01-04-1992 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘ఎగిరే కళను అనుభవం చేయడానికి రెండు విషయాల బ్యాలెన్స్ - జ్ఞానయుక్త భావన మరియు స్నేహయుక్త యోగము’’
ఈ రోజు బాప్ దాదా తమ స్నేహీ భావనా-మూర్త ఆత్మలను మరియు జ్ఞాన-స్వరూప యోగీ ఆత్మలను చూస్తున్నారు. రెండు రకాల ఆత్మలు తండ్రికి ప్రియమైనవారు మరియు ఇరువురూ తండ్రి పట్ల ఉన్న తమ స్నేహము మరియు భావన అనుసారంగా ప్రత్యక్ష ఫలం యొక్క వారసత్వానికి అధికారులు. జ్ఞాన స్వరూప యోగీ ఆత్మలు తమ శక్తి అనుసారంగా తండ్రికి సమీపంగా, సమానంగా ఉంటూ సర్వ శక్తుల అనుభూతి యొక్క వారసత్వాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు. ఇరువురూ ప్రాప్తి స్వరూపులే. కానీ ఇరువురి ప్రాప్తులలో తేడా ఉంది. స్నేహీ మరియు భావనా మూర్త పిల్లలు సదా భావన కారణంగా స్మృతిలో ఉంటారు. వారు తండ్రి ప్రేమను అనుభవం చేస్తారు, వారి భావనకు ఫల స్వరూపంగా శక్తిని కూడా అనుభవం చేస్తారు. కానీ సదా మరియు సర్వ శక్తులను అనుభవం చేయరు. జ్ఞాన స్వరూప యోగీ ఆత్మలు సదా సర్వ శక్తుల అనుభూతి ద్వారా సహజంగా విజయులుగా అయ్యే విశేష అనుభవం చేస్తారు, సమానతను అనుభవం చేస్తారు. కావున రెండు రకాల పిల్లలు వృద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారు. సదా చలించని, స్థిరమైన స్థితి యొక్క అనుభవాన్ని యోగీ ఆత్మలే చేస్తారు. స్నేహీ మరియు భావనా స్వరూప ఆత్మలు భావనతో, స్నేహంతో ముందుకు వెళ్తున్నారు కానీ సదా విజయులుగా లేరు. స్నేహీ ఆత్మల మనసులో, నోటిలో సదా బాబా-బాబా అని ఉంటుంది, దీని కారణంగా ఎప్పటికప్పుడు సహయోగం ప్రాప్తిస్తూ ఉంటుంది. భావన యొక్క ఫలము సమయమనుసారంగా తండ్రి ద్వారా ప్రాప్తించనే ప్రాప్తిస్తుంది. కానీ సమానంగా అవ్వడంలో జ్ఞానీ, యోగీ ఆత్మలు సమీపంగా ఉన్నారు, అందుకే భావనా మరియు జ్ఞానము యొక్క స్వరూపులుగా అయ్యే లక్ష్యము పెట్టుకోండి. భావన ఎంతగా ఉంటుందో, అంతగానే జ్ఞాన స్వరూపులుగా కూడా ఉండాలి. కేవలం భావన లేక కేవలం జ్ఞానమే ఉంటే, అది కూడా సంపూర్ణత కాదు. జ్ఞానయుక్త భావన, స్నేహ సంపన్న యోగీ ఆత్మ - ఈ రెండింటి బ్యాలెన్స్ సహజంగా ఎగిరే కళను అనుభవం చేయిస్తుంది. తండ్రి సమానము అనగా ఈ రెండింటిలో సమానత ఉండాలి.
