31-12-1998 అవ్యక్త మురళి

            31-12-1998         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఈ కొత్త సంవత్సరంలో ధైర్యం ఆధారంగా స్వయాన్ని శ్రమముక్తులుగా, సదా విజయీగా అనుభవం చేసుకోండి. 

ఈరోజు నవయుగ రచయిత బాప్ దాదా తన యొక్క అతిస్నేహి, సదా సహయోగి మరియు అతి సమీప పిల్లలకు క్రొత్తయుగం, క్రొత్త జీవితం మరియు క్రొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ఇవ్వడానికి వచ్చారు. నలువైపుల ఉన్న పిల్లలు చాలా స్నేహంలో బాప్ దాదాని మనస్సులో సన్ముఖంగా ఉంచుకుని శుభాకాంక్షలు తీసుకుంటున్నారు. బాప్ దాదా పిల్లల యొక్క క్రొత్త సంవత్సరపు ఉత్సాహ, ఉల్లాసాలను చూసి హర్షిస్తున్నారు. దూరంగా కూర్చున్నా, సమీపంగా కూర్చున్నా కానీ ఎక్కువ మంది మనస్సులో ఈ సంవత్సరం కొత్తదనం చేసే చూపిస్తాం అనే ఉత్సాహం చాలా ఉంది. స్వ పరివర్తనలో అయినా, సేవా సఫలతలో అయినా, శుభభావన, శుభకామన ద్వారా ప్రతి ఆత్మని పరివర్తన చేయటంలో అయినా ఉత్సాహం కూడా ఉంది, ఉల్లాసం కూడా బాగా ఉంది. వెనువెంట ధైర్యం కూడా శక్తిననుసరించి ఉంది. ఇలా ధైర్యవంతులైన పిల్లలకు బాప్ దాదా కూడా ఒక సంకల్పానికి కోటానుకోట్లరెట్లు సహాయం తప్పక చేస్తారు. అందువలన ధైర్యంతో సదా ముందుకు వెళ్ళిపోండి. ఎప్పుడూ కూడా స్వయం పట్ల అయినా లేదా ఇతరాత్మల పట్ల అయినా ధైర్యాన్ని తక్కువ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ క్రొత్త యుగమే ధైర్యం ద్వారా ఎగిరే యుగం, వరదాని యుగం, పురుషోత్తమ యుగం, స్వయంగా విధాత ద్వారా సర్వశక్తుల వారసత్వం సహజంగా ప్రాప్తింపచేసుకునే యుగం. అందువలన ఈ యుగం యొక్క గొప్పతనాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. ఏ కార్యం ప్రారంభిస్తున్నా అంటే స్వ పురుషార్ధం అయినా, విశ్వసేవ అయినా కానీ సదా ధైర్యం మరియు బాప్ దాదా యొక్క సహాయం ద్వారా స్వ పురుషార్ధంలో లేదా సేవలో నిశ్చయంగా సఫలత లభించాలి మరియు లభించవలసిందే, అసంభవం సంభవం కావాల్సిందే, ఎందుకంటే ఈ యుగం సఫలతాయుగం. అసంభవం సంభవం అయ్యే యుగం, అందువలన అవుతుందా? అవ్వదా? ఎలా అవుతుందో?... ఇలాంటి ప్రశ్నలు బ్రాహ్మణాత్మలకు రాకూడదు. బ్రాహ్మణుల జాతకంలో- "సఫలత వీరి యొక్క జన్మసిద్ధ అధికారం” అని ఉంది. కనుక అధికారి ఆత్మలు ఇలా ఆలోచించవలసిన అవసరం లేదు, వారసత్వం లభించవలసిందే. 

