09-12-1989 అవ్యక్త మురళి

     09-12-1989         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

                                  “యోగయుక్తంగా, యుక్తియుక్తంగా అయ్యేందుకు యుక్తి”

ఈరోజు బాప్ దాదా తమ పిల్లలందరిలో విశేషంగా రెండు రకాల పిల్లలను చూస్తున్నారు. ఒకరేమో - సదా యోగయుక్తులు మరియు ప్రతి కర్మలో యుక్తియుక్తులు. రెండవ వారు - యోగీలు కానీ సదా యోగయుక్తంగా లేరు మరియు సదా ప్రతి కర్మలో స్వతహాగా యుక్తియుక్తంగా లేరు. మనసు, మాట లేదా కర్మ - మూడింటిలోను ఒకసారి ఒకదానిలో, ఇంకొకసారి ఇంకొకదానిలో యుక్తియుక్తంగా ఉండరు. సాధారణంగా, బ్రాహ్మణ జీవితం అనగా స్వతహాగా యోగయుక్తము మరియు సదా యుక్తియుక్తము. ‘‘యోగయుక్తము మరియు యుక్తియుక్తము’’ గా ఉండడమే బ్రాహ్మణ జీవితం యొక్క అలౌకికత లేదా విశేషత లేదా అతీతత్వము మరియు ప్రియత్వము. కానీ కొంతమంది పిల్లలు ఈ విశేషతలో సహజంగా మరియు స్వాభావికంగా నడుస్తున్నారు మరియు కొంతమంది అటెన్షన్ ను కూడా పెడుతున్నారు, కానీ ఈ రెండు విషయాలను సదా అనుభవం చేయలేరు. దీనికి కారణమేమిటి? జ్ఞానమైతే అందరికీ ఉంది మరియు లక్ష్యం కూడా అందరిదీ ఒక్కటే. అయినా, కొందరు లక్ష్యం ఆధారంగా ఈ రెండు లక్ష్యాలు అనగా యోగయుక్త స్థితి మరియు యుక్తియుక్త స్థితి యొక్క అనుభూతికి సమీపంగా ఉన్నారు. మరికొందరు అప్పుడప్పుడు తీవ్ర పురుషార్థం ద్వారా సమీపంగా వస్తారు, కానీ అప్పుడప్పుడు సమీపంగా ఉంటారు, అప్పుడప్పుడు నడుస్తూ-నడుస్తూ ఏదో ఒక కారణానికి వశమై ఆగిపోతారు, అందుకే సదా లక్షణాలకు సమీపంగా ఉండే అనుభవాన్ని చేయరు. సర్వ బ్రాహ్మణాత్మలలో ఈ శ్రేష్ఠ లక్ష్యానికి సమీపంగా ఉన్నవారిలో నంబరువన్ ఎవరు? బ్రహ్మా తండ్రి. ఈ సిద్ధిని ప్రాప్తి చేసుకోవడానికి ఏ విధిని తమదిగా చేసుకున్నారు? సదా యోగయుక్తంగా ఉండేందుకు సరళమైన విధి - సదా తమను తాము ‘‘సారథి’’ మరియు ‘‘సాక్షి’’ గా భావిస్తూ నడవడము.

శ్రేష్ఠాత్మలైన మీరందరూ ఈ రథానికి సారథులు. ఆత్మ రథాన్ని నడిపించే సారథి. ఈ స్మృతి స్వతహాగానే ఈ రథం నుండి లేక దేహం నుండి అతీతంగా చేస్తుంది, ఏ రకమైన దేహభానం నుండైనా అతీతంగా చేస్తుంది. దేహభానం లేకపోతే సహజంగానే యోగయుక్తంగా అయిపోతారు మరియు ప్రతి కర్మలో యోగయుక్తంగా, యుక్తియుక్తంగా స్వతహాగానే అవుతారు. స్వయాన్ని సారథిగా భావించినట్లయితే సర్వ కర్మేంద్రియాలు తమ కంట్రోల్ లో ఉంటాయి అనగా సర్వ కర్మేంద్రియాలను సదా లక్ష్యం మరియు లక్షణాల గమ్యానికి సమీపంగా తీసుకువచ్చే కంట్రోలింగ్ పవర్ వచ్చేస్తుంది. స్వయం ‘‘సారథి’’ గా ఉన్నవారు ఏ కర్మేంద్రియానికి వశమవ్వలేరు ఎందుకంటే మాయ ఎవ్వరిపైన అయినా దాడి చేసేటప్పుడు, మాయ దాడి చేసే విధి ఏమిటంటే ఏవైనా స్థూల కర్మేంద్రియాలను గానీ, సూక్ష్మ శక్తులైన మనసు, బుద్ధి, సంస్కారాలను గానీ పరవశం చేస్తుంది. సారథి ఆత్మలైన మీకు తండ్రి ద్వారా ఏదైతే మహామంత్రం, వశీకరణ మంత్రం లభించిందో, దానిని పరివర్తన చేసి వశీకరణకు బదులుగా వశీభూతులుగా చేసేస్తుంది. మరియు ఒక్క విషయంలో వశీభూతులైనా కూడా, అన్ని భూతాలు ప్రవేశిస్తాయి ఎందుకంటే ఈ భూతాలకు కూడా పరస్పరంలో చాలా ఐక్యత ఉంది. ఒక్క భూతం వచ్చినా సరే, అది అన్నింటినీ ఆహ్వానిస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది? ఈ భూతాలు సారథుల నుండి స్వార్థులుగా చేసేస్తాయి. అప్పుడు మీరేం చేస్తారు? ఎప్పుడైతే సారథి స్థితి యొక్క స్మృతిలోకి వస్తారో, అప్పుడు భూతాలను పారద్రోలడానికి యుద్ధం చేస్తారు. యుద్ధం యొక్క స్థితిని యోగయుక్త స్థితి అని అనరు, అందుకే యోగయుక్తము మరియు యుక్తియుక్తము అనే గమ్యానికి సమీపంగా వెళ్ళేందుకు బదులుగా ఆగిపోతారు మరియు మొదటి నంబరు స్థితి నుండి రెండవ నంబరులోకి వచ్చేస్తారు. సారథి అంటే వశమయ్యేవారు కాదు కానీ వశం చేసుకొని నడిపించేవారు. మరి మీరందరూ ఎవరు? సారథులే కదా!

సారథి అంటే ఆత్మాభిమానీ ఎందుకంటే ఆత్మయే సారథి. బ్రహ్మా తండ్రి ఈ విధి ద్వారా నంబరువన్ సిద్ధిని ప్రాప్తి చేసుకున్నారు అందుకే తండ్రి కూడా వీరికి సారథిగా అయ్యారు. సారథిగా అయ్యే స్మృతిచిహ్నాన్ని తండ్రి చేసి చూపించారు. ఫాలో ఫాదర్ చేయండి. సారథిగా అయి సదా సారథి-జీవితంలో అతి అతీతమైన మరియు ప్రియమైన స్థితిని అనుభవం చేయించారు ఎందుకంటే దేహాన్ని అధీనం చేసుకొని తండ్రి ప్రవేశిస్తారు అనగా సారథిగా అవుతారు. దేహానికి అధీనంగా అవ్వరు అందుకే అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. అలాగే బ్రాహ్మణాత్మలైన మీరందరూ కూడా తండ్రి సమానంగా సారథి స్థితిలో ఉండండి. నడుస్తూ-తిరుగుతూ ఇది చెక్ చేసుకోండి - నేను సారథిగా అనగా అన్నింటినీ నడిపించే అతీతమైన మరియు ప్రియమైన స్థితిలో స్థితి అయి ఉన్నానా అని. మధ్య-మధ్యలో ఇది చెక్ చేసుకోండి. అంతేకానీ, రోజంతా గడిచిపోయిన తర్వాత రాత్రికి చెక్ చేసుకోవడం కాదు. రోజంతా గడిచిపోయింది అంటే, గడిచిపోయిన సమయం సదా కోసం సంపాదన లేకుండా పోయినట్లే. అందుకే, పోగొట్టుకున్న తర్వాత స్పృహలోకి రాకండి. దీనిని స్వతహాగా సహజ సంస్కారంగా చేసుకోండి. దేనిని? చెకింగ్ చేసుకునే సంస్కారాన్ని. ఎలాగైతే, ఈ బ్రాహ్మణ జీవితంలో ఎవరిదైనా ఏదైనా పాత సంస్కారం ఇప్పటికీ ముందుకు వెళ్ళడంలో విఘ్న రూపంగా అయినట్లయితే, అంటారు కదా - కోరుకోకపోయినా సంస్కారాలకు వశమైపోతున్నాము అని. ఏదైతే చేయకూడదని అనుకుంటారో అది చేసేస్తారు. వ్యతిరేక సంస్కారాలు, వద్దనుకున్నా ఏ కర్మలనైనా చేయిస్తున్నపుడు స్వాభావికంగా చెకింగ్ చేసుకునే ఈ శుద్ధ సంస్కారాన్ని తమదిగా చేసుకోలేరా? చెకింగ్ చేసుకునే ఈ శుద్ధ సంస్కారం శ్రమ లేకుండా స్వతహాగానే కార్యం చేయిస్తూ ఉంటుంది. మర్చిపోతాము లేదా చాలా బిజీగా ఉంటాము అని అనరు. అశుద్ధ సంస్కారాలు మరియు వ్యర్థ సంస్కారాలు ఉంటాయి. చాలామంది పిల్లలలో అశుద్ధ సంస్కారాలు లేవు కానీ వ్యర్థ సంస్కారాలు ఉన్నాయి. ఈ అశుద్ధ సంస్కారాలను, వ్యర్థ సంస్కారాలను మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేరు. మరియు ఇదే అంటారు - నా భావం కాదు, కానీ ఇది నా పాత స్వభావం లేక పాత సంస్కారం అని. అశుద్ధ సంస్కారాన్ని మర్చిపోలేనప్పుడు మరి శుద్ధ సంస్కారాన్ని ఎలా మర్చిపోతారు? కనుక సారథి యొక్క స్థితి స్వతహాగానే స్వ ఉన్నతి యొక్క శుద్ధ సంస్కారాన్ని ఇమర్జ్ చేస్తుంది మరియు స్వాభావికంగానే సమయానుసారంగా చెకింగ్ జరుగుతూ ఉంటుంది. అశుద్ధ అలవాట్లతో నిస్సహాయులుగా అవుతారు మరియు ఈ అలవాటుతో దృఢంగా అవుతారు. మరి విన్నారా, సదా యోగయుక్తంగా, యుక్తియుక్తంగా ఉండేందుకు విధి ఏమిటి? సారథిగా అయి నడవడము. సారథి స్వతహాగానే సాక్షిగా అయి దేనినైనా చేస్తారు, చూస్తారు, వింటారు. సాక్షిగా అయి చూడడంలో, ఆలోచించడంలో, చేయడంలో అన్నింటిలో అన్నీ చేస్తూ కూడా నిర్లిప్తంగా ఉంటారు అనగా మాయ యొక్క ప్రభావం నుండి అతీతంగా ఉంటారు. మరి పాఠాన్ని పక్కా చేసుకున్నారు కదా. బ్రహ్మా తండ్రిని ఫాలో చేసేవారే కదా. బ్రహ్మా తండ్రి పట్ల చాలా ప్రేమ ఉంది కదా. ప్రేమకు గుర్తు ‘‘సమానంగా అవ్వడము’’ అనగా ఫాలో చేయడము.

టీచర్లందరికీ తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉంది! తండ్రి సదా టీచర్లను తమ సమీప సేవా సాథీలు అని భావిస్తారు. కనుక మొదట టీచర్లు ఫాలో చేస్తారు కదా. ఇందులో సదా ‘మొదట నేను’ అనే లక్ష్యం ఉంచుకోండి. ఈర్ష్య పడడంలో మొదట నేను కాదు, అది నష్టపరుస్తుంది. పదం అదే - ‘మొదట నేను’ కానీ ఒకటేమో - ఈర్ష్యకు వశమై ‘మొదట నేను’, మరి దీని వలన మొదట వచ్చేందుకు బదులుగా ఎక్కడో చివరికి చేరుకుంటారు, ఫస్ట్ నుండి లాస్ట్ కు వచ్చేస్తారు మరియు ఫాలో ఫాదర్ లో ‘మొదట నేను’ అని అన్నారు మరియు చేసారంటే, అప్పుడు ఫస్ట్ ఉన్నవారితో పాటు మీరు కూడా ఫస్ట్ లోకి వస్తారు. బ్రహ్మా ఫస్ట్ కదా. కనుక సదా ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి - టీచర్లు అనగా ఫాలో ఫాదర్ మరియు ఫాలో ఫాదర్ లో నంబరువన్. ఎలాగైతే బ్రహ్మా నంబరువన్ గా అయ్యారు మరి ఫాలో చేసేవారు కూడా నంబరువన్ యొక్క లక్ష్యాన్ని పెట్టుకోండి. టీచర్లందరూ ఇలా పక్కాగా ఉన్నారు కదా. ధైర్యముందా ఫాలో చేయడానికి? ఎందుకంటే టీచర్లు అనగా నిమిత్తంగా అయ్యేవారు, అనేకాత్మలకు మీరు నిమిత్తులు. కనుక నిమిత్తంగా అయ్యేవారిపైన ఎంత బాధ్యత ఉంది! బ్రహ్మా తండ్రి నిమిత్తంగా ఉన్నారు కదా! మరి బ్రహ్మా తండ్రిని చూసి ఎంతమంది బ్రాహ్మణులు తయారయ్యారు! అదే విధంగా టీచర్లు ఏ కార్యం చేస్తున్నా కూడా ఈ స్మృతి ఉండాలి - భోజనం తయారుచేస్తున్నా, శుభ్రం చేస్తున్నా, కానీ ప్రతి కర్మ చేస్తూ - అనేక ఆత్మలకు నేను నిమిత్తంగా ఉన్నాను, నేను ఏ పని అయితే చేస్తానో, ఎలాగైతే చేస్తానో, నిమిత్త ఆత్మనైన నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. అందుకే బాప్ దాదా ఎల్లప్పుడూ ఇదే అంటారు - ఒకవైపు భాషణ చేయడము, మరోవైపు పాత్రలు శుభ్రం చేయడము. రెండు పనులలో కూడా యోగయుక్తంగా, యుక్తియుక్తంగా ఉండాలి. పని ఎలాంటిదైనా సరే, స్థితి సదా యోగయుక్తంగా, యుక్తియుక్తంగా ఉండాలి. అంతేకానీ భాషణ చేసేటప్పుడు యోగయుక్తంగా ఉండి మరియు పాత్రలు శుభ్రం చేసేటప్పుడు అనగా సాధారణ కర్మ చేసేటప్పుడు స్థితి సాధారణంగా ఉండడం కాదు. ప్రతి సమయంలోనూ ఫాలో ఫాదర్. విన్నారా!

ముందు కూర్చొంటారు కదా, మరి ముందు కూర్చోవడం ఎంత మంచిగా అనిపిస్తుంది! మరియు సదా ముందుకు వెళ్ళడము ఎంత మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఏదైనా కఠిన సంస్కారం వెనుకకు లాగే ప్రయత్నం చేసేటప్పుడు, ఈ దృశ్యాన్ని గుర్తు తెచ్చుకోండి. ముందు కూర్చోవడం మంచిగా అనిపించినప్పుడు, మరి ముందుకు వెళ్ళడంలో ఎందుకు వెనుకబడాలి? కనుక ఎప్పుడైనా ఏదైనా విషయం వచ్చినప్పుడు, మధుబన్ కు చేరుకోండి మరియు స్వయాన్ని ధైర్యం, ఉత్సాహాలలోకి తీసుకురండి ఎందుకంటే వెనుక ఉండేవారైతే చాలామంది చివర్లో వస్తారు. మీరు కూడా వెనుకే ఉండిపోతే, అప్పుడు వెనుక ఉన్నవారిని ముందు పెట్టాల్సి వస్తుంది, అందుకని సదా ‘మేము ముందు ఉండేవారము’ అనే స్మృతినుంచుకోండి. వెనుక ఉండడం అనగా ప్రజలుగా అవ్వడము. ప్రజలుగా అయితే అయ్యేది లేదు కదా! ప్రజా యోగులైతే కాదు, రాజయోగులు కదా! కనుక ఫాలో ఫాదర్. అచ్ఛా.

విదేశీయులు ఏం చేస్తారు? ఫాలో ఫాదర్ చేస్తారు కదా! ఎక్కడి వరకు చేరుకుంటారు? అందరూ ముందుకు వచ్చేస్తారు. ఎవరైతే వచ్చారో, ఫాలో ఫాదర్ చేసి ఫాస్ట్ మరియు ఫస్ట్ లోకి రావాలి. ఫస్ట్ లోకైతే ఒక్కరే వస్తారు కదా అని ఆలోచించకండి, కానీ ఫస్ట్-గ్రేడ్ వారైతే చాలామంది ఉంటారు. ఫస్ట్ నంబరులోనైతే బ్రహ్మా వస్తారు, కానీ ఫస్ట్ గ్రేడ్ లోనైతే సాథీలుంటారు, అందుకని ఫస్ట్ లోకి రండి. ఫస్ట్ ఒక్కరే ఉండరు, ఫస్ట్ గ్రేడ్ వారు చాలామంది ఉంటారు. అందుకని ఇలా ఆలోచించకండి - మొదటి నంబరైతే ఫైనల్ అయిపోయింది, అందుకే సెకండు నంబరులోకే వస్తాము. సెకండు గ్రేడులోకి వెళ్ళకండి. ఎవరైతే బాధ్యతను తీసుకుంటారో, వారే నంబరువన్, అర్జునుడు. ఫస్ట్ నంబరు అనగా అర్జునుడు. అందరికీ ఫస్ట్ నంబరులోకి వచ్చే ఛాన్స్ ఉంది, అందరూ రావచ్చు. ఫస్ట్ గ్రేడు అనంతమైనది, తక్కువేమీ కాదు. కనుక అందరూ ఫస్ట్ లోకి వస్తారు కదా, పక్కా? అచ్ఛా.

సదా బ్రహ్మా తండ్రిని ఫాలో చేసేవారు, సదా స్వతహాగా యోగయుక్తంగా, యుక్తియుక్తంగా ఉండేవారు, సదా సారథిగా అయి కర్మేంద్రియాలను శ్రేష్ఠ మార్గం పైన నడిపించేవారు, సదా గమ్యానికి సమీపంగా ఉండేవారు - ఇటువంటి సర్వ శ్రేష్ఠాత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

జోన్ల వారీగా అవ్యక్త బాప్ దాదా ద్వారా ఉచ్ఛరించబడిన మధుర మహావాక్యాలు - ఇండోర్ జోన్

బాప్ దాదా యొక్క శ్రేష్ఠ మతము, శ్రేష్ఠ గతిని ప్రాప్తి చేయించింది - ఈ విధంగా అనుభవం చేస్తున్నారు కదా! ఎలాంటి మతమో అలాంటి గతి ఏర్పడుతుంది. తండ్రిది శ్రేష్ఠ మతం అయినప్పుడు గతి కూడా శ్రేష్ఠంగా ఉంటుంది కదా! అంత మతి సో గతి... అని అంటారు, ఇలా ఎందుకు అంటూ ఉంటారు? ఎందుకంటే తండ్రి చక్రం యొక్క అంతిమంలోనే వచ్చి శ్రేష్ఠ మతాన్ని ఇస్తారు. కనుక అంతిమ సమయంలో శ్రేష్ఠ మతాన్ని తీసుకుంటారు మరియు అనేక జన్మలకు సద్గతిని ప్రాప్తి చేసుకుంటారు. ఈ సమయంలో అనంతమైన అంతిమ మతిని బట్టి గతి శ్రేష్ఠంగా అయిపోతుంది. మరి ఈ సమయంలోని స్మృతిచిహ్నమే భక్తిలో కొనసాగుతుంది. ఒక్క జన్మ యొక్క శ్రేష్ఠ మతంతో ఎన్ని జన్మల వరకు శ్రేష్ఠమైన గతి ప్రాప్తిస్తుంది. అన్ని స్మృతిచిహ్నాలు ఈ సంగమయుగానివే. స్మృతిచిహ్నాలుగా ఎందుకు అయ్యాయి? ఎందుకంటే ఈ సమయంలో స్మృతిలో ఉంటూ కర్మలు చేస్తారు. ప్రతి కర్మ యొక్క స్మృతిచిహ్నం తయారయింది. మీరు అమృతవేళ విధిపూర్వకంగా లేస్తారు. మరి చూడండి, మీ స్మృతిచిహ్నపు చిత్రాలను కూడా విధిపూర్వకంగా లేపుతారు, ఎంత ప్రేమగా లేపుతారు. అవి జడచిత్రాలే కానీ ఎంత హృదయపూర్వకంగా, స్నేహంతో లేపుతారు! లేపుతారు కూడా, తినిపిస్తారు కూడా, నిద్రపుచ్చుతారు కూడా, ఎందుకంటే మీరు ఈ సమయంలో అన్నీ విధి పూర్వకమైన స్మృతితో చేస్తారు. భోజనం కూడా విధిపూర్వకంగా తింటారు. భోగ్ పెట్టి తింటారు కదా లేక ఎలా ఉందో అలాగే తినేస్తారా? ఇలా కాదు కదా, ఎవరికైనా భోజనం ఇవ్వాలి, కనుక తొందర-తొందరగా భోగ్ పెట్టేసాము. ఒకవేళ ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినా, ఇలాంటి విధిలేని పరిస్థితి ఉన్నా కూడా, మొదట కొంత భాగం తప్పకుండా వేరుగా తీయండి. అంతేకానీ, ఎవరికైనా తినిపించి తర్వాత భోగ్ పెట్టడం కాదు. విధి పూర్వకంగా తినడంతో సిద్ధి ప్రాప్తిస్తుంది, సంతోషం కలుగుతుంది, నిరంతర స్మృతి సహజంగా ఉంటుంది.

కనుక అమృతవేళ నుండి రాత్రి వరకు ఏ కర్మ చేసినా సరే, విధిపూర్వకమైన స్మృతితో చేయండి, అప్పుడు ప్రతి కర్మకు సిద్ధి లభిస్తుంది. సిద్ధి అనగా ప్రత్యక్షఫలం ప్రాప్తిస్తూ ఉంటుంది. అన్నింటికంటే అతి గొప్ప సిద్ధి - ‘ప్రత్యక్షఫలం రూపంలో అతీంద్రియ సుఖం అనుభూతి అవ్వడము.’ సదా సుఖపు అలలలో, సంతోషపు అలలలో తేలియాడుతూ ఉంటారు. మొదట ప్రత్యక్ష ఫలం లభిస్తుంది, తర్వాత భవిష్య ఫలం లభిస్తుంది. ఈ సమయంలోని ప్రత్యక్ష ఫలం అనేక భవిష్య జన్మల ఫలం కంటే శ్రేష్ఠమైనది. ఒకవేళ ఇప్పుడు ప్రత్యక్షఫలం తినలేదు అంటే, మొత్తం కల్పంలో ఎప్పుడూ ప్రత్యక్షఫలం లభించదు. ఇప్పుడిప్పుడే చేసారు, ఇప్పుడిప్పుడే లభించింది - దీనినే ప్రత్యక్షఫలమని అంటారు. సత్యయుగంలో కూడా ఏ ఫలమైతే లభిస్తుందో, అది ఈ జన్మదే లభిస్తుంది, ఇతర జన్మలది కాదు. కానీ ఇక్కడ ఏదైతే లభిస్తుందో, అది ప్రత్యక్షఫలం అనగా ఇప్పటి ఫలము. కనుక ప్రత్యక్షఫలం నుండి వంచితులుగా అవ్వకండి, సదా ఫలాన్ని తింటూ ఉండండి. ఈ ప్రత్యక్షఫలం మంచిగా అనిపిస్తుంది కదా! ఇలాంటి భాగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? భగవంతుని ద్వారా ఫలం లభిస్తుంది - ఇది స్వప్నంలో కూడా ఉండేది కాదు. మరి ఏ విషయమైతే సంకల్పంలో, స్వప్నంలో కూడా లేదో అది జరిగినప్పుడు ఎంత సంతోషముంటుంది! ఈ రోజుల్లో అల్పకాలిక లాటరీ వచ్చినా కూడా, ఎంత సంతోషం కలుగుతుంది! మరియు ఈ ప్రత్యక్షఫలం భవిష్య ఫలంగా అవుతుంది. కనుక నషా ఉంటుంది కదా, అప్పుడప్పుడు తక్కువగా, అప్పుడప్పుడు ఎక్కువగా లేదు కదా? సదా ఏకరస స్థితిలో ఎగురుతూ ఉండండి. సెకండులో ఎగరడం నేర్చుకున్నారు కదా లేక ఎక్కువ సమయం పడుతుందా? సంకల్పం చేసారు మరియు చేరుకున్నారు - ఇలాంటి తీవ్ర వేగం ఉందా? అచ్ఛా.

ఇండోర్ జోన్ వారందరూ సంతుష్టంగా ఉన్నారు కదా, మాతలు సదా సంతుష్టంగా ఉన్నారా? అప్పుడప్పుడు లౌకిక పరివారం ద్వారా అసంతుష్టంగా అవ్వడం లేదు కదా? ఎప్పుడైనా విసుగు చెందుతున్నారా? అప్పుడప్పుడు చంచలమైన పిల్లల వలన విసుగు చెందుతున్నారా? ఎప్పుడూ విసుగు చెందకండి. ఎంతగా మీరు విసుగు చెందుతారో, అంతగా వారు ఎక్కువగా విసిగిస్తారు. అందుకే ట్రస్టీలుగా అయి, సేవాధారులుగా అయి సేవను చేయండి. నాది అనేది వస్తే విసుగు చెందుతారు. నా పిల్లలు మరి ఇలా చేస్తారా! కనుక ఎక్కడైతే ‘నాది’ అనేది ఉంటుందో అక్కడ విసుగు చెందుతారు మరియు ఎక్కడైతే ‘నీది-నీది’ అనేది వస్తుందో అక్కడ ఈదుతారు. కనుక ఈదేవారే కదా! సదా ‘నీది’ అనగా స్వమానంలో ఉండడము. ‘నాది-నాది’ అనడం అనగా అభిమానంలోకి రావడం, 'నీది-నీది' అని అంగీకరించడం అనగా స్వమానంలో ఉండడము. కనుక సదా స్వమానంలో ఉండేవారు అనగా ‘నీది’ అని అంగీకరించేవారు - దీనినే గుర్తుంచుకోండి. అచ్ఛా.

డబల్ విదేశీయులు కూడా చాలా కాలం తర్వాత కలిసినవారే. కొద్దిమందే ఉన్నారు. ఎంత సంతోషముంటుంది, దానిని వర్ణించగలరా? అనంతమైన తండ్రి కనుక ప్రాప్తి కూడా అనంతమైనదే. అందుకని హద్దులో లెక్కించలేరు. బాప్ దాదా డబల్ విదేశీ పిల్లలను తీవ్ర పురుషార్థీల వేగంతో చూసి సంతోషిస్తారు. భారతవాసులకైతే భారత్ విషయాల గురించి తెలుసు. కానీ వీరికి తెలియకపోయినా కూడా, ఇంత సమీపంగా తీవ్ర పురుషార్థులుగా అయ్యారు, కనుక అద్భుతం చేసారు కదా! కనుక డబల్ లక్కీగా అయ్యారు. మరియు భారతవాసులకు ఏం నషా ఉందంటే - మేమే ప్రతి కల్పంలో అవినాశీ భారతవాసులుగా అవుతాము. భారత్ యే అవినాశి ఖండము అని నషా ఉంది కదా. ప్రతి ఒక్కరికీ తమ-తమ నషా ఉంది. అందరూ భారత్ కే రావాల్సి ఉంటుంది కదా మరియు మీరైతే భారత్ లోనే కూర్చొన్నారు. అచ్ఛా. ఓం శాంతి.

Comments