వర్తమాన సమయంలో భావనా స్వరూప ఆత్మలు సేవలోకి ఎక్కువగా వస్తారు. ఈ ఆత్మలు కూడా స్థాపనా కార్యంలో అవసరము - ఆది సనాతన దేవతా ధర్మం యొక్క స్థాపన కావచ్చు, రాజ్యం యొక్క స్థాపన కావచ్చు, ఈ రెండింటిలోనూ అవసరము. కానీ ఇప్పుడు సమయమనుసారంగా జ్ఞానీ, యోగీ ఆత్మల యొక్క అవసరము ఇంకా ఎక్కువగా ఉంది, ఎందుకంటే రాబోయే సమయంలో వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం కారణంగా భావనా స్వరూప ఆత్మలు ఇంకా సహజంగా వచ్చేదే ఉంది. అందుకే సేవా లక్ష్యంలో జ్ఞానీ, యోగీ ఆత్మల వైపు అటెన్షన్ ఎక్కువగా ఉండాలి. ఇటువంటి ఆత్మల వృద్ధి అవసరము. అర్థమయిందా. సంఖ్య చాలా పెరుగుతుంది అని భావించకండి. కానీ ఇటువంటి తండ్రి సమానమైన సర్వ శక్తుల అనుభూతి కల ఆత్మలను తయారుచేయండి. రాజధాని యొక్క వృద్ధి అయితే బాగా జరుగుతుంది. కానీ విశ్వ పరివర్తనలో ఈ రెండు స్వరూపాల బ్యాలెన్స్ కల ఆత్మలే నిమిత్తులుగా అవుతారు ఎందుకంటే విశ్వ పరివర్తన కోసం చాలా సూక్ష్మ శక్తిశాలి స్థితి కల ఆత్మలు కావాలి. వీరు తమ వృత్తి ద్వారా, శ్రేష్ఠ సంకల్పాల ద్వారా అనేక ఆత్మలను పరివర్తన చేయగలగాలి. స్నేహీ లేక భావన కల ఆత్మలు తమ వరకు చాలా బాగా నడుచుకుంటారు కానీ ఆ స్నేహము మరియు భావన విశ్వం పట్ల ఉండదు. అది కేవలం స్వయం పట్ల లేక కొంతమంది సమీప ఆత్మల పట్ల మాత్రమే ఉంటుంది. అనంతమైన సేవను లేక విశ్వ సేవను బ్యాలెన్స్ కల ఆత్మలే చేయగలరు. అనంతమైన సేవ తమ శక్తిశాలి మనసా ద్వారా, తమ శుభభావన మరియు శుభకామనల ద్వారా జరుగుతుంది. కేవలం స్వయం పట్ల మాత్రమే భావన ఉండడం కాదు, కానీ ఇతరులను కూడా శుభభావన మరియు శుభకామనల ద్వారా పరివర్తన చేయగలరు. కావున ఇటువంటి భావన మరియు జ్ఞానము, స్నేహము మరియు యోగశక్తి ఉండాలి. ఇటువంటి ఆత్మలుగా అయ్యారా లేక కేవలం స్నేహీ మరియు భావన కలిగిన ఆత్మలను చూసి సంతోషిస్తున్నారా? కళ్యాణకారులుగా అయ్యారా లేక అనంతమైన విశ్వ కళ్యాణకారులుగా అయ్యారా, ఇది చెక్ చేసుకోండి. రిజల్టు ఏమిటి? తండ్రికి ఇరువురూ ప్రియమైనవారే అని బాప్ దాదా వినిపించారు. రెండు రకాల ఆత్మలను చూసి బాప్ దాదా సంతోషిస్తారు. ఎంతైనా స్నేహీ ఆత్మలుగా అయి తండ్రిని తమవారిగా చేసుకున్నారు కదా. తండ్రిని గుర్తించారు, వారసత్వానికి అధికారులుగా అయ్యారు, కోట్లలో కొందరి యొక్క లైనులోకి వచ్చారు, తమ ఆశ్రయ స్థానానికి చేరుకున్నారు, తనువు ద్వారా భ్రమించడం మరియు మనసు ద్వారా భ్రమించడం నుండి రక్షించబడ్డారు, అందుకే సంతోషిస్తారు కదా. పిల్లలూ సంతోషంగా ఉన్నారు, తండ్రి కూడా సంతోషంగా ఉన్నారు. అదృష్టవంతులుగా అయితే అయ్యారు కదా? డైరెక్టుగా తండ్రికి చెందినవారిగా అయ్యేవారిని చూడండి, వారు ప్రపంచం లెక్కలో ఎంత సాధారణ ఆత్మలు! విశ్వ శిక్షకుని విద్యార్థులను చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నారు! చదివించేవారు ఉన్నతోన్నతమైనవారు మరియు చదువుకునేవారు సాధారణమైనవారు. కానీ ఈ సాధారణమైనవారే సాధారణ స్వరూపంలో వచ్చిన తండ్రిని తెలుసుకుంటారు. బాప్ దాదా కూడా వి.ఐ.పి. గా అయితే రారు కదా, సాధారణ రూపంలో వస్తారు. ఏ ప్రైమ్ మినిస్టరో లేక రాజు తనువులోనో రారు, అందుకే వీరిని గుర్తించే సాధారణమైనవారే భాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. మీరు అదృష్టవంతులు కదా, ఎంత భాగ్యం లభించింది, పదమాపదమాలు అని అనడం కూడా తక్కువే.
