20-12-1992 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘ఆజ్ఞాకారులే సర్వ శక్తులకు అధికారులు’’
ఈ రోజు సర్వశక్తుల దాత అయిన బాప్ దాదా తమ శక్తి సైన్యాన్ని చూస్తున్నారు. సర్వశక్తివంతుడైన తండ్రి బ్రాహ్మణాత్మలందరికీ సర్వ శక్తుల యొక్క వారసత్వాన్ని సమానంగా ఇచ్చారు. కొందరికి తక్కువ శక్తి ఇవ్వడము మరియు కొందరికి ఎక్కువ శక్తి ఇవ్వడము - ఇటువంటి వ్యత్యాసాన్ని చూపించలేదు. అందరికీ ఒక్కరి ద్వారా, ఒకేసారి, ఒకే సమానంగా శక్తులను ఇచ్చారు. మరి ఒకే సమానంగా లభిస్తున్నప్పటికీ వ్యత్యాసం ఎందుకు ఉంది అన్న రిజల్టును చూస్తున్నారు. కొంతమంది సర్వ శక్తి సంపన్నులుగా అయ్యారు మరియు కొంతమంది కేవలం శక్తి సంపన్నులుగా అయ్యారు కానీ సర్వ శక్తి సంపన్నులుగా కాదు. కొంతమంది సదా శక్తి స్వరూపులుగా అయ్యారు, కొంతమంది అప్పుడప్పుడు శక్తి స్వరూపులుగా అయ్యారు. కొంతమంది బ్రాహ్మణాత్మలు సర్వశక్తివాన్ అన్న తమ అథారిటీతో ఏ సమయంలో, ఏ శక్తిని ఆర్డర్ చేస్తే, ఆ శక్తి రచన రూపంలో మాస్టర్ రచయితల ఎదురుగా వస్తుంది. ఆర్డర్ చేసారు మరియు అది హాజరవుతుంది. కొందరు ఆర్డర్ చేస్తారు కానీ సమయానికి శక్తులు హాజరవ్వవు, ‘చిత్తం ప్రభు’ అని అంటూ హాజరవ్వవు. దీనికి కారణమేమిటి? కారణం ఏమిటంటే - పిల్లలు సర్వశక్తివంతుడైన తండ్రిని ప్రభు అని కూడా అంటారు, ఎదురుగా ఉపస్థితులై ఉన్నవారు అని కూడా అంటారు, అయితే పిల్లల్లో ఎవరైతే ప్రభు అనగా తండ్రి ప్రతి అడుగు కోసం తెలిపిన శ్రీమతానికి, ప్రతి సమయము ‘సరే బాబా' అని అంటారో లేక ప్రతి ఆజ్ఞకు ‘సరే బాబా’ అని అంటూ దానిని ప్రాక్టికల్ గా చేస్తారో, అలా ‘సరే బాబా’ అనేవారి ఎదురుగా ప్రతి శక్తి కూడా ‘సరే ప్రభు’ లేక ‘సరే మాస్టర్ ప్రభు’ అని అంటుంది.
ఒకవేళ ఆత్మలు ఎవరైనా - సహజంగా పాటించగలిగే శ్రీమతాన్ని లేక ఆజ్ఞను పాటిస్తూ, కష్టంగా అనిపించేదానిని పాటించకపోతే - కొంత చేయడము, కొంత చేయకపోవడము, ఒకసారి ‘సరే ప్రభు’ అని, మరోసారి కేవలం ‘ప్రభు’ అని అంటే, దీనికి ప్రత్యక్ష ఋజువు లేక ప్రత్యక్ష ప్రమాణం యొక్క రూపం ఏమిటంటే - అటువంటి ఆత్మల ఎదురుగా సర్వ శక్తులు కూడా సమయమనుసారంగా హాజరవ్వవు. ఎలాగైతే ఏదైనా పరిస్థితిలో ఇముడ్చుకునే శక్తి కావాలంటే, అప్పుడు, మేము తప్పకుండా ఇముడ్చుకునే శక్తి ద్వారా ఈ పరిస్థితిని దాటుతాము, విజయులుగా అవుతాము అని సంకల్పం చేస్తారు. కానీ జరిగేదేమిటి? రెండవ నంబరువారు అనగా అప్పుడప్పుడు ఉపయోగించేవారు ఇముడ్చుకునే శక్తిని ప్రయోగిస్తారు, 10 సార్లు ఇముడ్చుకుంటారు కానీ అలా ఇముడ్చుకుంటున్నప్పటికీ ఒకటి-రెండుసార్లు ఇముడ్చుకోవాలనుకుంటున్నా ఇముడ్చుకోలేకపోతారు. అప్పుడు ఏం ఆలోచిస్తారు? నేను ఎవ్వరికీ వినిపించలేదు, నేను ఇముడ్చుకున్నాను కానీ వీరు నాతో పాటు ఉండేవారు, నా సహయోగులు, సమీపంగా ఉండేవారు, వీరికి కేవలం సూచన ఇచ్చాను. వినిపించలేదు, సూచన ఇచ్చాను. ఏమీ మాట్లాడకూడదు అనుకున్నాను కానీ కేవలం ఒకటి-రెండు మాటలైతే వెలువడ్డాయి. మరి దీనిని ఏమంటారు? ఇముడ్చుకోవడము అని అంటారా? 10 మంది ఎదురుగానైతే ఇముడ్చుకున్నారు, కానీ ఒకరిద్దరి ఎదురుగా ఇముడ్చుకోలేకపోతారు, మరి దీనిని ఏమంటారు? ఇముడ్చుకునే శక్తి ఆజ్ఞను పాటించిందా? అది మీ శక్తి అయినప్పుడు, దానిని తండ్రి వారసత్వంగా ఇచ్చినప్పుడు, మరి తండ్రి వారసత్వం అనగా పిల్లల వారసత్వము అవుతుంది. మీ శక్తులు మీకే ఉపయోగపడకపోతే వాటిని ఏమంటారు? ఆజ్ఞను పాటించేవి అని అంటారా లేక ఆజ్ఞను పాటించనివి అని అంటారా?
ఈ రోజు బాప్ దాదా సర్వ బ్రాహ్మణాత్మలను, సర్వ శక్తులకు అధికారులుగా ఎంతవరకు అయ్యారు అన్నది చూస్తున్నారు. ఒకవేళ అధికారులుగా అవ్వకపోతే, మరి ఆ సమయంలో పరిస్థితికి అధీనులుగా అవ్వాల్సి ఉంటుంది. బాప్ దాదాకు అన్నింటికన్నా ఎక్కువగా ఏ సమయంలో దయ కలుగుతుందంటే, ఎప్పుడైతే పిల్లలు ఏదైనా శక్తిని సమయానికి కార్యంలో ఉపయోగించలేకపోతే అప్పుడు. ఆ సమయంలో వారు ఏం చేస్తారు? ఏదైనా విషయము వారిని ఎదుర్కొంటున్నప్పుడు వారు తండ్రి ఎదురుగా ఏ రూపంలో వస్తారు? జ్ఞానీ-భక్తుల రూపంలో వస్తారు. భక్తులు ఏం చేస్తారు? భక్తులు ‘ఇది ఇవ్వండి’ అని కేవలం పిలుస్తూ ఉంటారు. పరుగెత్తుకుంటూ వచ్చేది తండ్రి వద్దకు, అధికారం పెట్టుకునేది తండ్రిపైన, కానీ రూపం రాయల్ భక్తుని వలె ఉంటుంది. మరియు ఎక్కడైతే అధికారులకు బదులుగా జ్ఞానీ భక్తులు లేక రాయల్ భక్తుల రూపంలో వస్తారో, అలా ఎప్పటివరకైతే భక్తి యొక్క అంశం మిగిలి ఉంటుందో, మరి భక్తి యొక్క ఫలము సద్గతి అనగా సఫలత, ఆ సద్గతిని అనగా విజయాన్ని ప్రాప్తి చేసుకోలేకపోతారు ఎందుకంటే ఎక్కడైతే భక్తి యొక్క అంశం మిగిలి ఉంటుందో, అక్కడ భక్తి యొక్క ఫలమైన జ్ఞానము అనగా సర్వ ప్రాప్తులు లభించజాలవు, సఫలత లభించజాలదు. భక్తి అనగా శ్రమ మరియు జ్ఞానం అనగా ప్రేమ. ఒకవేళ భక్తి యొక్క అంశం ఉంటే తప్పకుండా శ్రమ చేయాల్సి ఉంటుంది మరియు భక్తి యొక్క ఆచారము-పద్ధతి ఏమిటంటే, ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తారు, లేదంటే నిర్లక్ష్యులుగా ఉంటారు. జ్ఞానీ-భక్తులు కూడా ఏం చేస్తారు? ఎప్పుడైనా ఏదైనా విఘ్నం వస్తే, అప్పుడు విశేషంగా స్మృతి చేస్తారు.
ఒకటేమో - సేవ కోసం స్మృతిలో కూర్చోవడము మరియు రెండవది - స్వయంలో లేనిదానిని నింపుకునేందుకు స్మృతిలో కూర్చోవడము. రెండింటిలో తేడా ఉంది. ఏ విధంగానైతే ఇప్పుడు కూడా విశ్వంలో అశాంతితో కూడిన వాయుమండలం ఉంది కనుక సేవ కోసం సంగఠిత రూపంలో విశేషంగా స్మృతి యొక్క ప్రోగ్రామ్ ను తయారుచేస్తారు, అది వేరే విషయము. అది దాతగా అయి ఇవ్వడము కోసం చేస్తారు. అది యాచించడం కోసం చేయరు, ఇతరులకు ఇవ్వడం కోసం చేస్తారు. కనుక అది సేవ కోసం అయినట్లు. కానీ తమలో లేనిదానిని నింపుకునేందుకు అవసరమైన సమయంలో విశేషంగా స్మృతి చేస్తారు, అది నిర్లక్ష్యం యొక్క స్మృతి అవుతుంది. స్మృతి ఉంటుంది, మర్చిపోరు కానీ - మేము ఉన్నదే బాబాకు చెందినవారిగా, ఇంకెవరున్నారు అని అంటూ నిర్లక్ష్యపు స్మృతి ఉంటుంది. కానీ యథార్థమైన శక్తిశాలి స్మృతికి ప్రత్యక్ష ఋజువు ఏమిటంటే, సమయమనుసారంగా శక్తి అనేది హాజరవ్వాలి. నేను స్మృతిలోనే ఉంటాను - అని ఎవరెంతగా చెప్పినా కానీ స్మృతి యొక్క స్వరూపము - సఫలత. అంతేకానీ, ఏ సమయంలో స్మృతిలో కూర్చుంటారో, ఆ సమయంలో సంతోషం కూడా అనుభవమవుతుంది, శక్తి కూడా అనుభవమవుతుంది మరియు ఎప్పుడైతే కర్మలోకి, సంబంధ-సంపర్కంలోకి వస్తారో, ఆ సమయంలో సదా సఫలత ఉండదు - అన్నట్లు ఉండదు. అటువంటివారిని కర్మయోగి అని అనరు. శక్తులు అనేవి శస్త్రాలు మరియు శస్త్రాలు ఏ సమయం కోసం ఉంటాయి? శస్త్రాలను సదా అవసరమైన సమయంలో ఉపయోగించడం జరుగుతుంది.
యథార్థ స్మృతి అనగా సదా సర్వ శక్తి సంపన్నము. సదా శక్తిశాలి శస్త్రాలు కలిగి ఉండాలి. పరిస్థితి రూపీ శత్రువు వచ్చినప్పుడు శస్త్రాలు పనిచేయకపోతే, వారినేమంటారు? శక్తిశాలి లేక శస్త్రధారి అని అంటారా? ప్రతి కర్మలో స్మృతి అనగా సఫలత ఉండాలి. అటువంటివారినే కర్మయోగి అని అంటారు. కేవలం కూర్చున్న సమయంలో మాత్రమే యోగీ కాదు. మీ యోగం పేరు కూర్చున్న యోగి అనా లేక కర్మయోగి అనా? కర్మయోగి కదా. నిరంతరం కర్మలు ఉంటాయి మరియు నిరంతరం కర్మయోగులుగా ఉంటారు. కర్మ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు, నిద్రపోతున్నా సరే అక్కడ కూడా నిద్రపోయే కర్మను చేస్తున్నారు కదా. కనుక ఎలాగైతే కర్మ చేయకుండా ఉండలేరో, అలా ప్రతి కర్మను యోగం లేకుండా చేయలేరు. ఇటువంటివారిని కర్మయోగి అని అంటారు. అంతేకానీ, విషయమే అటువంటిది కదా, పరిస్థితులే అటువంటివి, సమస్యలే అటువంటివి, వాయుమండలమే అటువంటిది అని భావించకండి. ఇదే శత్రువు మరియు ఆ సమయంలో ఒకవేళ ఇలా అంటే, శత్రువు వచ్చేసాడు, అందుకే ఖడ్గాన్ని ఉపయోగించలేకపోయాను, ఖడ్గాన్ని కార్యంలో ఉపయోగించలేకపోయాను లేక ఖడ్గం అసలు గుర్తుకు రానే రాలేదు, లేదా ఖడ్గం పని చేయలేదు, ఇటువంటివారిని ఏమంటారు? శస్త్రధారి అని అంటారా? మీరు శక్తి సైన్యము. మరి సైన్యానికి శక్తి ఏమిటి? శస్త్రాలు. మరియు శస్త్రాలు అంటే సర్వ శక్తులు. కనుక రిజల్టు ఏం చూసారు? మెజారిటీవారిలో సదా అవసరమైన సమయంలో సర్వ శక్తులను ఆజ్ఞానుసారంగా నడిపించడములో లోపం కనిపించింది. అర్థం చేసుకుంటారు కూడా, కానీ సఫలతా-స్వరూపంలో సమయమనుసారంగా, శక్తిహీనంగా అన్నా అయిపోతారు లేదా కొద్దిగా అసఫలతను అనుభవం చేసి వెంటనే సఫలత వైపుకు నడవడం ప్రారంభిస్తారు. మూడు రకాల వారిని చూసారు.
మొదటి రకంవారు - అదే సమయంలో బుద్ధి ద్వారా - ఇది సరైనది కాదు, చేయకూడదు అని అర్థం చేసుకుంటారు, కానీ ఆ వివేకాన్ని శక్తి స్వరూపంలోకి మార్చలేరు.
రెండవ రకంవారు - అర్థం చేసుకుంటారు కూడా, కానీ అర్థం చేసుకుంటున్నప్పటికీ సమయం గడిచిపోయిన తర్వాత లేక సమస్య పూర్తయిన తర్వాత ఆలోచిస్తారు. మొదటి రకంవారు ఆ కొద్ది సమయంలో ఆలోచిస్తారు, రెండవ రకంవారు పూర్తయిన తర్వాత ఆలోచిస్తారు.
మూడవ రకంవారు - ఇది తప్పు అని అసలు రియలైజ్ అవ్వరు, సదా తమ తప్పును ఒప్పుగానే ఋజువు చేస్తారు అనగా సత్యతను రియలైజ్ అయ్యే శక్తి లేదు. మరి నేను ఎవరిని అని స్వయాన్ని చెక్ చేసుకోండి.
బాప్ దాదా ఏం చూసారంటే, వర్తమాన సమయమనుసారంగా సదా మరియు సహజ సఫలతను ఏ పిల్లలు ప్రాప్తి చేసుకున్నారు. వారిలో కూడా తేడా ఉంది. ఒకరేమో - సహజంగా సఫలతను ప్రాప్తి చేసుకునేవారు మరియు రెండవవారు, శ్రమ మరియు సహజము - ఈ రెండింటి తర్వాత సఫలతను పొందేవారు. ఎవరైతే సహజంగా మరియు సదా సఫలతను ప్రాప్తి చేసుకుంటారో, వారి మూల ఆధారము ఏం చూసారు? ఏ ఆత్మలైతే సదా స్వయాన్ని నిర్మాన-చిత్తము అనే విశేషత ద్వారా నడిపిస్తూ ఉంటారో, వారే సహజంగా సఫలతను ప్రాప్తి చేసుకుంటూ వచ్చారు. ‘నిర్మానము’ అనేది కేవలం ఒక పదమే కానీ నిర్మాన-స్థితి యొక్క విస్తారము మరియు సమయమనుసారంగా నిర్మాన-స్థితి యొక్క రకాలు... ఇవి చాలా ఉన్నాయి. దీని గురించి తర్వాత ఎప్పుడైనా వినిపిస్తాము. కానీ ఇది గుర్తుంచుకోండి, నిర్మానముగా అవ్వడమే స్వమానము మరియు సర్వుల ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సహజ సాధనము. నిర్మానముగా అవ్వడము అనగా వంగడము కాదు, కానీ తమ విశేషత మరియు ప్రేమలో సర్వులను వంగేలా చేయడము. అర్థమయిందా?
అందరూ రిజల్టు విన్నారు. సమయం మీ కోసం ఎదురు చూస్తూ ఉంది కానీ మీరేం చేస్తున్నారు? మీరు సమయం కోసం ఎదురు చూస్తున్నారా? మీరు యజమానికి బాలకులు కదా. కనుక సమయం మీ కోసం ఎలా ఎదురు చూస్తుందంటే, నా ఈ యజమానులు సమయమునైన నన్ను పరివర్తన చేస్తారు. అది ఎదురు చూస్తూ ఉంది కానీ మీరు ఏర్పాట్లు చేయాలి, ఎదురు చూడకూడదు. సర్వులకు సందేశమిచ్చే మరియు సమయాన్ని సంపన్నం చేసే ఏర్పాట్లు చేయాలి. ఎప్పుడైతే ఈ రెండు కార్యాలు సంపన్నమవుతాయో, అప్పుడు సమయం యొక్క ఎదురు చూపు పూర్తవుతుంది. మరి ఇటువంటి ఏర్పాట్లను అందరూ చేస్తున్నారా? ఏ వేగంతో? సమయాన్ని చూసి మీరు కూడా అంటారు, సమయం చాలా వేగంగా గడుస్తూ ఉంది అని. ఇన్ని సంవత్సరాలు ఎలా పూర్తి అయ్యాయి అని ఆలోచిస్తారు కదా! అవ్యక్త బాబా యొక్క పాలన మొదలై ఎన్ని సంవత్సరాలైంది! సమయం ఎంత వేగంగా గడిచిపోయింది! మరి మీ వేగం ఎలా ఉంది? ఫాస్ట్ గా ఉందా? లేక ఫాస్ట్ గా వెళ్ళి అప్పుడప్పుడు అలసిపోయి విశ్రాంతి తీసుకుంటారా? చేస్తున్నారు, డ్రామా యొక్క బంధనంలోనైతే బంధింపబడే ఉన్నారు. కానీ వేగం ఎలా ఉంది, ఇది చెక్ చేసుకోండి. సేవ జరుగుతూ ఉంది, పురుషార్థము జరుగుతూ ఉంది, ముందుకు వెళ్తున్నారు, ఇదైతే బాగానే ఉంది. కానీ ఇప్పుడు వేగాన్ని చెక్ చేసుకోండి, కేవలం నడవడాన్ని మాత్రమే చెక్ చేసుకోకండి. వేగాన్ని చెక్ చేసుకోండి, స్పీడ్ ను చెక్ చేసుకోండి, అర్థమయిందా? అందరూ తమ పనులు చేసుకుంటున్నారు కదా. అచ్ఛా!
నలువైపులా ఉన్న సదా తండ్రి ఎదురుగా ‘సరే బాబా’ అని అనేవారు, సదా మాస్టర్ సర్వశక్తివంతులుగా అయి సర్వ శక్తులను స్వయం యొక్క ఆజ్ఞానుసారంగా నడిపించేవారు, సర్వ శక్తులు ‘చిత్తం ప్రభు’ యొక్క పాత్రను అభినయించే - ఇటువంటి సదా సఫలతామూర్తి ఆత్మలకు, సదా ప్రతి కర్మలో స్మృతి స్వరూపాన్ని అనుభవం చేసే మరియు చేయించేవారు - ఇటువంటి అనుభవీ ఆత్మలకు సదా ప్రతి కర్మలో, సంబంధంలో, సంపర్కంలో నిర్మానులుగా అయి విజయీ-రత్నాలుగా అయ్యేవారు, ఇటువంటి సహజ సఫలతామూర్తులైన శ్రేష్ఠమైన పిల్లలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత మిలనము
సాధారణ కర్మలలో కూడా ఉన్నతమైన స్థితి యొక్క మెరుపును చూపించడమే ఫాలో ఫాదర్ చేయడము
సదా సంగమయుగీ పురుషోత్తమ ఆత్మను - ఇలా అనుభవం చేస్తున్నారా? సంగమయుగము యొక్క పేరే పురుషోత్తమము అనగా పురుషుల నుండి ఉత్తమ పురుషులుగా తయారుచేసే యుగము. మరి మీరు సంగమయుగమువారేనా? మీరందరూ పురుషోత్తములుగా అయ్యారు కదా. ఆత్మ పురుష్ మరియు శరీరము ప్రకృతి. కనుక పురుషోత్తమము అనగా ఉత్తమమైన ఆత్మను. అందరికన్నా నంబరువన్ పురుషోత్తములు ఎవరు? (బ్రహ్మా బాబా) అందుకే బ్రహ్మా ను ఆది దేవ్ అని అంటారు. ‘ఫరిశ్తా బ్రహ్మా’ కూడా ఉత్తమమైనవారిగా అయ్యారు మరియు తర్వాత భవిష్యత్తులో దేవాత్మగా తయారైన కారణంగా పురుషోత్తమునిగా అవుతారు. లక్ష్మీ-నారాయణులను కూడా పురుషోత్తములని అంటారు కదా. కావున ఇది పురుషోత్తమ యుగము, పురుషోత్తమముగా ఉన్నది ఆత్మనైన నేను. పురుషోత్తమ ఆత్మల కర్తవ్యము కూడా సర్వ శ్రేష్ఠమైనది. లేచారు, తిన్నారు-తాగారు, పనులు చేసారు, ఇలాంటి సాధారణ కర్మలు కాదు, సాధారణ కర్మలు చేస్తూ కూడా శ్రేష్ఠమైన స్మృతి, శ్రేష్ఠమైన స్థితి ఉండాలి. వారిని చూస్తూనే ఎలాంటి అనుభూతి కలగాలంటే - వీరు సాధారణమైన వ్యక్తి కాదు. ఏ విధంగానైతే అసలైన వజ్రం ఉంటుంది, అది ఎంత ధూళిలో దాగి ఉన్నా కానీ, తన మెరుపును తప్పకుండా చూపిస్తుంది, దాగి ఉండలేదు. మరి మీ జీవితము వజ్రతుల్యమైనది కదా.
ఎలాంటి వాతావరణంలో ఉన్నా కానీ, ఎలాంటి సంగఠనలో ఉన్నా కానీ, ఎలాగైతే వజ్రము తన మెరుపును దాచిపెట్టలేదో, అలా పురుషోత్తమ ఆత్మల శ్రేష్ఠమైన మెరుపు అందరికీ అనుభవమవ్వాలి. మరి ఇలా ఉన్నారా లేక ఆఫీసుకు వెళ్ళి, పనిలోకి వెళ్ళి మీరు కూడా అలాగే సాధారణంగా అయిపోతారా? ఇప్పుడు గుప్తంగా ఉన్నారు, పని కూడా సాధారణమైనది, అందుకే పాండవులను గుప్త రూపంలో చూపించారు. గుప్త రూపంలో రాజ్యం చేయలేదు, సేవ చేసారు. కావున ఇతరుల రాజ్యంలో గవర్నమెంట్-సర్వెంట్ గా పిలవబడతారు కదా. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కానీ సేవకులే కదా. కావున గుప్త రూపంలో మీరందరూ సేవాధారులు కానీ సేవాధారులుగా ఉంటూ కూడా మీరు పురుషోత్తములు. కావున ఆ మెరుపు మరియు నషా కనిపించాలి.
ఏ విధంగానైతే బ్రహ్మా బాబా సాధారణ తనువులో ఉంటూ కూడా పురుషోత్తమునిగా అనుభవమయ్యేవారు. అందరూ విన్నారు కదా. చూసారా లేక విన్నారా? ఇప్పుడు అవ్యక్త రూపంలో కూడా ఏం చూస్తారంటే - సాధారణ రూపములో పురుషోత్తముని మెరుపు! కావున ఫాలో ఫాదర్ చేయాలి కదా. అంతేకానీ, సాధారణమైన పని చేస్తున్నామని కాదు. మాతలు భోజనం తయారుచేస్తున్నారు, బట్టలు ఉతుకుతున్నారు - పని సాధారణమైనది కావచ్చు, కానీ స్థితి సాధారణంగా ఉండకూడదు, స్థితి మహాన్ గా ఉండాలి. ఇలా ఉన్నారా? లేక సాధారణ కర్మలు చేస్తూ సాధారణంగా అవుతున్నారా? ఇతరులు ఎలాగో, మనము అలాగే - అన్నట్లు ఉండకూడదు. ముఖంపై ఆ శ్రేష్ఠ జీవితం యొక్క ప్రభావం ఉండాలి. ఈ ముఖమే దర్పణం కదా. దీని ద్వారానే మీ స్థితిని చూసుకోగలరు. మహాన్ గా ఉన్నారా లేక సాధారణంగా ఉన్నారా, అది ఈ ముఖము అనే దర్పణం ద్వారా చూడగలరు. అది స్వయము కూడా చూసుకోగలరు మరియు ఇతరులు కూడా చూడగలరు. మరి ఇలా అనుభవం చేస్తున్నారా? సదా స్మృతి మరియు స్థితి శ్రేష్ఠంగా ఉండాలి. స్థితి శ్రేష్ఠంగా ఉన్నట్లయితే మెరుపు స్వతహాగా శ్రేష్ఠంగా ఉంటుంది.
ఎవరైతే సమాన స్థితి కలవారు ఉంటారో, వారు సదా తండ్రితో పాటు ఉంటారు. శరీరంతో ఏ మూలన కూర్చున్నా, ఒక పక్కన కూర్చున్నా, వెనుక కూర్చున్నా, మనసు యొక్క స్థితి ద్వారా తోడుగా ఉంటారు కదా. ఎవరైతే సమానంగా ఉంటారో, వారే తోడుగా ఉంటారు. స్థూలంగా ఎదురుగా కూర్చున్నా కానీ సమానంగా లేకపోతే సదా తోడుగా ఉండరు, ఒక పక్కకు ఉంటారు. కావున సమీపంగా ఉండడము అనగా సమాన స్థితిని తయారుచేసుకోవడము, అందుకే సదా బ్రహ్మా బాబా సమానంగా పురుషోత్తమ స్థితిలో స్థితులై ఉండండి. లౌకిక పరంగా కూడా చాలా మంది పిల్లల యొక్క ముఖము మరియు నడవడిక తండ్రి సమానంగా ఉంటే - వీరైతే తండ్రి వలె ఉన్నారు అని అంటారు. అయితే ఇక్కడ ముఖానికి సంబంధించిన విషయము కాదు, కానీ నడవడికయే చిత్రము. కావున ప్రతి నడవడిక ద్వారా తండ్రి యొక్క అనుభవం అవ్వాలి, దీనిని తండ్రి సమానము అని అంటారు. మరి సమీపంగా ఉండాలనుకుంటున్నారా లేక దూరంగానా? సంగమంలో, ఈ ఒక్క జన్మలో, స్థితిలో ఎవరైతే సమీపంగా ఉంటారో, వారు పరంధామంలో కూడా సమీపంగా ఉంటారు మరియు రాజధానిలో కూడా సమీపంగా ఉంటారు. ఒక్క జన్మలోని సమీపత అనేక జన్మలకు సమీపంగా ఉండేలా చేస్తుంది.
ప్రతి కర్మను చెక్ చేసుకోండి. తండ్రి సమానంగా ఉంటే చేయండి, లేదంటే మార్చుకోండి. మొదట చెక్ చేసుకోండి, ఆ తర్వాత చేయండి. అంతేకానీ, చేసిన తర్వాత - ఇది సరిగ్గా లేదు అని చెక్ చేసుకోవడము కాదు. జ్ఞాని యొక్క లక్షణము ఏమిటంటే - మొదట ఆలోచించాలి, ఆ తర్వాత చేయాలి. అజ్ఞాని యొక్క లక్షణము - చేస్తారు, ఆ తర్వాత ఆలోచిస్తారు. మరి మీరు ‘‘జ్ఞానయుక్త ఆత్మలు’’ కదా. లేక అప్పుడప్పుడు భక్తులుగా అవుతారా? పంజాబ్ వారు ధైర్యవంతులు కదా. మనసుతో కూడా ధైర్యవంతులు. మాయ కొద్దిగా చీమ రూపంలో వస్తే భయపడడము అన్నట్లు కాదు. మీరు ఛాలెంజ్ చేసేవారు. విద్యార్థులు ఎప్పుడైనా పరీక్షకు భయపడతారా? మరి మీరు ధైర్యవంతులా లేక చిన్న పరీక్షకు కూడా భయపడేవారా? యోగ్యులైన విద్యార్థులు ఎవరైతే ఉంటారో - వారు, త్వరగా పరీక్షలు అవ్వాలి మరియు పై క్లాసుకు వెళ్ళాలి అని ఆహ్వానిస్తారు. ఎవరైతే బలహీనంగా ఉంటారో, వారు - తారీఖు వాయిదా అవ్వాలి అని ఆలోచిస్తారు. మీరైతే తెలివైనవారు కదా.
మేమే కల్ప-కల్పము యొక్క విజయులము మరియు మేమే పదే-పదే అలా అవుతాము, ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. ఇంతటి పురుషార్థం చేసారా? మీరు అవ్వకపోతే ఇంకెవరు అవుతారు? మీరే ఇంతకుముందు కూడా విజయులుగా అయ్యారు, ఇప్పుడు విజయులుగా అయ్యారు మరియు విజయులుగా ఉంటారు. ‘విజయీ’ అన్న పదం పలకడంతోనే ఎంత సంతోషం కలుగుతుంది! ముఖం మారిపోతుంది కదా. ఎవరైతే సదా విజయులుగా ఉంటారో, వారు ఎంత సంతోషంగా ఉంటారు! అందుకే ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా క్షేత్రంలో విజయం ప్రాప్తి చేసుకుంటే సంతోషపు వాయిద్యాలు మోగుతాయి. మీకైతే సదా వాయిద్యాలు మోగుతాయి. ఎప్పుడూ సంతోషపు వాయిద్యాలు ఆగకూడదు. అర్ధకల్పం కొరకు ఏడ్వడము సమాప్తమైపోయింది. ఎక్కడైతే సంతోషపు వాయిద్యాలు మోగుతాయో, అక్కడ ఏడ్వడము జరగదు. అచ్ఛా!
Comments
Post a Comment