21-11-1992 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘కర్మల గుహ్య గతి యొక్క జ్ఞానులుగా అవ్వండి’’
ఈ రోజు సర్వ ఖజానాలను ఇచ్చే తండ్రి పిల్లలందరి జమ ఖాతాను చూస్తున్నారు. ఖజానాలైతే పిల్లలందరికీ తరగనంత లభించాయి మరియు అందరికీ ఒకేలా, ఒకరి ద్వారానే సర్వ ఖజానాలు లభించాయి. ఒక ఖాజానా కాదు, కానీ అనేక ఖజానాలు ప్రాప్తించాయి. అయినా ప్రతి ఒక్కరి జమ ఖాతా వేర్వేరుగా ఉంది. కొందరు సర్వ ఖజానాలను బాగా జమ చేసుకున్నారు మరియు చాలా మంది యథాశక్తి జమ చేసుకున్నారు. మరియు ఎంతైతే జమ చేసుకున్నారో, అంతగానే ముఖము మరియు నడవడికలో ఆ ఆత్మిక నషా కనిపిస్తుంది, జమ చేసుకున్న ఆత్మిక నషా అనుభవమవుతుంది. ఆత్మిక నషా యొక్క మొదటి గుర్తు ఏమిటంటే - ఎంతగా నషా ఉంటుందో అంతగా నిశ్చింత చక్రవర్తి యొక్క మెరుపు వారి ప్రతి కర్మలో కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడైతే ఆత్మిక నషా ఉంటుందో అక్కడ ఎటువంటి చింత ఉండజాలదు. ఏ విధంగా వెలుగు మరియు అంధకారము కలిసి ఉండలేవో, అలా ఈ నషా మరియు చింత, రెండూ ఒకే సమయంలో ఒకే చోట కలిసి ఉండలేవు.
నిశ్చింత చక్రవర్తి యొక్క విశేషత ఏమిటంటే - వారు సదా ప్రశ్నచిత్తులకు బదులుగా ప్రసన్నచిత్తులుగా ఉంటారు. ప్రతి కర్మలో, స్వయానికి సంబంధించి లేదా సర్వులకు సంబంధించి లేదా ప్రకృతికి సంబంధించి కూడా, ఏ సమయంలోనైనా, ఏ విషయంలోనైనా సంకల్పమాత్రంగా కూడా - ‘ఇది ఇలా ఎందుకు’ లేక ‘ఇదేం జరుగుతుంది’, ‘ఇలా కూడా జరుగుతుందా’? అనే ప్రశ్నార్థకాలు ఉండవు. ప్రసన్నచిత్త ఆత్మకు ప్రతి కర్మ చేస్తూ, చూస్తూ, వింటూ, ఆలోచిస్తూ, సంకల్పంలో ఏముంటుందంటే - ఏదైతే జరుగుతూ ఉందో అది నా కొరకు మంచిది మరియు సదా మంచే జరుగుతుంది. ప్రశ్నచిత్త ఆత్మ ఏమిటి, ఎందుకు, ఇలా, అలా... ఈ చిక్కులలో స్వయాన్ని నిశ్చింత స్థితి నుండి చింతలోకి తీసుకొస్తుంది. మరియు నిశ్చింత ఆత్మ చెడును కూడా మంచిలోకి పరివర్తన చేస్తారు, అందుకే వారు సదా ప్రసన్నంగా ఉంటారు.