ఇప్పుడు కూడా చూడండి, సంఖ్య అయితే చాలా ఉంది కదా. ఇంతకుముందు, ఇంత పెద్ద హాలు దేనికి పనికొస్తుంది అని ఆలోచించేవారు మరియు ఇప్పుడేమి అనిపిస్తుంది, దీని కన్నా పెద్ద హాలు కావాలి కదా. బ్రాహ్మణులకు ఈ వరదానం ఉంది - ఎంత పెద్దది తయారుచేస్తూ ఉంటారో, అది అంత చిన్నదిగా అవుతూ ఉంటుంది. ఎవరెవరైతే వచ్చారో, వచ్చిన వారందరికీ అభినందనలను తెలుపుతున్నారు, కానీ కేవలం భావన కలవారిగా కాదు, జ్ఞానీలుగా కూడా అవ్వండి. ప్రకృతి విషయంలో కూడా జ్ఞానీలుగా అవ్వండి. జ్ఞానము కేవలం ఆత్మను గురించినది మాత్రమే కాదు. ఆత్మ, పరమ ఆత్మ మరియు ప్రకృతి, ఇందులో డ్రామా కూడా వచ్చేస్తుంది. మూడింటి జ్ఞానము కావాలి. ఎక్కడికి వెళ్తున్నారు మరియు స్వయం పట్ల ఏ అటెన్షన్ ఉండాలి - ఒకవేళ ఈ ప్రకృతి గురించిన జ్ఞానం లేకపోయినా కూడా నాలెడ్జ్ ఫుల్ కారు. స్థానము, వ్యక్తి, స్థితి - ఈ మూడింటి జ్ఞానము ఉంచుకోండి. వెళ్ళాల్సిందే, తీసుకువెళ్ళాల్సిందే... అని కేవలం భావన కలవారిగా అవ్వకండి. జ్ఞాన స్వరూపులు అనగా దూరదృష్టి కలవారు, త్రికాలదర్శులు, మూడింటి జ్ఞానం ఒకవేళ స్పష్టంగా ఉన్నట్లయితే సఫలత లభిస్తుంది. ఒకవేళ ఎవరైనా తమ పొరపాటు వలన పదే-పదే అనారోగ్యంపాలు అయితే బాప్ దాదా వారిని జ్ఞానీ, యోగీ అని అనరు. జ్ఞానము అనగా అర్థము వివేకము. తమ స్థితిని కూడా అర్థం చేసుకోండి, తమ శరీరాన్ని కూడా అర్థం చేసుకోండి. ఆత్మ యొక్క స్థితి గురించి, శరీరం యొక్క స్థితి గురించి, వాయుమండలం గురించి, ఇలా అన్నింటి జ్ఞానము బుద్ధిలో ఉన్నట్లయితే నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నట్లు, అందుకే కేవలం భావనను చూసి రాజీ అవ్వకండి. వచ్చేవారు, తీసుకువచ్చేవారు, ఇరువురూ నాలెడ్జ్ ఫుల్ గా ఉండాలి. ఏదైతే జరుగుతుందో దానిని మధురమైన డ్రామా అనే అంటారు. అలజడిలోకైతే రారు కదా - చలించకుండా ఉండాలి. కానీ ఇకముందు కోసం అటెన్షన్ ఉండాలి. పిల్లలు ఎంతటి కష్టాన్ని సహించి చేరుకుంటారు అన్నది బాప్ దాదాకు తెలుసు, దాని కోసమైతే అభినందనలను ఇవ్వనే ఇచ్చారు. ఏ ఆత్మకు ఏ వారసత్వము లభించేది ఉందో, అది వారికి తప్పకుండా ప్రాప్తిస్తుంది. వారసత్వం నుండి వంచితులుగా ఎవరూ ఉండలేరు. సాకారంలో సమ్ముఖంలో ఉన్నా సరే లేక తమ స్థానంలో మన్మనాభవగా ఉన్నా సరే, వారసత్వం తప్పకుండా ప్రాప్తిస్తుంది. డబల్ నాలెడ్జ్ ఫుల్ గా అవ్వాలి, సగం నాలెడ్జ్ ఫుల్ గా అవ్వకండి. అచ్ఛా.
