10-01-1990 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘హోలీహంస యొక్క విశేషతలు’’
ఈ రోజు పిల్లలందరినీ విశేషాత్మలుగా తయారుచేసే బాప్ దాదా, ప్రతి ఒక్క హోలీహంస విశేషతలను చూస్తున్నారు. హంసలో నిర్ణయ శక్తి మరియు పరిశీలనా శక్తి విశేషంగా ఉంటాయి, అందుకే గ్రహించే శక్తి కూడా విశేషంగా ఉంటుంది. దీని వలన ముత్యాలు మరియు రాళ్ళు, రెండింటినీ పరిశీలిస్తుంది మరియు తర్వాత నిర్ణయిస్తుంది, ఆ తర్వాత ముత్యాలను గ్రహిస్తుంది, రాళ్ళు-రప్పలను వదిలేస్తుంది. కావున పరిశీలించడము, నిర్ణయించడము మరియు గ్రహించడము అనగా ధారణ చేయడము - ఈ మూడు శక్తుల విశేషత కారణంగా సంగమయుగీ సరస్వతి తల్లి యొక్క వాహనంగా హంసను చూపించారు. అయితే కేవలం ఒక్క సరస్వతి తల్లి యొక్క స్మృతిచిహ్నం మాత్రమే కాదు, కానీ తల్లి సమానంగా తయారయ్యేటువంటి జ్ఞానవీణా వాదినీలు మీరందరూ కూడా. ఈ జ్ఞానాన్ని ధారణ చేసేందుకు కూడా ఈ మూడు విశేషతలు అత్యంత అవసరము. మీరందరూ బ్రాహ్మణ జీవితాన్ని ధారణ చేస్తూనే జ్ఞానం ద్వారా, వివేకం ద్వారా మొదట పరిశీలనా శక్తి యొక్క ఆధారాన్ని గుర్తించారు, తమను తాము గుర్తించారు, సమయాన్ని గుర్తించారు, తమ బ్రాహ్మణ పరివారాన్ని గుర్తించారు, తమ శ్రేష్ఠ కర్తవ్యాన్ని గుర్తించారు, ఆ తర్వాత నిర్ణయించుకున్నారు, అప్పుడే బ్రాహ్మణ జీవితాన్ని ధారణ చేసారు. వీరు అదే కల్పక్రితం యొక్క అనంతమైన తండ్రి, పరమాత్మ, నేను కూడా అదే కల్పక్రితం యొక్క శ్రేష్ఠాత్మను, అధికారీ ఆత్మను - ఇది పరిశీలించిన తర్వాత నిర్ణయించారు. తండ్రిని పరిశీలించకుండా నిర్ణయించలేరు. చాలామంది ఆత్మలు ఇప్పటివరకు కూడా సంబంధ-సంపర్కంలో ఉన్నారు, చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటూ ఉంటారు, కానీ పరమాత్ముని పరిచయం లేదా పరిశీలించే శక్తి లేని కారణంగా ఎలా తయారవ్వాలి లేదా ఏం చేయాలి అనేది నిర్ణయించలేరు, అందుకే బ్రాహ్మణ జీవితాన్ని ధారణ చేయలేరు. సహయోగులుగా అవుతారు కానీ సహజయోగీ జీవితాన్ని తయారుచేసుకోలేరు ఎందుకంటే రెండు శక్తులు లేవు, అందుకే హోలీహంసలుగా అవ్వలేరు. పవిత్రత రూపీ ముత్యాలు మరియు అపవిత్రత రూపీ రాళ్ళు - రెండింటినీ వేర్వేరు అని భావించకపోతే పవిత్రతను గ్రహించగలిగే శక్తి రాలేదు. కనుక హోలీహంస యొక్క విశేషత - మొదటి శక్తి ‘‘పరిశీలించడము’’ అనగా గుర్తించడము. హోలీహంసలైన మీలో ఈ రెండు శక్తులు ఉన్నాయి కదా? ఎందుకంటే తండ్రిని గుర్తించారు, తమను తాము కూడా గుర్తించారు, నిర్ణయం కూడా సరిగ్గా తీసుకున్నారు, కనుకనే బ్రాహ్మణులుగా అయ్యారు మరియు నడుస్తున్నారు. ఈ విషయంలోనైతే అందరూ పక్కాగా పాస్ అయ్యారు. కానీ ఏదైతే సేవ చేస్తారో మరియు కర్మలోకి వస్తారో, మొత్తం రోజంతటి దినచర్యలో ఏ కర్మలైతే చేస్తారో, సంబంధ-సంపర్కంలో వస్తారో, అందులో ప్రతి కర్మ సఫలతా పూర్వకంగా ఉండాలి మరియు సంపర్కంలోకి ఉన్న ప్రతి ఆత్మ యొక్క సంబంధంలోకి రావడంలో సదా సఫలత ఉండాలి. అన్ని రకాల సేవలలో, మనసా, వాచా, కర్మణా - మూడింటిలోనూ సదా సఫలత అనుభవం అవ్వాలి, దీనికి కూడా ఆధారము పరిశీలనా శక్తి మరియు నిర్ణయించే శక్తి. ఇందులో ఫుల్ పాస్ గా ఉన్నారా?
సేవలో సఫలత మరియు సంపర్కంలో సఫలత సదా ఉండకపోవడానికి కారణం చెక్ చేసుకోండి - అదేమిటంటే, కార్యాన్ని, వ్యక్తిని, ఆత్మను పరిశీలించే శక్తిలో తేడా వచ్చేస్తుంది. ఏ ఆత్మకు, ఏ సమయంలో, ఏ విధి పూర్వకంగా సహయోగం కావాలో లేక శిక్షణ కావాలో, స్నేహం కావాలో, ఆ సమయంలో ఒకవేళ పరిశీలించే శక్తి తీవ్రంగా ఉన్నట్లయితే తప్పకుండా సంబంధంలో సఫలత ప్రాప్తిస్తుంది. కానీ జరుగుతుంది ఏమిటి? ఏ ఆత్మకు, ఏ సహయోగం లేక ఏ విధి ఆ సమయంలో కావాలో, అది ఇవ్వకుండా లేదా పరిశీలించలేని కారణంగా తమదైన పద్ధతిలో వారికి సహయోగమిస్తారు లేక విధిని ఉపయోగిస్తారు, అందుకే సంతుష్టత యొక్క సఫలత ఉండదు. ఎలాగైతే శారీరక అనారోగ్యాన్ని పరిశీలించే విధి డాక్టరుకు రాకపోతే ఏం జరుగుతుంది? బాగు అయ్యేందుకు బదులుగా ఒకటికి అనేక రోగాలు ఇంకా ఉత్పన్నమైపోతాయి. పేషంట్ కు సంతుష్టత యొక్క సఫలత లభించదు. దీనినే సాధారణ మాటలలో బాప్ దాదా, ప్రతి ఒక్కరి నాడిని పరిశీలించండి అని అంటారు. నడవడము మరియు నడిపించడము కూడా అవసరము. కావున ఏం చేయాల్సి ఉంటుంది? గుర్తించే అనగా పరిశీలించే శక్తిని తీవ్రతరం చేయాల్సి ఉంటుంది. ఇందులో తేడా వచ్చేస్తుంది, దీనినే మీరు సాధారణ భాషలో హ్యాండ్లింగ్ (నిర్వహణ)లో తేడా అని అంటారు. వీరి హ్యాండ్లింగ్ (నిర్వహణ) పద్ధతి పాతది, వీరిది కొత్త పద్ధతి... అని అంటారు కదా. ఈ తేడా ఎందుకు వచ్చింది? ఎందుకంటే ప్రతి సమయము ప్రతి ఆత్మను మరియు ప్రతి కార్యాన్ని పరిశీలించే శక్తి కావాలి. మొత్తానికి పరిశీలనా శక్తి వచ్చింది కానీ విస్తారమైన మరియు అనంతమైన పరిశీలనా శక్తి యొక్క అవసరం ఉంది - ఆ సమయంలో ఆత్మ యొక్క గ్రహించే శక్తి ఎంత ఉంది, వాయుమండలం ఏమిటి మరియు ఆ ఆత్మకు వినేటువంటి లేదా శిక్షణ తీసుకునేటువంటి మూడ్ ఎలా ఉంది... ఎలాగైతే, ఎవరైనా బలహీన శరీరం కలవారు ఉంటే, వారికి చాలా ఎక్కువ శక్తి కలిగిన ఇంజెక్షన్ ఇస్తే పరిస్థితి ఏమవుతుంది? వారు హార్ట్ ఫెయిల్ అయిపోతారు, శాంతి (కోమా)లోకి వెళ్ళిపోతారు. అలాగే, ఒకవేళ సంబంధంలోకి వచ్చినటువంటి ఆత్మ బలహీనంగా ఉంది, ఆ ఆత్మలో ధైర్యం లేదు కానీ మీరు వారికి శిక్షణ యొక్క డోస్ ఇస్తూనే ఉంటే, వారి మూడ్ ను, సమయాన్ని, వాయుమండలాన్ని పరిశీలించలేకపోతే రిజల్ట్ ఏమవుతుంది? ఒకటేమో, నిరాశ చెందుతారు మరియు శక్తి లేని కారణంగా గ్రహించలేకపోతారు, అంతేకాక ఇంకా మొండికేస్తారు మరియు నిరూపణ చేసే ప్రయత్నం చేస్తారు. మీరైతే మంచి భావనతోనే చేసారు కానీ సఫలత లభించకపోవడానికి కారణమేమిటంటే, పరిశీలించే మరియు నిర్ణయించే శక్తి తక్కువగా ఉన్నాయి, అందుకే సఫలతామూర్తులుగా అవ్వడంలో పర్సెంటేజ్ ఏర్పడుతుంది. కనుక మొత్తం రోజంతటి కర్మలలో మరియు సంబంధాలలో పరిశీలించే శక్తి యొక్క అవసరం ఉంది కదా. అందుకే, శిక్షణ ఇస్తే ఇవ్వండి కానీ అన్ని విషయాలను పరిశీలించి, అప్పుడు అడుగు వేయండి. అలాగే సేవా క్షేత్రంలో కూడా ఒకవేళ, ఆ ఆత్మల అవసరాన్ని లేక కోరికను పరిశీలించకుండా ఎంత మంచి జ్ఞానాన్ని ఇచ్చినా, ఎంత శ్రమించినా కానీ సఫలత ఉండదు. ‘‘బాగుంది, బాగుంది’’ అని అనడమైతే ఒక పద్ధతిలా అయిపోయింది ఎందుకంటే మీరు చెడు విషయాలైతే ఏవీ చెప్పరు కూడా. కానీ ఏదైతే సఫలత యొక్క లక్ష్యాన్ని పెట్టుకుంటారో, దానికి సామీప్యతను అనుభవం చేయాలంటే, దాని కోసం పరిశీలనా శక్తి అత్యంత అవసరము. ఎలాగైతే ఎవరైనా ముక్తిని కోరుకునేవారికి, మీరు జీవన్ముక్తి మరియు ముక్తి రెండింటినీ ఇచ్చినా సరే, వారు ఇష్టపడరు. నీటి కోసం దాహంతో ఉన్నవారికి 36 రకాల భోజనాన్ని ఇచ్చినా కానీ, వారు నీటి బిందువుతోనే సంతుష్టమవుతారు, అంతేకానీ భోజనంతో కాదు. కనుక ముక్తి కోరుకునేవారిని పరిశీలించి, వారికి ముక్తి గురించి స్పష్టీకరణ ఇచ్చినట్లయితే, వారి కోరిక కూడా పెరుగుతుంది మరియు జీవన్ముక్తిలోకి పరివర్తన కూడా అవుతుంది. ఎవరికైనా ధారణ యొక్క విషయాలను వినడం బాగా అనిపిస్తే, వారికి మీరు కల్పం 5000 సంవత్సరాలు అని లేక గీతా భగవంతుడు ఎవరు అని తెలియజేయడం మొదలుపెడితే, వారి ఇంటరెస్ట్ మొత్తానికే సమాప్తమైపోతుంది. అందుకే సేవలో కూడా ఆ ఆత్మ యొక్క స్థితి ఏమిటి మరియు నమ్మకం ఏమిటి - వీటిని పరిశీలించడం అవసరము. కనుక సేవలో సఫలత ఏ శక్తి ఆధారంగా లభించింది? పరిశీలించే శక్తి కావాలి. అజ్ఞానీ ఆత్మల సేవలో కావచ్చు, సేవా-సహచరుల సేవలో కావచ్చు - రెండింటిలోనూ సఫలతకు ఆధారం ఒక్కటే. కనుక హోలీహంస యొక్క విశేషత అయిన పరిశీలనా శక్తిని అన్నింటికన్నా ముందు పెంచుకోండి. పరిశీలించే శక్తి యథార్థంగా, శ్రేష్ఠంగా ఉన్నట్లయితే, నిర్ణయం కూడా యథార్థంగా ఉంటుంది మరియు మీరు ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటే, దానిని గ్రహించే శక్తి వారిలో స్వతహాగానే ఉంటుంది, అప్పుడు ఎలా తయారవుతారు? నంబరువన్ సఫలతామూర్త్. కనుక సేవలో కావచ్చు, సంబంధంలో కావచ్చు లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఈ లక్షణాన్ని ధారణ చేయండి.
కావున రోజంతటిలో ఇది చెక్ చేసుకోండి - మొదట రోజంతటి దినచర్యలో పరిశీలనా శక్తి ఎంతవరకు యథార్థంగా ఉంది మరియు ఎక్కడైనా కరెక్షన్ (సరిదిద్దవలసిన) లేక ఎడిషన్ (కలపవలసిన) అవసరం పడిందా? చేసిన తర్వాత కరెక్షన్ అనేది దానంతట అదే తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే దివ్యబుద్ధి యొక్క వరదానం అందరికీ లభించి ఉంది. సమస్యలకు వశమై గాని, సమయానికి లేక పరిస్థితికి వశమై గాని లేక ఎవరైనా ఆత్మల సాంగత్యానికి వశమై గాని లేక మాయ ద్వారా మన్మతానికి వశమై గాని, ఆ సమయంలో పరవశులైపోతారు కానీ ఆ సమయం, ఆ పరిస్థితి, ఆ సాంగత్యం యొక్క ప్రభావం, మన్మతం యొక్క ప్రభావం ఎప్పుడైతే తేలికైపోతుందో, అప్పుడు మళ్ళీ తమ దివ్యబుద్ధి పని చేస్తుంది. దీనినే మీరు ఆవేశం నుండి స్పృహలోకి వచ్చారు అని అంటారు. అప్పుడు రియలైజ్ అవుతారు, ఈ కరెక్షన్ లేక ఎడిషన్ జరగాల్సి ఉంది లేక చేయాలి అని. కానీ రిజిస్టరులో లేక కర్మ లెక్కల పుస్తకంలో మచ్చ లేదు కానీ చుక్క అయితే పడిపోయింది, పూర్తి స్వచ్ఛంగా అయితే లేదు కదా. అందుకే కర్మల లీల అతి గుహ్యమైనది అని అంటారు.
టీచర్లు అయితే కర్మల లీలను మంచి రీతిలో తెలుసుకున్నారు కదా. టీచర్లు రోజంతా ఏ పాటను పాడుతారు ‘‘వాహ్, నా శ్రేష్ఠ కర్మల లీల’’. కర్మల గుహ్య గతి యొక్క లీల కాదు, శ్రేష్ఠ కర్మల యొక్క లీల. ప్రపంచంలోని వారైతే ప్రతి కర్మలో, ప్రతి అడుగులో - అయ్యో, నా కర్మ! అని అనుకుంటూ కర్మలకు పశ్చాత్తాపపడుతూ ఉంటారు. మీరంటారు - ‘‘వాహ్ శ్రేష్ఠ కర్మ’’! ఇప్పుడు ఇందులో ఇంకా ముందుకు వెళ్ళండి - సదా వాహ్ శ్రేష్ఠ కర్మలుగా ఉండాలి, సాధారణ కర్మలుగా కాదు. కర్మలకు పశ్చాత్తాపపడడమైతే సమాప్తమైపోయింది కానీ శ్రేష్ఠ కర్మలు చేయాలి, దీనిని అండర్ లైన్ చేయండి. ఒకవేళ మిక్స్ కర్మలు ఉన్నట్లయితే - సాధారణమైనవి కూడా, శ్రేష్ఠమైనవి కూడా, అప్పుడు సఫలత కూడా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు విశేషంగా అటెన్షన్ పెట్టాల్సినది ఏమిటంటే, సాధారణతను విశేషతలోకి పరివర్తన చేయండి. బాప్ దాదా ప్రతి ఒక్కరి రోజంతటి దినచర్యలో ఏమేమి చూస్తారు అనేదాని గురించి కూడా ఇంకెప్పుడైనా వినిపిస్తాము. సాధారణత ఎంత ఉంది మరియు విశేషత ఎంత ఉంది - ఈ రిజల్టును చూస్తూ ఉంటారు.
బాప్ దాదా వద్ద చూసే సాధనాలు ఎన్ని ఉన్నాయంటే, ఒకే సమయంలో దేశ-విదేశాలలోని పిల్లలందరినీ చూడగలరు. వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేదు. 5 నిముషాలలో అందరి గురించి తెలిసిపోతుంది. పిల్లల గురించి ‘‘వాహ్-వాహ్’’ యొక్క పాటలను కూడా పాడుతారు, దీనితో పాటు సమానంగా అయ్యే లక్ష్యం అనుసారంగా చెకింగ్ కూడా చేస్తారు. ఇంతకుముందు కూడా వినిపించాము కదా, తండ్రి పట్ల స్నేహము మరియు తండ్రిని గుర్తించడంలోనైతే అందరూ పాస్ అయ్యారు మరియు అప్పుడప్పుడు అద్భుతమైన పనులు కూడా చేస్తారు. మంచి అద్భుతాలు చేస్తారు, అంతేకానీ, హంగామా చేసే అద్భుతాలు కాదు. కొంతమంది పిల్లలు హంగామా కల అద్భుతాలు కూడా చేస్తారు కదా! అక్కడ జరిగేదేమో హంగామా, కానీ ఇది మా అద్భుతము అని అంటారు. అందుకే బాప్ దాదా అంటారు - పరిశీలించే శక్తిని పెంచుకోండి. తమ కర్మలను కూడా పరిశీలించుకోగలరు మరియు ఇతరుల కర్మలను కూడా యథార్థంగా పరిశీలించగలరు. తప్పును ఒప్పు అని అనరు. అలా అంటున్నారంటే, అది పరిశీలనా శక్తిలో లోపం ఉన్నట్లు. మరియు సదా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఇది అందరి కోసం చెప్తున్నారు - ఎప్పుడైనా ఏదైనా అలాంటి-ఇలాంటి వ్యర్థమైన లేక సాధారణమైన కర్మను చేస్తే మరియు ఇది తప్పా లేక ఒప్పా అని తమంతట తాము గుర్తించలేకపోతే, ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి వస్తుందో, వశీభూతులైపోతారో, ఆ సమయంలో అలాంటి పరిస్థితిలో సిద్ధిని ప్రాప్తి చేసుకునేందుకు శ్రేష్ఠమైన విధి ఏమిటి? ఎందుకంటే ఆ సమయంలో తమ బుద్ధి అయితే వశీభూతమై ఉంది. ఒప్పును కూడా తప్పుగా భావిస్తారు, తప్పును తప్పుగా భావించరు, ఒప్పుగా భావిస్తారు, అప్పుడు మొండికేస్తారు లేక నిరూపణ చేస్తారు. ఇది వశీభూతమైన బుద్ధికి గుర్తు. అటువంటి సమయంలో సదా ఒక్క బాప్ దాదా శ్రేష్ఠ మతాన్ని గుర్తుంచుకోండి, అదేమిటంటే, ఎవరినైతే తండ్రి నిమిత్తము చేసారో, ఆ నిమిత్త ఆత్మలు ఏదైతే డైరెక్షన్ ఇస్తారో, దానికి మహత్వం ఇవ్వాలి. ఆ సమయంలో ఇలా ఆలోచించకండి, నిమిత్తంగా ఉన్నవారు బహుశా ఎవరో చెప్పడం వలన ఇలా చెప్తున్నారు అని, ఇలా అనుకుంటే మోసపోతారు. నిమిత్తంగా ఉన్నటువంటి శ్రేష్ఠాత్మల ద్వారా ఏవైతే శిక్షణలు లేక డైరెక్షన్లు లభిస్తాయో, వాటికి ఆ సమయంలో మహత్వం ఇవ్వడంతో, ఒకవేళ ఏదైనా చెడు విషయం జరిగినా కానీ మీరు బాధ్యులు కారు. ఎలాగైతే, బ్రహ్మాబాబా కోసం సదా అంటారు, ఒకవేళ బ్రహ్మా ద్వారా ఏదైనా పొరపాటు జరిగినా కానీ, ఆ పొరపాటు కూడా మీ పట్ల రైటుగా మారిపోతుంది అని. కనుక ఇలా నిమిత్తంగా ఉన్న ఆత్మల పట్ల ఎప్పుడూ కూడా ఈ వ్యర్థ సంకల్పము ఉత్పన్నం అవ్వకూడదు. ఒకవేళ మీకు సరిగ్గా అనిపించని నిర్ణయం ఏదైనా ఇచ్చినా కానీ, మీరు దానికి బాధ్యులు కారు. మీకు పాపం తయారవ్వదు. మీ పని సరిగ్గానే అయిపోతుంది ఎందుకంటే తండ్రి కూర్చున్నారు. తండ్రి, పాపాన్ని మార్చేస్తారు. ఇది గుహ్యమైన రహస్యము, గుప్తమైన మెషినరీ (యంత్రాంగము). అందుకే నిమిత్తంగా ఉన్న శ్రేష్ఠాత్మల యొక్క శ్రేష్ఠమైన డైరెక్షన్లకు మహత్వాన్ని ఇస్తూ వాటిని కార్యంలో ఉపయోగించండి. ఇందులో మీ లాభం ఉంది, నష్టం కూడా మారిపోయి లాభంగా అయిపోతుంది. ఇది తండ్రి ఇస్తున్న గ్యారంటీ. అర్థమయిందా? అందుకే, కర్మల లీల చాలా విచిత్రమైనది అని వినిపించాము. తండ్రి బాధ్యులు. ఎవరినైతే నిమిత్తంగా చేసారో, వారికి కూడా బాధ్యులు తండ్రి. మీ పాపాలను మార్చేందుకు కూడా బాధ్యులు వారే. ఊరికే అలా నిమిత్తంగా చేయలేదు, ఆలోచించి అర్థం చేసుకొని డ్రామా నియమానుసారంగా నిమిత్తంగా చేయడం జరిగింది. అర్థమయిందా!
టీచర్లకు బాగా అనిపిస్తుంది కదా. ఇందులో లాభం ఉంది, భారం తేలికైపోయింది. ఏదైనా విషయం వస్తే, నిమిత్తంగా ఉన్న పెద్దవారికి తెలుసు అని అంటారు. తేలికైపోయారు కదా. కానీ కేవలం అనడం వరకే కాదు, అర్థం చేసుకొని, స్నేహంతో, స్వమానపూర్వకంగా ఉండాలి. ఈ గుహ్యమైన విషయాల గురించి తండ్రికి తెలుసు మరియు ఎవరైతే తెలివైన పిల్లలు ఉన్నారో, వారికి తెలుసు. నిమిత్తంగా ఉన్నటువంటి ఆత్మల కోసం ఏదైనా అనడము అనగా తండ్రిని అనడము. నిమిత్తంగా తండ్రి చేసారు కదా. తండ్రి కన్నా మీకు ఎక్కువ పరిశీలనా శక్తి ఉందా?
బాప్ దాదాకు పిల్లలందరి పట్ల అత్యంత స్నేహం ఉంది. కేవలం నిమిత్తంగా ఉన్నవారి పట్ల మాత్రమే ప్రేమ ఉంది, ఇతరుల పట్ల లేదు అని కాదు. ప్రేమ కారణంగానే ఇలా డైరెక్షన్లు ఇస్తున్నారు. ప్రేమ లేకపోతే - ఎలా నడుస్తున్నారో, అలా నడుస్తారులే అని అంటారు. ఇంత ధైర్యం పెట్టి బ్రాహ్మణ జీవితంలో నడుస్తున్నారంటే, ఎగురుతున్నారంటే, చిన్న బలహీనత అయినా కూడా ఎందుకు ఉండిపోవాలి. ఇది ప్రేమ. ప్రేమ ఉన్నవారిలోని లోపాలను ఎప్పుడూ చూడలేరు. ఇది ప్రేమకు గుర్తు. ఎవరి పట్లనైతే హృదయపూర్వకమైన, సత్యమైన ప్రేమ ఉంటుందో, వారి లోపాన్ని ఎప్పుడూ తమ లోపంగా భావిస్తారు. అచ్ఛా.
ఏ కార్యం చేసినా, ఎప్పుడూ కూడా ఎటువంటి అలజడి యొక్క వాతావరణ ప్రభావంలోకి రాకండి. మీ ప్రభావం వేసినట్లయితే, వారు మీ ప్రభావంలోకి వచ్చేస్తారు మరియు హృదయం నుండి - సఫలత మా జన్మ సిద్ధ అధికారము అని వెలువడుతుంది. ధైర్యానికి చాలా మహత్వం ఉంది. ఎప్పుడూ ఏ విషయంలోనూ గాభరా పడకండి. మీరు కూడా వెయ్యి భుజాలు కలవారే. తండ్రి యొక్క వెయ్యి భుజాలు మీవి కూడా అయినట్లు కదా. అచ్ఛా -
నలువైపులా ఉన్న సదా పరిశీలనా శక్తి కల విశేషాత్మలకు, సదా ప్రతి కర్మ మరియు సంబంధంలో శ్రేష్ఠ సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతామూర్త్ ఆత్మలకు, సదా ధైర్యం మరియు శుభ భావన మరియు శుభ కామనల ద్వారా పరివర్తన చేసే శక్తిశాలీ ఆత్మలకు, ‘‘సదా వాహ్ నా శ్రేష్ఠ కర్మలు’’ అనే సంతోషపు పాటలను పాడే పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే
Comments
Post a Comment