11-12-1991 అవ్యక్త మురళి

    11-12-1991         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘సత్యత యొక్క సభ్యతయే రియల్ రాయల్టీ’’

ఈ రోజు బాప్ దాదా తమ శ్రేష్ఠ పరివారాన్ని అనగా తమ రాయల్ పరివారాన్ని చూస్తున్నారు. మొత్తం కల్పంలో అందరికన్నా రాయల్ గా ఉండేవారు శ్రేష్ఠ ఆత్మలైన మీరే. అనాది ఆత్మిక స్వరూపంలో కూడా అందరికన్నా శ్రేష్ఠమైన రాయల్ ఆత్మలు మరియు ఆది స్వరూప దేవాత్మల రూపంలో కూడా రాయల్ రాజ్యాధికారులు, రాయల్ పరివారానికి చెందినవారు. పూజ్య రూపంలో కూడా దేవాత్మలైన మీకు ఎంత రాయల్టీతో పూజ జరుగుతూ ఉంటుంది. ఇతర ఏ ధర్మాత్మలకు లేక రాజకీయ ఆత్మలకు ఇటువంటి రాయల్ పూజ జరగదు. కనుక మూడు రూపాలలోనూ - అనాది, ఆది మరియు పూజ్య స్వరూపాలలో ఇంత రాయల్ గా ఇంకెవ్వరూ లేరు ఎందుకంటే ఆత్మలైన మీ విషయంలో పవిత్రతనే రాయల్టీ. మొత్తం కల్పంలో ఇంతటి సంపూర్ణ పవిత్రులుగా ఇతర ఏ ఆత్మా అవ్వలేదు, అవ్వదు కూడా. ఇది పవిత్రత యొక్క విశేషతనే. అందుకే కేవలం దేవాత్మలైన మీ ఎదురుగా మాత్రమే ‘మీరు సంపూర్ణ నిర్వికారులు’ అన్న మహిమను పాడుతారు, ఇతర ఏ ధర్మాత్మల మహిమలోనూ ఇటువంటి మహిమ గానం చేయబడదు. కేవలం దేవాత్మల యొక్క శ్రేష్ఠ కీర్తి అనగా శ్రేష్ఠ పవిత్రతకు మాత్రమే కీర్తన జరుగుతుంది. ఇతర ఏ ధర్మములోనూ కీర్తన ఉండదు. వాయిద్యాలతో మరియు బాజా భజంత్రీలతో కీర్తన చేసే ఆచారము దేవాత్మలలోనే ఉంది మరియు సంగమయుగం యొక్క శక్తి స్వరూపంలో ఉంది. ఇది సంపూర్ణ పవిత్రతా విధి యొక్క సిద్ధి, కనుక మీ వంటి ఆత్మిక రాయల్టీ ఇతర ఏ ఆత్మకు లేదు. కనుక ఇటువంటి పవిత్రతా రాయల్టీ ఎంత వరకు వచ్చింది అని చెక్ చేసుకోండి. ఆత్మిక రాయల్టీకి అన్నింటికన్నా శ్రేష్ఠమైన గుర్తు - రియాల్టీ అనగా రాయల్టీ అనగా సత్యత. ఏ విధంగా ఆత్మ యొక్క అనాది స్వరూపము సత్యము. సత్ అనగా అవినాశీ మరియు సత్యము. ఏ విధంగానైతే తండ్రి మహిమలో కూడా విశేషంగా సత్యం-శివం-సుందరం అని ఇదే పాడుతూ ఉంటారు. సత్యమే శివుడు లేక గాడ్ ఈజ్ ట్రూత్ (భగవంతుడు సత్యము) అని అంటారు. కావున తండ్రి మహిమ సత్యమైనది అనగా సత్యతకు సంబంధించినది. ఇలాంటి రాయల్టీ అనగా రియాల్టీ - సత్యతలో కొద్దిగా కూడా కృత్రిమత్వము లేక కల్తీ ఉండకూడదు. మాటల్లోనైనా, కర్మల్లోనైనా, సంబంధ-సంపర్కంలోనైనా కల్తీ లేక కృత్రిమత్వము ఉండకూడదు. బాప్ దాదా దీనినే సాధారణ భాషలో సత్యత అని అంటారు. రాయల్ ఆత్మల వృత్తి, దృష్టి, మాటలు మరియు నడవడిక అన్నింటిలోనూ ఒకే సత్యత ఉంటుంది. వృత్తిలో ఒక విషయం ఉండడం మరియు మాటల్లో మరొక కృత్రిమమైన భావం ఉండడం జరగకూడదు కదా. దీనిని రాయల్టీ (హుందాతనము) లేక రియాల్టీ (వాస్తవికత) అని అనరు.

ఈ రోజుల్లో బాప్ దాదా పిల్లల లీలలను చూస్తున్నారు మరియు వింటున్నారు కూడా. చాలా మంది పిల్లలు విషయాలను కలపడంలో మరియు తయారుచేయడంలో చాలా తెలివైనవారిగా ఉన్నారు. ఎందుకంటే ద్వాపరం నుండి ఈ విధంగా కలిపిన మరియు తయారుచేసిన కథలను చాలా విన్నారు. కావున ఈ బ్రాహ్మణ జీవితంలో కూడా ఆ సంస్కారాన్ని ఇమర్జ్ చేస్తారు. ఎంత మంచి రూపంతో విషయాన్ని తయారుచేస్తారంటే, అసత్యాన్ని పూర్తిగా సంపూర్ణ సత్యంగా తయారుచేస్తారు మరియు సత్యాన్ని అసత్యంగా నిరూపిస్తారు. దీనినే లోపల ఒకటి, బయట మరొకటి అని అంటారు. మరి ఇదేమైనా రియాల్టీనా? రాయల్టీనా? కాదు కదా. కనుక ఇటువంటి పవిత్రత యొక్క రాయల్టీ అనగా రియాల్టీ. ఇది రాయల్టీ యొక్క లక్షణము. ఒకవేళ ఈ లక్షణం లేదంటే పవిత్రత యొక్క రాయల్టీ రాలేదని లేదా పర్సెంటేజ్ లో వచ్చిందే కానీ సంపూర్ణంగా రాలేదని భావించండి.

రియాల్టీ యొక్క రెండవ లక్షణాన్ని బాప్ దాదా సదా వినిపిస్తూ ఉంటారు - సత్యమున్న చోట మనసు ఆనందముతో నాట్యము చేస్తుంది. సత్యమైన ఆత్మలు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. ఒక్కోసారి తక్కువ సంతోషము, ఒక్కోసారి ఎక్కువ సంతోషము, అలా ఉండదు. రోజురోజుకు ప్రతి సమయము సంతోషం ఇంకా పెరుగుతూ ఉంటుంది. రియాల్టీ యొక్క లక్షణము - సదా సంతోషంగా నాట్యం చేయడము. నయనాలు మరియు హావభావాలు అని అంటారు కదా, రాయల్టీ యొక్క అర్థమేమిటంటే చిత్తములో కూడా మరియు నయనాలు, హావభావాలలో కూడా సదా హర్షితము. కేవలం బయటకు హర్షితముఖులుగా ఉండడం కాదు కానీ చిత్తములో కూడా హర్షితంగా ఉండాలి. హర్షిత చిత్తము, హర్షిత ముఖము - రెండూ హర్షితంగా ఉండాలి. చాలా సార్లు ఇలా కూడా జరుగుతూ ఉంటుంది, లోపల చిత్తములో సంతోషముండదు కానీ బాహ్యముఖతలో సమయమనుసారంగా హర్షితముఖులుగా అయి చూపిస్తారు. దీనిని అల్పకాలికమైన హర్షితముఖమని అంటారు, కానీ హర్షిత చిత్తము, హర్షిత ముఖము అవినాశీగా ఉండాలి. కావున పవిత్రత యొక్క రాయల్టీ, రియాల్టీ అనగా చిత్తము మరియు ముఖము హర్షితంగా, అవినాశీగా ఉండాలి. చెక్ చేసుకోండి - ఇతరులను చెక్ చేయడం మొదలుపెట్టకండి, స్వయాన్ని చెక్ చేసుకోండి. ఇటువంటి రాయల్ ఆత్మ బాప్ దాదాకు మరియు సర్వ బ్రాహ్మణ పరివారానికి అతి ప్రియంగా ఉంటుంది. అసలైన ప్రియమైన ఆత్మ యొక్క విశేషత ఏముంటుంది? ఎందుకంటే ఈ రోజుల్లోని ఆచార-పద్ధతుల అనుసారంగా ఎవరైతే చాలా ప్రియంగా అనిపిస్తారో, ఆ ప్రియమైనవారి వైపుకు వద్దనుకున్నా కూడా ఆకర్షితులవుతారు. దీనిని మీరు మీ భాషలో అటాచ్మెంట్ అని అంటారు. ఎందుకంటే ప్రియమైనవారిగా ఉంటే అటాచ్మెంట్ ఉంటుంది కదా. కానీ రియల్ మరియు రాయల్ ప్రేమ యొక్క గుర్తు ఏమిటంటే - వారు ఎంత ప్రియంగా ఉంటారో అంతే అతీతంగా కూడా ఉంటారు, అందుకే వారు స్వయము ఎక్స్ ట్రా అటాచ్మెంట్ లోకి రారు మరియు ఇతరులు కూడా వీరి అటాచ్మెంట్ లోకి రారు. దీనినే రియల్ ప్రేమ, సంపూర్ణ ప్రేమ అని అంటారు. వారు హర్షితంగా ఉంటారు, ఆకర్షణీయంగా కూడా ఉంటారు కానీ హద్దులో ఆకర్షణ చేసేవారిగా ఉండరు. కనుక రియల్ మరియు రాయల్ గా ఉండేవారి లక్షణమేమిటి? అతి ప్రియము మరియు అతి అతీతము.

రాయల్టీకి కల మరొక విశేషత ఏమిటంటే, ఆ ఆత్మలో ఎప్పుడూ ఏ రకమైన, స్థూలమైన లేక సూక్ష్మమైన యాచించే సంస్కారం ఉండదు ఎందుకంటే రాయల్ ఆత్మ సదా సంపన్నంగా, నిండుగా ఉంటుంది. ఒక నిండుదనమేమో బాహ్యమైనది, స్థూలమైన వస్తువులతో, స్థూలమైన సాధనాలతో నిండుదనము. మరియు రెండవది - మనసుతో నిండుదనము. ఎవరైతే మనసుతో నిండుగా ఉంటారో, వారి వద్ద స్థూలమైన వస్తువులు లేక సాధనాలు లేకపోయినా కానీ మనసు నిండుగా ఉన్న కారణంగా వారెప్పుడూ స్వయంలో లోటును అనుభూతి చేయరు. లేకపోయినా ఉన్నట్లుగా అనుభవం చేస్తారు. మరియు ఎవరి మనసైతే నిండుగా ఉండదో ఆ ఆత్మ బయటకు ఎంతగా వస్తువులు మరియు సాధనాలతో నిండుగా ఉన్నా కానీ వారెప్పుడూ స్వయాన్ని నిండుగా ఉన్నట్లు భావించరు. ఇటువంటి ఆత్మ కోరికల కారణంగా సదా ‘కావాలి, కావాలి’ అన్న పాటను పాడుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ ఇది జరగాలి, ఇది చేయాలి, ఇది లభించాలి, ఇది మారాలి... ప్రతి సమయము ఇదే పాటను పాడుతూ ఉంటారు. మనసుతో నిండుగా ఉన్న ఆత్మ సదా ఏ పాట పాడుతూ ఉంటుందంటే - అంతా పొందాను, అంతా ప్రాప్తించింది. ఇది జరగాలి, ఇది చేయాలి... ఇలా ‘కావాలి, కావాలి’ అన్నది కూడా రాయల్ గా యాచించే సంస్కారము. అనంతమైన సేవ విషయంలో ఇది జరగాలి, ఇది చేయాలి అని ఆలోచించడం వేరు, కానీ స్వయం యొక్క హద్దు ప్రాప్తుల కోసం ‘కావాలి, కావాలి’ అన్నది రాయల్ గా యాచించడము. పేరు కావాలి, గౌరవం కావాలి, కీర్తి కావాలి, ప్రేమ కావాలి, నన్ను అడగాలి - ఇవన్నీ హద్దు విషయాలు. రాయల్ ఆత్మలో యాచించే సంస్కారము అంశమాత్రము కూడా ఉండదు. రాయల్టీ అంటే ఏమిటో అర్థమయిందా?

తపస్య యొక్క చార్టులో ఇవన్నీ చెక్ చేసుకోండి. అంతేకానీ నేను ఎవరినీ నిందించలేదు, క్రోధం చేయలేదు అని కాదు. ఈ విషయాలన్నీ చెక్ చేసుకోండి. అప్పుడు ప్రైజ్ తీసుకోండి. తపస్య అంటే అర్థమే సంపూర్ణ పవిత్రంగా అవ్వడము. కనుక పవిత్రత యొక్క పర్సనాలిటీ, పవిత్రత యొక్క రాయల్టీ ప్రాక్టికల్ గా ఎంతవరకు ఉంది, ఇది చెక్ చేసుకోవాలి. ఇటువంటివారినే తపస్వీ రాజ్ అని అంటారు. రాయల్టీ అంటే ఏమిటో అర్థమయిందా?

రాయల్ ఆత్మ యొక్క ముఖము మరియు నడవడిక, రెండూ సత్యత యొక్క సభ్యతను అనుభవం చేయిస్తాయి. మామూలుగా కూడా రాయల్ ఆత్మలను సభ్యత యొక్క దేవీలు అని అంటారు. వారి మాట్లాడడములో, చూడడములో, నడవడములో, తినడములో, తాగడములో, కూర్చోవడములో, లేవడములో, ప్రతి కర్మలోనూ సభ్యత, సత్యత స్వతహాగానే కనిపిస్తాయి. నేను సత్యాన్ని నిరూపిస్తున్నాను అని అంటూ అందులో సభ్యత లేకపోవడం కాదు. చాలా మంది పిల్లలు ఏమంటారంటే, మామూలుగా అయితే క్రోధం రాదు కానీ ఎవరైనా అబద్ధం చెప్తే క్రోధం వస్తుంది. వారు అబద్ధం చెప్పారు, మీరు క్రోధంతో చెప్పారు, ఇరువురిలో రైట్ ఎవరు? సత్యతను నిరూపించేవారు సదా సభ్యత కలవారిగా ఉంటారు. చాలా మంది తెలివిని ప్రదర్శిస్తారు - మేము క్రోధం చేయము, మా గొంతే పెద్దదిగా ఉంటుంది, మా గొంతే అలా పదునుగా ఉంటుంది అని అంటారు. సైన్స్ సాధనాలతో శబ్దాన్ని తక్కువగా మరియు ఎక్కువగా చేయగలరు కదా, మరి సైలెన్స్ శక్తితో మీ మాటను నెమ్మదిగా లేక గట్టిగా చేయలేరా? దానికన్నా ఈ టేప్ రికార్డర్ మరియు ఈ మైక్ బాగున్నాయి ఎందుకంటే వీటిలో శబ్దాన్ని ఎక్కువగా, తక్కువగా చేయవచ్చు కదా. కావున సత్యతతో పాటు సభ్యత కూడా ఉందా అని చెక్ చేసుకోండి. ఒకవేళ సభ్యత లేకపోతే సత్యత లేనట్లే. కనుక పవిత్రత యొక్క రాయల్టీ సదా ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. లోపల అయితే రాయల్టీ ఉంది కానీ బయటకు కనిపించదు అని కాదు. ఒకవేళ లోపల ఉన్నట్లయితే బయటకు తప్పకుండా కనిపిస్తుంది. సత్యత యొక్క రాయల్టీని ఎవరూ దాచిపెట్టలేరు. ఇందులో గుప్తంగా ఉండకూడదు. చాలా మంది, మేము గుప్త పురుషార్థులము, అందుకే గుప్తంగా ఉంటాము అని అంటారు. కానీ ఎలాగైతే సూర్యుడిని ఎవరూ దాచిపెట్టలేరో, అలా సత్యత యొక్క సూర్యుడిని కూడా ఎవరూ దాచిపెట్టలేరు. దానిని ఏ కారణమూ దాచిపెట్టలేదు, ఏ వ్యక్తి దాచిపెట్టలేరు. సత్యము సదా సత్యమే. సత్యత యొక్క శక్తి అన్నింటికన్నా మహోన్నతమైనది. సత్యత అనేది నిరూపించడంతో నిరూపించబడదు. సత్యత యొక్క శక్తికి స్వతహాగానే నిరూపణ అయ్యే సిద్ధి ప్రాప్తిస్తుంది. సత్యతను ఒకవేళ ఎవరైనా నిరూపించాలనుకుంటే ఆ నిరూపించటము మొండితనంలా అవుతుంది, అందుకే సత్యత స్వయమే నిరూపణ అవుతుంది. దానిని నిరూపణ చేసే అవసరం లేదు. అర్థమైందా. తపస్యా సంవత్సరంలో ఏం చూపించాలి? పవిత్రత యొక్క పర్సనాలిటీ మరియు రాయల్టీ. అచ్ఛా!

దేశ-విదేశాల నుండి పిల్లలందరి ఉత్తరాలు, ప్రియస్మృతులు, పురుషార్థము మరియు సేవా సమాచారము మరియు హృదయపూర్వక ఆత్మిక సంభాషణ, అన్నీ బాప్ దాదా వద్దకు చేరుకుంటున్నాయి, చేరుకున్నాయి. బాప్ దాదా పిల్లలందరికీ పేరు సహితంగా ప్రియస్మృతులను ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ మొదట మా స్మృతి చేరుకుంది అని భావించండి ఎందుకంటే బాప్ దాదా ప్రియస్మృతులకు రెస్పాన్స్ ను అవ్యక్త రూపంతోనైతే అదే క్షణంలో ఇచ్చేస్తారు. కానీ ఎంతైనా సాకార విధితో స్వయం కూడా సాకారంలో ఉత్తరాలు రాస్తారు లేక ప్రియస్మృతులను పంపిస్తారు కనుక బాప్ దాదా కూడా సాకార విధి అనుసారంగా సాకార రూపంలో కూడా ప్రియస్మృతులను రిటర్న్ లో ఇస్తున్నారు. నలువైపులా తపస్య మరియు మనసా వైబ్రేషన్ల ద్వారా సేవ చేసే ఉల్లాస-ఉత్సాహాలు బాగున్నాయి మరియు ఇలాగే ఉంటాయని బాప్ దాదాకు తెలుసు. ఇప్పుడింకా లోతైన రహస్యయుక్తమైన విషయాలను ఎదురుగా ఉంచుకుని పురుషార్థాన్ని, సేవను సూక్ష్మంగా మరియు మహాన్ గా చేసుకుంటూ వెళ్ళండి. పిల్లలందరికీ, ఎవరైతే సమ్ముఖంలో కూర్చున్నారో లేక ఆకారీ స్వరూపంలో తండ్రి సమ్ముఖంలో ఉన్నారో, ఇలా సమ్ముఖంగా అనగా సదా తోడుగా ఉన్నవారందరి నయనాలలో, ముఖంలో, మనసులో సదా పిల్లలకు తండ్రి ఉన్నారు మరియు తండ్రికి పిల్లలు ఉన్నారు.

ఇలా సదా స్మృతిలో ఇమిడి ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు, సదా పవిత్రత యొక్క రియాల్టీ మరియు రాయల్టీలో ఉండే ఆత్మలకు, సదా మనసుతో సంపన్నంగా, నిండుగా ఉండే ఆత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో మిలనము

స్వయాన్ని పదమాపదమ భాగ్యశాలి ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా! ఇంతటి శ్రేష్ఠమైన భాగ్యము మొత్తం కల్పంలో ఏ ఆత్మకు లేదు. ఎంత ప్రసిద్ధమైన ఆత్మలైనా కానీ, మీ భాగ్యం ముందు వారి భాగ్యము ఏపాటిది? అది అల్పకాలికమైన భాగ్యము మరియు బ్రాహ్మణాత్మలది అవినాశీ భాగ్యము. ఇది కేవలం ఈ ఒక్క జన్మది కాదు, జన్మ జన్మల భాగ్యము. తండ్రికి చెందినవారిగా అవ్వడం అనగా భాగ్యం యొక్క వారసత్వము అధికారంగా లభించడము. కావున అధికారమైతే లభించింది కదా. బిడ్డ అనగా అధికారము, వారసత్వము. అధికారం యొక్క నషా ఉందా లేక అది ఎక్కుతూ దిగుతూ ఉందా? అర్ధకల్పమైతే కిందికే దిగారు, ఇప్పుడేం చేయాలి? నడవాలా, ఎక్కాలా లేక ఎగరాలా? ఎగిరే వస్తువు మధ్యలో ఎప్పుడూ ఆగదు. ఆగిపోతే కిందకు వస్తారు. కొంత సమయం కోసమైనా ఆగి, మళ్ళీ ఎగిరితే గమ్యానికి ఎలా చేరుకుంటారు? అందుకే ఎగురుతూ ఉండండి. కానీ ఎవరు సదా ఎగురుతారు? తేలికగా ఉన్నవారు. మరి తేలికగా ఉన్నారు కదా? లేదా తనువు, మనసు, సంబంధాల బరువు ఉందా? ఒకవేళ బరువు లేకపోతే ఎందుకు ఆగుతారు? బరువుగా ఉన్న వస్తువు కిందికి వస్తుంది మరియు తేలికగా ఉన్నది సదా పైన ఉంటుంది. మీరందరూ అయితే డబల్ లైట్ గా ఉన్నారు కదా?

 

Comments