నలువైపులా ఉన్న సర్వ అదృష్టవంతులైన ఆత్మలకు, స్నేహము మరియు యోగ శక్తుల సమానతలో సర్వ అనుభవీ ఆత్మలకు, భావన మరియు జ్ఞాన స్వరూప ఆత్మలకు, సదా తండ్రి సమానంగా అయ్యే లక్ష్యాన్ని పూర్తి చేసే ఆత్మలకు, సదా సమీపతను అనుభవం చేసే ఆత్మలకు, ఇటువంటి సదా చలించకుండా-స్థిరంగా ఉండే విశేష ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
గమనిక - ఈ రోజు మధుబన్ కు వచ్చిన పార్టీలో ఒకే గంటలో కర్ణాటక జోన్ కు చెందిన ఇద్దరు వృద్ధ సోదరులు తమ పాత శరీరాన్ని వదిలారు, అందుకే బాప్ దాదా అందరికీ విశేషమైన అటెన్షన్ ఇప్పించారు.
దాదీలతో అవ్యక్త బాప్ దాదా మిలనము
సంగఠన శక్తి సంగఠనను ముందుకు తీసుకువెళ్తూ ఉంది. మంచి ధైర్యంతో ఒకరికొకరు సహయోగాన్ని అందించుకుంటూ వృద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారు. నిమిత్తంగా ఉన్న ఆత్మలైన మీ ధైర్యము, అనేక ఆత్మల ధైర్యాన్ని పెంచుతుంది. ప్రతి పరిస్థితి యొక్క అనుభవీలుగా అయ్యారు. నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు) అని అనిపిస్తుంది కదా. బాప్ దాదా పరదా వెనుక నుండి సకాష్ ఇస్తున్నారు కానీ పాత్రను అభినయించే స్టేజిపై ఆత్మలైన మీరు ఉన్నారు. మంచి పాత్రను అభినయిస్తున్నారు. బాప్ దాదా సదా నిమిత్తంగా ఉన్న మహావీరుల సంగఠనకు, విశేషంగా అమృతవేళ మొట్టమొదటగా ఆ ఆత్మలకే ప్రియస్మృతులను ఇస్తారు, గుడ్ మార్నింగ్ చెప్తారు. దానిని సకాష్ అని అనండి లేక ప్రేమ అని అనండి, అదే మొత్తం రోజంతటికీ ఔషధంగా అవుతుంది. అలానే అనిపిస్తుంది కదా? అందరూ బాగున్నారు. ధైర్యము వలన సఫలత ఉండనే ఉంది.
అవ్యక్త బాప్ దాదాతో డబల్ విదేశీ సోదరీ-సోదరుల మిలనము
ఆస్ట్రేలియా పార్టీతో- ఆస్ట్రేలియా నివాసి పిల్లల విశేషతను బాప్ దాదా చూస్తున్నారు. ఆస్ట్రేలియా నివాసుల విశేషత ఏమిటి, తెలుసా? (మొదటిసారి వచ్చాము, అందుకే తెలియదు). కొత్త స్థానానికి వచ్చారా లేక మీకు తెలుసన్న స్థానానికి వచ్చారా? ఇక్కడికి చేరుకోవడంతో కల్పక్రితం యొక్క స్మృతి ఎంత స్పష్టంగా కలుగుతుందంటే, ఈ జన్మలో ఇప్పుడిప్పుడే చూసాము అన్నట్లుగా అనిపిస్తుంది. ఇదే సమీప ఆత్మలకు గుర్తు. ఈ అనుభవం ద్వారానే స్వయం గురించి తెలుసుకోగలరు - మేము బ్రాహ్మణాత్మలలో కూడా సమీపంగా ఉన్న ఆత్మలమా లేక దూరంగా ఉన్న ఆత్మలమా, ఫస్ట్ నంబరు వారిమా లేక సెకండ్ నంబరు వారిమా. ఇక్కడ ప్రతి ఒక్కరు నేను ఫస్ట్ నంబరులోకి వెళ్తాను అని భావిస్తారు - ఇదే ఈ అలౌకిక సంబంధంలో ఉన్న విశేషత. లౌకికంలోనైతే నంబరువారుగా భావిస్తారు - వీరు పెద్దవారు, వీరు రెండవ నంబరువారు, వీరు మూడవ నంబరువారు అని. కానీ ఇక్కడ లాస్ట్ లోని వారు కూడా, నేను లాస్ట్ సో ఫస్ట్ అని భావిస్తారు. ఇదే మంచి లక్ష్యము. ఫస్ట్ నంబరులోకి రావాల్సిందే. మరి ఫస్ట్ నంబరువారి గుర్తు - సదా తండ్రితో పాటు ఉండడము. ప్రయత్నం చేయడం కాదు, కానీ సదా తోడు యొక్క అనుభవం ఉండాలి. ఎప్పుడైతే ‘నా బాబా’ అన్నది అనుభవమవుతుందో, అప్పుడు ఏదైతే నాది అన్నది ఉంటుందో, అది స్వతహాగానే గుర్తుంటుంది, గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరముండదు. ‘నాది’ అంటే అధికారం ప్రాప్తి అవ్వడము. ‘‘నా బాబా మరియు నేను బాబా వాడిని’’ - ఇవి చాలా కొన్ని పదాలే మరియు ఇది సెకండు యొక్క విషయము. వీరినే సహజయోగీ అని అంటారు. మీ బోర్డుపై కూడా సహజ రాజయోగ కేంద్రము అని రాసి ఉంది కదా. మరి ఇటువంటి సహజయోగాన్నే నేర్చుకున్నారా? మాయ వస్తుందా? తండ్రితో పాటు ఉండేవారి ఎదురుగా మాయ రాలేదు. ఏ విధంగానైతే తమ శరీరము నివసించే స్థానం గురించి తెలుసు మరియు అది తయారై ఉంది కావున ఎప్పుడెప్పుడైతే ఫ్రీ అవుతారో, అప్పుడు సహజంగానే ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. అదే విధంగా - నేను తండ్రి వద్ద ఉండాలి, ఇదే ఆశ్రయ స్థానము అని తెలిసినప్పుడు పని చేస్తూ కూడా అక్కడ ఉండగలరు. బుద్ధి ద్వారా ఈ విధంగా అనుభవమవ్వాలి. ప్రతి ఒక్కరు తమ అదృష్టాన్ని తయారుచేసుకుని, అదృష్టాన్ని తయారుచేసేవారి ఎదురుగా చేరుకున్నారు. బాప్ దాదా ప్రతి ఒక్కరి అదృష్ట సితారను మెరుస్తూ ఉన్నట్లుగా చూస్తున్నారు. ఇది వెరైటీ గ్రూపు. పిల్లలు కూడా ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు, యువత కూడా ఉన్నారు. కానీ ఇప్పుడైతే అందరూ చిన్న పిల్లలుగా అయిపోయారు. ఇప్పుడు కొందరు, మేము 8 నెలల వారము, 12 నెలల వారము అని అంటారు. ఇలా అలౌకిక జన్మ గురించే వర్ణన చేస్తారు కదా! అచ్ఛా!
అందరూ కల్పక్రితం యొక్క సికీలధే ఆత్మలు (చాలా కాలం విడిపోయి తర్వాత కలిసిన ఆత్మలు). సదా తండ్రి పట్ల ఎడతెగని ప్రేమలో నిమగ్నమై ఉంటూ ముందుకు వెళ్తూ ఉండండి. ఈ ఎడతెగని స్మృతియే సర్వ సమస్యలను పరిష్కరించి ఎగిరే పక్షిగా చేసి, ఎగిరే కళలోకి తీసుకువెళ్తుంది. బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారులుగా ఉంటూ సదా ఇదే నషాలో ఉండండి - మేము కల్ప-కల్పము యొక్క అధికారులము. కల్ప-కల్పము మీ అధికారాన్ని తీసుకుంటూ ఉంటారు. అభినందనలు. మీరు సదా అభినందనలను అందుకునేందుకు పాత్రులైన ఆత్మలు. అచ్ఛా.
అమెరికా పార్టీతో - మీరందరూ బాప్ దాదా యొక్క శిరోకిరీటధారులు, శ్రేష్ఠ ఆత్మలు కదా. శ్రేష్ఠ ఆత్మల ప్రతి సంకల్పము, ప్రతి మాట శ్రేష్ఠంగా ఉంటుంది. అప్పుడప్పుడు కాదు, సదా, ఎందుకంటే సదా యొక్క వారసత్వాన్ని పొందుతున్నారు కదా. కావున సదా యొక్క వారసత్వాన్ని పొందేందుకు అధికారులుగా ఉన్నప్పుడు స్థితి కూడా సదాకాలానిదే ఉండాలి. ‘సదా’ అన్న పదాన్ని సదా గుర్తుంచుకోండి. బాప్ దాదా పిల్లలందరికీ ఇదే వరదానాన్ని ఇస్తారు - సదా సంతోషంగా ఉంటారు, సదా ఎగిరే కళలో ఉంటారు, సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటారు. ఇటువంటి వరదానం తీసుకునే ఆత్మలు స్వతహాగా సహజయోగిగా అవుతారు. ఈ రోజు సంతోషం యొక్క రోజు కదా? అందరికన్నా ఎక్కువ సంతోషం ఎవరికి ఉంది, తండ్రికా లేక పిల్లలకా? (పిల్లలకు) తమ పిల్లలు ప్రతి ఒక్కరు శ్రేష్ఠమైనవారు అన్నటువంటి తండ్రి మొత్తం ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు అని బాప్ దాదాకు సంతోషముంది. ఒకవేళ బాప్ దాదా ఒక్కొక్క బిడ్డ యొక్క విశేషతను వర్ణించుకుంటూ వెళ్తే ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి. పిల్లలు ప్రతి ఒక్కరి మహిమ గురించి పెద్ద-పెద్ద శాస్త్రాలు తయారవుతాయి. మీరు ఇటువంటి విశేష ఆత్మలు - ఈ నిశ్చయం ఉన్నట్లయితే సదా మాయాజీతులుగా స్వతహాగా అవుతారు.
మెక్సికో గ్రూపుతో - ఎంతగా దూరంగా ఉన్నారో అంతగా హృదయంతో సమీపంగా ఉన్నారా? ఇలా అనుభవం చేస్తారు కదా? అందరూ బాప్ దాదా హృదయ సింహాసనాన్ని మీ సీటుగా రిజర్వ్ చేసుకున్నారా? బాప్ దాదాకు ఒకొక్క రత్నము యొక్క విలువ తెలుసు. ఒక్కొక్క రత్నము స్థాపనా కార్యాన్ని సఫలం చేసేందుకు నిమిత్తులుగా ఉన్నారు. మరి స్వయాన్ని ఇంతటి అమూల్యమైన రత్నముగా భావిస్తున్నారా? మీరు ఎంతటి భాగ్యశాలి ఆత్మలు, ఎంతో దూరం నుండి కూడా తండ్రి వెతికి తమవారిగా చేసుకున్నారు. ఈ నాటి ప్రపంచంలో ఎవరైతే పెద్ద-పెద్ద విద్వాంసులు, ఆచార్యులు ఉన్నారో వారికన్నా మీరు పదమాల రెట్లు ఎక్కువ భాగ్యవంతులు. జీవితంలో ఏదైతే పొందాలో, అది పొందేసాను - అంతే, కేవలం ఇదే సంతోషంలో ఉండండి.
న్యూజిలాండ్ గ్రూపుతో - న్యూ లాండ్ ను (కొత్త భూమిని) తయారుచేస్తున్నారు కదా? స్వయాన్ని కూడా కొత్తగా తయారుచేసుకున్నారు, మరి విశ్వాన్ని కూడా కొత్తగా తయారుచేస్తారు కదా. మేమందరము విశ్వ నవ నిర్మాణాన్ని చేసేవారము అని తమ కర్తవ్యం గురించి ఇదే వినిపిస్తారు మరియు రాస్తారు కదా. కావున ఎక్కడ ఉంటారో, ఆ స్థానాన్ని అయితే కొత్తగా తయారుచేస్తారు కదా. ప్రతి స్థానానికి దాని విశేషత ఉంది. న్యూజిలాండ్ యొక్క విశేషత ఏమిటి? న్యూజిలాండ్ కు వెళ్ళిన భారతవాసులు మళ్ళీ భారత్ యొక్క శ్రేష్ఠ భాగ్యాన్ని తయారుచేసే తండ్రిని గుర్తించారు. భారత్ లో ఉంటూ భారతవాసి పిల్లలు తెలుసుకోలేదు కానీ విదేశంలో ఉంటూ భారత్ యొక్క మహిమను మరియు తండ్రిని తెలుసుకున్నారు. భారత్ యొక్క తప్పిపోయిన మంచి-మంచి పిల్లలు న్యూజిలాండ్ లో వెలువడ్డారు. టీచర్లు తర్వాత లభించారు. కానీ సేవ యొక్క స్థాపన ముందు చేసారు, అందుకే ధైర్యం కల పిల్లలు, ఉల్లాస-ఉత్సాహాలు కల పిల్లలు విశేషముగా ఉన్నారు. అర్థమయిందా.
Comments
Post a Comment