03-04-2012 అవ్యక్త మురళి

            03-04-2012         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

”నాది అన్న దానిని నీది లోకి పరివర్తన చేసి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి. బాబా ప్రేమలో మరియు సేవలో మనసును ఎంతగా బిజీగా పెట్టుకోండంటే వ్యర్థము రావడానికి మార్జిన్ ఉండకూడదు." 

ఈ రోజు బాప్ దాదా నలువైపుల ఉన్న తమ నిశ్చింత చక్రవర్తులను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఉదయమే లేచి నిశ్చింత స్థితిలో స్థితి అయ్యి ప్రతి కర్మను చేస్తారు. నిశ్చింత చక్రవర్తి జీవితం యొక్క అనుభవం పిల్లలందరికీ అనుభవమే. చక్రవర్తిత్వం కూడా మరియు నిశ్చింతత కూడా, ఎంత ప్రియంగా అనిపిస్తుంది! ఎందుకంటే మీరందరూ బాబాకు చింతలను ఇచ్చేసి సంతోషాలను తీసుకున్నారు. అది కూడా అవినాశీ సంతోషాన్ని తీసుకున్నారు. ఈ నిశ్చింత జీవితం ఎంత ప్రియమైనదో ప్రతి ఒక్కరూ అనుభవం చేస్తున్నారు. రాత్రి, పగలు ఏ విషయంలోనూ చింత లేదు, సంతోషము. ఇలా నిశ్చింతగా ఉండే జీవితాన్ని బాబా కేవలం ఈ ఒక్క జన్మకు మాత్రమే ఇవ్వలేదు, అనేక జన్మలకు నిశ్చింత చక్రవర్తులుగా చేసారని మీకు తెలుసు. నిశ్చింత జీవితం ఉంది, ఇప్పుడు అనుభవం చేస్తున్నట్లయితే సదా మస్తకంపై దివ్యమైన మెరిసే జ్యోతి కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ చింత ఉన్నట్లయితే తల మీద అనేక రకాల దుఃఖపు బుట్టలు కనిపిస్తాయి. ఈ నిశ్చింత జీవితం యొక్క విధి చాలా సహజమైనది. హద్దు యొక్క 'నాది-నాది'ని 'నీది'లోకి పరివర్తన చేసెయ్యడము. నేను మరియు నీదిలో కేవలం ఒక్కటే తేడా ఉంది. 'నే' మరియు 'నీ'. కానీ 'నాది'ని 'నీది'లోకి పరివర్తన చేసినప్పుడు జీవితం ఎంత సంతోషంగా అయిపోతుంది! అయిపోయింది కదా, తల ఊపండి. అయిపోయిందా! నిశ్చింత జీవితం అయిపోయింది.
బాప్ దాదా ఇప్పుడు పిల్లలందరి నుండి ఏమి కోరుకుంటున్నారంటే, చింతల జీవితానికి ఆధారము వ్యర్థ సంకల్పము, మరి పిల్లలందరి లోపల ఉన్న వ్యర్థ సంకల్పాల అంశము కూడా మిగలకూడదు ఎందుకంటే ఎప్పుడైతే మీరు 'నాది'ని 'నీది'లోకి పరివర్తన చేసినప్పుడు మీరు ఏమైపోయారు? మీరు నిశ్చింత చక్రవర్తులుగా అయిపోయారు. నిశ్చింత చక్రవర్తుల జీవితం ఎంత ప్రియమైనది! ప్రతి కర్మను చేస్తూ కూడా నిశ్చింత చక్రవర్తి. ఏ చింత కూడా లేదు - ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పటి వరకు... ఇదంతా సమాప్తమైపోయింది. బాప్ దాదా ఇప్పుడు ఈ సీజన్ యొక్క చివరి రోజున ఇదే కోరుకుంటున్నారు - పిల్లలు ప్రతి ఒక్కరూ వ్యర్థాన్ని 'నాది' కాక 'నీది'లోకి పరివర్తన చెయ్యండి. అప్పుడు బాబాయే స్వయంగా వాటిని భస్మం చేసేస్తారు. మీరు కేవలం ఈ చిన్నని తేడాను చేసి చూడండి, ఒప్పుకున్నట్లేనా? వీలవుతుందా? వీలవుతుంది అనుకుంటే చేతులెత్తండి. చాలా మంచిది, ఎందుకంటే ఈ 5-6 నెలలు మీరు విశ్వంలోని దుఃఖిత ఆత్మలకు మీ శక్తిశాలి వృత్తి ద్వారా సుఖశాంతుల కిరణాలను ఇవ్వవలసి ఉంటుంది. ఇందులోనే మీ మనసును బిజీగా పెట్టండి. వ్యర్థ సంకల్పాలు కూడా ఎందులో వస్తాయి? మనసులో వస్తాయి కదా! కావున బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు, ప్రతి ఒక్క నిశ్చింత చక్రవర్తి తమ మనసును అనగా వృత్తిని ఎంతగా బిజీగా పెట్టుకోండంటే వ్యర్థం వచ్చేందుకు మార్జిన్ ఉండకూడదు. శ్రమించవలసిన అవసరము ఉండకూడదు కానీ బాబా ప్రేమలో ఎంత బిజీగా ఉండండి అంటే, వృత్తితో చేసే సేవలో ఎంతగా మనసును బిజీగా పెట్టండంటే యుద్ధం కూడా చేయనవసరం ఉండకూడదు. 'మేము అనుకోవడం లేదు కానీ వచ్చేస్తున్నాయి' అని కొంతమంది పిల్లలు అంటారు. దీనిని ఏమని అంటారు? మనసును బాబా ప్రేమలో మరియు సేవలో బిజీగా పెట్టలేదు అని అనవచ్చా! అందరినీ అడుగుతున్నాము, మీ ప్రేమ బాబాపై ఎంత ఉంది? ఇలా అడిగితే ఏమని చెప్తారు? అనంతము అని అంటారు. మరి ఎవరి మీదైతే ప్రేమ ఉందో వారు చెప్పిన మాట వినడము కష్టమనిపించదు. మరి మీ అందరి ప్రేమ బాబాపై ఎడతెగనిది కదా! లేక అప్పుడప్పుడూ ఉన్నదా? సదా ఉందా లేక అప్పుడప్పుడూ ఉందా? సదా ప్రేమ ఉంది అనేవారు చేతులెత్తండి. సదా ప్రేమ ఉంది, చూడండి! ఆలోచించండి, సదా ప్రేమ ఉన్నట్లయితే బాబా చెప్పడము పిల్లలు చెయ్యడము ఉండాలి. ఇదైతే తెలుసు కదా!

బాప్ దాదా ఈ సీజన్లో పిల్లలతో ఇదే దృఢ సంకల్పాన్ని చేయించాలనుకుంటున్నారు, తయారుగా ఉన్నారు కదా! తల ఊపండి. దృఢ సంకల్పం చెయ్యడానికి తయారుగా ఉన్నారా? వెనుక ఉన్నవారు తయారుగా ఉన్నారా? మాతలు కూడా తయారుగా ఉన్నారా? పాండవులు కూడా తయారు ఉన్నారా? చేతులు పొడవుగా ఎత్తండి. ఇందులో రెండు రెండు చేతులెత్తండి. ఎప్పుడూ వ్యర్థ సంకల్పాలను దగ్గరకు రానివ్వము. వాటి పని రావడము, మీ పని సమాప్తం చెయ్యడము. ఈ సీజన్ లో బాప్ దాదా రెండు విషయాలపై శ్రద్ధ పెట్టమని ముందుగానే చెప్పి ఉన్నారు - ఒకటి సంకల్పము, రెండు సమయము. ఈ సంగమంలోని సమయము ఒక్కొక్క నిమిషము యొక్క కనెక్షన్ 21 జన్మలతో ఉంది అని మీకు తెలుసు. ఈ సమయంలో బాప్ దాదాకు పిల్లలపై, పిల్లలకు బాబాపై ప్రేమ ఉంది. మరి ఈ సంగమంలోని ఒక్క సెకండు, సెకండు కాదు ఎందుకంటే 21 జన్మలతో కనెక్షన్ ఉంది. ఒకవేళ ఇప్పుడు సమయాన్ని కాపాడుకోకపోతే 21 జన్మలు పోగొట్టుకున్నట్లే. బాబాపై ప్రేమ ఉంది. ప్రతి ఒక్కరూ, 'బాబాతో ఉండాలి, ఇప్పుడు కూడా ఉండాలి, కలిసి వెళ్ళాలి' అని అనుకుంటారు. మన ఇంటికి ఇక తిరిగి వెళ్ళాలి కదా. మరి ఇంట్లో కూడా కలిసి ఉండాలి మరియు రాజ్యంలో కూడా బాప్ దాదాతో పాటు విశేషంగా బ్రహ్మబాబాతో పాటు రాజధానిలో సమీపంగా రావాలి కావున, బ్రహ్మబాబా అయితే ఫరిస్తా రూపంలో ఉన్నారు. మరి మీరు కలిసి వెళ్ళాలి అంటే ఏమి చెయ్యవలసి ఉంటుంది? ఫరిస్తా అవ్వవలసి ఉంటుంది కదా! ఫరిస్తా అవుతారా, అవ్వవలసిందే. బ్రహ్మాబాబా చేతిలో చేయి వేసి కలిసి వెళ్ళాలి కదా, మరి చేయి ఏమిటి? ఫరిస్తాకు స్థూలమైన చేయి ఉండదు కదా. బ్రహ్మబాబా చేతిలో చేయి వేయడము అంటే ఏమిటి? శ్రీమతము. బాప్ దాదా శ్రీమతము ఇదే - ఇప్పుడు నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి సదా ఎలా అయితే మీ జగదాంబ పురుషార్థం చేసారో, బాబా చెప్పడము జగదాంబ చెయ్యడము. ఇలా జగదాంబను ఫాలో చెయ్యండి. సమయము మరియు సంకల్పాన్ని సఫలం చేసుకోవలసిందే. వ్యర్థంగా పోకూడదు. వినిపించాము కదా, ఒక్కొక్క సంకల్పం యొక్క కనెక్షన్ 21 జన్మలతో ఉంది. కావున, సదా మనసును బిజీగా పెట్టుకోవాలి అని బాప్ దాదా కోరుకుంటున్నారు. మురళి మననంలో కావచ్చు, సేవలో కావచ్చు, ప్రతి సమయం బిజీగా ఉండండి. మీ చార్టును తయారు చేసుకోండి. ప్రతి సమయము మధ్య మధ్యలో బాప్ దాదా వినిపించిన భిన్న భిన్న డ్రిల్స్ పాటించండి. డ్రిల్స్ తెలుసు కదా - అశరీరిగా అయ్యే డ్రిల్, మీ మూడు స్వరూపాల స్మృతి డ్రిల్. తెలుసు కదా! ఎలా అయితే బాబాకు మూడు రూపాలున్నాయో అలాగే మీకు కూడా మూడు రూపాలున్నాయి - బ్రాహ్మణ, ఫరిస్తా మరియు దేవత. ఈ మూడు రూపాలలో డ్రిల్ చెయ్యడం ద్వారా మీ మనసును బిజీగా పెట్టుకోండి అందుకే మహా మంత్రము ఏమిటి? మన్మనాభవ. బాప్ దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై చాలా చాలా ప్రేమ ఉంది కావున పిల్లలందరూ 'విజయీ భవ' అనే వరదానీలుగా అవ్వాలని బాప్ దాదా కోరుకుంటున్నారు. వినిపించాము కదా, 'మేము విజయులుగా అయ్యాము కానీ మాల 108 మాత్రమే ఉంది కదా, అటువంటప్పుడు విజయులుగా అయ్యి మాలలోకి రాలేము కదా' అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ బాప్ దాదాకు ఎంత ప్రేమ ఉందంటే మీరు విజయులుగా అయితే బాప్ దాదా మాలలో కూడా వరుసలు జోడిస్తారు. మీరు కేవలం విజయులుగా అవ్వండి. మరి ఏమనుకుంటున్నారు? విజయులుగా అవ్వవలసిందే కదా! లేక కేవలం 108 మంది మాత్రమే విజయులుగా అవుతారా? కాదు. బాబా పిల్లలందరూ విజయులే. బాప్ దాదా పిల్లలందరి మస్తకంపై ఏమి చూస్తున్నారు? విజయ తిలకము, ఎందుకంటే సాధారణ రూపంలో ఉన్న బాబాను గుర్తించారు కదా! చివరి పిల్లవాడైనా కానీ, పురుషార్థంలో ఢీలా అయినా కానీ వారిలోని విశేషత ఏమిటంటే సాధారణ రూపంలో ఉన్న బాబాను గుర్తించి 'నా బాబా' అని అనైతే అంటున్నారు కదా, అందుకే పిల్లలందరూ ధైర్యమును ఉంచి విజయాన్ని పొందాలి. కేవలం ఏమి చెయ్యాలి? శ్రమ పడే విషయం లేదు, ప్రేమ యొక్క విషయము. బాప్ దాదాపై ప్రేమ ఉంది, పరివారంపై ప్రేమ ఉంది అంటే ప్రేమ ఉన్నవారి నుండి దూరంగా ఉండలేరు. మరి బ్రహ్మబాబాపై ఎంత ప్రేమ ఉంది? బ్రహ్మబాబాపై, శివబాబాపై మాకు ఎడతెగని ప్రేమ ఉంది అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఎడతెగని ప్రేమ, ఎడతెగని ప్రేమ? చాలా మంచిది. మరి వచ్చే సీజన్లో బాహ దాదా ఏమి చూడాలని ఆశిస్తున్నారు? తెలుసు కదా. 5 నెలలు, 6 నెలలు లభించనున్నాయి మీకు, వ్యర్థం నుండి సమర్థ సంకల్పములు చెయ్యడానికి. 

