03-11-1992 అవ్యక్త మురళి

  03-11-1992         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘ఆత్మిక రాయల్టీతో సంపన్నంగా ఉండే ఆత్మల గుర్తులు’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తమ ఆత్మిక రాయల్ పరివారాన్ని చూస్తున్నారు. మొత్తం కల్పంలో అందరికన్నా రాయల్, ఆత్మలైన మీరే. ఆ మాటకొస్తే హద్దులోని రాజ్యాధికారి రాయల్ పరివారానికి చాలా మహిమ ఉంది. కానీ ఆత్మిక రాయల్ పరివారమని కేవలం మీకు మాత్రమే మహిమ ఉంది. రాయల్ పరివారానికి చెందిన ఆత్మలైన మీరు ఆది కాలంలో కూడా, మరియు అనాది కాలంలో కూడా, మరియు వర్తమాన సంగమయుగంలో కూడా ఆత్మిక రాయల్టీ కలిగినవారు. అనాది కాలంలో మధురమైన ఇంట్లో కూడా విశేష ఆత్మలైన మీ ఆత్మికత యొక్క ప్రకాశము, మెరుపు సర్వాత్మల కన్నా శ్రేష్ఠమైనది. ఆత్మలన్నీ మెరిసే జ్యోతి స్వరూపాలే, కానీ మీ ఆత్మిక రాయల్టీ యొక్క మెరుపు అలౌకికమైనది. ఏ విధంగానైతే సాకార ప్రపంచంలో ఆకాశం మధ్యలో నక్షత్రాలన్నీ మెరుస్తూ కనిపిస్తాయి కానీ విశేషంగా మెరిసే నక్షత్రాలు స్వతహాగానే తమ వైపుకు ఆకర్షిస్తాయి, అన్నీ ప్రకాశవంతంగా ఉన్నా కానీ వాటి ప్రకాశం విశేషంగా మెరుస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే అనాది కాలంలో పరంధామంలో కూడా ఆత్మిక నక్షత్రాలైన మీ ప్రకాశము అనగా ఆత్మిక రాయల్టీ యొక్క మెరుపు విశేషంగా అనుభవమవుతుంది. అదే విధంగా ఆది కాలంలో సత్యయుగంలో అనగా స్వర్గంలో ఆత్మలైన మీరు విశ్వ మహారాజుల యొక్క రాయల్ పరివారానికి అధికారులుగా అవుతారు. ప్రతి రాజుకు రాయల్ పరివారం ఉంటుంది.

కానీ ఆత్మలైన మీ రాయల్ పరివారం యొక్క రాయల్టీ మరియు దేవాత్మల రాయల్టీ మొత్తం కల్పంలో ఏ ఇతర రాయల్ పరివారానికి ఉండదు. ఇంత శ్రేష్ఠమైన రాయల్టీని చైతన్య స్వరూపంలో ప్రాప్తి చేసుకున్నారు కనుక మీ జడ చిత్రాలకు కూడా ఎంత రాయల్టీతో పూజ జరుగుతుంది. మొత్తం కల్పంలో రాయల్టీ యొక్క విధి ప్రమాణంగా ఏ ఇతర ధర్మపితలకు, ధర్మాత్ములకు లేక మహాత్ములకు ఇటువంటి పూజ జరగదు. కనుక ఆలోచించండి - జడ చిత్రాలకే అంత రాయల్టీతో పూజ జరుగుతున్నపుడు చైతన్యంలో ఎంత రాయల్ పరివారానికి చెందినవారిగా అవుతారు! మరి ఇంత రాయల్ గా ఉన్నారా? లేక అలా అవుతూ ఉన్నారా? ఇప్పుడు సంగమంలో కూడా ఆత్మిక రాయల్టీ కలవారిగా అనగా ఫరిశ్తా స్వరూపంగా అవుతారు, ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక రాయల్ పరివారం వారిగా అవుతారు. కనుక అనాది కాలం, ఆది కాలం మరియు సంగమయుగ కాలం - మూడు కాలాలలో నంబరువన్ రాయల్ గా అవుతారు. మేము మూడు కాలాలలోనూ ఆత్మిక రాయల్టీ కల ఆత్మలము అన్న నషా ఉంటుందా?

