18-01-2012 అవ్యక్త మురళి

           18-01-2012         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

“సేవలతో పాటు ఒకరికొకరు సహయోగులుగా అయ్యి తీవ్ర పురుషార్థపు అలను వ్యాప్తి         చెయ్యండి, మన్ జీతులుగా అయ్యి ఆత్మలకు మనసా సేవను చెయ్యండి” 

ఈ రోజు విశేషంగా స్నేహ దివసము. నలువైపుల ఉన్న పిల్లలు స్నేహ స్వరూపంతో మిలనము జరుపుకుంటున్నారు. మీరందరూ కూడా స్నేహ స్వరూపంలో మగ్నమై ఉన్నారు. ఈ రోజు అమృతవేళ నుండి నలువైపుల ఉన్న పిల్లలు అమృతవేళ కన్నా ముందే స్నేహ రూపంలో హృదయ ముత్యాల మాలలను తీసుకుని చేరుకున్నారు. అనేక ప్రకారాల భిన్న భిన్న మనో భావాలను బాబా ఎదుట వర్ణిస్తూ ఉన్నారు. పిల్లల స్నేహము ఎంత ప్రియమైనదో మీకు తెలుసు కదా. భిన్న భిన్న భాషలలో, భిన్న భిన్న భావాలతో బాప్ దాదా ఎదుట తమ మనసులోని మాటలను చెప్తున్నారు. నయనాలతో, నోటితో తమ భావాలను స్పష్టం చేస్తున్నారు. బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లల స్నేహ భావాలను చూసి అందరి స్నేహములో మునిగిపోయారు మరియు మనస్ఫూర్తిగా వాహ్ పిల్లలూ! వాహ్ అని కూడా అంటున్నారు. అలాగే పిల్లల నోటి నుండి వాహ్ బాబా వాహ్! అన్న పాట వినబడుతూ ఉంది. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ చూస్తూ పిల్లల ప్రేమలో లీనమై ఉన్నారు మరియు పిల్లలు బాబా ప్రేమలో లీనమై ఉన్నారు. బాబా తన పిల్లలను బాలక్ సో మాలికులుగా తయారుచేసే దృష్టితో చూస్తున్న రోజు ఇది. పిల్లలకు రాజ్య తిలకాన్ని దిద్దే రోజు ఇది. ఈరోజు బాప్ దాదా స్వయంగా ఫరిస్తా రూపంలో ఉండి పిల్లలను విశ్వ సేవకు నిమిత్తం చేసిన రోజు. స్వయం వెన్నుముకగా అయ్యి, పిల్లలను విశ్వమనే స్టేజ్ పై ప్రత్యక్షం చేసారు. బాప్ దాదా ఇప్పుడు పిల్లల సేవను చూసి, ఏ బాధ్యతనైతే ఇచ్చారో దాని రిజల్టును చూసి పిల్లలపై చాలా చాలా సంతోషంగా ఉన్నారు మరియు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నారు. అభినందనలు, అభినందనలు.

బాప్ దాదా ఏమి చూసారంటే ఇప్పటివరకు కూడా బాబా ద్వారా ఇవ్వబడిన విశ్వ సేవాధారి అన్న వరదానాన్ని పిల్లలు ప్రతి ఒక్కరూ అతి స్నేహంతో మరియు మనస్ఫూర్తిగా పూర్తి చేసారు మరియు చేస్తున్నారు. రిజల్టును కూడా బాప్ దాదా చూసారు, పిల్లలందరి మనసులో “నా బాబా” అన్న తపన ఉంది మరియు బాబా హృదయంలో కూడా “వాహ్! నా పిల్లలు” అని పిల్లలపై స్నేహము ఉంది. ఇప్పుడు అతి త్వరగా నలువైపులా బాబాను ప్రత్యక్షం చెయ్యవలసిందే అని వర్తమాన సమయంలో మెజారిటీ చిన్న-పెద్ద సెంటరు నివాసులు, పిల్లలు అందరిలో ఉత్సాహం ఉంది. కావున బాప్ దాదా స్నేహ దివసమైన ఈరోజున నలువైపుల ఉన్న దేశవిదేశాలలోని పిల్లలందరికీ తమ దృష్టితో, మనసుతో స్నేహము మరియు సేవకు రిటర్నుగా హృదయపూర్వక స్నేహమును, ప్రియస్మృతులను పదమారెట్లను ఇస్తున్నారు.

ఇప్పుడు సమయానుసారంగా బాబాను ప్రత్యక్షం చెయ్యాలన్న ఉత్సాహం ఏదైతే ఉందో అది నెమ్మది నెమ్మదిగా ఇతర ఆత్మలలో కూడా రావడం ప్రారంభమయింది. బ్రహ్మకుమారీలు ఏదో పొందారు అని భావిస్తున్నారు. వారి భావనలో పరివర్తన వచ్చింది. “ఏమో, ఏమి చేస్తున్నారో అనే భావన నుండి “మంచి కార్యమును చేస్తున్నారు, మేము చెయ్యలేనిది వీరు తమ సంగఠనలో ఉంటూ సఫలతను పొంది చూపించారు” అని అనుకునేంత పరివర్తన వచ్చింది. అందుకే బాప్ దాదా ఈరోజు ఎదురుగా కూర్చుని ఉన్న పిల్లలకు, నలువైపుల నుండి వింటున్న, చూస్తున్న పిల్లలందరికీ విశేషంగా హృదయపూర్వక స్నేహము మరియు హృదయపూర్వక ప్రేమను అందిస్తున్నారు. ఇప్పుడిక ఏమి చెయ్యాలి? సేవ కోసం అభినందనలనైతే బాప్ దాదా ఇచ్చేసారు. ఇప్పుడు బాప్ దాదా ఏమి ఆశిస్తున్నారంటే పిల్లలు ప్రతి ఒక్కరూ, 'ఇప్పుడు బాబా సమానంగా ఫరిస్తాగా అవ్వవలసిందే' అన్న ఉల్లాస-ఉత్సాహాలను ఉంచి, దృఢ నిశ్చయము, తీవ్ర పురుషార్థము చెయ్యవలసిందే. ఎందుకంటే ఇప్పుడు అందరూ బాబాతో పాటు రిటర్న్ జర్నీ (తిరుగు ప్రయాణం) చెయ్యవలసిందే. ఫరిస్తా సమానంగా అవ్వవలసిందే ఎందుకంటే కలిసి వస్తాము, కలిసి రాజ్యం చేస్తాము అని మీరందరూ ప్రతిజ్ఞ చేసారు కదా. మరి బ్రహ్మబాబా కూడా ఫరిస్తాగా అయ్యారు, మరి కలిసి ఎలా వెళ్తారు? బ్రహ్మబాబా అయితే జీవిస్తూనే ఫరిస్తా స్వరూపాన్ని చూపించారు. ఎంత బాధ్యత ఉండింది! అందరినీ యోగ్యులుగా చెయ్యవలసిందే కానీ ఇంతటి బాధ్యత ఉన్నప్పటికీ ఎంత అతీతంగా మరియు ప్రియంగా ఉండేవారో మీరందరూ చూసారు. సదా నిశ్చింత చక్రవర్తిగా ఉన్నారు, చింత కాదు, నిశ్చింత చక్రవర్తి. అలాగే పిల్లలైన మీరు కూడా ఇప్పుడు బాబా సమానంగా నిశ్చింత చక్రవర్తిగా, ఫరిస్తాగా అవ్వవలసిందే. అవ్వవలసిందే అన్న దృఢ సంకల్పం ఉందా లేక అవుతాములే అని అనుకుంటున్నారా! 

ఇప్పుడు బాప్ దాదా ఏమి చూసారంటే సమయానుసారంగా ఎంతైతే సేవపై ఉల్లాస ఉత్సాహాలు ప్రాక్టికల్ గా ఉన్నాయో అంతే ఉత్సాహము తీవ్ర పురుషార్థీలుగా అవ్వడంలో మరియు తయారు చెయ్యడంలో, సంపన్నంగా అవ్వడంలో మరియు తయారుచెయ్యడంలో ఉండాలి. వాయుమండలంలో కూడా ఉల్లాస-ఉత్సాహాలను నింపాలి. ఒకరికొకరు సహయోగులుగా అయ్యి ఇప్పుడు వాయుమండలంలో తీవ్ర పురుషార్థపు అలను వ్యాప్తి చెయ్యండి. ఎలా అయితే ఒకరికొకరు పరస్పరంలో సేవా ఉత్సాహాన్ని వాయుమండలంలో వ్యాప్తి చేసారో అలాగే ఇప్పుడు తీవ్ర పురుషార్థపు అల వాయుమండలంలో వ్యాప్తి చెయ్యాలి అని బాప్ దాదా ఇప్పుడు పిల్లలపై శుభ ఆశను పెట్టుకున్నారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు ఇప్పటికీ పురుషార్థము ఉంది, కానీ తీవ్ర పురుషార్థము చెయ్యాలి. బాప్ దాదా ఆశ ఏమిటంటే ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరిలో, పిల్లలందరూ బాప్ దాదా ఆశా సితారలు కదా! కదా? మేము బాబా ఆశల సితారలుగా అయ్యి ఉల్లాస ఉత్సాహాలను వాయుమండలంలో వ్యాప్తి చేస్తాము అని భావించేవారు చేతులెత్తండి. అచ్చా. చేతులైతే చాలా బాగా ఎత్తుతారు. బాప్ దాదా చేతులను చూసి సంతోషిస్తారు. మెజారిటీ చేతులెత్తారు. వెనుకవారిది కనిపించలేదు కానీ ముందువారిది కనిపించింది. వెనుకవారు ఇప్పుడు ఎత్తుతున్నారు. అభినందనలు, అభినందనలు. అచ్చా. బాప్ దాదా ఏమి చూసారంటే విశేషంగా మనసులో ఏదైనా విషయంపై ఉల్లాస-ఉత్సాహాలు ఉంటే ఆ కార్యము మంచిగా సాకారమవుతుంది. కావున బాప్ దాదా ఈసారి ఈ స్నేహ దివసమున ఈ హోమ్ వర్కును ఇస్తున్నారు - పిల్లలు ప్రతి ఒక్కరూ మనసు కారణంగా వ్యర్థంగా పోతున్న సంకల్పము మరియు సమయమును సమాప్తం చెయ్యండి. ఒకవేళ ఎప్పుడైనా వ్యర్థ సంకల్పం వస్తే అందులో ఎంత సమయం వృథా అవుతుందో అందరికీ అనుభవం ఉంది. శక్తి కూడా చాలా వృథా అవుతుంది. కావున బాప్ దాదా ఏ హోమ్ వర్కును ఇవ్వాలనుకుంటున్నారంటే ఈ రెండు నెలలు పిల్లలు ప్రతి ఒక్కరూ మనసులోని వ్యర్థ సంకల్పము మరియు వ్యర్థ సమయమును సమాప్తం చెయ్యాలి. ఇందుకోసం స్వయం కోసం ఒక విధిని తయారుచేసుకోండి. ఈ రెండు నెలలు ప్రతి ఒక్కరూ తమ చార్టును పెట్టుకోండి. వ్యర్థ సమయము, వ్యర్థ సంకల్పాలను ఎంత కంట్రోల్ చేసాను? ఎందుకంటే ఇప్పుడు సమయానుసారంగా మీరందరూ మీ మనసాశక్తితో ఆత్మలకు మనసాసేవను చేసే సమయమిది. ఇందుకోసం సదా మనసుపై అటెన్షన్ ను ఉంచడం అవసరము. మన్ జీత్, జగత్ జీత్ అని కూడా చెప్పబడి ఉంది. కనుక మన్మనాభవ అనే వాయుమండలంలో మనసులోని వ్యర్థాన్ని సమాప్తం చెయ్యండి. చెయ్యగలరా? చేస్తారా? వారు చేతులెత్తండి. బాప్ దాదా బహుమతిని ఇస్తారు. మీ రిజల్టును మీరే చూసుకోండి. మనసు సంతోషంగా ఉంటే మనసులోని సంతోషాన్ని పంచగలరు. ఈ పురుషార్థంలో అందరూ మొదటి నంబరును తీసుకోండి. ఇందులో అటెన్షన్ ను ఉంచండి. వ్యర్థము సమాప్తము. సమయము మరియు సంకల్పాలు రెండింటిలోనూ వ్యర్థము సమాప్తము మరియు సమర్థ సంకల్పాలు, సమర్ధ సమయము రాబోవు సమయంలో వాయుమండలంలో వ్యాపిస్తాయి. 

బాప్ దాదా ఒక విషయంలో పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. అది ఏ విషయము? పిల్లలందరూ సేవనైతే చేసారు కానీ దానితో పాటు 'డబుల్ రాజు'గా అవ్వమని బాప్ దాదా ఇచ్చిన సూచన గురించి తెలుసు కదా! ఒకటి స్వరాజ్య అధికారి, రెండు భవిష్య రాజ్య అధికారి. స్వరాజ్య అధికారి. తన ప్రతి పిల్లవాడు స్వరాజ్య అధికారిగా అయిన తండ్రి బాబా తప్ప మరెవ్వరూ లేరు అన్నది బాబాకున్న నషా. మీరందరూ స్వరాజ్య అధికారులు కదా! స్వ పై ఆత్మ రాజ్యం చేస్తుంది. కర్మేంద్రియాలకు వశమవ్వదు, రాజ్య అధికారి. పిల్లలు ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారిగా సదా ఉండాలి, అప్పుడప్పుడూ కాదు అన్నది బాప్ దాదా ఆశ. అవ్వగలరా? మీకిచ్చిన ఈ రెండు నెలలలో, స్వరాజ్య అధికారిగా ఉన్నానా? లేక కర్మేంద్రియాలకు వశమయ్యానా? అన్న విషయాన్ని నోట్ చేసుకోండి. ఇప్పుడు కర్మాతీతులుగా అవ్వాలి, సమయము సమీపిస్తుంది. మరి ఏమి చెయ్యాలి? నడుస్తూ తిరుగుతూ స్వరాజ్య అధికారిగా అవ్వవలసిందే. ఈ సంస్కారము బ్రాహ్మణ పిల్లలైన మీదే. డబుల్ రాజ్యము, స్వరాజ్యము మరియు భవిష్యత్తులో విశ్వ రాజ్యము. బాప్ దాదా అంతటా తిరుగుతూ పిల్లల రిజల్టును నోట్ చేసుకుంటూ ఉంటారు. కావున సదా స్వరాజ్య అధికారి అన్న విషయంలో అటెన్షన్ అవసరము. బాప్ దాదా రెండు కార్యాలను చెయ్యమని ఇచ్చారు. ఒకటి, ఈ రెండు నెలలు స్వరాజ్య అధికారిగా ఎంత ఉన్నాను? ఈ రిజల్టును చూసుకోవాలి. దీనితోపాటు మనసు యొక్క కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ద్వారా వ్యర్థాన్ని సమాప్తం చెయ్యాలి. ఇందులో ఎవరు నంబరును తీసుకుంటారో వారికి బాప్ దాదా బహుమతిని ఇస్తారు. ఇష్టమేనా? చెయ్యాలి కదా! చేస్తారా? చేస్తారు కదా? తల ఊపండి. అచ్చా.

