02-02-2013 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“తండ్రి స్నేహంలో ఇమిడిపోతూ, శక్తులతో మనసును నియంత్రిస్తూ సదా మన్ జీత్, జగత్ జీతులుగా అవ్వండి"
ఈరోజు బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ చూసి హర్షిస్తున్నారు. పిల్లలందరూ, సమ్ముఖంలో ఉన్నా, దూరంగా ఉన్నా కానీ బాప్ దాదా స్నేహంలో లవలీనమై ఉన్నారు. బాప్ దాదా కూడా పిల్లలందరి స్నేహాన్ని చూసి హర్షిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి ముఖము స్నేహములో ఇమిడి ఉంది మరియు బాప్ దాదా కూడా పిల్లలందరినీ చూస్తూ, లవ్లీన్ పిల్లలను చూస్తూ, స్నేహంలో ఇమిడి ఉన్న పిల్లలను చూస్తూ సంతోషిస్తున్నారు. పిల్లలందరిలో మూడు వరదానాలను చూస్తున్నారు. ఒకటి, తండ్రి స్వరూపంలో వారసత్వపు వరదానము, రెండు, శిక్షకుడి రూపంలో శ్రేష్ఠమైన శిక్షణా వరదానము, మూడు, గురువు రూపంలో వరదానాల వరదానము. మూడు వరదానముల స్వరూపమును చూసి హర్షిస్తున్నారు. ఇక్కడ కూర్చున్నవారైనా, దూరంగా ఉన్నవారైనా కానీ పిల్లలందరూ స్నేహములో లవలీనమై ఉన్నారు. తండ్రి కూడా పిల్లల స్నేహంలో లవలీనమై ఉన్నారు. ఈ స్నేహము పిల్లలందరినీ లవలీనమైన అనుభవాన్ని చేయిస్తుంది. ఈ స్నేహము అశరీరిగా చేసేందుకు సాధనము.
బాప్ దాదా పిల్లలందరినీ చూసి హర్షిస్తున్నారు. ఏ పాటను పాడుతారు? వాహ్ పిల్లలూ వాహ్! ఈ స్నేహము అశరీరిగా చేసేది. పిల్లలను చూసి బాబా ఏమంటారు? వాహ్ పిల్లలూ వాహ్! సదా ఈ స్నేహంలోనే ఇమిడి ఉండండి, ఈ పరమాత్మ స్నేహము ప్రతి ఒక్కరినీ పరమాత్మ ప్రేమలో ఇమిడ్చేది. పిల్లలు ప్రతి ఒక్కరి నయనాలలో బాప్ దాదా పిల్లల భాగ్యాన్ని చూస్తున్నారు. ఈ ఒక్క జన్మలో 21 జన్మల భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి మనసులలో పరమాత్మ ప్రేమ అనుభవం అవుతుంది. ఈ పరమాత్మ ప్రేమ ఒక్క జన్మలోనే ఎంత శ్రేష్ఠంగా చేస్తుందంటే ఆత్మ లవలీన్ గా అయ్యి, అశరీరిగా అయ్యి, తన ఇల్లు అయిన పరంధామానికి వెళ్ళడంతో పాటు తన రాజ్యానికి కూడా అధికారిగా అవుతుంది.