ఈ ఆత్మిక రాయల్టీ యొక్క పునాది ఏమిటి? సంపూర్ణ పవిత్రత. సంపూర్ణ పవిత్రతయే రాయల్టీ. కనుక స్వయాన్ని ప్రశ్నించుకోండి - ఆత్మిక రాయల్టీ యొక్క మెరుపు నా రూపం ద్వారా అందరికీ అనుభవమవుతుందా? ఆత్మిక రాయల్టీ యొక్క నషా ప్రతి చరిత్ర ద్వారా అనుభవమవుతుందా? లౌకిక ప్రపంచంలో కూడా వారెవరో తెలియకపోయినా సరే, అల్పకాలిక రాయల్టీ అనేది వారి ముఖము ద్వారా, నడవడిక ద్వారా అనుభవమవుతుంది. అలాగే ఆత్మిక రాయల్టీ కూడా గుప్తంగా ఉండదు, అది కూడా కనిపిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు జ్ఞానమనే దర్పణంలో స్వయాన్ని చూసుకోండి - నా ముఖంలో, నడవడికలో రాయల్టీ కనిపిస్తుందా లేక సాధారణ ముఖము, సాధారణ నడవడిక కనిపిస్తుందా? ఎలాగైతే సత్యమైన వజ్రము తన మెరుపు వలన ఎక్కడా దాగి ఉండలేదో, అలా ఆత్మిక మెరుపు కలవారు, ఆత్మిక రాయల్టీ కలవారు దాగి ఉండలేరు.

చాలా మంది పిల్లలు స్వయాన్ని సంతోషపర్చుకునేందుకు ఎలా ఆలోచిస్తారు మరియు మాట్లాడుతారంటే - ‘‘మేము గుప్త ఆత్మలము, అందుకే మమ్మల్ని ఎవరూ గుర్తించరు, సమయం వచ్చినప్పుడు దానంతట అదే తెలుస్తుంది.’’ గుప్త పురుషార్థము చాలా మంచి విషయమే కానీ గుప్త పురుషార్థుల మెరుపు మరియు నషా లేక ఆత్మిక రాయల్టీ యొక్క ప్రకాశం ఇతరులకు తప్పకుండా అనుభవం చేయిస్తుంది. తమను తాము ఎంత గుప్తంగా ఉంచుకున్నా కానీ, వారి మాటలు, వారి సంబంధ-సంపర్కాలు, ఆత్మిక వ్యవహారం యొక్క ప్రభావం వారిని ప్రత్యక్షం చేస్తుంది. దీనినే ప్రపంచంలోని వారు సాధారణ భాషలో మాటలు మరియు నడవడిక అని అంటారు. కనుక స్వయము స్వయాన్ని ప్రత్యక్షం చేసుకోకుండా, గుప్తంగా ఉంచుకోవడము - ఇది నిర్మానత యొక్క విశేషత. కానీ ఇతరులు వారి మాటలు, నడవడిక ద్వారా తప్పకుండా అనుభవం చేస్తారు. వీరు గుప్త పురుషార్థులు అని ఇతరులు చెప్పాలి. ఒకవేళ నేను గుప్త పురుషార్థిని అని మీరు స్వయం గురించి చెప్పుకుంటే అది గుప్తంగా ఉంచినట్లా లేక ప్రత్యక్షం చేసినట్లా? గుప్తము అని అంటున్నారు కానీ ‘నేను గుప్త పురుషార్థిని’ అని మాటలలో చెప్తున్నారు! ఇది గుప్తము అయినట్లా? చాలా మంది ఉత్తరాలలో కూడా - గుప్త పురుషార్థులైన మా గురించి నిమిత్తంగా ఉన్న దాదీలకు తెలియదు అని రాస్తారు. అంతేకాక ఇకముందు మేము ఏం చేస్తామో, ఏం జరుగుతుందో చూడండి అని కూడా రాస్తారు, మరి ఇది గుప్తంగా ఉన్నట్లా లేక ప్రత్యక్షం చేసినట్లా? గుప్త పురుషార్థులు స్వయాన్ని గుప్తంగా ఉంచుకోవడం చాలా మంచి విషయము. కానీ మీరు వర్ణన చేయకండి, ఇతరులు మీ గురించి చెప్పాలి. ఎవరైతే స్వయం గురించి స్వయమే చెప్పుకుంటారో వారినేమంటారు? (అన్నీ తెలుసునని భావించేవారు) మరి అన్నీ తెలుసని భావించేవారిగా అవ్వడము చాలా సులభం కదా.

కనుక ఏం విన్నారు? ఆత్మిక రాయల్టీ. రాయల్ ఆత్మలు ఒకటేమో సదా నిండుగా, సంపన్నంగా ఉంటారు మరియు సంపన్నతకు గుర్తు - వారు సదా తృప్త ఆత్మలుగా ఉంటారు. తృప్త ఆత్మ ప్రతి పరిస్థితిలో, ప్రతి ఆత్మ యొక్క సంబంధ-సంపర్కంలోకి వస్తూ, అన్నీ తెలిసి కూడా సంతుష్టంగా ఉంటారు. ఎవరు ఎంత అసంతుష్టంగా చేసే పరిస్థితులను వారి ఎదురుగా తీసుకొచ్చినా కానీ సంపన్న, తృప్త ఆత్మ అసంతుష్టంగా చేసేవారికి కూడా సంతుష్టతా గుణాన్ని సహయోగం రూపంలో ఇస్తారు. అటువంటి ఆత్మ పట్ల కూడా దయా హృదయులుగా అయి శుభ భావన మరియు శుభ కామనల ద్వారా వారిని కూడా పరివర్తన చేసే ప్రయత్నం చేస్తారు. ఆత్మిక రాయల్ ఆత్మల యొక్క శ్రేష్ఠ కర్మ ఇదే. ఏ విధంగానైతే స్థూలంగా కూడా రాయల్ ఆత్మలు ఎప్పుడూ చిన్న-చిన్న విషయాలలో, చిన్న-చిన్న వస్తువులలో తమ బుద్ధిని లేక సమయాన్ని వెచ్చించరు, చూస్తూ కూడా చూడరు, వింటూ కూడా వినరు, అదే విధంగా ఆత్మిక రాయల్ ఆత్మలు ఇతర ఆత్మల చిన్న-చిన్న విషయాలలో ఏవైతే రాయల్ గా లేవో, వాటిలో తమ బుద్ధిని లేక సమయాన్ని వెచ్చించరు. రాయల్టీ అనగా ఎలాంటి తేలికపాటి విషయంపైకి దృష్టి వెళ్ళదు అని ప్రపంచంలోని వారు కూడా అంటారు. ఆత్మిక రాయల్ ఆత్మల నోటి ద్వారా ఎప్పుడూ వ్యర్థమైన లేక సాధారణమైన మాటలు వెలువడవు, ప్రతి మాట యుక్తియుక్తంగా ఉంటుంది. యుక్తియుక్తము అనగా వ్యర్థ భావము నుండి అతీతంగా అవ్యక్త భావము, అవ్యక్త భావన. దీనినే రాయల్టీ అని అంటారు.