కనుక ఈ క్రొత్త సంవత్సరంలో విశేషంగా ఈ స్మృతిని ప్రత్యక్షం చేయండి - అన్ని వైపుల నుండి సఫలత శ్రేష్ట బ్రాహ్మణ ఆత్మనైన నా యొక్క అధికారం అని. ఈ నిశ్చయంతో, ఆత్మిక నషాతో ఎగురుతూ ఉండండి. (అభిమానం యొక్క నషా కాదు, ఆత్మిక నషా ఉండాలి). నిశ్చయబుద్ది ప్రతి కార్యంలో తప్పక విజయీ అవుతారు. ఇటువంటి నిశ్చయబుద్ది బ్రాహ్మణాత్మల మస్తకంలో విజయం యొక్క అదృష్ట రేఖ సదా ఉంటుంది. విజయీ తిలకం సదా మస్తకంలో మెరుస్తూ ఉంటుంది. అందువలన ఈ సంవత్సరాన్ని సదా విజయీ సంవత్సరంగా అనుభవం చేసుకోండి. ఇటువంటి నిశ్చయం మరియు నషా ఉందా? డబల్ విదేశీయులకు ఉందా? డబల్ విదేశీయులు తెలివైనవారు. (అందరూ చేతులు ఊపారు) చాలా మంచిది. తిలకం కనిపిస్తుంది. భారతవాసీయులు చాలా భాగ్యవంతులు, ఎందుకు? భారతదేశ భూమియే భాగ్యవంతమైనది. అందువలన విదేశీయులైనా, భారతవాసీయులైన ఇద్దరు భాగ్యవిధాత యొక్క పిల్లలు. అందువలన ప్రతి బ్రాహ్మణాత్మ విజయీయే. కేవలం ధైర్యాన్ని ప్రత్యక్షం చేయండి. భాగ్యం నిండి ఉంది. ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులు. అవును కదా? (అందరూ చేతులు ఊపుతున్నారు) చేతులు చాలా మంచిగా ఊపుతున్నారు. ఇప్పుడు మనస్సుతో కూడా సదా ధైర్యం అనే చేతిని ఊపుతూ ఉండాలి. బాప్ దాదాకి సంతోషంగా, గర్వంగా ఉంది - నా యొక్క ఒక్కొక్క బిడ్డ అనేకసార్లు విజయీ అని. ఒకసారి కాదు, అనేకసార్లు విజయీ ఆత్మలు. ఏమవుతుందో తెలియదు... అని ఎప్పుడూ అనుకోకూడదు. అవుతుందా అనే మాట ఎప్పుడూ రాకూడదు. విజయీలు మీరు మరియు సదా విజయీగానే ఉంటారు. అందరు పక్కాయేనా? చాలా మంచిది. ఇప్పుడు మరలా అక్కడికి వెళ్ళి ఇలా బలహీన సమాచారం వ్రాయకండి - దాదీ! లేదా బాబా! మాయ వచ్చేసింది అని. మాయాజీతులు మీరు. మేము కాకపోతే మరెవరు అవుతారు అనే ఆత్మికనషాను ప్రత్యక్షం చేయండి. ఇతర కార్యాలలో మనస్సు, బుద్ది బిజీ అయిపోతున్నాయి. అప్పుడు నషా గుప్తం అయిపోతుంది. కానీ మధ్యమధ్యలో పరిశీలించుకోండి - కర్మ చేస్తూ కూడా ఈ విజయీ స్థితి యొక్క ఆత్మికనషా ఉంటుందా? అని. నిశ్చయం ఉంటే నషా తప్పక ఉంటుంది. నిశ్చయానికి గుర్తు - నషా, నషా ఉంటే తప్పక నిశ్చయం ఉంటుంది. రెండింటికి సంబంధం ఉంది. అందువలన ఇప్పుడు 99సం||రంలో మీ నషాని ప్రత్యక్షం చేయండి. అప్పుడు పొరపాట్లు జరగవు, శ్రమ కూడా ఉండదు. బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు - పిల్లలు శ్రమ చేయటం, యుద్ధం చేయటం చూసి బాబాకి అది ఇష్టమనిపించటం లేదు. అందువలన ఈ క్రొత్త సంవత్సరాన్ని ఏవిధంగా జరుపుకుంటారు? ముక్తి సంవత్సరం జరుపుకున్నారు. అశుభాన్ని, వ్యర్థాన్ని, సమాప్తి చేసుకుంటే ఈ సంవత్సరం స్వతహాగానే శ్రమముక్తి సంవత్సరం అయిపోతుంది. అందరు ఆనందంలో ఉండేవారు, శ్రమ చేసేవారు కాదు. ఆనందం మంచిగా అనిపిస్తుందా లేక శ్రమ మంచిగా అనిపిస్తుందా? ఆనందం మంచిగా అనిపిస్తుంది కదా? ఈ సంవత్సరం మనస్సులో, సంకల్పంలో కూడా శ్రమ నుండి ముక్తులవ్వాలి. 

బాప్ దాదా దగ్గరకి చాలా మంచి ధైర్యంతో కూడిన పిల్లల యొక్క ఉత్తరాలు వచ్చాయి - ఇప్పటి నుండి మేము 108 మాలలోకి తప్పక వస్తాము అని వ్రాసారు. చాలా మంది యొక్క ఉల్లాసంతో కూడిన మంచి మంచి ఉత్తరాలు కూడా వచ్చాయి మరియు ఆత్మిక సంభాషణలో కూడా చాలామంది బాప్ దాదాకి తమ నిశ్చయం మరియు ధైర్యం యొక్క మంచి సమాచారం కూడా ఇచ్చారు. బాప్ దాదా అటువంటి పిల్లలకు చెప్తున్నారు - మీ అందరు జరిగిన విషయాలకు బిందువు పెట్టేస్తున్నారు. అందువలన జరిగిపోయిన దాని గురించి ఆలోచించకండి, ఇప్పుడు ఏదైతే ధైర్యం పెట్టుకున్నారో ఆ ధైర్యం మరియు సహాయంతో ముందుకు వెళ్ళిపోండి. క్రొత్త సంవత్సరంలో చాలా మంచి ఉత్సాహ, ఉల్లాసాలతో వ్రాసారు. విదేశీ పిల్లలైనా, దేశవాసీయులైనా అటువంటి పిల్లలకు బాప్ దాదా ఇదే వరదానం ఇస్తున్నారు - ఇదే ధైర్యం, నిశ్చయం మరియు నషాలో అమరంగా ఉండండి, అని. అమరంగా ఉంటారు కదా! డబల్ విదేశీయులు అమరంగా ఉంటారా? భారతవాసీయులు కూడా ఉంటారు కదా? భారతదేశం అయితే నెంబర్ తీసుకోవాల్సిందే. 

క్రొత్త సంవత్సరాన్ని ఎలా జరుపుకుంటారు? 1. బహుమతి ఇస్తారు. 2. గ్రీటింగ్స్ ఇస్తారు. మిఠాయిలు బాగా తింటారు మరియు తినిపిస్తారు. నృత్యగానాలు కూడా బాగా చేస్తారు. మీరు 12 గంటల తర్వాత కేవలం ఒక రోజు క్రొత్త సంవత్సరం జరుపుకోవటం కాదు. ఈ క్రొత్త యుగంలో ప్రతి ఘడియ క్రొత్తది, ప్రతి శ్వాస క్రొత్తది. ప్రతి సంకల్పం క్రొత్తది. అందువలన సదా సంవత్సరం అంతా ఒక రోజు, ఒక వారం, ఒక నెల, నాలుగు నెలలు, ఎనిమిది నెలలు కాదు, 12 నెలలూ ఒకరికొకరు మనస్సు యొక్క సంతోషం అనే మిఠాయిని పంచుతూ ఉండాలి. పంచుతారు కదా? దిల్ ఖుష్ మిఠాయి పంచిపెట్టడం వస్తుందా? అందరు తెలివైనవారు. కనుక దిల్ ఖుష్ మిఠాయి పంచి పెట్టాలి. ఎవరైనా వారి స్వభావం కారణంగా, సంస్కారం కారణంగా, సమస్య కారణంగా వారు స్వీకరించకపోయినా కానీ మీరు బలహీనం అవ్వకూడదు. మీరు పంచి పెట్టారు, మీ ఆజ్ఞాకారి అయిన చార్జ్ బాప్ దాదా దగ్గర జమ అయిపోయింది. నేను దిల్ ఖుష్ మిఠాయి తినిపించాను కానీ వారు కోపంలోకి వచ్చేసారు, అని అనుకోకండి. ఏం పర్వాలేదు, వారు రహస్యాన్ని తెలుసుకోని కారణంగా కోపంలోకి వచ్చారు, మీకయితే రహస్యం తెలుసు కదా! వారు కర్మలఖాతాకి లేదా సమస్యకి వశమై ఉన్నారు అనే రహస్యం కూడా తెలుసుకోండి. మీరు ఆజ్ఞాకారి అవ్వండి. సరేనా? ఆజ్ఞాకారి అవ్వాలి కదా? ఇక్కడ అలాగే అని బాగా చెప్తారు. చేతులు కూడా బాగా ఊపుతారు, సంతోషం చేసేస్తారు, భుజాలు, చేతులు కూడా బాగా ఊపుతారు. అయినప్పటికీ బాప్ దాదా ప్రతి బిడ్డ గురించి సదా సంతోషంగా ఉంటారు. నా పిల్లలు అని ఎప్పుడైతే అన్నారో ఇక ఎవరు ఎలా ఉన్నా కానీ చూసి బాబా సంతోషిస్తారు. బాబా ప్రతిజ్ఞ చేసారు - ఎలా అయినా నా పిల్లలను యోగ్యంగా చేసి వెంట తీసుకువెళ్తాను అని. వెంట వెళ్ళాలి కదా? వెంట వెళ్ళడానికి తయారుగా ఉన్నారా? అందరూ తయారుగా ఉన్నారా? ఎవరెడీయేనా? మంచిది, ఎవరెడీగా కూడా ఉన్నారు. చాలా మంచిది, సదా సంతోషంగా కూడా ఉన్నారా? మరలా మాయ వస్తే? ఆ తర్వాత కొద్దికొద్దిగా మనస్సుతో అరుస్తారా? బాబా మాయ వచ్చేసింది, మాయ వచ్చేసింది అని అరవకూడదు, ఎగిరిపోవాలి. మీరు పైకి ఎగిరిపోతే మాయ కింద ఉండిపోతుంది, చూస్తూ ఉండిపోతుంది. మంచిది! కనుక సంతోషంలో నాట్యం చేస్తూ ఉండాలి మరియు దిల్ ఖుష్ మిఠాయి కూడా పంచుతూ ఉండాలి. వెనువెంట సంబంధ, సంపర్కంలోకి ఎవరు వచ్చినా కానీ ఏదోక బహుమతి ఇవ్వాలి. ఎవరూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు, ఏ బహుమతి ఇస్తారు? మీ దగ్గర బహుమతులు చాలా ఉన్నాయి. బహుమతుల స్టాక్ ఉందా? ఇవ్వటంలో అయోమయం అవ్వకూడదు, ఇస్తూ వెళ్ళాలి. విశాలహృదయులు అవ్వాలి, కొంతమందికి శక్తి యొక్క సహయోగం ఇవ్వండి, కొంతమందికి శక్తి యొక్క వైబ్రేషన్స్ ఇవ్వండి, కొంతమందికి ఏదో గుణం యొక్క బహుమతి ఇవ్వండి. నోటితో కాదు, కానీ మీ ముఖం మరియు నడవడిక ద్వారా ఇవ్వండి. ఏదైనా గుణం లేక శక్తి ప్రత్యక్షంలో లేకపోతే తక్కువలో తక్కువ చిన్న బహుమతి అయినా కానీ ఇవ్వాలి, అది ఏమిటి? శుభభావన మరియు శుభకామన అనే బహుమతి ఇవ్వాలి. వీరు నా యొక్క ప్రియ అన్నయ్య లేదా అక్కయ్య, ఇలా ప్రియంగా ఆలోచించటం ద్వారా అశుభభావన శుభ భావనగా మారిపోతుంది. ఈ అన్నయ్య లేదా అక్కయ్య కూడా ఎగిరేకళలోకి వెళ్ళాలి అని శుభభావన లేదా సహయోగం చేయాలి. కొంతమంది పిల్లలు అంటున్నారు - మేము ఇస్తున్నాము కానీ వారు తీసుకోవటం లేదు అని. శుభ భావన తీసుకోవటం లేదు కానీ ఏదోకటి ఇస్తున్నారు కదా! అశుభ మాటలు మీకు ఇస్తున్నారు, అశుభ వైబ్రేషన్స్ ఇస్తున్నారు, అశుభ నడవడిక నడుస్తున్నారనుకోండి కానీ మీరు ఎవరు? మీ వృత్తి ఏమిటి? విశ్వపరివర్తకులేనా? మీ వ్యాపారం ఏమిటి? విశ్వపరివర్తకులు కదా! అయితే విశ్వాన్ని పరివర్తన చేయగలరు కదా! మరయితే వారు అశుభంగా మాట్లాడారు లేదా అశుభ నడవడిక నడిచారనుకోండి మీరు పరివర్తన చేయలేరా? శుభ రూపంలోకి పరివర్తన చేసుకోలేరా? అశుభాన్ని అశుభంగానే ధారణ చేస్తారా లేక అశుభాన్ని శుభంలోకి పరివర్తన చేసుకుని ప్రతి ఒక్కరికీ మీరు శుభ భావన, శుభ కామన యొక్క బహుమతి ఇస్తారా? సదా శుభభావన యొక్క స్టాక్ జమ చేసుకుని ఉంచుకోండి, మీరు ఇవ్వండి, పరివర్తన చేసుకోండి. అప్పుడు విశ్వపరివర్తకులు అని మీది ఏదైతే బిరుదు ఉంటుందో అది ఉపయోగపడుతుంది. సదా ప్రతి ఒక్కరిని పరివర్తన చేసి విశ్వపరివర్తనా కార్యాన్ని ఎవరైతే సాకారంలోకి తీసుకువస్తారో వారే 21 జన్మలు గ్యారంటీగా రాజ్యాధికారిగా అవుతారు అనే ఈ విషయాన్ని పక్కాగా అర్ధం చేస్కోండి. సింహాసనంపై అయితే ఒకసారి మాత్రమే కూర్చుంటారు కానీ ప్రతి జన్మలో రాజ కుటుంబంలో, రాజ్యాధికారి ఆత్మల సమీప సంబంధంలో ఉంటారు. విశ్వ పరివర్తకులే విశ్వరాజ్యాధికారిగా అవుతారు. అందువలన సదా మీ యొక్క ఈ వృత్తిని జ్ఞాపకం ఉంచుకోండి. నా కర్తవ్యమే - పరివర్తన చేయటం అని. దాత యొక్క పిల్లలు కనుక సదా దాత అయ్యి ఇస్తూ వెళ్ళండి. అప్పుడే భవిష్యత్తులో చేతులతో ఎవరికీ ఇవ్వరు కానీ సదా మీ రాజ్యంలో ప్రతి ఆత్మ నిండుగా ఉంటుంది, ఇది ఈ సమయంలో దాత అయిన దానికి ఫలంగా లభించే ప్రాలబ్దం, అందువలన లెక్కపెట్టుకోకండి, వీరు ఇది చేసారు, వీరు ఇన్నిసార్లు చేసారు అని మాస్టర్ దాత అయ్యి బహుమతి ఇస్తూ వెళ్ళండి మరియు ఏమి గ్రీటింగ్స్ ఇస్తారు? ఎవరికైనా కానీ, ఎవరి ద్వారా అయినా ఏదైనా ప్రాప్తిస్తే వారి నోటి నుండి, మనస్సు నుండి మీకు ధన్యవాదాలు అని అంటారు కదా! ఒకరికొకరు సంతోషం పంచి పెడితే కూడా ధన్యవాదాలు చెప్తారు. ఉత్సవ సమయాలలో కూడా శుభాకాంక్షలు చెప్తారు. అదేవిధంగా మీ ఎదురుగా ఎవరు వచ్చినా కానీ మీ నోటితో ఇటువంటి మాటలు మాట్లాడండి. సంకల్పంలో కూడా ఈ విధమైన శ్రేష్టసంకల్పాలు చేస్తే మిమ్మల్ని కలిసిన వారందరూ ప్రతి సమయం శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు తప్పక ఇస్తారు. కనుక సదా ఈ విధమైన మాటలు మాట్లాడండి. ఈ విధంగా సంబంధ, సంపర్కంలోకి రండి - వారి నోటి నుండి, మనస్సు నుండి శుభాకాంక్షలు లేదా ఆశీర్వాదాలు ఇవ్వాలి. శుభాకాంక్షలకు యోగ్యం కాని మాటలు మాట్లాడకండి. ఒకొక్కమాట రత్నం వలె ఉండాలి. సాధారణ మాటలు ఉండకూడదు. 

