13-12-1989 అవ్యక్త మురళి

      13-12-1989         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

“దివ్య బ్రాహ్మణ జన్మ యొక్క భాగ్యపు రేఖలు”

ఈరోజు విశ్వ రచయిత అయిన బాప్ దాదా తమ విశ్వం యొక్క సర్వ మనుష్యాత్మల రూపీ పిల్లలను చూస్తున్నారు. సర్వ ఆత్మలలో అనగా పిల్లలందరిలో రెండు రకాల పిల్లలున్నారు. ఒకరు - తండ్రిని గుర్తించినవారు మరియు రెండవ వారు - పిలిచేవారు లేదా గుర్తించేందుకు ప్రయత్నించేవారు. కానీ అందరూ పిల్లలే. మరి ఈ రోజు రెండు రకాల పిల్లలను చూస్తున్నారు. పిల్లలందరిలో గుర్తించినవారు లేక ప్రాప్తి చేసుకున్న పిల్లలు చాలా కొద్దిమందే ఉన్నారు మరియు గుర్తించేందుకు ప్రయత్నించేవారు అనేకమంది ఉన్నారు. గుర్తించిన పిల్లల మస్తకంపై శ్రేష్ఠ భాగ్యపు రేఖ మెరుస్తుంది. అన్నింటికంటే శ్రేష్ఠమైన భాగ్యపు రేఖ - తండ్రి ద్వారా దివ్య బ్రాహ్మణ జన్మ యొక్క రేఖ. దివ్య జన్మ యొక్క రేఖ అతి శ్రేష్ఠంగా మెరుస్తుంది. పిలిచేటువంటి పిల్లలు తెలియకుండానే - భగవంతుడే మమ్మల్ని రచించారు అని నమ్ముతారు. కానీ తెలియని వారిగా ఉన్న కారణంగా దివ్య జన్మ యొక్క అనుభూతిని చేయలేరు. మీరు కూడా అంటారు - మాకు బాప్ దాదా దివ్య జన్మనిచ్చారు అని. వారు కూడా అంటారు - భగవంతుడు రచించారు, భగవంతుడే రచయిత, భగవంతుడే పాలన కర్త అని. కానీ ఇరువురు చెప్పేదానిలో ఎంత వ్యత్యాసముంది. మీరు అనుభవంతో, నషాతో, జ్ఞానంతో అంటారు - మమ్మల్ని తల్లదండ్రులైన బాప్ దాదా రచించారు అనగా బ్రాహ్మణ జన్మనిచ్చారు అని. రచయితను, జన్మను, జన్మ పత్రిని, దివ్య జన్మ యొక్క విధిని మరియు సిద్ధిని - అన్నింటినీ తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికీ తమ దివ్య జన్మ యొక్క బర్త్ డే (పుట్టిన రోజు) గుర్తుంది కదా! ఈ దివ్య జన్మ యొక్క విశేషత ఏమిటి? సాధారణ జన్మ తీసుకున్న ఆత్మలు తమ బర్త్ డే ను వేరుగా జరుపుకుంటారు, ఫ్రెండ్స్ డే (స్నేహితుల దినోత్సవం)ను వేరుగా జరుపుకుంటారు, చదువుకునే రోజును వేరుగా జరుపుకుంటారు. మరియు మీరు ఏమంటారు? మీకు బర్త్ డే కూడా అదే, మ్యారేజ్ డే (పెళ్ళి రోజు) కూడా అదే మరియు చదువుకునే రోజు కూడా అదే. మదర్స్ డే అనండి, ఫాదర్స్ డే అనండి, ఎంగేజ్ మెంట్ డే (నిశ్చితార్థపు రోజు) అనండి అన్నీ ఒక్కటే. ఇటువంటి దివ్య జన్మ గురించి ఎప్పుడైనా విన్నారా? మొత్తం కల్పంలో ఆత్మలైన మీకు ఇటువంటి రోజు మళ్ళీ ఎప్పుడూ రాదు. సత్యయుగంలో కూడా బర్త్ డే మరియు మ్యారేజ్ డే ఒక్కటే ఉండదు. కానీ ఇది ఈ సంగమయుగంలోని ఈ మహాన్ జన్మ యొక్క విశేషత కూడా మరియు విచిత్రత కూడా. నిజానికి ఏ రోజునైతే బ్రాహ్మణులుగా అయ్యారో, ఆ రోజే జన్మదినము, ఆ రోజే మ్యారేజ్ డే ఎందుకంటే అందరూ ఇదే ప్రతిజ్ఞను చేస్తారు - ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అని. ఈ దృఢ సంకల్పాన్ని ముందే చేస్తారు కదా. నీతోనే తింటాను, నీతోనే కూర్చొంటాను, నీతోనే సర్వ సంబంధాలు నిర్వర్తిస్తాను - అని అందరూ ప్రతిజ్ఞ చేసారు కదా. పాండవులు, మాతలు, కుమారీలు అందరూ ప్రతిజ్ఞ చేసారు. కనుక స్వప్నంలో కూడా మనసు ఎక్కడకూ వెళ్ళలేదు. ఇలా పక్కాగా ఉన్నారా లేక ఎవరైనా సాథీలు కావాలా? సేవ కోసం ఎవరైనా విశేషమైన సాథీలు కావాలా? అయితే సాథీ-దినం అని ఎవరిది జరుపుకుంటారు? సేవాధారీ సాథీదా లేక తండ్రి సాథీ కనుక వారి దివసాన్ని జరుపుకుంటారా? సేవ చేసేవారు కావచ్చు, సేవ తీసుకునేవారు కావచ్చు కానీ సేవ చేసే సమయంలో సేవ చేసారు, తర్వాత ఎంత అతీతంగా మరియు ప్రియంగా అవ్వాలంటే కొంచెం కూడా విశేషమైన ఇష్టం ఉండకూడదు. ఎవరైతే సేవలో సహాయం చేస్తారో, వారు విశేషమైనవారిగా ఉంటారు కదా. సోదరుడు కావచ్చు, సోదరి కావచ్చు, ఎవరైతే విశేషమైన సేవను చేస్తారో, వారు విశేషమైన అధికారాన్ని కూడా కలిగి ఉంటారు. కనుక సేవలో సాథీలుగా అవ్వండి, కానీ సాక్షిగా అయి సాథీగా అవ్వండి. సాక్షీతనాన్ని మర్చిపోతారు. సాక్షీతనాన్ని మర్చిపోయి, కేవలం సాథీలుగా అయినట్లయితే తండ్రిని మర్చిపోతారు. సాక్షీగా అయి పాత్రను అభినయించే అభ్యాసం చేయండి.

పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై విశేషంగా 4 భాగ్యపు రేఖలు మెరుస్తాయి. 1) దివ్య జన్మ యొక్క రేఖ 2) పరమాత్మ పాలన యొక్క రేఖ 3) పరమాత్మ చదువు యొక్క రేఖ మరియు 4) నిస్వార్థ సేవ యొక్క రేఖ. అందరి మస్తకంలో నాలుగు భాగ్యపు రేఖలు మెరుస్తున్నాయి. కానీ మెరుపులో మరియు సదా ఏకరస వృద్ధిని ప్రాప్తి చేసుకోవడంలో తేడా ఉన్న కారణంగా మెరుపులో అంతరం కనిపిస్తుంది. ఆది నుండి ఇప్పటివరకు నాలుగు రేఖలు సదా యథార్థ రూపంలో నడుస్తూ ఉండడమనేది చాలా కొద్దిమందికే ఉంది. మధ్య-మధ్యలో ఏదో ఒక విషయంలో భాగ్యపు రేఖ ఖండితమైనా అవుతుంది లేక మెరుపు తక్కవైనా అవుతుంది, స్పష్టంగా ఉండదు. ఎలాగైతే హస్తరేఖలను కూడా చూస్తారు కదా - కొందరికి ఖండితమై ఉంటాయి, కొందరికి ఏకరసంగా ఉంటాయి, కొందరికి స్పష్టంగా ఉంటాయి, కొందరికి స్పష్టంగా ఉండవు. బాప్ దాదా కూడా పిల్లల భాగ్యపు రేఖలను చూస్తూ ఉంటారు. దివ్య జన్మనైతే అందరూ తీసుకున్నారు, కానీ దివ్య జన్మ యొక్క రేఖ ఖండితమవుతుంది లేదంటే స్పష్టంగా ఉండదు. ఎందుకంటే తమ జన్మ యొక్క ధర్మంలో అఖండంగా నడవరు కనుక వారి భాగ్యపురేఖ ఖండితమవుతుంది. ధర్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి - వీటి గురించి తెలుసు కదా. అలాగే పరమాత్మ పాలనలో అయితే బ్రాహ్మణులందరూ నడుస్తున్నారు. సమర్పితమై ఉండవచ్చు లేదా ప్రవృత్తిలో ఉండవచ్చు, కానీ తండ్రి డైరెక్షన్ పైన నడుస్తున్నారు. ప్రవృత్తి వారు ఏమంటారు? మీరు సంపాదించినది తింటున్నారా లేక తండ్రిది తింటున్నారా? తండ్రిది తింటున్నారు కదా. ఎందుకంటే తమదంతా తండ్రికిచ్చేసారు, కనుక తండ్రిదే అయినట్లు కదా. మీరు సంపాదిస్తూ ఉండవచ్చు, కానీ సంపాదించిన ధనాన్ని తండ్రి అధీనం చేస్తారా లేక మీ పనిలోనే ఉపయోగిస్తారా? ట్రస్టీలే కదా? ట్రస్టీలకు తమదంటూ ఏదీ ఉండదు. గృహస్థంలో ‘నాది’ అనేది ఉంటుంది, ట్రస్టీ అనగా అంతా తండ్రిది. తమ చేతితో భోజనం తయారుచేసినా కానీ, బ్రహ్మా భోజనం తింటున్నానని భావిస్తారు కదా. మొదట భోగ్ ఎవరికి పెడతారు? తండ్రికి అర్పిస్తారు కదా? అర్పించడం అనగా తండ్రిది తినడము. బ్రహ్మా భోజనాన్ని తింటారు. పిల్లల కోసం ఉపయోగించినా సరే, అది కూడా డైరెక్షన్ అనుసారంగా ఉపయోగిస్తారు. ఎలాగైతే సమర్పిత సోదరీలు లేక సోదరులు భిన్న-భిన్న కార్యాలలో తనువును, మనసును కూడా పెడతారు, అలాగే ధనాన్ని కూడా పెడతారు. అలాగే ప్రవృత్తిలో ఉండేవారు కూడా తనువును పెట్టినా, ధనాన్ని పెట్టినా తండ్రి శ్రీమతం అనుసారంగానే తాకట్టుగా భావిస్తూ కార్యంలో పెడతారు - ఇలాగే చేస్తారు కదా? తాకట్టులో మోసాన్ని అనగా మన్మతమును అయితే కలపడం లేదు కదా. కనుక పరమాత్మ పాలన బ్రాహ్మణాత్మలందరికీ లభిస్తూ ఉంది. శక్తిశాలిగా తయారుచేసేందుకు పాలన ఇవ్వడం జరుగుతుంది. తల్లి పాలనకు ప్రత్యక్ష రూపమేమిటి? పుత్రుడు శక్తిశాలిగా అవుతాడు. కనుక బ్రహ్మా-తల్లి పాలన ద్వారా అందరూ మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యారు. కానీ కొంతమంది పిల్లలు శక్తులను సదా కార్యంలో ఉపయోగిస్తారు, మరికొంతమంది పిల్లలు ప్రాప్తించిన శక్తులను అనగా పాలనను కార్యంలో ఉపయోగించరు అనగా పాలనను ప్రాక్టికల్ (ఆచరణ)లోకి తీసుకురారు. అందువలన శ్రేష్ఠమైన పాలన లభిస్తున్నా కూడా బలహీనంగా ఉండిపోతారు మరియు భాగ్యపురేఖ ఖండితమైపోతుంది.