ఈరోజు బామ్ దాదా పిల్లలకు విశేషమైన వరదానమును ఇస్తున్నారు - సదా బాబా స్నేహంలో ఇమిడిపోతూ మన్ జీత్, జగత్ జీతులుగా అవ్వండి. సదా మనసుకు యజమానిగా అయ్యి మన్ జీత్ గా అవ్వండి. మనసుకు యజమానిగా అవ్వడం కష్టమని కొందరు భావిస్తారు కానీ బాప్ దాదా అంటారు, మనసును మీరు 'నా మనసు' అని అంటారు కదా, ఎలా అయితే నా కర్మేంద్రియాలు అన్నప్పుడు అవి కంట్రోల్ గా ప్రతి కార్యాన్ని చేస్తాయో అలా మన్ జీత్, జగత్ జీతులుగా అవ్వడము కూడా కష్టము కాదు. ఈ రోజు బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ మన్ జీత్, జగత్ జీతులుగా చేయాలనుకుంటున్నారు. మనసును శక్తులతో నియంత్రిస్తూ మన్ జీతులుగా అవ్వవలసిందే. బాప్ దాదా పిల్లలందరినీ ఈరోజు సదా మనసుకు యజమానులుగా, మన్ జీత్, జగత్ జీతులుగా చేయాలనుకుంటున్నారు. నాది, నా వాటికి యజమానిని, యజమానిగా అయ్యి ఎలా కావాలంటే అలా మనసును నడిపించండి, అప్పుడు సంతోషంగా ఉంటారు. ఎలా అయితే ఈ చేతులు, కాళ్ళను ఆర్డర్ అనుసారంగా నడిపిస్తారు కదా, ఎందుకంటే నావి కదా, అలాగే మనసును కూడా శక్తి స్వరూపమై నడిపించగలరు కావున యజమానిగా అయ్యి నడిపించండి. అప్పుడు మన్ జీత్, జగత్ జీతులుగా అయిపోతారు. ఈ సంగమ సమయంలో పరమాత్మ తండ్రి ద్వారా వరదానాలు లభిస్తూ ఉంటాయి. వరదాత అయిన తండ్రి పిల్లలందరి జోలెను వరదానాలతో నింపుతారు. ఒక్క జన్మలో అనేక జన్మల భవిష్యత్తును తయారు చేసుకోవచ్చు. అనేక ఆత్మలు ఈరోజు ఇంటికి చేరుకోవడాన్ని బాప్ దాదా చూసారు. బాప్ దాదా అందరికీ ఎంతో స్నేహము మరియు శక్తి రూపంలో అభినందనలు తెలుపుతున్నారు. దానితోపాటు వరదానాలను కూడా ఇస్తున్నారు. వరదానము ఏమిటి? సదా శక్తి స్వరూప ఆత్మగా అయ్యి ఈ కర్మేంద్రియాలను నడిపించే మాస్టర్ అయ్యి, మన్ జీత్, జగత్ జీత్ గా అయ్యి, సదా సంతోషంగా ఉండండి మరియు సంతోషాన్ని పంచండి. ఎందుకంటే ఈరోజు విశ్వంలోని ఆత్మలు తమ తమ కార్యాలను చేస్తూ సంతోషానికి బదులుగా అనేక పరిస్థితులలో స్వయాన్ని బలహీనంగా భావిస్తున్నారు. బలహీనతను శక్తిగా మార్చండి. సంతోషాన్ని పంచండి. ప్రపంచ పరిస్థితినైతే చూస్తూనే ఉన్నారు కానీ స్వయాన్ని అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా చేసుకుని ఆ ప్రేమలో లవ్లీన్ అవ్వండి. అచ్ఛా.
ఈరోజు వచ్చినవారు లేవండి. ఈరోజు ప్రత్యేక ఆహ్వానంపై వచ్చినవారిని లేపండి. (వి.ఐ.పిల పుష్పగుచ్ఛం వచ్చింది) తమ ఇంటికి వచ్చినందుకు బాప్ దాదా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. మీ ఇల్లుగా అనిపిస్తుందా? అనిపిస్తుంటే చేతులెత్తండి. పిల్లలను చూసి బాప్ దాదా కూడా హర్షిస్తున్నారు మరియు వాహ్ పిల్లలూ వాహ్! అన్న పాటను పాడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు మీ సంతోషకర జీవితము ప్రపంచానికి అవసరము. మరి ఒక్కొక్కరూ అనేక ఆత్మలకు పరిచయాన్ని ఇచ్చి ఒకప్పుడు భారతదేశము ఎలా అయితే ఉన్నతంగా ఉండిందో అలా తయారు చెయ్యండి. బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. మీరందరూ మీ పరివారాన్ని చూసి సంతోషిస్తున్నారు కదా! చూడండి, రెండ్రెండు చేతులెత్తుతున్నారు. చాలా మంచిది. మీ తండ్రిని, మీ పరివారాన్ని కలుసుకోవడానికి మీ ఇంటికి వచ్చారు. సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు; సంతోషంగా ఉండండి మరియు సంతోషాన్ని పంచండి - ఈ వరదానమునే బాప్ దాదా ఇస్తున్నారు.
సేవ టర్న్ కర్ణాటక జోన్ వారిది, 11 వేలమంది వచ్చారు:- బాప్ దాదా ఇంతమంది పిల్లలను చూసి వాహ్ పిల్లలూ వాహ్! అన్న పాటను పాడుతున్నారు. ప్రతి ఒక్క జోన్ తమ జోన్‌ను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉండటాన్ని బాప్ దాదా చూసారు. ఇలా జోన్ల వారీగా వచ్చే సిస్టమ్ కూడా పిల్లలందరికీ అనేకమందిని తీసుకువచ్చే ఛాన్సును ఇస్తుంది. బాప్ దాదా కూడా పిల్లలు ఒక్కొక్కరినీ చూసి సంతోషిస్తున్నారు. చూడండి, సగం క్లాసు ఒక్క జోన్ నుండి వచ్చినవారే. బాప్ దాదా కర్ణాటక జోన్ కు విశేష వరదానమును ఇస్తున్నారు - సదా పరస్పరంలో కలుసుకుంటూ అద్భుతాన్ని చేసి చూపిస్తారు. ఏ ప్రోగ్రామును చేసినా అద్భుతంగా చేయండి. బాప్ దాదాకు కర్ణాటక జోన్ అంటే ఎందుకు ఇష్టము? ఎందుకంటే కర్ణాటక నుండి సేవ ఎంతో విస్తారంగా పెరుగుతుంది, పెరుగుతూనే ఉంటుంది. కర్ణాటక వారికి బాప్ దాదా ఇదే వరదానమును ఇస్తున్నారు - సదా సంతోషంగా కర్ణాటకలోని సోదరసోదరీలందరికీ పరమాత్మ సందేశాన్ని తప్పక అందించండి. ఎవ్వరూ మిగలకూడదు. సేవ చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు, ఇందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. మంచిది. కర్ణాటకనుండి మొదటిసారి వచ్చినవారు నిల్చుని ఉండండి, మిగిలిన వారు కూర్చోండి. అచ్చా. సగం క్లాసు మొదటిసారి వచ్చినవారే ఉన్నారు. మంచిది. మీ ఇంటికి వచ్చారు కానీ బాప్ దాదా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుని వారసులుగా అయ్యే వెళ్ళండి. బాప్ దాదా సంతోషిస్తున్నారు. 'మన్ జీత్, జగత్ జీత్, మనసుకు యజమానులుగా అవ్వండి' అని బాప్ దాదా ఏదైతే చెప్పారో ఆ టైటిల్ ను ఇప్పుడు టీచర్లు తప్పకుండా తీసుకోండి. మన్ జీత్, జగత్ జీత్.
డబుల్ విదేశీయులు:- డబుల్ విదేశీయులు, బాప్ దాదా ఇప్పుడు డబుల్ విదేశీయులు అని అనరు. డబుల్ పురుషార్థీలు అని బాప్ దాదా అంటారు. విదేశాలు పురుషార్థంలో అటెన్షను కూడా విశేషంగా ఇవ్వడాన్ని బాప్ దాదా చూసారు. వచ్చిన డబుల్ విదేశీయులకు బాప్ దాదా చాలా చాలా వరదానాలను ఇస్తున్నారు - సదా ముందుకు సాగుతూ ఉంటారు, అనేకులకు బాప్ దాదా వరదానాలను ఇప్పిస్తూ ఉంటారు. సేవ పట్ల ఆసక్తి చాలా బాగా ఉంది, దానితోపాటు స్వయాన్ని ముందుకు తీసుకువెళ్ళే పురుషార్థము కూడా బాగా జరుగుతూ ఉండటాన్ని బాబా చూసారు కావున బాప్ దాదా విశేషంగా డబుల్ ప్రేమను ఇస్తారు. ఎక్కడ ఎవరు ఉన్నాకానీ వారు అటెన్షన్ ఉంచి టెన్షన్ ఫ్రీగా ఉంటారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు, వెళ్తూ ఉంటారు. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు, ఈ పురుషార్థంలో అటెన్షన్ ఉంది. ఈ అటెన్షన్ టెన్షన్ ను సమాప్తం చేస్తుంది. కావున బాప్ దాదా డబుల్ విదేశీయులకు డబుల్ ప్రేమను ఇస్తున్నారు.
మరి అందరూ భవిష్యత్తు కోసం ఏ లక్ష్యాన్ని తీసుకుంటారు? 'స్వయం శక్తిశాలిగా అయ్యి ఇతరులకు కూడా బాప్ దాదా ఇచ్చి వారసులుగా చేసే సేవను చేస్తాము' అన్న లక్ష్యాన్ని అందరూ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి సెంటరుకు వచ్చే సోదరసోదరీలను వారస క్వాలిటీవారిగా తయారు చెయ్యండి. సదా బాబాతో కలిసి ఉంటూ అనేకులను కూడా బాబాకు సహచరులుగా చేసేవారే వారస క్వాలిటీవారు. నలువైపుల సేవను మంచిగా వృద్ధి చేస్తున్నందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఉల్లాసము ఉంది. ఢిల్లీలో ప్రోగ్రామును తయారు చేసారని బాప్ దాదా విన్నారు అలాగే శివరాత్రికి ప్రతి జోన్ వారు కనీసం తమ పట్టణంలో శివరాత్రికి శివబాబాకు కనీస పిల్లలు తయారయ్యేలా ప్రోగ్రామును తయారు చెయ్యండి. ప్రోగ్రామునైతే అందరూ చేస్తారు కానీ ప్రతి ప్రోగ్రాము నుండి ఎంతమంది వారసులు తయారయ్యారు, సమీపం వారు ఎంతమంది వచ్చారు, ఈ రిజల్టును కూడా తియ్యండి. ఇకపోతే, ఈ రోజు బాప్ దాదా చెప్పినట్లుగా అందరూ మన్ జీత్, జగత్ జీతులుగా తప్పకుండా అవ్వాలి. మనసులోని వ్యర్థ సంకల్పాలను సమాప్తము చేసి వ్యర్థానికి వీడ్కోలు ఇవ్వండి లేకపోతే వ్యర్థ సంకల్పాలు కూడా సమయాన్ని పోగొడతాయి. మరి ఈరోజు పాఠము - మన్ జీత్, జగత్ జీత్ గా అవ్వవలసిందే. నా మనసు, మరి నా వాటిపై రాజ్యము ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ స్వరూపాన్ని తమదిగా చేసుకోండి మరియు ఇతరులకు కూడా సహకారాన్ని ఇవ్వండి. వచ్చిన అతిథులు, తమ ఇంటిని చూసినందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఇప్పుడు ఏమి చేస్తారు? మరోసారి వచ్చినప్పుడు మీరు విజిటర్లుగా కాదు, ఇంటివారిగా అయ్యి మరింత మందిని ఇంటివారిగా చెయ్యాలి. సమ్మతమేనా! ఇష్టమేనా, చేతులెత్తండి. బాప్ దాదా చూస్తున్నారు. మంచిది. ఇప్పుడు విజిటర్లు కాదు, ఇప్పుడు ఇంటి యజమానులు, బాలకులు సో యజమానులు. విజిటర్ స్వయాన్ని విజిటర్‌గానే భావిస్తున్నారా లేక ఇంటికి బాలకులు సో యజమానులుగా భావిస్తున్నారా! మేము బాలకులు సో యజమానులము అని భావించేవారు చేతులెత్తండి. బాప్ దాదా మీకు వేయి రెట్లు అభినందనలు తెలుపుతున్నారు. మంచిగా అనిపిస్తుంది. చూడండి, వెరైటీ గ్రూపు ఇది. ఇతరుల సేవకు నిమిత్తమైన ఇద్దరూ లేవండి. (సభలో ఇద్దరు మహాత్మలు, సన్యాసులు ఉన్నారు) బాప్ దాదాకు చాలా ప్రియమైనవారు కావున ఇతరులను కూడా బాప్ దాదాకు ప్రియులుగా చేసేవారు. మంచిది, మీరు కూడా మీ అనుభవంతో అనేకులను అనుభవీగా తయారు చేసేవారు.
కుంభ మేళాలో కూడా చాలా బాగా సేవలు జరుగుతున్నాయి:- బాప్ దాదా కూడా విన్నారు, నిమిత్తమైన బిడ్డకు (మనోరమ అక్కయ్య, బాప్ దాదా కోటానుకోట్ల ప్రేమను అందిస్తున్నారు. అందరూ బాగా శ్రమిస్తున్నారు. బాప్ దాదా బిడ్డను రోజూ అమృతవేళ గుర్తు చేసుకుంటారు ఎందుకంటే గుర్తు చేసుకుంటే తనలో ఉల్లాస ఉత్సాహాలు వస్తూ ఉంటాయి మరియు ఆ ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారు. బాప్ దాదాకు ఈ సమాచారము లభిస్తూ ఉంటుంది. బిడ్డకు చాలా చాలా ప్రియస్మృతులు.
అచ్ఛా-అందరూ ఇక్కడినుండి వెళ్లగానే ఏమి చేస్తారు? తమ సమానంగా చేస్తారు కదా! మన గురించి ఎవరికైతే తెలియదో వారికి పరిచయమునిచ్చి సందేశమునైతే ఇవ్వాలి, మీరైతే మాకు చెప్పనే లేదు అన్న ఫిర్యాదు రాకూడదు అని ప్రతి ఒక్కరూ సంకల్పించండి. మీపై ఉన్న ఫిర్యాదును తప్పకుండా తొలగించుకోండి. మీ సంబంధంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సందేశమును ఇవ్వడం మీ బాధ్యత. ఇంత ఉందని మాకు తెలీదు అని చుట్టు ప్రక్కలవారు, సంపర్కంలోని వారు ఫిర్యాదు చెయ్యకూడదు. ప్రోగ్రాము చేస్తున్నారు, మంచిది. శివరాత్రికి, మీ పరిచయస్థులకు శివ పరమాత్మ కార్యం జరుగుతుందని కనీసం ఇదైతే తెలియాలి. మాకైతే మీరు చెప్పనేలేదు అని ఫిర్యాదు ఉండకూడదు ఎందుకంటే సమయంపై ఎటువంటి నమ్మకమూ లేదు. ఏది జరిగినా అకస్మాత్తుగానే జరుగనుంది. 'అకస్మాత్తుగా' అన్న విషయమును అందరూ మనసులో పెట్టుకోవాలి. మీ భవిష్యత్తును మరియు ఇతరుల భవిష్యత్తును ఎంతగా తయారు చేసుకోవాలనుకుంటే అందుకు ఇదే అవకాశము. బాప్ దాదా పిల్లలు ఒక్కొక్కరికీ అభినందనలు తెలుపుతున్నారు. ముందుకు వెళ్తున్నారు కూడా కానీ వేగాన్ని మరింత తీవ్రం చెయ్యండి. నలువైపుల ఉన్న పిల్లలు స్మృతిలో చాలా కూర్చుంటారని బాప్ దాదా చూసారు. బాప్ దాదా అందరి వద్దకు వెళ్ళి పిల్లలందరికీ ప్రేమను కూడా ఇస్తున్నారు మరియు ప్రేమతో పాటు అభినందనలు కూడా ఇస్తున్నారు. నలువైపుల ఉల్లాసము మంచిగా ఉంది. ఇప్పుడు దుఃఖము నుండి విడిపించండి. ఇప్పుడిక మీ రాజ్యమును రానివ్వండి. పిల్లలందరికీ విదేశాలవారు కావచ్చు, దేశంవారు కావచ్చు, గ్రామం వారు కావచ్చు, పిల్లలు ప్రతి ఒక్కరికీ బాప్ దాదా చాలా చాలా-చాలా స్మృతి మరియు ప్రేమను ఇస్తున్నారు.
దాదీ జానకిగారితో : - (బాబా, మీరు కరిగించేస్తారు) ఇప్పుడు చాలా సేవను చేస్తారు. చేస్తూ ఉన్నారు, ఇంకా చేస్తారు కూడా. సేవకు నిమిత్తంగా ఉన్నారు. నడుస్తుంది, శరీరము నడుస్తుంది, బాగా నడుస్తుంది.
మోహిని అక్కయ్య ఇప్పుడు లోటస్ హౌస్ లో ఉన్నారు:- మంచిది, లెక్కాచారాలను సమాప్తం చేసుకున్నారు, ఇప్పుడింకా డబుల్ పురుషార్ధము చేసి ముందుకు వెళ్తారు. ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళవలసిందే. బాప్ దాదా చాలా చాలా చాలా ప్రియస్మృతులను ఇస్తున్నారు. (మోహిని అక్కయ్యతో పాటు ఉన్న తోటి సేవాధారులు కూడా స్మృతిని ఇచ్చారు) సేవాధారులు ప్రేమతో సేవను చేసారు అందుకు అభినందనలు కానీ ముందు కూడా ఇలా నిర్విఘ్నంగా తయారు చేసి అసలు ఏమీ జరగలేదు అన్నట్లుగా తయారు చెయ్యండి.
