13-03-1990 అవ్యక్త మురళి

  13-03-1990         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 ‘‘సంగమయుగంలో ఆత్మలతో పరమాత్మ యొక్క విచిత్ర మిలనము’’

ఈ రోజు అనేక సార్లు కలుసుకునేటువంటి, చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. తండ్రి కూడా అదే పరిచయంతో పిల్లలను చూస్తున్నారు మరియు పిల్లలు కూడా ‘‘అనేక సార్లు కలుసుకున్నటువంటి స్మృతి’’ తో కలుసుకుంటున్నారు. ఇది ఆత్మ మరియు పరమాత్మ తండ్రి యొక్క విచిత్ర మిలనము. మొత్తం కల్పంలో ఏ ఆత్మ కూడా ‘‘అనేక సార్లు కలుసుకున్న తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నాను’’ అన్న స్మృతితో కలుసుకోరు. ఎప్పటికప్పుడు ధర్మపితలు వచ్చారు మరియు తమ అనుచరులను పై నుండి కిందికి తీసుకొచ్చారు కానీ ధర్మపితలు కూడా ‘‘అనేక కల్పాలు కలుసుకున్నవారము మళ్ళీ కలుసుకుంటున్నాము’’ అన్న స్మృతితో కలుసుకోరు. ఈ స్పష్టమైన స్మృతితో కేవలం పరమపిత తప్ప ఆత్మలతో మరెవ్వరూ కలుసుకోలేరు. ఈ కల్పంలో మొదటిసారి కలుసుకుంటున్నా కానీ, కలిసిన వెంటనే ఏదైతే పాత స్మృతి, పాత పరిచయం ఆత్మలలో సంస్కారాల రూపంలో రికార్డు నిండి ఉందో, అది ఇమర్జ్ అవుతుంది మరియు హృదయం నుండి ‘వీరు మా ఆ తండ్రే’ అనే స్మృతితో కూడిన శబ్దం వెలువడుతుంది. పిల్లలంటారు - మీరు నా వారు మరియు తండ్రి అంటారు - మీరు నా వారు. నా వారు అన్న సంకల్పం ఉత్పన్నమవుతూనే, అదే క్షణాన ఆ శక్తిశాలి స్మృతితో, సంకల్పంతో కొత్త జీవితము మరియు కొత్త ప్రపంచము లభించాయి మరియు సదా కోసం ‘‘నా బాబా’’ అన్న స్మృతి స్వరూపంలో స్థితులయ్యారు. స్మృతి స్వరూపులుగా అయ్యారు కనుక స్మృతికి రిటర్న్ లో సమర్థ స్వరూపులుగా అయ్యారు. సమర్థ స్వరూపులుగా అయ్యారు కదా, బలహీన స్వరూపులైతే కాదు కదా? మరియు ఎవరెంతగా స్మృతిలో ఉంటారో, అంతగా సమర్థతల అధికారాన్ని స్వతహాగా ప్రాప్తి చేసుకుంటారు. ఎక్కడైతే స్మృతి ఉంటుందో, అక్కడ సమర్థత ఉండనే ఉంటుంది. కొద్దిగా విస్మృతి ఉన్నా కానీ వ్యర్థం ఉంటుంది. వ్యర్థ సంకల్పాలు కావచ్చు, మాటలు కావచ్చు, కర్మలు కావచ్చు. అందుకే బాప్ దాదా పిల్లలందరినీ ‘పిల్లలు ప్రతి ఒక్కరూ స్మృతి స్వరూపులు తద్వారా సమర్థులు’ అనే దృష్టితోనే చూస్తారు. ఈ రోజు వరకు కూడా భక్తుల ద్వారా మీ స్మరణను వింటున్నారు. తమ స్మృతిలోకి ‘నా బాబా’ అన్నది తీసుకొచ్చారు కనుక భక్తాత్మలు కూడా ‘మా ఇష్టదేవతలు లేక దేవీలు’ అన్న స్మరణే చేస్తారు. ఏ విధంగానైతే మీరు అతి ప్రేమతో, హృదయ పూర్వకంగా తండ్రిని స్మృతి చేసారో, అంతగానే భక్తాత్మలు ఇష్ట ఆత్మలైన మిమ్మల్ని హృదయపూర్వకంగా, అతి ప్రేమతో గుర్తు చేసుకుంటారు. బ్రాహ్మణాత్మలైన మీలో కూడా కొందరు హృదయపూర్వకమైన స్నేహ సంబంధంతో స్మృతి చేస్తారు, మరికొందరు బుద్ధి ద్వారా, జ్ఞానం ఆధారంతో సంబంధాన్ని అనుభవం చేయాలని పదే-పదే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైతే హృదయపూర్వకమైన స్నేహముంటుందో మరియు సంబంధం అతి ప్రియంగా ఉంటుందో, అనగా అతి సమీపత ఉంటుందో, అక్కడ స్మృతిని మర్చిపోవడం కష్టమవుతుంది. ఎక్కడైతే కేవలం జ్ఞానం ఆధారంగా సంబంధం ఉంటుందో, అంతేకానీ హృదయపూర్వకమైన, ఎడతెగని స్నేహం ఉండదో, అక్కడ స్మృతి అప్పుడప్పుడు సహజంగా, అప్పుడప్పుడు కష్టంగా ఉంటుంది. ఏ విధంగానైతే శరీరంలో నర-నరాల్లో రక్తం ఇమిడి ఉంటుందో, అలా ఆత్మలో ప్రతి క్షణము స్మృతి ఇమిడి ఉంటుంది. దీనినే హృదయపూర్వక స్నేహ సంపన్నమైన నిరంతర స్మృతి అని అంటారు. ఏ విధంగానైతే భక్తాత్మలు తండ్రి గురించి - ఎక్కడ చూసినా నీవే నీవు అని అంటారో, అలా తండ్రి యొక్క స్నేహీ మరియు సమాన ఆత్మలను, ఎవరు చూసినా సరే - వీరి దృష్టిలో, మాటలో, కర్మలో పరమాత్మ తండ్రే అనుభవమవుతారు అన్నట్లు అనుభవం చేయాలి. వీరినే స్నేహీలు మరియు తండ్రి సమానులు అని అంటారు. కావున అందరూ స్మృతి స్వరూపులే. సంబంధం కూడా అందరికీ ఉంది, అధికారం కూడా అందరికీ ఉంది ఎందుకంటే అందరికీ - తండ్రి మరియు పిల్లల యొక్క పూర్తి అధికారమున్న సంబంధముంది. అందరూ ‘నా బాబా’ అని అంటారు. మా చిన్నాన్న, మా పెదనాన్న అని ఎవరూ అనరు. అధికారంతో కూడిన సంబంధమున్న కారణంగా సర్వ ప్రాప్తుల వారసత్వానికి అధికారులు. 50 సంవత్సరాల వారు కావచ్చు, 6 మాసాల వారు కావచ్చు, ‘నా వారు’ అని అనడంతో అధికారులుగానైతే అయిపోయారు. కానీ తేడా ఏమిటి! తండ్రి, అధికారాన్ని అయితే అందరికీ ఒకేలా ఇస్తారు - ఎందుకంటే వారు తరగని వారసత్వాన్ని ఇచ్చే దాత. రెండున్నర లక్షల మంది కాదు కదా, సర్వాత్మలు అధికారులుగా అయినా కానీ అంతకన్నా అపారమైన ఖజానా తండ్రి వద్ద ఉంది. కావున తక్కువ ఎందుకిస్తారు? కావున దాత అందరికీ ఒకేలా ఇస్తారు కానీ తీసుకునేవారిలో తేడా ఉంటుంది. కొందరు ప్రాప్తుల వారసత్వాన్ని మరియు ఖజానాను సమయం అనుసారంగా స్వయం పట్ల లేక సేవ పట్ల కార్యంలో ఉపయోగించి, దాని లాభాన్ని అనుభవం చేస్తారు, అందుకే తండ్రి ఖజానాను తమ ఖజానాగా చేసుకుంటారు అనగా స్వయంలో ఇముడ్చుకుంటారు, అందుకే ప్రతి ఖజానాను ఉపయోగించే అనుభవంతో సంతోషం మరియు నషాలో ఉంటారు. ఇది శుద్ధమైన నషా, తప్పుడు నషా కాదు. మరికొందరు - ఖజానా లభించింది, తమదిగా అయిపోయింది అనే సంతోషంలో ఉంటారు. కేవలం ‘నాది’ గా భావిస్తారు కానీ దానిని కార్యంలో ఉపయోగించరు. ఒక అమూల్యమైన వస్తువును కేవలం తమ వద్ద జమ చేసుకుని స్టాకు పెట్టుకున్నారు, కానీ కేవలం జమ చేసుకోవడానికి మరియు ఉపయోగించడానికి, అనుభూతిలో తేడా ఉంటుంది. ఎంతగా కార్యంలో ఉపయోగిస్తారో, అంతగా శక్తి మరింత పెరుగుతుంది, కానీ వారు అలా సదా చేయడం లేదు, అప్పుడప్పుడు చేస్తున్నారు. అందుకే సదా చేసేవారికి మరియు అప్పుడప్పుడు చేసేవారికి మధ్యన తేడా వస్తుంది. కార్యంలో వినియోగించే విధిని ఉపయోగించడం లేదు. కనుక దాత తేడా చేయరు కానీ తీసుకునేవారిలో తేడా ఉంటుంది. మీరందరూ ఎవరు? కార్యంలో ఉపయోగించేవారా లేక కేవలం జమ అయినదానిని చూసుకుని సంతోషించేవారా? మొదటి నంబరు వారా లేక రెండవ నంబరు వారా?

అందరూ నంబరువన్ గా ఉన్నారని బాప్ దాదా సంతోషిస్తున్నారు. లేదా కేవలం ఈ సమయంలోనే నంబరువన్ గా ఉన్నారా? బాప్ దాదా ఎల్లప్పుడూ ‘పిల్లల నోట్లో సదా గులాబ్ జామ్’ అని అంటారు. ఏది చెప్తే, అది చేసారంటే సదా నోట్లో గులాబ్ జామ్ ఉన్నట్లు. ప్రపంచంవారు నోట్లో గులాబీ అని అంటారు. కానీ గులాబీతో నోరు తీపి అవ్వదు కనుక గులాబ్ జామ్. నోట్లో ఉంటే సదా ఇలా చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. అచ్ఛా!

చాలామంది కొత్త-కొత్త వారు మళ్ళీ కలుసుకునేందుకు వచ్చి చేరుకున్నారు. ఎవరైతే ఈ కల్పంలో మళ్ళీ మిలనం జరుపుకుంటున్నారో, ఆ పిల్లలకు బాప్ దాదా విశేషంగా స్నేహంతో వరదానాన్ని ఇస్తున్నారు - సదా తమ మస్తకంపై తండ్రి చేతిని అనుభవం చేస్తూ వెళ్ళండి. ఎవరి తలపైనైతే తండ్రి చేయి ఉందో, వారు సదా ఈ వరదానం యొక్క అనుభవం ద్వారా అన్ని విషయాలలో సురక్షితంగా ఉంటారు. ఈ వరదాన హస్తము ప్రతి విషయంలోనూ మీ రక్షణకు సాధనము. అన్నింటికన్నా గొప్ప సెక్యూరిటీ ఇదే.

బాప్ దాదా టీచర్లందరిలోనూ నిమిత్తంగా అయ్యే ధైర్యాన్ని చూసి సంతోషిస్తున్నారు. ధైర్యం పెట్టి నిమిత్తంగా అయితే అవుతారు కదా. టీచరు నిమిత్తంగా అవ్వడం అనగా అనంతమైన స్టేజిపై హీరో పాత్రను అభినయించడము. ఏ విధంగానైతే హద్దు స్టేజిపై హీరో పాత్రధారి ఆత్మ వైపు అందరికీ విశేషమైన అటెన్షన్ ఉంటుందో, అలా ఏ ఆత్మలకైతే మీరు నిమిత్తంగా అవుతారో, విశేషంగా వారు మరియు మిగిలిన ఆత్మలందరూ నిమిత్తంగా అయిన టీచర్లు అయిన మిమ్మల్ని అదే దృష్టితో చూస్తారు. అందరికీ విశేషమైన అటెన్షన్ ఉంటుంది కదా! కనుక టీచర్లు స్వయంపై కూడా విశేషమైన అటెన్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సేవలో హీరో పాత్రధారులుగా అవ్వడము అనగా హీరోగా అవ్వడము. ఆశీర్వాదాలు కూడా టీచర్లకు ఎక్కువ లభిస్తాయి. ఎంతగా ఆశీర్వాదాలు లభిస్తాయో, అంతగా స్వయం పట్ల అటెన్షన్ పెట్టడం అవసరము. ఇది కూడా డ్రామానుసారంగా విశేషమైన భాగ్యము. కనుక సదా ఈ ప్రాప్తించిన భాగ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. వంద నుండి వెయ్యి, వెయ్యి నుండి లక్ష, లక్ష నుండి కోటి, కోటి నుండి పదమ్, పదమ్ నుండి పదమాపదమ్, సదా ఈ భాగ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇలాంటి వారిని యోగ్యమైన ఆదర్శ టీచర్లని అంటారు. బాప్ దాదా నిమిత్తంగా అయిన పిల్లలను తప్పకుండా గుర్తు చేస్తారు మరియు సదా అమృతవేళ, ‘‘వాహ్ పిల్లలూ వాహ్’’ అనే ఆశీర్వాదాలను ఇస్తారు. సేవాధారులు విన్నారా! టీచర్లు అనగా నంబరువన్ సేవాధారులు. అచ్ఛా!

నలువైపులా ఉన్న అతీతమైన మరియు ప్రియమైన మిలనాన్ని అనేక కల్పాలు జరుపుకునేవారు, సదా ప్రాప్తించిన వారసత్వం యొక్క ఖజానాలను సమయం అనుసారంగా కార్యంలో ఉపయోగించేవారు, సదా హృదయంతో అతి స్నేహీలుగా మరియు తండ్రి సమానంగా అయి స్వయం ద్వారా తండ్రిని అనుభవం చేయించేవారు, సదా స్మృతి స్వరూపం నుండి భక్తుల ద్వారా సమర్థ స్వరూపంగా అయ్యేవారు, సదా తమకు ప్రాప్తించిన భాగ్యాన్ని పంచేవారు అనగా పెంచుకునేవారు - ఇటువంటి మాస్టర్ దాతలైన సమర్థ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

డబల్ విదేశీ సోదర-సోదరీలతో గ్రూపులవారీగా మిలనము

1. అందరూ తమను తాము చాలా-చాలా భాగ్యవంతులుగా భావిస్తున్నారా? ఎందుకంటే, ఇలాంటి శ్రేష్ఠ ఆత్మలుగా అవుతామని ఎప్పుడూ స్వప్నంలో కూడా సంకల్పం వచ్చి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు సాకారంలో అయ్యారు! చూడండి, ఎక్కడెక్కడి నుండి బాప్ దాదా రత్నాలను ఎంచుకుని, రత్నాల మాలను తయారుచేసారు. బ్రాహ్మణ పరివారం యొక్క మాలలో కూర్చబడ్డారు. ఎప్పుడూ మాల నుండి బయటికైతే రారు కదా? ఎలాంటి మాలకైనా విశేషత మరియు సుందరత ఏముంటుంది? ఒక పూస ఇంకొక పూసతో కలిసి ఉంటుంది. ఒకవేళ మధ్యలో దారం కనిపిస్తే, పూస పూసతో కలిసి ఉండకపోతే, సుందరంగా అనిపించదు. కావున మీరు బ్రాహ్మణ పరివారం యొక్క మాలలో ఉన్నారు అనగా సర్వ బ్రాహ్మణాత్మలకు సమీపంగా అయ్యారు. ఏ విధంగా తండ్రికి సమీపంగా ఉన్నారో, అలా తండ్రితో పాటు పరివారానికి కూడా సమీపంగా ఉన్నారు ఎందుకంటే ఈ పరివారం కూడా ఈ గుర్తించడంతో, పరిచయంతో ఇప్పుడు కలుసుకుంటారు. పరివారంలో ఆనందం కలుగుతుంది కదా? కేవలం తండ్రి స్మృతిలో ఆనందం కలుగుతుందని కాదు. యోగం పరివారంతో జోడించకూడదు కానీ ఒకరికొకరు సమీపంగా ఉండాలి. ఇంత పెద్ద రెండున్నర లక్షల మంది పరివారం ఏదైనా ఉంటుందా? (ఇప్పుడైతే 9-10 లక్షల మంది కన్నా పెద్ద పరివారం ఉంది) కావున పరివారం మంచిగా అనిపిస్తుందా లేక కేవలం బాబా మంచిగా అనిపిస్తారా? ఎవరికైతే కేవలం బాబా మంచిగా అనిపిస్తారో, వారు పరివారంలోకి రాలేరు. బాప్ దాదా పరివారాన్ని చూసి సదా హర్షిస్తారు మరియు సదా ప్రతి ఒక్కరి విశేషతలను చూసి హర్షితంగా ఉంటారు. ప్రతి బ్రాహ్మణాత్మ పట్ల ఇదే సంకల్పం ఉంటుంది, వాహ్ బ్రాహ్మణ-ఆత్మా వాహ్! చూడండి, తండ్రికి పిల్లల పట్ల ఇంత ప్రేమ ఉంది, అందుకే వస్తారు కదా, లేకపోతే పైన కూర్చుని కలిసేవారు. కేవలం పైనే కూర్చుని కలవరు. మీరు విదేశాల నుండి వస్తారు, అలాగే బాప్ దాదా కూడా విదేశం నుండి వస్తారు. అన్నింటికన్నా అత్యంత దూరమైన స్థానం నుండి వస్తారు కానీ క్షణంలో వస్తారు. మీరందరూ కూడా క్షణంలో ఎగిరే కళను అనుభవం చేస్తున్నారా? క్షణంలో ఎగరగలరా? సంకల్పం చేసారు మరియు చేరుకున్నారు అన్నంత డబల్ లైట్ గా ఉన్నారా. పరంధామము అని అనగానే చేరుకోవాలి, ఇలాంటి ప్రాక్టీస్ ఉందా? ఎక్కడా చిక్కుకోరు కదా? అప్పుడప్పుడు ఏవైనా మేఘాలు విసిగించడం లేదు కదా, కేర్ ఫుల్ గా (జాగ్రత్తగా) కూడా మరియు క్లియర్ గా (స్పష్టంగా) కూడా ఉన్నారు కదా.

డబల్ విదేశీ పిల్లలకు వచ్చీ రావడంతోనే సెంటర్లు లభిస్తాయి. చాలా త్వరగా టీచర్లుగా అవుతారు, అందుకే సేవ యొక్క ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ఆశీర్వాదాలు లభించేటువంటి విశేషమైన లిఫ్ట్ లభిస్తుంది, దానితో పాటు వస్తూనే ఎంతగా బిజీ అవుతారంటే ఇతర విషయాల కోసం తీరికే లభించదు, అందుకే బిజీగా ఉండడానికి భయపడకండి, ఇది గుడ్ సైన్ (శుభ సూచకము). చాలా మంది అంటారు కదా - లౌకిక కార్యం కూడా చేయాలి, ఇంకా అలౌకిక సేవ కూడా చేయాలి మరియు స్వయం యొక్క సేవ కూడా చేసుకోవాలి - ఇలా చాలా బిజీగా ఉండాల్సి ఉంటుంది. కానీ ఇలా బిజీగా ఉండడం అనగా మాయాజీతులుగా అవ్వడము. ఇది బాగా అనిపిస్తుందా లేక లౌకిక ఉద్యోగం చేయడం కష్టంగా ఉందా? ఏదైతే లౌకిక ఉద్యోగం చేస్తారో, అందులో ఏదైతే సంపాదన వస్తుందో, దానిని ఎక్కడ ఉపయోగిస్తారు? ఎలాగైతే సమయాన్ని ఉపయోగిస్తారో, అలా ధనాన్ని కూడా ఉపయోగిస్తారు. కావున తనువు-మనసు-ధనము, మూడూ ఉపయోగపడతాయి, సఫలమవుతాయి కదా, అందుకే అలసిపోకండి. సెంటరు తెరిస్తే, సందేశం వింటూనే ఎంతమంది ఆత్మల కళ్యాణం జరుగుతుంది. కనుక మనసుకు మరియు ధనానికి సంబంధముంది, ఎక్కడైతే ధనముంటుందో, అక్కడ మనసు ఉంటుంది. ఎక్కడైతే మనసు ఉంటుందో, అక్కడ ధనముంటుంది. డబల్ విదేశీయులు అన్ని రకాలుగా సఫలం చేసుకోవడంలో బిజీగా ఉండడాన్ని చూసి బాప్ దాదా సంతోషిస్తారు. అందరూ గోల్డెన్ ఛాన్సలర్లే. సదా గుర్తుంచుకోండి, నేను సఫలతా మూర్తిని మరియు సదా సఫలత నా మెడలోని హారము. ఏ కార్యం చేసినా, ముందుగా, సఫలత నా మెడలోని మాల అని అనుకోండి. ఎలాంటి నిశ్చయముంటుందో, అలాంటి ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. అచ్ఛా.