అలాగే చదువు యొక్క రేఖ - చదువు యొక్క లక్ష్యము-ఉద్దేశ్యమే శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేసుకోవడము. శిక్షకుడైన తండ్రి అందరికీ ఒకటే చదివిస్తారు, ఒకే సమయంలో చదివిస్తారు. కానీ శ్రేష్ఠమైన బ్రాహ్మణ జీవితం యొక్క, చదువు యొక్క పదవి లేక నషా ఏదైతే ఉందో అది అందరికీ ఒకే విధంగా ఉండదు. ఫరిస్తా నుండి దేవతగా అయ్యే హోదాను సదా స్మృతిలో ఉంచుకోరు. అందుకే భాగ్యపురేఖలో అంతరం వచ్చేస్తుంది. అలాగే సేవ యొక్క రేఖ - బ్రహ్మా తండ్రి సాకార రూపంలో అంతిమ వరదాన రూపంలో స్మృతినిప్పించిన సేవా విశేషత - నిరాకారీ, నిర్వికారీ మరియు నిరహంకారి. నిరాకారీ స్థితిలో స్థితులవ్వకుండా ఏ ఆత్మకు కూడా సేవా ఫలాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే ఆత్మ నుండి వచ్చే బాణం ఆత్మకు తగులుతుంది. స్వయం సదా ఇటువంటి స్థితిలో స్థితులై ఉండనట్లయితే, ఎవరి సేవనైతే చేస్తారో వారు కూడా సదా స్మృతి స్వరూపులుగా అవ్వలేరు. అలాగే నిర్వికారీ - ఏ వికారపు అంశమైనా ఇతరాత్మల శూద్ర వంశాన్ని పరివర్తన చేసి బ్రాహ్మణ వంశీయులుగా తయారుచేయలేదు. ఆ ఆత్మ కూడా శ్రమ చేయాల్సి వస్తుంది, అందుకని ప్రేమ యొక్క ఫలాన్ని సదా అనుభవం చేయలేకపోతారు. నిరహంకారీ సేవకు అర్థమే ఫలస్వరూపులుగా అయి వంగటము. నమ్రచిత్తులుగా అవ్వకుండా నిర్మాణము అనగా సేవలో సఫలత లభించదు. కనుక నిరాకారీ, నిర్వికారీ, నిరహంకారీ - ఈ మూడు వరదానాలను సదా సేవలో ప్రాక్టికల్ లోకి తీసుకురావడము - దీనిని అఖండమైన భాగ్యపురేఖ అని అంటారు. ఇప్పుడు 4 భాగ్యపురేఖలు చెక్ చేసుకోండి - అఖండంగా ఉన్నాయా లేక ఖండితంగా ఉన్నాయా, స్పష్టంగా ఉన్నాయా లేక అస్పష్టంగా ఉన్నాయా? కోట్లలో కొందరిగా అయితే అయిపోయారు, కానీ ఆ కొందరిలో కూడా కొందరిగా అవ్వాలి. ఎవరైతే కొందరిలో కొందరిగా ఉంటారో, వారే ఇప్పుడు సర్వులకు గౌరవనీయులుగా మరియు భవిష్యత్తులో పూజ్యనీయులుగా అవుతారు. ఎవరైతే అఖండమైన భాగ్యపురేఖలు కలవారిగా ఉంటారో, వారి గుర్తులు - వారు ఇప్పుడు కూడా సర్వ బ్రాహ్మణ పరివారానికి ప్రియమైనవారిగా ఉంటారు. గౌరవనీయులుగా ఉన్న కారణంగా సర్వుల ఆశీర్వాదాలు, శ్రేష్ఠ ఆత్మల భాగ్యపురేఖలను మెరిపింపజేస్తూ ఉంటాయి. మరి స్వయాన్ని ప్రశ్నించుకోండి - నేను ఎవరు? మరి విన్నారా! ఈ రోజు ఏం చూసారో!

ప్రపంచం వారు పాలనకర్త, జన్మదాత అని అంటారు. కానీ జన్మదాత యొక్క పరిచయమే లేదు మరియు మీరు - పరమాత్మ జన్మదాతగా ఎలా అవుతారు, పరమాత్మ పాలనకర్తగా ఎలా అవుతారు అన్నది నషాతో చెప్పగలరు. బ్రహ్మా-తల్లి యొక్క పాలన కూడా లభిస్తుంది మరియు తండ్రి శ్రేష్ట మతంపై యోగ్యాత్మలుగా అయ్యారు. తండ్రి పిల్లలను యోగ్యులుగా తయారుచేస్తారు మరియు తల్లి శక్తిశాలిగా తయారుచేస్తుంది. రెండు అనుభవాలు ఉన్నాయి కదా అచ్ఛా!

గీతా పాఠశాలకు చెందినవారు ఎక్కువ మంది వచ్చారు. గీతా పాఠశాల వారు ఎవరు? గీతా జ్ఞానాన్ని వినే ‘‘అర్జునులు’’ అర్జునులుగా భావిస్తూ గీతా జ్ఞానాన్ని వింటారా లేక అర్జునుడంటే వేరే వారా? ‘‘నేనే అర్జునుడను’’ అని భావిస్తున్నారా? సదా ఇదే అనుభవం చేస్తూ వినండి - నేను అర్జునుడను, నాకు విశేషంగా భగవంతుడు గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. గీతా పాఠశాల వారైతే అందరికంటే నంబరువన్ గా తయారవుతారు. ఈ విధితో విన్నట్లయితే ముందుకు వెళ్ళిపోతారు. టీచర్లు బిజీగా ఉండేందుకు గీతా పాఠశాలలు బాగున్నాయి. గీతా పాఠశాల చక్రవర్తిగా కూడా తయారుచేస్తుంది, బిజీగా కూడా ఉంచుతుంది, బుద్ధి కూడా మంచిగా అవుతుంది. తక్కువ శ్రమ తీసుకుంటారు, సహాయకులుగా ఎక్కువగా అవుతారు. బలిహారమైతే గీతా పాఠశాల వారిదే కదా, అందుకే గ్రామాలలో నివసించేవారు తండ్రికి ప్రియమనిపిస్తారు. పెద్ద స్థానాలలో మాయ కూడా పెద్ద రూపంలో వస్తుంది. గ్రామాలలో ఉన్నవారికి మాయ కూడా గ్రామం వంటిదే వస్తుంది. అందుకే గ్రామాల వారు చాలా మంచివారు. ఎక్కువ సంఖ్య ఎక్కడ నుండి వచ్చారు? కానీ ఇప్పుడైతే అందరూ మధుబన్ నివాసులే.

టీచర్లందరి పర్మనెంట్ అడ్రస్ ఏమిటి? మధుబన్ యే కదా. అది దుకాణం, ఇది ఇల్లు. ఎక్కువగా ఏది గుర్తుంటుంది, ఇల్లా లేక దుకాణమా? కొంతమందికి దుకాణం ఎక్కువగా గుర్తుంటుంది. నిదురిస్తున్నా కూడా దుకాణమే గుర్తుకొస్తుంది. మీరైతే ఎక్కడ కావాలనుకుంటే అక్కడ బుద్ధిని స్థితి చేయగలరు. సేవాకేంద్రంలో ఉంటూ కూడా మధుబన్ నివాసులుగా అవ్వగలరు మరియు మధుబన్ లో ఉంటూ కూడా సేవాధారిగా అవ్వగలరు. ఈ అభ్యాసముంది కదా. సెకండులో ఆలోచించారు మరియు స్థితులయ్యారు. ఇది టీచర్ల స్థితి యొక్క విశేషత. బుద్ధి కూడా సమర్పణ అయింది కదా లేక కేవలం సేవ కోసమే సమర్పితమా? సమర్పిత బుద్ధి అనగా ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్థితులవ్వడము. ఇది విశేషతకు గుర్తు. బుద్ధి సహితంగా సమర్పితము - ఇలా ఉన్నారు కదా లేక బుద్ధి ద్వారా సగం సమర్పితమై మరియు శరీరంతో పూర్తిగా సమర్పితమయ్యారా?

కొంతమంది టీచర్లు కూడా అంటారు - యోగంలో కూర్చొన్నప్పుడు, ఆత్మాభిమానులుగా అయ్యేందుకు బదులుగా సేవ గుర్తుకొస్తుంది. కానీ అలా ఉండకూడదు ఎందుకంటే చివరి సమయంలో ఒకవేళ అశరీరిగా అయ్యేందుకు బదులుగా సేవ యొక్క సంకల్పాలు నడిచినా కూడా, సెకండు యొక్క పేపర్లో ఫెయిల్ అయిపోతారు. ఆ సమయంలో ఒక్క తండ్రి, నిరాకారీ, నిర్వికారీ, నిరహంకారీ - ఇవి తప్ప ఇంకేమీ గుర్తు రాకూడదు. బ్రహ్మా తండ్రి అంతిమ స్థితి ఇదే తయారుచేసుకున్నారు కదా - పూర్తి నిరాకారీ. సేవలో మళ్ళీ సాకారంలోకి వచ్చేస్తారు. అందుకే ఈ అభ్యాసం చేయండి - ఏ సమయంలో ఏ స్థితి కావాలనుకుంటే ఆ స్థితి లేకపోతే మోసపోతారు. ఇలా ఆలోచించకండి - సేవ యొక్క సంకల్పాలే వచ్చాయి, చెడు సంకల్పాలు, వికల్పాలైతే రాలేదు అని. కానీ కంట్రోలింగ్ పవర్ అయితే లేనట్లే కదా. కంట్రోలింగ్ పవర్ లేకపోతే రూలింగ్ పవర్ రాదు, తర్వాత రూలర్ గా అవ్వలేరు. కనుక అభ్యాసం చేయండి. ఇప్పటి నుండే చాలాకాలపు అభ్యాసం కావాలి. దీనిని తేలికగా తీసుకొని వదలకండి. కనుక విన్నారా, టీచర్లు ఏ అభ్యాసం చేయాలో? అప్పుడే అంటారు - టీచర్లు తండ్రిని ఫాలో చేసేవారు అని. సదా బ్రహ్మా తండ్రిని ఎదురుగా ఉంచుకోండి మరియు మూడు వరదానాలను గుర్తుంచుకోండి మరియు ఫాలో చేయండి. ఇది సహజమే కదా. ఈ అంతిమ వరదానం చాలా శక్తిశాలి వరదానము. ఒకవేళ ఈ మూడు వరదానాలను సదా స్మృతిలో ఉంచుకుంటూ, ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చినట్లయితే తండ్రి హృదయసింహాసనానికి మరియు రాజ్య సింహాసనానికి అధికారులుగా తప్పకుండా అవుతారు. అచ్ఛా! తండ్రి సమానమైన, సదా నాలెడ్జ్ ఫుల్, పవర్ ఫుల్ పిల్లలందరికీ, సదా భాగ్యవిధాత ద్వారా స్పష్టమైన, శ్రేష్ఠ భాగ్యపు రేఖలు కల భాగ్యశాలీ పిల్లలకు, సదా తండ్రి సమానంగా మూడు వరదానాలు ప్రాప్తించుకున్న విశేషాత్మలకు, సదా బ్రాహ్మణ జన్మ యొక్క పాలన మరియు చదువును ముందుకు తీసుకువెళ్ళేవారు - ఇటువంటి అఖండ భాగ్యశాలీ పిల్లలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

అవ్యక్త బాప్ దాదా జోన్ వారీ పిల్లల కలయిక - మహారాష్ట్ర గ్రూపు

సదా స్వయాన్ని సర్వ ప్రాప్తులతో నిండుగా అనుభవం చేస్తున్నారా? ఎప్పుడూ ఖాళీగా అయిపోవడం లేదు కదా? ఎందుకంటే తండ్రి ఇన్ని ప్రాప్తులను చేయించారు. ఒకవేళ సర్వ ప్రాప్తులను స్వయంలో జమ చేసుకున్నట్లయితే, ఎప్పుడూ ఖాళీ అవ్వలేరు. ఈ జన్మ విషయమే కాదు, కానీ అనేక జన్మలు కూడా ఇక్కడి నిండుతనమే తోడుగా ఉంటుంది. కనుక భవిష్యత్తుకు కూడా సరిపడేంతగా ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఖాళీగా ఎలా అవుతారు? ఒకవేళ బుద్ధి ఖాళీగా ఉంటే అలజడి ఉంటుంది. ఏ వస్తువైనా ఒకవేళ పూర్తిగా నిండుగా లేకపోతే, దానిలో అలజడి ఉంటుంది. కనుక నిండుగా ఉన్నదానికి గుర్తు - మాయకు వచ్చేందుకు మార్జిన్ (అవకాశం) ఉండదు. మాయనే కదిలిస్తుంది. మరి మాయ వస్తుందా, రాదా? సంకల్పంలోనైనా వస్తుందా? మాయ రాజ్యంలోనైతే అర్ధకల్పము అనుభవం చేసారు మరియు ఇప్పుడు తమ రాజ్యంలోకి వెళ్తున్నారు. ఎప్పుడైతే మాయాజీతులుగా అవుతారో, అప్పుడు మళ్ళీ తమ రాజ్యం వస్తుంది మరియు మాయాజీతులుగా అయ్యేందుకు సహజ సాధనం - సదా ప్రాప్తులతో నిండుగా ఉండండి. ఏ ఒక్క ప్రాప్తితోనూ వంచితులుగా కాకండి. సర్వప్రాప్తులు ఉండాలి. అంతేకానీ, ఇలా ఉండకూడదు, ఒక్క విషయం లేకపోయినా ఏమీ ఫర్వాలేదు. ఒకవేళ ఏ కొంచెం లోపం ఉన్నా కూడా, మాయ విడిచిపెట్టదు, ఆ స్థానం నుండి కదిలిస్తుంది. కనుక మాయ వచ్చేందుకు మార్జిన్ యే ఉండకూడదు. అది రావడము, మళ్ళీ దానిని పారద్రోలడము, ఇందులో సమయం పోతుంది. కనుక మాయాజీతులుగా అయ్యారా? 2 సంవత్సరాలు లేక 3 సంవత్సరాలలో అయిపోతామని ఆలోచించకండి. బ్రాహ్మణుల కోసం స్లోగన్ - “ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడూ లేదు” ఇప్పుడు సమయం యొక్క వేగం అనుసారంగా ఏ సమయంలోనైనా ఏదైనా జరగవచ్చు. అందుకే తీవ్ర పురుషార్థులుగా అవ్వండి. అచ్ఛా!

Comments