మరి రండి, మధువనం వారు లేవండి. క్రిందివారైనా, పైనవారైనా. చాలామంది ఉన్నారు. మధువనంవారు బాప్ దాదాకు ప్రియమైనవారు. అంటే మిగతావారు ప్రియమైనవారు కాదని కాదు. అందరూ ప్రియమైనవారే కానీ మధువనం వారిపై ఒక విషయంలో విశేషమైన ప్రేమ ఉంది, అది ఏమిటి? మనసులో అయితే అందరూ గుర్తు చేస్తారు. అందరూ యోగీ ఆత్మలే. అందరూ జ్ఞాని ఆత్మలే కానీ మధువనం వారికి తమ భవిష్యత్తు సహజంగా తయారు చేసుకునేందుకు ఒక లిఫ్టు లభించింది. ఆ లిఫ్టు ఏమిటి? ఎవరు మధువనానికి వచ్చినా, వారి సేవకు నిమిత్తమవుతారు. భోజనం తయారుచేసేవారు కావచ్చు, ఏ డ్యూటీ చేసేవారైనా కావచ్చు, బాప్ దాదా అంటారు, చిమ్మే సేవలో ఉన్నవారైనా భాగ్యశాలురే అని. ఎందుకని? ఎవరు వచ్చినాకానీ వారు ఈ వాతావరణాన్ని చూసి, మీ మనసులోని ప్రేమ శక్తి చూసి సంతోషిస్తారు. భోజనం తయారు చేసేవారు కావచ్చు, మరింకేదైనా డ్యూటీ కావచ్చు కానీ మధువనం వారికి ఛాన్సు ఉంది. మధువనాన్ని ప్రేమ మరియు శక్తిశాలి వాతావరణంగా తయారుచేసే అవకాశం ఉంది. అందుకే బాప్ దాదా మధువనం వారికి చాలా చాలా అభినందనలు తెలుపుతున్నారు. ఈ సీజన్ సమాప్తి, రాబోయే సీజన్‌కు కూడా మీ మనసులలో ఆత్మలను సంతుష్టపరచడానికి మరియు శక్తిశాలిగా అనుభవం చేయించడానికి నిమిత్తంగా అవుతూ ఉంటారు. కావున అందరూ మధువనం వారి కోసం చప్పట్లు కొట్టండి. అచ్ఛా. .
బాప్ దాదాకు ఈరోజు అమృతవేళలో మధువనం సేవాధారులు కనిపించారు. ప్రతి ఒక్కరితో బాప్ దాదా వతనంలో కూడా కలిసారు మరియు ప్రత్యేకంగా, మీకు ముందుగా చెప్పినట్లుగా, నాలుగు గంటల సమయంలో అడ్వాన్స్ గా వెళ్ళిన మీ దాదీలు తప్పకుండా వస్తారు. అలాగే ఈ రోజు కూడా విశేషమైన దాదీలు మరియు విశేషమైన సోదరులు చేరుకున్నారు. వారు విశేషంగా మధువనం వారిని ఇమర్జ్ చేసుకోమని చెప్పారు. విశేషంగా దీదీ మరియు దాదీ, విశేషమైన సోదరులు కూడా మధువనం వారిని గుర్తు చేసుకున్నారు. విశేషంగా దాదీ గుర్తు చేసారు. అంతే కాకుండా వతనం యొక్క మామిడిపండు, వతనం యొక్క పండ్లు ఎంత బాగుంటాయో మీకు తెలుసు కదా, ఫలాల కోసం కర్రను ఉపయోగించనవసరం లేదు. ఏ ఫలం కావాలనుకుంటే ఆ ఫలాన్ని మీ చేతులతోటే తీసుకోగలరు. ఈరోజు మధువనం వారితో మామిడిపళ్ళ పిక్నిక్ చేసుకుంటాము అని దాదీ అన్నారు. ఇతర దాదీలు కూడా వారితో ఉన్నారు, విశేషమైన సోదరులు కూడా ఉన్నారు. మధువనం గురించి దాదీ మనసులో ఏమని ఉందో అడగండి అని బాబా చెప్పారు. అప్పుడు దాదీ ఏమని చెప్పారో తెలుసా? తెలుసా? తెలుసు మీకు. దాదీ అయితే మీకు తెలుసు కదా! దాదీ అన్నారు, ఇప్పటివరకు కూడా నా మనసులో ఇంకా ఉన్న సంకల్పం ఏమిటంటే, మధువనంలోని ప్రతి ఒక్కరూ, పురుషార్థంలో లోటు ఉన్నా కానీ దానికి పురుషార్థం చెయ్యాలి, కానీ మేము మధువనం వారినుండి ఒకటి కోరుకుంటున్నాము. వారు ఏమనుకుంటున్నారు? ఒక్కొక్క మధువన నివాసి బాబా సమానంగా అవ్వాలి. అసలైతే అందరూ అవ్వవలసిందే కానీ విశేషంగా మధువనంవారు. మధువనం వారికి దాదీపై ప్రేమ ఉంది, ఇది దాదీకి తెలుసు అంటున్నారు. మరి ప్రేమకు రిటర్న్ గా ఏమి కోరుకుంటున్నారంటే, ఎలా అయితే మమ్మా లక్ష్యం పెట్టుకున్నారో, బాబా చెప్పడము - మమ్మా చెయ్యడము. ఇదైతే మధువనం వారికి తెలుసు. అలాగే అమృతవేళ నుండి రాత్రి వరకు మధువనం వారు ప్రతి ఒక్కరూ, ఒకవేళ బాబా పైనే కాక మా మీద ప్రేమ ఉన్నట్లయితే, దాదీలపై కూడా ప్రేమ ఉంది, ఎలా అయితే మమ్మా బాబా చెప్పిన ప్రతి సలహాను జీవితంలో ఆచరించారో, అలా మేము కూడా చేసాము. మరి ఒకవేళ దాదీలపై ప్రేమ ఉన్నట్లయితే, ఇదే చేసి చూపించండి. ఉదయం నుండి రాత్రి వరకు దాదీలకు లేక బాబాకు లేక ఎవ్వరికీ నచ్చని సంకల్పాలు, మాటలు, కర్మలు చెయ్యవద్దు. మా ఈ సందేశాన్ని ప్రత్యేకంగా మధువనం వారికి ఇవ్వండి. అప్పుడు మేము (గుల్జార్ దాదీ) దాదీతో అన్నాము, దాదీ! మీరు ఎప్పుడైనా మధువనానికి వస్తారా? ఇప్పుడు నేను (గుల్జార్ సోదరి) వతనం యొక్క సమాచారాన్ని మధువనం వారికి వినిపిస్తున్నాను. మరి నేను (గుల్జార్ సోదరి) వారితో అన్నాను - 'దాదీ, మధువనం వారైతే మీరు ఏమి చెపితే అది చేస్తారు.” మరి నేను నిజమే చెప్పాను కదా, చేస్తారా? చేతులెత్తండి. రెండు రెండు చేతులెత్తండి. చేస్తారా? చాలా మంచిది.

మరి ఈ రోజు ఈ సీజన్ చివరిది. వతనంలో ఇంకా కూడా శోభ ఉంది. మధువనం వారైతే కలిసి మర్జ్ అయిపోయారు, కానీ దాదీలైతే డబుల్ విదేశీయులను కూడా ఇమర్జ్ చేసుకున్నారు. డబుల్ విదేశీయులు లేవండి. మరి విశేషమైన దాదీలే కాక దాదీ ఇలా అంటున్నారు, 'మాకు డబుల్ విదేశీయుల ఒక విషయం చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే మేము అక్కడ ఉన్నప్పుడు వీరి సీజన్ ప్రారంభమయింది అప్పుడు మేము చూసినదేమిటంటే మధువనానికి రావడానికి టికెట్ కోసం ఎంతో యక్తులతో డబ్బును ప్రోగు చేసేవారు. ఇలా-ఇలా యుక్తులతో డబ్బును జమ చేసుకుని మధువనానికి వచ్చారు అని వినగానే మాకు చాలా ప్రేమ కలిగేది. అంతే కాకుండా డబుల్ విదేశీయులలో చాలా మంచి ఉల్లాస ఉత్సాహాలను చూడటం చూసాము. రాగానే 'నా బాబా' అని అంటూ ఎంత సంతోషిస్తారంటే 'నాది' అన్న వెంటనే 'నావారిగా' అయిపోయేవారు. వారి ముఖము, వారి ఉత్సాహము చాలా బాగా కనిపించేవి. అందుకే డబుల్ విదేశీయులకు
మేము (దాదీ) మరియు బాప్ దాదా చెప్పేదేమిటంటే డబుల్ విదేశీయులు మధువనానికి అలంకారము అని. మరి ఇప్పుడు కూడా డబుల్ విదేశీయులు మధువన కార్యాలను ఎంతో శ్రద్ధతో చేస్తారు కావున మా వైపు నుండి కూడా డబుల్ విదేశీయులకు చాలా చాలా చాలా చాలా ప్రియస్మృతులను ఇవ్వండి మరియు ఇలా చెప్పండి, సదా బాబా హృదయంలో మీరు ఉన్నారు - మీ హృదయంలో బాబా ఉన్నారు, ఈ వరదానమునే మా తరఫునుండి ఇవ్వండి. ఇది ఈరోజు అమృతవేళ వతన సమాచారము. 

నలువైపుల ఉన్న అందరూ, దూరంగా ఉన్నవారైనా దగ్గరగా ఉన్నా కానీ అందరిలో బాప్ దాదా ఏమి చూస్తున్నారు? ప్రతి ఒక్కరి మస్తకంపై మెరుస్తున్న నక్షత్రం కనిపిస్తుంది. మేము ఎలా అవ్వాలి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో ఉంది. ఎలా బాబా ఉన్నారో అలా మీరు అవ్వండి. ఈ ఉల్లాస ఉత్సాహాలు కూడా అందరి మనసులలో ఉన్నాయి. బాప్ దాదా ఈ సీజన్ లో విశేషంగా టీచర్లను లేవమంటున్నారు. టీచర్లందరూ లేవండి. ఎంతమంది టీచర్లు ఉన్నారు! నాలుగువంతుల హాలు టీచర్లతోటే ఉంది. టీచర్లను చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తారు ఎందుకంటే బాబా సమానమైన సీట్ లభించే భాగ్యం పొందారు. బాబా మురళిని వినిపించే సీట్ లభించింది. బాబా సదా టీచర్లను సహవాసులు అని అంటారు. ఇప్పుడు టీచర్ల నుండి బాప్ దాదా ఒక విషయాన్ని కోరుకుంటున్నారు. వినిపించమంటారా? బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే, టీచర్ ప్రతి ఒక్కరూ ముఖముతో బ్రహ్మబాబా సమానంగా సంతోషంగా కనిపించాలి. లోపల పురుషార్థం జరుగుతున్నప్పటికీ బయట మీ ముఖముతో బాబా ప్రత్యక్షత జరగాలి. ఎవరు చూసినా కానీ మీలో వారికి ఒక మెరుపు కనిపించాలి. ఇలా ముఖముతో సేవ చేసేవారు బాబాను ప్రత్యక్షం చేసేస్తారు. బాబాను మీ ముఖము ద్వారా ప్రత్యక్షం చేసే సమయం ఇప్పుడు వచ్చేసింది. టీచర్లకు 'నా బాబా' అని సదా, స్వతహాగా గుర్తుంటుంది. ఇప్పుడు బాబాను ముఖముతో ప్రత్యక్షం చెయ్యాలి. చెయ్యగలిగితే చెయ్యండి. చూడండి, అందరూ ఏమంటారు! రిజల్టులో ఏమి ఉంది? బ్రహ్మకుమారీలు చాలా మంచి పని చేస్తున్నారు, బాబా ప్రత్యక్షమవ్వలేదు. వారింకా గుప్తంగానే ఉన్నారు. మరి ఇప్పుడు సమయము సమీపంగా వస్తున్నందున మీ ద్వారా, అది నిమిత్త టీచర్లు అయినా, ఇతరులైన పిల్లలు కానీ, ఇప్పుడు బాబాను ప్రత్యక్షం చెయ్యాలి. బ్రహ్మకుమారీలు మంచి పని చేస్తున్నారు, ఇదైతే జరిగింది. ఇక్కడివరకు చేరుకున్నారు. కానీ, 'స్వయం పరమాత్మ బ్రహ్మ తనువులో ప్రత్యక్షమై బ్రహ్మకుమారీలను ఇంతటి యోగ్యులుగా చేస్తున్నారు' అని ఇప్పుడు ప్రత్యక్షం జరగాలి. ఇప్పుడు ఈ పాయింట్ ఇంకా మిగిలి ఉంది. 'నా బాబా వచ్చేసారు' అని పాట పాడుతూ ఉంటారు, కానీ 'భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమై ఈ కార్యాన్ని సోదరసోదరీల ద్వారా చేయిస్తున్నారు' అని ప్రత్యక్షం కావాలి. ఈ ప్రత్యక్షత చెయ్యాలి కదా? ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు కదా! ఇప్పుడు ప్రారంభించి వచ్చే సీజన్ లోపు చేస్తాము. మీరందరూ కూడా ఇందులో ఉన్నారు, వచ్చే సీజన్ లోపల అయిపోతుందా? అలా అనుకునేవారు చేతులెత్తండి. చేతులు కొంతమంది ఎత్తుతున్నారు. చేతులు ఎత్తని వారు చూస్తారు, మీరు చేస్తారు. టీచర్లు అయితే సంకల్పం చేసారు కదా! ఎందుకంటే చూస్తూనే ఉన్నారు, అన్నీ అకస్మాత్తుగా జరుగనున్నాయి అని బాప్ దాదా చెప్తూనే ఉన్నారు. అకస్మాత్తుగా, అకస్మాత్తుగా అంటూ కూడా చాలా సమయమే అయిపోయింది అని కొంతమంది పిల్లలు అనుకుంటారు. కానీ అకస్మాత్తుగా కూడా ఎప్పుడు జరుగుతుందంటే పిల్లలు బాబా సమానంగా అయినప్పుడు. మీ ముఖము, మీ ఒక్కొక్క మాట బాబాను ప్రత్యక్షం చెయ్యాలి. జరిగిపోవలసిందే. జరగాల్సిందే, కేవలం నిమిత్తంగా అవ్వవలసి ఉంది. ఇప్పుడు వచ్చే సీజన్లో ఏమి చేస్తారు? ఒకటి, స్వయాన్ని బాబా సమానంగా చేసుకోవడము. ఏ లోపము ఉండిపోయినా కానీ దానిని సంపన్నం చెయ్యండి. బాహ దాదాకు ఏ విషయంలో సంతోషంగా ఉంది? పిల్లలు, చిన్న పెద్ద సెంటర్లు వాణి ద్వారా తాము ఏమి చేస్తున్నారో ప్రసిద్ది చేసారు. వాతావరణాన్ని మార్చారు. ఇందుకు బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. ఎవరు ఎక్కడ ప్రోగ్రాములు చేసినా, మంచిగా చేసారు. బ్రహ్మకుమారీలు 75 సంవత్సరాల నుండి నిజంగానే గుప్తంగా తమ కార్యాలను చేసుకుంటూ వచ్చారు అని అందరికీ కూడా అర్థమయింది. ఇప్పుడు, 'బ్రహ్మకుమారీల భగవంతుడు బాబా వచ్చారు' అని అందరూ అనాలి. లక్ష్యము ఉంది కదా! మరి వచ్చే సీజన్లోపు ఈ కార్యం ప్రారంభమవ్వాలి. ఇందుకు ప్రత్యక్ష ప్రోగ్రామును తయారుచెయ్యండి. ప్రోగ్రాము తయారుచేస్తారు కదా, మీటింగ్ చేస్తారు కదా. ఇప్పుడు పిల్లలందరికీ వారసత్వాన్ని ఇచ్చే బాబా వచ్చారన్న విషయం తెలియాలి కదా, మీటింగ్ లో ఈ ప్రోగ్రామును తయారుచెయ్యండి. ఎవ్వరూ వంచితులుగా మిగిలిపోకూడదు. బాబాకైతే పిల్లల దుఃఖము చూసి చాలా దయ కలుగుతూ ఉంటుంది. దుః ఖంలో మొర పెట్టుకున్నప్పుడు, బాబాకు దయ కలుగుతుంది. దేవీదేవతలైన మిమ్మల్ని కూడా ఎంతగానో పిలుస్తూ ఉంటారు. మరి వచ్చే సీజన్లో, ఒకటి, వ్యర్థం యొక్క నామరూపాలు ఉండకూడదు, ఒప్పుకున్నట్లేనా? ఒప్పుకున్నారా! మనసు యొక్క చేతిని ఎత్తండి. వ్యర్థము అంటే ఏమిటి అన్న ఈ జ్ఞానమే మాయమైపోవాలి. ఎలా అయితే స్వర్గపు రాజకుమారులకు దుఃఖము, అశాంతి గురించి ఏమీ తెలియదో అలాగే ఇక్కడ కూడా. వ్యర్థం గురించి మాట్లాడితే ఏమంటున్నారు, అదంటే ఏమిటి అని అంటారు. అలాగే బ్రాహ్మణ పరివారంలో వ్యర్థమంటే ఏమిటో తెలియకూడదు. స్వ చింతన, స్వ చింతన. అచ్ఛా.