2. ఈ స్వీట్ సైలెన్స్ ప్రియంగా అనిపిస్తుంది కదా? ఎందుకంటే ఆత్మ యొక్క ఒరిజినల్ స్వరూపమే స్వీట్ సైలెన్స్. కనుక ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో, ఈ స్వీట్ సైలెన్స్ స్థితిని అనుభవం చేయగలరా? ఎందుకంటే ఆత్మ ఇప్పుడు ఈ బంధనాల నుండి ముక్తి అయ్యింది, అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ ఒరిజినల్ స్థితిలో స్థితులవ్వాలి. కావున బంధనముక్తులుగా అయ్యారా లేక అవ్వాలా? ఈ సారి మధుబన్ లో రెండు పదాలను విడిచి వెళ్ళండి - సమ్ థింగ్ మరియు సమ్ టైమ్. ఇది ఇష్టమే కదా? అందరూ వదిలేస్తారా? ధైర్యం పెడితే సహాయం లభిస్తుంది. ఎందుకంటే 63 జన్మలు అనేక బంధనాలలో ఉన్నాము మరియు కేవలం ఈ ఒక్క జన్మే స్వతంత్రంగా అయ్యేటువంటిది, దీని ఫలితంగానే అనేక జన్మలు జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకుంటామని మీకు తెలుసు. కనుక పునాదిని ఇక్కడే వేసుకోవాలి. పునాది అంత పక్కాగా ఉన్నప్పుడే 21 జన్మలు నడుస్తుంది. ఎంతగా స్వయంపై నిశ్చయం పెట్టుకుంటారో, అంతగా నషా ఉంటుంది. తండ్రిపై కూడా నిశ్చయము, స్వయంపై కూడా నిశ్చయము మరియు డ్రామాపై కూడా నిశ్చయము, మూడు నిశ్చయాలలో పాస్ అవ్వాలి. అచ్ఛా - ఒక్కొక్క రత్నానికి తమ-తమ విశేషత ఉంది. బాప్ దాదాకు అందరి విశేషతలు తెలుసు. ఇప్పుడిక మున్ముందు తమ విశేషతను కార్యంలో ఇంకా ఉపయోగిస్తే, ఆ విశేషత పెరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో ఖర్చు చేస్తే ధనం తక్కువైపోతుంది కానీ ఇక్కడ ఎంతగా ఉపయోగిస్తారో, ఖర్చు చేస్తారో, అంతగా పెరుగుతుంది. అందరూ అనుభవజ్ఞులే కదా. కనుక ఈ సంవత్సరం ఈ వరదానాన్ని గుర్తుంచుకోండి - నేను విశేష ఆత్మను మరియు విశేషతను కార్యంలో ఉపయోగించి ఇంకా ముందుకు తీసుకువెళ్తాను. ఏ విధంగా ఇక్కడ దగ్గరగా కూర్చోవడం మంచిగా అనిపిస్తుందో, అలా అక్కడ కూడా సదా దగ్గరగా ఉండండి. బాప్ దాదా సదా ప్రతి ఒక్కరినీ ఇదే శ్రేష్ఠమైన దృష్టితో చూస్తారు - ఒక్కొక్క బిడ్డ యోగి కూడా మరియు యోగ్యుడు కూడా. అచ్ఛా!

Comments