ఈ సమయంలోని రాయల్టీ భవిష్యత్తులో రాయల్ పరివారంలోకి వచ్చేందుకు అధికారిగా చేస్తుంది. కనుక వృత్తి రాయల్ గా ఉందా అని చెక్ చేసుకోండి. వృత్తి రాయల్ గా ఉండడం అనగా సదా శుభ భావన, శుభ కామనల వృత్తితో ప్రతి ఆత్మతో వ్యవహారంలోకి రావాలి. రాయల్ దృష్టి అనగా సదా ఫరిశ్తా రూపంలో ఉంటూ ఇతరులను కూడా ఫరిశ్తా రూపంలో చూడాలి. రాయల్ కృతి అనగా కర్మలో సదా సుఖం ఇవ్వాలి, సుఖం తీసుకోవాలి - ఈ శ్రేష్ఠ కర్మ ప్రమాణంగా సంపర్కంలోకి రావాలి. ఈ విధంగా రాయల్ గా తయారయ్యారా? లేక తయారవ్వాలా? బ్రహ్మాబాబా యొక్క మాట, ముఖము మరియు నడవడికలోని రాయల్టీని చూసారు. అలా బ్రహ్మాబాబాను ఫాలో చేయండి. సాకారుడిని ఫాలో చేయడం సులభమే కదా! బ్రహ్మాను ఫాలో చేసారంటే శివబాబాను ఫాలో చేసినట్లే. ఒక్కరినైతే ఫాలో చేయగలరు కదా. తండ్రి సమానంగా అయ్యే పాయింట్లనైతే ప్రతిరోజు వింటారు! వినడం అనగా ఫాలో చేయడము. కాపీ చేయడం సులభమే కదా లేక కాపీ చేయడం కూడా రాదా?

బాప్ దాదా ఈ రోజు చిరునవ్వు నవ్వుతున్నారు - మధుబన్ కు వచ్చినప్పుడు విశేషంగా గురువారం రోజున ఏం చేస్తారు? ఒకటేమో భోగ్ పెడతారు. ఇంకా కేవలం మధుబన్ లో మాత్రమే చేసేదేమిటి? జీవిస్తూ మరణించే భోగ్ పెట్టిస్తారు. మీరందరూ జీవిస్తూ మరణించే భోగ్ పెట్టించారా? బాప్ దాదా చిరునవ్వు నవ్వుతున్నారు - జీవిస్తూ మరణించడం అన్నది జరుపుకోవడము సులభమే, స్టేజిపై కూర్చున్నారు, తిలకం దిద్దుకున్నారు, మరణించారు! కానీ జీవిస్తూ మరణించడం అనగా పాత సంస్కారాల నుండి మరణించడము. పాత సంస్కారాలు, పాత ప్రపంచం యొక్క ఆకర్షణ నుండి మరణించడము, జీవిస్తూ మరణించడం అంటే ఇదే. భోగ్ పెట్టించారు. భండారీలో జమ చేసారు మరియు జీవిస్తూ మరణించడం అయిపోయింది - ఇలా చేయడం చాలా సులభము. కానీ మరణించారా? బాప్ దాదా ఏమి ఆలోచిస్తున్నారంటే - పాత ప్రపంచము, పాత సంస్కారాలు - వీటి నుండి సదా కోసం సంకల్పం మరియు స్వప్నంలో కూడా మరణించడాన్ని జరుపుకోవాలి, ఈ విధంగా జీవిస్తూ మరణించడాన్ని ఎవరు మరియు ఎప్పుడు జరుపుకుంటారు? ఒకవేళ స్టేజిపై కూర్చోబెడితే అందరికందరూ కూర్చుండిపోతారు. స్టేజిపై కూర్చోవడము అనేదైతే సాధారణమైన విషయము. కానీ బుద్ధిని కూర్చోబెట్టాలి, దీనిని యథార్థంగా జీవిస్తూ మరణించడాన్ని జరుపుకోవడము అని అంటారు. మరణించారంటే, మరణించడము అనగా పరివర్తన అవ్వడము. మరి ఈ విధంగా జీవిస్తూ మరణించడం కోసం ఎంతమంది తయారుగా ఉన్నారు? లేక సెంటరుకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, కావాలనుకోలేదు కానీ జరిగిపోయింది అని అంటారా? ఇక్కడైతే జీవిస్తూ మరణించడాన్ని జరుపుకుని వెళ్తారు, మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా విషయం ఎదురుగా వస్తే మళ్ళీ జీవిస్తారు. ఇలా చేయకండి.