ఈ రోజుల్లో సైన్స్ సాధనాల ద్వారా కూడా ఏదైతే వ్యర్థమైన మరియు పాడైన సామాగ్రి ఉంటుందో, దానిని పరివర్తన చేసి మంచి వస్తువులను తయారుచేస్తారు. అలాగే ప్రసన్నచిత్త ఆత్మ సైలెన్స్ శక్తి ద్వారా విషయం చెడుగా ఉన్నా, సంబంధాలు చెడుగా అనుభవం అవుతున్నా, ఆ చెడును మంచిలోకి పరివర్తన చేసి స్వయంలో కూడా ధారణ చేస్తారు మరియు ఇతరులకు కూడా తమ శుభభావన యొక్క శ్రేష్ఠ సంకల్పాల ద్వారా చెడును పరివర్తన చేసి మంచిని ధారణ చేసే శక్తిని ఇస్తారు. చాలామంది పిల్లలు ఎలా ఆలోచిస్తారు మరియు మాట్లాడుతారంటే - ‘‘ఆ విషయమే చెడు లేక తప్పు అన్నప్పుడు, తప్పును తప్పు అని అనాల్సే ఉంటుంది కదా! లేదా తప్పును తప్పు అని అర్థం చేసుకోవాల్సే ఉంటుంది కదా!’’ కానీ తప్పును తప్పుగా అర్థం చేసుకోవడమనేది అర్థం చేసుకోవడం పరంగా అర్థం చేసుకున్నారు. ఈ విధంగా రైట్ మరియు రాంగ్ అని అర్థం చేసుకోవడము, తెలుసుకోవడము వేరే విషయము కానీ జ్ఞాన సంపన్న స్వరూపంతో తెలుసుకునేవారు, అర్థం చేసుకున్న తర్వాత స్వయంలో ఏ ఆత్మ యొక్క చెడును, చెడు రూపంలో తమ బుద్ధిలో ధారణ చేయరు. కావున అర్థం చేసుకోవడం వేరే విషయము, అర్థం చేసుకోవడం వరకు రైట్. కానీ స్వయంలో లేక తమ చిత్తములో, తమ బుద్ధిలో, తమ వృత్తిలో, తమ వాణిలో ఇతరుల చెడును చెడు రూపంలో ధారణ చేయకూడదు, ఇముడ్చుకోకూడదు. కావున అర్థం చేసుకోవడము మరియు ధారణ చేయడము - ఇందులో తేడా ఉంది.
స్వయాన్ని రక్షించుకునేందుకు ఏమంటారంటే - ఈ విషయమే తప్పు, తప్పును తప్పు అని చెప్పాల్సి ఉంటుంది కదా. కానీ తెలివైనవారి పని ఏమిటి? తెలివైనవారు ఒకవేళ ఇది చెడు వస్తువు అని అర్థం చేసుకుంటే, మరి చెడు అని అర్థం చేసుకుంటూ కూడా తమ వద్ద జమ చేసుకుంటారా? తమ వద్ద బాగా సంబాళించి పెట్టుకుంటారా? వదిలేస్తారు కదా. లేక జమ చేసుకోవడమే తెలివా? దీనిని తెలివి అని అంటారా? మరియు ఆలోచించండి, ఒకవేళ చెడు విషయాన్ని లేక చెడు నడవడికను స్వయంలో ధారణ చేస్తే, తమ బుద్ధి, వృత్తి, వాణి సదా సంపూర్ణ స్వచ్ఛమైనవిగా భావించబడతాయా? ఒకవేళ కొద్దిగానైనా ఏదైనా దోషము లేక మరక ఉండిపోతే, మురికి ఉండిపోతే, ఆ దోషము కలవారు ఎప్పుడూ పర్ఫెక్ట్ అని పిలవబడరు, ప్రసన్నచిత్తులుగా ఉండలేరు. ఒకవేళ ఎవరి చెడు అయినా చిత్తములో ఉన్నట్లయితే, వారి చిత్తము సదా ప్రసన్నచిత్తంగా ఉండలేదు మరియు చిత్తములో ధారణ అయిన విషయాలు వాణిలోకి తప్పకుండా వస్తాయి, అది ఒకరి ముందైనా వర్ణన చేయవచ్చు, లేక అనేకుల మందైనా వర్ణన చేయవచ్చు. కానీ కర్మల గతి యొక్క గుహ్య రహస్యాన్ని సదా ఎదురుగా ఉంచుకోండి. ఒకవేళ ఎవరి చెడునైనా లేక తప్పుడు విషయాన్ని అయినా చిత్తములో ఉంచుకోవడంతో పాటు వర్ణన చేసినట్లయితే, ఆ వ్యర్థ వర్ణన ఎలా ఉంటుందంటే - ఎలాగైతే ఎవరైనా గుమ్మటంలో శబ్దం చేస్తే, వారి శబ్దమే ఇంకా పెద్ద రూపంలోకి మారి వారి వద్దకు వస్తుంది. గుమ్మటంలో శబ్దం చేసి చూసారా? కనుక ఒకవేళ ఎవరి చెడునైనా వర్ణించే మరియు తప్పును తప్పుగా వ్యాపింపజేసే సంస్కారముంటే, దీనిని మీరు అలవాటు అని అంటారు. ఈ రోజు మీరు ఎవరినైనా నిందిస్తారు మరియు స్వయాన్ని చాలా తెలివైనవారిగా, తప్పులకు దూరంగా ఉన్నవారిగా భావించి వర్ణిస్తారు, కానీ పక్కా నియమము లేక కర్మల సిద్ధాంతము ఏమిటంటే - ఈ రోజు మీరు ఎవరినైనా నిందించారంటే రేపు మరెవరైనా మిమ్మల్ని దానికి రెండింతలు నిందిస్తారు. ఎందుకంటే ఈ తప్పు విషయాలు ఎంత తీవ్ర వేగంతో వ్యాపిస్తాయంటే, ఎలాగైతే ఏదైనా విశేషమైన వ్యాధిని కలిగించే సూక్ష్మ క్రిములు (జీవాణువులు) చాలా త్వరగా వ్యాపిస్తాయి, మరియు అలా వ్యాపిస్తూ ఆ సూక్ష్మ క్రిములనేవి ఎవరినైతే నిందించారో అక్కడ వరకు తప్పకుండా చేరుకుంటాయి. మీరు ఒక నింద వేసి ఉండవచ్చు మరియు వారు మిమ్మల్ని తప్పు అని నిరూపించేందుకు మీపై పది నిందలు వేస్తారు. కనుక రిజల్టు ఏమయింది? కర్మల గతి ఏమయింది? తిరిగి ఎక్కడికి వచ్చింది? ఒకవేళ మీకు ఆ ఆత్మను సరిచేయాలనే శుభభావన ఉంటే, ఆ తప్పు విషయాన్ని శుభభావనా స్వరూపంతో విశేషమైన నిమిత్త స్థానానికి చేర్చవచ్చు, వ్యాపింపజేయడం తప్పు. చాలామంది ఏమంటారంటే - నేనైతే ఎవ్వరికీ చెప్పలేదు కానీ వారు చెప్తూ ఉంటే నేను కూడా అవును, అవును అని అన్నాను, వేరే ఏమీ మాట్లాడలేదు. మీ భక్తి మార్గపు శాస్త్రాలలో కూడా ఏమని వర్ణించారంటే చెడు పనిని చూసినా, దానికి తోడు అందించినా, అది కూడా పాపమే. అవును, అవును అని అనడం కూడా కర్మల గుహ్య గతి ప్రమాణంగా పాపంలో భాగస్థులుగా అవ్వడమే.
వర్తమాన సమయంలో కర్మల గతి యొక్క జ్ఞానాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారు. కానీ ఈ చిన్న-చిన్న సూక్ష్మ పాపాలు శ్రేష్ఠ సంపూర్ణ స్థితిలో విఘ్న రూపంగా అవుతాయి. తేలికగా తీసుకుంటున్నారు అన్నదానికి గుర్తులు ఏమిటి? వారు సదా ఎలా ఆలోచిస్తారు మరియు భావిస్తారంటే - ఇదైతే ఇతరులు కూడా చేస్తారు, ఇదైతే ఈ రోజుల్లో నడుస్తూనే ఉంటుంది. లేదా స్వయాన్ని తేలికగా చేసుకునేందుకు ఏమంటారంటే - నేను సరదాగా అన్నాను, నా భావం అలా లేదు, ఊరకే అలా అన్నాను. ఈ విధి సంపూర్ణ సిద్ధి ప్రాప్తించడంలో సూక్ష్మ విఘ్నంగా అవుతుంది. అందుకే జ్ఞానమైతే చాలా లభించింది, రచయిత మరియు రచనల జ్ఞానాన్ని వినడము, వర్ణన చేయడము చాలా స్పష్టమయ్యాయి కానీ కర్మల గుహ్య గతి యొక్క జ్ఞానము బుద్ధిలో సదా స్పష్టంగా ఉండదు, అందుకే తేలికగా తీసుకుంటారు. చాలామంది పిల్లలకు స్వయం పట్ల కూడా ఫిర్యాదు ఉంటుంది, అదేమిటంటే - తండ్రి ఎలా చెప్తున్నారో, తండ్రి పిల్లల పట్ల ఏ శ్రేష్ఠమైన ఆశలు పెట్టుకుంటారో, ఏం కోరుకుంటారో, ఎంత కోరుకుంటారో అంతగా మేము లేము. దీనికి కారణమేమిటి? ఈ అతి సూక్ష్మమైన వ్యర్థ కర్మలు బుద్ధిని, మనసును ఉన్నతంగా అనుభవం చేయనివ్వవు. యోగం జోడించడానికి కూర్చుంటారు కానీ చాలా సమయం యుద్ధంలో గడిచిపోతుంది, వ్యర్థాన్ని తొలగించి సమర్థంగా అవ్వడంలో సమయం గడిచిపోతుంది, అందుకే ఏం చేయాలి? ఎంత ఉన్నతంగా అవుతారో, ఆ ఉన్నతంలోకి వెళ్ళేటప్పుడు అటెన్షన్ కూడా ఉన్నతంగా పెట్టాల్సి ఉంటుంది.
బ్రాహ్మణ జీవితం యొక్క ఆనందంలో ఉండాలి. ఆనందంగా ఉండడం అంటే అర్థము - ఏది తోస్తే అది చేయడము, ఆనందంగా ఉండడము అని కాదు. ఈ అల్పకాలికమైన సుఖం యొక్క ఆనందము లేక అల్పకాలికమైన సంబంధ-సంపర్కాల ఆనందము సదాకాలికమైన ప్రసన్నచిత్త స్థితికి భిన్నమైనది. దీనినే ఆనందమని భావించకండి. ఏది తోస్తే అది మాట్లాడుతాము, ఏది తోస్తే అది చేస్తాము, మేమైతే ఆనందంగా ఉంటాము. అల్పకాలికముగా మనసుకు తోచినట్టు వ్యవహరించేవారిగా అవ్వకండి. సదాకాలికమైన ఆత్మిక ఆనందంలో ఉండండి. ఇదే యథార్థమైన బ్రాహ్మణ జీవితము. ఆనందంలో కూడా ఉండండి మరియు కర్మల గతి యొక్క జ్ఞానులుగా కూడా ఉండండి. అప్పుడే ఏది కోరుకుంటారో, ఎలా కోరుకుంటారో అలా అనుభవం చేస్తూ ఉంటారు. అర్థమయిందా? కర్మల గుహ్య గతి యొక్క జ్ఞానులుగా అవ్వండి. తర్వాత ఖజానాల జమ యొక్క రిజల్టును వినిపిస్తాము. అచ్ఛా!
నలువైపులా ఉన్న చింతల నుండి దూరంగా నిశ్చింత చక్రవర్తి ఆత్మలకు, సదా ప్రసన్నచిత్త విశేష ఆత్మలకు, సదా స్వయం పట్ల మరియు సర్వాత్మల పట్ల శ్రేష్ఠ పరివర్తనా శక్తిని కర్మలోకి తీసుకొచ్చే కర్మయోగీ ఆత్మలకు, సదా రచయిత-రచనల జ్ఞానులకు మరియు కర్మ-సిద్ధాంతం యొక్క జ్ఞానులకు కూడా - ఇలాంటి జ్ఞాన స్వరూప ఆత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో మిలనము
వర్తమాన సమయంలో ఏ విషయం యొక్క అవసరముంది? కర్మల గుహ్య గతి యొక్క జ్ఞానం మర్జ్ అయ్యింది, అందుకే నిర్లక్ష్యము ఉంది. పురుషార్థులుగా కూడా ఉన్నారు కానీ పురుషార్థంలో నిర్లక్ష్యం వచ్చేస్తుంది, అందుకే ఇప్పుడు దీని అవసరం ఉంది. బాప్ దాదా అందరి రిజల్టును చూస్తారు. ఏదైతే నడుస్తూ ఉందో అది బాగుంది కానీ ఇప్పుడు అత్యంత మంచిగా తయారవ్వాల్సిందే. బిజీగా ఉండాల్సి ఉంటుంది కదా. ఎక్కువ సమయం ఎందులో బిజీగా ఉండాల్సి ఉంటుంది? ఏ విషయంలో ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉంటుంది? స్వయం యొక్క స్థితి అతీతంగా మరియు ప్రియంగా ఉంది కానీ సమయమైతే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ సమయాన్ని పవర్ ఫుల్, శక్తిశాలి లైట్ హౌస్, మైట్ హౌస్ గా అయి వైబ్రేషన్లను వ్యాపింపజేసేందుకు ఉపయోగిస్తే ఏమవుతుంది? సంగఠిత రూపంలో ఇదే వాతావరణం ఉంటే, ఇక వేరే విషయమేదీ లేకపోతే విశ్వానికి లేక ప్రకృతికి ఏ వైబ్రేషన్లు చేరుకుంటాయి? మా రచయితలు మరియు మాస్టర్ రచయితలు ఎప్పుడు సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయి మాతో తమ స్వాగతం చేయించుకుంటారు అని ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రకృతి కూడా స్వాగతం చేస్తుంది కదా. కనుక అది సఫలతా మాలతో స్వాగతం చేయాలి, ఆ రోజు రావాల్సిందే. ఎప్పుడైతే సఫలత యొక్క వాయిద్యాలు మోగుతాయో అప్పుడు ప్రత్యక్షతా వాయిద్యాలు మోగుతాయి. మోగడమైతే మోగాల్సిందే కదా. అచ్ఛా!
చంద్రమణి దాదీ సేవ కోసం వెళ్ళేందుకు సెలవు తీసుకుంటున్నారు
ఆల్ రౌండ్ గా అవ్వడమే శ్రేష్ఠమైన సేవ. మంచిది, అంతటా తిరుగుతూ ఉండండి. అంతటా తిరిగే పాత్ర పిల్లలదే. తండ్రి అయితే అవ్యక్త రూపంలో అంతటా తిరగగలరు. సాకార రూపంలో కూడా అంతటా తిరిగే పాత్ర తండ్రిది కాదు, పిల్లలదే. అచ్ఛా!
అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత మిలనము - విజయమాలలోకి వచ్చేందుకు తీవ్ర పురుషార్థులుగా అవ్వండి
సదా తీవ్ర పురుషార్థీ ఆత్మలమని అనుభవం చేస్తున్నారా? బ్రాహ్మణులుగా అయ్యారు కనుక పురుషార్థులుగా ఉండనే ఉన్నారు. తీవ్ర పురుషార్థులా లేక కేవలం పురుషార్థులా? విని, వినిపించేవారిని పురుషార్థులని అంటారా లేక తీవ్ర పురుషార్థులని అంటారా? వినడము మరియు వినిపించడము, ఆ తర్వాత ఏమవుతుంది? తీవ్ర పురుషార్థులని ఎవరిని అంటారు - వినేవారినా లేక తయారయ్యేవారినా? ఎవరైతే మాలలో 16108 వ నంబరులో ఉంటారో, వారు కూడా తప్పకుండా వింటారు మరియు వినిపిస్తారు. లేకుంటే మాలలోకి ఎలా వస్తారు? కానీ 108 మాలలోకి ఎవరు వస్తారు? 108 మాల యొక్క పేరు విజయీ మాల. 16000 మాల యొక్క పేరు విజయీ మాల కాదు. కనుక వినడము మరియు వినిపించడము - ఇది మెజారిటీ చేస్తారు. కానీ విన్నారు మరియు తయారయ్యారు, ఇటువంటి వారిని తీవ్ర పురుషార్థీ అని అంటారు. తీవ్ర పురుషార్థులు 108 మంది ఉన్నారు మరియు పురుషార్థులు 16108 మంది ఉన్నారు. కనుక తమను తాము చెక్ చేసుకోండి - తీవ్ర పురుషార్థినా లేక పురుషార్థినా? తాము ఎవరు, ఎలా ఉన్నారు అన్నది మెజారిటీ తమకు తాము తెలుసుకోగలరు. ఎవరో కొంతమంది మాత్రము ఎలా ఉన్నారంటే వారికి స్వయం గురించి కూడా తెలియదు, రాంగ్ ను రైట్ అని భావిస్తూ వెళ్తూ ఉంటారు. నేను ఎవరు అన్నది మెజారిటీకి తమ మనసులో తమకు సత్యం తెలుసు. కనుక సదా స్వయాన్ని చూసుకోండి, ఇతరులను కాదు.
మీ పురుషార్థాన్ని చెక్ చేసుకోండి మరియు తీవ్ర పురుషార్థంలోకి చేంజ్ చేసుకోండి. లేకుంటే చివరి సమయం వచ్చినప్పుడు చేంజ్ చేసుకోలేరు. ఆ సమయంలో చదువుకునే సమయం సమాప్తమై ఉంటుంది. పరీక్షల సమయంలో చదువుకునేందుకు అవకాశం లభించదు. ఒకవేళ ఎవరైనా విద్యార్థికి ఒక ప్రశ్నకు జవాబు రాకపోతే పుస్తకం తెరిచి చదువుకొని సమాధానం రాస్తానని అనుకుంటే అది రైటా లేక రాంగా? కనుక ఆ సమయంలో స్వయాన్ని మార్చుకోలేరు. ఎవరో, ఎలా ఉన్నారో దాని అనుసారంగానే ప్రారబ్ధాన్ని ప్రాప్తి చేసుకుంటారు. కానీ ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడింకా టూ లేట్ బోర్డు పడలేదు, లేట్ యొక్క బోర్డు పడింది. లేట్ అయ్యారు కానీ టూ లేట్ అవ్వలేదు కనుక ఇప్పుడింకా అవకాశముంది. చాలామంది విద్యార్థులు 6 నెలల్లో కూడా పాస్ విత్ ఆనర్ గా అవుతారు, ఒకవేళ సరైన పురుషార్థం చేసినట్లయితే. కానీ సమయం సమాప్తమైన తర్వాత ఏమీ చేయలేరు. తండ్రి కూడా దయ చూపించాలని అనుకున్నా చూపించలేరు. పోనీలే, వీరు మంచివారు, వీరికి మార్కులు ఇచ్చేద్దాము, తండ్రి ఇలా చేయగలరా? అందుకే ఇప్పటి నుండే చెక్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోండి.
