04-12-1991 అవ్యక్త మురళి

     04-12-1991         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘సఫల తపస్వీ అనగా పవిత్రతా పర్సనాలిటీ మరియు రాయల్టీ కలవారు’’

ఈ రోజు నలువైపులా ఉన్న తపస్వీ పిల్లల స్మృతి బాప్ దాదా వద్దకు చేరుకుంటుంది. కొందరు సాకారంలో సమ్ముఖంలో స్మృతికి రిటర్న్ గా మిలనం జరుపుకుంటున్నారు, కొందరు పిల్లలు ఆకారీ రూపంలో స్మృతిని మరియు మిలనాన్ని అనుభవం చేస్తున్నారు. బాప్ దాదా రెండు రూపాలలోని పిల్లలను చూస్తున్నారు. ఈ రోజు అమృతవేళ బాప్ దాదా పిల్లల తపస్య యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని చూసారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పురుషార్థానుసారంగా తపస్య చేస్తున్నారు. లక్ష్యము కూడా ఉంది మరియు ఉల్లాసం కూడా ఉంది. అందరూ తపస్వీలే ఎందుకంటే బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతయే తపస్య. తపస్య అనగా ఒక్కరి లగనములో నిమగ్నమై ఉండడము. సఫల తపస్వీలు చాలా కొద్దిమంది ఉన్నారు. పురుషార్థీ తపస్వీలు చాలామంది ఉన్నారు. సఫల తపస్వీలకు గుర్తు - వారి ముఖం మరియు స్వభావంలో పవిత్రతా పర్సనాలిటీ మరియు పవిత్రతా రాయల్టీ సదా స్పష్టంగా అనుభవమవుతుంది. తపస్య యొక్క అర్థమే, మనసు, మాట, కర్మ మరియు సంబంధ-సంపర్కాలలో అపవిత్రత యొక్క అంశ మాత్రము, నామ-రూపాలు కూడా సమాప్తమవ్వడము. ఎప్పుడైతే అపవిత్రత సమాప్తమవుతుందో, అప్పుడు ఈ సమాప్తినే సంపన్న స్థితి అని అంటారు. సఫల తపస్వీ అనగా సదా స్వతహాగా పవిత్రతా పర్సనాలిటీ మరియు రాయల్టీ ప్రతి మాట మరియు కర్మ ద్వారా, దృష్టి మరియు వృత్తి ద్వారా అనుభవమవ్వాలి. పవిత్రత కేవలం బ్రహ్మచర్యము కాదు, సంపూర్ణ పవిత్రత అనగా సంకల్పంలో కూడా ఏ వికారము టచ్ చేయకూడదు. ఎలాగైతే బ్రాహ్మణ జీవితంలో శారీరక ఆకర్షణ లేక శారీరక టచింగ్ అపవిత్రతగా భావించబడుతుందో, అలాగే మనసు, బుద్ధిలో ఏదైనా వికారము పట్ల సంకల్పమాత్రంలో ఆకర్షణ లేక టచింగ్, ఇది కూడా అపవిత్రత అనబడుతుంది. పవిత్రతా పర్సనాలిటీ కలవారు, రాయల్టీ కలవారు మనసు-బుద్ధితో కూడా ఈ చెడును టచ్ చేయరు ఎందుకంటే సఫల తపస్వీ అనగా సంపూర్ణ వైష్ణవులు. వైష్ణవులు ఎప్పుడూ చెడు వస్తువును టచ్ చేయరు. మరి వారిది స్థూలమైనది, బ్రాహ్మణ వైష్ణవ ఆత్మలైన మీది సూక్ష్మమైనది. చెడును టచ్ చేయకుండా ఉండడము, ఇదే తపస్య. ధారణ చేయడము అనగా గ్రహించడము. ఇదైతే చాలా స్థూలమైన విషయము. కానీ సంకల్పంలో కూడా టచ్ చేయకూడదు, వీరిని సత్యమైన వైష్ణవులు అని అంటారు.

