18-01-1992 అవ్యక్త మురళి

     18-01-1992         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘తండ్రితో స్నేహానికి గుర్తు - తండ్రి సమానంగా అవ్వడము’’

ఈ రోజు అనంతమైన తల్లిదండ్రుల ఎదురుగా మొత్తం అనంతమైన పరివారము ఉంది. కేవలం ఈ సభయే కాదు, కానీ నలువైపులా ఉన్న స్నేహీ, సహయోగీ పిల్లల చిన్నదైన బ్రాహ్మణ పరివారము అతి ప్రియమైన మరియు అతీతమైన పరివారము, అలౌకిక పరివారము, చిత్రంలో ఉంటూ విచిత్రమైన అద్భుతమైన పరివారము ఎదురుగా ఉంది. బాప్ దాదా అమృతవేళ నుండి పిల్లలందరి స్నేహంతో కూడిన, మిలనము జరుపుకునే, వరదానము తీసుకునే మధురాతి-మధురమైన ఆత్మిక సంభాషణను వింటున్నారు. అందరి మనసులలో స్నేహం యొక్క భావన మరియు సమానంగా అవ్వాలి అనే శ్రేష్ఠ కామన, ఈ ఉల్లాస-ఉత్సాహాలనే నలువైపులా చూసారు. ఈ రోజు మెజారిటీ పిల్లల ఎదురుగా నంబరువన్ శ్రేష్ఠ ఆత్మ, తల్లి-తండ్రి అయిన బ్రహ్మా ఇమర్జ్ రూపంలో ఉన్నారు. అందరి మనసులలో ఈ రోజు విశేషంగా ప్రేమ సాగరుడైన బాప్ దాదా యొక్క ప్రేమ స్వరూపము ప్రత్యక్ష రూపంలో కనుల ఎదురుగా ఉంది. నలువైపులా ఉన్న పిల్లలందరి స్నేహంతో కూడిన, హృదయపూర్వకమైన పాటను బాప్ దాదా విన్నారు. స్నేహానికి రిటర్న్ గా వరదాత అయిన తండ్రి పిల్లలకు ఇదే వరదానాన్ని ఇస్తున్నారు - ‘‘సదా ప్రతి సమయము, ప్రతి ఒక్క ఆత్మతో, ప్రతి పరిస్థితిలో స్నేహీ మూర్త భవ’’. ఎప్పుడూ తమ స్నేహీ మూర్తిని, స్నేహీ గుణాన్ని, స్నేహీ వ్యవహారాన్ని, స్నేహం యొక్క సంబంధ-సంపర్కాలను విడిచిపెట్టకండి, మర్చిపోకండి. ఏ వ్యక్తి కానీ, ప్రకృతి కానీ, మాయ ఎటువంటి భయంకర రూపాన్ని, జ్వాలా రూపాన్ని ధారణ చేసి ఎదురుగా వచ్చినా కానీ, ఆ భయంకర జ్వాలా రూపాన్ని సదా స్నేహంతో కూడిన శీతలత ద్వారా పరివర్తన చేస్తూ ఉండండి. ఈ కొత్త సంవత్సరంలో విశేషంగా స్నేహాన్ని తీసుకోవాలి, స్నేహాన్ని ఇవ్వాలి. సదా స్నేహంతో కూడిన దృష్టి, స్నేహంతో కూడిన వృత్తి, స్నేహమయీ కృతి ద్వారా స్నేహీ సృష్టిని తయారుచేయాలి. ఎవరైనా స్నేహం ఇవ్వకపోయినా కూడా, మాస్టర్ స్నేహ స్వరూప ఆత్మలైన మీరు దాతగా అయి ఆత్మిక స్నేహాన్ని ఇస్తూ ఉండండి. నేటి జీవాత్మలు స్నేహము అనగా సత్యమైన ప్రేమ కొరకు దాహంతో ఉన్నారు. ఒక ఘడియ స్నేహం కోసం అనగా ఒక బిందువు కోసం దాహంతో ఉన్నారు. సత్యమైన స్నేహం లేని కారణంగా వ్యాకులత చెంది భ్రమిస్తూ ఉన్నారు. సత్యమైన ఆత్మిక స్నేహాన్ని వెతుకుతున్నారు. దాహంతో ఉన్న ఇటువంటి ఆత్మలకు ఆధారాన్ని ఇచ్చే మాస్టర్ జ్ఞాన సాగరులు మీరు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - ఆత్మలైన మీ అందరినీ బ్రాహ్మణ పరివారంలోకి పరివర్తన చేయడానికి, ఆకర్షించడానికి విశేషమైన ఆధారము ఏమిటి? ఈ సత్యమైన ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, ఆత్మిక పరివారము యొక్క ప్రేమ - ఈ ప్రేమ యొక్క ప్రాప్తియే పరివర్తన చేసింది. జ్ఞానాన్ని అయితే తర్వాత అర్థం చేసుకుంటారు కానీ మొదట ఆకర్షించేది సత్యమైన, నిస్వార్థమైన పరివారం యొక్క ప్రేమ. పునాది ఇదే కదా, దీని వలనే అందరూ వచ్చారు కదా. విశ్వంలో కోటీశ్వరులు చాలామంది ఉన్నారు కానీ పరమాత్మ యొక్క సత్యమైన ప్రేమకు బికారిగా ఉన్నారు, ఎందుకు? ఎందుకంటే కోట్ల ధనంతో ఈ ప్రేమ లభించదు. సైన్స్ వారిని చూడండి - ఎన్ని అల్పకాలిక సుఖం యొక్క సాధనాలను విశ్వానికి ఇచ్చారు, కానీ ఎంత గొప్ప వైజ్ఞానికులో, అంతగా ఇంకా ఏదో పరిశోధన చేయాలి, ఇంకా ఏదో పరిశోధన చేయాలి అన్న ఈ పరిశోధనలోనే నిమగ్నమై ఉన్నారు. వారికి సంతుష్టత యొక్క అనుభూతి లేదు, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలి, ఇందులోనే సమయాన్ని పోగొట్టుకుంటారు. పరిశోధించడమే వారికి ప్రపంచంగా అయిపోయింది. మీ వంటి స్నేహ-సంపన్నమైన జీవితము యొక్క అనుభూతి లేదు. నాయకులను చూడండి, తమ కుర్చీలను సంభాళించుకోవడంలోనే నిమగ్నమై ఉన్నారు. రేపు ఏమవుతుంది అన్న చింతలో నిమగ్నమై ఉన్నారు. మరియు బ్రాహ్మణులైన మీరు సదా పరమాత్మ-ప్రేమ అనే ఊయలలో ఊగుతూ ఉంటారు. రేపటి గురించి చింత లేదు. రేపటి గురించి చింత లేదు, మృత్యువు గురించి చింత లేదు. ఎందుకు? ఎందుకంటే మీకు తెలుసు - ఏదైతే జరుగుతూ ఉందో అది కూడా మంచిది మరియు ఏది జరగబోతుందో అది ఇంకా మంచిది, అందుకే మంచిది-మంచిది అని అంటూ మంచిగా అయిపోయారు.

బ్రాహ్మణ జీవితము అనగా చెడుకు వీడ్కోలు ఇవ్వడము మరియు సదా అంతా చాలా మంచిగా ఉంది అని దీని అభినందనలను జరుపుకోవడము. ఇలా చేసారా లేక ఇప్పుడు వీడ్కోలు ఇస్తున్నారా? ఎలాగైతే పాత సంవత్సరానికి వీడ్కోలనిచ్చి కొత్త సంవత్సరం కోసం అభినందనలను ఇచ్చారు కదా. శుభాకాంక్షలు తెలిపే కార్డులు చాలా వచ్చాయి కదా. చాలామంది పిల్లల శుభాకాంక్షల యొక్క కార్డులు మరియు లెటర్స్ వచ్చాయి. బాప్ దాదా అంటారు, ఎలాగైతే కొత్త సంవత్సరం యొక్క కార్డులను పంపించారు లేదా సంకల్పం చేసారు, మరి సంగమయుగంలోని ప్రతి క్షణము కొత్తది కదా. సంగమయుగం యొక్క ప్రతి క్షణానికి అభినందనల కార్డులను పంపించకండి, కార్డులను సంబాళించడము కష్టమవుతుంది. కానీ కార్డుకు బదులుగా ఈ రికార్డును ఉంచుకోండి - ప్రతి క్షణం కొత్తగా అనుభవం చేసానా? ప్రతి కొత్త క్షణము కొత్త ఉల్లాస-ఉత్సాహాలను అనుభవం చేసానా? ప్రతి క్షణం స్వయంలో నవీనతను అనగా దివ్యతను, విశేషతను ఏం అనుభవం చేసాను? దానికి అభినందనలను ఇస్తాము. బ్రాహ్మణాత్మలైన మీకు ప్రతి సమయము అన్నింటికన్నా అతి పెద్ద సెరిమని (ఉత్సవం) ఏది? సెరిమని అనగా సంతోషకరమైన సమయము లేక సంతోషకరమైన రోజు. సెరిమనిలో అన్నింటికన్నా పెద్ద విషయము, మిలనము జరుపుకోవడమే అవుతుంది. మిలనము జరుపుకోవడమే సంతోషాన్ని జరుపుకోవడము. మీ అందరికి పరమాత్మ మిలనము, శ్రేష్ఠ ఆత్మల మిలనము ప్రతి సమయము జరుగుతుంది కదా! కనుక ప్రతి సమయము సెరిమని అయినట్లు కదా! నాట్యం చేయండి, పాడండి మరియు తినండి, ఇదే సెరిమని అవుతుంది. బ్రహ్మా తండ్రి యొక్క భండారా నుండి తింటారు, అందుకే సదా బ్రహ్మా భోజనాన్ని తింటారు. ప్రవృత్తివారు ఎవరైనా తమ సంపాదనతో తినరు, సెంటరువారు సెంటరు యొక్క భండారీ నుండి తినరు, కానీ బ్రహ్మా తండ్రి యొక్క భండారా నుండి, శివబాబా యొక్క భండారీ నుండి తింటారు. నా ప్రవృత్తి కాదు, నా సెంటరు కాదు. ప్రవృత్తిలో ఉన్నా కూడా మీరు ట్రస్టీలు, తండ్రి శ్రీమతమనుసారంగా నిమిత్తంగా అయి ఉన్నారు, మరియు సెంటరులో ఉన్నా కూడా అది తండ్రి సెంటరు, నాది కాదు, అందుకే సదా శివబాబా యొక్క భండారీ (హుండీ), బ్రహ్మాబాబా యొక్క భండారా(వంటిల్లు) - ఈ స్మృతి ద్వారా భండారీ కూడా నిండుగా ఉంటుంది, భండారా కూడా నిండుగా ఉంటుంది. నాది అన్నది తీసుకువస్తే భండారా మరియు భండారీలో వృద్ధి జరగదు. ఏ కార్యంలోనైనా ఒకవేళ ఏ రకమైన లోపం లేక లోటు ఉంది అంటే దానికి కారణము - తండ్రికి బదులుగా నాది అనే భావన యొక్క లోపం ఉంది, అందుకే లోటు ఉంటుంది. లోటు అన్న పదము లోపానికి కూడా అనడం జరుగుతుంది మరియు లోటు అన్న పదము అశుద్ధత కలిసినప్పుడు కూడా అనడము జరుగుతుంది. ఎలాగైతే బంగారంలో అశుద్ధత(మాలిన్యం) చేరుకుంటుంది కదా. కానీ బ్రాహ్మణ జీవితమైతే ప్రతి క్షణం సెరిమని జరుపుకునే అభినందనలతో కూడిన జీవితము. అర్థమయిందా!

మామూలుగా ఈ రోజు మీరందరూ శబ్దానికి అతీతంగా వెళ్తారు మరియు బాప్ దాదా, ఎవరైతే శబ్దానికి అతీతంగా ఉన్నారో, వారిని శబ్దంలోకి తీసుకువస్తారు. ఈ అభ్యాసం చాలా మంచిది - ఇప్పుడిప్పుడే చాలా శబ్దంలో ఉన్నారు, చర్చించుకుంటూ కూడా ఉండి ఉండవచ్చు, అటువంటి వాతావరణంలో కూడా, సంకల్పం చేసారు అంటే శబ్దం నుండి అతీతంగా అయిపోవాలి కనుక క్షణంలో శబ్దం నుండి అతీతంగా ఫరిశ్తా స్థితిలో స్థితులవ్వండి. ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే ఫరిశ్తా అనగా శబ్దం నుండి అతీతమైన అవ్యక్త స్థితి. అంతేకానీ, వాతావరణం చాలా శబ్దంతో కూడి ఉంది, అందుకే శబ్దానికి అతీతంగా వెళ్ళడానికి సమయం కావాలి అని కాదు. అలా ఉండకూడదు. ఎందుకంటే లాస్ట్ సమయంలో నలువైపులా వ్యక్తుల యొక్క, ప్రకృతి యొక్క అలజడితో కూడిన శబ్దం ఉంటుంది - ఆక్రందనలు చేసేటువంటి, కదిలింపజేసేటువంటి వాయుమండలమే ఉంటుంది. అటువంటి సమయంలో క్షణంలో అవ్యక్త ఫరిశ్తా నుండి నిరాకారీ అశరీరి ఆత్మను అన్న అభ్యాసమే విజయీగా చేస్తుంది. ఈ స్మృతి జపమాలలోకి అనగా విజయమాలలోకి తీసుకొస్తుంది, అందుకే ఈ అభ్యాసము ఇప్పటి నుండే చాలా అవసరము, వీరినే ప్రకృతిజీత్, మాయాజీత్ అని అంటారు. యజమానిగా అయి కావాలంటే నోటి ద్వారా రాగాన్ని మోగించండి, కావాలంటే చెవుల ద్వారా వినండి, ఒకవేళ వద్దనుకుంటే క్షణంలో ఫుల్స్టాప్ పెట్టండి. సగం స్టాప్ కూడా కాదు, ఫుల్స్టాప్. ఇదే బ్రహ్మా తండ్రి సమానంగా అవ్వడము. స్నేహానికి గుర్తు - సమానంగా అవ్వడము. ప్రతి ఒక్కరు నాకు స్నేహం ఎక్కువగా ఉంది అని అంటారు. ఎవరికి బ్రహ్మా తండ్రితో ఎక్కువ స్నేహము ఉంది అని ఎవరిని అడిగినా సరే, అందరూ నాకు ఎక్కువ ఉంది అనే అంటారు. కనుక ఎలాగైతే స్నేహం విషయంలో, నాకే ఎక్కువ స్నేహము ఉంది అని భావిస్తారో, అలాగే సమానంగా అవ్వడంలో కూడా ఈ తీవ్ర పురుషార్థం చేయండి, నేను నంబరువన్ తో పాటు, యుగళ్ పూస తో పాటు ఉండే పూసగా మాలలో కూర్చబడాలి. దీనిని స్నేహానికి రిటర్న్ ఇచ్చారు అని అంటారు. స్నేహంలో మధుబన్ కు పరుగెత్తి రావడంలోనైతే తెలివైనవారిగా ఉన్నారు. అందరూ త్వరత్వరగా పరుగులు తీస్తూ వచ్చి చేరుకున్నారు కదా. ఎలాగైతే ఈ ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించారో, అలాగే సమానంగా అయ్యే ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించండి. స్థానము చిన్నదిగా ఉంది మరియు మనసు పెద్దదిగా ఉంది, అందుకే స్థానం లభించలేదు అని ఫిర్యాదు చేయకండి. ఎప్పుడైతే మనసు పెద్దదిగా ఉంటుందో, అప్పుడు ఆ ప్రేమలో ఎటువంటి కష్టమైనా, కష్టముగా అనిపించదు. బాప్ దాదా పిల్లల కష్టాన్ని కూడా చూడలేరు. యోగం చేసినట్లయితే స్థానము తయారైపోతుంది. అచ్ఛా!

నలువైపులా ఉన్న దేశ విదేశాలలోని స్నేహంలో ఇమిడి ఉన్న శ్రేష్ఠ ఆత్మల యొక్క చాలా-చాలా సంకల్పాల ద్వారా, ఉత్తరాల ద్వారా, సందేశాల ద్వారా ఈ స్మృతి దివసానికి మరియు కొత్త సంవత్సరానికి ప్రియస్మృతులు బాప్ దాదాకు లభించాయి. అందరి హృదయం యొక్క మధురాతి-మధురమైన రాగాన్ని బాప్ దాదా విన్నారు. రిటర్న్ లో బాప్ దాదా కూడా పిల్లలందరికీ మధురాతి-మధురమైన, ప్రియాతి-ప్రియమైన పిల్లలూ అని అంటూ ప్రియస్మృతులను ఇస్తున్నారు. ఎగురుతూ ఉన్నారు మరియు తీవ్ర వేగంతో ఎగురుతూ ఉండండి. మాయ ఆటను ఆటగానిగా అయి చూస్తూ వెళ్ళండి. ప్రకృతి యొక్క పరిస్థితులను మాస్టర్ సర్వశక్తివంతులుగా అయి ఆడుతూ-ఆడుతూ దాటుకుంటూ వెళ్ళండి. తండ్రి చేయి మరియు దివ్య బుద్ధి యొక్క యోగము రూపీ తోడును సదా అనుభవం చేస్తూ సమర్థులుగా అయి సదా పాస్ విత్ ఆనర్ గా అవుతూ వెళ్ళండి. సదా స్నేహ-మూర్త భవ అనే వరదానాన్ని స్మృతి స్వరూపంలో గుర్తుంచుకుంటూ, ఉండేటువంటి సర్వ స్నేహీ మూర్తులకు, సదా మాస్టర్ దాతలైన ఆత్మలకు తల్లిదండ్రుల శక్తి సంపన్నమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో - తండ్రి తోడు యొక్క వారసత్వమే విశేషమైన శక్తులు. ఈ శక్తుల ద్వారా సర్వ కార్యాలు సహజంగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. అందరూ సమీప సహచరులే కదా! తోడుగా ఉన్నారు మరియు తోడుగా వెళ్తారు మరియు తోడుగానే రాజ్యం చేస్తారు. సంగమములో కూడా సమీపంగా, నిరాకారీ ప్రపంచంలో కూడా సమీపంగా మరియు రాజధానిలో కూడా సమీపంగా ఉంటారు. జన్మిస్తూనే సమీపత యొక్క వరదానం లభించింది. అందరూ సమీపత యొక్క వరదానులము అని ఇటువంటి అనుభవమవుతుంది కదా? తోడు యొక్క అనుభవమవ్వడము, ఇదే సమీపతకు గుర్తు. వేరుగా అవ్వడము కష్టము, తోడుగా ఉండడము స్వతహాగానే జరుగుతుంది. సమీపత యొక్క సంగఠనకు సమీపంగా ఉన్నారు. రాజ్య సింహాసనం తీసుకుంటారు కదా? సింహాసనంపై కూడా విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు కదా. ఎలాగైతే ఇప్పుడు హృదయాన్ని జయించారో, హృదయాన్ని జయించారు అంటే, తర్వాత నంబరువారుగా విశ్వం యొక్క రాజ్య సింహాసనముపై విజయం ప్రాప్తించుకుంటారు. ఇటువంటి విజయులే కదా? మీ ఉల్లాస-ఉత్సాహాలను చూసి అందరూ ఉల్లాస-ఉత్సాహాలతో నడుస్తున్నారు, మరియు సదా నడుస్తూ ఉంటారు. పిల్లలు తండ్రి యొక్క అద్భుతాలను పాడుతారు మరియు తండ్రి పిల్లల యొక్క అద్భుతాలను పాడుతారు. మీరు వాహ్ బాబా వాహ్ అని అంటారు మరియు బాబా వాహ్ పిల్లలూ వాహ్ అని అంటారు. అచ్ఛా.

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా కలయిక

మేమంతా పూజ్య ఆత్మలము మరియు పూర్వజ ఆత్మలము, ఇంతటి నషా ఉంటుందా? మీరందరూ ఈ సృష్టి రూపీ వృక్షం యొక్క వేర్ల దగ్గర కూర్చున్నారు కదా? ఆది పిత యొక్క పిల్లలు ఆది రత్నాలు. కనుక ఈ వృక్షానికి కాండము కూడా మీరే. ఏవైతే కొమ్మలు-రెమ్మలు వెలువడతాయో, అవి బీజము తర్వాత ఉన్న కాండము నుండే వెలువడతాయి. కనుక అన్నింటికన్నా ఆది ధర్మానికి చెందిన ఆత్మలు మీరు, మిగిలినవారందరూ తర్వాత వెలువడుతారు, అందుకే మీరు పూర్వజులు. కనుక మీరు పునాది వంటివారు. పునాది ఎంతగా పక్కాగా ఉంటుందో, రచన కూడా అంతగా పక్కాగా ఉంటుంది. కనుక స్వయంపై అంతటి అటెన్షన్ ఉంచుకోవాలి. పూర్వజులు అనగా కాండముగా ఉన్న కారణంగా డైరెక్ట్ బీజముతో కనెక్షన్ ఉంది. మేము డైరెక్ట్ పరమాత్మ ద్వారా రచింపబడ్డాము అని మీరు నషాతో చెప్పగలరు. ఎవరు రచించారు? అని ప్రపంచం వారిని అడగండి. భగవంతుడు రచించారు అని విన్నటువంటి మాటలను చెప్తారు. కానీ వారు నామమాత్రంగా అంటారు మరియు మీరు డైరెక్ట్ పరమ ఆత్మ యొక్క రచన. నేటి బ్రాహ్మణులు కూడా మేము బ్రహ్మా సంతానమని అంటారు. కానీ మీరు ప్రాక్టికల్ గా బ్రహ్మాకు సంతానము. కనుక మేము డైరెక్ట్ రచన అన్న సంతోషము ఉంది. ఏ మహాన్ ఆత్మ, ధర్మాత్మ యొక్క రచన కాదు, డైరెక్ట్ పరమ ఆత్మ యొక్క రచన. కనుక డైరెక్ట్ రచనలో ఎంత శక్తి ఉంది! ప్రపంచంవారు భగవంతుడు ఏదో ఒక వేషంలో వస్తారు అని వెతుకుతున్నారు మరియు మీరేమో లభించేసారు అని అంటారు. కనుక ఎంత సంతోషము ఉంది! మరి మిమ్మల్ని చూసి ఇతరులు కూడా సంతోషపడేలా, అంత సంతోషము ఉంటుందా, ఎందుకంటే సంతోషంగా ఉండేవారి ముఖము సదా హర్షితంగానే ఉంటుంది కదా!

