30-11-2011 అవ్యక్త మురళి

          30-11-2011         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

        “అమృతవేళ విశేషంగా సర్వశక్తుల అనుభవీ స్వరూపులుగా అయ్యి యోగ శక్తిని వాయుమండలంలో వ్యాపింపజేయండి. మనసును సదా బిజీగా ఉంచండి, సమయపు                                                            పిలుపు - తీవ్ర పురుషార్థీ భవ"

ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లల మస్తకంపై మెరుస్తున్న భాగ్య సితారలను చూస్తున్నారు. ఒకటి - జన్మ, రెండు - సంబంధము మరియు మూడవ భాగ్యము - ప్రాప్తులు. మూడు భాగ్యములను చూసి హర్షిస్తున్నారు. జన్మలోని భాగ్యమైతే మీకు తెలుసు. మీ అందరికీ ఈ దివ్య జన్మ, బ్రాహ్మణ జన్మను ఇచ్చినది స్వయంగా భాగ్య విధాత. మరి ఇది ఎంత పెద్ద భాగ్యమో ఆలోచించండి! దీనితో పాటు సంబంధము, దీని విశేషత తెలుసు కదా. మూడు సంబంధాలు-తండ్రి, శిక్షకుడు, సద్గురువు. మూడు సంబంధాలూ ఒక్క బాబాతోటే ఉన్నాయి. ప్రాప్తుల గురించి కూడా మీకు తెలుసు. ఎక్కడ బాబా ఉంటారో అక్కడ ప్రాప్తులు సర్వమూ ఉంటాయి మరియు అనంతముగా ఉంటాయి. ఒక్కరిలోనే మూడు సంబంధాలు. జీవితంలో ఈ మూడు సంబంధాలు అవసరము. కానీ ప్రపంచం వారి ప్రతి సంబంధము వేర్వేరు వ్యక్తులతో ఉంటుంది కానీ మీ మూడు సంబంధాలు ఒక్కరితోటే ఉన్నాయి. ఒక్కరితోటే మూడు సంబంధాలూ ఉన్న కారణంగా స్మృతి కూడా, అనుభవం కూడా సహజంగా జరుగుతాయి. అందరూ మూడు సంబంధాలలో అనుభవిగా ఉన్నారు కదా! తండ్రి ద్వారా ఏమి లభిస్తుంది? వారసత్వము. వారసత్వము కూడా ఎంత ఉన్నతమైనది లభిస్తుంది, అంతేకాక ఈ వారసత్వము ఎంత సమయము వరకు ఉంటుంది! ఎందుకంటే ఈ వారసత్వము పరమాత్మ తండ్రి ద్వారా లభిస్తుంది. రెండవ సంబంధము శిక్షకుడు. శిక్షణను సోర్స్ ఆఫ్ ఇన్ కమ్ (ఆదాయానికి ఆధారము) అని అంటారు. మరి మీ అందరికీ శిక్షకుని ద్వారా ఎంతటి ఉన్నత ప్రాప్తి లభించిందో తెలుసు కదా! ఇంతటి ఉన్నత ప్రాప్తిని పరమాత్మ తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు. విద్య ద్వారా పదవి ప్రాప్తిస్తుంది. మీ అందరికీ కూడా శ్రేష్ఠ ప్రాప్తి కలిగింది. ప్రపంచంలో అన్నిటికన్నా ఉన్నత పదవి రాజ పదవి అని అంటారు. మరి మీకు కూడా శిక్షకుని ద్వారా రాజ పదవి ప్రాప్తించింది. ఇప్పుడు కూడా స్వరాజ్యానికి రాజులు, ఎందుకని? ఆత్మ రాజయోగి అయిన కారణంగా స్వరాజ్య అధికారిగా తయారువుతుంది. స్వయంపై రాజ్యం చేస్తుంది. కర్మేంద్రియాలకు వశమవ్వదు. ఆత్మ యజమానిగా అయ్యి ఈ కర్మేంద్రియాలకు రాజుగా అవుతుంది. ఇప్పుడు స్వరాజ్యము మరియు భవిష్యత్తులో కూడా రాజ్య భాగ్యము ప్రాప్తిస్తాయి. కావున డబుల్ రాజ్యము - ఇప్పుడు కూడా మరియు భవిష్యత్తులో కూడా పదవి ప్రాప్తిస్తుంది. మూడవ సంబంధము - సద్గురువు. మూడు సంబంధాలు ప్రాప్తించాయి కదా! అవునా? తండ్రి, శిక్షకుడు మరియు మూడవది సద్గురువు. సద్గురువు రూపంలో గురువు నుండి శ్రీమతం లభిస్తుంది. ఎంతటి శ్రేష్ఠ మతం లభించింది! మరి స్వయాన్ని పరిశీలించుకోండి, సదా శ్రీమతంపై నడుస్తున్నానా లేక ఒక్కోసారి మన్మతము వైపుకు, ఒక్కోసారి పరమతము వైపుకు బుద్ధి వెళ్తుందా? పరిశీలించుకున్నారా? సద్గురువు ద్వారా సదా శ్రీమతమనే శ్రేష్ఠ మతము పైనే నడుస్తున్నాము, మన్మతము లేక పరమతము ఎప్పుడూ స్వప్నంలో కూడా రాలేదు అని భావించేవారు చేతులెత్తండి. ఎవరైతే సదా శ్రీమతంపైనే నడుస్తున్నారో, పరమతము, మన్మతము లేదో వారు చేతులెత్తండి.

చూడండి, మాతలు చేతులెత్తారు. కొద్దిమంది చేతులెత్తుతున్నారు. అప్పుడప్పుడూ వెళ్తుంది. పరమతము, మన్మతము మోసం చేస్తాయి. మరి విశేషమైన శ్రీమతము ఏమిటి? స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను గుర్తు చెయ్యండి. ఇది సహజమా, కష్టమా అప్పుడప్పుడూ కష్టంగా అనిపిస్తుందా! కానీ బాబా ఏమి కోరుకుంటున్నారంటే సదా ఈ మూడు సంబంధాలతో పిల్లలు ప్రతి ఒక్కరూ మున్ముందుకు ఎగిరిపోవాలి అని. మరి బాప్ దాదా అడుగుతున్నారు, ఎవరైతే చేతులెత్తలేదో వారు ఇప్పటినుండి మన్మతము, పరమతాన్ని త్యాగం చెయ్యగలరా? చెయ్యగలరా? వారు చేతులెత్తండి. అచ్చా. ఎందుకంటే బాప్ దాదా సమయం గురించి సూచన ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ఈ సంగమ సమయము అతి విలువైనది. వర్తమాన సమయం అనుసారంగా అన్నీ అకస్మాత్తుగా జరుగనున్నాయి అని కూడా బాప్ దాదా సూచన ఇచ్చి ఉన్నారు. కావున సదా ఎవరెడీగా అవ్వాలి కదా! కలిసి వస్తారు కదా లేక వెనుక వెనుక వస్తారా? బాప్ దాదాతో కలిసి మన ఇంటికి వెళ్ళాలి కదా! రెడీగానే ఉన్నారు కదా! కలిసి వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? ఎవరెడీ. రెడీ కూడా కాదు, ఎవరెడీ. కావున బాప్ దాదా సమయం గురించి సూచన ఇస్తున్నారు. ఈ ఒక్క జన్మలో 21 జన్మల ప్రాలబ్దాన్ని తయారు చేసుకోవాలి. మరి ఎంత అటెన్షన్ ను ఉంచాలో ఆలోచించండి. బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై ప్రేమ ఉంది. పిల్లలందరూ బాబాతో కలిసి కలిసి వెళ్ళాలి, కలిసి రాజ్యా ధికారులగా అవ్వాలన్నదే బాబా కోరుకుంటున్నారు. మరి కలిసి వెళ్ళాలంటే బాబా సమానంగా సంపూర్ణంగా మరియు సంపన్నంగా అవ్వాలి కదా, అప్పుడే కలిసి వెళ్తాము కదా! ఈ సమయంలో ఈ చిన్ని జన్మలో 21 జన్మల ప్రాప్తి నిశ్చితమైనది. సంగమంలోని ఈ చిన్ని జన్మలోని ఒక్కొక్క నిమిషము ఎంత మహత్తరమైనదో ఆలోచించండి! లెక్క వేయండి, ఈ ఒక్క జన్మలో 21 జన్మల రాజ్య భాగ్యాన్ని తీసుకోవాలంటే సంగమంలోని ఒక్క నిమిషము కూడా ఎంతటి విలువైనది! ఈ విలువను తెలుసుకొని ఏం చెయ్యవలసి ఉంటుంది?

రెండు విషయాలలో అటెన్షన్ ఉంచవలసి ఉంటుందని బాప్ దాదా ముందు కూడా వినిపించి ఉన్నారు. ఆ రెండు విషయాలు ఏమిటి? గుర్తుంది కదా! ఒకటి - సమయము, రెండు - సంకల్పము. సంకల్పము వ్యర్థంగా పోకూడదు, సమయము వ్యర్థంగా పోకూడదు. ఒక్కొక్క సెకండు సఫలమవ్వాలి. మరి చెప్పండి, ఇంతటి అటెన్షన్ ను ఇవ్వవలసి ఉంటుంది కదా! బాప్ దాదాకు పిల్లలందరిపై ప్రేమ ఉంటుంది. ఒక్కరు కూడా కలిసి రావడం నుండి వంచితమవ్వకూడదు అని బాప్ దాదా కోరుకుంటున్నారు. కలిసి ఉన్నాము, కలిసి వెళ్తాము, కలిసి రాజ్యాధికారులుగా అయ్యి సదా జీవితంలో సుఖశాంతులను అనుభవం చేసుకుంటాము. మరి చెప్పండి, కలిసి వస్తారు కదా! వస్తారా? ఉండిపోరు కదా? చూడండి, మూడు భాగ్యములు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్నాయి. మీ మస్తకంలో ఈ మూడు భాగ్యములు కనిపిస్తున్నాయి కదా! సంగమయుగమే భాగ్యశాలి యుగము. ఎవరు ఎంత భాగ్యాన్ని తయారు చేసుకోవాలనుకుంటే అంతగా చేసుకోవచ్చు. కానీ ఇందుకు బహుకాలపు అటెన్షన్ అవసరము. కావున పిల్లలందరూ తమ తమ పురుషార్థంలో ఇప్పుడు తీవ్రతను తీసుకురండి. పురుషార్థీ కాదు. బాప్ దాదా ఏమి చూసారంటే పురుషార్థము చేస్తున్నారు కానీ ఇప్పుడు అందరిదీ తీవ్రతతో కూడిన పురుషార్థం ఉండాలి. బాప్ దాదా పిల్లలందరినీ బాలక్ సో మాలికులుగా చూడాలనుకుంటున్నారు. దేనికి యజమానులు? సర్వ ఖజానాలకు యజమానులు. అప్పుడప్పుడూ కొంతమంది పిల్లలు బాప్ దాదాతో ఏమని చెప్తారంటే బాబా, మీరైతే సర్వ శక్తులను ఇచ్చారు, మేము కూడా స్వయాన్ని సర్వశక్తిమంతులుగా భావిస్తుంటాము కానీ కొంతమంది పిల్లల ఫిర్యాదు ఏమిటంటే - అప్పుడప్పుడూ ఏ సమయంలో ఏ శక్తి అవసరమో అది సమయానికి రాదు. ఇందుకు కారణము ఏమిటి? బాబా ప్రతి ఒక్కరికీ సర్వ శక్తులనూ ఇచ్చారు. ఇచ్చారా లేక కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువగా ఇచ్చారా? సర్వ శక్తులు లభించాయా, చేతులెత్తండి. అందరికీ లభించాయి కానీ సమయానికి ఎందుకు ఉపయోగపడవు? ఇందుకు కారణము? కారణము మీకు తెలుసు కూడా కానీ ఆ సమయంలో మర్చిపోతారు. సర్వ శక్తుల ఖజానా పిల్లలందరికీ వారసత్వంగా లభించింది. పిల్లలందరికీ బాబా సర్వ శక్తుల వారసత్వాన్ని ఇచ్చారు. ఒకరికి తక్కువగా మరొకరికి ఎక్కువగా ఇవ్వలేదు. సర్వ శక్తులనూ ఇచ్చారు. కానీ సమయానికి ఎందుకు ఉపయోగపడటం లేదు? మీరు ఆలోచించండి, ఎవరైనా తమ స్వమానమనే సీట్ పై ఉండకపోతే వారి ఆజ్ఞలను పాటిస్తారా? అదే విధంగా, ఏ శక్తి అయితే సమయానికి మీ వద్దకు రావడం లేదో, అందుకు కారణం మీరు 'మాస్టర్ సర్వశక్తిమంతుడను' అన్న సీట్ పై సెట్ అయ్యి లేకపోవడమే. అందుకే సీట్ పై లేకపోతే ఎవరూ మాట వినరు. కావున సదా మీ సీట్ పై సెట్ అయ్యి ఉండండి. ఒకసారి వ్యర్థ ఆలోచనలు వస్తాయి, ఒకసారి టెన్షన్ కలుగుతుంది. వీటి వలననే స్వమానమనే సీట్ దూరమవుతుంది. బాప్ దాదా ప్రతి ఒక్కరికీ ఎన్ని స్వమానాలు ఇచ్చారు! ఎంత పెద్దది స్వమానము అనే సీట్! లెక్కపెట్టండి, ఎన్ని స్వమానాలు బాబా ఇచ్చారు? స్వమానంలో సెట్ అయ్యి ఉండకపోతే ఎక్కడ స్వమానము ఉండదో అక్కడ ఏమి జరుగుతుంది? తెలుసు కదా! దేహ అభిమానము వస్తుంది. ఉంటే స్వమానము ఉంటుంది లేకపోతే దేహ భానము ఉంటుంది. దేహ భానము అనే సీట్ పై కూర్చుని ఆర్డర్ చేస్తే శక్తులు మీ మాట వినవు. లేకపోతే మాస్టర్ సర్వశక్తిమంతుని ఆజ్ఞ వినకపోవడం అన్నది జరుగదు. సీట్ పై సదా సెట్ అయ్యి ఉండే అభ్యాసాన్ని సదా చెయ్యండి. పరిశీలించుకోండి, కర్మయోగంలో ఉన్నా కానీ, సేవలో ఉన్నా కానీ, స్వ మననము, మంథనములో ఉన్నా కానీ సీట్ పై సెట్ అయ్యి ఉంటే సర్వ శక్తులూ హాజరవుతాయి. 

ఈ రోజు బాప్ దాదా ఏమి చూసారంటే, అమృతవేళ అంతటా చుట్టి వచ్చారు. నలువైపుల చుట్టి వచ్చారు, దేశము మరియు విదేశము. చుట్టి రావడానికి బాప్ దాదాకు సమయమేమీ పట్టదు. అప్పుడు ఏమి చూసారు? చెప్పమంటారా! అందరూ మెజారిటీ కూర్చునైతే ఉన్నారు. లేచి తమ తమ స్థానాలలో కూర్చుని ఉన్నారు, అమృతవేళ సమయమంతా అనుభవీ మూర్తిగా అయ్యి కూర్చోవాలని పురుషార్థం కూడా చేస్తున్నారు కానీ ఏమి చూసాము? కొద్దిమంది మాత్రమే అనుభవీ మూర్తులుగా ఉన్నారు. అన్నిటికన్నా పెద్ద శక్తి అనుభవము. అనుభవీ స్వరూపము, సర్వ శక్తుల అనుభవీ స్వరూపము, మాస్టర్ నాలెడ్జ్ ఫుల్, మాస్టర్ సర్వ శక్తి స్వరూపము. అనుభవీ స్వరూపులుగా అవ్వడంలో కొంత లోటు కనిపించింది. పురుషార్ధం చేస్తున్నారు. అయినాకానీ, పురుషార్థం చేసి వచ్చే వారికి బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. మెజారిటీ కూర్చుంటున్నారు కానీ లైట్ మైట్ స్వరూపంలో అనుభవీ మూర్తులుగా అయ్యి కూర్చోవాలన్నది బాప్ దాదా ఆశ. ఎందుకంటే ఈ అమృతవేళలో చేసే యోగ శక్తి పూర్తి వాయుమండలంలో వ్యాపిస్తుంది. ఈ అనుభవాన్ని మరింత ముందుకు సాగించండి. ఎలా అయితే బ్రహ్మా బాబాను చూసాము కదా, ఎంతటి శక్తిశాలి ఫరిస్తా స్థితి ఉండేదో అలాగే ఈ అమృతవేళకు ఇప్పుడు తమ తమ ప్రకారంగా అటెన్షన్ ను అలసట లేకుండా ఇవ్వండి. బాప్ దాదా ఏమి చూసారంటే కొంతమంది పిల్లలు లైట్-మైట్ రూపంలో కూడా కూర్చుంటారు. కూర్చోరు అని కూడా కాదు, కూర్చుంటారు కానీ ఈ సమయంలో చేసే పురుషార్థానికి మరింత అటెన్షను ఇవ్వవలసి ఉంటుంది. మనసును సదా బిజీగా ఉంచండి అని బాప్ దాదా ముందు కూడా సూచన ఇచ్చి ఉన్నారు. మనసా సేవతో కానీ, వాచా సేవతో కానీ, మననశక్తితో కానీ ఏదో ఒక విధంగా మనసును బిజీగా ఉంచండి. మననం చెయ్యండి. మననశక్తి మనసును ఏకాగ్రం చేస్తుంది. కొంతమంది పిల్లలు మననం మంచిగా చేస్తారు కానీ మననశక్తిని కూడా రోజంతటిలో పెంచండి ఎందుకంటే బాప్ దాదాకు చివరి బిడ్డపై కూడా ప్రేమ ఉంటుంది. చివరి బిడ్డ కూడా కలిసి రావాలి అని బాప్ దాదా కోరుకుంటారు. ఉండిపోకూడదు. వెనుక వెనుక ఉండిపోకూడదు. మరి ఏమి చేస్తారు? అటెన్షన్.

ఈరోజు బాప్ దాదా సభను చూసారు, పిల్లల వృద్ధి జరిగేదే ఉంది అని తెలుసు. 75 సంవత్సరాల జూబ్లీ జరుపుకున్నారు. అందుకు బాప్ దాదా పిల్లలకు అభినందనలు తెలుపుతున్నారు. బాప్ దాదా పిల్లలలోని సేవా తపనను కూడా చూసారు. ప్రతి స్థానంలోని వారికీ ఉత్సాహం ఉంది. సేవ యొక్క ఫలము మరియు సేవ యొక్క బలము కూడా కనిపిస్తున్నాయి. విశేషంగా బాప్ దాదా ఏమి చూసారంటే పిల్లలు ఎక్కడ సేవ చేసినా అక్కడ ఈసారి ప్రభుత్వంలో నిమిత్తమై ఉన్న ఆత్మలు ఎక్కువగా వచ్చారు. ఇప్పటి సమయానుసారంగా దుఃఖము, అశాంతి పెరుగుతున్న ఈ సమయంలో ఈ అంశాలు చాలా అవసరమని చివరకు వారు అంటారు. ఎందుకంటే ఎంతగా శాంతిని కోరుకుంటున్నారో అంతగా అశాంతి పెరిగిపోతుంది. ఏదో ఒక అశాంతికరమైన విషయము వస్తూనే ఉంది. అందుకే నలువైపుల టెన్షన్ పెరిగిపోతుంది. భారతదేశం టెన్షన్ ఫ్రీ అవ్వాలని ప్రభుత్వం కూడా ఆశిస్తుంది. మరి అందరూ, ఏ పిల్లలైతే సేవను చేసారో ఆ పిల్లలందరికీ బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. సేవ చేయబోయే వారికి కూడా ముందుగానే అభినందనలు తెలుపుతున్నాము. 

బాప్ దాదా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నారు, పిల్లలందరూ ఫాలో ఫాదర్ చేస్తూ బాబా సమానంగా సంపన్నంగా తప్పకుండా అవ్వాలి. పిల్లలందరూ పురుషార్థాన్ని చేస్తూ ఉండటాన్ని కూడా బాప్ దాదా చూసారు. పురుషార్థం చెయ్యాలన్న తపన కూడా ఉంది. స్వయంతోటి కూడా అనేక ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటారు, ఇక చెయ్యము, ఇక చెయ్యము... కానీ కారణము ఏమవుతుంది? పురుషార్థంలో దృఢత్వము లోపించడమే ఇందుకు కారణము. మధ్య మధ్యలో నిర్లక్ష్యము వచ్చేస్తుంది. అవుతాములే, తయారవుతాములే... ఈ నిర్లక్ష్యము పురుషార్థాన్ని ఢీలా చేసేస్తుంది. మరి ఇప్పుడు ఏమి చేస్తారు? ఇప్పుడు ఇదే విశేషమైన అటెన్షన్ ఉంచండి, మీకు మీరే ఒక ప్రోగ్రామును తయారు చేసుకోండి. రోజంతా మనసును బిజీగా పెట్టుకునే విధంగా తయారుచేసుకోండి. మీ ప్రోగ్రామును మీరు తయారుచేసుకోండి. మనసును బిజీగా పెట్టుకునే విధంగా మీ టైమ్ టేబుల్ ను మీరే తయారుచేసుకోండి. మననం చేయండి, సేవను చెయ్యండి, పరస్పరం అటెన్షన్ ఇచ్చుకోండి కానీ బిజీగా ఉంచండి. మనసుతో బిజీ, శరీరంతో అయితే బిజీగా ఉండనే ఉంటారు. కానీ మనసుతో బిజీగా ఉండండి. మనసుతో బిజీగా ఉండటంలో నంబర్ వన్ వ్యాపారవేత్తగా అవ్వండి. ఇది చెయ్యగలరా? చేస్తారా? చేస్తారా? ఎందుకంటే మీకు తెలుసు, బ్రహ్మా బాబా కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు. మీ అడ్వాన్స్ పార్టీవారు కూడా మీకోసం వేచి ఉన్నారు. వీరు ఎప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకువస్తారా అని. సమయాన్ని సమీపంగా తీసుకువచ్చే బాధ్యత మీదే. స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకోవడమంటే సమయాన్ని సమీపంగా తీసుకురావడమే.

బాప్ దాదా విశేషంగా ఒక్క నెల సమయాన్ని ఇచ్చి ఉన్నారు. ఈ ఒక్క నెలలో ప్రతి ఒక్కరూ తీవ్ర పురుషార్థీలుగా అయ్యి, పురుషార్థీ కాదు, తీవ్ర పురుషార్థీగా అవ్వాలి. సమ్మతమేనా? సమ్మతమేనా? చేతులెత్తండి. అచ్ఛా, అభినందనలు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పం చేసి ప్రతిరోజూ రోజంతటి రిజల్టును బాప్ దాదాకు ఎలా ఇవ్వాలి? తీవ్ర పురుషార్థం యొక్క చార్టును ఎలా ఇవ్వాలి? పురుషార్థం కాదు, తీవ్ర పురుషార్థం. ఇందుకు తయారుగా ఉన్నారా? తయారుగా ఉన్నారా? రెండు చేతులు ఎత్తండి. చాలా మంచిది. ఇప్పుడు బాప్ దాదా అకస్మాత్తుగా మధ్యలోనే రిజల్టును అడుగుతారు. డేట్ చెప్పరు. అకస్మాత్తుగా ఒక్క నెలలో ఏ రోజైనా రిజల్టును అడుగుతారు. చెయ్యాల్సిందే. ఈ ప్రతిజ్ఞ మీకు మీరే స్వయంగా చేసుకోండి. బాప్ దాదా అయితే చేయిస్తూనే ఉన్నారు కానీ మీకు మీరే ఈ సంకల్పం చెయ్యండి మరియు ప్రాక్టికల్ గా చేసి చూపించండి. చెయ్యాల్సిందే. చేద్దాములే, లే, లే వద్దు... ఇప్పుడు ఇది మంచిది కాదు. సమయము ముందుకు సాగుతుంది, అతిలోకి వెళ్తుంది. మరి సమయాన్ని పరివర్తన చేసే పూర్వజులైన మీకు దుఃఖంతో ఉన్న మీ పరివారాన్ని చూసి దయ కలగడం లేదా? దయా హృదయులుగా అవ్వండి. దుఃఖంతో ఉన్నవారికి సుఖమయ దారిని చూపించండి. మనసు ద్వారా కావచ్చు, వాచ ద్వారా లేక సంబంధ సంపర్కం ద్వారా కావచ్చు. మీ పరివారమే కదా! కావున పరివారంలోని దుఃఖాన్ని తొలగించాలి. దయా హృదయులుగా అవ్వండి. అచ్ఛా.

సేవ టర్న్ కర్ణాటక జోన్ వారిది: - అచ్చా. ఇప్పుడు కర్ణాటక వారు ఏ విశేషత చేస్తారు? తీవ్ర పురుషార్థం చేసే విశేషత. పురుషార్ధం చేస్తారు మరియు చేయిస్తారు. చేయించడము మరియు చేయడము, ఇందులో చేతులెత్తండి. బాప్ దాదా కేవలం ఇక్కడ మాత్రమే చూడటం లేదు. పిల్లలు ఎక్కడ కూర్చున్నా, పార్కులో కూర్చున్నా, భిన్న భిన్న హాళ్ళల్లో కూర్చున్నా కానీ అందరికీ చాలా చాలా ప్రియస్మృతులను తెలుపుతున్నారు. దూరంగా కూర్చుని ఉన్నా కానీ హృదయానికి సమీపంగా ఉన్నారు. నలువైపుల నుండి చూస్తున్న పిల్లలకు కూడా బాప్ దాదా ప్రియస్మృతులను తెలుపుతున్నారు. దేశవిదేశాలలోని పిల్లలందరినీ బాప్ దాదా చూస్తున్నారు. దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా కానీ బాప్ దాదా హృదయంలో ఇమిడిపోతారు ఎందుకంటే పిల్లల ప్రతిజ్ఞ ఏమిటంటే మా హృదయాలలో బాబా ఉన్నారు మరియు మేము ప్రతి ఒక్కరమూ బాబా హృదయంలో ఉన్నాము అని. కావుననే బాబాకు హృదయాభిరాముడు అన్న టైటిల్ వచ్చింది.

అచ్చా, కర్ణాటకవారు చాలామంది వచ్చారు. సేవ పాత్రను కూడా మంచిగా వహించారు. మధువన్ వారికి కూడా బాప్ దాదా విశేషంగా క్రింద, పైన ఉన్న అందరికీ పదమారెట్లు ప్రేమను మరియు స్మృతిని అందిస్తున్నారు ఎందుకంటే ఎంతగా పెరిగినా కానీ సేవ మంచిగా చేసారు, రిజల్టు మంచిగా వచ్చింది. అలసట లేకుండా అందరినీ ప్రేమతో స్వీకరించడాన్ని బాప్ దాదా చూసారు. ఉండేందుకు వసతిని కల్పించేవారు కావచ్చు, తినిపించేవారు కావచ్చు, ఏ సేవ చేసేవారైనా కానీ, సేవ రిజల్టు మంచిగా ఉంది. అందుకే వచ్చినవారికి, సేవ చేసినవారికి, సహయోగము చేసినవారికి, ఒక్కొక్కరికీ బాబా అభినందనలు తెలుపుతున్నారు. అచ్ఛా.

నాలుగు వింగ్స్ - ఆర్ట్ అండ్ కల్చరల్, సైన్స్ అండ్ ఇంజినీర్, ఎడ్యుకేషన్ మరియు పొలిటీషియన్ వింగ్ వారితో: - అచ్చా, ప్రతి వింగ్ వారు తమ తమ గుర్తును పెట్టుకున్నారు. బాప్ దాదా అందరి ఉల్లాస ఉత్సాహాలను చూసి చాలా చాలా సంతోషంగా ఉన్నారు. రిజల్టులో కూడా ప్రతి వింగ్ ఇప్పుడు ప్రగతిలోకి వెళ్ళడాన్ని చూసాము. ప్రతి వింగ్ వారు చేయదల్చుకున్న ప్రోగ్రాములు బాప్ దాదా వద్దకు చేరుకున్నాయి. ప్రోగ్రాములైతే తయారు చేసారు, చాలా మంచిది. ఉత్సాహంతో చేసారు. దానిని ప్రాక్టికల్ లో చేసి బాప్ దాదా ఎదుట రిజల్టుతో సహా ఎవరైనా శాంపులను కూడా ప్రతి వింగ్ తీసుకువస్తుంది. నాలుగు వింగ్స్ వారు చాలామంది ఉన్నారు. చేతులెత్తండి. బాప్ దాదా అందరినీ సమీపంగా చూస్తున్నారు. బాగుంది. ఇప్పుడు ప్రతి ఒక్క వింగ్ రిజల్టును తయారు చెయ్యండి. ఎప్పటినుండైతే వింగ్స్ సేవ ఆరంభమయిందో అప్పటినుండి ఇప్పటివరకు ఎంతమంది మైకులను తయారు చేసారు, ఎంతమంది వారసులు తయారయ్యారు, ఎంతమంది విద్యార్థులు తయారయ్యారు! ప్రతి వింగ్ ఉత్సాహంతో అయితే చేస్తుంది కానీ బాప్ దాదా ఈ రిజల్టును చూడాలని ఆశిస్తున్నారు. అభినందనలు కూడా తెలుపుతున్నారు ఎందుకంటే ప్రతి వింగ్ ఒక దానిని మించి మరొకటి ముందుకు వెళ్తుంది. సేవలో క్రొత్త క్రొత్త ప్లాన్లు కూడా తయారుచేస్తున్నారు. కావున ఈ రోజు వచ్చిన నాలుగు వింగ్స్ వారికి బాప్ దాదా ఇప్పుడు విశేషంగా అభినందనలు తెలుపుతున్నారు. అచ్చా. డ్రస్సు కూడా వేసుకుని వచ్చారు ఎడ్యుకేషన్ వింగ్ వారు. (సైంటిస్ట్ ఇంజినీర్ వింగ్ యొక్క సిల్వర్ జూబ్లీ) మంచిది, సిల్వర్ జూబ్లీ సందర్భంగా విశేషంగా బాప్ దాదా ప్రత్యేకంగా ఒక్కొక్కరినీ పేరు సహితంగా చూస్తున్నారు మరియు అభినందనలు కూడా తెలుపుతున్నారు. సంస్థది 75 సంవత్సరాల జూబ్లీ, వీరిది సిల్వర్ జూబ్లీ. బాప్ దాదా సంతోషిస్తున్నారు. చేస్తూ వెళ్ళండి, ఎగురుతూ ఉండండి, చివరకు ఆరోజు వస్తుంది, సమీపంగా వస్తుంది, ఆ రోజున అందరూ మా బాబా వచ్చేసారు అని అంటారు. ఇప్పుడు ఏ వింగ్స్ అయితే ఉన్నాయో అందులో ఎటువంటి ఆత్మలను తయారు చెయ్యండంటే మనస్పూర్తిగా, 'నా బాబా వచ్చేసారు' అనే ఆత్మలను తయారుచెయ్యండి. అటువంటి వారి పేర్లను బాప్ దాదాకు పంపించండి. ఎంతమంది సేవనైతే చేసారో, ఎంతమంది అయితే తయారయ్యారో, అందులో ఎంతమంది నా బాబా వచ్చేసారు అని అంటున్నారు! తర్వాత బాప్ దాదా బహుమతిని ఇస్తారు. ఇప్పుడు ఈ సేవనే బాగా చేయండి. ఇటువంటి పురుషార్థీలు తయారవ్వాలి. ప్రత్యక్షత చెయ్యాలి కదా. దుఃఖంతో ఉన్నవారిని సుఖవంతులుగా చెయ్యాలి కదా! ఈ భారతదేశాన్నే స్వర్గంగా చెయ్యాలి. మరి ఎప్పుడు చేస్తారు? వింగ్స్ వారు వినిపించండి, ఎంత సమయం కావాలి? ఎంత సమయం కావాలి? చెప్పండి. మీరు చెప్పండి, ఎంత సమయం కావాలి? నాలుగు వింగ్స్ నిమిత్తమైన వారు ముందుకు రండి. (అందరినీ స్టేజీ పైకి పిలిచారు). చూడండి, (ఈసారి అన్నామలై యూనివర్శిటీ తరఫున స్నాతకోత్సవంలో యమ్.ఎస్.సి డిగ్రీను ఇస్తారు) బాప్ దాదా ఇప్పుడు ఏదైతే చెప్పారో, అటువంటి వారసులను తయారు చెయ్యండి. ఇప్పుడు టోపీ వేసుకోండి, కానీ వారసులను తయారు చెయ్యండి. వారసులను తయారు చేసే బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది. అక్కడక్కడ మైకులు తయారయ్యారు కానీ వారసులను తయారు చెయ్యండి. ఇందులో నంబర్ తీసుకోండి. ఏ డిపార్టుమెంటు వారసులను తయారు చెయ్యడంలో నంబర్ వన్? ఇప్పుడు వారసులను తయారు చేసే సీజన్. ఇంకా పెంచుతూ వెళ్ళండి, ఇప్పుడు వారసులను తయారుచెయ్యండి. సహయోగులుగా అయితే చాలామంది అవుతారు కానీ వారసులు తయారుకావాలి. ఎటువంటి ఉదాహరణ తయారవ్వాలంటే వారి గురించి విని ఇతరులకు కూడా ఉత్సాహం కలగాలి. సమయం వస్తుంది, ఇప్పుడైతే సమయం కూడా మీకు సహాయం చేస్తుంది ఎందుకంటే దుఃఖం పెరుగుతుంది. ఒక నిర్ణయం తీసుకుంటారు కానీ ఆ నిర్ణయం ఎక్కడ అమలవుతుంది! (ఇప్పుడు అందరూ మంచిగా సహయోగం చేస్తున్నారు) సహయోగమునైతే ఇస్తున్నారు కానీ వారు స్వయం ముందుకు రావాలి. అది కూడా జరుగుతుంది. అచ్చా.

డబుల్ విదేశీ సోదర సోదరీలతో: - డబుల్ విదేశీయులు అనగా డబుల్ ఎగిరే వాళ్ళు అని అర్థం. డబుల్ ఎగరడము అంటే సెకండులో ఏ స్థితిలో కావాలంటే ఆ స్థితిలో ఉండగలగడము. మరి ఇటువంటి అభ్యాసము ఉందా? ఏ సమయంలో ఏ స్థితిని కోరుకుంటే ఆ స్థితితో ఎగిరే కళ స్థితిని అనుభవం చేసుకోండి. ఈ అభ్యాసమే సమయానికి ఉపయోగపడుతుంది. ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో ఆ స్థితి ప్రాక్టికల్ లోకి రావాలి. డబుల్ విదేశీయులు కదా! కావున పురుషార్థం కూడా డబుల్ చేస్తారు కదా! చేస్తున్నారు కూడా, బాప్ దాదా వద్దకు మంచి మంచి సమాచారము వస్తుంది. సేవ సమాచారము కూడా వస్తుంది, సేవ కూడా పెరుగుతుంది, నిమిత్తమయ్యేందుకు మంచి మంచి ఆత్మలు కూడా తయారువుతున్నాయి. అందుకే బాప్ దాదా డబుల్ విదేశీయులకు డబుల్ అభినందనలు తెలుపుతున్నారు. బాగుంది, ప్రతి గ్రూపులో డబుల్ విదేశీయులు ఎవరో ఒకరు ఉంటున్నారు. ఈ మీ ప్రోగ్రామును మంచిగా తయారుచేసారు. డబుల్ విదేశీయులు ఇప్పుడు వారసుల లిస్టును తయారు చెయ్యండి. ప్రతి సెంటరులో ఎంతమంది క్రొత్తగా వారసులుగా అయ్యారు? మీరైతే ఉండనే ఉన్నారు. ఇప్పుడు బాప్ దాదా వారసుల లిస్టును కోరుకుంటున్నారు. అచ్ఛా.

ఇప్పుడు ఎవరు ఎక్కడ కూర్చున్నాకానీ వారందరికీ, టి.వీలో చూస్తున్నాకానీ, ఇక్కడ భిన్న భిన్న స్థానాలలో కూర్చున్నా కానీ వారు కూడా టీ.వీల ద్వారా చూస్తున్నారు. పిల్లలు ఒక్కొక్కరికీ బాప్ దాదా ఈ రోజు తీవ్ర పురుషార్థి అన్న టైటిల్ ను ఇస్తున్నారు. ఇప్పుడు ఈ టైటిల్‌ను సదా గుర్తుంచుకోండి. మీరెవరు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే తీవ్ర పురుషార్థీలము అని చెప్పండి. సరేనా, అందరికీ సమ్మతమేనా? సమ్మతమేనా? ఇప్పుడు ఢీలా పురుషార్థము సరిపోదు, సమయము ముందుకు పరిగెత్తుతుంది కావున ఇప్పుడు తీవ్ర పురుషార్థీగా అవ్వవలసిందే. సమయపు పిలుపు - తీవ్ర పురుషార్థీ భవ. పిల్లలందరికీ బాప్ దాదా నుండి చాలా చాలా ప్రియస్మృతులు మరియు తీవ్ర పురుషార్థానికి బహుమతిని కూడా ఇస్తున్నారు.

మొదటిసారిగా వచ్చిన వారితో:- అచ్చా, మొదటిసారిగా వచ్చిన పిల్లలకు బాప్ దాదా విశేషంగా అభినందనలు తెలుపుతున్నారు. పిల్లలైన మిమ్మల్ని చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు, ఎందుకు సంతోషిస్తున్నారు? ఎందుకంటే మీరందరూ అంతిమ సమయాని కంటే ముందుగానే చేరుకున్నారు అందుకే అభినందనలు. మీ హక్కును పొందేందుకు అధికారులుగా అయ్యారు. ఈ రోజు బాప్ దాదా పదే పదే తీవ్ర పురుషార్థీలుగా అవ్వండని చెప్తున్నారు. తీవ్ర పురుషార్థీగా అయితే ఎంతో ముందుకు వెళ్ళవచ్చు. ఈ వరదానము ఇప్పుడే ప్రాప్తిస్తుంది. ఎవరైతే వచ్చారో వారందరూ ఈ అటెన్షను ఉంచాలి, ఒకటి-సదా మురళి స్టడీ నియమానుసారంగా చేస్తూ ఉండండి మరియు దానితోపాటు మనసా సేవ మరియు వాచ సేవను చేసే బంగారు అవకాశాన్ని తీసుకుంటూ ఉండండి. అందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు.

దాదీ జానకితో: - (బాబా, మీరెంత మంచివారు) మీరు కూడా ఎంత మంచి వారు. అందరూ మంచిగా అవుతారు. యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతుంది, అందరూ మంచిగా ఉన్నారు.

(సౌథ్ ఆఫ్రికాలో పర్యావరణానికి సంబంధించిన కాన్ఫరెన్సుకు 50 వేలమంది వచ్చారు, అక్కడ జయంతి అక్కయ్య మరియు వారితో ఉన్నవారు ఎంతో మంచి సేవను చేస్తున్నారు) పిల్లలందరి సమాచారమును విన్నాము. నిమిత్తమై ఉన్న పిల్లలకు, సోదరులు కూడా ఉన్నారు, వారికి ప్రత్యేకంగా బాప్ దాదా మనస్పూర్తిగా చాలా చాలా ప్రేమను ఇస్తున్నారు. మంచి ధైర్యాన్ని ఉంచారు. చివరకు ఆ రోజు కూడా వస్తుంది, వాహ్ బాబా వాహ్ అని అనే పిల్లలను మీరే తీసుకువస్తారు.

మారిషస్ సమాచారాన్ని వినిపించారు, 2012 కోసం బాప్ దాదా ప్రేరణలను అడుగుతున్నారు:- బాప్ దాదాకైతే పిల్లలందరి పట్ల శ్రేష్టాతి శ్రేష్ఠమైన ఆశ ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరూ బాబాకు చెందినవారుగా అయ్యి ఇతరులను కూడా బాబాకు చెందినవారిగా చేస్తారని బాబా ఆశ. ఇప్పుడు తీవ్ర పురుషార్థము, సేవలో కూడా మరియు ధారణలో కూడా, రెండింటిలో తీవ్ర పురుషార్థము.

(ఆంధ్ర ప్రదేశ్ లో చాలా మంచి సేవలు జరిగాయి) బాప్ దాదా వినిపించారు కదా, ఎక్కడైతే ప్రోగ్రాములు జరిగాయో అవి చాలా మంచిగా జరిగాయి. నలువైపుల మంచిగా జరిగాయి.

రుక్మిణి దాదీతో:- ఇప్పుడు మందులను మంచిగా వేసుకుంటూ ఉండండి, మంచిగా అయిపోతారు. ఏదో ఒకటి చెయ్యాలి కదా. మరేదీ ఆలోచించవద్దు. ఇతరులను కూడా ఆలోచనలో ఉంచవద్దు, స్వయం కూడా ఆలోచించవద్దు. 

మహామహిమ్ ఊర్మిళ సింహ్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ తో: - చాలా మంచిగా చేసారు, మాతల స్వమానాన్ని నిలబెట్టారు. మాతలు ఎంత ముందుకు వెళ్తారో అంతగా భారతదేశ కళ్యాణము జరుగుతుంది. అందుకు మీరు నిమిత్తమయ్యారు. ఇప్పుడు అందరినీ టెన్షన్ ఫ్రీ చెయ్యండి. మీ పట్టణంలోని వారిని టెన్షన్ ఫ్రీ చెయ్యండి. చాలా టెన్షన్ ఉంది. మెడిటేషన్ కోర్సు టెన్షన్ ఫ్రీ చేస్తుంది. ఎంత వీలైతే అంత, మీ కనెక్షన్లోని వారి కోసం ఒక ప్రోగ్రామును ఏర్పాటు చేసి మెడిటేషన్ ద్వారా టెన్షన్ ఫ్రీ చెయ్యండి. అప్పుడే దేశ కళ్యాణము జరుగుతుంది కదా. టెన్షన్‌ సఫలత లభించదు, టెన్షన్ లేకుండా ఉంటే ఏ ప్లాను వేసినా అందులో శక్తి వస్తుంది. కనుక, టెన్షన్ ఫ్రీ చెయ్యడానికి నిమిత్తమవ్వండి.

కర్ణాటక యాక్టర్ జయంతి సోదరితో:- చూడండి, ఇప్పుడు మనసుకు చూడాలనిపించింది కదా, అలాగే ఇప్పుడు మనసును టెన్షన్ ఫ్రీ చేసుకోండి. అందుకోసం ఇక్కడ మెడిటేషన్ కోర్సును ఇవ్వడం జరుగుతుంది. ఆ కోర్సును తీసుకోండి. మీ తోటివారికి కూడా టెన్షన్ ఫ్రీ కోర్సును ఇప్పించండి, అప్పుడు ఏమవుతుంది? టెన్షన్ ఫ్రీగా ఉండటం వలన ఇతరులలో కూడా శాంతి వ్యాపిస్తుంది లేకపోతే టెన్షన్లో శాంతి మాయమైపోతుంది. మీ తోటివారిని కూడా ఇలా తయారుచెయ్యండి. మీరు ఇక్కడకు వచ్చారు కదా, ఇక్కడ కొద్దిగా నేర్చుకుని వెళ్ళండి, వారిని మీ సమానంగా తయారు చెయ్యండి. తర్వాత, గ్రూపును తీసుకురండి. తోటివారిగా అవ్వండి.

Comments