10-12-1992 అవ్యక్త మురళి

  10-12-1992         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘పూర్వజులము మరియు పూజ్యులము అనే స్మృతిలో ఉంటూ సర్వుల అలౌకిక పాలనను చేయండి’’

ఈ రోజు విశ్వ-రచయిత అయిన తండ్రి తమ శ్రేష్ఠ రచనను చూస్తున్నారు. సర్వ రచనలలోకల్లా శ్రేష్ఠ రచన బ్రాహ్మణాత్మలైన మీరే ఎందుకంటే మీరే విశ్వానికి పూర్వజ ఆత్మలు. ఒక వైపు పూర్వజులు, దానితో పాటు పూజ్య ఆత్మలు కూడా. ఈ కల్పవృక్షానికి పునాది అనగా వేర్లు బ్రాహ్మణాత్మలైన మీరే. ఈ వృక్షానికి మూల ఆధారమైన 'కాండము' కూడా మీరే, అందుకే మీరు సర్వాత్మలకు పూర్వజులు. సృష్టి చక్రంలో విశేషంగా ఎవరైతే ధర్మ-పితలు అని పిలవబడతారో, ఆ ధర్మపితలకు కూడా పూర్వజ ఆత్మలైన మీ ద్వారానే తండ్రి సందేశం ప్రాప్తిస్తుంది, దీని ఆధారంగానే సమయమనుసారంగా ఆ ధర్మపితలు తమ ధర్మానికి చెందిన ఆత్మలకు సందేశమిచ్చేందుకు నిమిత్తంగా అవుతారు. ఏ విధంగానైతే బ్రహ్మాబాబా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ గా ఉన్నారో, అలా బ్రహ్మాతో పాటు బ్రాహ్మణాత్మలైన మీరు కూడా సహచరులుగా ఉన్నారు, అందుకే పూర్వజ ఆత్మలైన మీరు మహిమ చేయబడ్డారు.

పూర్వజ ఆత్మలకు, డైరెక్ట్ గా (ప్రత్యక్షంగా) లేక ఇన్ డైరెక్ట్ గా (పరోక్షంగా) సర్వాత్మలతో సంబంధం ఉంది. ఏ విధంగానైతే వృక్షం యొక్క కొమ్మలు-రెమ్మలు అన్నింటి సంబంధము వేర్లతో లేక కాండముతో తప్పకుండా ఉంటుంది. అదే విధంగా ఏ ధర్మం యొక్క చిన్న లేక పెద్ద కొమ్మలు-రెమ్మలైనా కానీ సంబంధం స్వతహాగానే ఉంటుంది. కనుక మీరు పూర్వజులైనట్లు కదా. అర్ధకల్పము రాజ్యాధికారులుగా అయిన తర్వాత మళ్ళీ పూజ్య ఆత్మలుగా అవుతారు. పూజ్యులుగా అవ్వడంలో కూడా ఆత్మలైన మీ వంటి పూజ ఇక ఏ ఇతర ధర్మాత్మలకు కూడా జరగదు. ఏ విధంగానైతే పూజ్య ఆత్మలైన మీకు విధి పూర్వకంగా పూజ జరుగుతుందో, అలా ఏ ధర్మ-పితలకు కూడా పూజ జరగదు. తండ్రి కార్యంలో బ్రాహ్మణాత్మలైన మీరు ఎవరైతే సహచరులుగా అవుతారో, వారికి కూడా దేవత లేక దేవీ రూపంలో విధి పూర్వకంగా పూజ జరుగుతుంది. ఇక ఏ ఇతర ధర్మపితల సహచరులకు, ధర్మ పాలన చేసే ఆత్మలకు విధి పూర్వకంగా పూజ జరగదు, మహిమ జరుగుతుంది. విగ్రహాలను (మూర్తులను) తయారుచేస్తారు కానీ మీ వంటి పూజ్యులుగా అవ్వరు.

