12-11-1992 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘భవిష్య విశ్వ-రాజ్యము యొక్క ఆధారము - సంగమయుగము యొక్క స్వరాజ్యము’’
ఈ రోజు విశ్వ రచయిత అయిన బాప్ దాదా తమ స్వరాజ్య అధికారి పిల్లలందరినీ చూస్తున్నారు. ఈ వర్తమాన సంగమయుగం యొక్క స్వరాజ్య అధికారులుగా మరియు భవిష్యత్తులో విశ్వ రాజ్య అధికారులుగా అవుతారు ఎందుకంటే స్వరాజ్యం ద్వారానే విశ్వ రాజ్య అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఈ సమయంలోని స్వరాజ్య ప్రాప్తి యొక్క అనుభవము, భవిష్య విశ్వ రాజ్యం యొక్క అనుభవం కంటే అతి శ్రేష్ఠమైనది! మొత్తం డ్రామాలో రాజ్యాధికారులు రాజ్యం చేస్తూ వస్తారు. అన్నింటికన్నా శ్రేష్ఠమైనది, మొట్టమొదటిది స్వరాజ్యము, దీని ఆధారంగా స్వరాజ్య అధికారి ఆత్మలైన మీరు అనేక జన్మలు సత్య-త్రేతాయుగాల వరకు విశ్వ రాజ్య అధికారులుగా అవుతారు. కావున మొదటిది స్వరాజ్యము, ఆ తర్వాత అర్ధకల్పము విశ్వ రాజ్య అధికారము మరియు ద్వాపరయుగం నుండి మొదలుకొని రాజ్యమైతే ఉండనే ఉంటుంది కానీ అక్కడ విశ్వ రాజ్యం కాదు, రాష్ట్రాలకు రాజులుగా అవుతారు. మొత్తం విశ్వంపై ఒకే రాజ్యమనేది కేవలం సత్యయుగంలో మాత్రమే ఉంటుంది. కావున మూడు రకాల రాజ్యాల గురించి వినిపించాము. రాజ్యం అనగా సర్వ అధికారాల ప్రాప్తి. సత్య-త్రేతాయుగాల రాజనీతి, ద్వాపరం యొక్క రాజనీతి మరియు సంగమయుగం యొక్క స్వరాజ్య నీతి - మీకు మూడింటి గురించి మంచి రీతిలో తెలుసు.
సంగమయుగం యొక్క రాజనీతి అనగా ప్రతి బ్రాహ్మణాత్మ స్వయం యొక్క రాజ్యాధికారులుగా అవుతారు. ప్రతి ఒక్కరు రాజయోగి. మీరంతా రాజయోగులేనా లేక ప్రజాయోగులా? రాజయోగులు కదా. రాజయోగులు అనగా రాజులుగా అయ్యే యోగులు. స్వరాజ్య అధికారి ఆత్మల యొక్క విశేషమైన నీతి ఏమిటంటే - ఎలాగైతే రాజు తన సేవా సహచరులకు, ప్రజలకు ఏ ఆజ్ఞను ఎలా ఇస్తే, ఆ ఆజ్ఞ అనుసారంగా, అదే నీతి ప్రమాణంగా సహచరులు లేక ప్రజలు కార్యం చేస్తారు. అలాగే స్వరాజ్య అధికారి ఆత్మలైన మీరు మీ యోగశక్తి ద్వారా ప్రతి కర్మేంద్రియానికి ఏ విధంగా ఆజ్ఞను ఇస్తారో, అదే విధంగా ప్రతి కర్మేంద్రియము మీ ఆజ్ఞ అనుసారంగా నడుస్తుంది. కేవలం ఈ స్థూల శరీరంలోని సర్వ కర్మేంద్రియాలే కాకుండా మనసు, బుద్ధి, సంస్కారాలు కూడా రాజ్యాధికారీ ఆత్మలైన మీ డైరెక్షన్ల అనుసారంగా నడుస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా మనసును అనగా సంకల్ప శక్తిని అక్కడ స్థితి చేయగలరు అనగా మీరు మనసు, బుద్ధి, సంస్కారాలకు కూడా రాజ్యాధికారులు. మీరు సంస్కారాలకు వశమవ్వరు కానీ సంస్కారాలను తమ వశం చేసుకుని శ్రేష్ఠమైన నీతి ద్వారా కార్యంలో ఉపయోగిస్తారు, శ్రేష్ఠ సంస్కారాల అనుసారంగా సంబంధ-సంపర్కంలోకి వస్తారు. కావున స్వరాజ్య నీతి ఏమిటంటే - మనసు, బుద్ధి, సంస్కారాలు మరియు సర్వ కర్మేంద్రియాలపై స్వ అనగా ఆత్మ యొక్క అధికారము. ఒకవేళ ఏవైనా కర్మేంద్రియాలు - ఒక్కోసారి కళ్ళు మోసం చేస్తాయి, ఒక్కోసారి మాటలు మోసం చేస్తాయి, ఒక్కోసారి వాణి అనగా నోరు మోసం చేస్తుంది, సంస్కారాలు తమ కంట్రోల్ లో ఉండవు, అటువంటివారిని స్వరాజ్య అధికారులని అనరు, వారిని స్వరాజ్య అధికారులుగా అయ్యే పురుషార్థులని అంటారు. వారు అధికారులు కాదు కానీ పురుషార్థులు. వాస్తవానికి రాజ్యాధికారీ ఆత్మలను స్వప్నంలో కూడా ఏ కర్మేంద్రియము గాని, మనసు, బుద్ధి, సంస్కారాలు గాని మోసం చేయలేవు ఎందుకంటే వారు అధికారులుగా ఉంటారు. అధికారులు ఎప్పుడూ అధీనమవ్వలేరు. అధీనంగా ఉంటే అధికారులుగా అయ్యే పురుషార్థులని అర్థము. కావున నేను పురుషార్థినా లేక అధికారినా? అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. అధికారులుగా అయ్యారా లేక అవుతూ ఉన్నారా? స్వరాజ్యం యొక్క ఆత్మిక నషా ఏ అనుభవం చేయిస్తుంది? ఎలా తయారవుతారు? నిశ్చింత చక్రవర్తులుగా, నిశ్చింతపురానికి చక్రవర్తులుగా అవుతారు!
అందరికన్నా అత్యంత గొప్ప చక్రవర్తి - నిశ్చింత చక్రవర్తి మరియు అన్నింటికన్నా అత్యంత గొప్ప రాజ్యము - నిశ్చింతపురి యొక్క రాజ్యము. నిశ్చింతపురి యొక్క రాజ్యాధికారుల ముందు ఈ విశ్వ రాజ్యం కూడా అసలేమీ కాదు. ఈ నిశ్చింతపురి యొక్క రాజ్యాధికారము అతి శ్రేష్ఠమైనది మరియు సుఖమయమైనది. పేరే నిశ్చింతపురి. మరి నిశ్చింతపురి యొక్క అనుభవం ఉంది కదా. లేక అప్పుడప్పుడు కిందికి వచ్చేస్తారా? సదా ఆత్మిక నషాలో నిశ్చింతపురికి చక్రవర్తులము అనే అధికారంలో ఉండండి. కిందికి రాకండి. చూడండి, ఈ రోజుల్లోని రాజ్యంలో కూడా ఒకవేళ ఎవరైనా కుర్చీపై ఉంటే వారి అధికారముంటుంది మరియు రేపు కుర్చీ నుండి దిగిపోతే వారి అధికారముంటుందా? సాధారణంగా అయిపోతారు. కావున మీరు కూడా స్వరాజ్య నషాలో ఉంటారు, అకాల సింహాసనాధికారులుగా ఉంటారు. అందరి వద్ద సింహాసనం ఉంది కదా. మరి సింహాసనాన్ని ఎందుకు వదిలేస్తారు? సదా సింహాసనాధికారులుగా ఉండండి, ఆత్మిక నషాలో ఉండండి. అకాల సింహాసనం అంటే - అమృత్సర్ లో ఉండే ఆ అకాల సింహాసనం కాదు, ఇది ఈ అకాల సింహాసనము. ఈ అకాల సింహాసనం అందరి వద్ద ఉంది. కావున అకాల సింహాసనాధికారి స్వరాజ్య అధికారులుగా ఎవరు తయారుచేసారు? తండ్రి, బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరినీ సింహాసనాధికారి రాజుగా చేసారు.
మొత్తం సృష్టి చక్రంలో ఎవరికైనా అనేకమంది పిల్లలు ఉండి, అందరూ రాజా పిల్లలుగా ఉండే తండ్రి ఎవరైనా ఉంటారా! లక్ష్మి-నారాయణులు కూడా అలా అవ్వలేరు. పరమాత్మ తండ్రి మాత్రమే - నా పిల్లలందరూ రాజా పిల్లలు అని అంటారు. ఆ మాటకొస్తే ప్రపంచంలో ఇతడు రాజా బిడ్డ అని ఊరకే అంటారు. ఆ బిడ్డ ఎలా తయారైనా, సేవకునిగా అయినా, లేదా ఇంకెలా తయారైనా, అనడానికి రాజా బిడ్డ అనే అంటారు. కానీ ఈ సమయంలో మీరు ప్రాక్టికల్ గా రాజయోగులుగా అనగా రాజా పిల్లలుగా అవుతారు. కావున తండ్రికి కూడా నషా ఉంది మరియు పిల్లలకు కూడా నషా ఉంది. కావున స్వరాజ్యం యొక్క నీతి ఏమిటి? స్వయంపై రాజ్యం, ప్రతి కర్మేంద్రియముపై అధికారము ఉండాలి. అంతేకానీ చూడాలనుకోలేదు కానీ చూసేసాము అన్నట్లు ఉండకూడదు. కళ్ళు తెరిచి ఉన్నాయి కదా అందుకే కనిపించింది, చెవులకు తలుపులు లేవు కదా అందుకే విషయం చెవిలో పడింది అని కాదు. మీకు రెండు చెవులు ఉన్నాయి. ఒకవేళ అలాంటి విషయము ఏదైనా విన్నా దానిని బయటకు తీసే మార్గము కూడా ఉంది. అందుకే ఈ భారత్ లో విశేషంగా గాంధీగారి స్మృతిలో ఈ చిత్రము తయారుచేయబడింది - చెడు చూడకండి, చెడు వినకండి, చెడు మాట్లాడకండి. వారు మూడు చూపిస్తారు, మీరు నాలుగు చూపిస్తారు. చెడు ఆలోచించకండి కూడా ఎందుకంటే మొదట ఆలోచిస్తారు, ఆ తర్వాత మాట్లాడుతారు, ఆ తర్వాత చూస్తారు. అందుకే కంట్రోలింగ్ పవర్ (నియంత్రణ శక్తి), రూలింగ్ పవర్ (శాసన శక్తి) ఉంచుకోండి. రాజు అనగా రూలింగ్ పవర్. రాజుగా ఉంటూ రూలింగ్ పవర్ లేనే లేకపోతే వారిని రాజుగా ఎవరు అంగీకరిస్తారు! కావున స్వరాజ్యము అనగా రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్.
బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - చాలా మంది పిల్లలు పరిశీలించడంలో చాలా తెలివి కలవారిగా ఉంటారు. ఏదైనా పొరపాటు జరిగితే, అది నీతి అనుసారంగా లేకపోతే, అప్పుడు - ఇది చేయకూడదు, ఇది సత్యము కాదు, యథార్థము కాదు, ఇది అయథార్థము, వ్యర్థము అని అర్థం చేసుకుంటారు. కానీ అర్థం చేసుకున్నా, మళ్ళీ చేస్తూ ఉంటారు లేదా చేసేస్తారు. మరి దీనిని ఏమంటారు? ఏ శక్తి తక్కువగా ఉంది? కంట్రోలింగ్ పవర్ లేదు. ఉదాహరణకు ఈ రోజుల్లో కారు నడుపుతారు, ఆక్సిడెంట్ జరిగే అవకాశముందని చూస్తూ ఉంటారు కూడా, బ్రేకు వేసే ప్రయత్నం చేస్తారు కానీ బ్రేకు పడకపోతే తప్పకుండా ఆక్సిడెంట్ జరుగుతుంది కదా. బ్రేకు ఉంది కానీ శక్తిశాలిగా లేకపోతే మరియు ఇక్కడ పడేందుకు బదులుగా అక్కడ పడితే ఏమవుతుంది? అంత సమయము పరవశమై ఉన్నట్లే కదా. కోరుకున్నా చేయలేకపోతారు. బ్రేకు వేయలేకపోతారు లేక బ్రేకు శక్తిశాలిగా లేని కారణంగా సరిగ్గా పడదు. కావున ఇది చెక్ చేసుకోండి. ఎత్తైన పర్వతాలను ఎక్కేటప్పుడు ఏమి రాసి ఉంటుంది? బ్రేకు చెక్ చేసుకోండి అని రాసి ఉంటుంది ఎందుకంటే బ్రేకు రక్షణకు సాధనము. కావున కంట్రోలింగ్ పవర్ లేదా బ్రేకు వేయడం అంటే ఇక్కడ వేస్తే అక్కడ పడడం అని కాదు. ఎవరైనా వ్యర్థాన్ని కంట్రోల్ చేయాలనుకుంటే, ఇది రాంగ్ అని అర్థం చేసుకుంటారు, అయితే అదే సమయంలో రాంగ్ అనేది రైట్ లోకి పరివర్తన అవ్వాలి. దీనిని కంట్రోలింగ్ పవర్ అని అంటారు. అంతేకానీ కంట్రోల్ చేయాలని అనుకుంటూ కూడా ఉంటారు, కానీ అరగంట వ్యర్థంగా గడిచిన తర్వాత కంట్రోల్ లోకి రావడం కాదు. చాలా పురుషార్థం చేసి అరగంట తర్వాత పరివర్తన అయితే దానిని కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ అని అనరు. అది కొద్ది-కొద్దిగా అధీనము మరియు కొద్ది-కొద్దిగా అధికారి, రెండు మిక్స్ అయినట్లు. మరి అటువంటివారిని రాజ్యాధికారులని అంటారా లేక పురుషార్థులని అంటారా? కావున ఇప్పుడు పురుషార్థులుగా కాదు, రాజ్యాధికారులుగా అవ్వండి. ఇది స్వరాజ్యాధికారము యొక్క శ్రేష్ఠమైన ఆనందము.
స్వరాజ్య అధికారి అనగా సదా ఆనందమే ఆనందంలో ఉండడము. ఆనందంగా ఉండేవారు ఎప్పుడూ ఏ విషయంలోనూ తికమకపడరు. ఒకవేళ తికమకపడితే ఆనందం ఉండదు. సంగమయుగంలో ఆనందమే ఆనందముంది కదా. లేక అప్పుడప్పుడు మాత్రమే ఆనందముందా? శక్తులకు, పాండవులకు ఆనందముంది కదా. కావున అర్థమయిందా - స్వరాజ్యం యొక్క నీతి ఏమిటో మరియు విశ్వ రాజ్యం యొక్క నీతి ఏమిటో? ప్రజలైనా లేక రాయల్ కుటుంబము వారైనా, స్వర్గంలో ప్రజలంటే ప్రజలు కాదు, ప్రజలు కూడా ఒక పరివారము. పరివారము యొక్క నీతియే సత్య-త్రేతాయుగాల రాజనీతి. రాజుగా పిలవబడతారు కానీ రాజు అయినప్పటికీ వారు పరమప్రియ తండ్రి యొక్క స్వరూపము. పరివారము అనే విధితో రాజనీతి నడుస్తుంది. రాజ్య కార్య వ్యవహారాలు వేర్వేరు చేతులలో ఉంటాయి కానీ పరివారమనే స్నేహం యొక్క విధితో కార్య వ్యవహారాలు జరుగుతాయి. రాజు వద్ద చాలా ధన-సంపద ఉండి, ప్రజలకు తినేందుకు, తాగేందుకు ఏమీ లేకపోవడం అనేది ఉండదు. ద్వాపర-కలియుగాల రాజనీతిలో లా అండ్ ఆర్డర్ నడుస్తుంది. కానీ విశ్వరాజ్యం, దైవీ రాజ్య సమయంలో ఈ నీతియే నడుస్తుంది, లా ఉండదు, కానీ స్నేహం మరియు సంబంధము యొక్క నీతి నడుస్తుంది. ఏ ఆత్మకు దుఃఖమనే పదము కూడా తెలియదు. రాజు అయినా లేక ప్రజలైనా దుఃఖము-అశాంతి యొక్క నామరూపాలు ఉండవు. దుఃఖమంటే ఏమిటి అన్న విషయంలో అజ్ఞానముంటుంది, దానికి సంబంధించిన జ్ఞానమే ఉండదు. ఇప్పుడు స్వరాజ్యం ఉన్న ఈ సమయంలో కూడా బాప్ దాదా మిమ్మల్ని ఏ నీతితో నడిపిస్తున్నారు? స్నేహము మరియు శ్రీమతము. శ్రీమతంపై నడుస్తూ ఉంటే ఎలాంటి కఠినమైన ఆజ్ఞను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఈ నీతిని మర్చిపోయినట్లయితే మీరు స్వయాన్ని స్వయమే కలియుగ నీతి అనుసారంగా నడిపించుకుంటారు. కావున విశ్వ రాజ్యం యొక్క నీతి కూడా చాలా ప్రియమైనది ఎందుకంటే అనేకత ఉండదు, ఒకే రాజ్యం మరియు తరగని ఖజానా ఉంటుంది! ప్రజలు కూడా అంత సంపన్నంగా ఉంటారు - ఈ రోజుల్లోని పెద్ద-పెద్ద పదమపతులు ఎవరైతే ఉన్నారో, వారి కన్నా సంపన్నంగా ఉంటారు! అప్రాప్తి యొక్క నామ-రూపాలు కూడా ఉండవు. కానీ దీనికి ఆధారమేమిటి? స్వరాజ్యము.
ఈ సమయంలో సంపన్నంగా అవుతారు, అందుకే పరమాత్మ-సంపద యొక్క సంపన్నత, సత్య-త్రేతాయుగాలలో అనేక జన్మలు ప్రాప్తిస్తుంది. అందుకే ఇలా అన్నాము - నంబరువన్ రాజ్యం స్వరాజ్యము, తర్వాత విశ్వరాజ్యము మరియు మూడవది ద్వాపర-కలియుగాలలోని వేరు-వేరు రాష్ట్రాల రాజ్యము. ఈ రాజ్యం గురించి అయితే బాగా తెలుసు, వర్ణించాల్సిన అవసరం లేదు. కావున సదా ఏ నషాలో ఉండాలి? స్వరాజ్యము మా జన్మ సిద్ధ అధికారము! ఏ జన్మది? బ్రాహ్మణ జన్మది. బ్రహ్మాబాబా జన్మతోనే ప్రతి బ్రాహ్మణాత్మకు స్వరాజ్య తిలకాన్ని దిద్దారు. మీరు తిలకధారులే కదా. ఇది స్మృతి తిలకము. తిలకము కూడా ఉంది, సింహాసనము కూడా ఉంది మరియు కిరీటము కూడా ఉంది. కిరీటధారులే కదా. ఏ కిరీటము ఉంది? విశ్వకళ్యాణమనే కిరీటముంది. మీరు విశ్వకళ్యాణకారులు కదా. పవిత్రతా కిరీటము మరియు విశ్వకళ్యాణ కిరీటము - డబల్ కిరీటముంది. పవిత్రతా కిరీటము అంటే ప్రకాశ కిరీటము మరియు విశ్వకళ్యాణ కిరీటము అంటే సేవా కిరీటము.
మీరు విశ్వ సేవాధారులు కదా. మేము గుజరాత్ వారము, మేము రాజస్థాన్ వారము, మేము ఢిల్లీ సేవాధారులము అని స్వయాన్ని రాష్ట్ర సేవాధారులుగా భావించకండి. అలా కాదు. మీరు విశ్వ సేవాధారులు. ఎక్కడ ఉన్నా మీ వృత్తి, దృష్టి అనంతంలో ఉండాలి. ఒకవేళ విశ్వ సేవాధారులుగా అవ్వకపోతే స్వరాజ్యము, విశ్వరాజ్యము లభించవు, ఇక తర్వాత ద్వాపర-కలియుగాలలో రాష్ట్రానికి రాజులుగా అవ్వాల్సి వస్తుంది. విశ్వ రాజ్యాధికారులుగా అవ్వాలంటే సదా మీ కిరీటము, తిలకము మరియు సింహాసనము - సదా వీటిపై స్థితులై ఉండండి. శరీరముతో సింహాసనంపై కూర్చోవడం కాదు కానీ బుద్ధి ద్వారా స్మృతి యొక్క స్థితిలో స్థితులై ఉండాలి. స్థితిలో స్థితులవ్వడమే సింహాసనంపై కూర్చోవడము, ఇలా అయితే సదా కూర్చోగలరు. శరీరంతో అయితే ఎన్ని గంటలు కూర్చుంటారు? అలసిపోతారు కదా. కానీ బుద్ధి ద్వారా స్థితిలో స్థితులవ్వడమే సింహాసనాధికారులుగా అవ్వడము. ఇది సులభమే కదా. కావున స్వరాజ్యం యొక్క నషాలో నిరంతరం స్థితులై ఉండండి. ఏం చేయాలో అర్థమయిందా? పురుషార్థులుగా కాదు కానీ అధికారులుగా అవ్వండి.
అందరూ మిలనము జరుపుకున్నారు కదా. పరమాత్మ-మిలన మేళాను జరుపుకునేందుకు అందరూ పరుగుపరుగున వస్తారు. మీరంతా మిలన మేళాకు వచ్చారు కదా. ఇది మేళా అని అనిపిస్తుందా లేక గుంపులా అనిపిస్తుందా? ప్రశాంతత ఉంది కదా. ప్రశాంతంగా ఉండడం, తినడం, నడుచుకోవడం, అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి కదా. అయినా మీరు చాలా అదృష్టవంతులు. ఆ మేళాల వలె మట్టిలో అయితే ఉండడం లేదు కదా. ఎంతైనా మంచము, పరుపు అయితే లభించాయి కదా. అక్కడి మేళాలలోనైతే స్నానం చేస్తున్నా కూడా మట్టే, ఉంటున్నా కూడా మట్టే మరియు తింటున్నా మట్టే మీతో పాటు వస్తుంది. ఇక్కడ పిల్లలు తమ ఇంటికి వస్తారు. నషాతో వస్తారు. తండ్రికి కూడా సంతోషము మరియు పిల్లలకు కూడా సంతోషము. హాలులో వెనుక కూర్చున్నవారు అందరికన్నా ముందు ఉన్నారు ఎందుకంటే బాప్ దాదా యొక్క మొదటి దృష్టి చివరి వరకు వెళ్తుంది. అచ్ఛా!
సర్వ స్వరాజ్య అధికారి నిశ్చింత చక్రవర్తి పిల్లలకు, విశ్వ రాజ్య అధికారులుగా అనేక జన్మలు సంపూర్ణ సంపన్నంగా ఉండే సర్వాత్మలకు, సదా తిలకము, కిరీటము మరియు సింహాసనానికి అధికారి పిల్లలకు, సదా అనంతమైన సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే విశేషమైన పిల్లలకు, దేశ-విదేశాలలో సమ్ముఖంగా అనుభవం చేసే పిల్లలందరికీ బాప్ దాదా యొక్క పదమాల గుణాల ప్రియస్మృతులు. ఇంకా అందరి స్నేహభరిత పత్రాలకు బదులు కూడా ఇస్తున్నారు. విదేశం వారు మరియు దేశంవారు - ఇరువురు తమ తమ విధి ప్రమాణంగా స్వపురుషార్థంలో సిద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారు మరియు సేవలో కూడా సదా ముందుకు వెళ్ళే ఉత్సాహంలో నిమగ్నమై ఉన్నారు. అందుకే ఎవరు ఏ మూలలో ఉన్నా, ప్రతి ఒక్కరి స్మృతి, సేవా సమాచారము, ప్రేమపూర్వక పత్రాలు, స్థితి యొక్క ఉల్లాస-ఉత్సాహాల సమాచారము అన్నీ లభించాయి మరియు బాప్ దాదా పిల్లలందరికీ వారి వారి పేరు సహితంగా, ప్రతి ఒక్కరి విశేషతల సహితంగా చాలా చాలా చాలా ప్రియస్మృతులను ఇస్తున్నారు మరియు సదా ఈ స్మృతి మరియు ప్రేమ యొక్క పాలనలో పాలింపబడుతున్నారు, ఎగురుతున్నారు మరియు ఎగురుతూ-ఎగురుతూ గమ్యానికి చేరుకోవాల్సిందే లేక చేరిపోయే ఉన్నారని చెప్పవచ్చా. కావున ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment