26-10-1991 అవ్యక్త మురళి

    26-10-1991         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘తపస్యకు ప్రత్యక్ష ఫలము - సంతోషము’’ 

ఈ రోజు బాప్ దాదా తమ తపస్వీ రాజులైన పిల్లలందరినీ చూస్తున్నారు. మీరు తపస్వీలు కూడా మరియు రాజ్యాధికారులు కూడా, అందుకే మీరు తపస్వీ రాజులు. తపస్య అనగా రాజ్యాధికారిగా అవ్వడము. తపస్య రాజుగా తయారుచేస్తుంది. కావున అందరూ రాజులుగా అయ్యారు కదా. తపస్య యొక్క బలము ఏమి ఫలమిస్తుంది? ఆధీనుల నుండి అధికారులుగా అనగా రాజులుగా తయారుచేస్తుంది, అందుకే తపస్య ద్వారా రాజ్య భాగ్యము ప్రాప్తిస్తుంది అన్న గాయనం కూడా ఉంది. కావున మీ భాగ్యము ఎంతటి శ్రేష్ఠమైనది! ఇటువంటి భాగ్యము మొత్తం కల్పములో ఇంకెవ్వరికీ ప్రాప్తించజాలదు. ఇది ఎంత గొప్ప భాగ్యమంటే, భాగ్యవిధాతను తమవారిగా చేసుకున్నారు. ఇక ఒక్కొక్క భాగ్యాన్ని విడిగా అడగాల్సిన అవసరం లేదు. భాగ్యవిధాత నుండి అన్ని భాగ్యాలను వారసత్వం రూపంలో తీసుకున్నారు. వారసత్వాన్ని ఎప్పుడూ అడగడం జరగదు. అన్ని భాగ్యాలను భాగ్యవిధాతనే స్వయంగా ఇచ్చారు. తపస్య అనగా ఆత్మ అంటుంది - నేను మీ వాడిని, మీరు నా వారు, దీనినే తపస్య అని అంటారు. ఈ తపస్యా బలంతోనే భాగ్యవిధాతను తమవారిగా చేసుకున్నారు. భాగ్యవిధాత అయిన తండ్రి కూడా, నేను మీ వాడిని అని అంటారు. కావున ఇది ఎంత శ్రేష్ఠ భాగ్యము! భాగ్యముతో పాటుగా స్వరాజ్యము ఇప్పుడు లభించింది. భవిష్య విశ్వ రాజ్యానికి స్వరాజ్యమే ఆధారము, అందుకే మీరు తపస్వీ రాజులు. బాప్ దాదాకు కూడా తమ రాజ్యాధికారులైన పిల్లలు ప్రతి ఒక్కరినీ చూసి సంతోషం కలుగుతుంది. భక్తిలో అనేక జన్మలలో బాప్ దాదా ఎదురుగా ఏం అన్నారు? గుర్తుందా లేక మర్చిపోయారా? పదే-పదే స్వయాన్ని నేను బానిసను, నేను బానిసను అని అన్నారు. నేను మీ బానిసను అని అన్నారు. తండ్రి అంటారు - నా పిల్లలు, అయినా బానిసలా! మీరు సర్వశక్తివంతుని పిల్లలు, కనుక బానిసలుగా ఉండడం శోభిస్తుందా! అందుకే తండ్రి, నేను మీ బానిసను అన్నదానికి బదులుగా ఏమి అనుభవం చేయించారు? నేను మీ వాడిని అని అనుభవం చేయించారు. కావున బానిసల నుండి రాజులుగా అయ్యారు. ఇప్పటికీ అప్పుడప్పుడు బానిసలుగా అయితే అవ్వరు కదా? బానిసత్వం యొక్క పాత సంస్కారాలు అప్పుడప్పుడు ఇమర్జ్ అయితే అవ్వవు కదా? మాయకు బానిసలుగా అవుతారా? రాజు ఎప్పుడూ బానిసగా అవ్వలేరు. బానిసత్వం తొలగిపోయిందా లేక అప్పుడప్పుడు మంచిగా అనిపిస్తుందా? కావున తపస్యా బలము చాలా శ్రేష్ఠమైనది మరియు ఏం తపస్య చేస్తారు? తపస్య చేయటానికి కష్టపడుతున్నారా? తపస్య అంటే ఏమిటి అన్నది బాప్ దాదా వినిపించారు. తపస్య అనగా ఆనందంగా జరుపుకోవడము. తపస్య అనగా చాలా సహజంగా నాట్యం చేయడము మరియు పాడటము, అంతే. నాట్యం చేయడము మరియు పాడటము సులభమా లేక కష్టమా? మనోరంజనంలా ఉంటుందా లేక కష్టమనిపిస్తుందా? కావున తపస్యలో ఏం చేస్తారు? తపస్యకు ప్రత్యక్ష ఫలము సంతోషము. మరి సంతోషంలో ఏం జరుగుతుంది? నాట్యం చేస్తారు. తపస్య అనగా సంతోషంలో నాట్యం చేయడము మరియు తండ్రి యొక్క మరియు మీ యొక్క ఆది-అనాది స్వరూపంలోని గుణాలను గానం చేయడము. కనుక ఈ పాట ఎంత పెద్దది మరియు ఎంత సులువైనది. దీనికి గొంతు సరిగ్గా ఉందా లేక సరిగ్గా లేదా అన్నది కూడా అవసరం లేదు. ఈ పాటను నిరంతరం పాడవచ్చు. నిరంతరం సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి. కావున తపస్య యొక్క అర్థమేమిటి? నాట్యం చేయడము మరియు పాడడము, ఇది ఎంత సులభము. ఎవరైతే చిన్న పొరపాటు చేస్తారో, వారి తల భారమవుతుంది. బ్రాహ్మణ జీవితంలో ఎప్పుడూ ఎవరి తల భారంగా అవ్వజాలదు. హాస్పిటల్ తయారుచేస్తున్న వారికి తల భారంగా అయ్యిందా? ట్రస్టీలు ఎదురుగా కూర్చుని ఉన్నారు కదా! తల భారంగా ఉంది. చేసేది చేయించేది తండ్రి అన్నప్పుడు మీకేమి భారముంది? ఇక్కడ నిమిత్తులుగా అయి భాగ్యాన్ని తయారుచేసుకునే సాధనాన్ని తయారుచేస్తున్నారు. మీ బాధ్యత ఏమిటి? తండ్రి బాధ్యత అన్నదానికి బదులుగా తమ బాధ్యత అని భావిస్తారు కనుక తల భారమవుతుంది. సర్వశక్తివంతుడైన తండ్రి నాకు సహచరునిగా ఉన్నప్పుడు ఏం భారీతనము ఉంటుంది. చిన్న పొరపాటు చేస్తారు, నా బాధ్యత అని భావిస్తారు, అప్పుడు తల భారమవుతుంది. కనుక బ్రాహ్మణ జీవితమంటేనే నాట్యం చేయండి, పాడండి మరియు ఆనందంగా ఉండండి. సేవ అనేది, వాచా సేవ అయినా లేక కర్మణా సేవ అయినా, ఈ సేవ కూడా ఒక ఆట. సేవ అంటే వేరే ఏదో కాదు. కొన్ని బుద్ధితో ఆడే ఆటలు ఉంటాయి, కొన్ని తేలికైన ఆటలు ఉంటాయి. కానీ ఏవైనా ఆటలే కదా. బుద్ధితో ఆడే ఆటలలో బుద్ధి ఏమైనా భారంగా అవుతుందా. అలా ఈ ఆటలన్నీ ఆడుతున్నారు. కనుక ఎంతో ఆలోచించాల్సిన పనైనా లేక అటెన్షన్ పెట్టాల్సిన పనైనా, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు అన్నీ ఆటలే, అలాగే ఉన్నారా? లేదా కొద్ది-కొద్దిగా చేస్తూ-చేస్తూ అలసిపోతారా? మెజారిటీ అలసిపోనివారిగా ఉంటారు కానీ అప్పుడప్పుడు కొద్దిగా అలసిపోతారు. ఈ యోగ ప్రయోగాన్ని చేసినట్లయితే, సర్వ ఖజానాలను - సమయాన్ని కావచ్చు, సంకల్పాలను కావచ్చు, జ్ఞాన ఖజానాను కావచ్చు లేక స్థూల తనువును కావచ్చు, ఒకవేళ యోగ ప్రయోగం చేసే పద్ధతితో ఉపయోగిస్తే, ప్రతి ఖజానా పెరుగుతూ ఉంటుంది. ఈ తపస్యా సంవత్సరంలో యోగాన్ని ప్రయోగించారు కదా. ఏం ప్రయోగం చేసారు? ఈ ఒక్కొక్క ఖజానాను ప్రయోగించండి. ఎలా ప్రయోగించాలి? ఏ ఖజానాను అయినా తక్కువగా ఖర్చు చేయాలి మరియు ప్రాప్తి అధికంగా ఉండాలి. శ్రమ తక్కువగా ఉండాలి, సఫలత ఎక్కువగా ఉండాలి, ఈ విధితో ప్రయోగించండి. ఉదాహరణకు సమయాన్ని లేక సంకల్పాలను తీసుకోండి - ఇవి శ్రేష్ఠమైన ఖజానాలు. ఇక్కడ సంకల్పాలు తక్కువగా ఖర్చవ్వాలి కానీ ప్రాప్తి ఎక్కువగా ఉండాలి. ఒక సాధారణ వ్యక్తి 3-4 నిముషాలు సంకల్పాలు నడిపించిన తర్వాత, ఆలోచించిన తర్వాత ఏదైతే సఫలతను లేక ప్రాప్తిని పొందగలరో, దానిని మీరు 1-2 సెకండ్లలోనే పొందగలరు. దీనినే సాకారంలో బ్రహ్మాబాబా కూడా - కమ్ ఖర్చా బాలా నషీన్ (తక్కువ ఖర్చుతో ఎక్కువ ఖ్యాతి) అని అనేవారు. ఖర్చు తక్కువ చేయండి కానీ ప్రాప్తి 100 రెట్లు ఉండాలి. దీని ద్వారా ఏమవుతుంది? సమయంలో లేక సంకల్పాలలో ఏదైతే పొదుపు అవుతుందో, దానిని ఇతరుల సేవలో ఉపయోగించగలరు. దాన-పుణ్యాలను ఎవరు చేయగలరు? ఎవరి వద్దనైతే ధనం పొదుపు అవుతుందో, వారు. ఒకవేళ తమకు సరిపోయేంతనే సంపాదించారు మరియు తిన్నారంటే, ఇక దాన-పుణ్యాలు చేయలేరు. ఇదే యోగ ప్రయోగము. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితము, తక్కువ సంకల్పాలతో ఎక్కువ అనుభూతి ఉండాలి, అప్పుడే ప్రతి ఖజానాను ఇతరుల పట్ల ఉపయోగించగలరు. అలాగే వాణి మరియు కర్మలలో కూడా - తక్కువ ఖర్చు అవ్వాలి మరియు సఫలత ఎక్కువగా ఉండాలి, అప్పుడే అద్భుతమని మహిమ చేస్తారు. బాప్ దాదా ఏం అద్భుతం చేసారు? ఎంత కొద్ది సమయంలో ఎలా ఉన్నవారిని ఎలా తయారుచేసారు? అందుకే, అద్భుతం చేసారు అని అంటారు. ఒకటికి పదమాల రెట్ల ప్రాప్తిని అనుభవం చేస్తారు. అందుకే అద్భుతం చేసారు అని అంటారు. ఎలాగైతే బాప్ దాదా యొక్క ఖజానా - ప్రాప్తిని మరియు అనుభూతిని ఎక్కువగా చేయిస్తుందో, అలా మీరందరూ కూడా యోగాన్ని ప్రయోగించండి. కేవలం ‘‘బాబా, మీరు అద్భుతం చేసారు’’ అని పాట పాడడమే కాదు. మీరు కూడా అద్భుతం చేసేవారు. చేస్తారు కూడా. కానీ తపస్య నడుస్తున్న సమయంలో మెజారిటీ యొక్క రిజల్టులో ఏం చూసారు?

