01-03-1990 అవ్యక్త మురళి

  01-03-1990         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘బ్రాహ్మణ జీవితం యొక్క పునాది - దివ్య బుద్ధి మరియు ఆత్మిక దృష్టి’’ 

ఈ రోజు దివ్య బుద్ధి విధాత మరియు ఆత్మిక దృష్టి దాత అయిన బాప్ దాదా నలువైపులా ఉన్న దివ్య బుద్ధిని ప్రాప్తి చేసుకునే పిల్లలను చూస్తున్నారు. బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరికీ ఈ రెండు వరదానాలు బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే ప్రాప్తించాయి. దివ్య బుద్ధి మరియు ఆత్మిక దృష్టి - ఇవి జన్మ సిద్ధ అధికారం రూపంలో అందరికీ లభించి ఉన్నాయి. ఈ వరదానాలు బ్రాహ్మణ జీవితం యొక్క పునాది. ఈ రెండు ప్రాప్తులనే జీవన పరివర్తన లేక మరజీవా జన్మ, బ్రాహ్మణ జీవితం అని అనడం జరుగుతుంది. గత జీవితము మరియు వర్తమాన బ్రాహ్మణ జీవితము - ఈ రెండింటి మధ్యన తేడా విశేషంగా ఈ రెండు విషయాలదే. ఈ రెండు విషయాలపై సంగమయుగీ పురుషార్థుల నంబరు తయారవుతుంది. ఈ రెండు విషయాలను సదా ప్రతి సంకల్పంలో, మాటలో, కర్మలో ఎవరు ఎంతగా ఉపయోగిస్తారో, అంతగానే ముందు నంబరును తీసుకుంటారు. ఆత్మిక దృష్టి, దృష్టితో వృత్తి, కృతి స్వతహాగానే మారిపోతాయి. దివ్య బుద్ధి ద్వారా స్వయం పట్ల, సేవ పట్ల, బ్రాహ్మణ పరివారంలోని సంబంధ-సంపర్కాల పట్ల సదా మరియు స్వతహాగా ప్రతి విషయంలోనూ నిర్ణయం యథార్థమైనదిగా ఉంటుంది మరియు ఎక్కడైతే దివ్య బుద్ధి ద్వారా యథార్థ నిర్ణయం జరుగుతుందో, అక్కడ నిర్ణయం ఆధారంగానే స్వయం, సేవ, సంబంధ-సంపర్కాలు యథార్థంగా శక్తిశాలిగా అవుతాయి. దృష్టి మరియు దివ్య బుద్ధినే ముఖ్యమైన విషయాలు.

ఈ రోజు బాప్ దాదా పిల్లలందరి దివ్య బుద్ధిని చెక్ చేస్తున్నారు. అన్నింటికన్నా ముందుగా దివ్య బుద్ధి యొక్క మొదటి నిర్ధారణ - వారు సదా తండ్రిని, స్వయాన్ని మరియు ప్రతి బ్రాహ్మణ ఆత్మను, వారు ఎవరో, ఎలా ఉన్నారో, అలానే తెలుసుకుని ఆ రూపంలో తండ్రి నుండి ఎంత తీసుకోవాలో, ఆ అధికారాన్ని సదా ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. తండ్రి ఎలాగైతే తయారుచేసారో, సేవకు నిమిత్తంగా పెట్టారో, బ్రాహ్మణ జీవితంలో తండ్రి ఏ విశేషతలను, దివ్య గుణాలను ఇచ్చారో, ఏ విధంగా నిమిత్తంగా చేసారో - ఆ విధంగా తమను తాము గుర్తించి ఆ ప్రమాణంగా స్వయాన్ని ముందుకు తీసుకువెళ్ళడము - దీనినే తండ్రిని, స్వయాన్ని మరియు బ్రాహ్మణ ఆత్మలను వారు ఎవరో, ఎలా ఉన్నారో అలా వారిని తెలుసుకుని ముందుకు తీసుకువెళ్ళడము అని అంటారు. ఇది దివ్య బుద్ధి యొక్క మొదటి నిర్ధారణ.

దివ్య బుద్ధి అనగా హోలీహంస బుద్ధి. హంస అనగా స్వచ్ఛత, పాలను మరియు నీటిని లేక ముత్యాలను మరియు రాళ్ళను గుర్తించి ముత్యాలను గ్రహించేటువంటిది. ఇవి రాళ్ళు, ఇవి ముత్యాలు అని తెలుసు కానీ రాళ్ళను ధారణ చేయదు, అందుకే హోలీహంస సంగమయుగీ జ్ఞాన స్వరూప విద్యాదేవి ‘‘సరస్వతి’’ యొక్క వాహనము. మీరంతా జ్ఞాన స్వరూపులు, అందుకే విద్యాపతులు లేక విద్యాదేవీలు. ఈ వాహనము దివ్య బుద్ధికి గుర్తు. బ్రాహ్మణులైన మీరందరూ బుద్ధియోగం ద్వారా మూడు లోకాలను విహరిస్తారు. బుద్ధిని కూడా వాహనమని అంటారు. అన్ని వాహనాల కన్నా తీవ్ర వేగం కలది. దివ్య బుద్ధిని బుద్ధి బలము అని కూడా అనడం జరుగుతుంది ఎందుకంటే బుద్ధి బలము ద్వారానే తండ్రి నుండి సర్వ శక్తులను క్యాచ్ చేయగలరు, అందుకే బుద్ధి బలమని అనడం జరుగుతుంది. ఎలాగైతే సైన్స్ బలము ఉంది, సైన్స్ బలము ఎన్ని హద్దు అద్భుతాలను చూపిస్తుంది! నేడు మానవుడికి అసంభవమని అనిపించే ఎన్నో విషయాలను అది సంభవం చేసి చూపిస్తుంది. కానీ అది వినాశీ బలము. సైన్స్ అనేది బుద్ధి బలమే కానీ దివ్య బుద్ధి బలము కాదు, అది ప్రాపంచిక బుద్ధి, అందుకే ఈ ప్రపంచం కోసము మరియు ప్రకృతి కోసమే ఆలోచించగలరు మరియు చేయగలరు. దివ్య బుద్ధి బలము మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారుచేస్తుంది, పరమాత్మను గుర్తించడాన్ని, పరమాత్మ మిలనాన్ని, పరమాత్మ ప్రాప్తిని అనుభూతి చేయిస్తుంది. దివ్య బుద్ధి ఏది కావాలనుకుంటే అది, ఎలా కావాలనుకుంటే అలా, అసంభవాన్ని సంభవం చేసేటువంటిది. దివ్య బుద్ధి ద్వారా ప్రతి కర్మలో పరమాత్మ ప్రేమను (పవిత్రమైన టచింగ్ ను) అనుభవం చేసి ప్రతి కర్మలో సఫలతను అనుభవం చేయగలరు. దివ్య బుద్ధి ఎటువంటి మాయ దాడినైనా ఓడించగలదు. ఎక్కడైతే పరమాత్మ టచింగ్ ఉంటుందో, పవిత్రమైన టచింగ్ ఉంటుందో, మిక్స్చర్ (కలగలపడము) ఉండదో, అక్కడ మాయ టచింగ్ లేక దాడి అసంభవము. మాయ రావడం కాదు కదా, అది కనీసం టచ్ కూడా చేయలేదు. మాయ దివ్య బుద్ధి ఎదురుగా సఫలత యొక్క వరమాలగా అవుతుంది, మాయ మాయగా ఉండదు. ఎలాగైతే ద్వాపరంలోని ఋషి-ముని ఆత్మలు సింహాన్ని కూడా తమ శక్తితో శాంతపరిచేవారు కదా. సింహం సాథీగా అవుతుంది, వాహనంగా అవుతుంది, ఆట వస్తువుగా అవుతుంది, పరివర్తన అవుతుంది కదా. మరి సతోప్రధానులు, మాస్టర్ సర్వశక్తివంతులు, దివ్య బుద్ధి వరదానులైన మీ ఎదురుగా మాయ ఏపాటిది! మాయ శత్రువు రూపం నుండి పరివర్తన అవ్వలేదా? దివ్య బుద్ధి బలము అతి శ్రేష్ఠమైన బలము. కేవలం దీనిని ఉపయోగించండి. ఎటువంటి సమయమో, ఆ విధితో ఉపయోగించినట్లయితే, సర్వ సిద్ధులు మీ అరచేతిలో ఉంటాయి. సిద్ధి అనేది ఏమంత పెద్ద విషయం కాదు, కేవలం దివ్య బుద్ధి యొక్క స్వచ్ఛత. ఎలాగైతే ఈ రోజుల్లో ఇంద్రజాలికులు చేతులతో చమత్కారం చేసి చూపిస్తారు కదా. ఈ దివ్య బుద్ధి యొక్క స్వచ్ఛత సర్వ సిద్ధులను అరచేతిలోకి తీసుకొస్తుంది. బ్రహ్మణాత్మలైన మీరందరూ సర్వ సిద్ధులను ప్రాప్తి చేసుకున్నారు. కానీ దివ్య సిద్ధులను, సాధారణమైనవాటిని కాదు. అందుకే ఈ రోజు వరకు కూడా భక్తులు మీ మూర్తుల ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునేందుకు వెళ్తారు. సిద్ధి స్వరూపులుగా అయ్యారు కావుననే భక్తులు మీ నుండి యాచించేందుకు వెళ్తారు. మరి దివ్య బుద్ధి యొక్క అద్భుతం ఏమిటో అర్థమయిందా! దివ్య బుద్ధి యొక్క అద్భుతం స్పష్టమయ్యింది కదా. కానీ ఈ రోజు ఏం చూసారు? ఏం చూసి ఉంటారు? టీచర్లు వినిపించండి.

టీచర్లు అయితే తండ్రి సమానంగా మాస్టర్ శిక్షకులుగా అయ్యారు కదా! టీచరు అనగా ప్రతి సంకల్పము, మాట మరియు ప్రతి క్షణము సేవలో ఉపస్థితులు - ఇటువంటి సేవాధారినే బాప్ దాదా టీచర్ అని అంటారు. ప్రతి సమయమైతే వాణి ద్వారా సేవ చేయలేరు, అలసిపోతారు కదా. కానీ మీ ఫీచర్స్ (ముఖ కవళికలు) ద్వారా ప్రతి సమయం సేవ చేయగలరు. ఇందులో అలసట యొక్క విషయం లేదు. ఇదైతే చేయగలరు కదా. టీచర్లు మాట్లాడే సేవనైతే యథాశక్తి మరియు సమయమనుసారంగానే చేయగలరు కానీ భవిష్య ఫరిశ్తా యొక్క ముఖ కవళికలు ఉండాలి. ఫరిశ్తా సంగమయుగం యొక్క భవిష్యత్తు, అదే ముఖ కవళికల్లో కనిపించినట్లయితే ఎంత మంచి సేవ జరుగుతుంది? జడ చిత్రాలు, వాటి ముఖ కవళికల ద్వారా అంతిమ జన్మ వరకు కూడా సేవ చేస్తున్నప్పుడు చైతన్య శ్రేష్ఠ ఆత్మలైన మీరు మీ ముఖ కవళికల ద్వారా సేవ సహజంగా చేయగలరు. మీ ముఖ కవళికల్లో సదా సుఖము, శాంతి, సంతోషం యొక్క మెరుపు ఉండాలి. ఎటువంటి దుఃఖమయమైన, అశాంత ఆత్మ అయినా సరే, ఆందోళనలో ఉన్న ఆత్మ అయినా సరే, మీ ముఖ కవళికల ద్వారా తమ శ్రేష్ఠ భవిష్యత్తును తయారుచేసుకోగలరు. ఇటువంటి అనుభవం ఉంది కదా. అమృతవేళ తమ ముఖ కవళికలను చెక్ చేసుకోండి. ఎలాగైతే శరీరం యొక్క ముఖ కవళికలను చెక్ చేసుకుంటారు కదా, అలా ఫరిశ్తా ముఖ కవళికల్లో సంతోషం, శాంతి, సుఖం యొక్క అలంకరణ, ఇది చెక్ చేసుకున్నట్లయితే స్వతహాగా మరియు సహజంగా సేవ జరుగుతూ ఉంటుంది. టీచర్లకు సహజమనిపిస్తుంది కదా. ఈ సేవనైతే 12 గంటలు చేయగలరు. ఈ వాణి సేవనైతే రెండు, నాలుగు గంటలే చేస్తారు. ప్లానింగ్ చేసే పని, భాషణ ఇచ్చే పని అయితే అలసిపోతారు, ఇందులోనైతే అలసిపోయే విషయమే లేదు. ఇది న్యాచురల్ కదా. ఆ మాటకొస్తే అందరూ అనుభవజ్ఞులే కానీ... బాప్ దాదా చూసారు, విదేశాలలో కుక్కలను మరియు పిల్లులను ఎక్కువగా పెంచుతూ ఉంటారు. అటువంటి ఆట బొమ్మలు కూడా ఇక్కడకు తీసుకొస్తారు. కావున అనుభవం చాలా బాగా చేస్తారు కానీ అప్పుడప్పుడు కుక్క వచ్చేస్తుంది, అప్పుడప్పుడు ఏదో ఒక పిల్లి వచ్చేస్తుంది, వాటిని తరిమేందుకు సమయాన్ని వెచ్చిస్తారు. కానీ ఈ రోజు వినిపించాము కదా, మాయ మీ సఫలత యొక్క మాలగా అవుతుంది. నిమిత్త సేవాధారులు అందరి మెడలో మాల వేసి ఉంది. సఫలత మాల ఉందా లేక అప్పుడప్పుడు మెడలో మాల ఉన్నా కూడా కనిపించని కారణంగా సఫలత లభించాలని బయట వెతుకుతూ ఉంటారా? రాణి కథను వినిపిస్తారు కదా. మెడలో హారం ఉన్నా కూడా బయట వెతుకుతూ ఉన్నారు, ఇలా అయితే చేయరు కదా. సఫలత ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క అధికారము. టీచర్లందరూ సఫలతామూర్తులు కదా లేక పురుషార్థీ మూర్తులు, శ్రమించే మూర్తులా? పురుషార్థం కూడా సహజ పురుషార్థము, శ్రమతో కూడినది కాదు. యథార్థ పురుషార్థం యొక్క పరిభాష ఏమిటంటే - న్యాచురల్ అటెన్షన్. చాలామంది, అటెన్షన్ పెట్టాలి కదా అని అంటారు. కానీ అటెన్షన్ టెన్షన్ లోకి మారిపోతుంది అనేది తెలియను కూడా తెలియదు. న్యాచురల్ అటెన్షన్ అనగా యథార్థ పురుషార్థి.

టీచర్లంటే బాప్ దాదాకు ప్రేమ, అందుకే శ్రమ చేయనివ్వరు. హృదయం యొక్క ప్రేమ అంటే ఇదే కదా. అచ్ఛా, ఇంకా ఏమేమి చూసారో మరో సారి వినిపిస్తాము! కొద్ది-కొద్దిగా వినిపిస్తాము. అందరి లోపల స్వయం యొక్క చిత్రమైతే వస్తూ ఉంది.

దేశ-విదేశాలలో సేవా వైభవం చాలా బాగుంది. భారత్ యొక్క కాన్ఫరెన్స్ కూడా చాలా బాగా సఫలం అయ్యింది. సఫలతకు గుర్తు ఏమిటంటే, సఫలత యొక్క సుగంధం ద్వారా వచ్చే ఆత్మలు తమ ఉల్లాస-ఉత్సాహాలతో సంఖ్యలో పెరుగుతూ ఉంటారు. మంచిగా ఉంది అన్నదానికి గుర్తు ఏమిటంటే అందరి లోపల - చూడాలి, వినాలి, పొందాలి అన్న కోరిక పెరుగుతుంది. ఇది మంచికి గుర్తు. కనుక సంఖ్య తక్కువ ఉంటుందని అనుకోకండి. ఒకవేళ మంచిగా చేసినట్లయితే కోరిక పెరుగుతుంది, సంఖ్య కూడా పెరుగుతుంది. విదేశీ రిట్రీట్ లో కావచ్చు, కాన్ఫరెన్స్ లో కావచ్చు, రెండింటి రిజల్టు రోజు-రోజుకు చాలా-చాలా మంచిగా కనిపిస్తూ ఉంది. అన్నింటికన్నా మంచి రిజల్టు ఏమిటంటే, ఇదివరకు విదేశాలలో, బ్రహ్మాకుమారీల పేరు మీద ఎవరూ రారు అని అనేవారు. ‘‘ఇప్పుడైతే డైరెక్ట్ బ్రహ్మాకుమారీల ఆశ్రమాలకు రిట్రీట్ లు చేసుకునేందుకు వెళ్తున్నారు, రాజయోగం నేర్చుకునేందుకు వెళ్తున్నారు’’ అని అనుకుంటున్నారు, కనుక ఇది పరదా నుండి బయటకు రావడము, ముసుగును తీసేసారు. మధుబన్ నివాసులు లేక సేవాధారులందరూ, భారత్ లోని అనేక స్థానాల నుండి వచ్చి సేవ చేసి ఉండవచ్చు, మధుబన్ నివాసులు మరియు నలువైపుల యొక్క సేవాధారులు, విషయాలను చూడకుండా, విశ్రాంతిని చూడకుండా, స్నేహంతో, మంచి అలసట లేని సేవను చేసారు, అందుకే బాప్ దాదా నలువైపులా ఉన్న అలసట లేని సేవకు సఫలత ప్రాప్తి చేసుకునే విశేషమైన పిల్లలకు సేవ యొక్క అభినందనలను, హృదయపూర్వకమైన అభినందనలను తెలుపుతున్నారు. శబ్దము మారుమోగుతూ నలువైపులా వ్యాపిస్తూ ఉంది. అచ్ఛా!

సర్వ దివ్య బుద్ధి ఆత్మిక వరదానీ ఆత్మలకు, సదా బుద్ధి బలాన్ని సమయమనుసారంగా, కార్యమనుసారంగా ఉపయోగించే జ్ఞాన స్వరూప ఆత్మలకు, సదా తమ ఫరిశ్తా ముఖ కవళికల ద్వారా అఖండ సేవ చేసే స్వతహా మరియు సహజ పురుషార్థీ ఆత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

డబల్ విదేశీ సోదరీ-సోదరుల యొక్క వేర్వేరు గ్రూపులతో అవ్యక్త బాప్ దాదా మిలనము

1) అందరూ తమ శ్రేష్ఠ భాగ్యాన్ని చూసుకుని హర్షితులుగా ఉంటారా? ఇంకా ఎంతోమంది వచ్చినా కానీ, మీ భాగ్యమైతే సదా ఉండనే ఉంది. మీరు వారిని ముందు పెట్టినా కూడా, మీరే ముందు ఉంటారు ఎందుకంటే ముందు పెట్టేవారు స్వతహాగానే ముందు ఉంటారు. ఇతరులను ముందు పెట్టడంతో మీ పుణ్యం జమ అవుతుంది. కనుక ముందుకు వెళ్ళిపోయారు కదా! సదా ప్రతి అడుగులో ఈ లక్ష్యం ఉండాలి, ముందుకు వెళ్ళాలి మరియు తీసుకువెళ్ళాలి. ఎలాగైతే తండ్రి పిల్లలను ముందుంచారు, స్వయం బ్యాక్ బోన్ గా ఉన్నారు కానీ పిల్లలను ముందుంచారు, మరి ఫాలో ఫాదర్ చేసేవారు కదా. ఎంతగా ఇక్కడ తండ్రిని ఫాలో చేస్తారో, అంతగా విశ్వ రాజ్య సింహాసనంపై నంబరువారుగా ఫాలో చేస్తారు. సింహాసనం తీసుకోవాలా లేక సింహాసనాధికారిని చూడాలా? (సింహాసనంపై కూర్చోవాలి). సత్యయుగంలోనైతే ఎనిమిది మంది కూర్చుంటారు, మరి ఏం చేస్తారు? కొద్ది సమయం కోసం ట్రై చేస్తారా! విశ్వ మహారాజు తమ మహల్లోకి వెళ్ళినప్పుడు మీరు కూర్చుని చూస్తారా! ఏం చేస్తారు? ఎంతగా ఈ సమయంలో సదా తండ్రితో పాటు తింటారో-తాగుతారో, ఉంటారో, ఆడుకుంటారో, చదువుకుంటారో అంతగా అక్కడ తోడుగా ఉంటారు. మరి బ్రహ్మాబాబాపై చాలా ప్రేమ ఉంది కదా. బ్రహ్మాబాబాకు, బ్రహ్మాకుమారులు మరియు కుమారీలు ప్రియమైనవారని బాప్ దాదాకు కూడా సంతోషముంది! బ్రహ్మాబాబాతో పాటు అనేక జన్మలు సమీపంగా ఉంటారు మరియు తోడుగా ఉంటారు. 21 జన్మల గ్యారంటీ అయితే ఉంది - భిన్న నామ-రూపాలతో బ్రహ్మా ఆత్మతో పాటు సంబంధంలో ఉంటారు. ఇది మనసులో అనిపిస్తుందా లేక విన్నారు కాబట్టి అంటున్నారా? ఫీలింగ్ కలుగుతుందా? ఎంతగా సమీపత యొక్క స్మృతి ఉంటుందో, అంతగా న్యాచురల్ నషా, నిశ్చయం స్వతహాగా ఉంటాయి. హృదయంలో సదా అనుభవం చేయండి, ఏమనంటే, అనేక సార్లు తండ్రికి సహచరులుగా అయ్యారు, ఇప్పుడు కూడా ఉన్నారు, అనేక సార్లు అలా అవుతూ ఉంటారు. పిల్లల అవినాశీ పురుషార్థం చూసి బాప్ దాదాకు విశేషమైన సంతోషం కలుగుతుంది. సదా తల్లిదండ్రులకు మరియు పరివారానికి చిన్న పిల్లల పట్ల విశేషమైన ప్రేమ ఉంటుంది మరియు అందరి ప్రేమనే వారిని ముందుకు తీసుకువెళ్తుంది. బాప్ దాదా సదా చూస్తూ ఉంటారు, ఏ బిడ్డ ఎంత ముందుకు వెళ్తున్నాడు మరియు సేవలో ఎంత వృద్ధి చేస్తున్నాడు! కనుక సదా ఇదే వరదానాన్ని స్మృతిలో ఉంచుకోండి, సదా నిరంతరం మరియు న్యాచురల్ పురుషార్థం ఉండాలి. ఈ సంవత్సరం ఈ వరదానాన్ని స్మృతిలో ఉంచుకుని స్మృతి స్వరూపులుగా అవ్వాలి. ఈ వరదానం పర్సనల్ గా నా వరదానము అని ప్రతి ఒక్కరూ భావించాలి! అచ్ఛా!

అందరూ బిజీగా ఉంటారు కదా! ఎవరైతే బిజీగా ఉంటారో, వారి వద్దకు మాయ రాదు ఎందుకంటే వారి వద్ద మాయను రిసీవ్ చేసుకునే సమయమే లేదు. మరి ఇంత బిజీగా ఉంటున్నారా లేక అప్పుడప్పుడు రిసీవ్ చేసుకుంటున్నారా? బ్రాహ్మణులుగా అయ్యిందే ఎందుకు? బిజీగా ఉండడం కోసం కదా. బాప్ దాదా సరదాగా అంటారు, బిజీగా ఉండేవారే అత్యంత పెద్ద బిజినెస్ మ్యాన్ అని. రోజంతటిలో ఎంత పెద్ద బిజినెస్ చేస్తారు? లెక్క తెలుసా? లెక్క చూసుకోవడం వచ్చా? ప్రతి అడుగులో పదమాల సంపాదన. అడుగులో పదమము - మొత్తం కల్పంలో ఇటువంటి బిజినెస్ ను ఎవ్వరూ చేయలేరు. కనుక ఎంతగా జమ అవుతుందో, ఆ జమ యొక్క సంతోషం ఉంటుంది. అందరికన్నా ఎక్కువ సంతోషం ఎవరికి ఉంటుంది? నషాతో చెప్పండి, మేము సంతోషంగా ఉండకపోతే ఇంకెవరు ఉంటారు! ఈ నషా కూడా ఉండాలి కానీ నిర్మానముగా కూడా ఉండాలి. ఎలాగైతే మంచి వృక్షం యొక్క గుర్తు ఏమిటంటే - ఫలాలతో ఉంటుంది కానీ వంగి ఉంటుంది. ఇటువంటి నషా ఉందా? కనుక రెండూ కలిసి ఉండాలి. మీ అందరి న్యాచురల్ జీవితము ఇలా తయారైంది, ఎవరిని చూసినా సరే, వీరు ఒకే పరివారం యొక్క ఆత్మలు అనే స్మృతితో చూస్తారు, అందుకే నష్టపరిచే నషా కాదు. ప్రతి ఆత్మ పట్ల హృదయపూర్వకమైన ప్రేమ స్వతహాగానే ఇమర్జ్ అవుతుంది. ఎప్పుడూ ఎవరి పట్ల ద్వేషం కలగజాలదు. ఎప్పుడైనా ఎవరైనా నిందించినా కూడా ద్వేషం రాజాలదు, ప్రశ్న ఉత్పన్నమవ్వజాలదు. ఎక్కడైతే ప్రశ్నార్ధకం ఉంటుందో, అక్కడ అలజడి తప్పకుండా ఉంటుంది. ఫుల్ స్టాప్ పెట్టేవారు ఫుల్ పాస్ అవుతారు. ఎవరి వద్దనైతే శక్తుల ఫుల్ స్టాక్ ఉంటుందో, వారే ఫుల్ స్టాప్ పెట్టగలరు. అచ్ఛా!

బాప్ దాదా వీడ్కోలు సమయంలో పిల్లలందరికీ హోలీ శుభాకాంక్షలను తెలిపారు

పవిత్రమైన పిల్లలకు సదా హోలీనే. సదా జ్ఞాన రంగులో రంగరించబడి ఉంటారు, అందుకే ప్రత్యేకంగా రంగు వేసుకునే అవసరమే ఉండదు. వీరైతే వేసుకోరు కూడా కదా! విదేశాలలో వేసుకోరు. అదైతే మనోరంజనము. ఇకపోతే, రంగులో రంగరించబడి మిక్కీమౌస్ గా అవ్వవద్దు. సదా హోలీ హంసలు, హోలీ (పవిత్రం)గా ఉండేవారు మరియు హోలీని జరుపుకునేవారు, ఇతరులపై కూడా హోలీ (పవిత్రం)గా చేసే రంగును వేస్తారు. పిల్లలందరికీ హోలీ శుభాకాంక్షలు మరియు దానితో పాటు ఉల్లాస-ఉత్సాహాల జీవితంలో ఎగురుతున్నందుకు అభినందనలు. అచ్ఛా!

Comments