పర్ దాదీతో :- బాగున్నారు. మీ ముఖము బాబాను గుర్తు తెప్పిస్తుంది. మీరు మాట్లాడినా మాట్లడకపోయినా కానీ మీ ముఖము సేవ చేస్తుంది.
నిర్వైర్ అన్నయ్యతో:- ఇప్పుడు సేవ చెయ్యాలి, అలా సెలవు ఇవ్వము. వీరందరూ నిమిత్తము. సేవకు ఇంకా ఎంతో అవకాశము ఉంది. చెయ్యండి, బాగా చెయ్యండి. (మీరు తోడుంటే తప్పకుండా చేస్తాము) చెయ్యవలసిందే.
కుంజ్ దాదీ అహ్మదాబాద్ హాస్పిటల్ నుండి స్మృతిని పంపారు:- వారికి స్మృతిని ఇవ్వండి, మొదటినుండి వారు బాబాకు గారాల బిడ్డ. ఇప్పటికీ ప్రేమ మరియు గారాబము శరీరాన్ని నడిపిస్తున్నాయి. బాప్ దాదా దృష్టి ఉంది, సేవ మంచిగా చేసారు.
(దేశ విదేశాలలోని అనేకమంది సోదరసోదరీలు స్మృతిని పంపారు) ఎవరైతే స్మృతిని పంపారో వారికి పదమా పదమా రెట్లు రెస్పాండ్ చేస్తున్నాము. అచ్ఛా.
బృజ్ మోహన్ అన్నయ్యతో:- ప్లాన్ మంచిగా తయారు చేసారు. సహజము కదా, అందరూ సంతోషిస్తారు. అహింస అనే మంచి అంశమును ఎంచుకున్నారు ఎందుకంటే ఇప్పటికీ అహింసను సగంమంది ఒప్పుకుంటారు. అహింస అని విని మరింత అటెన్షను ఇస్తారు.
రమేష్ అన్నయ్యతో:- (నారి సురక్ష యాత్రను శివరాత్రినాడు ప్రారంభిస్తాము) మంచిది, సంగఠన రూపంలో సందేశాన్ని పెంచండి. ఈసారి అన్ని సెంటర్లు కలిసి ఉల్లాస ఉత్సాహాలతో సేవను చెయ్యండి. వర్తమాన సమయంలో ఏ టాపిక్ అయితే ఉందో దానిని తీసుకోండి. మీరు ఎలా ఆలోచిస్తున్నారో అది మంచిగా ఉంది. ఎటువంటి టాపిక్ ను నలువైపుల ఎంచుకోవాలంటే వీరు ప్రపంచ వాతావరణాన్ని బాగు చెయ్యాలనుకుంటున్నారు అని అనిపించాలి. ఈరోజుల్లో బ్రహ్మకుమారీలపై అందరికీ ప్రేమ ఉంది, ముందు వారేదైతే అనేవారో, ఇప్పుడు సేవను చూసి, వృద్ధిని చూసి సంతోషిస్తున్నారు.
(రమేష్ అన్నయ్య 80వ జన్మదినాన్ని జరపుకుంటున్నారు) అభినందనలు.
డా. బనారసి అన్నయ్యతో:- మీవంటి సహచరుడిని తయారు చెయ్యలేదు. ఇప్పుడు కూడా సహచరుడిని తయారు చెయ్యలేదు. వీరు తమవంటి సహచరుడిని తయారు చెయ్యాలి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ వెనుక ఎవ్వరూ ఉండరు. అప్పుడు రోగులకు సౌకర్యంగా ఉండదు. (ప్రతాప్ అన్నయ్య ఉన్నారు) ప్రతాప్ అన్నయ్య అయితే తమ పనిలోనే ఉన్నారు కదా, వీరిలా ఫ్రీగా లేరు. సరేనా.
Comments
Post a Comment