మీకు మహిమ కూడా జరుగుతుంది, అలాగే పూజ కూడా జరుగుతుంది. బ్రాహ్మణాత్మలైన మీ మహిమ యొక్క విధి కూడా అందరికన్నా అతీతమైనది. ఏ విధంగానైతే దేవాత్మలైన మీ మహిమ చాలా సుందరంగా కీర్తనల రూపంలో జరుగుతుందో, హారతి రూపంలో జరుగుతుందో, అలా ఇతర ఆత్మల మహిమ ఈ విధంగా జరగదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే శ్రేష్ఠ రచన అయిన మీరు పూర్వజులు మరియు పూజ్యులు. బ్రాహ్మణాత్మలైన మీరు ఆది ఆత్మలు ఎందుకంటే ఆది దేవ్ అయిన బ్రహ్మాకు సహయోగులుగా, శ్రేష్ఠ కార్యానికి నిమిత్తులుగా అయ్యారు. అనాది రూపంలో కూడా పరమ ఆత్మకు అతి సమీపంగా ఉండేవారు. ఆత్మల చిత్రం ఏదైతే చూపిస్తారో, అందరికన్నా సమీప ఆత్మలుగా ఎవరిని చూపిస్తారు? అందులో మీరు ఉన్నారు. కనుక అనాది రూపంలో కూడా అతి సమీపంగా ఉన్నారు, దీనినే డబల్ విదేశీయులు నియరెస్ట్ మరియు డియరెస్ట్ అని అంటారు. స్వయాన్ని ఈ విధంగా భావిస్తున్నారా?

పూర్వజుల పని ఏమిటి? పూర్వజులు అందరి పాలన చేస్తారు. పెద్దవారి పాలనయే ప్రసిద్ధమైనది. కనుక పూర్వజ ఆత్మలైన మీరందరూ సర్వాత్మల పాలన చేస్తున్నారా? లేదా కేవలం మీ వద్దకు వచ్చే విద్యార్థుల పాలన మాత్రమే చేస్తున్నారా? లేక సంబంధ-సంపర్కంలోకి వచ్చే ఆత్మల పాలన చేస్తున్నారా? మొత్తం విశ్వంలోని ఆత్మలకు పూర్వజులా లేక కేవలం బ్రాహ్మణాత్మలకు పూర్వజులా? వేర్లు మరియు కాండము ఏవైతే ఉంటాయో, అవి పూర్తి వృక్షం కోసం ఉంటాయా లేక కేవలం తన కాండం కోసం మాత్రమే ఉంటాయా? కొమ్మలు-రెమ్మలు అన్నింటి కోసం ఉంటాయి కదా. వేర్లు మరియు కాండము ద్వారా పూర్తి వృక్షంలోని ఆకులన్నింటికీ నీరు లభిస్తుంది. లేదా కేవలం కొన్ని కొమ్మలు-రెమ్మలకు మాత్రమే నీరు లభిస్తుందా? అన్నింటికీ లభిస్తుంది కదా. చివర్లో ఉన్న ఆకులకు కూడా లభిస్తుంది. ఇంతటి అనంతమైన నషా ఉందా? లేక అనంతము నుండి హద్దులోకి కూడా వచ్చేస్తారా? ఎంత సేవ చేయాలి! ప్రతి ఆకుకు నీరు ఇవ్వాలి అనగా సర్వాత్మల పాలన చేసేందుకు మీరు నిమిత్తులు.

ఎవరైనా ఇతర ధర్మాల ఆత్మలను కలిసినప్పుడు లేక చూసినప్పుడు కూడా - “ఓ పూర్వజ ఆత్మలూ, ఇలా అనుభవం చేస్తున్నారా, ఈ ఆత్మలందరూ మా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వంశావళివారు, బ్రాహ్మణాత్మలైన మేము కూడా మాస్టర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్లము అనగా పూర్వజులము, వీరందరూ మా వారే’’ అని. లేక కేవలం బ్రాహ్మణాత్మలు మాత్రమే మన వారా? పరస్పరంలో అందరూ సోదరులు అని అంటున్నప్పుడు పూర్వజ ఆత్మలైన మీరు పెద్ద అన్నయ్యలు అనగా తండ్రి సమానమైనవారు. ఈ స్మృతిని ప్రాక్టికల్ జీవితంలో అనుభవం చేయాలి మరియు చేయించాలి. పూర్వజ ఆత్మలైన మీ అందరి పాలనా స్వరూపం ఏమిటి? లౌకిక జీవితంలో కూడా పాలనకు ఆధారం ఏమిటి? పాలన చేయడము అనగా ఎవరినైనా శక్తిశాలిగా తయారుచేయడము. ఏదో ఒక విధితో, సాధనంతో పాలన చేసి శక్తిశాలిగా చేస్తారు - భోజనం ద్వారానైనా, చదువు ద్వారానైనా శక్తిశాలిగా తయారుచేస్తారు. ఆ పాలనకు ప్రత్యక్ష స్వరూపంగా ఆత్మలోనూ, శరీరంలోనూ శక్తి వస్తుంది. కనుక పాలనకు ప్రత్యక్ష స్వరూపము - శక్తిశాలిగా తయారుచేయడము.