స్మృతిచిహ్నంలో కూడా ఎలా చూపిస్తారంటే, రావణుడి ఒక తలను అంతం చేస్తే మరొకటి వచ్చేది. ఇక్కడ కూడా ఒక విషయం పూర్తయితే మరొకటి ఉత్పన్నమవుతుంది, అప్పుడు ఏమనుకుంటారంటే - మేమైతే రావణుడిని అంతం చేసేసాము, మళ్ళీ ఇది ఎక్కడి నుండి వచ్చింది? కానీ ముఖ్యమైన పునాదిని సమాప్తం చేయని కారణంగా ఒక రూపం మారి మరొక రూపంలో వస్తుంది. పునాదినే సమాప్తం చేస్తే మాయ రూపాన్ని మార్చుకుని దాడి చేయదు, సదా కోసం వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోతుంది. కనుక ఎలా తయారవ్వాలో అర్థమయిందా? ఆత్మిక రాయల్టీ కలవారిగా అవ్వాలి. ప్రతి కర్మ ఆత్మిక రాయల్ పరివారం అనుసారంగా ఉందా అని సదా చెక్ చేసుకోండి. ఎప్పుడైతే 99 శాతం మాటలు, కర్మలు మరియు సంకల్పాలు రాయల్టీ కలవిగా ఉంటాయో, అప్పుడే భవిష్యత్తులో కూడా రాయల్ పరివారంలో వస్తారు. మేమైతే తప్పకుండా వస్తాము అని అనుకోకండి. సరే, సంపన్నంగా అవ్వకపోయినా ఒక శాతం ఫ్రీగా ఇస్తాను. కానీ 99 శాతం రాయల్టీ కల సంస్కారాలు, మాటలు మరియు సంకల్పాలు న్యాచురల్ గా ఉండాలి. పదే-పదే యుద్ధం చేయాల్సిన అవసరం రాకూడదు, సహజ సంస్కారంగా అయిపోవాలి. అచ్ఛా!

నలువైపులా ఉన్న ఆత్మిక రాయల్టీ కల రాయల్ ఆత్మలకు, సదా పవిత్రత ద్వారా రాయల్టీని అనుభవం చేయించే ఆత్మలకు, సదా ఫరిశ్తా స్వరూప సంస్కారాలను ప్రాక్టికల్ లోకి తీసుకొచ్చే ఆత్మలకు, సదా బ్రహ్మాబాబాను ఫాలో చేసే ఆత్మలకు, సదా శ్రేష్ఠ బ్రాహ్మణ ప్రపంచంలో బ్రాహ్మణ సంస్కారాలను అనుభవం చేసే ఆత్మిక రాయల్ పరివారానికి బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత మిలనము