బాప్ దాదా ఇప్పటి వరకు ఫలితంలో చూసారు - రేపు అయితే మారిపోతారు కానీ ఈ రోజు వరకు చూసింది ఏమిటంటే మాటలలో ఏదైతే స్నేహం మరియు నియమం ఉండాలో ఆ స్నేహం మరియు నియమం తక్కువగా ఉన్నాయి. అందువలన రత్నాల సమానమైన మాటలు మాట్లాడండి. మీరు వజ్రతుల్యం కనుక మీ మాటలు కూడా రత్నం సమానంగా ఉండాలి. అంత విలువైనవిగా ఉండాలి, సాధారణంగా ఉండకూడదు, వ్యర్ధంగా ఉండకూడదు. మరియు అప్పుడప్పుడు బాప్ దాదా చూస్తున్నారు - ఫలితం చెప్పనా, ఎందుకంటే 12 గంటల తర్వాత అన్నింటినీ సమాప్తి చేసుకోవాలి కదా! కనుక బాప్ దాదా ఇది కూడా చూసారు - కొంతమంది పిల్లలు చిన్నవిషయాన్ని చాలా విస్తారం చేస్తున్నారు. దీనిలో ఏమౌతుందంటే ఎలా అయితే వృక్షం యొక్క విస్తారంలో బీజం గుప్తం అయిపోతుందో అదేవిధంగా విస్తారంలో సారం గుప్తం అయిపోతుంది. అర్ధం చేయించడానికి విస్తారం చేస్తున్నాము అని అంటారు, కానీ విస్తారంలో మీరు ఏదైతే అర్థం చేయించాలనుకుంటున్నారో ఆ సారం దాగిపోతుంది, మరియు ఆ వ్యర్ధమాటల ద్వారా మాటకి ఏదైతే శక్తి ఉంటుందో ఆ శక్తి తక్కువ అయిపోతుంటే. ఎక్కువ మాట్లాడేవారికి బుద్ధి యొక్క శక్తి కూడా తక్కువ అయిపోతుంది. కనుక క్లుప్తంగా మరియు మధురంగా (షార్ట్ & స్వీట్ ) మాట్లాడండి. మరెవరు అయినా చెప్తున్నప్పుడు అయితే నాకు వినడానికి అంత సమయం లేదు అని అంటున్నారు కానీ స్వయం చెప్తున్నప్పుడు సమయాన్ని మర్చిపోతున్నారు. అందువలన మీ ఖజానాల స్టాక్ జమ చేసుకోండి. సంకల్ప ఖజానాను జమ చేసుకోండి, మాట ఖజానాను జమ చేసుకోండి, శక్తుల యొక్క ఖజానా జమ చేసుకోండి, సమయం యొక్క ఖజానా జమ చేసుకోండి, గుణాల ఖజానాను జమ చేసుకోండి. రోజూ రాత్రి మీ ఈ ఖజానాల పొదుపు యొక్క ఖాతా పరిశీలించుకోండి, ఎన్ని సంకల్పాలు వ్యర్థానికి బదులు సమర్ధ ఖాతాలో జమ చేసుకున్నాను? ఎంత సమయం వ్యర్ధానికి బదులు సమర్థ ఖాతాలో జమ చేసుకున్నాను? గుణాలు, శక్తుల ద్వారా శ్రేష్టకార్యం చేసానా? గుణాలను కార్యంలో ఉపయోగించానా? శక్తిని కార్యంలో ఉపయోగించానా? ఇదే జమ చేసుకోవటం. సంకల్పం, సమయం, గుణాలు, శక్తులు వీటి యొక్క ఖాతా రోజు రాత్రి పరిశీలించుకుని మొత్తం ఎంత పొదుపు చేసుకున్నారో చూసుకోండి. ఈ పొదుపే స్వయానికి కూడా సహయోగం ఇస్తుంది మరియు ఇతరులకు కూడా ఇస్తుంది. కనుక ఏమి చేయాలో అర్థమైందా? అందరు ఏమి చేయాలి అని అడుగుతున్నారు కదా! కనుక ఇప్పుడు ఇది చేయాలి. గ్రీటింగ్స్ కూడా తీసుకోవాలి, బహుమతి కూడా ఇవ్వాలి. జమ కూడా చేసుకోవాలి మరియు శ్రమని వదిలేయాలి. పొదుపుపై ధ్యాస పెడితే శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. శ్రమముక్త సంవత్సరాన్ని అట్టహాసంగా జరుపుకుంటారు. వ్యర్థం మరియు అశుభం నుండి ముక్తి అయ్యే సంవత్సరం జరుపుకుంటారు. బాప్ దాదా ముక్తి సంవత్సరం యొక్క ఫలితం ఇప్పుడు అడగటంలేదు. బాబాకి జ్ఞాపకం అయితే ఉంది. ఎంతమంది ముక్తి సంవత్సరం జరుపుకున్నారు, ఎంతమంది ముక్తి నెల జరుపుకున్నారు అనే ఫలితం చెప్తాను. 6 నెలలు జరుపుకున్నారా, అర్ధ సంవత్సరం జరుపుకున్నారా, పూర్తిగా జరుపుకున్నారా? - ఇవన్నీ 18వ తారీఖుకు లెక్కిస్తాను. 

డబల్ విదేశీయులు మంచిగా జరుపుకున్నారు కదా! భారతవాసీయులు కూడా జరుపుకున్నారు, ఫలితం 18వ తారీఖున చెప్తాను. సంవత్సరం అంతా జరుపుకున్నవారికి ఏమి బహుమతి ఇస్తారు? దాదీలు చెప్పండి? సంవత్సరం అంతా ముక్తి సంవత్సరంగా జరుపుకున్నవారికి ఏమి ఇస్తారు? శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు అయితే ఇస్తారు సరే కానీ స్మృతిచిహ్నంగా ఏమి ఇస్తారు? బహుమతి తయారు చేసి ఉంచండి. ఎంతమంది బహుమతి తీసుకుంటారో చూస్తాను. కొత్త సంవత్సరం, కొత్త ఉత్సాహం, కొత్త ధైర్యం, అన్నీ కొత్తవే. ఈ ఘడియలో ఉన్న స్థితి కంటే రెండవ ఘడియలో ఇంకా ఉన్నతమైన స్థితి ఉండాలి. సరేనా? మంచిది - ఈరోజు 12 గంటల వరకు కూర్చోవాలి. అందువలనే అందరు అన్నిచోట్ల నుండి పరుగుపరుగున క్రొత్త సంవత్సరం జరుపుకోవడానికి వచ్చారు. మంచిది - ఎవరైతే క్రొత్తవారు, పాతవారు వచ్చారో ఒకరికొకరు మనస్సు నుండి శుభాకాంక్షలు ఇచ్చుకుంటున్నారు. వచ్చారు, రండి, స్వాగతం! శాంతివనం యొక్క అలంకరణ మీరే! రండి. ఈ హాల్ ఎంత అలంకరించబడిందో చూడండి! అలంకరించినవారు ఎవరు? మీరే కదా! మంచిది - ఈరోజు బాప్ దాదా ప్రతి గ్రూపుతో ఎక్కడ కూర్చున్నవారిని అక్కడే నిలబెట్టి కలుసుకుంటారు. డబల్ విదేశీయులైనా, భారతవాసీయులైనా, ప్రతి జోన్, ఒకొక్క జోన్ తో బాబా కలుసుకుంటారు కానీ స్టేజ్ పైకి రాకండి. అక్కడే నిల్చుని కలుసుకోండి. ఇది కూడా కొత్త విషయం కదా! క్రొత్త సంవత్సరం జరుపుకోవడానికి వచ్చారు. కనుక ఇది కూడా కొత్త విషయం! మంచిది! 

Comments