05-12-1989 అవ్యక్త మురళి

    05-12-1989         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

                                                “సదా ప్రసన్నంగా ఎలా ఉండాలి?”

ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలను చూస్తున్నారు. ఏం చూసారు? పిల్లలు ప్రతి ఒక్కరు ప్రతి సమయం స్వయం ఎంత ప్రసన్నంగా ఉంటున్నారు, దానితో పాటు ఇతరులను స్వయం ద్వారా ఎంత ప్రసన్నంగా చేస్తున్నారు. ఎందుకంటే పరమాత్మ సర్వ ప్రాప్తుల యొక్క ప్రత్యక్ష స్వరూపంగా ప్రసన్నతయే ముఖంపై కనిపిస్తుంది. “ప్రసన్నత” బ్రాహ్మణ జీవితానికి విశేషమైన ఆధారము. అల్పకాలిక ప్రసన్నతకు మరియు సదాకాలిక సంపన్నత యొక్క ప్రసన్నతకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. అల్పకాలిక ప్రసన్నత అల్పకాలిక ప్రాప్తి పొందినవారి ముఖంపై కొంత సమయానికి తప్పకుండా కనిపిస్తుంది, కానీ ఆత్మిక ప్రసన్నత స్వయాన్ని అయితే తప్పకుండా ప్రసన్నంగా చేస్తుంది, అంతేకాక ఆత్మిక ప్రసన్నత యొక్క వైబ్రేషన్లు ఇతర ఆత్మల వరకు చేరుకుంటాయి, ఇతర ఆత్మలు కూడా శాంతి మరియు శక్తిని అనుభవం చేస్తారు. ఎలాగైతే, ఫలాలతో ఉన్న వృక్షం తన శీతలమైన నీడలో కొంత సమయం కోసం మానవులకు శీతలతను అనుభవం చేయిస్తుంది మరియు మానవులు ప్రసన్నంగా అవుతారు. అలాగే, పరమాత్మ ప్రాప్తులనే ఫలాలతో సంపన్నమై, ఆత్మిక ప్రసన్నత కలిగిన ఆత్మ, ఇతరులకు కూడా తన ప్రాప్తులనే నీడతో వారి తనువు-మనసుకు శాంతి మరియు శక్తిని అనుభవం చేయిస్తుంది. ప్రసన్నతా వైబ్రేషన్లు సూర్య కిరణాల సమానంగా వాయుమండలానికి, వ్యక్తులకు, ఇతర అన్ని విషయాలను మరపింపజేసి సత్యమైన ఆత్మిక శాంతి యొక్క, సంతోషం యొక్క అనుభూతిలోకి పరివర్తన చేసేస్తాయి. వర్తమాన సమయంలోని అజ్ఞానీ ఆత్మలు తమ జీవితంలో చాలా ఖర్చు చేసైనా సరే, ప్రసన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు ఏం ఖర్చు చేసారు? పైసా ఖర్చు చేయకుండానే సదా ప్రసన్నంగా ఉంటారు కదా! లేదా ఇతరుల సహాయంతో ప్రసన్నంగా ఉంటారా? బాప్ దాదా పిల్లల చార్టు చెక్ చేసారు. ఏం చూసారు? ఒకరేమో - సదా ప్రసన్నంగా ఉండేవారు, రెండవవారు- ప్రసన్నంగా ఉండేవారు. ‘సదా’ అనే పదం లేదు. ప్రసన్నత కూడా మూడు రకాలైనవి చూసారు. 1. స్వయంతో ప్రసన్నము 2. ఇతరుల ద్వారా ప్రసన్నము 3. సేవ ద్వారా ప్రసన్నము. ఒకవేళ మూడింటిలోనూ ప్రసన్నంగా ఉన్నట్లయితే బాప్ దాదాను స్వతహాగానే ప్రసన్నం చేస్తారు. మరియు ఏ ఆత్మపైన అయితే తండ్రి ప్రసన్నంగా ఉంటారో, వారు సదా సఫలతామూర్తులుగా ఉండనే ఉంటారు.

బాప్ దాదా చూసారు - చాలామంది పిల్లలు తమతో తాము కూడా అప్రసన్నంగా ఉంటారు. చిన్న విషయం కారణంగా అప్రసన్నంగా ఉంటారు. మొట్టమొదటి పాఠం - 'నేను ఎవరు' దీనిని తెలుసుకుని కూడా మర్చిపోతారు. ఏదైతే తండ్రి తయారుచేసారో, ఇచ్చారో దానిని మర్చిపోతారు. బాబా ప్రతి ఒక్క బిడ్డను పూర్తి వారసత్వానికి అధికారిగా తయారుచేసారు. కొందరికి పూర్తిగా, కొందరికి సగం వారసత్వం ఇవ్వలేదు. ఎవరికైనా సగం లేక పావు భాగం లభించిందా? సగం లభించిందా లేక సగం తీసుకున్నారా? బాబా అయితే అందరికీ మాస్టర్ సర్వశక్తివంతులు అనే వరదానం లేక వారసత్వం ఇచ్చారు. పిల్లలకు కొన్ని శక్తులే ఇచ్చి, కొన్ని ఇవ్వలేదు అని కాదు. తమ కోసం ఏమీ ఉంచుకోలేదు. సర్వగుణ సంపన్నులుగా తయారుచేసారు, సర్వ ప్రాప్తి స్వరూపులుగా తయారుచేసారు. కానీ తండ్రి ద్వారా ఏ ప్రాప్తులైతే లభించాయో, వాటిని స్వయంలో ఇముడ్చుకోరు. ఎలాగైతే, స్థూల ధనం లేక సాధనాలు ప్రాప్తించినా కూడా, ఖర్చు చేయడం రాకపోయినా లేదా సాధనాలను ఉపయోగించడం రాకపోయినా, ప్రాప్తి ఉన్నా కూడా వాటి నుండి వంచితులవుతారు. అలాగే, అన్ని ప్రాప్తులు లేక ఖజానాలు అందరి వద్దా ఉన్నాయి, కానీ కార్యంలో ఉపయోగించే విధి రాదు మరియు సమయానికి ఉపయోగించడం కూడా రాదు. తర్వాత అంటారు - నేను అర్థం చేసుకున్నాను ఇది చేయాలి, ఇది చేయకూడదు అని కానీ ఆ సమయంలో మర్చిపోయాను. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను ఆ విధంగా జరిగి ఉండకూడదు అని. ఆ సమయంలో ఒక్క సెకండు గడిచిపోయినా కూడా, సఫలత యొక్క గమ్యానికి చేరుకోలేరు ఎందుకంటే సమయం అనే బండి వెళ్ళిపోయింది. ఒక సెకండు ఆలస్యం చేసినా, ఒక గంట ఆలస్యం చేసినా సమయమైతే వెళ్ళిపోయింది కదా. మరియు ఎప్పుడైతే సమయం అనే బండి వెళ్ళిపోతుందో, అప్పుడు స్వయంతో నిరాశ పడిపోతారు. మరియు అప్రసన్నత యొక్క సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి - నా భాగ్యమే ఇలా ఉంది, డ్రామాలో నా పాత్రే ఇలా ఉంది అని అంటారు. ఇంతకుముందు కూడా వినిపించడం జరిగింది - స్వయంతో అప్రసన్నంగా ఉండటానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉంటాయి. మొదటిది - నిరాశ పడడం, రెండవ కారణం - ఇతరుల విశేషత, భాగ్యం లేదా పాత్రను చూసి ఈర్ష్య ఉత్పన్నమవ్వడము. ధైర్యం తక్కువ ఉంటుంది, ఈర్ష్య ఎక్కువ ఉంటుంది. నిరాశ పడేవారు ఎప్పుడూ ప్రసన్నంగా ఉండలేరు మరియు ఈర్ష్య పడేవారు కూడా ఎప్పుడూ ప్రసన్నంగా ఉండలేరు. ఎందుకంటే ఈ రెండు విషయాలలోనూ అటువంటి ఆత్మల కోరిక ఎప్పుడూ పూర్తి అవ్వదు. మరియు కోరికలు మంచిగా అవ్వనివ్వవు, అందుకే ప్రసన్నంగా ఉండరు. ప్రసన్నంగా ఉండేందుకు సదా ఒక విషయాన్ని బుద్ధిలో ఉంచుకోండి - డ్రామా నియమానుసారంగా సంగమయుగంలో ప్రతి బ్రాహ్మణాత్మకు ఏదో ఒక విశేషత లభించి ఉంది. మాలలో చివరి 16,000 వ పూస అయినా కానీ, వారికి కూడా ఏదో ఒక విశేషత లభించి ఉంది. దాని కన్నా ఇంకా ముందుకు వెళ్ళండి, 9 లక్షలు అని ఏదైతే అంటూ ఉంటారో, వారికి కూడా ఏదో ఒక విశేషత లభించి ఉంది. మీ విశేషతను మొదట గుర్తించండి. ఇప్పుడింకా 9 లక్షల వరకు చేరుకోనే లేదు. కనుక బ్రాహ్మణ జన్మకు గల భాగ్యం యొక్క విశేషతను గుర్తించండి మరియు కార్యంలో పెట్టండి. కేవలం ఇతరుల విశేషతలను చూసి నిరాశలోకి లేక ఈర్ష్యలోకి రాకండి. కానీ తమ విశేషతను కార్యంలో పెట్టినట్లయితే, ఒక్క విశేషత ఇతర విశేషతలను తీసుకొస్తుంది. ఒకటి పక్కన బిందువు పెడుతూ వెళ్తే దాని విలువ ఎంత అవుతుంది? ఒకటి పక్కన ఒక బిందువు పెట్టినట్లయితే 10 అవుతుంది, రెండవ బిందువు పెట్టినట్లయితే 100 అయిపోతుంది, మూడవది పెట్టినట్లయితే... ఈ లెక్క అయితే వస్తుంది కదా. కార్యంలో పెట్టడం అనగా పెంచడము. ఇతరులను చూడకండి. మీ విశేషతను కార్యంలో పెట్టండి. ఎలా అయితే, చూడండి, బాప్ దాదా ఎప్పుడూ భోలీ భండారీ (భోలీ దాదీ) ఉదాహరణను ఇస్తారు. మహారథుల పేర్లు అప్పుడప్పుడు వస్తాయి, కానీ వీరి పేరు ఎక్కువగా వస్తుంది. ఏ విశేషత అయితే ఉందో, దానిని కార్యంలో పెట్టారు. వారు భండారానే సంభాళించారు, కానీ విశేషతను కార్యంలో పెట్టిన కారణంగా విశేషాత్మగా మహిమ చేయబడ్డారు. అందరూ మధుబన్ ను వర్ణించేటప్పుడు దాదీల విషయాలను వినిపిస్తారు మరియు భోలీ దాదీ గురించి కూడా వినిపిస్తారు. భాషణ అయితే చేయరు కానీ విశేషతను కార్యంలో పెట్టడం ద్వారా స్వయం విశేషంగా అయిపోయారు. ఇతరులు కూడా విశేషమైన దృష్టితో చూస్తారు. కనుక ప్రసన్నంగా ఉండటానికి ఏం చేస్తారు? విశేషతను కార్యంలో పెట్టండి. అప్పుడు వృద్ధి చెందుతుంది మరియు ఎప్పుడైతే అన్ని విశేషతలు వచ్చేస్తాయో, అప్పుడు సంపన్నంగా అయిపోతారు. మరియు ప్రసన్నతకు ఆధారం - సంపన్నత. ఎవరైతే స్వయంతో ప్రసన్నంగా ఉంటారో, వారు ఇతరులతో కూడా ప్రసన్నంగా ఉంటారు, సేవతో కూడా ప్రసన్నంగా ఉంటారు. ఏ సేవ లభించినా, అందులో ఇతరులను ప్రసన్నం చేసి సేవలో ముందు నంబరు తీసుకుంటారు. అన్నింటికంటే అతి గొప్ప సేవ - మీ ప్రసన్నమూర్తి చేస్తుంది. కనుక విన్నారు కదా, ఏ చార్టును చూసారో! అచ్ఛా.

టీచర్లకు ముందు కూర్చొనే భాగ్యం లభించింది ఎందుకంటే పండాలుగా (మార్గదర్శకులుగా) అయి వచ్చారు కనుక చాలా శ్రమ చేస్తారు. ఒకరిని సుఖధామ్ నుండి పిలుస్తారు, మరొకరిని విశాల భవన్ నుండి పిలుస్తారు. వ్యాయామం మంచిగా అవుతుంది కదా. సెంటర్ లోనైతే నడవడం చేయరు కదా. ఎప్పుడైతే మొదట్లో సేవను ఆరంభించినప్పుడు నడుచుకొని వెళ్ళేవారు కదా. మీ పెద్ద దాదీలు కూడా నడిచి వెళ్ళేవారు. సామాన్ల సంచి చేతితో పట్టుకొని నడిచి వెళ్ళేవారు. ఈ రోజుల్లో అయితే మీరందరూ అంతా తయారైపోయిన తర్వాత వచ్చారు, కనుక అదృష్టవంతులు కదా. తయారై ఉన్న సెంటర్లు లభించాయి. మన ఇళ్ళు అయిపోయాయి. మొదట్లో అయితే, యమునా నది తీరంలో ఉండేవారు. రాత్రి నిద్రించడానికి, పగలు సేవ చేయడానికి ఒకటే గది ఉండేది. కానీ సంతోషంతో ఏదైతే త్యాగం చేసారో, దాని భాగ్యం యొక్క ఫలాన్ని ఇప్పుడు తింటున్నారు. మీరు ఫలాన్ని తినే సమయంలో వచ్చారు. నాటింది వారు, మీరు తింటున్నారు. ఫలం తినడమైతే చాలా సహజం కదా. ఇప్పుడు అలాంటి ఫల స్వరూపమైన క్వాలిటీని తయారుచేయండి. అర్థమయిందా? క్వాంటిటీ (సంఖ్య) అయితే ఉండనే ఉంది మరియు క్వాలిటీ కూడా కావాలి. 9 లక్షల వరకు వెళ్ళాలంటే క్వాంటిటీ మరియు క్వాలిటీ రెండూ కావాలి. కానీ 16 వేల పక్కా మాలనైతే తయారుచేయండి. ఇప్పుడు క్వాలిటీ యొక్క సేవ పైన విశేష గమనం ఉంచండి.

ప్రతి గ్రూపులో టీచర్లు కూడా వస్తారు, కుమారీలు కూడా వస్తారు కానీ వెలువడరు. మధుబన్ మంచిగా అనిపిస్తుంది, బాబా పట్ల ప్రేమ కూడా ఉంది కానీ సమర్పణ అవ్వటానికి ఆలోచిస్తారు. ఎవరైతే స్వయాన్ని ఆఫర్ చేసుకుంటారో, వారు నిర్విఘ్నంగా నడుస్తారు మరియు ఎవరైతే చెప్పడం వలన నడుస్తారో వారు ఆగుతారు మళ్ళీ నడుస్తూ ఉంటారు. వారైతే పదే-పదే మిమ్మల్నే అంటూ ఉంటారు - మేమైతే ముందే చెప్పాము కదా, మేము సరెండర్ అయి ఉండాల్సింది కాదు. కొంతమంది ఆలోచిస్తారు - దీనికంటే బయట ఉండి సేవ చేయడం మంచిది అని. కానీ బయట ఉండి సేవ చేయడం మరియు త్యాగం చేసి సేవ చేయడం - దీనిలో తప్పకుండా వ్యత్యాసముంటుంది. ఎవరైతే సమర్పణ యొక్క మహత్వాన్ని తెలుసుకున్నారో, వారు ఎల్లప్పుడూ స్వయాన్ని అనేక విషయాల నుండి దూరం చేసుకొని విశ్రాంతిగా వచ్చేసారు, అనేక శ్రమల నుండి విడిపించబడ్డారు. కనుక టీచర్లు తమ మహత్వాన్ని మంచి రీతిగా తెలుసుకున్నారు కదా? ఉద్యోగం మరియు ఈ సేవ - రెండు పనులు చేసేవారు మంచివారా లేక ఒక పని చేసేవారు మంచివారా? అయినా కూడా, వారికైతే డబల్ పాత్రను పోషించాల్సి ఉంటుంది. నిర్బంధనంగా ఉన్నారు, కానీ డబల్ పాత్ర అయితే ఉంది కదా. మీదైతే ఒకటే పాత్ర ఉంది. ప్రవృత్తి వారైతే మూడు పాత్రలు పోషించాల్సి ఉంటుంది - ఒకటేమో చదువు, రెండవది సేవ మరియు దానితో పాటు ప్రవృత్తిని పాలన చేసే పాత్ర. మీరైతే అన్ని విషయాల నుండి విడిపించబడ్డారు. అచ్ఛా.

సర్వ సదా ప్రసన్నత యొక్క విశేషత సంపన్న శ్రేష్ఠ ఆత్మలకు, సదా తమ విశేషతను గుర్తించి కార్యంలో పెట్టేటువంటి తెలివైన మరియు సారయుక్తమైన ఆత్మలకు, సదా ప్రసన్నంగా ఉండేటువంటి, ప్రసన్నంగా చేసేటువంటి శ్రేష్ఠత కలిగిన మహాన్ ఆత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

ఆగ్రా - రాజస్థాన్ జోన్ తో అవ్యక్త బాప్ దాదా కలయిక - సదా స్వయాన్ని అకాల సింహాసనాధికారి శ్రేష్ఠాత్మలుగా అర్థం చేసుకుంటున్నారా? ఆత్మ అకాల్ అయినప్పుడు, దాని సింహాసనం కూడా అకాల సింహాసనం అయిపోయింది కదా. ఆత్మ ఈ సింహాసనంపై కూర్చుని ఎన్ని పనులు చేస్తుంది. సింహాసనాధికారి ఆత్మను, ఈ స్మృతి ద్వారా స్వరాజ్యం యొక్క స్మృతి స్వతహాగానే వస్తుంది. రాజు కూడా ఎప్పుడైతే సింహాసనంపై కూర్చొంటారో, అప్పుడు రాజ్యం యొక్క నషా, రాజ్యం యొక్క సంతోషం స్వతహాగానే ఉంటాయి. సింహాసనాధికారి అనగా స్వరాజ్యాధికారి రాజును - ఈ స్మృతి ద్వారా అన్ని కర్మేంద్రియాలు స్వతహాగానే ఆర్డర్ అనుసారంగా నడుస్తాయి. ఎవరైతే, అకాల సింహాసనాధికారి అని అర్థం చేసుకుని నడుచుకుంటారో, వారి కోసం తండ్రి హృదయ సింహాసనం కూడా ఉంటుంది ఎందుకంటే ఆత్మ అని అర్థం చేసుకుంటే తండ్రి మాత్రమే గుర్తుకొస్తారు. మరి అప్పుడు దేహమూ లేదు, దేహ సంబంధాలూ లేవు, పదార్థాలు లేవు, ఒక్క బాబాయే సంసారము. అందుకే అకాల సింహాసనాధికారి తండ్రి యొక్క హృదయ సింహాసనాధికారిగా కూడా అవుతారు. తండ్రి హృదయంలో ఏ పిల్లలు ఉంటారంటే - ‘‘ఎవరైతే ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు’’ అని అనుకుంటారో. కనుక డబల్ సింహాసనం అయిపోయింది. ఎవరైతే చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలుగా ఉంటారో, ప్రియంగా ఉంటారో, వారిని ఎల్లప్పుడూ ఒడిలో కూర్చోబెట్టుకుంటారు, పైన కూర్చోబెడతారు, కింద కాదు. కనుక బాబా కూడా అంటారు - సింహాసనంపై కూర్చోండి, కిందకు రాకండి. ఎవరికైతే సింహాసనం లభిస్తుందో, వారు వేరే స్థానంలో కూర్చొంటారా ఏమిటి? కనుక అకాల సింహాసనాన్ని లేదా హృదయ సింహాసనాన్ని మర్చిపోయి దేహమనే నేలపైకి, మట్టిలోకి రాకండి. దేహాన్ని మట్టి అని అంటారు కదా. మట్టి, మట్టిలో కలిసిపోతుంది - ఇలా అంటారు కదా! కనుక దేహంలోకి రావడం అనగా మట్టిలోకి రావడము. ఎవరైతే రాయల్ పిల్లలు ఉంటారో, వారెప్పుడూ మట్టిలో ఆడరు. పరమాత్మ పిల్లలు అంటే అందరికంటే రాయల్ అయినట్లు. కనుక సింహాసనంపై కూర్చోవడం మంచిగా అనిపిస్తుందా లేక మట్టిలోకి కూడా వెళ్ళి చూడాలి అని కొద్ది-కొద్దిగా మనసులో అనిపిస్తుందా. చాలామంది పిల్లలకు మట్టిని తినే లేదా మట్టిలో ఆడుకునే అలవాటు ఉంటుంది. మరి అలా అయితే లేరు కదా. 63 జన్మలు మట్టితో ఆడుకున్నారు. ఇప్పుడు తండ్రి సింహాసనాధికారిగా చేస్తున్నారు, కనుక మట్టితో ఎలా ఆడుకుంటారు? ఎవరైతే మట్టిలో ఆడుకుంటారో, వారు మలినంగా అవుతారు. మీరు కూడా ఎంత మలినంగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి స్వచ్ఛంగా తయారుచేసారు - సదా ఈ స్మృతి ద్వారా సమర్థంగా అవ్వండి. శక్తిశాలిగా ఉన్నవారు ఎప్పుడూ బలహీనంగా అవ్వరు. బలహీనంగా అవ్వడం అనగా మాయ యొక్క వ్యాధి రావడము. ఇప్పుడైతే సదా ఆరోగ్యవంతులుగా అయిపోయారు. ఆత్మ శక్తిశాలిగా అయిపోయింది. శరీరం యొక్క లెక్కాచారాలు వేరే విషయం, కానీ మనసు శక్తిశాలిగా అయిపోయింది కదా. శరీరం బలహీనంగా ఉంది, నడవడం లేదు, ఇది చివరి శరీరం, ఇలా అయితే జరిగేదే ఉంది, కానీ ఆత్మ శక్తిశాలిగా ఉండాలి. శరీరంతో పాటు ఆత్మ బలహీనమవ్వకూడదు. కనుక సదా గుర్తుంచుకోండి - డబల్ సింహాసనాధికారి నుండి డబల్ కిరీటధారిగా అయ్యేవారము. అచ్ఛా.

అందరు సంతుష్టంగా ఉన్నారు కదా! సంతుష్టం అనగా ప్రసన్నత. సదా ప్రసన్నంగా ఉంటున్నారా లేక అప్పుడప్పుడు ఉంటున్నారా? అప్పుడప్పుడు అప్రసన్నంగా, అప్పుడప్పుడు ప్రసన్నంగా - ఇలా అయితే కాదు కదా? ఎప్పుడైనా ఏదైనా విషయంలో అప్రసన్నంగా అవ్వడం లేదు కదా? ఈ రోజు ఇది చేసేసాము, ఈరోజు ఇలా అయిపోయింది, నిన్న అలా అయిపోయింది - ఇలాంటి ఉత్తరాలైతే రాయరు కదా? సదా ప్రసన్నచిత్తులుగా ఉండేవారు తమ ఆత్మిక వైబ్రేషన్ల ద్వారా ఇతరులను కూడా ప్రసన్నులుగా చేస్తారు. నేనైతే ప్రసన్నంగానే ఉంటాను అని కాదు, కానీ ప్రసన్నతా శక్తి తప్పకుండా వ్యాపిస్తుంది. ఇతరులు ఎవరినైనా కూడా ప్రసన్నంగా చేయగలిగే విధంగా ఉన్నారా లేక మీ వరకు మాత్రమే ప్రసన్నంగా ఉన్నారా? ఇతరులను కూడా ప్రసన్నంగా చేసినట్లయితే, అప్పుడిక ఉత్తరాలేవీ రావు. ఒకవేళ ఏదైనా అప్రసన్నతను తెలిపే ఉత్తరం వచ్చినట్లయితే, దానిని తిరిగి వారికే పంపించేయండి కదా! ఈ సమయాన్ని మరియు ఈ తారీఖును గుర్తు పెట్టుకోండి. ఈ ఉత్తరం రాయండి - నేను ఓ.కె గా ఉన్నాను మరియు అందరూ నాతో కూడా ఓ.కె గా ఉన్నారు. ఈ రెండు లైన్లు వ్రాయండి, చాలు. నేను కూడా ఓ.కె, ఇతరులు కూడా నాతో ఓ.కె గా ఉన్నారు. ఇంత ఖర్చు ఎందుకు చేస్తారు? ఈ రెండు లైన్లు అయితే కార్డు పైన కూడా వచ్చేస్తాయి మరియు పదే-పదే కూడా రాయకండి. చాలామంది రోజు కార్డు పంపిస్తారు, రోజూ పంపించకండి. నెలలో రెండు సార్లు, 15 రోజులకు ఒకసారి ఓ.కె యొక్క కార్డు వ్రాయండి, వేరే కథలేవీ వ్రాయకండి. తమ ప్రసన్నత ద్వారా ఇతరులను కూడా ప్రసన్నంగా తయారుచేయండి. అచ్ఛా.

Comments