సేవలో బిజీగా ఉన్నట్లయితే సహజంగా మాయాజీతులుగా అవుతారు

సదా మీ శక్తిశాలి వృత్తితో వాయుమండలాన్ని పరివర్తన చేసే విశ్వ-పరివర్తక ఆత్మలు కదా. ఈ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషమైన కర్తవ్యమేమిటి? తమ వృత్తి ద్వారా, వాణి ద్వారా మరియు కర్మల ద్వారా విశ్వ-పరివర్తన చేయడము. మరి అందరూ ఇలాంటి సేవ చేస్తున్నారా? లేక సమయం లభించడం లేదా? వాణి సేవ కోసం సమయం లేకపోయినా కానీ, వృత్తి ద్వారా, మనసా సేవ ద్వారా పరివర్తన చేసేందుకు సమయమైతే ఉంది కదా. సేవాధారి ఆత్మలు సేవ లేకుండా ఉండలేరు. బ్రాహ్మణ జన్మ ఉన్నదే సేవ కోసము. మరియు ఎంతగా సేవలో బిజీ ఉంటారో, అంత సహజంగా మాయాజీతులుగా అవుతారు. కనుక సేవ యొక్క ఫలం కూడా లభిస్తుంది మరియు సహజంగా మాయాజీతులుగా కూడా అవుతారు, కావున డబుల్ లాభం ఉంది కదా. ఏ మాత్రం బుద్ధికి తీరిక లభించినా సేవలో నిమగ్నమవ్వండి. ఆ మాటకొస్తే పంజాబ్-హర్యానాలో సేవా-భావము ఎక్కువగా ఉంది. గురుద్వారాలకు వెళ్ళి సేవ చేస్తారు కదా. అది స్థూలమైన సేవ మరియు ఇది ఆత్మిక సేవ. సేవ చేయకుండా సమయాన్ని పోగొట్టుకోకూడదు. నిరంతర యోగులుగా, నిరంతర సేవాధారులుగా అవ్వండి - సంకల్పాల ద్వారానైనా చేయండి, వాణి ద్వారానైనా చేయండి, కర్మల ద్వారానైనా చేయండి. మీ సంపర్కం ద్వారా కూడా సేవ చేయవచ్చు. సరే, మనసా సేవ చేయడం రాకపోతే మీ సంపర్కం ద్వారా, మీ నడవడిక ద్వారా కూడా సేవ చేయవచ్చు. ఇదైతే సహజమే కదా. కావున, సదా సేవాధారులుగా ఉన్నామా లేక అప్పుడప్పుడు సేవాధారులుగా ఉన్నామా అని చెక్ చేసుకోండి. ఒకవేళ అప్పుడప్పుడు సేవాధారులుగా ఉంటే రాజ్య భాగ్యము కూడా అప్పుడప్పుడే లభిస్తుంది. ఈ సమయంలోని సేవ భవిష్య ప్రాప్తికి ఆధారము. సేవ చేయాలనే కోరిక ఉంది కానీ సమయం లేదు అని ఎప్పుడూ ఎవ్వరూ ఈ సాకులు చెప్పలేరు. కొందరు శరీరం నడవదు, కాళ్ళు పని చేయవు, ఏం చేయాలి? అని అంటారు. కొందరు నడుము పని చేయడం లేదని అంటారు, కొందరు కాళ్ళు పని చేయడం లేదని అంటారు. కానీ బుద్ధి అయితే నడుస్తుంది కదా! కావున బుద్ధి ద్వారా సేవ చేయండి. విశ్రాంతిగా మంచముపై కూర్చుని సేవ చేయండి. ఒకవేళ నడుము బాగోలేకపోతే చారబడండి కానీ సేవలో బిజీగా ఉండండి.

బిజీగా ఉండడమే సహజ పురుషార్థము. శ్రమ చేయాల్సిన అవసరముండదు. పదే-పదే మాయ వస్తూ ఉంటే, మీరు దానిని పారద్రోలుతూ ఉంటే శ్రమ అవుతుంది, యుద్ధం జరుగుతుంది. బిజీగా ఉండేవారు యుద్ధం నుండి విముక్తులవుతారు. బిజీగా ఉంటే మాయకు వచ్చేందుకు ధైర్యముండదు మరియు మీరు ఎంతగా స్వయాన్ని బిజీగా ఉంచుకుంటారో అంతగానే మీ వృత్తి ద్వారా వాయుమండలం పరివర్తనవుతూ ఉంటుంది. ఏం చేయాలి, వాయుమండలం చెడుగా ఉంది అని బ్రాహ్మణాత్మలెవ్వరూ ఆలోచించకూడదు. చెడుగా ఉంది కావుననే పరివర్తన చేస్తారు కదా. చెడుగానే లేకపోతే ఏం చేస్తారు? మంచిగా ఉన్నదానిని ఏమైనా మారుస్తారా? చెడును మంచిగా చేయడమే విశ్వపరివర్తకుల పని. కనుక చెడుగానే ఉంటుంది. చెడును మంచిగా చేసేవారు మీరే! విశ్వ పరివర్తన యొక్క కార్యాన్ని చేసారు కనుకనే ఇప్పటివరకు మీకు మహిమ ఉంది. శక్తుల గాయనంలో మీకు ఎంత మహిమ చేస్తారు! మీ మహిమ వింటూ సంతోషిస్తారు కదా! అచ్ఛా.

Comments