గ్లోబల్ హాస్పిటల్ సోదర-సోదరీలతో

హాస్పిటల్ కు ఎవరైనా దుఃఖితులు వస్తే వారు సంతోషాన్ని పొందుతున్నారు కదా? ఎటువంటి సంతోషకరమైన వాతావరణం ఉండాలంటే, ఎవరు వచ్చినా సరే, దుఃఖాన్ని మర్చిపోవాలి ఎందుకంటే వాతావరణం అనేది వ్యక్తి యొక్క వైబ్రేషన్లతోనే తయారవుతుంది. ఎవరైనా దుఃఖిత ఆత్మల సంగఠన ఉంటే అక్కడి వాతావరణం కూడా దుఃఖమయంగానే ఉంటుంది. అక్కడికి ఎవరైనా నవ్వుతూ వచ్చినా సరే, వారు నిశ్శబ్దంగా అయిపోతారు, ఇంకెక్కడైనా సంతోషంగా ఉండే వ్యక్తుల సంగఠన ఉంటే, సంతోషముతో కూడిన సంగఠన ఉంటే, ఎటువంటి దుఃఖిత ఆత్మలు వచ్చినా సరే మారిపోతారు. ప్రభావము తప్పకుండా పడుతుంది. కనుక ఎవర్ హ్యాపీ హాస్పిటల్ కదా? కేవలం హెల్దీ కాదు, హ్యాపీ కూడా. అందరూ చిరునవ్వుతో ఉంటే, నవ్వుతూ ఉంటే సగం చికిత్స జరిగిపోతుంది. సగం మందు సంతోషమే. కనుక మందుల ఖర్చు కూడా పొదుపు అవుతుంది కదా. తక్కువ ఖర్చుతో నిరోగులుగా అయ్యామని పేషెంట్ కూడా సంతోషిస్తారు మరియు హాస్పిటల్ ఖర్చు కూడా తగ్గిపోతుంది. డాక్టర్లకు సమయం కూడా తక్కువ కేటాయించాల్సి వస్తుంది. ఎలాగైతే సాకారంలో చూసారు కదా, బ్రహ్మా తండ్రి ఎదురుగా వచ్చినప్పుడు ఏం అనుభవం వినిపించేవారు? చాలా విషయాలు తీసుకొని వచ్చేవారు కానీ తండ్రి ఎదురుగా రావడంతోనే ఆ విషయాలకు లోలోపలే పరిష్కారం లభించేది. ఈ అనుభవాన్ని విన్నారు కదా. అలాగే డాక్టర్ల అయిన మీ ఎదురుగా ఎవరు వచ్చినా సరే, రావడంతోనే సగం అనారోగ్యం అక్కడే బాగైపోవాలి. డాక్టర్లు అందరూ అలాగే ఉన్నారు కదా. తండ్రి ఎలాగైతే అలౌకికమైనవారో, తండ్రి పిల్లలు ఎవరైతే కార్యానికి నిమిత్తంగా ఉన్నారో, వారందరూ కూడా అలౌకికంగా ఉంటారు కదా. మీ అందరిదీ అలౌకిక జీవితమా లేక సాధారణ జీవితమా? ఎంతెంతగా తపస్యలో ముందుకు వెళ్తూ ఉంటారో, అంతగా మీ వైబ్రేషన్లు చాలా తీవ్ర వేగంతో పని చేస్తాయి. అచ్ఛా. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రఖ్యాతిని పొందే హాస్పిటల్ అయి ఉండాలి. సమయం కూడా తక్కువగా ఖర్చు అవ్వాలి, స్థూల ధనం కూడా తక్కువగా ఖర్చవ్వాలి మరియు ప్రఖ్యాతి ఎక్కువగా ఉండాలి. పేరు గొప్పగా ఉండాలి మరియు ఖర్చు తక్కువ ఉండాలి. కనుక ఇటువంటి అలౌకిక సేవాధారులే కదా! పునాదిని మంచిగా వేసారు. హాస్పిటల్ లాగ అనిపిస్తుందా లేక యోగ భవన్ అని అనిపిస్తుందా? ఇది హాస్పిటల్ కాదు కానీ యోగ కేంద్రము, హ్యాపీ హౌస్ అన్న పేరు వస్తుంది. ఈ విధంగా లౌకికంలో కూడా హ్యాపీ హౌస్ ను తయారుచేస్తారు. దాని లోపలికి ఎవరు వెళ్ళినా సరే నవ్వుతూనే ఉంటారు. కానీ ఇది మనసు యొక్క చిరునవ్వు. అది కొద్ది సమయం కోసం ఉంటుంది మరియు ఇది సదా కాలం కోసం ఉంటుంది. అచ్ఛా. సదా హర్షితమైన మూడ్ లో ఉండండి. ఏం జరిగినా సరే, మీరు మూడ్ ఆఫ్ అవ్వకండి. ఎవరైనా నిందించినా కూడా, అవమానపరచినా కూడా మీరు సదా హర్షితంగా ఉండండి. అచ్ఛా, ఓం శాంతి.

Comments