సేవ టర్న్ ఢిల్లీ మరియు ఆగ్రా వారిది:- బాగుంది, అందరూ టి.వి. లో ఈ మంచి దృశ్యాన్ని చూడండి. (నా బాబా అనే పట్టీ అందరూ ఊపుతున్నారు). చాలా మంచిది. ఇక జెండాలు దించండి. అచ్చా. ఢిల్లీవారు తమ మనసును పెద్దగా చేసుకోవలసి ఉంది. ఎందుకని? బ్రాహ్మణులందరూ దేవతలుగా అయ్యి ఎక్కడకు వస్తారు? ఢిల్లీలోకే వస్తారు కదా! కనుక ఢిల్లీ వారు చాలా పెద్ద మనసు చేసుకోవాలి. చూడండి, ఒకవేళ బ్రహ్మబాబా కూడా కృష్ణుడిగా అయితే ఎక్కడకు వస్తారు? ఢిల్లీలోకే వస్తారు. కనుక, ఢిల్లీ వారు ఇప్పుడు కూడా ఢిల్లీలోని బ్రాహ్మణ సంఖ్యను పెంచవలసి ఉంది. అన్ని జోన్లలోకల్లా ఢిల్లీ సంఖ్య ఎక్కువగా ఉండాలి. ఇక్కడ జెండా ఎగురవేసారు కదా, అలా దుఃఖిత ఆత్మల మనసులలో బాబా జెండాను ఎగురవేయండి. ఈ జెండాలు వ్యర్థంగా పోవద్దు, నిజమైన జెండాలు దుఃఖితుల మనసులలో ఎగురవేయండి. సేవ అయితే జరుగుతూనే ఉంది. సేవ చేస్తున్నారు కానీ బాప్ దాదా ఏమి చూసారంటే ఈ సంవత్సరం ఏ జోన్ కూడా సేవలో వెనుక లేదు. అందరూ పెద్ద మనసుతో సంతోషంగా ఏ ప్రోగ్రాము చేసినా కానీ చాలా సుందరంగా చేసారు. 'మీరు ఆత్మలు, శరీరం కాదు' అన్న విషయం అందరికీ స్పష్టం చేసారు. ఈ విషయాన్ని మెజారిటీ మంది ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆత్మను ఎలా అయితే ప్రత్యక్షం చేసారో అలాగే పరమాత్మ ప్రత్యక్షతను కూడా పక్కా చెయ్యండి. అందులో ఎవరు నంబర్ వన్ తీసుకుంటారో బాప్ దాదా చూస్తారు. ఆత్మ పాఠాన్ని చాలామందే పక్కా చేసుకున్నారు, ఇప్పుడు పరమాత్మ వారసత్వాన్ని ఇస్తున్నారు, కొందరైనా తీసుకోవాలి కదా. మీ పరివారమే కదా! వంచితులుగా ఉండిపోకూడదు. మరి ఏమి చెయ్యాలి? అది కూడా చెప్పారు. ఢిల్లీ పునాది. మంత్రి వర్గం కూడా వీరు చేస్తున్నది ఒప్పుకుని తీరవలసిందే అని అనుకునే రోజు కూడా వస్తుంది. ఈ అద్భుతాన్ని చేసి చూపించండి. నంబర్‌వన్ ఢిల్లీ వారు చేస్తారా, మరెవరైనా చేస్తారా, వారికి బాప్ దాదా బహుమతిని ఇస్తారు. ఇప్పుడు మిగిలి ఉన్న విషయాన్ని పూర్తి చెయ్యండి. ఉల్లాసం ఉంది కదా? ఢిల్లీ వారికైతే ఉంది కదా! అచ్ఛా..

డబుల్ విదేశీయులు:- మీకు డబుల్ విదేశీయులు అని లభించినట్లుగా డబుల్ పురుషార్థీలు అన్న టైటిల్ లభించాలని బాబా కోరుకుంటున్నారు. తీవ్ర పురుషార్థి. తీవ్ర పురుషార్థి డబుల్ విదేశీయులు వచ్చారు. వీలవుతుందా? డబుల్ విదేశీయులుగా ఉన్నట్లుగా తీవ్ర పురుషార్థి. ఎవ్వరు కూడా సాధారణ పురుషార్ధిగా ఉండవద్దు. ధైర్యమును ఉంచి చేరుకుంటున్నందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. విదేశీయులు లేని టర్న్ ఏదీ లేదు. అంటే ఇది ధైర్యముతో చేస్తున్నారనే కదా! అలాగే ఇప్పుడు డబుల్ విదేశీయులు అంటే తీవ్ర పురుషార్థులు అని ఉదాహరణ చూపించండి. వీలవుతుందా? చేతులెత్తండి. మరి వచ్చే గ్రూపులో ఎవరు వచ్చినా కానీ అది తీవ్ర పురుషార్థి గ్రూపు. ఎవరైతే ముందుకు సాగుతున్నారో, వచ్చే సీజన్ లో బాప్ దాదా అందరినీ లేవమంటారు, కానీ తీవ్ర పురుషార్థీలు, ఏ ఆటంకము మధ్యలో లేకుండా ఉన్నవారిని బాబా లేవమంటారు. అప్పుడు డబుల్ విదేశీయులు లేస్తారు కదా. ఇంకా తీవ్ర పురుషార్థం చెయ్యండి. ఎంత తీవ్ర పురుషార్థం చెయ్యండంటే బాప్ దాదా ఎదురుగా చేయి ఎత్తగలగాలి. సరేనా, ఒప్పుకుంటారా ఇందుకు? మొదటి లైన్ వారు ఒప్పుకున్నారా? మధువనం వారికి ఇష్టమే కదా! ఇక్కడంతా మధువనం వారు కూర్చున్నారు. ఇష్టమేనా? మధువనం వారు మళ్ళీ లేవండి. అచ్చా. వీరు టి.వి. లో వస్తున్నారు. వీరు ఎవరెవరు అని బాప్ దాదా అడిగితే ఈ టి.వి చూసి చెప్పవచ్చు. అచ్ఛా. ఎవరైతే వచ్చారో, వింటూ ఉన్నవారు కూడా ఉన్నారు కానీ మధువనం వారు తీవ్ర పురుషార్థీలలో చేతులెత్తుతారు కదా! ఎత్తుతారు కదా? ఇప్పుడు చేతులు ఎత్తండి. అచ్చా. మీకు పదమారెట్లు అభినందనలు. చాలా మంచిది. ప్రతి జోన్ నుండి ఎంతమంది తీవ్ర పురుషార్థీలు ఉన్నారు అని బాప్ దాదా నోట్ చేసుకుంటారు. మీరు లిస్టును ఇవ్వండి. ప్రతి జోన్ వారు, ఇక్కడకు రాకపోయినా కానీ లిస్టును తప్పకుండా తీసుకురండి. తీవ్ర పురుషార్థం చేసేవారి లిస్టును తీసుకురండి. సరేనా! వెనుక ఉన్నవారు, సరేనా? మీకు నచ్చిందా? చాలా మంచిది. బాప్ దాదాకు తీవ్ర పురుషార్థీలు చాలా నచ్చుతారు. ఎప్పటివరకు సాధారణ పురుషార్ధం చేస్తారు? ఇక వెళ్ళాలి కదా, ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి కదా! మరి తీవ్ర పురుషార్థీలుగా అయ్యి వెళ్ళాలి కదా! బాప్ దాదాకు, వినిపించాము కదా, పిల్లలు ప్రతి ఒక్కరూ విజయులుగా అవ్వడం మంచిగా అనిపిస్తుంది. ఇలా జరిగింది, ఇలా జరిగింది... ఈ సమాచారం వినడం మంచిగా అనిపించదు. కనీసం, ఏ జోన్లు అయితే ఉన్నాయో వారు ఈ 6 నెలలలో, 'అందరూ తీవ్ర పురుషార్థం చేసారు' అన్న రిజల్టును ఇవ్వగలరు. ఒకవేళ 6 నెలలు తీవ్ర పురుషార్ధం చేస్తే అప్పుడు అలవాటుగా అవుతుంది. అవుతుంది కదా అలవాటు! 6 నెలలలో ఎంతమంది తీవ్ర పురుషార్థీలుగా అయ్యారో రిజల్టు తీసుకుంటాము. బాప్ దాదా బహుమతి కూడా ఇస్తారు. ఏ జోన్లో అయితే ఎక్కువ తీవ్ర పురుషార్థీలు ఉంటారో వారికి కూడా బహుమతిని ఇస్తాము. సరేనా? మధువనం వారు, సరేనా? అచ్చా.

మొదటిసారి వచ్చినవారు చాలామంది ఉన్నారు:- చాలా మంచిది. మొదటిసారి వచ్చిన వారికి బాప్ దాదా చాలా చాలా అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకని? ఎందుకంటే ఈ దుఃఖపు వాతావరణాన్ని దాటుకుని సుఖశాంతుల వైపుకు చేరుకున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరూ తమ జీవితం ద్వారా ఇతర ఆత్మలకు పరిచయాన్ని అయితే ఇవ్వగలరు కదా. వచ్చినవారికి ఇది కూడా తెలిసి ఉండాలి - లాస్ట్ సో ఫాస్ట్ వెళ్ళి మీరు కూడా పురుషార్థిగా అయ్యి ఉన్నతంగా అవ్వవచ్చు ఎందుకంటే బాబాను ఒప్పుకున్నారు కదా! మరి బాబా ద్వారా వారసత్వానికి అధికారులుగా అయినట్లే. సమయం సమాప్తం అవ్వకముందే మీ ఇంటికి చేరుకున్నందుకు బాప్ దాదాకు సంతోషంగా ఉంది. తమ పరివారంలోకి వచ్చినందుకు బాబాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ ఇంటికి చేరుకున్నారు. అది కార్యం చేసే స్థానము. ఇది ఇల్లు, ఇది పరమాత్ముని ఇల్లు అంటే మీ ఇల్లు అందుకే బాబా పదమారెట్లు సంతోషంగా ఉన్నారు. పరివారం నుండి విడిపోయిన పిల్లలు మళ్ళీ తమ పరివారంలోకి, తమ ఇంటికి చేరుకున్నారు. ఇప్పుడు లాస్ట్ సో ఫాస్ట్ అవ్వవచ్చు. మార్జిన్ ఉంది. ఒకవేళ తీవ్ర పురుషార్ధం చేస్తే ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. కేవలం అటెన్షన్ ఇవ్వవలసి ఉంటుంది, అంతే. వాహ్ పిల్లలు వాహ్! అని బాప్ దాదాకైతే సంతోషంగా ఉంటుంది. రండి, ఇంకా వస్తూ ఉండండి, మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. తీవ్ర పురుషార్థం చేస్తూ ఉండండి. ఓం శాంతి. అచ్చా.