ఈరోజు పిల్లలందరి స్నేహాన్ని బాప్ దాదా స్వీకరించారు. అమృతవేళలో అయితే వతనంలో చాలామంది పిల్లలు ఉన్నారు. అడ్వాన్స్ పార్టీవారు కూడా వతనంలో ఈరోజు తమ హృదయపూర్వక ప్రేమను అందించడానికి, తీసుకోవడానికి వచ్చారు. 'మా ఈ పాత్ర ఇంకా ఎంత కాలం' అని వారు బాబాను అడుగుతున్నారు. ఏమని జవాబు ఇవ్వమంటారు? ఏమన్నారు? (మేము రెడీగా ఉన్నాము అని దాదీ జానకి అన్నారు) మీరు ఒంటరిగానే వెళ్ళిపోతారా? (అందరమూ వెళ్తాము) మీకు అందరిపై ప్రేమ ఉంది కదా, అలా వదిలేసి రాజ్యం చెయ్యడానికి వెళ్తారా. (అడ్వాన్స్ పార్టీవారు మమ్మల్ని విడిచి ఎందుకు వెళ్ళిపోయారు) వారి పాత్ర అలా ఉంది కదా. వారు వెళ్ళవలసిందే. ఇప్పుడు త్వరత్వరగా సంగఠనను తయారుచేసేందుకు మీరు ప్రయత్నం చెయ్యండి. రెండు నెలల హోమ్ వర్క్, ఏదైతే ఇచ్చామో, ఒకవేళ మీరు ఇది అందరితో చేయించగలిగితే, రిజల్టు వస్తే త్వరగా అయిపోతుంది. (బాబా స్నేహంలో చేసేస్తారు) స్నేహమైతే ఉంది, స్నేహంలో కూడా పాస్ అయ్యారు. అందరికీ స్నేహము ఉండటాన్ని బాప్ దాదా కూడా చూసారు. కానీ స్నేహముతో పాటు శక్తి కూడా కావాలి. ఇందుకోసం అమృతవేళను పవర్ ఫుల్ గా చేసుకోండి. కూర్చుంటున్నారు, కూర్చుంటున్నందుకు బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు కానీ కూర్చున్న వాయుమండలం శక్తిశాలిగా ఉండాలి. ఒకరు ఒకలా కూర్చుంటారు, ఇంకొకరు ఇంకోలా కూర్చుంటారు. ఒకవేళ ఫోటో తీస్తే ఇంకేదో ఉండాలి అని మీకే అనిపిస్తుంది. బాప్ దాదా చెప్పిన జ్వాలాముఖి యోగంపై ఇప్పుడు మరింత అటెన్షన్ ఇవ్వండి. అందరూ పురుషార్ధం చేస్తున్నారు కానీ పురుషార్థం ముందు 'తీవ్ర' అన్న పదాన్ని జోడించండి. ఇప్పుడు పిల్లలందరికీ రెండు నెలల సమయాన్ని ఇచ్చారు. ఇందులో అటెన్షన్ తో పాటు బాప్ దాదా కూడా ఎక్ ట్రా సహాయాన్ని కూడా అందిస్తారు. మనసుకు యజమానులు మీరు, మీ పాదాలను, చేతులను సునాయాసంగా నడిపించినంతగా మీ మనసును నడిపించాలి. మీ శరీరంతో ఏది కావాలంటే అది చేస్తారు కదా. ఇది ఇక్కడ కాక అక్కడ పెట్టాలి అని అనుకుంటే పెట్టగలరు కదా. అలాగే మైండ్ కంట్రోల్, ఏది అవసరమో అదే సంకల్పం చెయ్యండి. రోజూ రాత్రి రిజల్టును చూసుకోండి. ఈ రోజు మనసు యొక్క రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ ఎంత ఉంది? ఇప్పుడు వ్యర్థాన్ని త్వరత్వరగా సమాప్తం చెయ్యాలి. ఇప్పుడు సమర్థులుగా అయ్యి వాయుమండలంలో సమర్థ శక్తిని వ్యాపింపజేయండి. బాప్ దాదా అయితే పిల్లల దుఃఖాన్ని, మొరను విని పిల్లల ద్వారా ఇప్పుడు త్వరగా సమాప్తి చేయాలని ఆశిస్తున్నారు. వినిపించాము కదా, పురుషార్థము అందరూ చేస్తున్నారు కానీ ఇప్పుడు 'తీవ్రత'ను యాడ్ చెయ్యండి. చెయ్యవలసిందే. చేస్తాములే చూద్దాములే... ఈ లే, లే... ఇప్పుడు సరిపోదు.

స్నేహ దృశ్యాన్ని కూడా ఈ రోజు చూసాము. ప్రతి ఒక్కరి మనసులో ఎంత ప్రేమ ఉంది! కానీ ఎంత ప్రేమ ఉందో, దానితోపాటు అంతే శక్తి కూడా కావాలి. ఇప్పుడు శక్తిని నింపుకోండి. ఎప్పుడూ ఏ సోదరి కూడా తమను తాము కేవలం శక్తిగా కాక శివ శక్తిగా భావించండి. శివశక్తి, బాబా తోడుగా ఉన్నారు. పాండవులతో పాండవపతి తోడుగా ఉన్నారు. మరి ఇప్పుడు ఏమి చేస్తారు? పురుషార్థము అన్న పదం ముందు తీవ్ర అని పెట్టండి. వాయుమండలాన్ని తయారు చెయ్యండి. ఒకరికొకరు సహయోగులుగా అయ్యి, ప్రతి ఒక్కరూ తమ తమ స్థానాలలో ఉంటారు, స్థానాన్ని శక్తిశాలిగా చెయ్యండి. తమ తోటివారిని శక్తిశాలిగా చెయ్యండి. మరి ఇప్పుడు ఏమి చేస్తారు? నవీనత చేస్తారు కదా? 'నా బాబా' అని అంటున్నప్పుడు 'నా' సమానంగా అవ్వాలి కదా. ప్రతి ఒక్కరూ తమ మనసులో దృఢ సంకల్పం చెయ్యండి. సంకల్పాలు మంచి మంచిగా చేస్తారు. ఇది చేస్తాము, ఇది చేస్తాము, ఇది చేస్తాము అంటూ అమృతవేళ ఎంతో మంచి సంకల్పాలను చేస్తారు కానీ కర్మయోగిగా అయినప్పుడు, సంబంధ-సంపర్కంలోకి వచ్చినప్పుడు అక్కడ తేడా కనిపిస్తుంది. కర్మయోగి స్థితిలో అటెన్షన్ ఎక్కువ అవసరము. అచ్చా.

అందరూ సంతోషంగా ఉన్నారు కదా! సంతోషంగా ఉన్నారా? చూడండి, క్రొత్త క్రొత్తవారు కూడా ఎంతమంది వస్తున్నారో! క్రొత్తవారు, మొదటిసారిగా వచ్చినవారు చేతులెత్తండి. చూడండి, ఎంతమంది ఉన్నారో! సగం క్లాసు క్రొత్తవారే. వచ్చిన క్రొత్తవారిని చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు.ఎందుకంటే అంతిమ సమాప్తి సమయం కన్నా ముందుగానే వచ్చి చేరుకున్నారు. కానీ ఎంత లేట్ గా వచ్చారో అంతగా తీవ్ర పురుషార్థం చెయ్యవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ కొద్ది సమయంలోనే మీరు పూర్తిగా 21 జన్మలకు తమ భవిష్యత్తును తయారుచేసుకోవాలి. ఇంతటి అటెన్షను ఉంచవలసి ఉంటుంది. సమయాన్ని కాపాడండి, సెకండు కూడా వ్యర్థంగా పోకూడదు. తీవ్ర పురుషార్థీగా ఉండండి. సాధారణ పురుషార్థంతో చేరుకోవడం కష్టము. అయినప్పటికీ వచ్చిన క్రొత్త పిల్లలకు బాప్ దాదా హృదయపూర్వక అభినందనలను తెలుపుతున్నారు. అచ్ఛా. 

సేవ టర్న్ ఇండోర్ జోన్ వారిది, 7 వేల మంది వచ్చారు. - అచ్చా. ఇండోర్ జోన్ టీచర్లు చేతులెత్తండి. బాప్ దాదా టీచర్లకు అభినందనలు తెలుపుతున్నారు. బాప్ దాదా టీచర్లందరికీ ఎందుకు అభినందనలు తెలుపుతున్నారు? ఎందుకంటే బాప్ దాదా ఏమి చూసారంటే ఇండోర్ సేవలో ఎవరైతే నిమిత్తమయ్యారో వారు మంచి సేవా రిజల్టును చూపించారు. ఆ స్థానానికి విశేషంగా ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారికి బయటవారితో మంచి పరిచయాలు ఉన్నాయి. సందేశాన్ని మంచిగా ఇచ్చారు. ఇప్పుడిక ఏమి చెయ్యాలి? ఇందులో మంచిగా ఉన్నారు, ఇందుకు బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. కానీ ఎంతగా సంబంధ-సంపర్కాలు ఉన్నాయో, వారిని ఇప్పుడు వారసులుగా చెయ్యండి. సంపర్కంలో ఉన్నారు కానీ వారసత్వ క్వాలిటీవారిని బాబా ఎదుటకు తీసుకురండి. తీసుకురాగలరు, మంచి పరిచయాలు ఉన్నాయి. (దగ్గు వస్తుంది)

ఈరోజు రథం యొక్క ఆరోగ్యం మంచిగా లేదు. అయినప్పటికీ బాప్ దాదా కలవడానికి వచ్చారు. బాప్ దాదాకు పిల్లలను చూసి సంతోషంగా ఉంటుంది, వాహ్! పిల్లలూ వాహ్! అనే హృదయం నుండి వెలువడుతుంది. మీరు ఎంత మనస్పూర్తిగా వాహ్! బాబా వాహ్! అని అంటారో అంతకంటే ఎక్కువగా బాబా, వాహ్! పిల్లలూ వాహ్! అని అంటారు. కావున ఇప్పుడు ఇండోర్ వారు తమ పరిచయంలో ఉన్నవారిని మరింత సమీపంగా తీసుకురండి. తీసుకురాగలరు. ఆశావాదులు. ఆశావాదులను ఎదురుగా తీసుకురండి. అచ్చా. సేవ కోసం వచ్చారు. ఒక్కొక్క జోన్ కు ఇలా చాలా మంచి ఛాన్సు లభించడం చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. ఎక్కువ సంఖ్యను తీసుకు వచ్చేందుకు అవకాశం లభిస్తుంది. కావున ఈ ప్రోగ్రాము మంచిగా తయారైంది. ప్రతి జోన్‌కు అవకాశం లభిస్తుంది కానీ అవకాశం తీసుకుని తిరిగి అందుకు రిజల్టును కూడా చూపాలి, బాప్ దాదా ఎదుటకు తీసుకురావాలి. అచ్చా.

డబుల్ విదేశీయులు 400 మంది వచ్చారు. - చాలా మంచిది. డబుల్ విదేశీయులు యజ్ఞానికి అలంకారము. ఎప్పుడు వచ్చినా కానీ యజ్ఞానికి అలంకారంగా నిలుస్తారు. అందరూ ఎంతో సంతోషిస్తారు ఎందుకంటే మీలో ఒక విశేషత మంచిగా ఉంది. ఏది చెయ్యాలనుకుంటే దానిని వెంటనే చేసేస్తారు, పొడిగించరు. ఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతూ ఉండటాన్ని బాప్ దాదా చూసారు. డబుల్ విదేశీయులు ఉండని టర్న్ ఏదీ ఉండదు. బాప్ దాదా డబుల్ విదేశీయులకు డబుల్ పురుషార్థీలు అని టైటిల్ ఇస్తారు. ఇప్పుడు చేసి చూపించండి. డబుల్ పురుషార్థీలుగా అయ్యి రిజల్టును చూపించండి. సేవ పెరుగుతూ ఉందని బాప్ దాదాకు తెలుసు. సమాచారము వస్తూ ఉంటుంది. సేవ కూడా మంచిగా జరుగుతూ ఉంది. ఇప్పుడు కేవలం ఈరోజు ఏదైతే చెప్పామో, పురుషార్థం ముందు 'తీవ్ర' అని జోడించండి. తీవ్ర పురుషార్థీ పిల్లలు సదా బాబాను తమ హృదయంలో పెట్టుకుంటారు మరియు బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ తమ హృదయంలో పెట్టుకుంటారు. అందరి హృదయాలలో బాప్ దాదా ఉన్నారు కదా! చేతులెత్తండి. మీ హృదయంలో ఎవరున్నారు? బాప్ దాదా. మరియు బాప్ దాదా హృదయంలో పిల్లలైన మీరు ఉన్నారు. ఏ పిల్లలైతే విశేషంగా ప్రియస్మృతులను పంపారో వారికి ప్రత్యేకంగా బాప్ దాదా ప్రియస్మృతులను తెలుపుతున్నారు. జయంతి బిడ్డ కూడా ఎంతో ప్రేమగా ప్రియస్మృతులను పంపారు. గాయత్రి బిడ్డ కూడా పంపారు. ఇంకా ఇలా ఎవరైతే పంపారో, వారికి బాబా కూడా విశేషమైన ప్రియస్మృతులను ఇచ్చారు. ఒకవేళ ఎవరికైనా ఏమైనా ఆశ ఉంటే ఆ ఆశను పూర్తి చేస్తూ వారిని ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. వీరి ఆశలు పాడు చేసేవి కాదు, మంచివే. సేవా ఉల్లాసము కూడా మంచిగా ఉంది. ఎవరైతే విశేషంగా స్మృతిని పంపారో వారికి బాప్ దాదా పదమారెట్ల ప్రియస్మృతులను తెలియజేస్తున్నారు. మంచి ఆల్ రౌండ్ సేవాధారులు. ఇతరులు బాబాకు గుర్తులేరు అని అనకండి, అందరూ గుర్తున్నారు కానీ వారు విశేషంగా పంపారు కావున విశేషంగా తెలపడం జరిగింది. అద్భుతం, ఏ జోన్ టర్న్ లో కూడా విదేశీయులు మిస్ అవ్వరు. (వజీహా ఎంతో ప్రేమగా స్మృతి చేస్తూ పత్రాన్ని పంపారు) వారు మంచిగా గుర్తుంటారు. తన అనారోగ్యం ఎంతో మంది సేవను చేసింది. ఎంత అనారోగ్యం ఉన్నా అంత అనారోగ్యం ఉన్నట్లుగా కనిపించరు అని డాక్టర్లు కూడా వీరిని చూసి సంతోషిస్తారు. సంతోషంగా ఉంటారు. అనారోగ్యంపై విజయమును సాధించడము అని దీనిని అంటారు. అనారోగ్యం తన పని చేసుకుంటుంది, వీరు తమ స్మృతి అనే పనిలో బిజీగా ఉన్నారు. ఇది కూడా డబుల్ విదేశీయుల ఉదాహరణ. డబుల్ విదేశీయులకు బాప్ దాదా హృదయపూర్వక ప్రియస్మృతులను తెలుపుతున్నారు. మధువనానికి ప్రత్యేకమైన అలంకరణగా అయ్యి వస్తున్నందుకు విశేషంగా అభినందనలు కూడా తెలుపుతున్నారు. మీకు మంచిగా అనిపిస్తుంది కదా? పిల్లలందరికీ కూడా మీ రాక ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అందరి మనసుల నుండి వాహ్!వాహ్! అని వస్తుంది. ఇప్పుడు అద్భుతమైతే చేసారు, ప్రతి స్థానంలో సందేశాన్ని ఇచ్చారు కానీ ఇప్పుడు వారస క్వాలిటీని తయారు చెయ్యండి. విదేశాల నుండి వారసులను తయారుచేసి తీసుకురండి. చెయ్యగలరు ఎందుకంటే అందరికంటే ఫాస్ట్ గా వెళ్ళేవారు కదా.

టీచర్ అక్కయ్యలు చాలామంది వచ్చారు. - టీచర్లను చూసైతే బాప్ దాదా చాలా సంతోషిస్తారు ఎందుకంటే నిమిత్తమైన టీచర్లుగా ఎవరైతే అయ్యారో వారు బాప్ దాదాను ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తులు. ఎవరైనా టీచరు చూడగానే సంతోషిస్తారు ఎందుకంటే టీచర్లు అంటేనే వారి ఫీచర్ల ద్వారా ఫ్యూచర్ (భవిష్యత్తు)ను చూపించేవారు. మీ ఫ్యూచర్ ఏమిటి? సదా మనసుతో సంతోషంగా ఉండటము, సదా అధికారిగా ఉంటూ అధీనులుగా ఉండకుండా ఉండటమే మీ ఫ్యూచర్. మరి టీచర్ల ఫీచర్లు దీనిని సాక్షాత్కారం చేయిస్తాయి. ప్రతి టీచరు ఏమనుకోవాలంటే, ఎక్కడన్నా మాట్లాడినా మాట్లాడకపోయినా కానీ మీ ఫీచర్లు వర్తమాన సమయ ప్రాప్తిని మరియు భవిష్య ప్రాప్తిని మీ ముఖంలో చూపాలి. నా ముఖము సదా ఈ ప్రాప్తులను సాక్షాత్కారం చేసేదిగా ఉందా అని పరిశీలించుకోండి. ఎవరైనా టీచర్ ఎదుటకు వస్తే, టీచరును చూడగానే ఒకటి, సంతోషంగా అవ్వాలి, సంతోషం వారి జీవితంలో కనిపించాలి. ఇటువంటి సంతోషమైన మనసుతో, సంతోషమును అదృష్టముగా కలిగి ఉండండి. ప్రతి టీచర్ లక్ష్యము మంచిగా ఉండటాన్ని బాప్ దాదా చూసారు. చెయ్యవలసిందే. అవ్వవలసిందే. ఇదే కదా మీ లక్ష్యము? లక్ష్యమేమిటి? ఇదే లక్ష్యము కదా! ఈ లక్ష్యము లక్షణాలలో కనిపిస్తుంది కూడా, మరింత కనిపించాలి. ఎవరు వచ్చినా కానీ సంతోషాన్ని తప్పకుండా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే సంతోషము ప్రతి మనిషికి అవసరము. కోరుకుంటారు కానీ అవ్వలేకపోతున్నారు. మరి టీచర్లు అనగా తమ ఫీచర్ల ద్వారా కూడా సేవ చేసేవారు. వీరు ఎంత గొప్పగా అయ్యారు అని అనుభవం అవ్వాలి. ఇక రాబోవు సమయంలో మీ ముఖము మరియు నడవడిక ఎక్కువ సేవను చేస్తాయి ఎందుకంటే ఎలా అయితే సున్నితమైన సమయము వస్తుందో అంతగా సమయము తక్కువగా లభిస్తుంది కానీ ఏదో లభించాలి, ఏదో లభించాలి అన్న కోరిక ఎక్కువ అవుతుంది. ఇందుకోసం టీచర్లు సదా ఎంతగా ఎవరెడీగా ఉండాలంటే ఎవరు వచ్చినాకానీ వారు ఏదో ఒకటి తీసుకు వెళ్ళగలగాలి. ముఖము మరియు నడవడిక ద్వారా కూడా ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి. దాత పిల్లలు కదా! బాప్ దాదా అయితే టీచర్లను చూసి చాలా సంతోషిస్తారు. మనసులో వాహ్ టీచర్లు వాహ్! అని పాట పాడుతూ ఉంటారు ఎందుకంటే ప్రతి టీచరు సేవనైతే చేస్తారు కానీ తమ రిజల్టును రాత్రి కూడా చూసుకుంటారు. ఈ రోజు ఏ సేవ అయింది అని చూసుకుంటారు. తమ చార్టును తామే చూసుకుంటారు. సేవ కోసం పెట్టుకున్న లక్ష్యమైతే పూర్తయింది. ఒకవేళ కొన్ని కారణాల వల్ల పూర్తి అవ్వకపోతే దానిని డబుల్ చెయ్యండి. ఖాళీగా వదలకండి ఎందుకంటే టీచర్లు అంటే నిమిత్త దాతకు పిల్లలు, దాతలు. చిన్న సెంటరు వారైనా కానీ పెద్ద సెంటరు వారైనా కానీ బాప్ దాదా అయితే సంతోషిస్తున్నారు కానీ త్యాగం చేసి సేవాస్థానానికి రావడము కూడా ధైర్యంతో కూడుకున్న విషయమే. బాప్ దాదా మీ ధైర్యానికి సంతోషిస్తున్నారు. ఇప్పుడు మరింతమందిని తయారు చెయ్యండి. ఇంకా టీచర్లను తయారు చెయ్యండి ఎందుకంటే సేవ పెరగవలసిందే. ఇప్పుడు కొంత హంగామా జరుగుతుంది, అందరూ ఎంతో ఉత్కంఠతో మీ వద్దకు వస్తారు. సేవ పెరిగేదే ఉంది, తగ్గేది లేదు. మంచిది, ఒక జోన్ నుండి ఎక్కువ మంది టీచర్లు , వేరే స్థానం నుండి తక్కువ మంది ఉండి ఉండవచ్చు. (2000 మంది టీచర్లు వచ్చారు). టీచర్లకు అభినందనలు.

కలకత్తా వారు ఎంతో చక్కగా అలంకరించారు:- కలకత్తా వారు ఈ సేవను ఎంతో మనస్ఫూర్తిగా స్వీకరించారు. అలంకరణ ఎలా ఉన్నాకానీ మనస్పూర్తిగా చెయ్యడాన్ని బాప్ దాదా చూసారు. బాప్ దాదా ఇందులో మనసును చూస్తారు, అలంకరణను చూడరు. అదైతే నడుస్తూ - తిరిగుతూ ఉంటేనే కనిపిస్తుంది కానీ మనస్ఫూర్తిగా చేస్తున్నందుకు అభినందనలు, అభినందనలు. బాగుంది. కలకత్తా బ్రహ్మబాబా యొక్క దివ్య జన్మభూమి. బాగుంది. మీ ఇన్‌ఛార్జ్ దాదీ కూడా అద్భుతమైన పాత్రను వహిస్తున్నారు. ఇప్పుడు అన్ని జోన్ల వారికి బాప్ దాదా ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు సేవ చేసి వారస క్వాలిటీని తీసుకురండి, ఇందులో నంబరును తీసుకోండి. సేవాస్థానాలను పెంచారు, బాబా పిల్లలను కూడా పెంచారు ఇందుకు అభినందనలు కానీ ఇప్పుడు ప్రతి జోన్ వారు వారస క్వాలిటీని పెంచాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. మైకులు కూడా కావాలి, వారసులు కూడా కావాలి, ఇటువంటి క్వాలిటీని పెంచండి అని బాప్ దాదా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎవరు చెప్తే, ఒక్కరు చెప్తే అనేకులు ప్రభావితులైతే దానిని క్వాలిటీ అని అంటారు. అచ్ఛా.

నలువైపుల ఉన్న అతి స్నేహి, సహయోగి, సేవాధారి పిల్లలకు బాప్ దాదా స్నేహ దివసమున స్నేహము నిండిన ప్రియస్మృతులను ఇస్తున్నారు. దీనితో పాటు బాప్ దాదా ప్రతి స్నేహి పిల్లలకు ఈ విషయమును చెప్తున్నారు - ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరూ తీవ్ర పురుషార్థములో నంబరు వన్ ను తీసుకోవాలన్న లక్ష్యాన్ని ఉంచండి. అవ్వవలసిందే, డ్రామా తయారుచెయ్యవలసిందే. నలువైపుల ఎక్కడ కూర్చున్నాకానీ, ఎంత ఉల్లాస ఉత్సాహాలతో వింటున్నారు, చూస్తున్నారు అన్నది బాప్ దాదా అందరినీ చూస్తున్నారు. పిల్లలందరికీ స్నేహపూర్వక ప్రియస్మృతులు మరియు అభినందనలు, అభినందనలు.  

దాదీలతో: - అచ్చా, చూడండి. నిమిత్తమైన దాదీలందరూ చాలా ప్రియమైనవారు. (దాదీ గుల్జార్ చాలా మంచివారు) మీరు లేకపోతే ఏమి చేసేవారు! దాదీలందరూ ప్రియమైనవారు, అతీతమైనవారు. (బాబా ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి)

మోహిని అక్కయ్యతో: - వీరు ధైర్యవంతురాలు, మంచిగా అయిపోతారు. బాప్ దాదా నడిపిస్తున్నారు కదా. వీరు నడుస్తున్నారు. బాప్ దాదా నడిపిస్తున్నారు. లెక్కాచారాలను సమాప్తం చేసుకుని నడుస్తున్నారు. చాలా మంచిది. 

బాప్ దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంత ప్రియమంటే, దాదీలు ముందుకు వస్తారు మీరు రాకపోయినా కానీ బాప్ దాదాకు పిల్లలందరిపై ఎంతో ప్రేమ ఉంది. మేమైతే దూరం నుండి చూసేవారము అని అనుకోకండి. మీరు హృదయంలో ఉండేవారు. అచ్ఛా!

పర్ దాదీతో: - మీ జోన్ వచ్చింది, చూడండి ఎంత మంచిగా వచ్చారో! అచ్ఛా. (ముగ్గురు అన్నయ్యలు బాప్ దాదాకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు) మీ త్రిమూర్తి చాలా బాగుంది. (రమేష్ అన్నయ్య గాడ్లీవుడ్ స్టూడియో ఫోటో బాబాకు చూపించారు. 26 జనవరి దీని ప్రారంభోత్సవం అని చెప్పారు.) చాలా మంచిది, ఇప్పుడు బాగా నడిపించండి. బాగా శక్తితో నడిపించండి. క్రొత్త క్రొత్త విషయాలను చెయ్యండి, జరుగుతుంది. సేవ అంటే మేవా తినడమే. సేవను చెయ్యడం లేదంటే మేవాను తింటున్నారని అర్థం. (ఉషా సోదరికి సేవపై ఎంతో ఉత్సాహము ఉండేది) వారి భావన పని చేస్తుంది. సేవపై ఉన్న భావన, సేవ జరగాలి, సేవ జరగాలి అని వారి మనసులో ఉన్న సంకల్పం పని చేస్తుంది. సేవా ఉల్లాసము ఉండేది అందుకే కదా పరివారానికి మరియు బాబాకు కూడా ప్రియంగా ఉన్నారు. (రమేష్ అన్నయ్యతో) మీ ఆరోగ్యం మంచిగా ఉందా? నడిపించండి. 

భూపాల్ అన్నయ్యతో: - ఇప్పుడు ఆఫీసర్ మంచిగా అయిపోయారు. ఇప్పుడిక ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. వారిని యోగంతో మంచిగా చేసి వెళ్ళి కొంత సేవను చెయ్యండి. మీరెంత శుభ చింతకులు అని అప్పుడు వారికి అర్థమవుతుంది. ఈ అనుభవాన్ని తప్పక చెయ్యాలి. తప్పకుండా మంచిగా అయిపోతారు. అచ్ఛా,

గోలక్ అన్నయ్యతో: - (చాలా కృషి చేస్తారు) కృషికి ఫలితం వీరికి ఆంతరికంగా లభిస్తుంది. కృషి ఎప్పుడూ వ్యర్థంగా పోదు. అందరి నుండి పొందే ప్రేమయే వీరికి లభిస్తున్న ప్రేమ. ఏదైనా విషయం జరగడం అది మరో విషయం, కానీ హృదయపూర్వక ప్రేమ ఉంది. అచ్చా.

నారాయణ్ దాదా మరియు మనోజ్జ్:- ఇద్దరూ వచ్చారు, చాలా మంచిది. వచ్చారు. మంచిది. ప్రతి టర్న్ లోనూ మీరు రావాలి. ఒకప్పుడు వచ్చేవారు, ఇప్పుడేమో అప్పుడప్పుడూ వస్తున్నారు. అప్పుడప్పుడూ అంటే బాబాకు నచ్చదు. రావాలి ఎందుకంటే ప్రతి ఆత్మ ఎంతో ముందుకు వెళ్ళాలి అని బాబా కోరుకుంటున్నారు. రావడము, వెళ్ళడము, కలవడము దీనితో సంతోషము కలుగుతుంది. ముఖము సంతోషమయంగా అవుతుంది, దుఃఖము సమాప్తమైపోతుంది. విచారిస్తూ ఉంటారు కదా! సంతోషంగా కూడా ఉంటారు ఎందుకంటే జ్ఞానమైతే ఉంది కదా. వీరు కూడా సంతోషంగా ఉన్నారు. మీరిద్దరూ ఎంత సంతోషంగా ఉండాలంటే, ఇంత సంతోషం మీకెక్కడ దొరికింది అని అందరూ అడగాలి! సంతోషంగా ఉండాలి. బాగుంది. సంతోషంగా ఉంటే అన్ని సమస్యలు తొలగిపోతాయి, ఇది గ్యారంటీ. ఆలోచిస్తారు కదా, సంతోషంగా ఉండండి. ఎంత సంతోషంగా ఉంటారో అంతగా ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది మరియు అందరూ కూడా మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. అయినా ఈ పరివారంతో సంబంధం ఉంది కదా, ఇక్కడికి సంబంధీకులే కదా మీరు. ఎక్కడున్నాకానీ మీ ముఖముతో సేవను చెయ్యండి. ఎవరు చూసినా కానీ వీరెవరు, ఎక్కడినుండి వచ్చారు అని అనుకోవాలి. పాలన అయితే తీసుకున్నారు కదా.

Comments