తపస్య యొక్క ఉల్లాస-ఉత్సాహాలు బాగున్నాయి. అటెన్షన్ కూడా ఉంది, సఫలత కూడా ఉంది కానీ సర్వ ఖజానాలను స్వయం పట్ల ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. స్వయం అనుభూతులను పొందడము కూడా మంచి విషయమే. కానీ తపస్యా సంవత్సరము స్వయం కోసము మరియు విశ్వ సేవ కోసమే ఇవ్వబడింది. తపస్య యొక్క వైబ్రేషన్లను విశ్వంలో ఇంకా తీవ్రవేగంతో వ్యాపింపజేయండి. ఇంతకుముందు కూడా వినిపించాము కదా - యోగ ప్రయోగాలను పెంచండి మరియు అనుభవమనే ప్రయోగశాలలో ప్రయోగము యొక్క వేగాన్ని పెంచండి. వర్తమాన సమయంలో సర్వాత్మలకు అవసరమైనది ఏమిటంటే - మీ శక్తిశాలి వైబ్రేషన్ల ద్వారా, వాయుమండలం ద్వారా పరివర్తన జరగటము, అందుకే ప్రయోగాన్ని ఇంకా పెంచండి. సహయోగీ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఈ సహయోగమే యోగంలోకి మారుతుంది. ఒకరేమో స్నేహీ సహయోగీలు మరియు రెండవవారు సహయోగీ యోగీలు. మరియు మూడవవారు నిరంతరం యోగీ ప్రయోగీలు. ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి - నేను ఎవరిని. కానీ బాప్ దాదాకు మూడు రకాల పిల్లలూ ప్రియమైనవారే. చాలామంది పిల్లల వైబ్రేషన్లు బాప్ దాదా వద్దకు చేరుకున్నాయి. రకరకాల వైబ్రేషన్లు ఉన్నాయి. తండ్రి వద్దకు ఏ విషయం చేరుకుందో తెలుసా? సూచనతోనే అర్థం చేసుకునేవారు కదా? ఈ తపస్యా సంవత్సరంలో ఏమేమి అయితే జరుగుతూ ఉందో, దానికి కారణమేమిటి? పెద్ద-పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు, దీనికి కారణమేమిటి? కొందరేమో, ఇదే తపస్యకు ఫలమని భావిస్తున్నారు. మరికొందరేమో, తపస్యా సంవత్సరంలో ఇవి ఎందుకు అని భావిస్తున్నారు. రెండు రకాల వైబ్రేషన్లు వస్తున్నాయి. కానీ సమయం యొక్క ఈ తీవ్ర వేగముతో మరియు తపస్యా వైబ్రేషన్లతో అవసరాలు పూర్తి అవ్వడము - ఇది తపస్యా బలం యొక్క ఫలము. ఫలాన్ని అయితే తినాల్సి ఉంటుంది కదా. తపస్య అన్ని అవసరాలను సమయానికి సహజంగా పూర్తి చేస్తుంది అని డ్రామా చూపిస్తుంది. అర్థమయిందా. ఇది ఎందుకు జరుగుతుంది అన్న ప్రశ్న ఉత్పన్నమవ్వకూడదు. తపస్య అనగా సఫలత సహజంగా అనుభూతి అవ్వాలి. ఇక మున్ముందు అసంభవము సహజంగా ఎలా సంభవమవుతుంది అన్న అనుభవాన్ని ఎక్కువలో ఎక్కువ చేస్తూ ఉంటారు. విఘ్నాలు రావడము, ఇది కూడా డ్రామాలో ఆది నుండి అంతిమం వరకు నిశ్చితమై ఉంది. ఈ విఘ్నాలు కూడా అసంభవం నుండి సంభవం యొక్క అనుభూతిని కలిగిస్తాయి. మరియు మీరందరూ అయితే అనుభవీలుగా అయ్యారు, అందుకే విఘ్నాలు కూడా ఆటగా అనిపిస్తాయి. ఏ విధంగానైతే ఫుట్ బాల్ ఆటను ఆడుతారు. అప్పుడేమి చేస్తారు? బంతి వస్తుంది, అప్పుడే కదా దానిని కాలితో కొడతారు. ఒకవేళ బంతే రాకపోతే, దానిని ఎలా కొడతారు? అది ఆట ఎలా అవుతుంది? ఇది కూడా ఫుట్ బాల్ ఆట. ఆట ఆడడంలో మజా అనిపిస్తుంది కదా లేక తికమకపడతారా? బంతి నా కాలి వద్దకు రావాలి, నేను కొట్టాలి అని ప్రయత్నిస్తారు కదా. ఈ ఆట అయితే జరుగుతూనే ఉంటుంది. నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు). డ్రామా ఆటను కూడా చూపిస్తుంది మరియు సంపన్న సఫలతను కూడా చూపిస్తుంది. ఇదే బ్రాహ్మణ కులం యొక్క ఆచారము, పద్ధతి. అచ్ఛా.

ఈ గ్రూపుకు చాలా అవకాశాలు లభించాయి. ఏ కార్యానికైనా నిమిత్తులుగా అవ్వడము, ఎటువంటి విధి ద్వారానైనా నిమిత్తులుగా అవ్వడము అనగా ఛాన్స్ తీసుకునే ఛాన్సలర్లుగా అవ్వడము. నేటి ప్రపంచంలో సంపద కలిగినవారు చాలామంది ఉన్నారు కానీ ప్రపంచంలోని వారి వద్ద లేని, అన్నింటికన్నా ఏ గొప్ప సంపద మీ వద్ద ఉంది? మరియు దాని అవసరము సంపద కలవారికి కూడా ఉంటుంది, పేదవారికి కూడా ఉంటుంది. అది ఏ సంపద? అన్నింటికన్నా అవసరమైన అత్యంత గొప్ప సంపద దయ. పేదవారైనా లేక ధనవంతులైనా కానీ, ఈ రోజు దయ లేదు. దయ అనే సంపద అన్నింటికన్నా అత్యంత గొప్ప సంపద. వేరే ఏమీ ఇవ్వకపోయినా గాని దయ ద్వారా అందరినీ సంతుష్టపర్చగలరు. మరియు మీరు చూపించే దయ ఈశ్వరీయ పరివారము అనే సంబంధంతో చూపించే దయ. అది అల్పకాలికమైన దయ కాదు. పరివారము అనే భావనతో కూడిన దయ అన్నింటికన్నా అత్యంత గొప్ప దయ మరియు ఇది అందరికీ అవసరము మరియు మీరు అందరికీ ఇవ్వగలరు. ఆత్మిక దయ తనువు, మనసు మరియు ధనాలను కూడా పూరించగలదు. అచ్ఛా, దీని గురించి తర్వాత వినిపిస్తాము.

నలువైపులా ఉన్న తపస్వీ రాజులైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా యోగ ప్రయోగము ద్వారా తక్కువ ఖర్చుతో శ్రేష్ఠమైన సఫలతను అనుభవం చేసేవారు, సదా నేను మీ వాడిని, మీరు నా వారు అనే తపస్యలో నిమగ్నమై ఉండేవారు, సదా ప్రతి సమయము తపస్య ద్వారా సంతోషంగా నాట్యం చేసే మరియు తండ్రి మరియు స్వయం యొక్క గుణాలను గానం చేసేవారు, ఇటువంటి దేశ-విదేశాలలోని సర్వ స్మృతి స్వరూప పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments