31-12-2011 అవ్యక్త మురళి

           31-12-2011         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

“నూతన సంవత్సరంలో తీవ్ర పురుషార్థీ భవ అనే వరదానంతో మీ ముఖం ద్వారా ఫరిస్తా రూపాన్ని చూపించండి. లైట్-మైట్ స్వరూపులై జ్వాలాముఖి యోగం ద్వారా వ్యర్థాన్ని కాల్చి వేయండి. దుఃఖంతో, అశాంతితో ఉన్న ఆత్మలకు శక్తులను దానం చెయ్యండి." 

ఈరోజు బ్రాహ్మణ పరివార రచయిత తన నలువైపుల ఉన్న పరివారాన్ని చూస్తున్నారు. ఇది చిన్న పరివారము, చిన్న ప్రపంచము కానీ చాలా ప్రియమైనది. ఎందుకంటే కోట్లలో కొద్దిమంది కదా. ఎందుకు ప్రియమైనవారు? తండ్రిని గుర్తించారు కనుక. బాబా నుండి వారసత్వానికి అధికారులుగా అయ్యారు. కనుక, ఎలా అయితే బాబా ప్రియమైనవారో అలాగే బ్రాహ్మణ పరివారము కూడా ప్రియమైనదే. పిల్లలు జన్మించగానే బాప్ దాదా వారి మస్తకంపై అదృష్ట సితారలు మెరిసేలా చేసారు. అందుకే ఈ చిన్న ప్రపంచము చాలా ప్రియమైనది. మీ అందరికీ కూడా మీకున్న ఇంతటి స్వమానం గురించి తెలుసు కదా! బాప్ దాదా కూడా పిల్లలు ఒక్కొక్కరినీ చూసి చాలా సంతోషిస్తున్నారు మరియు ఏ పాటను పాడుతారు? వాహ్ పిల్లలూ వాహ్!

ఈరోజు అందరూ ఈ శ్రేష్టమైన రోజున బాబాను కలుసుకోవడానికి వచ్చారు. ఈరోజు సంగమం జరిగే రోజు. వీడ్కోలు కూడా మరియు అభినందనలు కూడా. సంగమానికి ముందునుండీ మహత్వము ఉంది. సాగరము మరియు నదుల సంగమం ఎక్కడ జరిగినా దాని మహత్వము ఉంటుంది. అలాగే ఈనాటి మహత్వము కూడా చాలా గాయన యోగ్యమైనది. పాత సంవత్సర సమాప్తము మరియు నూతన సంవత్సర ఆరంభము కానున్నాయి. ఈ రోజు అందరి మనసులలో రాబోవు క్రొత్త సంవత్సరం కోసం ఎంతో ఉత్సాహం ఉంది కదా! ప్రతి ఒక్కరూ ఏమి వదలాలి మరియు ఎలా అవ్వాలి అని ప్లాన్ వేసుకున్నారు కదా! రెండింటి ప్లాన్ ను వేసుకున్నారు కదా! వేసుకున్నారా? ఎవరైతే రాబోవు సంవత్సరంలో స్వ ఉన్నతి కోసం, తీవ్ర పురుషార్థం కోసం ప్లాన్ వేసుకున్నారో వారు చేతులెత్తండి. ప్లాన్ తయారు చేసుకున్నారు కదా! అభినందనలు. బాప్ దాదా పిల్లల నుండి ఏమి ఆశిస్తున్నారో అందరికీ తెలుసు. పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలన్నది బాప్ దాదా శుభ భావన. ఇప్పుడైతే సమయము కూడా సహాయాన్ని అందిస్తుంది. మరి ప్రతి ఒక్కరూ తమ మనసులో తమ కోసం క్రొత్త ప్లాన్‌ను తయారు చేసుకున్నారు కదా! కొంత వదిలిపెట్టాలి మరియు కొంత ముందుకు వెళ్ళాలి. ఏమి వదలాలి? పాత ప్రపంచము మరియు పాత సంబంధాలను వదిలిపెట్టే పురుషార్థంపై అందరి అటెన్షన్ ఉండటాన్ని బాప్ దాదా చూసారు. పాత సంస్కారాలను వదలాలని అనుకుంటారు కూడా కానీ వదలడానికి పిల్లలింకా కష్టపడుతూ ఉండటాన్ని బాప్ దాదా చూసారు. కనుక, ఈ క్రొత్త సంవత్సరంలో పిల్లలు ప్రతి ఒక్కరూ తమ నిజ సంస్కారాలను సంస్కారం చేసుకోండి. మీరందరూ కూడా ఈ సంకల్పాన్ని పూర్తి చెయ్యాలనుకుంటున్నారు కదా! పాత సంస్కారాలను మీరు 'నేచర్' అని అంటారు, నా భావము అలా లేదు కానీ నా 'నేచర్' అని అంటారు. ఈ 'నేచర్' ఈ వర్తమాన బ్రాహ్మణ జన్మ సంస్కారం కాదు, అది పాత సంస్కారము. ఆ పాత సంస్కారాన్ని ఈ రోజు, ప్రతి ఒక్కరికీ స్వయం గురించి తెలుసు, కనుక ఈరోజు పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు ఆ పాత సంస్కారాన్ని కూడా వదిలిపెట్టే దృఢ సంకల్పాన్ని చెయ్యగలరా? చెయ్యగలరా? కోరుకుంటారు కూడా, కోరుకోవడం లేదని కూడా కాదు కానీ అయినప్పటికీ మాటిమాటికీ పురుషార్థంలో తీవ్రతను తీసుకువచ్చే దానిలో ఆ సంస్కారమే భిన్న భిన్న రూపాలలో వచ్చి విఘ్నం వేస్తుంది. కనుక బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే సంవత్సరానికి వీడ్కోలును ఇవ్వడంతో పాటు ఈరోజు ఆ పాత సంస్కారానికి కూడా వీడ్కోలు చెప్పండి. ఇందుకు తయారుగా ఉన్నారా, తయారుగా ఉన్నవారు చేతులెత్తండి. ఇందుకోసం ఏమి చేస్తారు? మీకోసం ఏమైనా ప్లాన్ ఆలోచించారా? ఇందుకు అన్నిటికన్నా మంచి విషయం - దృఢ సంకల్పం. సంకల్పం ఉంది, అవ్వాలి అని ఉంది కానీ సంకల్పంలో తీవ్రత అవసరము. ఎలా అయితే బ్రాహ్మణులుగా అవ్వడంతో పాటు అశుద్ధ భోజనాన్ని స్వీకరించము అని కూడా ప్రతిజ్ఞ చేసారో ఇందులో దృఢ సంకల్పం ద్వారా మెజారిటీ పాస్ అవ్వడాన్ని బాప్ దాదా చూసారు. ఎలా అయితే తనువు కోసం అశుద్ధ భోజనం గురించి సంకల్పం చేసారో మరియు ప్రాక్టికల్ గా చేస్తున్నారో అలాగే ఎప్పుడూ ఎవ్వరి పట్ల ఎటువంటి పరిస్థితులలోనూ వ్యర్థ సంకల్పాలను చెయ్యకుండా సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామనలను ఉంచుతాను అని మనసు కోసం కూడా సంకల్పం చెయ్యండి. మనసుకు సంకల్పాలే భోజనము. తనువుకోసం మెజారిటీ దృఢ సంకల్పం చేసినట్లుగా అలాగే మనసు కోసం వ్యర్థ సంకల్పాలు, అశుద్ధ భావనలను తొలగించలేరా? ప్రతి ఆత్మ పట్ల హృదయపూర్వక స్నేహము మరియు సహయోగాన్ని మీ మనసులో నిలుపుకోలేరా?

ఈరోజు ఈ పాత సంవత్సరంతో పాటు ఇటువంటి వృత్తి మరియు దృష్టి అందరి నుండి వీడ్కోలు తీసుకోవాలని బాప్ దాదా ఆశిస్తున్నారు. ఈ దృఢ సంకల్పాన్ని చెయ్యగలరా? చెయ్యగలరా? చెప్పండి, మాతలు, టీచర్లు, అన్నయ్యలు కూడా అందరూ కోరుకుంటున్నారు. రేపటి నుండి ఏ ఆత్మ గురించైనా ఒకవేళ వ్యర్థం వస్తే, వ్యర్థ భావన మరియు వ్యర్థ భావములకు ఈరోజు సమాప్తి సమారోహమును జరపండి. చెప్పండి, టీచర్లు ఇందుకు సిద్ధంగా ఉన్నారా? టీచర్లు రెండ్రెండు చేతులెత్తండి. ఎత్తండి. అచ్చా. ఎవరైతే చేతులు ఎత్తలేదో వారు లేవండి. ఎవరైతే చేతులెత్తలేదో వారు కాస్త లేచి నిల్చోండి. మంచిది. మేము పురుషార్ధం చేస్తాము కానీ దృఢ సంకల్పం చెయ్యము అనేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరైతే లేచారో వారు లక్ష్యాన్ని మరియు పురుషార్థాన్ని చేస్తాము అని అంటారో వారు చేతులెత్తండి. ఎందుకంటే సమయం గురించి అటెన్షన్ ఉంచాలి. అందరూ ఈ సంగమ సమయంలోనే భవిష్య బహుకాలపు సఫలతను పొందాలి కదా! 21 జన్మల వారసత్వాన్ని తీసుకోవాలి. ఎక్కడ ఈ ఒక్క జన్మ, ఎక్కడ ఆ 21 జన్మలు! ఈ ఒక్క జన్మలోనే ఎంతో సమయము తీవ్ర పురుషార్థం చెయ్యాల్సి ఉంటుంది అప్పుడే కలగనున్న బహు కాలపు ప్రాప్తులను పొందగలరు. బాబాపై ప్రేమ ఉంది అంటే బాబాతో పాటు ఉండాలి కదా. సమీపంగా ఉండాలి కదా! బ్రహ్మబాబాతో పాటు ఉండి రాజ్య అధికారులుగా అవ్వాలి కదా! మరి ఈ సమయంలోనైనా బాబా సమానంగా అవ్వాలి కదా. బ్రహ్మబాబాకు పిల్లలందరిపై ఎంత ప్రేమ ఉందో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ 'నా బాబా' అని అంటారు. బాబాకు నాపై ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ మరెవ్వరికీ లేదు. నాపై బాబాకు ఎంతో ప్రేమ ఉంది. మరి ఈ ప్రేమ, బాప్ దాదా ఇద్దరి ప్రేమ ఈ జన్మలోనే అనుభవం చేసుకుంటున్నారు. ఎవరిపై అయితే ప్రేమ ఉంటుందో వారి మాటలను త్రోసిపుచ్చరు. మరి బ్రహ్మబాబాపై అందరికీ ప్రేమ ఉంది కదా, ఎంత ప్రేమ ఉంది? చాలా ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉంది అని చూపించలేకపోయినా కానీ పిల్లలకు ప్రేమ ఉంది అని బాబాకు తెలుసు, నంబరువారీగా ఉంది కానీ ప్రేమ అయితే ఉంది. ఈ విషయంలో బాప్ దాదా కూడా పిల్లలందరికీ సర్టిఫికేట్ ను ఇస్తున్నారు. ప్రేమ అయితే ఉంది కానీ పిల్లలు అప్పుడప్పుడూ అల్లరి చెయ్యడాన్ని బాప్ దాదా చూసారు. ఆ సమయంలో బాబా ఏమి చేస్తారు? అది చూసి బాబా విశేషంగా శక్తిని దానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరూ రాజా పిల్లలు. ప్రపంచంలో అతి ప్రియమైన పిల్లలను రాజాబాబు అని అంటారు. నిజానికి రాజు పిల్లలు కాకపోయినా రాజాబాబు అని పిలుస్తారు. కానీ మీరందరూ బాప్ దాదాకు ఇప్పుడు కూడా రాజా పిల్లలే, భవిష్యత్తులో కూడా రాజా పిల్లలే. ఇప్పుడు స్వమానము ఉంది, స్వరాజ్యము ఉంది. ఇప్పుడు ఆత్మ రాజ్యము సర్వ కర్మేంద్రియాలపై ఉంది. కనుక ఇప్పుడు స్వరాజ్యాధికారులు, భవిష్యత్తులో విశ్వ రాజ్యాధికారులు. మరి రాజా పిల్లలే కదా. అవును అనుకుంటే తల ఊపండి.

ఈరోజు బాప్ దాదా అమృతవేళ నలువైపుల, దేశవిదేశాలలో, నలువైపుల చుట్టి వచ్చారు. ఏమి చూసారు? అమృతవేళ సమయంలో యోగంలో మెజారిటీ కూర్చుంటారు, స్నేహం కారణంగా కూర్చుంటారు, బాప్ దాదాతో మాట్లాడుతారు కూడా, ఆత్మిక స్థితిలో కూడా కూర్చుంటారు, బాప్ దాదా నుండి శక్తిని కూడా తీసుకుంటారు కానీ రాబోయే కొత్త సంవత్సరంలో బాప్ దాదా నవీనతను ఆశిస్తున్నారు. ఎందుకంటే సమయము ఇప్పుడు రోజురోజుకూ నాజూకుగా అవుతుంది. ఇటువంటి సమయంలో ఇప్పుడు జ్వాలాముఖి యోగము కావాలి. అటువంటి జ్వాలాముఖి యోగము ఇప్పుడు అవసరము. జ్వాలాముఖి యోగము అనగా లైట్ మైట్ శక్తిశాలి స్వరూపము, ఎందుకంటే సమయానుసారంగా ఇప్పుడు దుఃఖము, అలజడులు పెరగనున్నాయి. అందుకే దుఃఖంలో, కలవరంతో ఉన్న ఆత్మలకు విశేష జ్వాలాముఖి యోగం ద్వారా శక్తులను ఇవ్వవలసిన అవసరము ఉంది. దుఃఖము, అశాంతికి బదులుగా ఏదైనా ఒక శక్తిని, శాంతిని తమ మనసా సేవ ద్వారా ఇవ్వవలసి ఉంటుంది. 'ఒక్క పరివారము' అని మీరిప్పుడు టాపిక్ పెట్టారు కదా. దాని అనుసారంగా ఒకే పరివారం అనుకున్నప్పుడు అశాంతితో ఉన్న ఆత్మలకు ఏదో ఒక దానాన్ని ఇస్తారు. అందుకే బాప్ దాదా రాబోవు క్రొత్త సంవత్సరానికి అటెన్షన్ ఇప్పిస్తున్నారు - ఇప్పుడు జ్వాలాముఖి యోగము అవసరము. జ్వాలాముఖి యోగము ద్వారానే మిగిలి ఉన్న పాత సంస్కారాలన్నీ భస్మమైపోతాయి. 

అడ్వాన్స్ పార్టీలో ఉన్న మీవారంతా ఇదే కోరుకుంటున్నారు - ఇప్పుడు సమయాన్ని, సమాప్తమయ్యే సమయాన్ని ఎదురుగా చూడండి. ఇప్పుడు రిటర్న్ జర్నీ(తిరుగు ప్రయాణం) అని గుర్తుంచుకోండి. “ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి” అన్న వాక్యాన్ని మీ దాదీ(మన్మోహిని) గుర్తు చేసుకుంటున్నారు. “నేను ఇప్పుడు సంపన్నంగా అవ్వాలి, సంపూర్ణంగా అవ్వాలి అన్న పాట నాకు సదా గుర్తుండేది” అని దాదీ అనేవారు. ఈ రోజు విశేషంగా అమృతవేళ వతనంలో బాప్ దాదాతో మిలనం జరుపుకుంటూ అడ్వాన్స్ పార్టీవారు ఏమని చెప్తున్నారంటే, ఏ దాదీలైతే వెళ్ళారో, మా అందరి తరఫున 'జ్వాలాముఖి యోగము' అవసరము అని చెప్తున్నాము. అది ఇతరులను శక్తిశాలిగా చేసేందుకు అవ్వచ్చు లేక తమ బ్రాహ్మణ పరివారమును సంపన్నంగా చెయ్యడానికి కావచ్చు. ఇప్పుడు సమయాన్ని సమీపానికి తీసుకువచ్చేందుకు మీరు నిమిత్తులు. అందుకే రాబోవు సంవత్సరంలో ఏమి చేస్తారు? విశేషంగా ఏమి చేస్తారు? ఒకరకొకరు స్నేహి, సహయోగిగా అయ్యి ప్రతి ఒక్క సెంటరు, సేవాస్థానంలో జ్వాలాముఖి యోగము మరియు వైబ్రేషన్లు. కర్మలలో ఒకరకొకరు సహయోగులుగా అయ్యి ప్రతి ఒక్కరిపై అటెన్షను పెడ్తూ వారిలోని లోపాలు తొలగిపోయేందుకు సహయోగమును అందించండి. మనసు ద్వారా ఇతరాత్మలకు సేవను చెయ్యండి మరియు మీ సహయోగము ద్వారా తోటి బ్రాహ్మణులకు విశేష సేవను చెయ్యండి. అప్పుడు మన మనసులోని ఆశ పూర్తవుతుంది.

ఈరోజు వతనంలో అడ్వాన్స్ పార్టీవారు రాబోవు సంవత్సరానికి మీ అందరి కోసం ప్రియస్మృతులను తెలిపారు మరియు వారి మనసులోని ఆశలను కూడా వినిపించారు. మరి చెప్పండి, బాప్ దాదా సంకల్పమైతే విన్నారు కానీ దానితోపాటు మీ దాదీల మనసులోని క్రొత్త సంవత్సర శుభ భావనలను కూడా విన్నారు కదా! బాప్ దాదా పిల్లలందరికీ బలహీనులైనా, తీవ్ర పురుషార్థీలైనా అందరికీ మూడు శుభాకాంక్షలను తెలుపుతున్నారు - ఒకటి, క్రొత్త జీవితానికి శుభాకాంక్షలు, రెండు, నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు మరియు మూడు, నూతన ప్రపంచంలో కలిసి వెళ్తున్నందుకు శుభాకాంక్షలు.

ఎప్పటి లోపు బాబా సమానంగా అవుతాను అని అందరూ మీకు మీరే ఒక సమయాన్ని నిర్ధారించుకోండి. మీకోసం మీరే నిర్ధారించుకోండి. నిర్ధారించుకోవడం వచ్చు కదా? బాప్ దాదా అయితే ఈ రోజు పిల్లలందరినీ చూస్తూ ఈ వరదానాన్ని ఇస్తున్నారు - రాబోయే సంవత్సరంలో పిల్లలందరూ తీవ్ర పురుషార్థీలుగా అవ్వాలి.' అమృతవేళ స్మృతిలో కూర్చున్నప్పుడు, లేచే సమయంలో బాప్ దాదా ఇచ్చిన ఈ వరదానాన్ని గుర్తుంచుకోండి - తీవ్ర పురుషార్థీ భవ. బాప్ దాదా రెండు విషయాలపై ముందు కూడా అటెన్షన్ ఇప్పించి ఉన్నారు. ఎందుకంటే ఈ సంగమ సమయము అకస్మాత్తుగా సమాప్తం కానుంది. కనుక, ఒకటి - సమయము, రెండు, సంకల్పము. రెండింటిపై ప్రతి క్షణం అటెన్షన్ ఉంచండి. పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ క్రొత్త సంవత్సరంలో ఎలా అవుతారు? ఎలా అవుతారు? ఎవరు మీ ముఖమును చూసినాకానీ మీ ముఖము ద్వారా వారికి ఫరిస్తా రూపం కనిపించాలి. ఫలానా వారు, ఫలానా వారు అని కాదు. ఫరిస్తా అనుభవం కావాలి. ఇందుకోసం జ్వాలాముఖి  యోగము, వ్యర్థము కాదు. లైట్ మరియు మైట్ స్వరూప యోగముతో వ్యర్థాన్ని కాల్చి వేయండి. సమర్థమైన ఫరిస్తా కనిపించాలి. మీలో ఎవరిని చూసినా ఇలాగే అనిపించాలి. ఎందుకంటే మీరందరూ బాబాకు అతి ప్రియమైనవారు కదా. బాబా మిమ్మల్నందరినీ ప్రత్యేకంగా ఎక్కడెక్కడినుండో ఎంచుకున్నారు. 'నేను బ్రాహ్మణ సో ఫరిస్తా' అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. అమృతవేళలో, మీ దినచర్యలో 'నేను బ్రాహ్మణ సో ఫరిస్తా' అని గుర్తుంచుకోండి. నడుస్తూ తిరుగుతూ ఉన్న ఫరిస్తా స్వరూపము. ఫరిస్తా స్వరూపమైతే మంచిగా అనిపిస్తుంది కదా! బ్రహ్మబాబా ఫరిస్తా అయ్యారు, ఫాలో ఫాదర్.

ఈ సంవత్సరం 'తీవ్ర పురుషార్థీ భవ' అన్న వరదానాన్ని ఇవ్వడం జరిగింది, సాధారణ పురుషార్థం కాదు. సాధారణ పురుషార్థం ఉన్నట్లయితే రాజ్యంలోకి కలిసి రారు. బాబా కోరుకునేదేమిటంటే ఎంతమంది విద్యార్థులున్నారో, ఎంతమంది బాప్ దాదా మురళిని అధ్యయనం చేస్తున్నారో, ఈశ్వరీయ విద్యార్థులు అందరూ ఎలా అవుతారు? ఫరిస్తా. భారమంతా తొలగిపోతుంది. సంస్కార భారము కూడా తొలగిపోతుంది. మరి ఈ సంవత్సరానికి ఏ హోమ్ వర్కును చేస్తారు? ఫరిస్తా స్వరూపంలో ఉండాలి. దీనినే తీవ్ర పురుషార్థము అని అంటారు. ఇప్పుడు ప్రతి సెంటరు, ప్రతి వారము, ప్రతి విద్యార్థి రిజల్టు తీవ్ర పురుషార్థంతో ఉందా అని చూడటం జరుగుతుంది. ఏదైనా పరిస్థితి వస్తే, వారికి సహయోగాన్ని అందించండి. స్నేహంతో వారికి ధైర్యాన్ని ఇవ్వండి మరియు తమ సెంటరును, విద్యార్థిని తీవ్ర పురుషార్ధిగా చెయ్యండి, వారం రిజల్టును చూడండి ఎందుకంటే సమయం అలజడుల సమయము. ఈ రోజు ఈ సంగమ రోజున వీడ్కోలు మరియు శుభాకాంక్షల సమయంలో, పిల్లలు ఎవరు ఎక్కడ కూర్చున్నా కానీ అందరినీ బాప్ దాదా చూస్తున్నారు. సైన్సు సాధనాల ద్వారా చూస్తున్నారు కూడా. చూసి ఎంత సంతోషిస్తున్నారు! నలువైపుల ఉన్న పిల్లలకు బాప్ దాదా విశేషమైన వరదానాన్ని ఇస్తున్నారు - 'సదా సంతుష్టమణి భవ'. సంతుష్టంగా ఉండండి మరియు సంతుష్టంగా చెయ్యండి. అచ్ఛా.

సేవ టర్న్ - ఈస్టర్న్, తమిళనాడు మరియు నేపాల్ వారిది: - (15 వేలమంది వచ్చారు) బెంగాల్ - బెంగాల్ లో ప్రతి ఒక్కరూ సేవ మరియు పురుషార్థము మంచిగా చేస్తున్నారు. పిల్లలందరూ తమ అదృష్టాన్ని మంచిగా చేసుకున్నందుకు బాప్ దాదా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. సేవ కూడా ప్రతి ఒక్కరూ యథాశక్తి చేస్తున్నారు. అందుకే బాప్ దాదా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు సదా సంతోషంలో ఉన్నారు, సదా సంతోషంగా ఉంటారు. 

సేవాధారులందరినీ నిల్చోమన్నారు:- క్లాసులోని మూడువంతులు వీరితోటే నిండిపోయింది. బాప్ దాదా ఏమి చూసారంటే ఎన్ని జోన్లు ఉన్నాయో వాటి అన్నింటిలోకి ఇది పెద్ద జోన్. ఒక్క జోన్లో చిన్న చిన్న జోన్లు ఉన్నాయి. పిల్లలు ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారు నిమిత్తంగా ఉంటూ సేవను చేస్తున్నారు. వృద్ధి కూడా బాగా జరుగుతుంది. ఎందుకంటే బాప్ దాదా ఏమి చూసారంటే ఈ ఒక్క జోన్లోనే ఎన్ని జోన్లు ఉన్నాయి కానీ అందరూ నిర్విఘ్నంగా, తమ పురుషార్థంలో సురక్షితంగా ఉన్నారు, ఇందుకు బాప్ దాదా శుభాకాంక్షలను తెలుపుతున్నారు. ఒకవేళ ఎవరిలోనైనా ఏదైనా లోపము ఉంటే రాబోవు సంవత్సరంలో, 'మేమందరమూ నిర్విఘ్నులము, ఎవర్రెడీ మరియు తీవ్ర పురుషార్థీలము అని 5 జోన్లు నుండి బాబా వద్దకు సర్టిఫికేట్‌ను పంపించవలసి ఉంటుంది. మీ టర్న్ లో మీవద్ద నుండి మూడొంతులు మంది వచ్చారు. ఇంతటి వృద్ధి ఉన్న కారణంగా చేరుకున్నారు కదా. ఇక్కడ కొంతమంది క్రొత్త పిల్లలు కూడా ఉన్నారు కానీ క్రొత్తవారు కూడా 'తీవ్ర పురుషార్థీ భవ' అనే వరదానాన్ని తీసుకుని తీవ్ర పురుషార్థీగా అయ్యి ఇతరుల సేవను కూడా, తీవ్ర సేవను చేసి భాగ్యాన్ని చేసుకుంటే అప్పుడు అందరూ వీరు నిజంగానే సుఖదాత పిల్లలు అని ఒప్పుకుంటారు. చాలా పెద్ద జోన్ ఇది. బాప్ దాదా సంతోషిస్తున్నారు. చూడండి, మీరు టి.వీలో చూడండి, మూడొంతులు క్లాసు వీరే ఉన్నారు. సదా సంతోషంగా ఉండండి, అదృష్టవంతులుగా ఉండండి అని బాప్ దాదా విశేషంగా ఈ జోన్ కు వరదానాన్ని ఇస్తున్నారు. అచ్చా.

జ్యూరిస్ట్ వింగ్ :- బాప్ దాదా మీ మీటింగ్ అజెండాను చూసారు, వీరు చెప్పారు. 'గీతా భగవంతుడు ఎవరు' అనే దానిని ప్రసిద్ది చేసే సేవలో మునిగి ఉండండి. గ్రూపులుగా తయారు చెయ్యండి. వారందరూ ఏమి ఆలోచించారో దాని రిజల్టు రావాలి. ఢిల్లీవారు కూడా చాలా బాగా చేసారు. బృజ్ మోహన్ చేసారు కదా, మీరు చేసారు కదా, మరి రిజల్టు ఏమి వచ్చింది? రిజల్టు వచ్చిందా? చెప్పండి. (ధర్మగురువులతో ప్రయత్నించాము, ఇప్పుడు జ్యూరిస్ట్ వింగ్ తో కలిసి దీనిని చేస్తాము) (ముంబయి మేళాలో మూడు స్టాళ్ళు గీత భగవంతుడు గురించి ఉన్నాయి) మంచిది. ఏదైతే పురుషార్ధం చేస్తున్నారో అదైతే చేస్తున్నారు కానీ దీని సారాంశాన్ని వ్రాయండి, అందరూ కలిసి, అందరి కొద్ది కొద్ది సేవలను వ్రాయండి. కానీ ఇప్పుడు ఈ పాయింట్ యొక్క అటెన్షన్ ను ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీరేదైతే 75 సంవత్సరాలు జరుపుకుంటున్నారో ఇందులో మీకు సహయోగులుగా చాలామంది అవుతారు. పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడతాయి కావున ఇప్పుడు ఈ పాయింట్ ను మంచిగా నిరూపించండి. ఎలా అయితే వేర్వేరు స్థానాలలో జూబ్లీ ఉత్సవాలను జరిపారు కదా! అలాగే ప్రతి స్థానంలో చిన్న చిన్న గ్రూపులను తయారు చెయ్యండి, వారు ఈ పాయింటు గురించి పురుషార్ధం చేసి మీవరకు సమాచారాన్ని అందించే విధంగా యోగ్యమైన గ్రూపుగా ఉండాలి. ఆ సమాచారాన్ని విని మీరు వారికి డైరెక్షన్లను ఇవ్వవలసి ఉంటుంది. ఇద్దరు ముగ్గురుని నిమిత్తంగా చెయ్యండి. ఇందుకు కమిటీని తయారు చెయ్యండి. కేవలం న్యాయమూర్తులనే కాక అభిరుచి ఉన్నవారిని, వీరు చెయ్యగలరు అని మీకు అనిపించిన వారిని ప్రోగు చేసి వారి గ్రూపును తయారు చెయ్యండి. ఎందుకంటే బ్రహ్మకుమారీలు చేసే కర్తవ్యముతోటే ఇప్పుడు పరివర్తన రానుంది అని అందరి బుద్ధిలోనూ ఉంది. ఈ ఫంక్షన్ల వలన ఈ రిజల్టు వచ్చింది. కావున ఇప్పుడు ఈ పాయింట్ పైనే మరింత అటెన్షను ఇచ్చి, గ్రూపును తయారుచేయండి. ఆ గ్రూపులో జడ్జ్ అయినా మరెవరయినా అభిరుచి ఉన్నవారు ఉండవచ్చు. ఎలా అయితే ఈ బృజ్ మోహన్ చేస్తూ ఉంటారు కదా అలా చేస్తూ ఉండండి. ఈ పాయింటు చాలా అవసరము, దీని ద్వారానే పరివర్తన వస్తుంది. మరి ఇప్పుడు ఏమి చేస్తారు? (ఇప్పుడు మీరిచ్చిన డైరెక్షను తప్పకుండా పాటిస్తాము). అచ్చా, వచ్చిన వింగ్స్ వారందరికీ బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. 

డబుల్ విదేశీ గ్రూపు: - (పిల్లలు మరియు యువకుల గ్రూపు, పిల్లలు పాట పాడారు) చాలా బాగుంది, బాప్ వాదా మీ అందరి ప్రియస్మృతులను కూడా చూసారు. మీ అందరి స్మృతిని మరియు ప్రేమను బాప్ దాదా స్వీకరించారు. ఎవరైతే ఈ ట్రైనింగ్ ఇప్పుడు తీసుకున్నారో వారందరూ మీ మీ తోటివారిని తయారు చెయ్యండి. చిన్న పిల్లలైతే చిన్న పిల్లల గ్రూపును తయారు చేసుకుని తీసుకురండి. మధ్యవారైతే మీ గ్రూపును తయారు చెయ్యండి, పెద్దవారైతే పెద్దవారి గ్రూపును తయారు చెయ్యండి. సేవ చెయ్యండి మరియు అందుకు ఋజువుగా వారిని మధువనానికి తీసుకురండి. ధైర్యముంది కదా? ధైర్యముందా? మంచిది. ట్రైనింగ్ రిజల్టును కూడా బాప్ దాదా చూసారు. ఎంతో ఉత్సాహంతో చేసారు, మధువనంలో చేసారు. ఎంత మంచి వాతావరణంలో చేసారు. ఈ ట్రైనింగ్ రిజల్టు తప్పకుండా రావాలి. అందుకే బాప్ దాదా పదమ పదమ పదమారెట్లు అభినందనలు, అభినందనలు, అభినందనలు.

సింధీ గ్రూపు మరియు డబుల్ విదేశీయులు:- తీవ్ర పురుషార్థం చెయ్యడమే డబుల్ విదేశీయుల లక్ష్యము. ఏదైతే చెయ్యాలనుకుంటారో అది తప్పకుండా పూర్తి చేస్తారు. సగం, పావు భాగం చేసి వదిలిపెట్టరు. చేస్తే పూర్తిగా చేస్తారు. ఈ విశేషత కారణంగా విదేశాలు సేవలో ముందు ఉండటాన్ని బాప్ దాదా చూసారు. మూలమూలలో కూడా సేవస్థానాన్ని తెరుస్తున్నారు. మీలోని ఉత్సాహ ఉల్లాసాలను చూసి బాప్ దాదా సదా అభినందనలు తెలుపుతూనే ఉంటారు. డబుల్ విదేశీయులకు పదమ పదమ రెట్ల అభినందనలు. బాప్ దాదా సేవలో సంతుష్టంగా ఉన్నారు కానీ ప్రతి విదేశీయుడు, ప్రతి విదేశీ సెంటరు నిర్విఘ్నంగా ఉన్నాయి అన్న విదేశీ రిపోర్టు ఇప్పుడు రావాలి. సెంటరు నిర్విఘ్నంగా ఉండాలి. ఎవరైతే తమ సెంటరు నిర్విఘ్నంగా ఉంది అని భావిస్తున్నారో వారు రిపోర్టును పంపండి తర్వాత బాబా వారికి బహుమతిని ఇస్తారు. కానీ అందరూ నిర్విఘ్నంగా ఉండాలి. అందరినీ నిర్విఘ్నంగా చేసి రిపోర్టును ఇవ్వండి. ఒకవేళ అలా ఉంటే వారికి ఇప్పటినుండే అభినందనలు. ఒకవేళ అలా ఇంకా తయారవ్వాలి అని అంటే రిపోర్టు ఇచ్చాక అభినందనలు తెలుపుతాము. విదేశాలవారు త్వరగా చెయ్యడంలో తెలివైనవారని బాప్ దాదా అంటారు. ఏదైతే చేసారో దానిని వెంటనే ఆచరించేసారు. ఫారెన్(విదేశాలు) ఫారన్ (త్వరగా). మంచిది. సింధీ గ్రూపు కూడా వచ్చింది. అభినందనలు. చూడండి, సింధీవారు బాబాకు మరియు భారతదేశానికి అతి ప్రియమైనవారు. ఎందుకంటే విదేశాలకు వెళ్ళినాకానీ మీలో ఉన్న భారతదేశ రక్తము యొక్క పరువు నిలిపారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు, మీరు అమరులు. అమరులు కనుక అమర్ భవ అన్న వరదానము లభిస్తుంది. ఈరోజు విశేషంగా వీరు వచ్చారు, ఏ ప్రోగ్రాము కోసమైతే వచ్చారో అది బాప్ దాదాకు నచ్చింది. మంచిగా చేసారు. ఇప్పుడు మీరు సింధీవారు, ఎవరైతే రెగ్యులర్ విద్యార్థులున్నారో వారు ఎలాగూ ఉన్నారు. కానీ మీరు మరోసారి వచ్చినప్పుడు మీరు క్రొత్త క్రొత్తగా ఎవరినైతే తయారుచేసారో వారిని తీసుకురండి. గ్రూపు అయితే తయారై ఉండి ఉండవచ్చు కదా. ఆ గ్రూపును తీసుకురండి ఎందుకంటే, 'బాప్ దాదా భారతదేశంలో జన్మ తీసుకున్నారు, ఇందుకు ఈ విదేశీయులు నిమిత్తమయ్యారు' అని బాప్ దాదా విశ్వానికి చూపించదల్చుకున్నారు. కనుక, ఎవరి సేవనైతే చేసారో వారిని మీతో పాటు తీసుకురండి. క్రొత్త క్రొత్త వారిని మీతో తీసుకురండి, గ్రూపును తయారు చెయ్యండి. సేవలో ఇంకా ముందుకు వెళ్తున్నందుకు బాప్ దాదాకు సంతోషంగా ఉంది. మీపై మీరు అటెన్షన్ పెట్టుకోవడంపై జనక్ బిడ్డ ఎంగానో అటెన్షన్ ఉంచుతున్నారు, అందుకే దీని రిజల్టు మంచిగా ఉంది. బాప్ దాదాకు కూడా విదేశాలను చుట్టి వచ్చే అవకాశం లభిస్తుంది. ఏ సమయం లభిస్తుంది? అమృతవేళ. విదేశీ సెంటర్లను కూడా బాప్ దాదా చుట్టి వస్తారు. ఇప్పుడు దీనికి జతగా జ్వాలాముఖి యోగము అవసరము. ఈ జ్వాలాముఖి యోగము అందరినీ సమీపంగా తీసుకువస్తుంది ఎందుకంటే శక్తి లభించింది కదా. మీరు కూడా లైట్- మైట్ రూపులుగా అవుతారు. నడుస్తూ తిరుగుతూ కూడా లైట్ - మైట్ స్వరూపులుగా అవుతారు ఇప్పుడు ప్రజలకు అందరికీ వైబ్రేషన్లు లభిస్తున్నాయి. అప్పుడు శ్రమ తక్కువ, ఎక్కువ ప్రాప్తి లభిస్తాయి. ఇప్పుడు భారతదేశంలో ఎక్కడెక్కడ అయితే ఫంక్షను జరిగాయో అక్కడ మునుపటికన్నా మంచి రిజల్టు వస్తుంది. పిల్లల కోసం బాబా నిమిత్తమయ్యారు, దాదీలు మరియు దీదీలు మీ అందరూ విశేషంగా బాప్ దాదాతో కలిసి 75 సంవత్సరాలు జరుపుకుని మైదానానికి వచ్చారు. ఇందుకు చాలా చాలా చాలాచాలా-అభినందనలు. దాదాలు కూడా ఉన్నారు, దాదీలు కూడా ఉన్నారు. మంచిది.

ఇప్పుడు దాదీలందరూ కలిసి ఏదైనా కొత్త ప్లాన్‌ను తయారు చెయ్యండి. ఏమంటారు? (దాదీ జానకి అన్నారు- “బాబా, జనవరి నెల చాలా మహత్వపూర్వకమైనది. ఇది నా భావన.” నిర్వైర్ అన్నయ్య అన్నారు - "పరస్పరం కూర్చుని ఏదైనా కొత్త ప్లాన్‌ను తయారు చేస్తాము. దాదీలు కోరుకుంటున్నట్లుగా, మీరు ఆశిస్తున్నట్లుగా అందరి మనసుల నుండి 'నా బాబా' అని రావాలి, దాని అనుసారంగానే ప్రణాళిక సిద్ధం చేస్తాము”.) ప్రతి ఒక్కరూ తమలో ఒక దృఢ సంకల్పాన్ని చెయ్యండి, నేను నిర్విఘ్నంగా అవ్వాల్సిందే, తయారు చెయ్యాల్సిందే. ఎవరిని చూసినా కానీ ఆశ్చర్యంతో వీరెవరు అని అనుకుని మిమ్మల్ని చూసి సంతోషించాలి. బాప్ దాదా క్రొత్త సంవత్సరంలో నవీనతను తీసుకురావలనుకుంటున్నారు. అవే పాత సంస్కారాలు వద్దు. పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా సమానంగా కనిపించాలి. ఫాలో బ్రహ్మబాబా. పరిస్థితులు, మాటలు అన్నీ బాబా ముందుకు కూడా వచ్చాయి కానీ ఫరిస్తాగా అయిపోయారు. ఫరిస్తాగా అవ్వాలి అన్న దృఢ సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ చెయ్యండి ఎందుకంటే మీకు మీరే చేసుకుంటే అది మీకు బాగా గుర్తుంటుంది. నేను అవ్వాల్సిందే, అంతే. మీవారిగా అవ్వడం వలన సహజంగా వైబ్రేషన్లు వ్యాపిస్తాయి. మరి ఇప్పుడు ఏ లక్ష్యం పెట్టుకున్నారు? ఫరిస్తాగా అవ్వాల్సిందే. పక్కాయే కదా! వెనక ఉన్నవారు అవుతారు కదా! ఈరోజు 12గంటలకు అందరూ అన్నీ నాకు వదిలేసి వెళ్ళండి. ఏ లోపమున్నా దానిని వదిలి వెళ్ళండి. అచ్ఛా.

అందరికీ చాలా చాలా ప్రియస్మృతులు మరియు అభినందనలు.

దాదీ జానకీతో: - (కుంజ్ మీకు తమ స్మృతులను చాలా పంపారు) చాలామంచి బిడ్డ కానీ లెక్కాచారాల కారణంగా రాలేకపోతున్నారు. (ఆంటీ అంకుల్ కూడా స్మృతులను ఇచ్చారు) బాప్ దాదా హృదయము అనే డబ్బాలో మీరుంటారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే, పిల్లలు కూడా ఎంతమంచి వారిని తయారు చేసారు. (జయంతి అక్కయ్య వజీహా వద్దకు వెళ్ళారు). వజీహా బిడ్డ చాలా ధైర్యవంతురాలు. అందుకే పరివారానికి కళ్యాణం జరిగింది. (ఢిల్లీ శాంతి సోదరి స్మృతులను పంపారు) ఎవరైతే ఆరోగ్యం సరి లేకున్న కారణంగా చేరుకోలేదో లేక డ్రామా కారణంగా చేరుకోలేదో వారికి బాప్ దాదా పేరు సహితంగా, మీ పేరును గర్తుంచుకోండి, బాప్ దాదా పేరుతో సహా చాలా చాలా చాలా చాలా ప్రియస్మృతులను అందిస్తున్నారు.

Comments