03-04-1991 అవ్యక్త మురళి

 03-04-1991         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము 

‘‘సర్వ హద్దుల నుండి బయటకు వచ్చి అనంతమైన వైరాగిగా అవ్వండి’’

ఈ రోజు కల్పం తర్వాత మళ్ళీ మిలనం జరుపుకునే పిల్లలందరూ తమ సాకారీ స్వీట్ హోమ్ అయిన మధుబన్ కు చేరుకున్నారు. సాకార వతనం యొక్క స్వీట్ హోమ్ మధుబన్. ఇక్కడ తండ్రి, పిల్లల ఆత్మిక మేళా జరుగుతుంది. మిలన మేళా జరుగుతుంది. కావున పిల్లలందరూ మిలన మేళాకు వచ్చారు. తండ్రి మరియు పిల్లల యొక్క ఈ మిలన మేళా కేవలం సంగమయుగంలోనే మరియు మధుబన్ లోనే జరుగుతుంది, అందరూ పరుగులు తీస్తూ మధుబన్ కు చేరుకున్నారు. మధుబన్ బాప్ దాదాతో సాకార రూపంలో కూడా మిలనం చేయిస్తుంది మరియు దానితో పాటు సహజ స్మృతి ద్వారా అవ్యక్త మిలనాన్ని కూడా చేయిస్తుంది ఎందుకంటే మధుబన్ ధరణికి ఆత్మిక మిలనం యొక్క అనుభూతిని మరియు సాకార రూపంలో మిలనం యొక్క అనుభూతిని చేయించే వరదానము లభించి ఉంది. వరదానీ ధరణి అయిన కారణంగా మిలనం యొక్క అనుభవాన్ని సహజంగా చేస్తారు. వేరే ఏ స్థానంలోనూ జ్ఞాన సాగరుడు మరియు జ్ఞాన నదుల యొక్క మిలన మేళా జరగదు. సాగరము మరియు నదుల యొక్క మిలన మేళా జరిగే స్థానము ఇది ఒక్కటే. ఇటువంటి మహాన్ వరదానీ ధరణిపైకి వచ్చారు - ఈ విధంగా భావిస్తున్నారా?

తపస్యా సంవత్సరంలో విశేషంగా ఈ కల్పంలో మొదటిసారి కలుసుకునేటువంటి పిల్లలకు గోల్డెన్ ఛాన్స్ లభించింది. మీరు ఎంత భాగ్యశాలురు! తపస్య యొక్క ఆదిలోనే కొత్త పిల్లలకు ఎక్స్ ట్రా బలం లభించింది. కనుక ఆదిలోనే లభించిన ఈ ఎక్స్ ట్రా బలము భవిష్యత్తులో ముందుకు వెళ్ళేందుకు సహయోగిగా అవుతుంది, అందుకే కొత్త పిల్లలకు డ్రామా కూడా ముందుకు వెళ్ళేందుకు సహయోగమిచ్చింది. అందుకే, మేమైతే వెనుక వచ్చాము అన్న ఫిర్యాదును చేయలేరు. అలా కాదు. తపస్యా సంవత్సరానికి కూడా వరదానం లభించి ఉంది. తపస్యా సంవత్సరంలో వరదాని భూమిపైకి వచ్చే అధికారం లభించింది, అవకాశం లభించింది. ఈ ఎక్స్ ట్రా భాగ్యము తక్కువేమీ కాదు. ఈ సంవత్సరము, ఈ మధుబన్ ధరణి మరియు తమ పురుషార్థము - ఈ మూడు వరదానాలు విశేషంగా కొత్త పిల్లలైన మీకు లభించాయి. కనుక ఎంత భాగ్యశాలురుగా అయ్యారు! ఇంతటి అవినాశీ భాగ్యం యొక్క నషాను తమతో పాటు ఉంచుకోండి. కేవలం ఇక్కడి వరకు మాత్రమే నషా ఉండడం కాదు, కానీ తండ్రి అవినాశీ, శ్రేష్ఠాత్మలైన మీరు అవినాశీ, కావున భాగ్యము కూడా అవినాశీ. అవినాశీ భాగ్యాన్ని అవినాశీగా ఉంచుకోండి. ఇది కేవలం సహజమైన అటెన్షన్ ఇచ్చే విషయము. టెన్షన్ తో కూడిన అటెన్షన్ కాదు, సహజమైన అటెన్షన్ ఉండాలి, అయినా ఏం కష్టముంది? నా బాబాను తెలుసుకున్నారు, స్వీకరించారు, ఎవరినైతే తెలుసుకున్నారో, స్వీకరించారో, అనుభవం చేసారో, అధికారం ప్రాప్తించిందో, అప్పుడిక కష్టమేముంది? కేవలం బాబా ఒక్కరే నా వారు - ఇది అనుభవమవుతూ ఉండాలి. ఇదే సంపూర్ణ జ్ఞానము.


