13-10-1992 అవ్యక్త మురళి

  13-10-1992         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘నంబరువన్ గా అవ్వాలంటే జ్ఞానాన్ని మరియు యోగాన్ని స్వరూపంలోకి తీసుకురండి’’

ఈ రోజు సత్యమైన శిక్షకుడు తమ శ్రేష్ఠ శిక్షణలను ధారణ చేసే ఈశ్వరీయ విద్యార్థులను చూస్తున్నారు, ప్రతి ఒక్క ఈశ్వరీయ విద్యార్థి ఈ ఈశ్వరీయ శిక్షణను ఎంతవరకు ధారణ చేసారు అని చూస్తున్నారు. చదివించేవారు ఒక్కరే, చదువు కూడా ఒక్కటే కానీ చదివేవారు చదువులో నంబరువారుగా ఉన్నారు. ప్రతి రోజు యొక్క పాఠము మురళీ ద్వారా ప్రతి స్థానంలో ఒకే పాఠాన్ని వింటారు అనగా ఒకే పాఠాన్ని చదువుతారు. మురళీ అనగా పాఠము ప్రతి స్థానంలో ఒక్కటే ఉంటుంది. తేదీ తేడా ఉండవచ్చు కానీ మురళీ అదే ఉంటుంది. అయినా నంబరువారుగా ఎందుకు ఉన్నారు? నంబరు ఎందుకు తయారవుతుంది? ఎందుకంటే ఈ ఈశ్వరీయ చదువును చదివే విధి - కేవలం వినడము కాదు కానీ ప్రతి మహావాక్యాన్ని స్వరూపంలోకి తీసుకురావాలి. అందరూ ఒకేలా వింటారు కానీ స్వరూపంగా అవ్వడంలో నంబరువారుగా అవుతారు. నేను నంబరువన్ గా అవ్వాలి అని అందరికి ఒకే లక్ష్యముంది. ఇటువంటి లక్ష్యముంది కదా! నంబరువన్ గా అవ్వాలనే లక్ష్యముంది. కానీ రిజల్టులో నంబరువారుగా అవుతారు ఎందుకంటే లక్ష్యాన్ని లక్షణాలలోకి తీసుకురావడము - ఇందులో లక్ష్యము మరియు లక్షణాలలో తేడా వచ్చేస్తుంది.

ఈ చదువులో సబ్జెక్టులు కూడా ఎక్కువ లేవు. నాలుగు సబ్జెక్టులను ధారణ చేయడము - ఇందులో కష్టమేముంది! మరియు నాలుగు సబ్జెక్టులకు పరస్పరము ఒకదానికొకటి సంబంధముంది. జ్ఞానమనే ఒక సబ్జెక్టును సంపూర్ణ విధి పూర్వకంగా ధారణ చేయండి అనగా జ్ఞానం యొక్క ఒక్కొక్క పదాన్ని స్వరూపంలోకి తీసుకురండి, జ్ఞానం ముఖ్యంగా రెండు పదాలలో ఉంది, వాటిని రచయిత మరియు రచన లేక అల్ఫ్ (తండ్రి) మరియు బే (వారసత్వం) అని అంటారు. రచయిత అయిన తండ్రి గురించి అర్థం చేసుకున్నారు అనగా పరమాత్మ-పరిచయం, సంబంధం స్పష్టమైంది మరియు రచన అనగా మొదటి రచన - నేను శ్రేష్ఠ ఆత్మను మరియు రెండవది - ఆత్మనైన నాకు ఈ అనంతమైన రచనలో అనగా అనంతమైన డ్రామాలో మొత్తం కల్పంలో ఏ-ఏ పాత్ర ఉంది - ఈ మొత్తం జ్ఞానమైతే అందరికీ ఉంది కదా. కానీ శ్రేష్ఠ ఆత్మ యొక్క స్వరూపంగా అయి ప్రతి సమయము శ్రేష్ఠ పాత్రను అభినయించడము - ఇందులో అప్పుడప్పుడు స్మృతి ఉంటుంది, అప్పుడప్పుడు మర్చిపోతారు. ఒకవేళ ఈ రెండు పదాల జ్ఞానము ఉంటే, యోగము కూడా ఈ రెండు పదాల ఆధారంపైనే ఉంది కదా. జ్ఞానంతో యోగానికి స్వతహాగానే సంబంధముంది. ఎవరైతే జ్ఞానయుక్త ఆత్మలుగా ఉంటారో, వారు తప్పకుండా యోగయుక్త ఆత్మలుగా కూడా ఉంటారు. కనుక జ్ఞానానికి మరియు యోగానికి సంబంధం ఉన్నట్లు కదా. మరియు ఎవరైతే జ్ఞానులుగా,యోగులుగా ఉంటారో, వారి ధారణ శ్రేష్ఠంగా ఉంటుందా లేక బలహీనంగా ఉంటుందా? శ్రేష్ఠంగా స్వతహాగానే ఉంటుంది కదా, సహజంగా ఉంటుంది కదా లేక ధారణలో కష్టముంటుందా? ఎవరైతే జ్ఞానయుక్త, యోగయుక్త ఆత్మలుగా ఉన్నారో, వారు ధారణలో బలహీనంగా ఉండగలరా? ఉండరు. కానీ అలా ఉన్నారు. మరి వారిలో జ్ఞాన-యోగాలు లేనట్లా? జ్ఞానులుగా ఉన్నారు కానీ జ్ఞాన యుక్త ఆత్మ - ఈ స్థితి లేదు. యోగాన్ని జోడించేవారిగా ఉన్నారు కానీ యోగీ జీవితం కలవారిగా లేరు. జీవితం సదా ఉంటుంది మరియు జీవితం సహజంగా ఉంటుంది. యోగీ జీవితం అనగా వాస్తవిక స్వభావం యోగులు వలె ఉంటుంది.

63 జన్మల విస్మృతి యొక్క సంస్కారాలు మరియు బలహీనత యొక్క సంస్కారాలు బ్రాహ్మణ జీవితంలో అక్కడక్కడ మూల స్వభావంగా అయి పురుషార్థంలో విఘ్నాలు వేస్తాయి. ఎంతగా స్వయము మరియు ఇతరులు ఇది పరివర్తన చేసుకోండి అని అటెన్షన్ ఇప్పించినా కానీ లేదా స్వయం కూడా ఇది పరివర్తన అవ్వాలి అని అర్థం చేసుకున్నా కానీ, తెలిసి కూడా, పరివర్తన అవ్వాలని అనుకున్నా కూడా ఏం చెప్తారు? ఇలా ఉండాలనుకోలేదు కానీ ఇది నా నేచర్, ఇది నా స్వభావము అని అంటారు. కనుక స్వభావం సహజమైనదిగా అయిపోయింది కదా. ఎవరివైనా మాటలలో లేక వ్యవహారంలో జ్ఞాన-సంపన్న వ్యవహారము లేకపోతే, యోగీ జీవితము అనుసారంగా వ్యవహారము, మాటలు లేకపోతే వారు ఏమంటారు? ఈ మాటే అంటారు, నా మాటలు సహజంగా ఇలానే ఉంటాయి, మాట్లాడే టోన్ యే ఇలా ఉంటుంది. లేదా నా నడవడిక-వ్యవహారమే అఫిషియల్ గా లేక గంభీరంగా ఉంటుంది అని అంటారు. దానికి మంచి పేరు చెప్తారు, ఇది ఆవేశం కాదు కానీ అఫిషియల్ గా ఉండడము. కనుక పరివర్తన అవ్వాలని అనుకున్నా కూడా, అర్థం చేసుకున్నా కూడా స్వభావం అనేది సహజంగానే కార్యం చేస్తూ ఉంటుంది, అందులో శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎవరైతే జ్ఞానీ జీవితంలో లేక యోగీ జీవితంలో ఉంటారో, వారి ప్రతి కర్మ సహజంగా జ్ఞానము మరియు యోగముతో సంపన్నంగా ఉంటుంది అనగా జ్ఞానము మరియు యోగము - ఇదే వారి స్వభావంగా అయిపోతుంది మరియు స్వభావంగా అయిన కారణంగా శ్రేష్ఠ కర్మలు, యుక్తియుక్త కర్మలు సహజంగానే జరుగుతూ ఉంటాయి. కనుక అర్థమయిందా, స్వభావము సహజము చేసేస్తుంది. కనుక జ్ఞానము మరియు యోగము మూల స్వభావంగా అయిపోవాలి - దీనినే జ్ఞానీ జీవితము కలవారు, యోగీ జీవితము కలవారు అని అంటారు.

అందరూ జ్ఞానులే, అందరూ యోగులే కానీ వ్యత్యాసం ఏమిటి? ఒకరేమో, జ్ఞానం వినేవారు-వినిపించేవారు, యథా శక్తి జీవితంలోకి తీసుకొచ్చేవారు. రెండవవారు, జ్ఞానమును మరియు యోగమును ప్రతి సమయం తమ జీవితం యొక్క స్వభావంగా చేసుకునేవారు. అందరూ విద్యార్థులే కానీ ఈ వ్యత్యాసం ఉన్న కారణంగా నంబరువారుగా అయిపోతారు. ఎవరి స్వభావమైతే జ్ఞానీ-యోగీల స్వభావం వలె ఉంటుందో, వారి ధారణ కూడా సహజంగా ఉంటుంది. సహజంగానే వారి స్వభావ-సంస్కారాలు ధారణా స్వరూపంగా ఉంటాయి. ఈ గుణాన్ని ధారణ చేయాలి, ఆ గుణాన్ని ధారణ చేయాలి అని పదే-పదే పురుషార్థం చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ప్రారంభంలో పునాది సమయంలోనే జ్ఞానము, యోగము మరియు ధారణను తమ జీవితంగా చేసుకున్నారు, అందుకే ఈ మూడు సబ్జెక్టులు అటువంటి ఆత్మకు స్వతహాగా మరియు స్వాభావికమైన అనుభూతులుగా అయిపోతాయి, అందుకే అటువంటి ఆత్మలను సహజ యోగులు, సహజ జ్ఞానులు, సహజ ధారణా-మూర్తులు అని అంటారు. మూడు సబ్జెక్టులకు కనెక్షన్ ఉంది. ఎవరి వద్దనైతే ఇన్ని అనుభూతుల యొక్క ఖజానా సంపన్నంగా ఉంటుందో, అటువంటి సంపన్న మూర్తులు స్వతహాగానే మాస్టర్ దాతగా అవుతారు. దాత అనగా సేవాధారి. దాత ఇవ్వకుండా ఉండలేరు. దాతృత్వ సంస్కారం ద్వారా స్వతహాగానే సేవా సబ్జెక్టు ప్రాక్టికల్ గా సహజమైపోతుంది. కనుక నాలుగు సబ్జెక్టులకు సంబంధముంది కదా. ఎవరైనా, నాలో జ్ఞానమైతే మంచిగా ఉంది కానీ ధారణలో లోపముంది అని అంటే వారిని జ్ఞాని అని అంటారా? జ్ఞానమైతే ఇతరులకు కూడా ఇస్తారు కదా. ఉంది కనుకనే ఇస్తారు! మొదటిది, అర్థం చేసుకోవడము, రెండవది, స్వరూపంలోకి తీసుకురావడము. అర్థం చేసుకోవడంలో అందరూ తెలివైనవారిగా ఉన్నారు, అర్థం చేయించడంలో కూడా అందరూ తెలివైనవారు కానీ నంబరువన్ గా అవ్వాలంటే జ్ఞానాన్ని మరియు యోగాన్ని స్వరూపంలోకి తీసుకురండి. అప్పుడు నంబరువారుగా ఉండరు కానీ నంబరువన్ గా ఉంటారు.

ఈ రోజు సత్యమైన శిక్షకుడు తన నలువైపులా ఉన్న ఈశ్వరీయ విద్యార్థులను చూస్తున్నారని వినిపించాము. మరి ఏం చూసారు? అందరూ నంబరువన్ గా కనిపించారా లేక నంబరువారుగా కనిపించారా? రిజల్టు ఏం ఉంటుంది? లేదా నంబరువన్ అయితే ఒక్కరే ఉంటారు, మేమైతే నంబరువారులోకే వస్తాము అని భావిస్తున్నారా. ఫస్ట్ డివిజన్ లోనైతే రాగలరు కదా. అందులో ఒక్కరే ఉండరు. కనుక చెక్ చేసుకోండి, ఒకవేళ పదే-పదే ఏదైనా విషయంలో స్థితి కింద-మీద అవుతుంది అనగా పదే-పదే పురుషార్థంలో శ్రమ చేయాల్సి వస్తుంది, దీని ద్వారా ఏం ఋజువు అవుతుందంటే, జ్ఞానమనే ముఖ్యమైన సబ్జెక్టులోని రెండు పదాలు - ‘రచయిత’ మరియు ‘రచన’ యొక్క చదువును స్వరూపంలోకి తీసుకురాలేదు, జీవితంలో మూల సంస్కారం రూపంలో లేక మూల స్వభావం రూపంలో లేక సహజ స్వభావం యొక్క రూపంలోకి తీసుకురాలేదు. బ్రాహ్మణ జీవితం యొక్క సహజ స్వభావ-సంస్కారమే యోగీ జీవితము, జ్ఞానీ జీవితము. జీవితము అనగా నిరంతరం, సదా ఉంటుంది. 8 గంటలు జీవితముంది, 4 గంటలు లేదు అని ఈ విధంగా ఉండదు. ఈ రోజు 10 గంటల యోగీగా అయ్యాము, ఈ రోజు 12 గంటల యోగీగా అయ్యాము, ఈ రోజు 2 గంటల యోగీగా అయ్యాము - ఇలాంటివారు యోగాన్ని జోడించే యోగులు, యోగీ జీవితం కలిగిన యోగులు కాదు. విశేషంగా సంగఠిత రూపంలో ఎందుకు కూర్చుంటారంటే, సర్వుల యోగ శక్తితో వాయుమండలం ద్వారా బలహీన పురుషార్థులను మరియు విశ్వంలోని సర్వాత్మలను యోగ శక్తి ద్వారా పరివర్తన చేయాలి, అందుకే అది కూడా అవసరము, కానీ తమ తెగిపోయిన యోగాన్ని మాత్రమే జోడిస్తూ ఉండడానికి ఏమీ యోగంలో కూర్చోరు. సంగఠిత శక్తి అనేది కూడా సేవకు నిమిత్తమవుతుంది కానీ నా కనెక్షన్ మళ్ళీ జోడింపబడాలి అని ఏమీ యోగ-భట్టీ పెట్టరు. ఒకవేళ బలహీనంగా ఉంటే దీని కోసమే కూర్చుంటారు మరియు ‘‘యోగ యుక్త ఆత్మ’’ అయి ఉంటే మాస్టర్ సర్వశక్తివంతులుగా అయి, మాస్టర్ విశ్వకళ్యాణకారిగా అయి సర్వులకు సహయోగాన్ని ఇచ్చే సేవ చేస్తారు. కనుక చదువు అనగా స్వరూపంగా అవ్వడము. అచ్ఛా!

ఈ రోజు దీపావళి జరుపుకునేందుకు వచ్చారు. జరుపుకోవడము అంటే అర్థమేమిటి? దీపావళిలో ఏం చేస్తారు? దీపాలు వెలిగిస్తారు. ఈ రోజుల్లోనైతే లైట్లు వెలిగిస్తారు. మరియు లైటు వద్దకు ఏం వస్తాయి? దీపపు పురుగులు. దీపపు పురుగుల విశేషత ఏముంటుంది? బలి అవ్వడము. కనుక దీపావళి జరుపుకోవడం అంటే అర్థము ఏమైనట్లు? మరి బలి అయ్యారా లేక ఈ రోజు అవ్వాలా? అయ్యారా లేక అవ్వాలా? (అయిపోయాము) మరి దీపావళి అయితే జరుపుకున్నారు, మళ్ళీ ఎందుకు జరుపుకుంటున్నారు? బలి అయిపోయినప్పుడే దీపావళి జరుపుకున్నట్లు లేదా మధ్య-మధ్యలో తిరిగేందుకు వెళ్తారా? బలి అయ్యారు కానీ ఇప్పుడింకా కొద్దిగా రెక్కలు ఉన్నాయి, వాటితో కొద్దిగా తిరుగుతారు. మరి అలా తిరిగేవారైతే కారు కదా. తిరగడము అనగా మాయ యొక్క ఏదో ఒక రూపంతో ఎదురుదెబ్బ తినడము. మాయతో ఎదురుదెబ్బ తింటారా లేక మాయను ఓడిస్తారా? లేక అప్పుడప్పుడు విజయం ప్రాప్తించుకుంటూ, అప్పుడప్పుడు ఎదురుదెబ్బ తింటున్నారా?

దీపావళి అంటే, మీ స్మృతిచిహ్నాన్నే జరుపుకుంటారు. మీ స్మృతిచిహ్నమే కదా? లేక ముఖ్యమైన ఆత్మల స్మృతిచిహ్నమా, మీరు కేవలం చూసేవారా? ఇది మీ అందరి స్మృతిచిహ్నము, అందుకే ఈ రోజుల్లో చాలామంది దీపాలకు బదులుగా చిన్న-చిన్న బల్బులను వెలిగిస్తున్నారు. దీపాలను వెలిగిస్తే సంఖ్య వాటికన్నా తగ్గిపోతుంది. కానీ మీ సంఖ్య అయితే చాలా ఉంది కదా. కనుక అందరి స్మృతిచిహ్నంగా అనేక చిన్న-చిన్న బల్బులను వెలిగిస్తారు. కనుక మీ స్మృతి చిహ్నాన్ని జరుపుకుంటున్నారు. దీపాన్ని చూసినప్పుడు ఇది మా స్మృతిచిహ్నము అని భావిస్తున్నారా? స్మృతి వస్తుందా? ఇదే సంగమయుగం యొక్క విశేషత, చైతన్య దీపాలు తమ జడ స్మృతిచిహ్నమైన దీపాలను చూస్తున్నారు. చైతన్యంలో స్వయం మీరే మరియు జడ స్మృతిచిహ్నాన్ని చూస్తున్నారు. నిజానికి ఏ రోజునైతే దీపావళి జరుపుకుంటారో ఆ రోజే వాస్తవికమైన తిథి. ఇదైతే ప్రపంచంవారు తిథిని ఫిక్స్ చేసారు, కానీ మీ తిథి మీదే, అందుకే బ్రాహ్మణులైన మీరు ఏ రోజును జరుపుకుంటారో అదే సత్యమైన తిథి, అందుకే ఏదైనా తిథిని ఫిక్స్ చేయాలంటే ఎవరిని అడుగుతారు? బ్రాహ్మణుల ద్వారానే నిర్ణయిస్తారు. కనుక ఈ రోజు బాప్ దాదా దేశ-విదేశాలలోని సదా వెలిగి ఉన్న దీపాలందరికీ దీపావళి యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నారు, అభినందనలు తెలుపుతున్నారు. దీపావళి శుభాకాంక్షలు అనగా సమృద్ధిగా, సంపన్నంగా అయ్యే శుభాకాంక్షలు!

ఇటువంటి సదా వెలిగే జ్యోతులకు, సదా స్వయం ప్రకాశ స్వరూపులుగా అయి అనేకుల అంధకారాన్ని తొలగించే సత్యమైన దీపాలకు, సదా నాలుగు సబ్జెక్టులను తమ జీవితంలోకి తీసుకువచ్చేటువంటి, సర్వ సబ్జెక్టులలో నంబరువన్ యొక్క లక్ష్యాన్ని లక్షణంలోకి తీసుకువచ్చేటువంటి జ్ఞాన యుక్త ఆత్మలకు, యోగ యుక్త ఆత్మలకు, దివ్యగుణ స్వరూప ఆత్మలకు, నిరంతర సేవాధారులకు, శ్రేష్ఠ విశ్వ-కళ్యాణకారి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత మిలనము

‘‘ఎవరి ముఖము మరియు నడవడిక ద్వారా సదా సంతోషపు మెరుపు కనిపిస్తుందో వారే భాగ్యశాలులు’’

అందరూ స్వయాన్ని సదా భాగ్యశాలి ఆత్మలమని భావిస్తున్నారా? భాగ్యశాలి ఆత్మల గుర్తులేమిటి? వారి ముఖము మరియు నడవడిక ద్వారా సదా సంతోషపు మెరుపు కనిపిస్తుంది. ఏ స్థూల కార్యము చేస్తున్నా సరే, సాధారణమైన పని చేస్తున్నా కానీ ప్రతి కర్మ చేస్తూ సంతోషపు మెరుపు కనిపించాలి. దీనినే నిరంతరం సంతోషంలో మనసు నాట్యం చేస్తూ ఉండడము అని అంటారు. సదా ఈ విధంగా ఉంటున్నారా? లేక అప్పుడప్పుడు చాలా సంతోషంగా ఉంటారు, అప్పుడప్పుడు తక్కువగా ఉంటారా? సంతోషం యొక్క ఖజానా తమ ఖజానాగా అయిపోయింది. కనుక మీ ఖజానా సదా మీతో పాటు ఉంటుంది కదా. లేక అప్పుడప్పుడు ఉంటుందా? తండ్రి ఖజానాను తమ ఖజానాగా చేసుకున్నారా లేక తమ ఖజానాను మర్చిపోతారా? మీ స్థూల వస్తువైతే గుర్తుంటుంది కదా. ఆ ఖజానా కళ్ళకు కనిపిస్తుంది కానీ ఈ ఖజానా కళ్ళకు కనిపించదు, మనసుతో అనుభవం చేస్తారు. మరి అనుభవం చేసిన విషయాన్ని ఎప్పుడైనా మర్చిపోతారా? కనుక సదా మేము సంతోషం యొక్క ఖజానాకు యజమానులము అని స్మృతిలో ఉంచుకోండి. ఖజానా ఎంతగా గుర్తుంటుందో అంతగా నషా ఉంటుంది. ఈ ఆత్మిక నషా ఇతరులకు కూడా వీరి వద్ద ఏదో ఉంది అని అనుభవం చేయిస్తుంది.

మాతలకు మొత్తం సమయమంతా ఏం గుర్తుంటుంది? కేవలం తండ్రి గుర్తుంటారా లేక ఇంకేదైనా గుర్తుంటుందా? వారసత్వం యొక్క సంతోషమైతే కనిపిస్తుంది కదా. బ్రాహ్మణ జీవితానికి ఒక్క తండ్రే ప్రపంచము అయినప్పుడు, మరి ప్రపంచం తప్ప ఇంకేం గుర్తుకొస్తుంది! సదా మనసులో తమ శ్రేష్ఠ భాగ్యం యొక్క పాటను పాడుతూ ఉండండి. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యం మొత్తం కల్పంలో ప్రాప్తిస్తుందా? మొత్తం కల్పంలో ఇప్పుడే ప్రాప్తిస్తుంది, కనుక ఇప్పటి సంతోషం, ఇప్పటి నషా అన్నింటికన్నా శ్రేష్ఠమైనవి. కనుక మాతలకు ఇతర సంబంధీకులు ఎవరైనా గుర్తుకొస్తారా? సంబంధాలలో ఏదైనా కింద-మీద అయితే మోహం వస్తుందా? మోహమంతా సమాప్తమైందా? ఏం జరిగినా సరే, నాకు మోహం రాదు అని ఎవరైతే అంటారో, వారు చేతులెత్తండి. అచ్ఛా, మోహం యొక్క పేపరు వస్తే రానివ్వండి? పాండవులైతే నష్టోమోహులు కదా. వ్యవహారంలో ఏదైనా కింద-మీద అయినా కూడా నష్టోమోహులుగా ఉంటారా? ఇప్పుడు కూడా మధ్య-మధ్యలో మాయ పేపరు అయితే తీసుకుంటుంది కదా. మరి అందులో పాస్ అవుతున్నారా? లేక మాయ వచ్చినప్పుడు కొద్దిగా ఢీలా అవుతున్నారా? మరి సదా సంతోషం యొక్క పాటలు పాడుతూ ఉండండి. అర్థమయిందా? ఏం పోయినా కానీ సంతోషం పోకూడదు. మాయ ఏ రూపంలో వచ్చినా కానీ సంతోషం పోకూడదు. ఈ విధంగా సంతోషంగా ఉండేవారే సదా భాగ్యశాలులు. అచ్ఛా!

ఇప్పుడు ఆంధ్ర మరియు కర్ణాటకవారు ఏ అద్భుతం చేయాలి? ఏ ఆత్మ కూడా వంచితమవ్వకూడదు. ప్రతి ఒక్కరికీ సందేశమివ్వాలి. ఎక్కడ ఉంటున్నా సరే సర్వాత్మలకు సందేశం లభించాలి. ఎంతగా సందేశమిస్తారో అంతగా సంతోషం పెరుగుతూ ఉంటుంది. అచ్ఛా!

Comments