10-01-1991 అవ్యక్త మురళి

10-01-1991         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము 

‘‘నాలుగు సత్తాల (శక్తుల) బ్యాలెన్స్ ద్వారా తండ్రి సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వండి’’

ఈ రోజు సర్వశక్తివంతుడైన బాప్ దాదా తమ పిల్లలందరి విశేషమైన శక్తులను చూస్తున్నారు. ఈనాటి విశ్వంలో విశేషంగా మూడు శక్తులు ఉన్నాయి - ఒకటి ధర్మ సత్తా, రెండవది రాజ్య సత్తా, మూడవది విజ్ఞాన సత్తా. కానీ బ్రాహ్మణాత్మలైన మీలో నాలుగు సత్తాలు ఉన్నాయి. మొదటి మూడు సత్తాలైతే ఉండనే ఉన్నాయి, వాటితో పాటు నాల్గవ సత్తా - శ్రేష్ఠ కర్మల సత్తా. ఈనాటి విశ్వంలో ఈ నాల్గవ సత్తా యొక్క లోటు ఉంది, దీనినే శ్రేష్ఠ చరిత్ర యొక్క సత్తా అని అంటారు. ఈ నాలుగు సత్తాల ద్వారా బ్రాహ్మణాత్మలైన మీరు తమ మరియు విశ్వం యొక్క కళ్యాణం చేస్తున్నారు. నాలుగు సత్తాలు మాలో ఉన్నాయని మంచి రీతిలో తెలుసుకున్నారు. నాలుగూ ఉన్నాయా లేక కేవలం ఒక ధర్మ సత్తానే ఉందా? ధర్మ సత్తా అనగా సదా శ్రేష్ఠ సుఖమయమైన, సంతోషకరమైన జీవితాన్ని జీవించే కళ. దీనినే ధర్మము అనగా ధారణ అని అంటారు. రాజ్య సత్తా అనగా తమకు మరియు రాజ్యానికి అనగా తమ కర్మ సహచరులకు తమ స్నేహము మరియు శక్తి యొక్క బ్యాలెన్స్ ద్వారా సర్వ ప్రాప్తులు, సంతుష్టత యొక్క అధికారాన్ని దాతగా అయి అనుభవం చేయించడము. రాజు అనగా దాత. ప్రతి ఒక్కరి ద్వారా సంతుష్టత యొక్క వాహ్! వాహ్! రావాలి. ఇది యథార్థమైన రాజ్య సత్తా. కనుక రాజ్య సత్తా అనగా స్వయం నడుచుకోవడము మరియు ఇతరులను నడిపించే కళ.

విజ్ఞాన సత్తా అనగా విజ్ఞానం ద్వారా, సాధనాల ద్వారా ప్రత్యక్ష ఫలాన్ని అనుభూతి చేయించే కళ. శ్రేష్ఠ కర్మల సత్తా అనగా కర్మల వర్తమాన ఫలము, సంతోషాన్ని మరియు శక్తిని అనుభవం చేయడము, ఇంకా దానితో పాటు భవిష్య ఫలము జమ అయినట్లు అనుభూతి చేయడము. దీనిని అంటారు, కర్మల ఖజానాల సంపన్నత యొక్క నషాలో ఉండే కళ. ఇప్పుడు ఆలోచించండి, ఈ నాలుగు కళలు మీ జీవితంలో ఉన్నాయా? అన్నింటికన్నా పెద్ద ఖజానా, శ్రేష్ఠ కర్మల ఖజానా. ఒకవేళ శ్రేష్ఠ కర్మల ఖజానా జీవితంలో లేకపోతే మానవ జీవితము అమూల్యమైన జీవితము కాదు కానీ పశు సమానమైన జీవితము. జీవితాన్ని జీవించడము నేర్చుకోవాలంటే ఇక్కడికి వచ్చి నేర్చుకోండి అని మీరందరూ ఏ అథారిటీతో విశ్వం ఎదురుగా ఛాలెంజ్ చేస్తారు. ఈ ఛాలెంజ్ చేస్తారు కదా. రాజ్య నేతలు కావచ్చు, వైజ్ఞానిక నేతలు కావచ్చు, ధర్మ నేతలు కావచ్చు, అందరి ఎదురుగా ఆత్మిక నషాతో మీరంటారు - నిశ్చింత చక్రవర్తులుగా అయి చూడండి. చక్రవర్తులు కదా! జీవితం యొక్క యథార్థమైన ఆనందాన్ని అనుభవం చేస్తున్నారు కదా! అన్నింటికన్నా పెద్ద ఖజానా ఎవది వద్ద ఉంది? (మన వద్ద ఉంది). అథారిటీతో అంటారు కదా, ఎందుకంటే ప్రపంచంలో మూడు సత్తాలు ఉన్నాయి, మీ వద్ద నాలుగు సత్తాలు ఉన్నాయి మరియు నాలుగు సత్తాల బ్యాలెన్స్, ఇదే తండ్రి సమానమైన సంపన్న మరియు సంపూర్ణ స్థితి.

తపస్యా సంవత్సరంలో ఏం చేస్తారు? ఈ నాలుగు సత్తాలను చెక్ చేసుకోవాలి. నాలుగు సత్తాల ఆధారంతో ఏకరస స్థితి యొక్క ఆసనము సదా స్థిరమైనదిగా, చలించనిదిగా ఉంటుంది. తపస్య ఎల్లప్పుడూ ఆసనంపైన చేస్తారు. కనుక ఈ నాలుగు సత్తాలు అనే నాలుగు కాళ్ళు ఏకరస స్థితి అనే ఆసనాన్ని దృఢంగా చేస్తాయి. ప్రతి సమయము నిశ్చంత చక్రవర్తి యొక్క అనుభవం చేయిస్తాయి. చక్రవర్తి అంటే అధికారి, ప్రజలు అంటే అధీనంగా ఉండాల్సి ఉంటుంది. కనుక మీరు నిశ్చింతా చక్రవర్తులు, నిశ్చింత ప్రజలు కాదు. మీరు రాజయోగులు, ప్రజాయోగులు కాదు. ఈ నిశ్చింత చక్రవర్తి యొక్క గుర్తులు ఏం కనిపిస్తాయి? ఎంతగా అధికారియో, అంతగా సర్వులకు సత్కారం చేసేవారిగా ఉంటారు. కేవలం అధికారి కారు. సత్కారం ద్వారానే అధికారి యొక్క పరిశీలన జరుగుతుంది. వినిపించారు కదా, యోగ్యమైన రాజుకు గుర్తు - సర్వుల ద్వారా సంతుష్టత అనే పుష్పాల వర్షము కురవాలి. వాహ్! వాహ్! అనే పాట ఉండాలి. ఇటువంటి రాజ్యసత్తాను ప్రాప్తి చేసుకున్నారా? మొదట తమ సమీపంగా ఉన్న కర్మ సహచరులను, కర్మేంద్రియాలను చెక్ చేసుకోండి - ఆత్మ రాజునైన నా యొక్క స్నేహము మరియు శక్తి అనగా లవ్ మరియు లా - రెండూ సదా ఆర్డర్లో నడుస్తున్నాయా లేక అప్పుడప్పుడు నడుస్తున్నాయా? విధి లేక నడుస్తున్నాయా లేక ప్రేమతో నడుస్తున్నాయా? చూపించేందుకు నడుస్తున్నాయా లేక ఇష్టంతో నడుస్తున్నాయా? అదే విధంగా రోజంతటి దినచర్యలో తమ కర్మ సంబంధీకులను లేక కర్మ సహచరులను చూడండి, వాటితో పాటు సంపర్కంలోకి వచ్చే ఆత్మలందరినీ చూడండి - రాజ్యాధికారి ఆత్మనైన నా ద్వారా ఎంత శాతంలో మరియు ఎంతమంది సంతుష్టంగా, హర్షితంగా ఉన్నారు? ఇది రాజ్య సత్తా యొక్క యథార్థమైన అనుభూతి. విజ్ఞాన సత్తాను చెకింగ్ ఎలా చేస్తారు?

హద్దు విజ్ఞానం హద్దు స్థూల సాధనాల ద్వారా సుఖాన్ని, విశ్రాంతిని అనుభూతి చేయిస్తుంది. మీ విజ్ఞానము యోగ శక్తి. యోగము అన్నింటికన్నా గొప్ప విజ్ఞానము. అక్కడ సాధనాలు ఉన్నాయి మరియు ఇక్కడ సాధన ఉంది. ఆత్మను, మనసు మరియు బుద్ధి యొక్క సాధన ద్వారా ఎంత దూరంగా తీసుకువెళ్తారు? హద్దు వైజ్ఞానికులు సూర్యుని వరకు చేరుకోలేకపోయారు మరియు అనంతమైన వైజ్ఞానికులు చంద్రుడు, సూర్యుని కన్నా కూడా అతీతంగా, మనసు మరియు బుద్ధి యొక్క సాధన ద్వారా ఎంత సమయంలో చేరుకుంటారు? మరియు ఎంత ఖర్చు అవుతుంది? సమయము ధనము వంటిది అని సమయం కోసం అంటారు. ఇందులో స్థూలమైన ధనమైతే ఖర్చు అవ్వదు, సమయమనే ధనము కూడా ఖర్చు అవ్వదు. కనుక ఎంత గొప్ప విజ్ఞానము. వారు ఎయిర్ కండిషన్ ద్వారా సుఖాన్ని ఇస్తారు, విశ్రాంతినిస్తారు మరియు మీరు సాధన ద్వారా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శీతల స్థితి యొక్క అనుభవం చేస్తారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్వాలా రూపాన్ని, శక్తి రూపాన్ని అనుభవం చేయగలరు. హద్దు విజ్ఞానము కొద్ది సమయం కోసం విశ్రాంతినివ్వడానికి నిమిత్తంగా అవుతుంది కానీ మీరు సదా విశ్రాంతిగా ఉంటారు. విశ్రాంతి యొక్క నిద్రలో నిద్రిస్తారు. విశ్రాంతిగా లేస్తారు మరియు విశ్రాంతిగా రోజంతటి కార్యాలు చేస్తారు. అశాంతిగా ఏమైనా అవుతున్నారా? ఎప్పుడైతే ఆసనము నుండి దిగుతారో, అప్పుడు అశాంతిగా అవుతారు లేదంటే అశాంతి యొక్క నామ-రూపాలు ఉండవు.

విజ్ఞానము ఇంకా ఏం చేస్తుంది? మనోరంజనం యొక్క సాధనాలను ఇస్తుంది. హద్దు మనోరంజనం యొక్క అవసరం ఉండేందుకు మీ మనసు ఎప్పుడూ ఉదాసీనంగా అవ్వనే అవ్వదు ఎందుకంటే ఎప్పుడైతే మనసు యొక్క దాసునిగా అవుతారో, అప్పుడే ఉదాసీనంగా అవుతారు. దాసునిగా ఏమైనా అవుతున్నారా? లేదా అప్పుడప్పుడు 63 జన్మల సంస్కారాలు వచ్చేస్తున్నాయా. ఇప్పుడైతే చక్రవర్తులుగా అయ్యారు కదా. దాసునిగానూ అవ్వరు, ఉదాసీనంగానూ అవ్వరు, అందుకే మనసు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఏకాంతంలో ఉన్నా కూడా ఆనందంగా ఉంటారు, సంగఠనలో ఉన్నా ఆనందంగా ఉంటారు. సదా ఆనందాల దాత, యజమాని అయిన తండ్రితో పాటు ఉంటారు కదా లేక అప్పుడప్పుడు అలుగుతారా? అలగకండి. మనసును లేదా ముఖాన్ని తిప్పుకోకండి., విజ్ఞాన సత్తా ఎంతవరకు అవినాశీగా ఉంటుంది అని ఈ విధంగా చెక్ చేసుకోండి. అదే విధంగా ధర్మసత్తా.

ధర్మము అనగా శ్రేష్ఠ జీవితాన్ని జీవించే కళ. ఈ ధారణయే ధర్మము. మీరందరూ అయితే ధర్మ-ఆత్మలు కూడా మరియు శ్రేష్ఠ కర్మ-ఆత్మలు కూడా. కనుక ఇది చెక్ చేసుకోండి, బ్రాహ్మణ జీవితంలో జీవిస్తున్నామా? బ్రాహ్మణ జీవితము అనగా సదా నిర్వికల్పమైన, నిర్విఘ్నమైన, నిర్వికర్మీ, సదా నిరాకారీ మరియు సాకారీ. దీనినే అంటారు, జీవితాన్ని జీవించే కళ. ఇక్కడ ఏ హద్దు యొక్క కోరిక లేదు, ఏ అప్రాప్తి లేదు. ఏది పొందాలో అది పొందేసాము అని సదా ఈ పాట పాడుతూ ఉండాలి. దీనినే ధర్మ సత్తా అని అంటారు. ఇప్పుడు ఆలోచించండి, నాలుగు సత్తాలు ఉన్నాయా? నాలుగు కాళ్ళు ఏకరసంగా ఉన్నాయా? లేదా ఒకటి చిన్నదిగా, ఒకటి పెద్దదిగా ఉందా? నాలుగు కాళ్ళు ఏకరసంగా ఉన్నప్పుడే అచలంగా ఉంటారు లేదంటే అలజడి ఉంటుంది. కనుక విన్నారా తండ్రి ఏం చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిలో నాలుగు సత్తాలు ఎంతవరకు జమ అయ్యాయి. మీరు సంతోషంగా జీవించేవారు కదా. విధి లేక జీవిస్తున్నాము, నడుస్తున్నాము, నడవాల్సిందే, దీనిని జీవించడము అని అనరు. అప్పుడప్పుడు మరణిస్తారు, అప్పుడప్పుడు జీవిస్తారు, అప్పుడప్పుడు శ్వాస ఆగిపోతుంది, అప్పుడప్పుడు ఢీలాగా అయిపోతారు, అప్పుడప్పుడు వేగముగా ఉంటారు - ఇదేమీ జీవించడము కాదు. అచ్ఛా.

(ఎవరో ఒక సోదరికి కొంత కష్టం కలిగింది)

క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టడం వస్తుందా లేక సమయం పడుతుందా? గడిచిపోయిందేదో గడిచిపోయింది, ఫుల్ స్టాప్, ఇదే విజ్ఞానము. విజ్ఞానం కూడా వస్తువును చెరిపివేస్తుంది కదా. అనంతమైన విజ్ఞాన సత్తాతో సెకండులో బిందువు పెట్టడము అనగా ఫుల్ స్టాప్ పెట్టడము - దీని కోసమే తపస్య యొక్క గోల్డెన్ ఛాన్స్ లభించింది ఎందుకంటే అంతిమ పేపర్ లో నలువైపులా ప్రకృతి యొక్క 5 తత్వాలు మరియు 5 వికారాలు అన్నీ కలిసి అలజడిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాయి. అతి అలజడిలో సెకండులో అచలంగా ఉండేవారే పాస్ విత్ ఆనర్గా అవుతారు. చివర్లో ఏకాంతంలో కూర్చుని పేపర్ ఇవ్వాలి అని భావించకండి. అతి అలజడిలో అతి అచలము. ఇదే పేపర్. ఇదే ప్రశ్న వస్తుంది, అందుకే ఇప్పటి నుండే అభ్యాసం చేయండి. బయటి అలజడి మనసును అలజడిలోకి తీసుకురాకూడదు, వీరినే విజయీరత్నాలు అని అంటారు. అచ్ఛా!

నలువైపులా ఉన్న శ్రేష్ఠ ధర్మ సత్తా ఉన్న ధర్మాత్మలకు, అనంతమైన విజ్ఞాన సత్తా ఉన్న సాధనా స్వరూప ఆత్మలకు, రాజ్య సత్తా ఉన్న స్వరాజ్యాధికారి ఆత్మలకు, శ్రేష్ఠ కర్మ సత్తా ఉన్న కర్మయోగి ఆత్మలకు, బాప్ దాదా యొక్క, నిశ్చింత చక్రవర్తిగా చేసేటటువంటి తండ్రి యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

అచ్ఛా - ఈ రోజు టీచర్లు కూడా త్యాగం చేసారు. (టీచర్లందరూ వెనుక కూర్చున్నారు) కనుక త్యాగం యొక్క భాగ్య స్వరూపంగా విశేషమైన ప్రియస్మృతులను స్వీకరించండి. టీచర్ల పనే ఇతరులను ముందుకు తీసుకువెళ్ళడము. మంచి పని చేసారు, ప్రాక్టికల్ గా కర్మ చేసి చూపించారు, దీని కోసం శుభాకాంక్షలు. డబల్ విదేశీయుల ఉత్తరాలు మరియు కార్డులు చాలా వచ్చాయి, దేశవాసులవి కూడా ఉత్తరాలు మరియు కార్డులు చాలా వచ్చాయి. కార్డులు ఎక్కడ ఉంచారు? హృదయమనే డిబ్బీలో సంభాళించి ఉంచారు, ఎవరైతే కొత్త సంవత్సరం యొక్క విశేషమైన ప్రియస్మృతులను పంపించారో, వారితో పాటు పిల్లలందరికీ కొత్త సంవత్సరం యొక్క ప్రతి సమయంలో నవీనతకు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. కర్మయోగి స్థితి యొక్క అద్భుతం ఏముంటుంది అన్నదానికి ఇప్పుడు విశ్వంలో ఒక ఉదాహరణగా అయి చూపించండి. ఎవరైతే ఉదాహరణగా అవుతారో, డ్రామాలో పరీక్ష సమయంలో వారికి ఎక్స్ ట్రా మార్కులు లభిస్తాయి. అచ్ఛా.

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా కలయిక-

తండ్రితో పాటు ఉండడం వలన శ్రేష్ఠ స్థితిని సహజంగా అనుభవం చేస్తున్నారు కదా. రాత్రి-పగలు తండ్రి తోడును అనుభూతి చేయడం వలన సహజంగానే శ్రేష్ఠ అనుభవాన్ని చేస్తూ ఉంటారు ఎందుకంటే సమీపత ద్వారా శక్తి లభిస్తుంది. ఎలాగైతే సాకారంలో సమీపంగా ఉండడము సహజము అనిపిస్తుందో, అలాగే అవ్యక్తంలో ఎంతగా అటెన్షన్ ఇస్తూ ఉంటారో అంతగా సహజంగా అనుభవం చేస్తూ ఉంటారు. అందరూ నిరంతర యోగీలు కదా, యోగీ జీవితము కలవారు, జీవితము నిరంతరంగా ఉంటుంది, రెండు గంటలది కాదు. ఎప్పుడైతే, తండ్రి నా వారు, నేను తండ్రికి చెందినవాడిని అని ఒకసారి అనుభవం చేసారో మళ్ళీ వేరుగా ఎలా అవ్వగలరు. నిరంతర యోగీ జీవితంలో అతీంద్రియ సుఖము, ఆనందము యొక్క అనుభవమవుతుంది మరియు శ్రమ కూడా ఉండదు. శ్రమించాల్సిన పనిని అప్పుడప్పుడు చేయడం జరుగుతుంది మరియు ఏదైతే సహజంగా ఉంటుందో, దానిని సదా చేయగలరు. కనుక సహజమనిపిస్తుందా లేక కష్టమనిపిస్తుందా? మాయ అయితే రావడం లేదు కదా? ఈ సమయంలో నషా ఎక్కి ఉంది కనుక మాయ కనిపించడం లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఇలా జరిగిపోయింది అని అంటారు. నిరంతరము యొక్క స్థితి మంచిది. ఒక్క తండ్రి తప్ప ఉన్నతమైనది ఇంకేముంది. ఒకటేమో, ఉన్నతమైన వస్తువు ప్రియంగా అనిపిస్తుంది మరియు రెండవది, ఎవరైతే ప్రియమైనవారిగా ఉంటారో, వారు ప్రియమనిపిస్తారు. మరి అందరికన్నా ప్రియమైనవారు, అందరికన్నా ఉన్నతమైనవారు తండ్రే కదా. కనుక ఇంకెవరు గుర్తుకొస్తారు! కేవలం మధ్య-మధ్యలో మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. కొద్దిగా పర్సెంటేజ్ తగ్గినట్లయితే దానిని పెంచాలి. అప్పుడు మాయ రావడానికి మార్జిన్ ఉండదు. కానీ ఏం జరుగుతుందంటే, నడుస్తూ-నడుస్తూ స్థితి సాధారణ స్థితి అవుతూ ఉంటుంది, కానీ స్మృతి అయితే ఉండనే ఉంది, మర్చిపోవడమైతే మర్చిపోలేదు అని భావిస్తారు. కానీ సాధారణంగా అవుతూ-అవుతూ విస్మృతి వైపుకు వెళ్ళిపోతారు, అందుకే సాధారణముగా కూడా అవ్వనివ్వకండి. కొంచెమైనా పర్సెంటేజ్ తగ్గినట్లయితే, యాడ్ చేయండి అప్పుడు సదా శక్తిశాలిగా ఉంటారు. శక్తిశాలి ఆత్మ వద్దకు మాయకు వచ్చేందుకు ధైర్యము ఉండదు. మాయ వచ్చింది, తర్వాత యుద్ధం చేసారు, దీనిలో సమయం గడిచిపోతుంది మరియు లింకు తెగిపోతుంది. తెగిపోయిన లింకును జోడించడము, దీని వలన నిరంతరంలో అంతరం వచ్చేస్తుంది. అందుకే స్థితిని సాధారణంగా అవ్వనివ్వకండి. తండ్రి స్మృతి అయితే ఉంది కదా అని ఈ పొరపాటులో ఉండకండి. అలా ఉండకండి, కానీ సదా స్మృతి స్వరూపంగా ఉన్నారా? స్మృతి స్వరూపము అనగా శక్తిశాలి. అప్పుడప్పుడు కామము, క్రోధము, లోభము, మోహము అనే పెద్ద వికారాలైతే రావు కానీ తమ స్వభావము లేక తమ సంస్కారాలే సాధారణ స్థితిని తయారుచేస్తాయి. ఈ సోమరితనము అనే రూపంలో మాయ వస్తుంది. రోజు చదువుతారు, మురళీ కూడా వింటారు, సేవ కూడా చేస్తారు కానీ ఎలా ఉండాలో అలా లేరు. నడుస్తున్నారు కానీ వేగము ఎంత ఉంది? నడవడముతో పాటు వేగము కూడా మంచిగా ఉండాలి. తండ్రి ఎల్లప్పుడూ పిల్లలను సదా ఉన్నతంగా చూస్తారు మరియు సదా ఉన్నతంగా చూసేందుకు శుభమైన ఆశను పెట్టుకుంటారు. అచ్ఛా - అందరూ శ్రేష్ఠ కర్మలు చేసేటటువంటి కర్మ సత్తా ఉన్నవారు కదా. శ్రేష్ఠ కర్మల యొక్క ఖజానా జమ అయి ఉంది కదా. ఎన్ని జన్మలు నడుస్తుంది? ఎంత జమ చేసుకున్నారు? పూర్తి కల్పము నడుస్తుందా లేక 21 జన్మలు నడుస్తుందా? అర్ధకల్పము తర్వాత కూడా పూజింపబడతారు. ఎప్పుడైతే శ్రేష్ఠ కర్మల ఖాజానాను జమ చేసుకుంటారో, అప్పుడే పూజ్యులుగా కూడా అవుతారు. లాస్ట్ జన్మ కూడా చూడండి ఎంత మంచిగా ఉంది. భికారులుగా అయితే అవ్వలేదు కదా. పప్పు, రొట్టె అయితే ఉంది. కనుక చివరి జన్మ మంచిగా ఉన్నప్పుడు ఇతర జన్మలు కూడా అతి దుఃఖమయంగా అయితే ఉండి ఉండవు. ఇదైతే సుఖంతో పోలిస్తే దుఃఖితులుగా ఉన్నారు, అంతేకానీ, ఫకీరులుగా అయి రొట్టెను యాచించేటువంటి దుఃఖితులుగా అయితే అవ్వరు. ప్రపంచం యొక్క లెక్కతో అతి దుఃఖితులుగా అవ్వరు, సత్యయుగం యొక్క లెక్కతో దుఃఖితులుగా అవుతారు. అచ్ఛా.

టీచర్లది కూడా భాగ్యము, వారికి సేవ యొక్క లాటరీ లభిస్తుంది. లాటరీ అయితే అందరికీ లభిస్తుంది కానీ వీరికి సేవ యొక్క లాటరీ విశేషంగా లభించింది. మీరు కూడా టీచర్లను చూసి సంతోషిస్తారు కదా లేక టీచర్లు ముందు ఎందుకు అని భావిస్తారా? ఇతరులను ముందు పెట్టేవారు స్వతహాగా ముందుకు వెళ్తారు. గౌరవాన్ని ఇచ్చేవారికి గౌరవం తప్పకుండా లభిస్తుంది, ఇది ఒక అనాది నియమము. ఇవ్వడము అనగా తీసుకోవడము మరియు తీసుకోవడము అనగా పోగొట్టుకోవడము. కొంతమంది తీసుకునేందుకు ప్రయత్నిస్తారు - నాకు గౌరవం లభించాలి, గౌరవం ఎందుకు ఇవ్వరు. కనుక తీసుకోవడము వెనుక వెళ్ళడము అనగా పోగొట్టుకోవడము మరియు ఇవ్వడము అనగా తీసుకోవడము. కనుక ఇచ్చేటటువంటి దాత యొక్క పిల్లలా లేక తీసుకునేవారా? దేవత అనగా ఇచ్చేవారు. మంచిది - తండ్రి కూడా సంతోషంగా ఉన్నారు, పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారు, ఇంకేం కావాలి. టీచర్లు అందరికన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే విద్యార్థులను చూసి సంతోషమనిపిస్తుంది. అచ్ఛా.

Comments