నిర్లక్ష్యాన్ని వదిలేయండి. బాగున్నాము, నడుస్తున్నాము, చేరుకుంటాము - ఇది నిర్లక్ష్యము. నిర్లక్ష్యముగా ఉన్నవారికి ఈ సమయంలోనైతే ఆనందంగా అనిపిస్తుంది. ఎవరైతే నిర్లక్ష్యముగా ఉంటారో వారికి ఏ చింత ఉండదు, వారు విశ్రాంతినే సర్వస్వము అని భావిస్తారు. కనుక నిర్లక్ష్యాన్ని ఉంచుకోకండి. సదా అలర్ట్! మీరు పాండవ సైన్యము కదా. సైన్యము నిర్లక్ష్యముగా ఉంటుందా లేక అలర్ట్ గా ఉంటుందా? సైన్యము అనగా అలర్ట్ గా, సావధానంగా, అప్రమత్తంగా ఉండేవారు. నిర్లక్ష్యముగా ఉండేవారిని సైన్యంలోని సైనికులు అని అనరు. కనుక నిర్లక్ష్యము కాదు, అటెన్షన్! కానీ అటెన్షన్ కూడా సహజ విధిగా అవ్వాలి. చాలామంది అటెన్షన్ యొక్క టెన్షన్ ను కూడా పెట్టుకుంటారు. టెన్షన్ తో కూడిన జీవితమైతే సదా నడవలేదు. టెన్షన్ తో కూడిన జీవితం కొంత సమయం నడుస్తుంది, సహజంగా నడవదు. కనుక అటెన్షన్ ఉంచుకోవాలి కానీ ‘న్యాచురల్ అటెన్షన్’ అలవాటుగా అవ్వాలి. ఉదాహరణకు విస్మృతి అనేది అలవాటుగా అయిపోయింది కదా. వద్దనుకున్నా జరిగిపోతుంది. మరి ఇది అలవాటుగా అయింది కదా, సహజము అయింది కదా. ఈ విధంగా స్మృతి స్వరూపంగా ఉండడం అలవాటు అవ్వాలి, అటెన్షన్ యొక్క అలవాటు అవ్వాలి, అందుకే అలవాటుకు మనుష్యాత్మలు వశమవుతారని అంటారు. వద్దనుకున్నా జరిగిపోతుంది, దీనినే వశమవ్వడమని అంటారు. మరి ఇటువంటి తీవ్ర పురుషార్థులుగా అయ్యారా? తీవ్ర పురుషార్థీ అనగా విజయీ. అప్పుడే మాలలోకి రాగలరు.
చాలా కాలపు అభ్యాసము కావాలి. సదా అలర్ట్ అనగా సదా ఎవర్రెడీ! మీకు ఏమని నిశ్చయముంది, వినాశనం యొక్క సమయం వరకు ఉంటారా లేక ముందు కూడా వెళ్లవచ్చా? ముందు కూడా వెళ్లవచ్చు కదా, అందుకే ఎవర్రెడీ. వినాశనం మీ కోసం ఎదురుచూడాలి, మీరు వినాశనం కోసం ఎదురుచూడకూడదు. అది రచన, మీరు రచయిత. సదా ఎవర్రెడీ. ఏం అర్థమైంది? అటెన్షన్ పెట్టండి. ఏదైనా లోపముంది అని అర్థమైతే, దానిని చాలా త్వరత్వరగా సమాప్తం చేయండి. సంపన్నంగా అవ్వడం అనగా బలహీనతలను సమాప్తం చేయడము. అంతేకానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడివారిగా, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడివారిగా ఉండడం కాదు. అందరూ తీవ్ర పురుషార్థులుగా అయి వెళ్ళండి. అచ్ఛా!
Comments
Post a Comment