కేవలం స్మృతి సమయంలో స్మృతిలో ఉండడము, దీనిని తపస్య అని అనరు. తపస్య అనగా పవిత్రతా పర్సనాలిటీ మరియు రాయల్టీని స్వయం కూడా అనుభవం చేయడము మరియు ఇతరులకు కూడా అనుభవం చేయించడము. సఫల తపస్వీకి అర్థమే విశేషమైన మహాన్ ఆత్మగా అవ్వడము. విశేష ఆత్మలు లేక మహాన్ ఆత్మలను దేశము లేక విశ్వం యొక్క పర్సనాలిటీలు అని అంటారు. పవిత్రతా పర్సనాలిటీ అనగా ప్రతి కర్మలో మహానత మరియు విశేషత. పర్సనాలిటీ అనగా సదా స్వయము మరియు ఇతరుల సేవలో బిజీగా ఉండడము అనగా తమ శక్తిని, సమయాన్ని, సంకల్పాలను వ్యర్థంగా పోగొట్టుకోకుండా సఫలం చేయడము. ఇటువంటి వారినే పర్సనాలిటీ కలవారు అని అంటారు. పర్సనాలిటీ కలవారు ఎప్పుడూ కూడా చిన్న-చిన్న విషయాలలో తమ మనసు, బుద్ధిని బిజీగా పెట్టుకోరు. కనుక అపవిత్రతకు చెందిన విషయాలు శ్రేష్ఠ ఆత్మలైన మీ ముందు చిన్నవా లేక పెద్దవా? అందుకే తపస్వీ అనగా అటువంటి విషయాలను వింటూ కూడా వినకూడదు, చూస్తూ కూడా చూడకూడదు. ఇటువంటి అభ్యాసం చేసారా? ఇలాంటి తపస్య చేసారా? లేదా ఇలా ఆలోచిస్తున్నారా, మేమైతే కోరుకోము కానీ కనిపిస్తుంది, వినిపిస్తుంది? ఏ విధంగానైతే ఏ వస్తువుతోనైతే మీకు కనెక్షన్ ఉండదో, ఆ వస్తువును చూస్తూ కూడా చూడరు కదా. ఎలాగైతే మార్గములో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా కనిపిస్తుంది, కానీ మీకు పనికి వచ్చే విషయమేమీ కాకపోతే, చూస్తూ కూడా చూడరు కదా. సైడ్ సీన్ గా భావించి దాటేస్తారు కదా? అలాగే ఏ విషయాలైతే వింటారో, చూస్తారో అవి మీకు పనికి రావో, అప్పుడు వింటూ కూడా వినకండి, చూస్తూ కూడా చూడకండి. ఒకవేళ మనసు, బుద్ధిలో వీరు ఇలాంటివారు, వారు ఇలాంటివారు... అని ధారణ చేసారు, దీనినే వ్యర్థాన్ని, చెడును టచ్ చేయడము అని అంటారు అనగా సత్యమైన వైష్ణవత్వము సంపూర్ణ రూపంలో లేదు. పవిత్రతా పర్సనాలిటీలో పర్సంటేజ్ లోపము అనగా తపస్యా పర్సంటేజ్ లో లోపము ఉంది, మరి అర్థమయిందా, తపస్య అంటే ఏమిటో?

ఇదే విధితో తమను తాము చెక్ చేసుకోండి - తపస్యా సంవత్సరంలో తపస్యకు ప్రత్యక్ష స్వరూపమైన పవిత్రతా పర్సనాలిటీని అనుభవం చేస్తున్నారా? పర్సనాలిటీ ఎప్పుడూ దాగి ఉండలేదు, ప్రత్యక్షంగా తప్పకుండా కనిపిస్తుంది. ఏ విధంగానైతే సాకార బ్రహ్మా తండ్రిని చూసారు - పవిత్రతా పర్సనాలిటీని ఎంత స్పష్టంగా అనుభవం చేసేవారు. ఈ తపస్య యొక్క అనుభవానికి గుర్తు, ఇప్పుడు మీ ద్వారా ఇతరులకు అనుభవమవ్వాలి. ముఖము మరియు స్వభావము, రెండింటి ద్వారా అనుభవం చేయించగలరా. ఇప్పుడు కూడా చాలామంది అనుభవం చేస్తారు కూడా. కానీ ఈ అనుభవాన్ని ఇంకా స్వయం ద్వారా ఇతరులకు వ్యాపింపజేయండి. ఈ రోజు పర్సనాలిటీ గురించి వినిపించాము. తర్వాత రాయల్టీ గురించి వినిపిస్తాము.

అందరూ మిలనాన్ని జరుపుకోవడానికి వచ్చారు. కనుక బాప్ దాదా కూడా మిలనం జరుపుకోవడం కోసం మీలా వ్యక్త శరీరంలోకి వస్తారు. సమానంగా అవ్వాల్సి ఉంటుంది కదా. మీరు సాకారంలో ఉన్నారు కనుక తండ్రి కూడా సాకార తనువును ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మీరు వ్యక్తము నుండి అవ్యక్తముగా అవ్వాలా లేక అవ్యక్తముగా ఉన్నవారు వ్యక్తముగా అవ్వాలా? నియమం ఏమి చెప్తుంది? అవ్యక్తముగా అవ్వాలి కదా? మరి అవ్యక్తముగా ఉన్నవారిని వ్యక్తములోకి ఎందుకు తీసుకువస్తారు? మీరు కూడా అవ్యక్తముగా అవ్వాలి అన్నప్పుడు అవ్యక్తముగా ఉన్నవారిని అవ్యక్తములోనే ఉండనివ్వండి కదా. అవ్యక్త మిలనం యొక్క అనుభవాన్ని పెంచుతూ వెళ్ళండి. అవ్యక్తముగా ఉన్నవారు కూడా డ్రామానుసారంగా వ్యక్తములోకి వచ్చేందుకు బంధింపబడి ఉన్నారు కానీ సమయమనుసారంగా, పరిస్థితుల అనుసారంగా అవ్యక్త మిలనం యొక్క అనుభవం చాలా పనికొస్తుంది, అందుకే ఈ అనుభవాన్ని ఎంత స్పష్టంగా మరియు సహజంగా చేస్తూ వెళ్ళండంటే సమయానికి ఈ అవ్యక్త మిలనము సాకారానికి సమానంగా అనుభవమవ్వాలి. అర్థమయిందా - ఆ సమయంలో, మాకు అవ్యక్తము నుండి వ్యక్తములో కలుసుకునే అలవాటే ఉంది అని ఈ విధంగా అనకండి. ఎలాంటి సమయమూ, అలాంటి మిలనం జరుపుకోగలరా. అర్థమయిందా!

ఎవరు ఎక్కడి నుండి వచ్చినా సరే, ఈ సమయంలో అందరూ మధుబన్ నివాసులే. లేక స్వయాన్ని మహారాష్ట్ర నివాసులము, ఒరిస్సా నివాసులము... అని భావిస్తున్నారా? ఒరిజనల్ గా అయితే మధుబన్ నివాసులు. సేవార్థము భిన్న-భిన్న స్థానాలకు వెళ్ళారు, బ్రాహ్మణులు అనగా మధుబన్ నివాసులు. సేవా స్థానాలకు వెళ్ళారు, అందుకే సేవా స్థానాన్ని - ఇదే నా స్థానము అని ఎప్పుడూ భావించకండి. చాలా మంది పిల్లలు వీరిని మార్చండి అని అన్నప్పుడు, ఇలా అంటారు - వద్దు, మమ్మల్ని పంజాబుకు లేక ఒరిస్సాకు మాత్రమే పంపించండి. ఒరిజనల్ గా పంజాబుకు, ఒరిస్సాకు చెందినవారా లేక మధుబన్ కు చెందినవారా? మరి, మేము పంజాబుకు చెందినవారము కనుక పంజాబుకే పంపించండి, గుజరాత్ కు చెందినవారము కనుక గుజరాత్ కే పంపించండి అని ఎందుకంటారు? మారడానికి తయారుగా ఉన్నారా? టీచర్లందరూ తయారుగా ఉన్నారా? ఎవరిని ఎక్కడికి మార్చినా కూడా, తయారుగా ఉన్నారా? చూడండి, దాదీ అందరికీ నో అన్న సర్టిఫికెట్ ను ఇస్తున్నారు. అచ్ఛా, ఇది కూడా ఏప్రిల్ లో చేస్తాము. ఎవరైతే మారేందుకు తయారుగా ఉన్నారో, వారే కలుసుకోవడానికి రావాలి. సెంటరుకు వెళ్ళిన తర్వాత, ఒకవేళ మేము లేకపోతే వీరికి ఏమవుతుంది, నాకు ఏమవుతుంది...? అని ఆలోచిస్తారా. కొద్దో గొప్పో ఏమైనా పక్కకు తప్పుకుంటారా. బాప్ దాదా నుండి తపస్య యొక్క ప్రైజ్ తీసుకోవాలి మరియు బాప్ దాదాకు తపస్య యొక్క ప్రైజ్ ను ఇవ్వాలి అని కూడా అనుకుంటారా, లేక కేవలం తీసుకోవాలి అని అనుకుంటారా? అందరూ సెంటర్ల నుండి సరెండర్ అయి రండి. కొత్త ఇంటిపైన అభిరుచి ఏమైనా ఉందా? శ్రమ చేసి నిర్మించారు కదా, ఎక్కడైతే నాది అనేది ఉంటుందో, అక్కడ తపస్య అని దేనిని అంటారు? తపస్య అనగా నీది మరియు తపస్య భంగమవ్వడము అనగా నాది. అర్థమయిందా - వీరైతే అందరూ చిన్న-చిన్న టీచర్లు, పర్వాలేదు, ఇక్కడి నుండి అక్కడికి వెళ్తాము అని అంటారు. పెద్దవారు కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. అచ్ఛా - ఎవరైతే సెంటరుకు వచ్చేవారు ఉన్నారో, వారు కూడా, మా టీచరు వెళ్ళిపోతారు అని ఆలోచిస్తూ ఉండవచ్చు. మీరందరూ కూడా ఎవర్రెడీగా ఉన్నారా? ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. లేక మాకైతే ఈ టీచరే కావాలి అని అంటారా? ఏ టీచరు లభించినా కూడా, అందులో రాజీగా ఉంటాము అని ఎవరైతే భావిస్తారో, వారు చేతులెత్తండి. ఏ టీచరు లభించినా కూడా, బాప్ దాదా బాధ్యులు, దాదీ, దీదీ బాధ్యులు, ఇలా భావించేవారు చేతులెత్తండి. ఇప్పుడు ఇది టి.వి.లోనైతే వచ్చింది కదా. టి.వి.లో అందరి ఫోటోను తీయండి, తర్వాత చూస్తాము. అంతిమ పేపరులో ఈ ప్రశ్నయే రానున్నది - నష్టోమోహా స్మృతి స్వరూపము. కనుక అంతిమ పేపరు కోసమైతే అందరూ తయారవ్వాల్సిందే. రిహార్సల్ చేస్తారు కదా, జోన్ హెడ్ ను కూడా మారుస్తాము. పాండవులను కూడా మారుస్తాము. మీదేమైనా ఉందా ఏమిటి? బాప్ దాదా ఇచ్చారు మరియు బాప్ దాదా తీసుకున్నారు. అచ్ఛా, అందరూ ఎవర్రెడీగా ఉన్నారా, అందుకే ఇప్పుడు కేవలం చేతులు ఎత్తినందుకు అభినందనలు.

నలువైపులా ఉన్న సఫల తపస్వీ ఆత్మలకు, సదా పవిత్రత యొక్క పర్సనాలిటీలో ఉండేవారు, సదా పవిత్రత యొక్క రాయల్టీలో ఉండేవారు, సదా సత్యమైన సంపూర్ణ వైష్ణవ ఆత్మలకు, సదా సమయమనుసారంగా స్వయాన్ని పరివర్తన చేసుకునే విశ్వ పరివర్తకులు, ఇటువంటి సదా యోగీ, సహజ యోగీ, స్వతహా యోగీ, మహాన్ ఆత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో కలయిక

అందరూ తపస్వీ ఆత్మలు - ఇటువంటి అనుభవం చేస్తున్నారా? తపస్య అనగా ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు. ఆ విధంగా ఉన్నారా లేక వేరేవారు ఎవరైనా ఉన్నారా, ఇప్పటికీ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా వ్యక్తి లేక ఏదైనా వైభవము ఉన్నాయా? ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరా లేక కొద్ది-కొద్దిగా మోహం ఉందా? నిమిత్తంగా అయి సేవ చేయడము వేరే విషయము, కానీ మోహం ఎక్కడ ఉన్నా సరే, వ్యక్తిలో కావచ్చు, వైభవంలో కావచ్చు, మోహానికి గుర్తు, అక్కడికి బుద్ధి తప్పకుండా వెళ్తుంది. మనసు తప్పకుండా పరుగెడుతుంది. కనుక చెక్ చేసుకోండి, మొత్తం రోజంతటిలో మనసు మరియు బుద్ధి ఎక్కడెక్కడికి పరుగెడుతుంది? కేవలం తండ్రి మరియు సేవ వైపుకు తప్ప ఇంకెక్కడికి మనసు, బుద్ధి వెళ్ళడం లేదు కదా? ఒకవేళ వెళ్తుంది అంటే మోహం ఉన్నట్లు. ఒకవేళ వ్యవహారం చేస్తున్నా కూడా, ఏం చేస్తున్నా కూడా, అది కూడా ట్రస్టీగా అయి చేయాలి. నాది కాదు, నీది. నా పని, నేనే చూడాల్సి వస్తుంది... నా బాధ్యత... ఇలా ఎప్పుడైనా అంటారా? ఏం చేయాలి, నా బాధ్యత కదా, నిర్వర్తించాల్సి వస్తుంది కదా, చేయాల్సి వస్తుంది కదా, ఇలా ఎప్పుడైనా అంటారా? లేక నీది నీకే అర్పితము, నాది ఎక్కడి నుండి వచ్చింది? కనుక ఈ మాటలు కూడా మాట్లాడలేరు? నేనే చూడాల్సి వస్తుంది, నేనే చేయాల్సి వస్తుంది, నాదే, నిర్వర్తించాల్సే వస్తుంది... నాది అన్నారు అంటే భారం ఏర్పడినట్లు. తండ్రిది, తండ్రి చేస్తారు, నేను నిమిత్తముగా ఉన్నాను, అంటే తేలికగా అవుతారు. భారాన్ని ఎత్తే అలవాటు అయితే లేదు కదా? 63 జన్మలు భారాన్ని ఎత్తారు కదా. చాలా మందికి భారాన్ని ఎత్తే అలవాటు ఉంటుంది. భారాన్ని ఎత్తకుండా ఉండలేరు. అలవాటుకు బానిస అయిపోతారు. నాది అని అంగీకరించడము అంటే భారము ఎత్తడము. అర్థమయిందా. సమయానికి పనికొస్తుంది అని కొద్దిగా పక్కకు పెట్టి ఉంచారా? పాండవులు కొద్దిగా బ్యాంక్ బ్యాలెన్సును, కొద్దిగా జేబు ఖర్చును ఉంచుకున్నారా? కొద్దిగా కూడా నాది అనేది ఉండకూడదు. నాది అనగా మైలుపడడము. ఎక్కడ నాది అనేది ఉంటుందో, అక్కడ వికారాల మాలిన్యము తప్పకుండా ఉంటుంది. నీది అంటే ఏం జరుగుతుంది? ఈదుతూ ఉంటారు, మునిగిపోరు. ఈదడములో ఆనందం కలుగుతుంది కదా! కనుక తపస్య అనగా నీది, నాది కాదు. అచ్ఛా, ఇది ఈస్టర్న్ జోన్. సూర్యుడు ఉదయిస్తాడు కదా. కనుక ఈస్టర్న్ జోన్ వారి వద్ద తండ్రి తోడుకు స్మృతిచిహ్నమైన సూర్యుడు సదా ప్రకాశిస్తూనే ఉంటాడు కదా. అందరూ తపస్యలో సఫలతను ప్రాప్తి చేసుకుంటున్నారు కదా. తపస్యలో సంతుష్టముగా ఉన్నారా? తమ చార్టుతో సంతుష్టముగా ఉన్నారా? లేక ఇప్పుడింకా అవ్వాలా? ఇది కూడా ఒక లిఫ్ట్ అనే గిఫ్ట్. గిఫ్ట్ ఏదైతే ఉంటుందో, అందులో ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు, కొనే శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకటేమో, తమ పురుషార్థము మరియు రెండవది, విశేషముగా తండ్రి ద్వారా గిఫ్ట్ లభించడము. కనుక తపస్యా సంవత్సరము ఒక గిఫ్ట్, సహజమైన అనుభూతి యొక్క గిఫ్ట్. ఎవరు ఎంత చేయాలనుకుంటే అంత చేయవచ్చు. శ్రమ తక్కువ, నిమిత్త మాత్రంగా మరియు ప్రాప్తిని ఎక్కువ పొందవచ్చు. ఇప్పటికీ సమయం ఉంది, సంవత్సరం పూర్తి కాలేదు. ఇప్పటికీ ఏది తీసుకోవాలనుకుంటే అది తీసుకోవచ్చు, అందుకే సఫలత యొక్క సూర్యుడిని తూర్పులో మేలుకొల్పండి. సదా అందరూ సంతోషంగా ఉన్నారా లేక అప్పుడప్పుడు ఏవైనా విషయాలు జరిగినప్పుడు బాధపడతారా? సంతోషం పెరుగుతూ ఉంటుందా, తక్కువ అయితే అవ్వదు కదా? మాయాజీతులుగా ఉన్నారా లేక మాయ రంగును చూపిస్తుందా? అది ఎంతగా రంగును చూపించినా సరే, నేను మాయాపతిని. మాయ రచన, నేను మాస్టర్ రచయితను. కనుక ఆటను చూడండి, కానీ ఆటలో ఓడిపోకండి. మాయ ఎంతగా అనేక రకాల ఆటలను చూపించినా, చూసే మీరు మనోరంజనంగా భావిస్తూ చూడండి. చూస్తూ-చూస్తూ ఓడిపోకండి. సాక్షీగా అయి, అతీతంగా అయి చూస్తూ ఉండండి. అందరూ తపస్యలో ముందుకు వెళ్ళేవారే కదా, గిఫ్ట్ తీసుకునేవారే కదా? సేవ బాగా జరుగుతుందా? స్వయం యొక్క పురుషార్థంలో ఎగురుతున్నారు మరియు సేవలో కూడా ఎగురుతున్నారు. అందరూ ఫస్ట్ లో ఉన్నారు. సదా ఫస్ట్ లో ఉండండి, సెకెండులోకి రాకండి. ఫస్ట్ లో ఉంటే సూర్యవంశీయులుగా అవుతారు, సెకెండు అయితే చంద్రవంశీయులు. ఫస్ట్ నంబరు వారు మాయాజీతులుగా ఉంటారు. ఎటువంటి సమస్యా ఉండదు, ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు, ఎటువంటి ప్రశ్న ఉండదు, ఎటువంటి బలహీనత ఉండదు. ఫస్ట్ నంబరు అనగా ఫాస్ట్ పురుషార్థము. ఎవరిదైతే ఫాస్ట్ పురుషార్థము ఉంటుందో, వారు వెనుక ఉండలేరు. సదా సాక్షీ మరియు సదా తండ్రి యొక్క సహచరులు - ఇదే గుర్తుంచుకోండి.

Comments