ఒక్క ‘‘బాబా’’ అనే పదంలో మొత్తం ఆదిమధ్యాంతాల జ్ఞానము ఇమిడి ఉంది ఎందుకంటే వారు బీజము కదా. బీజcgలోనైతే మొత్తం వృక్షమంతా ఇమిడి ఉంటుంది కదా. విస్తారాన్ని మర్చిపోవచ్చు కానీ సారము ఒక్క బాబా అనే పదము - ఇది గుర్తుండడము కష్టము కాదు. సదా సహజము కదా! అప్పుడప్పుడు సహజము, అప్పుడప్పుడు కష్టమా. బాబా సదా నా వారా లేక అప్పుడప్పుడు నా వారా. బాబా సదా నా వారు అన్నప్పుడు స్మృతి కూడా సదా సహజముగా ఉంటుంది. ఇది కష్టమేమీ కాదు. భగవంతుడు, మీరు నా వారు అని అన్నారు మరియు మీరు, మీరు నా వారు అని అన్నారు. ఇక కష్టమేముంది? అందుకే విశేషంగా కొత్త పిల్లలు ఇంకా ముందుకు వెళ్ళండి. ఇప్పుడు కూడా ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంది. ఇప్పుడింకా ఫైనల్ సమాప్తి యొక్క విజిల్ మోగలేదు. అందుకే ఎగరండి మరియు ఇతరులను కూడా ఎగిరేలా చేస్తూ వెళ్ళండి. దీనికి విధి ఏమిటంటే, వేస్టును అనగా వ్యర్థాన్ని ఆపు చేయండి. పొదుపు ఖాతాను, జమ ఖాతాను పెంచుకుంటూ వెళ్ళండి ఎందుకంటే 63 జన్మల నుండి పొదుపు చేయలేదు కానీ పోగొట్టుకున్నారు. అన్ని ఖాతాలను వ్యర్థంగా పోగొట్టుకుని సమాప్తం చేసేసారు. శ్వాస యొక్క ఖజానాను కూడా పోగొట్టుకున్నారు, సంకల్పాల ఖజానాను కూడా పోగొట్టుకున్నారు, సమయం యొక్క ఖజానాను కూడా పోగొట్టుకున్నారు, గుణాల ఖజానాను కూడా పోగొట్టుకున్నారు, శక్తుల ఖజానాను కూడా పోగొట్టుకున్నారు, జ్ఞానం యొక్క ఖజానాను కూడా పోగొట్టుకున్నారు. ఎన్ని ఖాతాలు ఖాళీ అయిపోయాయి! ఇప్పుడు ఈ ఖాతాలన్నింటినీ జమ చేసుకోవాలి. జమ అయ్యే సమయము కూడా ఇప్పుడే ఉంది మరియు జమ చేసుకునే విధి కూడా తండ్రి ద్వారా సహజంగా లభిస్తూ ఉంది. వినాశీ ఖజానాలు ఖర్చు చేయడంతో తగ్గిపోతాయి, తరిగిపోతాయి మరియు ఈ ఖజానాలన్నింటినీ ఎంతగా స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల శుభమైన వృత్తితో కార్యంలో ఉపయోగిస్తారో, అంతగా అవి జమ అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఖజానాలను కార్యంలో ఉపయోగించడము - ఇది జమ చేసుకునే విధి. అక్కడ ఉంచుకోవడము జమ చేసుకునేందుకు విధి మరియు ఇక్కడ ఉపయోగించడము జమ చేసుకునేందుకు విధి. తేడా ఉంటుంది. సమయాన్ని స్వయం పట్ల లేక ఇతరుల పట్ల శుభ కార్యాలలో ఉపయోగించినట్లయితే జమ అవుతూ ఉంటుంది. జ్ఞానాన్ని కార్యంలో ఉపయోగించండి. అదే విధంగా గుణాలను మరియు శక్తులను ఎంతగా ఉపయోగిస్తారో, అవి అంతగా పెరుగుతాయి. ఇలా ఆలోచించకండి - ఏ విధంగానైతే వారు లాకరులో పెట్టుకుని, నా వద్ద చాలా జమ అయి ఉంది అని భావిస్తారో, అలా మీరు కూడా నా బుద్ధిలో చాలా జ్ఞానం ఉంది, గుణాలు కూడా నాలో చాలా ఉన్నాయి, శక్తులు కూడా ఉన్నాయి అని ఆలోచించడం కాదు. వాటిని లాకప్ చేసి పెట్టుకోకండి, ఉపయోగించండి. అర్థమయిందా? జమ చేసుకునే విధి ఏమిటి. కార్యంలో ఉపయోగించడము. స్వయం పట్ల కూడా ఉపయోగించండి, లేదంటే పోగొట్టుకుంటారు. చాలామంది పిల్లలు, నాలో సర్వ ఖజానాలు చాలా ఇమిడి ఉన్నాయి అని అంటారు. కానీ ఇమిడి ఉన్నాయి అన్నదానికి గుర్తు ఏమిటి? ఇమిడి ఉన్నాయి అనగా జమ అయి ఉన్నాయి. కనుక వాటి గుర్తు ఏమిటంటే- స్వ పట్ల మరియు ఇతరుల పట్ల సమయానికి కార్యంలో ఉపయోగపడాలి. కార్యంలోకి రానే రావు కానీ చాలా జమ ఉంది, చాలా జమ ఉంది అని అంటారు. కావున దీనిని జమ చేసుకునే యథార్థ విధి అని అనరు, కావున ఒకవేళ యథార్థ విధి లేకపోతే సమయానికి సంపూర్ణత యొక్క సిద్ధి లభించదు. మోసపోతారు. సిద్ధి లభించదు.

గుణాలను, శక్తులను కార్యంలో ఉపయోగించినట్లయితే పెరుగుతూ ఉంటాయి. కావున పొదుపు చేసే విధిని, జమ చేసే విధిని అలవర్చుకోండి. అప్పుడు వ్యర్థం యొక్క ఖాతా స్వతహాగానే పరివర్తన అయి సఫలమవుతుంది. ఏ విధంగానైతే భక్తి మార్గంలో ఈ నియమం ఉంటుంది, అదేమిటంటే, మీ వద్ద స్థూల ధనం ఎంత ఉన్నా సరే, దానిని దానం చేయండి, సఫలం చేయండి, అప్పుడు అది పెరుగుతూ ఉంటుంది అని అంటారు. సఫలం చేసుకునేందుకు భక్తిలో కూడా ఉల్లాస-ఉత్సాహాలను ఎంతగా పెంచుతారు. మీరు కూడా తపస్యా సంవత్సరంలో కేవలం వ్యర్థంగా ఎంత పోగొట్టుకున్నాము అన్నది మాత్రమే చెక్ చేసుకోకండి. వ్యర్థంగా పోగొట్టుకోవడము, అది వేరే విషయము. కానీ ఖజానాలన్నీ ఏవైతే వినిపించారో, వాటిని ఎంత సఫలం చేసాము అన్నది చెక్ చేసుకోండి. గుణాలు కూడా తండ్రి ఇచ్చిన కానుక. ఇది నా గుణము, నా శక్తి - స్వప్నంలో కూడా ఈ పొరపాటు చేయకండి. ఇది తండ్రి ఇచ్చిన కానుక అనగా ప్రభువు ఇచ్చిన కానుక, పరమాత్మ ఇచ్చిన కానుకను నాదిగా భావించడము అంటే - అది మహాపాపము. చాలాసార్లు చాలామంది పిల్లలు సాధారణ భాషలో ఇలా ఆలోచిస్తారు కూడా మరియు మాట్లాడుతారు కూడా - నా ఈ గుణాన్ని ఉపయోగించడం లేదు, నాలో ఈ శక్తి ఉంది, నా బుద్ధి చాలా మంచిది, దానిని ఉపయోగించడం లేదు. ‘‘నాది’’ అన్నది ఎక్కడి నుండి వచ్చింది? ‘‘నాది’’ అని అన్నారంటే మురికిగా అవుతారు. భక్తిలో కూడా ఈ శిక్షణను 63 జన్మలుగా ఇస్తూ వచ్చారు - నాది అని భావించకండి, నీదిగా భావించండి అని. అయినా కూడా అలా భావించలేదు. అలాగే జ్ఞాన మార్గంలో కూడా అనడానికి నీది అని అంటూ, నాదిగా భావిస్తే - ఆ మోసము ఇక్కడ నడవదు, అందుకే ప్రభు ప్రసాదించినదానిని తమదిగా భావించడము అంటే - ఇది అభిమానము మరియు అవమానపర్చడము. ‘‘బాబా-బాబా’’ అన్న పదమును ఎక్కడా కూడా మర్చిపోకండి. బాబా శక్తినిచ్చారు, బుద్ధినిచ్చారు, ఇది బాబా కార్యము, ఇది బాబా సెంటరు, అన్ని వస్తువులు బాబావే. నా సెంటరు, నేను కట్టించాను, నాకు అధికారం ఉంది అని అనుకోకండి. నా అన్న పదం ఎక్కడి నుండి వచ్చింది? అది మీదా? మూటను సంభాళించుకుని పెట్టుకున్నారా ఏమిటి? చాలామంది పిల్లలు ఎటువంటి నషాను చూపిస్తారంటే, మేము సెంటరు యొక్క భవనాన్ని తయారుచేసాము కనుక మాకు అధికారము ఉంది. కానీ తయారుచేసింది ఎవరి సెంటరును? బాబా సెంటరు కదా! కావున ఎప్పుడైతే బాబాకు అర్పణ చేసారో, అప్పుడిక మీది ఎక్కడి నుండి వచ్చింది? నాది అన్నది ఎక్కడి నుండి వచ్చింది? బుద్ధి మారినప్పుడు నాది అని అంటారు. నాది-నాది అన్నదే మురికిగా చేసింది, ఇంకా మురికిగా అవ్వాలా? బ్రాహ్మణులుగా అయినప్పుడు బ్రాహ్మణ జీవితంలో తండ్రితో చేసిన మొదటి ప్రతిజ్ఞ ఏమిటి? కొత్తవారు ప్రతిజ్ఞ చేసారా లేక పాతవారు చేసారా? కొత్తవారు కూడా ఇప్పుడు పాతవారిగా అయి వచ్చారు కదా? నిశ్చయబుద్ధి యొక్క ఫారమును నింపి వచ్చారు కదా? కనుక అందరి మొట్టమొదటి ప్రతిజ్ఞ ఏమిటంటే - తనువు, మనసు, ధనము మరియు బుద్ధి అన్నీ మీవే. ఈ ప్రతిజ్ఞను అందరూ చేసారా?

ఇప్పుడు ప్రతిజ్ఞను చేసేవారైతే చేతులెత్తండి. ఎవరైతే ఇలా భావిస్తారో - అవసరమైన సమయానికి ఎంతో కొంత ఉంచుకోవాల్సి ఉంటుంది, అంతా తండ్రికి ఎలా ఇచ్చేస్తాము? ఎంతో కొంత పక్కకు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇది తెలివైన పని అని భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. ఏదైనా పక్కకు పెట్టుకున్నారా? చూసుకోండి, మళ్ళీ తర్వాత మమ్మల్ని ఎవరు చూసారు, ఇంత గుంపులో మమ్మల్ని ఎవరు చూసారు అని అనకండి. తండ్రి వద్దనైతే టి.వి చాలా స్పష్టంగా ఉంది. దాని నుండి దాగి ఉండలేరు. అందుకే ఆలోచించి, అర్థం చేసుకుని కొద్దిగా ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి. పాండవులు ఏమనుకుంటున్నారు? కొద్దిగా ఉంచుకోవాలా? బాగా ఆలోచించండి. ఎవరైతే పెట్టుకోవాలి అనుకుంటారో వారు ఇప్పుడే చేతులెత్తండి, రక్షించబడతారు. లేదంటే ఈ సమయము, ఈ సభ, మీరు ఈ విధంగా తల ఊపడము, ఇవన్నీ కనిపిస్తాయి. ఎప్పుడూ కూడా నాది అన్నది పెట్టుకోకండి. తండ్రి అని అన్నట్లయితే పాపం సమాప్తమైపోతుంది. తండ్రి అని అనకపోతే పాపమవుతుంది. పాపానికి వశమైతే ఇక బుద్ధి పని చేయదు. ఇక ఎంతగా అర్థం చేయించినా - కాదు, ఇదే రైటు ఇలా జరగాల్సిందే, ఇలా చేయాల్సిందే అని అంటారు. తండ్రికి కూడా దయ కలుగుతుంది ఎందుకంటే ఆ సమయంలో పాపానికి వశమై ఉంటారు. తండ్రిని మర్చిపోతే పాపం వచ్చేస్తుంది. పాపానికి వశమైన కారణంగా ఏదైతే మాట్లాడతారో, ఏదైతే చేస్తారో - మేము ఏం చేస్తున్నాము అన్నది స్వయానికి కూడా అర్థం కాదు ఎందుకంటే పరవశులై ఉంటారు. కనుక సదా జ్ఞానం యొక్క తెలివిలో ఉండండి. పాపం యొక్క ఆవేశంలోకి రాకండి. మధ్యమధ్యలో ఈ మాయ అల వస్తుంది. కొత్తవారైన మీరు ఈ విషయాల నుండి రక్షించబడి ఉండండి. నాది-నాది అన్నదానిలోకి వెళ్ళకండి. కొద్దిగా పాతవారిగా అయిన తర్వాత ఇక ఈ నాది-నాది అన్న మాయ చాలా వస్తుంది. నా ఆలోచన అని అంటారు, నా బుద్ధి అన్నదే లేనప్పుడు ఇక నా ఆలోచన అన్నది ఎక్కడి నుండి వచ్చింది? మరి జమ చేసుకునే విధి ఏమిటో అర్థమయిందా? కార్యంలో ఉపయోగించడము. సఫలం చేసుకోండి, తమ ఈశ్వరీయ సంస్కారాలను కూడా సఫలం చేసుకోండి, అప్పుడు వ్యర్థ సంస్కారాలు స్వతహాగా వెళ్ళిపోతాయి. ఈశ్వరీయ సంస్కారాలను కార్యంలో ఉపయోగించకపోతే, అవి లాకర్ లో ఉంటాయి మరియు పాతవి పని చేస్తూ ఉంటాయి. చాలామందికి బ్యాంకులలో లేక అల్మరాలలో పెట్టుకునే అలవాటు ఉంటుంది. చాలా మంచి వస్త్రాలుంటాయి, ధనం ఉంటుంది, వస్తువులు ఉంటాయి, కానీ పాతవాటిని ఉపయోగిస్తారు. పాత వస్తువుల పట్ల వారికి ప్రేమ ఉంటుంది మరియు అల్మరాలోని వస్తువులు అల్మరాలోనే ఉంటాయి మరియు పాతవాటితోనే వారు వెళ్ళిపోతారు. కావున పాత సంస్కారాలను ఉపయోగిస్తూ ఈశ్వరీయ సంస్కారాలను బుద్ధి అనే లాకర్ లో పెట్టుకోకండి, ఇలా చేయకండి. కార్యంలో ఉపయోగించండి, సఫలం చేసుకోండి. కావున ఎంత సఫలం చేసుకున్నాము అన్న చార్టును పెట్టుకోండి. సఫలం చేసుకోవడము అనగా పొదుపు చేయడము లేక పెంచుకోవడము. మనసా ద్వారా సఫలం చేసుకోండి, వాణి ద్వారా సఫలం చేసుకోండి. సంబంధ-సంపర్కాల ద్వారా, కర్మల ద్వారా, తమ శ్రేష్ఠ సాంగత్యం ద్వారా, తమ అత్యంత శక్తిశాలి వృత్తి ద్వారా సఫలం చేసుకోండి. నా వృత్తి అయితే మంచిగా ఉంటుంది అని కాదు. కానీ సఫలం ఎంత చేసుకున్నారు? నా సంస్కారాలైతే శాంతిగా ఉంటాయి అని కాదు కానీ సఫలం ఎంత చేసుకున్నారు? కార్యంలో ఉపయోగించారా? కావున ఈ విధిని అలవర్చుకోవడంతో సంపూర్ణత యొక్క సిద్ధిని సహజంగా అనుభవం చేస్తూ ఉంటారు. సఫలం చేసుకోవడమే సఫలత యొక్క తాళంచెవి. ఏం చేయాలో అర్థమయిందా? కేవలం మీలో మీరే ఇలా సంతోషపడుతూ ఉండకండి - నేనైతే చాలా మంచి గుణవంతుడను, నేను చాలా బాగా భాషణ చేయగలను, నేను చాలా మంచి జ్ఞానిని, యోగం కూడా నాది చాలా బాగుంటుంది. కానీ బాగుంటే దానిని ఉపయోగించండి కదా. దానిని సఫలం చేయండి. కార్యంలో ఉపయోగించడము మరియు పెంచుకోవడమే సహజ విధి. ఇలా చేస్తే ఏ శ్రమ లేకుండా పెరుగుతూ ఉంటుంది మరియు 21 జన్మలు ప్రశాంతంగా తినండి. అక్కడ శ్రమించాల్సిన అవసరం ఉండదు.

ఇది విశాలమైన సభ (ఓం శాంతి భవన్ యొక్క హాలు పూర్తిగా నిండిపోయింది, అందుకే చాలామందికి కింద మెడిటేషన్ హాలులో, చిన్న హాలులో కూర్చోవాల్సి వచ్చింది. హాలు చిన్నదైపోయింది). శాస్త్రాలలో మీ స్మృతిచిహ్నం ఏదైతే ఉందో, అందులో కూడా ఇలా గాయనం ఉంది - మొదట గ్లాసులో నీటిని వేసారు, ఆ తర్వాత దాని నుండి కుండలో వేసారు, ఆ తర్వాత కుండ నుండి చెరువులో వేసారు, చెరువు నుండి నదిలో వేసారు. చివరికి ఎక్కడికి వెళ్ళింది? సాగరములోకి. అలాగే ఈ సభ మొదట హిస్టరీ హాలులో జరిగేది, ఆ తర్వాత మెడిటేషన్ హాలులో జరిగేది, ఇప్పుడు ఓం శాంతి భవన్ లో జరుగుతుంది. ఇప్పుడు తర్వాత ఎక్కడ ఉంటుంది? కానీ అలాగని సాకార మిలనం లేకుండా అవ్యక్త మిలనం జరుపుకోలేరని కాదు. అవ్యక్త మిలనాన్ని జరుపుకునే అభ్యాసము సమయమనుసారంగా పెరగాల్సిందే మరియు పెంచుకోవాల్సిందే. ఇక్కడ దాదీలు దయాహృదయులై కొత్తవారైన మీ అందరిపై విశేషమైన దయ చూపించారు. కానీ అవ్యక్త అనుభవాన్ని పెంచుకోండి - ఇదే సమయానికి పనికొస్తుంది. చూడండి, కొత్త-కొత్త పిల్లల కోసమే బాప్ దాదా విశేషంగా ఈ సాకార మిలనము యొక్క పాత్రను ఇప్పటివరకు అభినయిస్తున్నారు. కానీ ఇది కూడా ఎప్పటివరకు?

