31-12-2000 అవ్యక్త మురళి

               31-12-2000         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

పొదుపు యొక్క ఖాతా జమ చేసుకుని అఖండ మహాదాని అవ్వండి. 

ఈరోజు నవయుగ రచయిత తన యొక్క నవయుగ అధికారి పిల్లలను చూస్తున్నారు. ఈరోజు పాత యుగంలో సాధారణమైనవారు మరియు రేపు క్రొత్త యుగంలో రాజ్యాధికారి పూజ్యులు. ఈరోజు మరియు రేపటి ఆట. ఈరోజు ఏమిటి మరియు రేపు ఏమిటి! అనన్య జ్ఞానీ ఆత్మల ఎదురుగా రాబోయే రేపు కూడా ఈ రోజు వలె స్పష్టంగా కనిపిస్తుంది. మీరందరు క్రొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి వచ్చారు. కానీ బాప్ దాదా క్రొత్తయుగాన్ని చూస్తున్నారు. క్రొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు తమతమ క్రొత్త ప్లాన్స్ తయారుచేసుకునే ఉంటారు. ఈరోజు పాత సంవత్సరం యొక్క సమాప్తి, సమాప్తిలో సంవత్సరమంతటి ఫలితం చూస్తారు. అదేవిధంగా ఈ రోజు బాప్ దాదా కూడా ప్రతి ఒక బిడ్డ యొక్క ఫలితం చూసారు. బాప్ దాదాకి అయితే చూడడానికి సమయం పట్టదు. ఈరోజు విశేషంగా పిల్లలందరి యొక్క జమఖాతా చూసాను. పురుషార్థం అయితే పిల్లలందరు చేసారు, స్మృతిలో కూడా ఉన్నారు, సేవ కూడా చేసారు, లౌకిక అలౌకిక పరివారం యొక్క సంబంధ, సంపర్కాలను కూడా నిలుపుకున్నారు. కానీ ఈ మూడు విషయాలలో జమఖాతా ఎంత ఉంది? ఈరోజు బాప్ దాదా వతనంలో జగదాంబ మాతని ప్రత్యక్షం చేసారు. (దగ్గు వచ్చింది) ఈ రోజు బాజా (డప్పు) కొద్దిగా పాడయింది కానీ మ్రోగించాలి కదా! బాప్ దాదా మరియు మమ్మా కలిసి పిల్లల యొక్క జమాఖాతాను చూసారు. పొదుపు చేసి ఎంత జమ చేసుకున్నారు? అని చూశారు. చూసినది ఏమిటి? అందరూ నెంబర్ వారీయే కానీ ఎంత జమ ఖాతా ఉండాలో అంత లేదు, తక్కువగా ఉంది. అప్పుడు జగదాంబ మాత ప్రశ్నించారు - స్మృతి అనే సబ్జక్టులో కొంతమంది పిల్లల యొక్క లక్ష్యం మంచిగా ఉంది, పురుషార్గం కూడా మంచిగా ఉంది, అయినప్పటికీ జమఖాతా ఎంత ఉండాలో అంత లకు తక్కువగా ఎందుకు ఉంది? ఇలా ఆత్మికసంభాషణ జరిగి, జరిగి ఇదే ఫలితం ఏమి వచ్చిందంటే యోగాభ్యాసం అయితే చేస్తున్నారు, కానీ యోగస్థితి యొక్క శాతం సాధారణంగా ఉన్న కారణంగా జమా ఖాతా కూడా సాధారణంగానే ఉంటుంది, యోగం చేసుకోవాలి అనే లక్ష్యం మంచిగా ఉంది, కానీ యోగానికి ఫలితం - యోగయుక్త, యుక్తియుక్త మాట మరియు నడవడిక. దీనిలో లోపం ఉన్న కారణంగా యోగం చేసే సమయంలో మంచిగా ఉంటున్నారు కానీ యోగి అనగా యోగం యొక్క ప్రభావం జీవితం అంతా ఉండాలి. అందువలనే సమయం అంతా జమా ఇవ్వటం లేదు, అప్పుడప్పుడు మాత్రమే అవుతుంది. నడుస్తూ నడుస్తూ స్మృతి శాతం సాధారణం అయిపోతుంది. అప్పుడు చాలా తక్కువ జమ అవుతుంది. 

రెండవది - సేవ గురించి ఆత్మిక సంభాషణ జరిగింది. సేవ అయితే చాలా చేస్తున్నారు, రాత్రి పగలు బిజీగా కూడా ఉంటున్నారు. చాలా మంచి మంచి ప్లాన్స్ తయారు చేస్తున్నారు మరియు సేవ యొక్క వృద్ధి కూడా బాగా జరుగుతుంది. అయినా కానీ ఎక్కువమంది యొక్క జమా ఖాతా తక్కువగా ఎందుకు ఉంది? ఆత్మిక సంభాషణలో తేలిన విషయం ఏమిటంటే సేవ అయితే అందరూ చేస్తున్నారు, స్వయాన్ని బిజీగా ఉంచుకునే పురుషార్థం కూడా బాగా చేస్తున్నారు. అయినా కానీ జమా ఖాతా తక్కువగా ఉండటానికి కారణం ఏమిటి? ఆత్మికసంభాషణలో కారణం ఏమి వచ్చింది అంటే - సేవ ద్వారా బలం కూడా లభిస్తుంది మరియు ఫలం కూడా లభిస్తుంది. బలం అంటే స్వయం యొక్క హృదయం యొక్క సంతుష్టత, ఫలం అంటే సర్వుల సంతుష్టత. సేవ చేసారు, కష్టపడ్డారు, సమయాన్ని వినియోగించారు. కానీ సేవ ద్వారా మనస్సు యొక్క సంతుష్టత, సర్వుల సంతుష్టత అనుభవం అవ్వాలి. మీతో పాటు ఉన్నవారికి, ఎవరికి సేవ చేసామో వారి మనస్సులో సంతుష్టత అనుభవం చేసుకోవాలి అంతేకానీ చాలా బావుంది, చాలా బావుంది అనేసి వెళ్ళిపోకూడదు. వారి మనస్సుకి సంతుష్టత యొక్క అల అనుభవం కావాలి. చాలా మంచిగా విన్నాం అనటం వేరే విషయం కానీ ఏదో లభించింది, ఏదో పొందాము అని వారికి అనిపించాలి. దీని గురించి బాప్ దాదా గతంలో చెప్పారు - 1. బుద్ది వరకు బాణం వేయటం. 2. మనస్సుకి బాణం వేయటం. చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది అని మిమ్మల్ని మీరు సంతోషం చేసుకునే సంతుష్టత కాదు, స్వయం మరియు సర్వుల యొక్క మనస్సు అంగీకరించాలి. మరోవిషయం ఏమిటంటే సేవ చేశారు మరియు దాని యొక్క ఫలితాన్ని మీరు స్వీకరించారు అంటే నేను చేశాను, నేను చేశాను అని స్వీకరించారంటే సేవాఫలాన్ని తినేసినట్లే. జమ కాలేదు. బాప్ దాదా చేయిచారు అని ధ్యాస బాప్ దాదా వైపుకి ధ్యాస ఇప్పించాలి కానీ ఈ అక్కయ్య చాలా మంచివారు, ఈ అన్నయ్య చాలా మంచివారు అని మీ ఆత్మ వైపుకి కాదు. బాప్ దాదా వీరిని చాలా మంచిగా తయారు చేశారు అని అనుభవం చేయిచటమే జమ ఖాతాను పెంచుకోవటం. అందువలనే ఫలితం మొత్తంలో చూసింది ఏమిటంటే శ్రమ ఎక్కువ, సమయం మరియు శక్తి ఎక్కువ జమ ఖాతా తక్కువ. జమఖాతాను పెంచుకునే తాళంచెవి చాలా సహజమైనది. అది వజ్ర తాళంచెవి, స్వర్ణిమ తాళంచెవిని ఉపయోగిస్తున్నారు. కానీ జమ చేసుకునే తాళంచెవి వజ్రాలది. అది ఏమిటంటే నిమిత్త భావం మరియు నిర్మాన భావం. ముందు వెనుక అనుకోవటం కాదు, సేవ చేసే సమయంలో నిమిత్తభావం, నిర్మాణభావం ఉండాలి మరియు ప్రతీ ఆత్మ పట్ల, వారు మీ సహయోగులు అయినా లేదా మీరు ఎవరికి సేవ చేస్తున్నారో వారి పట్ల ఆయనా, ఇద్దరి పట్ల నిస్వార్ధ శుభభావన మరియు శుభస్నేహం ఉండాలి. ఈ విధి ద్వారా సేవ చేసేవారి జమఖాతా ఎలా పెరిగిపోతుందో బాప్ దాదా జగదాంబ మాతకు చూపించారు. ఎలా పెరుగుతుందంటే కేవలం ఒక్క సెకనులో అనేక గంటల జమా ఖాతా తయారయిపోతుంది. వేగంగా టిక్,టిక్,టిక్ అన్నట్లుగా యంత్రంలో వచ్చేస్తుంది. ఇది చూసి జమ చేసుకోవటం చాలా సహజం అని జగదాంబ మాత చాలా సంతోషపడుతున్నారు. బాప్ దాదా మరియు జగదంబ సరస్వతి ఇద్దరి యొక్క సలహా ఏమిటంటే ఇప్పుడు క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక జమాఖాతాను పరిశీలించుకోండి - రోజంతటిలో పొరపాట్లు చేయలేదు కానీ సమయం, సంకల్పం, సేవ, సంబంధ, సంపర్కంలో స్నేహం మరియు సంతుష్ఠత ద్వారా ఎంత జమ చేసుకున్నాను? కొంతమంది పిల్లలు కేవలం ఈరోజు ఏమి చెడు చేయలేదు కదా, ఎవరికి దు:ఖం ఇవ్వలేదు అని పరిశీలించుకుంటున్నారు కానీ మొత్తం రోజంతటిలో శ్రేష్ట సంకల్పాల ఖాతా ఎంత జమ చేసుకున్నాను? అని పరిశీలించుకోండి. శ్రేష్ట సంకల్పం ద్వారా సేవాఖాతా ఎంత జమ అయ్యింది? ఏదోక కార్యంతో ఎంతమంది ఆత్మలకు సుఖానిచ్చాను? యోగం చేసారు. కానీ యోగం యొక్క శాతం ఏవిధంగా ఉంది? ఈ రోజు ఆశీర్వాదాల ఖాతాను ఎంత జమ చేసుకున్నాను?... ఇలా పరిశీలించుకోండి. 

ఈ క్రొత్త సంవత్సరంలో ఏమి చేయాలి? మనస్సు ద్వారా, వాచా ద్వారా, కర్మణా ద్వారా ఏది చేస్తున్నా కానీ సమయం అనుసరించి మనస్సులో ఏమి ధ్యాస ఉండాలంటే నేను అఖండ మహాదానిగా అవ్వాల్సిందే. మహాదాని కాదు, అఖండ మహాదాని అవ్వాలి. అఖండంగా అవ్వాలి. మనస్సుతో శక్తుల దానం, వాచాతో జ్ఞాన దానం మరియు మీ కర్మ ద్వారా గుణదానం చేయాలి. ఈనాటి ప్రపంచంలో బ్రాహ్మణ పరివారం అనే ప్రపంచంలో అయినా, అజ్ఞానీల ప్రపంచంలో అయినా వినడానికి బదులు చూడాలనుకుంటున్నారు, చూసి చేయాలనుకుంటున్నారు. మీ అందరికి సహజంగా ఎందుకు అనిపిస్తుంది? బ్రహ్మాబాబాని కర్మలో గుణదానమూర్తిగా చూసారు. జ్ఞానదానం అయితే చేస్తునే ఉంటారు కానీ ఈ సంవత్సరం విశేషంగా ప్రతి ఆత్మకు గుణదానం అంటే మీ జీవితం యొక్క గుణాల ద్వారా సహయోగం ఇవ్వాలి అనే ధ్యాస పెట్టుకోండి. బ్రాహ్మణులకు అయితే దానమివ్వరు కదా, సహయోగమివ్వాలి. ఏది ఏమైపోయినా, ఎవరు ఎంత అవగుణాలతో ఉన్నవారు అయినా కానీ నేను నా జీవితం ద్వారా, కర్మ ద్వారా, సంపర్కం ద్వారా గుణదానం అంటే సహయోగిగా అవ్వాలి అని అనుకోవాలి. దీనిలో ఇతరులను చూడకూడదు - వీరు చేయకపోతే నేను ఎలా చేయను, వీరు కూడా ఇలాగే ఉన్నారు అని అనకండి. బ్రహ్మాబాబా శివబాబాను చూసారు. కనుక ఒకవేళ మీరు చూడాలనుకుంటే బ్రహ్మాబాబాని చూడండి. దీనిలో ఇతరులను చూడకుండా ఎవరు చేస్తారో వారే అర్జునులు అనే లక్ష్యం పెట్టుకోండి అంటే ఎవరైతే స్వయం నిమిత్తం అవుతారో వారే నెంబర్ వన్ అర్జునునిగా అవుతారు. బ్రహ్మాబాబా నెంబర్ వన్ అర్జునుడిగా అయ్యారు. ఒకవేళ ఇతరులను చూసి చేస్తే నెంబర్ వారీలోకి వస్తారు కానీ నెంబర్ వన్ అవ్వరు. చేతులు ఎత్తండి అని అంటే అందరు నెంబర్ వన్లోనే ఎత్తుతున్నారా లేక నెంబర్ వారీలో ఎత్తుతున్నారా? మరయితే ఏ లక్ష్యం పెట్టుకుంటారు? అఖండ మహాదాని మరియు స్థిరంగా అవ్వాలి. ఎవరు ఎంత చలింపచేసినా చలించకూడదు. అందరూ ఇలాగే ఉన్నారు, నిన్ను నీవు చంపుకోవటం ఎందుకు, అందరిలో కలిసిపో అని ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇలా మనల్ని బలహీనంగా చేసే సహయోగులు చాలామంది దొరుకుతారు. నీ ధైర్యాన్ని, ఉల్లసాన్ని పెంచే సహయోగులు బాప్ దాదాకి కావాలి. ఏమి చేయాలో అర్థమైందా! సేవ చేయండి, ఇంకా బాగా చేయండి కానీ జమా ఖాతా పెంచుకునే విధంగా చేయండి. మొదట స్వసేవ తర్వాత సర్వుల సేవ. మరో విషయాన్ని కూడా బాప్ దాదా గమనించారు, చెప్పనా? 

ఈరోజు చంద్రుడు మరియు సూర్యుని యొక్క మిలనం కదా! జగదంబ మాత బాప్ దాదాకి చాలా నెమ్మదిగా, మంచి పద్దతితో ఒక విషయం చెప్పారు, జగదంబ అన్నారు - ఎడ్వాన్స్ పార్టీ వారు ఎంతవరకు ఎదురుచూడాలి? ఎందుకంటే మీరు ఎడ్వాన్స్ స్థితిలోకి వెళ్తే ఎడ్వాన్స్ పార్టీ వాళ్ళ కార్యం పూర్తయిపోతుంది. అయితే జగదంబ మాత ఏ విషయం చెప్పారు? బాప్ దాదాకి అయితే తెలుసు అయినా కానీ ఈరోజు ఆత్మికసంభాషణ కదా! జగదంబ అన్నారు - నేను కూడా మధువనం మరియు సేవాకేంద్రాలు అన్నీ తిరుగుతాను. ఆమె నవ్వుతూ నవ్వుతూనే సైగ చేసినట్లు చెప్పేవారు, డైరెక్టుగా చెప్పేవారు కాదు, జగదాంబను చూసిన వారికి ఈ విషయం తెలుసు. అదేవిధంగా ఇప్పుడు కూడా అన్నారు - ఈరోజుల్లో ఒక విశేషత కనిపిస్తుంది, ఏ విశేషత? ఈ రోజుల్లో అనేక రకాలైన సోమరితనం వచ్చేసింది. ఒకొక్కకరికి ఒక్కోవిధమైన సోమరితనం ఉంది. అయిపోతుంది, చేసేస్తాము .... వారయితే చేస్తున్నారు కదా, మేము కూడా చేస్తున్నాము .... ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది... భాష ఈవిధంగా ఉంది. సోమరితనం అనేది సంకల్పంలో అయితే ఉండనే ఉంది కానీ మాటల్లో కూడా ఉంది. ఈ క్రొత్త సంవత్సరంలో దీని కొరకు ఏదైనా యుక్తి పిల్లలకి చెప్పమని బాప్ దాదా అన్నారు. జగదంబ మాత సదా ఒక సూక్తిని ధారణ చేసేవారు జ్ఞాపకం ఉందా? ఎవరికి జ్ఞాపకం ఉంది? (యజమాని యొక్క ఆజ్ఞ నన్ను నడిపిస్తుంది.) అప్పుడు జగదంబ అన్నారు - మమ్మల్ని బాప్ దాదా నడిపిస్తున్నారు, ఆయన ఆజ్ఞానుసారం ప్రతీ అడుగు వేస్తున్నాను, మమ్మల్ని నడిపించేవారు స్వయం బాబా అని సదా ఈ ధారణ చేస్తే, ఈ స్మృతి ఉంటే ఇక దృష్టి ఎక్కడికి వెళ్తుంది? నడిచేవారికి నడిపించేవారిపైనే దృష్టి ఉంటుంది, మరోవైపు ఉండదు. చేసిచేయించేవారు నన్ను నిమిత్తం చేసి చేయిస్తున్నారు, నడిపిస్తున్నారు. భాద్యత చేయించేవానిది. అప్పుడు సేవలో ఏదైతే తల బరువు అనిపిస్తుందో అది తేలిక అయిపోయి సదా ఆత్మిక గులాబీ పుష్పం వలె అయిపోతారు. ఏమి చేయాలో అర్థమైందా? అఖండ మహాదాని అవ్వాలి. క్రొత్త సంవత్సరం జరుపుకోవడానికి అందరూ పరుగు పరుగున వచ్చారు, మంచిది, హౌస్ ఫుల్ అయిపోయింది. మంచిది నీళ్ళు దొరుకుతున్నాయి కదా! నీళ్ళు లభించాయా? అయినప్పటికీ నీరు గురించి శ్రమ చేసినవారికి శుభాకాంక్షలు. ఇన్ని వేల మందికి నీరు చేర్చటం అంటే సామాన్య విషయం కాదు, రెండు, నాలుగు బకెట్లు కాదు కదా! రేపు అయితే అందరూ వచ్చిపోయే మేళాలో ఉంటారు. అందరు విశ్రాంతిగా ఉన్నారు కదా! తుఫాను కొద్దిగా పరీక్ష పెట్టింది. కొద్దిగా చలిగా అనిపించింది కానీ అందరు బాగానే ఉన్నారా? పాండవులు మంచిగా ఉన్నారా? మంచిది, కుంభమేళా కంటే బాగుంది కదా! మంచిది, మూడు అడుగుల స్థలం అయితే లభించింది కదా! మంచాలు లభించలేదు. కానీ మూడు అడుగుల స్థలం అయితే లభించింది కదా! 

క్రొత్త సంవత్సరంలో నలువైపుల ఉన్న పిల్లలు దేశంలో మరియు విదేశాలలో కూడా క్రొత్త సంవత్సర మహోత్సవాన్ని చూస్తున్నారు. బుద్ధి ద్వారా చూస్తున్నారు, చెవుల ద్వారా వింటున్నారు. మధువనంలో కూడా చూస్తున్నారు. మధువనం వారు కూడా యజ్ఞ రక్షకులై సేవా పాత్రను అభినయించారు, చాలా మంచిది! బాప్ దాదా దేశ, విదేశీయులతో పాటు సేవకు నిమిత్తమైన మధువన నివాసీయులకి కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు. మంచిది! గ్రీటింగ్ కార్డులు చాలా వచ్చాయి. గ్రీటింగ్ కార్డులు గొప్పేమీ కాదు కానీ వీటిలో మీ మనస్సు యొక్క స్నేహం దాగి ఉంది. కనుక బాప్ దాదా కార్డ్ ల అందాన్ని చూడటం లేదు, ఎంతో విలువైన మనస్సు యొక్క స్నేహం నిండి ఉందో అని చూస్తున్నారు. అందరు తమతమ మనస్సు యొక్క స్నేహాన్ని పంపారు. ఇటువంటి స్నేహి ఆత్మలకు విశేషంగా ఒక్కొకరి పేరు చెప్పటం కుదరదు కదా కానీ బాప్ దాదా మీ కార్ద్ కి బదులుగా అలాంటి పిల్లలకు స్నేహంతో నిండిన గౌరవాన్ని (రిగార్డ్) ఇస్తున్నారు. స్మృతి ఉత్తరాలు, టెలిఫోన్, కంప్యూటర్స్, ఈ మెయిల్ ఇలా సాధనాలు ఏవైతే ఉన్నాయో ఆ సాధనాలన్నింటి ద్వారా కంటే ముందుగా సంకల్పమే మొదట బాప్ దాదా దగ్గరికి చేరుతుంది. ఆ తర్వాత మీ కంప్యూటర్లో ఈ మెయిల్ రూపంలో వస్తుంది. పిల్లల యొక్క స్నేహం బాప్ దాదా దగ్గరికి ప్రతి సమయం చేరుతూనే ఉంటుంది. కానీ ఈ రోజు విశేషంగా కొంతమంది క్రొత్త సంవత్సరం యొక్క ప్లాన్స్ కూడా వ్రాసారు, ప్రతిజ్ఞలు కూడా చేసారు, జరిగిపోయిందేదో జరిగిపోయినదిగా భావించి ముందుకు వెళ్ళే ధైర్యం కూడా పెట్టుకున్నారు. అందరికీ బాప్ దాదా ఏమి చెప్తున్నారంటే చాలా, చాలా శభాష్ పిల్లలూ! శభాష్!! 

మీరందరూ కూడా సంతోషిస్తున్నారు కదా! వారు కూడా సంతోషిస్తున్నారు. ఇప్పుడు బాప్ దాదా మనస్సులో ఆశ ఏమిటంటే దాత పిల్లలైన ప్రతీ ఒక్కరూ దాత అవ్వండి. ఇది కావాలి, ఇది జరగాలి, ఇది చేయాలి అని అడగకండి. దాతగా అవ్వండి, ఒకరినొకరు ముందుకి తీసుకువెళ్ళటంలో విశాలహృదయులు అవ్వండి. మాకు పెద్దవాళ్ళ ప్రేమ కావాలి అని చిన్నవారు బాప్ దాదాతో అంటున్నారు, మరయితే పెద్దవారికి గౌరవం ఇవ్వండి అని చిన్నవారికి బాప్ దాదా చెప్తున్నారు. అప్పుడు మీకు ప్రేమ లభిస్తుంది. గౌరవం ఇవ్వటమే గౌరవం తీసుకోవటం, గౌరవం అనేది మామూలుగా లభించదు. ఇవ్వటమే తీసుకోవటం. మీ జడ చిత్రాలు ఇస్తున్నాయి కదా! దేవత అంటేనే ఇచ్చేవారు అని అర్ధం. దేవీ అంటే కూడా ఇచ్చేవారే. చైతన్య దేవీదేవతలైన మీరు దాత అవ్వండి, ఇవ్వండి. అందరూ దాతగా ఇచ్చేవారిగా అయిపోతే తీసుకునేవారు ఇక ఉండరు కదా! అప్పుడు నలువైపులా సంతుష్టత యొక్క ఆత్మిక గులాబీల సువాసన వ్యాపిస్తుంది, విన్నారా. 

కనుక క్రొత్త సంవత్సరంలో పాత బాష మాట్లాడకూడదు. కొందరు పాత బాష మాట్లాడతారు, అది బావుండటం లేదు. పాత మాట, పాత నడవడిక, పాత ఏ అలవాటుతో బలహీనం అవ్వకండి. ప్రతీ విషయం కొత్తగా ఉందా అని మిమ్మల్ని మీరు అడగండి. ఏమి క్రొత్తదనం చేశారు? కేవలం 21వ శతాబ్దం జరుపుకోవటమేనా? ఈ 21వ శతాబ్దంలో 21 జన్మల సంపూర్ణ వారసత్వం పొందాల్సిందే. పొందాలి కదా! 

నలువైపులా ఉన్నటువంటి నవయుగ అధికారి శ్రేష్ట ఆత్మలకి, పిల్లలందరికీ, సదా ప్రతి అడుగులో కోటానుకోట్ల సంపాదన చేసుకునే ఆత్మలకు, సదా స్వయాన్ని బ్రహ్మాబాబా సమానంగా సర్వులకి ఒక ఉదాహరణగా, సాధారణంగా తయారుచేసుకునేవారికి, సదా స్వయం యొక్క జీవితంలో గుణాలను ప్రత్యక్షం చేసి ఇతరులను గుణవంతులుగా తయారుచేసేవారికి, సదా అఖండ మహాదాని, మహా సహయోగి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments