నేతల కుర్చీ కావాలా? ఏమీ వద్దు ఎందుకంటే కుర్చీ ఉన్నా కూడా ఒక్క జన్మకు కూడా భరోసా ఉండదు మరియు మీకు ఎంత గ్యారంటీ ఉంది? 21 జన్మల గ్యారెంటీ ఉంది. గ్యారెంటీ-కార్డును మాయ అయితే దొంగిలించడం లేదు కదా? ఎలాగైతే ఇక్కడ పాస్ పోర్టును పోగొట్టుకుంటే ఎంత కష్టమవుతుంది! మరి గ్యారెంటీ-కార్డును మాయ అయితే తీసుకోవడము లేదు కదా? అది దాక్కునే ఆట ఆడుతుంది. అప్పుడు మీరేం చేస్తారు? ఎటువంటి శక్తిశాలిగా అవ్వండి అంటే మాయకు ధైర్యం ఉండకూడదు.

4. ప్రతి కర్మను త్రికాలదర్శిగా అయి చేయండి

అందరూ స్వయాన్ని సింహాసనాధికారి ఆత్మలమని అనుభవం చేస్తున్నారా? ఇప్పుడు సింహాసనం లభించిందా లేక భవిష్యత్తులో లభించనున్నదా, ఏమంటారు? అందరూ సింహాసనంపైన కూర్చుంటారా? (హృదయసింహాసనం చాలా పెద్దది). హృదయసింహాసనమైతే పెద్దది కానీ సత్యయుగ సింహాసనంపై ఒకే సమయంలో ఎంతమంది కూర్చుంటారు? సింహాసనంపై ఎవరు కూర్చున్నా కూడా సింహాసనాధికారులు రాయల్ ఫ్యామిలీలోకైతే వస్తారు కదా. సింహాసనంపై ఒకేసారి కలిసి అయితే కూర్చోలేరు! ఈ సమయంలో అందరూ సింహాసనాధికారులు, అందుకే ఈ జన్మకు మహత్వముంది. ఎంతమంది కావాలనుకున్నా, ఎవరు కావాలనుకున్నా హృదయ సింహాసనాధికారిగా అవ్వవచ్చు. ఈ సమయంలో ఇంకే సింహాసనమైనా ఉందా? ఏ సింహాసనం ఉంది? (భృకుటి సింహాసనం) అవినాశీ ఆత్మలైన మీ సింహాసనము ఈ భృకుటి. కనుక భృకుటి సింహాసనాధికారులు కూడా మరియు హృదయ సింహాసనాధికారులు కూడా. డబల్ సింహాసనం ఉంది కదా! ఆత్మనైన నేను భృకుటి యొక్క అకాల సింహాసనాధికారిని అన్న నషా ఉంది! సింహాసనాధికారి ఆత్మకు స్వయం పైన రాజ్యముంటుంది, అందుకే స్వరాజ్య అధికారులు. స్వరాజ్య అధికారిని - ఈ స్మృతి సహజంగానే తండ్రి ద్వారా సర్వ ప్రాప్తులను అనుభవం చేయిస్తుంది. కనుక మూడు సింహాసనాల గురించిన జ్ఞానం ఉంది. నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారు కదా! శక్తిశాలిగా కూడా ఉన్నారా లేక కేవలం నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారా? ఎంతగా నాలెడ్జ్ ఫుల్ గా ఉంటారో, అంతగానే శక్తిశాలిగా ఉండాలి లేక ఎక్కువ నాలెడ్జ్ ఫుల్ గా, తక్కువ శక్తిశాలిగా ఉన్నారా? జ్ఞానంలో ఎక్కువ తెలివైనవారిగా ఉన్నారు! నాలెడ్జ్ ఫుల్ మరియు శక్తిశాలి - రెండు కలిసే ఉండాలి. కనుక మూడు సింహాసనాల స్మృతి సదా ఉండాలి.

జ్ఞానంలో మూడుకు మహత్వముంది. త్రికాలదర్శిగా కూడా అవుతారు. మూడు కాలాల గురించి మీకు తెలుసు. లేక కేవలం వర్తమానం గురించే తెలుసా? ఏదైనా కర్మ చేసినప్పుడు త్రికాలదర్శిగా అయి కర్మ చేస్తున్నారా లేక కేవలం ఏకదర్శిగా అయి కర్మ చేస్తున్నారా? మీరు ఏకదర్శులా లేక త్రికాలదర్శులా? రేపు ఏం జరగనున్నదో అది తెలుసా? రేపు ఏం జరగనున్నదో అది చాలా మంచిగా ఉంటుందని మాకు తెలుసు అని చెప్పండి. ఇదైతే తెలుసు కదా! కనుక త్రికాలదర్శులుగా అయ్యారు కదా. ఏదైతే గతించిందో అది కూడా మంచిదే, ఏదైతే జరుగుతూ ఉందో అది ఇంకా మంచిది మరియు ఏదైతే జరగబోతుందో అది ఇంకా చాలా మంచిది! చాలా మంచిదే జరగనున్నది, చెడు జరగదు అని నిశ్చయముంది కదా. ఎందుకు? చాలా మంచి తండ్రి లభించారు, మీరు చాలా మంచివారిగా అయ్యారు, చాలా మంచి కర్మలు చేస్తున్నారు. మరి అంతా మంచిగా ఉంది కదా. లేదా కొంచెం చెడుగా, కొంచెం మంచిగా ఉందా? ఎప్పుడైతే నేను శ్రేష్ఠ ఆత్మను అని తెలిసిందో, మరి శ్రేష్ఠ ఆత్మల సంకల్పము, మాట, కర్మ మంచిగా ఉంటాయి కదా! మరి ఇది సదా స్మృతిలో ఉంచుకోండి - కళ్యాణకారి తండ్రి లభించారు కావున సదా కళ్యాణమే కళ్యాణము జరుగుతుంది. తండ్రినే విశ్వ-కళ్యాణకారి అని అంటారు మరియు మీరు మాస్టర్ విశ్వ కళ్యాణకారులు! కనుక ఎవరైతే విశ్వానికి కళ్యాణం చేసేవారో, వారికి అకళ్యాణం జరగనే జరగదు, అందుకే ఈ నిశ్చయం పెట్టుకోండి - ప్రతి సమయము, ప్రతి కార్యము, ప్రతి సంకల్పము కళ్యాణకారి. సంగమయుగానికి కూడా కళ్యాణకారి యుగమని పేరు పెడతారు. కనుక అకళ్యాణం జరగదు. మరి ఏం గుర్తుంచుకుంటారు? ఏదైతే జరుగుతూ ఉందో అది మంచిది మరియు ఏదైతే జరగనున్నదో అది చాలా-చాలా మంచిది. ఈ స్మృతి సదా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. అచ్ఛా, అందరూ మూల-మూలల్లో తండ్రి జెండాను ఎగిరేస్తున్నారు. అందరూ చాలా ధైర్యం మరియు తీవ్ర పురుషార్థంతో ముందుకు వెళ్తున్నారు మరియు సదా ముందుకు వెళ్తూ ఉంటారు. భవిష్యత్తు కనిపిస్తుంది కదా. ఎవరైనా మీ భవిష్యత్తు ఎలా ఉంటుందని అడిగితే, మాకు తెలుసు, చాలా బాగుంటుందని చెప్పండి. అచ్ఛా.

Comments