అందరూ సంతోషంగా, సంతుష్టంగా ఉన్నారా? బయట ఉండడంలో కూడా సంతుష్టంగా ఉన్నారా? ఇది కూడా డ్రామాలోని పాత్ర. మొత్తం ఆబూ అంతా మాదిగా అవుతుంది అని అంటారు కదా, మరి అది ఎలా అవుతుంది? మొదట మీరైతే పాదం పెట్టండి, ఆ తర్వాత ఇప్పుడు ఏవైతే ధర్మశాలల పేరుతో ఉన్నాయో అవి మీవిగా అవుతాయి. చూడండి, విదేశాలలో ఇప్పుడు ఈ విధంగా జరగడం ప్రారంభమయింది. చర్చిలు అంతగా నడవకపోతుంటే, వాటిని బి.కె.లకు ఇచ్చేసారు. ఇటువంటి పెద్ద-పెద్ద స్థానాలు ఏవైతే ఉన్నాయో, అవి నడవలేకపోతే వాటిని ఆఫర్ చేస్తారు కదా. కనుక ప్రతి స్థానంలోనూ బ్రాహ్మణుల అడుగులు పడుతున్నాయి, ఇందులో కూడా రహస్యముంది. బ్రాహ్మణులకు డ్రామాలో ఈ విధంగా ఉండే పాత్ర లభించింది. కావున మొత్తమంతా మీదిగా అయినప్పుడు ఏం చేస్తారు? తమంతట తామే ఆఫర్ చేస్తారు - మీరు సంభాళించండి, మమ్మల్ని కూడా సంభాళించండి, ఆశ్రమాన్ని కూడా సంభాళించండి. ఏ సమయంలో ఏ పాత్ర లభిస్తే, దానితో రాజీగా ఉంటూ పాత్రను అభినయించండి. అచ్ఛా.

నలువైపులా ఉన్న సర్వ మిలనం జరుపుకునే, జ్ఞాన రత్నాలను ధారణ చేసే చాతక ఆత్మలకు, ఆకార రూపంలో లేక సాకార రూపంలో మిలన మేళాను జరుపుకునే శ్రేష్ఠ ఆత్మలకు, సదా సర్వ ఖజానాలను సఫలం చేసుకుని సఫలతా స్వరూపులుగా అయ్యే ఆత్మలకు, సదా నా బాబా అని అనుకునేవారికి మరియు ఎటువంటి హద్దులోని నాది అనేది అంశమాత్రము కూడా ఉంచుకోని అనంతమైన వైరాగీ ఆత్మలకు, సదా ప్రతి సమయము విధి ద్వారా సంపూర్ణత అనే సిద్ధిని ప్రాప్తి చేసుకునే పిల్లలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో - సదా ఏదో ఒక కొత్త దృశ్యము ఉండాలి కదా. ఇప్పుడు ఏదైతే రిపీట్ అయ్యిందో, అది కూడా డ్రామాలోని కొత్త దృశ్యము. ఈ హాలు కూడా చిన్నదిగా అయిపోతుంది అని అనుకున్నారా? సదా ఒకే దృశ్యముంటే బాగా అనిపించదు. అప్పుడప్పుడు వచ్చే దృశ్యాలు బాగా అనిపిస్తాయి. ఇది కూడా ఒక ఆత్మిక మెరుపు కదా! ఈ ఆత్మలందరి సంకల్పము పూర్తి అయ్యేదే ఉంది, అందుకే ఈ దృశ్యము జరిగింది. సరే రండి, అని ఇక్కడి నుండి అనుమతి ఇచ్చారు. అప్పుడిక ఏం చేస్తారు? ఇప్పుడింకా కొత్తవారు ఇంకా పెరగనున్నారు. మరియు పాతవారైతే పాతవారిగా అయ్యారు. ఎంతైతే ఉత్సాహంతో వచ్చారో, అలా స్వయాన్ని సెట్ చేసుకున్నారు, మంచి పని చేసారు. ఇది విశాలంగా అయితే అవ్వాల్సిందే. ఇంకా చిన్నదిగా అయితే అయ్యేదే లేదు. విశ్వ కళ్యాణకారి అనే టైటిల్ ఉన్నప్పుడు విశ్వం ముందు ఇది ఏమీ కానే కాదు. వృద్ధి కూడా జరగనున్నది మరియు విధిలో కూడా ఇంకా-ఇంకా కొత్తగా అవ్వనున్నది. ఏదో ఒక కొత్త విధి జరుగుతూ ఉండాలి. ఇప్పుడు వృత్తి శక్తిశాలిగా అవుతుంది. తపస్సు ద్వారా వృత్తి శక్తిశాలిగా అయితే స్వతహాగా వృత్తి ద్వారా ఆత్మల వృత్తి కూడా పరివర్తనవుతుంది. అచ్ఛా, మీరందరూ సేవ చేస్తూ అలసిపోవడం లేదు కదా. ఆనందంలో ఉన్నారు కదా. ఆనందమే ఆనందము. అచ్ఛా.

Comments