పూర్వజ ఆత్మలైన మీ పాలన యొక్క విధి ఏమిటి? అలౌకిక పాలన యొక్క స్వరూపము ఏమిటంటే, స్వయానికి తండ్రి ద్వారా ప్రాప్తించిన సర్వ శక్తులను ఇతర ఆత్మలలో నింపడము. ఏ ఆత్మకు ఏ శక్తి అవసరమో, వారికి ఆ సమయంలో ఆ శక్తి ద్వారా పాలన చేయడము - ఇలాంటి పాలన చేయడం వస్తుందా? మీరు పూర్వజులే కదా. అందరూ పూర్వజ ఆత్మలేనా లేక చిన్నవారా? అందరూ పూర్వజులేనా లేక ఎవరో కొంతమంది మాత్రమే పూర్వజులా? మరి పూర్వజులకు పాలన చేయడం వస్తుంది కదా. కేవలం సెంటరు యొక్క పాలననే చేస్తారా లేక మొత్తం విశ్వంలోని ఆత్మలకు పాలన చేస్తారా? కేవలం ప్రవృత్తిని మాత్రమే పాలన చేస్తారా లేక విశ్వాన్ని పాలన చేస్తారా? వర్తమాన సమయంలో పూర్వజ ఆత్మలైన మీ పాలన సర్వాత్మలకు అవసరము.

ఏమేం జరుగుతుంది అనే వార్తలనైతే అందరూ చాలా ఆసక్తితో వింటారు (అయోధ్యలో జరిగిన సంఘటన తర్వాత చాలా స్థానాల నుండి హింస యొక్క వార్తలు అందుతున్నాయి). కానీ పూర్వజ ఆత్మలు సమాచారం విన్న తర్వాత సర్వుల పాలనను చేసారా? అశాంతి సమయంలో పూర్వజ ఆత్మలైన మీకు ఇది ఇంకా విశేష కార్యంగా స్వతహాగానే అవుతుంది. కనుక ఓ పూర్వజులారా! పాలన యొక్క మీ సేవలో నిమగ్నమవ్వండి. ఏ విధంగానైతే అశాంతి సమయంలో విశేషంగా పోలీసులు లేక మిలట్రీవారు, అశాంతిని శాంతిగా చేయడము మా కార్యము అని భావిస్తారు. ఆజ్ఞ లభించగానే వచ్చి చేరుకుంటారు మరియు ఇటువంటి సమయంలో విశేషమైన అటెన్షన్ తో తమ సేవ చేసేందుకు అలర్ట్ గా అవుతారు. మీరందరూ అలజడి యొక్క సమాచారాన్ని అయితే విన్నారు కానీ సేవలో అలర్ట్ అయ్యారా లేక వినే ఆనందాన్ని మాత్రమే తీసుకున్నారా? మీ పూర్వజ స్థితి స్మృతిలోకి వచ్చిందా? ఆత్మలందరినీ శాంతి శక్తితో పాలన చేశారా? లేక ఇక్కడ ఇది జరిగింది, అక్కడ ఇది జరిగింది అని ఇదే ఆలోచిస్తున్నారా? ఇలాంటి సమయంలో విశేష ఆత్మల సేవ అత్యంత అవసరము. మీ వృత్తి ద్వారా, మనసా శక్తి ద్వారా విశేషమైన సేవ చేశారా? లేదంటే ఎలాగైతే విధి పూర్వకంగా స్మృతి చేస్తారో, సేవ చేస్తారో అలాగే చేశారా? మీరు ఆత్మిక సమాజ సేవకులు కూడా. మరి ఆత్మిక సమాజ సేవకులు తమ విశేషమైన సమాజ సేవను అదనంగా చేశారా? ఇంత బాధ్యత మాది ఉంది అని భావించారా? లేక ప్రోగ్రామ్ లభిస్తేనే చేస్తారా? ఇలాంటి సమయంలో క్షణంలో తమ సేవకు అలర్ట్ అవ్వాలి. ఇదే పూర్వజ ఆత్మలైన మీ బాధ్యత.

ఇప్పుడు కూడా విశ్వంలో అలజడి ఉంది మరియు ఈ అలజడి ఎప్పటికప్పుడు ఇంకా పెరిగేదే ఉంది. ఆత్మలైన మీ కర్తవ్యం ఏమిటంటే - ఇటువంటి సమయంలో ఆత్మలలో విశేషంగా శాంతిని, సహనశక్తి యొక్క ధైర్యాన్ని నింపడము, లైట్ హౌస్ గా అయి అందరికీ శాంతి ప్రకాశాన్ని ఇవ్వడము. ఏం చేయాలో అర్థమయిందా? ఇప్పుడు మీ బాధ్యతను లేక కర్తవ్యాన్ని ఇంకా తీవ్ర వేగంతో పాటించండి, తద్వారా ఆత్మలకు ఆత్మిక శక్తి యొక్క ఊరట లభించాలి, రగులుతున్న దుఃఖపు అగ్నిలో శీతల జలాన్ని నింపిన అనుభవం చేయాలి. ఈ కర్తవ్యాన్ని చేయగలరా? దూరం నుండి కూడా చేయగలరా లేక ఎదురుగా వచ్చినపుడే చేస్తారా? చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు అలజడి తీవ్రమయ్యే కొలది మీ సేవ కూడా ఇంకా తీవ్రమవ్వాలి. పూర్వజుల పాలన ఏమిటో అర్థమయిందా? అంతేకానీ, పూర్వజులుగా ఉన్నారు కానీ పాలన చేయలేరు అని కాదు. పూర్వజుల కర్తవ్యమే పాలన ద్వారా శక్తి నింపడము. శ్రేష్ఠమైన శక్తిశాలి స్థితి ద్వారా పరిస్థితిని దాటే శక్తిని అనుభవం చేయించండి. అచ్ఛా!

నలువైపులా ఉన్న ఆదిదేవ్ బ్రహ్మాకు సహాయకులైన ఆది ఆత్మలందరికీ, సర్వాత్మలకు పునాది అయిన పూర్వజ ఆత్మలకు, సదా సర్వాత్మల పట్ల అనంతమైన సేవ చేసే శ్రేష్ఠ వృత్తిని ఉంచుకునే ఆత్మలందరికీ, ఆత్మిక సమాజ సేవాధారి ఆత్మలందరికీ బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో మిలనము - వర్తమాన సమయంలో అశాంతి ఆత్మలకు శాంతినివ్వడము - ఇదే అందరి విశేష కార్యము. దయాహృదయుడైన తండ్రి యొక్క పిల్లలకు సర్వాత్మల పట్ల దయ కలుగుతుంది కదా. దయాహృదయులు ఏం చేస్తారు? దయ అంటేనే అర్థము, ఎలాంటి ధైర్యాన్ని అయినా ఇవ్వడము, నిర్బల ఆత్మకు బలాన్ని ఇవ్వడము. కనుక ఆత్మల దుఃఖపూరిత సంకల్పాలు మాస్టర్ సుఖదాతలైన ఆత్మల వద్దకు తప్పకుండా చేరుకుంటాయి. ఎలాగైతే అక్కడ దుఃఖపు అల ఉందో, అలా విశేషమైన ఆత్మలలో ఇవ్వాలి, ఏదో చేయాలి అని సేవ యొక్క విశేషమైన అల నడవాలి. మేము ఏం చేసాము అని ప్రతి ఒక్కరు తమ సేవ యొక్క అదనపు చార్టును చెక్ చేసుకోవాలి. ఏ విధంగానైతే సాధారణ సేవ నడుస్తుంది, అదైతే నడుస్తుంది. కానీ వర్తమాన సమయంలో వాయుమండలం ద్వారా, వృత్తి ద్వారా సేవ చేయడము పట్ల విశేషమైన అటెన్షన్ ఉంచండి. దీని ద్వారానే స్వస్థితి కూడా స్వతహాగా శక్తిశాలిగా అవుతుంది. ఇటువంటి అలను వ్యాపింపజేసారా? విశ్వానికి రాజులుగా అవుతారు కనుక సర్వాత్మల పట్ల అలను వ్యాపింపజేయాలి కదా. ఏ ఆత్మ వంచితమవ్వకూడదు. ఇతర ధర్మాలకు చెందిన ఆత్మలైనా కానీ వాస్తవానికి మీ వంశావళివారే. ఏ ధర్మానికి చెందిన ఆత్మలైనా కానీ అందరికీ వేర్లు ఒకటే కదా. ఈ అల ఉందా? (లేదు). అటెన్షన్ ప్లీజ్!

అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత మిలనము -

వ్యర్థం యొక్క ప్రభావంలోకి వచ్చేవారిగా అవ్వకండి, మీ శ్రేష్ఠ ప్రభావాన్ని వేసేవారిగా అవ్వండి

సదా స్వయాన్ని, పురుషార్థంలో ముందుకు వెళ్ళే ఆత్మను అని అనుభవం చేస్తున్నారా? పురుషార్థంలో ఎప్పుడు కూడా ఒకసారి ఆగే కళ, ఒకసారి దిగే కళ - ఇలా ఉండకూడదు. ఒకసారి చాలా మంచిగా, ఒకసారి మంచిగా, ఒకసారి కొంచెం మంచిగా, ఇలా ఉండకూడదు. సదా చాలా మంచిగా ఉండాలి ఎందుకంటే సమయం తక్కువగా ఉంది మరియు సంపూర్ణంగా అయ్యే గమ్యము శ్రేష్ఠంగా ఉంది. కనుక మీ పురుషార్థ వేగాన్ని కూడా తీవ్రం చేయాల్సి ఉంటుంది. పురుషార్థంలో తీవ్రవేగానికి గుర్తు ఏమిటంటే - వారు సదా డబల్ లైట్ గా ఉంటారు, ఏ రకమైన బరువును అనుభవం చేయరు. ప్రకృతి ద్వారా ఏదైనా పరిస్థితి వచ్చినా, వ్యక్తుల ద్వారా ఏదైనా పరిస్థితి వచ్చినా కానీ ప్రతి పరిస్థితి, స్వస్థితి ముందు అసలు ఏమాత్రం అనుభవమవ్వదు. స్వస్థితి యొక్క శక్తి పర-స్థితి కన్నా చాలా ఉన్నతమైనది, ఎందుకు? ఇది స్వ, అది పరాయి. మీ శక్తిని మర్చిపోతారు, అప్పుడే పర-స్థితి పెద్దదిగా అనిపిస్తుంది. సదా డబల్ లైట్ అంటే అర్థము - లైట్ అనగా పైన ఉండేవారు. తేలికగా ఉండే వస్తువు పైకి వెళ్తుంది. బరువు ఉండే వస్తువు సదా కిందకు వస్తుంది. అర్ధకల్పమైతే కిందకే వస్తూ ఉన్నారు కదా. కానీ ఇప్పుడిది పైకి వెళ్ళే సమయము. కనుక ఏం చేయాలి? సదా పైన ఉండాలి.

శరీరంలో కూడా చూసినట్లయితే ఆత్మ యొక్క నివాస స్థానము పైన ఉంది, ఉన్నతంగా ఉంది. కాళ్ళలోనైతే లేదు కదా. ఏ విధంగానైతే శరీరంలో ఆత్మ స్థానము ఉన్నతంగా ఉందో, అలా స్థితి కూడా సదా ఉన్నతంగా ఉండాలి. బ్రాహ్మణుల గుర్తును కూడా ఉన్నతమైన పిలక స్థానముగా చూపిస్తారు కదా. పిలక అంటే ఉన్నతము అని అర్థము. స్థితి ఉన్నతంగా ఉంది అన్నదానికి స్థూలమైన గుర్తును చూపించారు. శూద్రులను కింద చూపిస్తారు, బ్రాహ్మణులను ఉన్నతంగా చూపిస్తారు. కనుక బ్రాహ్మణుల స్థానము మరియు స్థితి, రెండూ ఉన్నతమైనవే. ఒకవేళ స్థానము గుర్తుంటే స్థితి స్వతహాగా ఉన్నతంగా అవుతుంది. బ్రాహ్మణుల దృష్టి కూడా సదా పైన ఉంటుంది ఎందుకంటే ఆత్మ, ఆత్మలను చూస్తుంది, ఆత్మ పైన ఉంది కనుక దృష్టి కూడా పైకి వెళ్తుంది. ఎప్పుడైనా ఎవరినైనా కలిసినప్పుడు లేక మాట్లాడినప్పుడు ఆత్మను చూస్తూ మాట్లాడుతారు, ఆత్మతో మాట్లాడుతారు. మీ దృష్టి ఆత్మ వైపుకు వెళ్తుంది. ఆత్మ మస్తకంలో ఉంది కదా. కనుక ఉన్నతమైన స్థితిలో స్థితులవ్వడము సహజము.

ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఏర్పడుతుందో, అప్పుడు కింది స్థాయి మాటల నుండి, కింది స్థాయి వాయుమండలం నుండి సదా దూరంగా ఉంటారు, వాటి ప్రభావంలోకి రారు. మంచి ప్రభావం పడుతుందా లేక చెడు ప్రభావం కూడా పడుతుందా? ఒకవేళ ప్రవృత్తిలో చెడు వాయుమండలం ఉంటే అప్పుడేం చేస్తారు? ప్రభావితులవుతారా? చెడును మంచిగా చేసేవారా లేక ప్రభావంలోకి వచ్చేవారా? ఎందుకంటే మాయ కూడా చూస్తుంది - అచ్ఛా, వ్రేలు అయితే పట్టుకున్నాను. వ్రేలు తర్వాత చేతిని పట్టుకుంటుంది, చేతి తర్వాత కాలు పట్టుకుంటుంది, అందుకే ప్రభావంలోకి రాకండి. ప్రభావంలోకి వచ్చేవారు కాదు, శ్రేష్ఠ ప్రభావాన్ని వేసేవారు. కనుక బ్రాహ్మణాత్మ అనగా సదా డబల్ లైట్, ఉన్నతంగా ఉండేవారు. ఈ స్మృతి ద్వారానే ముందుకు ఎగురుతూ వెళ్ళండి.

అందరూ సంతోషంగా ఉన్నారు కదా. దుఃఖపు అల అయితే రాదు కదా? ఎందుకంటే ఎవరైతే దుఃఖధామాన్ని వదిలి వెళ్ళారో వారి వద్దకు దుఃఖపు అల ఎలా రాగలదు. సంగమములో దుఃఖధామము మరియు సుఖధామము, రెండింటి జ్ఞానము ఉంది. మీరు రెండింటి గురించి తెలిసిన నాలెడ్జ్ ఫుల్, శక్తిశాలి ఆత్మలు. పొరపాటున కూడా దుఃఖధామంలోకి వెళ్ళలేరు. సదా సంతోషంగా ఉండేవారి వద్దకు దుఃఖపు అల ఎప్పుడూ రాలేదు. అచ్ఛా! సేవ మరియు స్వ ఉన్నతి - రెండింటి బ్యాలెన్స్ ఉంచండి. అంతేకానీ, సేవలో మునిగిపోయి స్వ ఉన్నతిని మర్చిపోకూడదు. సేవ పట్ల అభిరుచి ఎక్కువగా ఉంది. కానీ రెండింటిలో బ్యాలెన్స్ ఉండాలి. అర్థమయిందా? మంచిగా నడుస్తున్నారు. కానీ కేవలం మంచి వరకే ఆగిపోకండి, ఇంకా మంచి కన్నా మంచిగా నడవాలి.


Comments