నలువైపుల ఉన్న పిల్లలకు బాప్ దాదా యొక్క హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు దానితోపాటు బాబా పిల్లలందరినీ తమ స్వమాన నషాలో స్థితి అయి ఉండటం చూసి హర్షిస్తున్నారు. ఎప్పుడు కూడా స్వమానాన్ని వదిలి పెట్టకండి. స్వమానధారి అంటే సదా సర్వ ప్రాప్తివంతులు. స్వమానాల లిస్టు చాలా పెద్దది. రోజూ ఒక్కొక్క స్వమానాన్ని స్మృతిలో పెట్టుకుని స్వరూపంలోకి తీసుకువస్తూ తీవ్ర పురుషార్థీలుగా అయ్యి ముందుకు వెళ్తూ ఉండండి. బాప్ దాదాను హృదయంలో కూర్చోబెట్టుకుని స్వయాన్ని బాప్ దాదా హృదయంలో కూర్చోబెట్టుకుని నిర్భయులుగా అయ్యి మాస్టర్ సర్వశక్తిమంతులుగా అవ్వండి. ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. ఓంశాంతి.

మోహిని అక్కయ్యతో: - నడిపించడం వచ్చింది కదా. నడుస్తూ ఉండండి. తోడు ఉంది, చేయి ఉంది, ఇంకేమి కావాలి! 

(దాదీ జానకి ఆరోగ్యం కారణంగా ఈ రోజు స్టేజి మీదకు రాలేదు) బాప్ దాదా అయితే వారిని ఎదురుగా చూస్తున్నారు. వారు ఎక్కడున్నా కానీ బాబా హృదయంలో కూర్చుని ఉంటారు. బాప్ దాదా దాదీకి సర్వ శక్తుల కిరణాలను ఇస్తున్నారు. సేవకు నిమిత్తమైన ఆత్మ కావున అందరూ, పరివారమంతా మీకు ప్రియస్మృతులను అందజేస్తున్నారు. నిమిత్తంగా ఉన్నారు, నిమిత్తంగా అవ్వవలసిందే. ఇకపోతే ఈ లెక్కాచారాలు సమాప్తమవ్వవలసిందే. బాప్ దాదా మరియు పరివారం యొక్క శుభ ఆశలు మీతో ఉన్నాయి మరియు సదా ఉంటాయి. అచ్ఛా.
పర్ దాదీతో: - బాగున్నారా, హర్షితముఖము. చాలా బాగుంది. ఎంత కష్టమున్నా ముఖంలో కనిపించదు. సాక్షిగా అయి నడుచుకుంటున్నారు. సాక్షిగా అయ్యి నడుచుకోవడంలో తెలివైనవారు. నంబరు తీసుకుంటారు. 

ముగ్గురు అన్నయ్యలతో: - ఇలా కలుసుకునే విధి చాలా బాగుంది. ఇప్పుడు విశేషంగా వాతావరణాన్ని మరింత శక్తిశాలిగా చెయ్యండి. ద్వారం నుండి లోపలకు వచ్చిన ప్రతి ఒక్కరూ 'నేనెక్కడకు వచ్చాను' అని అనుభవం చేసుకోవాలి. శాంతిని అనుభవం చేస్తున్నారు కానీ శక్తి కూడా అనుభూతి అవ్వాలి. ఇక్కడ ఏది కావాలంటే అది లభించగలదు అని అనుభూతి అవ్వాలి. ఇటువంటి వాతావరణం ఇంకెక్కడా చూడలేదు, విచిత్ర స్థానము అని అనుభవం చెయ్యాలి. పరస్పరంలో కలుసుకుని డిపార్టుమంటువారికి వారానికి ఒకసారి లేక రెండు సార్లు ఏదైనా అంశంపై సమయాన్ని కేటాయించి వారి స్థితిగతులను కనుక్కుని ఏమైనా కావాలంటే, సాల్వేషన్ కావాలంటే అది కూడా అడగండి. అంతే కాకుండా ఏదైనా ఒక పాయింట్ పై హోమ్ వర్కును ఇచ్చి తర్వాత కలిసినప్పుడు అడగండి. ప్రతి డిపార్టుమెంటులో ఇది జరగాలి. లేకపోతే కేవలం పని మాత్రమే చేస్తే అందులోనే బిజీ అయిపోతున్నారు. పరస్పరంలో కొంత ఆత్మిక సంభాషణ కూడా జరగాలి. తీవ్ర పురుషార్థి చేస్తున్నట్లుగా. వీరు అంత చెయ్యలేరు. ఒక వారం లేక రెండు వారాలలో డిపార్టుమెంటులో ఈ ప్రోగ్రామును పెట్టండి, అప్పుడు ఏముంది, ఏమి లేదన్నది తెలుస్తుంది. ఏమైనా కావాలంటే సాల్వేషన్ ఇవ్వండి, ఆలోచించి ఇవ్వండి. అంటే డిపార్టుమెంటులో కేవలం పని మాత్రమే కాక జ్ఞానం కూడా జరగాలి. ఇది వీలవుతుంది కదా. వీలవుతుందా? అయితే ఇది చెయ్యండి. సెంటరువారు రాత్రిపూట కూర్చుంటారు, ఇలా కూర్చోవాలి. వారానికి ఒకసారి కూర్చోండి లేక 15 రోజులకు ఒకసారి కూర్చోండి. పాజిటివ్ చేస్తే నెగెటివ్ అణిగిపోతూ ఉంటుంది. అందరూ ఆలోచించి, జరగబోయే మీటింగ్ లో సలహా తీసుకోండి.

('హూ ఏమ్ ఐ' అనే వీడియో ఫిల్మ్ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ రూపంలో ప్రభుత్వం ఒప్పుకుంది.) అందరికీ ఈ సమాచారాన్ని అందించండి. ఏదో ఒక సమాచారాన్ని అందిస్తూ ఉండండి. ఇప్పుడేంటంటే వాతావరణం అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఏమి చేసినా కానీ దాని ప్రభావం పడుతుంది.

(ఇప్పుడు 6 నెలలు అయితే కలవరు) కలుస్తూనే ఉంటాము, అమృతవేళలో కలుస్తాము కదా.

Comments