30-11-1999 అవ్యక్త మురళి

             30-11-1999         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 పాస్ విత్ ఆనర్ అయ్యేటందుకు సర్వ ఖజానాల ఖాతాను జమ చేసుకుని సంపన్నంగా అవ్వండి.

ఈరోజు బాప్ దాదా ఏ సభను చూస్తున్నారు? ఈనాటి సభలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఉన్నతమైనవారు మరియు అవినాశి ఖజానాలతో ధనవంతమైనవారు. ప్రపంచంవారు ఎంత ధనవంతులైనా కానీ ఒక జన్మకే ధనవంతులు. ఒక జన్మ అంతా కూడా ధనవంతంగా ఉంటారో, ఉండరో నిశ్చితం లేదు. ఈ ప్రపంచంలో ఎంత ధనవంతులైనా కానీ ఒక జన్మకే. కానీ మీరయితే నిశ్చయం మరియు నషాతో చెప్తారు - మేము అనేక జన్మలకు ధనవంతులం అని. ఎందుకంటే మీరందరు అవినాశి ఖజానాలతో సంపన్నులు. మేము ఈ సమయంలోని పురుషార్ధం ద్వారా ఒక రోజులో కూడా చాలా సంపాదన చేసుకోనేవాళ్ళం అని మీ అందరికీ తెలుసు. ఒక రోజులో ఎంత సంపాదన చేసుకుంటున్నారో తెలుసా? లెక్క తెలుసు కదా! ఒక అడుగులో కోటానుకోట్ల సంపాదన అనే మహిమ ఉంది మరియు అనుభవం ఉంది. కనుక ఒక రోజులో బాబా ద్వారా, బాబా యొక్క జ్ఞానం ద్వారా, స్మృతి ద్వారా ప్రతి అడుగులో కోటానుకోట్లు జమ అవుతున్నాయి. అయితే రోజంతటిలో ఎన్ని అడుగులు స్మృతిలో వేస్తారో అన్ని కోటానుకోట్లు జమ చేసుకుంటున్నారు. ఇలా సంపాదన చేసుకునేవారు, ఖజానాలను జమ చేసుకునేవారు విశ్వంలో ఎవరైనా ఉంటారా లేదా ఉన్నారా? విశ్వం అంతా చుట్టు తిరిగి రండి! మీరు తప్ప మరెవ్వరు ఇంతగా జమ చేసుకోలేరు. అందువలన బాబా చెప్తున్నారు - ఆత్మలైన మా యొక్క భాగ్యం పరమాత్మ బాబా ద్వారా ఇంత శ్రేష్టంగా తయారయ్యింది అనే శ్రేష్ట స్మృతిలో ఉండండి. 

మీ ఖజానాలు ఏమిటో అయితే తెలుసు కదా! సమయం యొక్క ఖజానా గురించి కూడా తెలుసు, సంగమయుగం యొక్క సమయం ఎంత శ్రేష్టమైనదో! అధికారిగా అయ్యి ఏ ప్రాప్తి కావాలంటే ఆ ప్రాప్తిని బాబా నుండి తీసుకుంటున్నారు. సర్వ అధికారాలు పొందేశారు కదా! ఒక్కొక్క శ్రేష్టసంకల్పం ఎంత ఉన్నత ఖజనా, సమయం కూడా పెద్ద ఖజానా, సంకల్పం కూడా పెద్ద ఖజానా, సర్వశక్తులు ఉన్నతోన్నతమైన ఖజానా, ఒక్కొక్క జ్ఞానరత్నం ఎంత ఉన్నతమైన ఖజానా, ప్రతి ఒక గుణం ఎంత ఉన్నతమైన ఖజానా! శ్వాసశ్వాసలో భగవంతుని స్మృతి ద్వారా శ్వాస సఫలం అవుతుంది. ప్రపంచంలోని వారు కూడా అనుకుంటారు. మీ అందరి శ్వాస సఫలతా స్వరూపంగా ఉంటుంది, వ్యర్ధంగా ఉండదు. ప్రతి శ్వాసలో సఫలత యొక్క అధికారం నిండి ఉంది. బాప్ దాదా పిల్లలందరికీ సర్వఖజానాలు ఒకే విధంగా ఇచ్చారు. అన్నీ ఇచ్చారు మరియు సమానంగా ఇచ్చారు. కొంతమందికి ఒక గుణం, కొంతమందికి 10 గుణాలు, కొంతమందికి 100 గుణాలు... ఇలా ఇవ్వలేదు. ఇచ్చేటువంటి దాత ఒక్కొక్క బిడ్డకి సర్వఖజానాలు బ్రాహ్మణులుగా అవుతూనే సమాన రూపంలో ఇచ్చారు. కానీ ఖజానాలను ఎంత జమ చేసుకుంటున్నారు మరియు ఎంత పోగొట్టుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంది. 

ప్రతి ఒక్కరు పరిశీలించుకోవాలి - మేము రోజంతటిలో ఎంత జమ చేసుకుంటున్నాము మరియు ఎంత పోగొట్టుకుంటున్నాము? అని. పరిశీలించుకుంటున్నారా? తప్పక పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఒక జన్మ కోసం కాదు, ప్రతి జన్మకి జమ అవ్వాలి, అనేక జన్మలకు జమ అవ్వాలి. జమ చేసుకునే విధి తెలుసా? చాలా సహజం. కేవలం బిందువు పెడుతూ వెళ్ళండి. బిందువు స్మృతి ఉంటే జమ అవుతుంది. ఎలా అయితే స్థూల ఖజానాలో కూడా ఒకటి ప్రక్కన బిందువు (సున్న) పెడుతూ ఉంటే సంఖ్య పెరుగుతూ ఉంటుంది కదా! అలాగే ఆత్మ కూడా బిందువు, బాబా కూడా బిందువు మరియు డ్రామాలొ జరిగిపోయిన దానికి బిందువు! ఒకవేళ ప్రతి ఖజానాను బిందువు రూపంలో స్మ్మతి చేస్తే జమ అవుతూ ఉంటుంది. అనుభవం ఉంది కదా! బిందువు పెట్టగానే వ్యర్థానికి బదులు జమ అవుతూ ఉంటుంది. బిందువు పెట్టడం వస్తుందా? బిందువు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ బిందువుకి బదులు పెద్ద లైన్ అయిపోతుంది, బిందువుకి బదులు ప్రశ్నార్ధకం అయిపోతుంది లేదా ఆశ్చర్యార్ధకం వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. కనుక జమాఖాతాను పెంచుకునే విధి - బిందువు. మరియు పోగొట్టుకునే మార్గం - పెద్ద లైన్ గీయటం, ప్రశ్నార్ధకం పెట్టడం, ఆశ్చర్యార్ధకం పెట్టడం. ఏది సహజమైనది? బిందువే కనుక విధి చాలా సహజమైనది - స్వమానం మరియు బాబా స్మృతి మరియు వ్యర్ధ విషయాలకు బిందువు పెట్టండి. బాబా ఇంతకు ముందు కూడా చెప్పారు - రోజూ అమృతవేళ మీకు మీరు మూడు బిందువుల యొక్క స్మృతి తిలకాన్ని పెట్టుకోండి. అప్పుడు ఒక ఖజానా కూడా వ్యర్ధమవ్వదు. ప్రతి సమయం, ప్రతి ఖజానా జమ అవుతూ ఉంటుంది. బాప్ దాదా పిల్లలందరి యొక్క ప్రతి ఖజానా జమ యొక్క చార్ట్ చూశారు, దానిలో ఏమి చూశారు? జమ ఖాతా ఎంత ఉండాలో అంత ఇప్పటి వరకూ కూడా లేదు. సమయం, సంకల్పం, మాట కూడా వ్యర్ధమవుతున్నాయి. నడుస్తూ, నడుస్తూ అప్పుడప్పుడు సమయం యొక్క గొప్పతనం ప్రత్యక్ష రూపంలో తక్కువ ఉంటుంది. సమయం యొక్క గొప్పతనం సదా గుర్తు ఉంటే, ప్రత్యక్షంగా ఉంటే సమయాన్ని మరింత సఫలం చేసుకోగలరు. మొత్తం రోజంతటిలో సాధారణరూపంగా సమయం గడిచిపోతుంది. పొరపాటుగా కాదు కానీ సాధారణంగా గడిచిపోతుంది. అలాగే సంకల్పాలు కూడా చెడుగా రావటం లేదు కానీ వ్యర్ధంగా పోతున్నాయి. ఒక గంట యొక్క పరిశీలన చేసుకోండి, ప్రతి గంటలో సమయం మరియు సంకల్పం ఎంత సాధారణంగా వెళ్తున్నాయి? జమ అవ్వటం లేదు. మరలా బాప్ దాదా సైగ కూడా చేస్తారు, కానీ బాప్ దాదాకి కూడా చాలా నమ్మకం కలిగిస్తారు. బాబా! ఇటువంటి సంకల్పాలు కొంచెమే వస్తున్నాయి అంతే, ఇంకేమి లేవు, సంకల్పంలో కొద్దిగా వస్తుంది, సంపూర్ణం అయిపోతాము, సరి అయిపోతాము, ఇప్పుడింకా అంతిమ సమయం రాలేదు కదా, కొంచెం సమయం ఉంది కదా! సమయానికి సంపన్నంగా అయిపోతాము అంటున్నారు. కానీ చాలా సమయం యొక్క జమ ఖాతా కావాలి అని బాప్ దాదా చాలా సార్లు చెప్పారు. జమ ఖాతాను అంతిమంలో పూర్తి చేసుకుంటాము, సమయం వస్తే తయారైపోతాము అని అనకూడదు. చాలా సమయం యొక్క జమ ఖాతా చాలా సమయం నడుస్తుంది. వారసత్వం తీసుకోవటంలో అయితే అందరూ మేము లక్ష్మీనారాయణులుగా అవుతాం అని అంటున్నారు. త్రేతాయుగి అవుతారా అని చేతులు ఎత్తమని చెప్తే ఎవరూ ఎత్తరు, లక్ష్మీ నారాయణులుగా అవుతారా, అని అంటే అందరూ చేతులెత్తుతారు. ఒకవేళ చాలా సమయం యొక్క జమ ఖాతా ఉంటే పూర్తి వారసత్వం లభిస్తుంది. ఒకవేళ కొద్దిగా జమ అయితే పూర్తి వారసత్వం ఎలా లభిస్తుంది? అందువలన సర్వ ఖజానాలను ఎంత జమ చేసుకోగలరో అంత ఇప్పటి నుండి జమ చేసుకోండి. అయిపోతుంది, వచ్చేస్తాము ...... అని అనటం కాదు. చేయాల్సిందే - ఇదే ధృడత. అమృతవేళ స్మృతిలో కూర్చున్నప్పుడు, మంచి స్థితిలో కూర్చున్నప్పుడు లోలోపల మనస్సులో చాలా ప్రతిజ్ఞలు చేస్తున్నారు - ఇది చేస్తాము. అది చేస్తాము, అద్భుతం చేసి చూపిస్తాము .... ఇది మంచి విషయమే, శ్రేష్ట సంకల్పాలే చేస్తున్నారు కానీ ఈ ప్రతిజ్ఞలన్నింటినీ కర్మలోకి తీసుకురండి. కేవలం ప్రతిజ్ఞలు చేయకండి కానీ ప్రతిజ్ఞ ఏవైతే చేస్తున్నారో అవి మనసా, వాచా మరియు కర్మలోకి తీసుకురండి. పిల్లలు చాలా మంచి, మంచి సంకల్పాలు చేస్తున్నారు. ఆ సమయంలో బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఎందుకంటే ధైర్యం అయితే పెట్టుకుంటున్నారు కదా. ఇలా తయారవుతాము, ఇది చేస్తాము... ఇలా ధైర్యం చాలా మంచిగా పెట్టుకుంటున్నారు. కనుక ధైర్యానికి బాప్ దాదా సంతోషిస్తున్నారు. కానీ కర్మలోకి వచ్చేసరికి అప్పుడప్పుడులోకి వచ్చేస్తున్నారు. ప్రతిజ్ఞ చేయటం చాలా సహజం కానీ కర్మలోకి తీసుకురావటం అంటే ప్రతిజ్ఞను నిలుపుకోవటం. ప్రతిజ్ఞలు చేసేవారు. అయితే చాలామంది ఉన్నారు కానీ నిలుపుకోవటంలో నెంబర్‌ వారీ అయిపోతున్నారు. కనుక సంకల్పం మరియు కర్మని, ప్లాన్ మరియు ప్రాక్టికల్ రెండింటినీ సమానంగా చేస్కోండి. చేసుకోగలరు కదా? 

వ్యాపారదారులు వచ్చారు, వ్యాపారదారులకు వ్యాపారం చేయటం తెలుసు కదా! జమ చేసుకోవటం తెలుసు కదా! మరియు ఇంజనీర్స్ మరియు వైజ్ఞానికులు వచ్చారు, వైజ్ఞానికులు కూడా ప్రత్యక్షంలో పని చేస్తారు. మరియు ఎవరైతే గ్రామీణ విభాగం (రూరల్) వారు వచ్చారో బాప్ దాదా వారిని పరిపాలకులు (రూరల్) అని అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈ సేవ లేకపోతే ఎవరూ నడవలేరు. కనుక వచ్చినటువంటి మూడు విభాగాల వారు కర్మ చేసి చూపించేవారు, కేవలం చెప్పేవారు కాదు, చేసి చూపించేవారు. కనుక అందరూ ప్రతిజ్ఞను కర్మలో నిలుపుకునే ఆత్మలే కదా? లేక కేవలం ప్రతిజ్ఞ చేసేవారేనా? ప్రతిజ్ఞ సమయంలో అయితే బాప్ దాదాకి ధైర్యాన్ని చూపించి సంతోషం చేసేస్తున్నారు. బాప్ దాదా దగ్గర ప్రతి ఒక్క బిడ్డ యొక్క ప్రతిజ్ఞల ఫైల్ ఉంది. (వతనంలో) అక్కడ ప్రతిజ్ఞల ఫైల్ పెట్టుకోవడానికి స్థలం లేదా అలమారా కావలసిన పనే లేదు. అప్పుడప్పుడు బాప్ దాదా తన యొక్క అలౌకిక టి.వి అకస్మాత్తుగా పెడతారు. ఎప్పుడూ పెట్టరు కానీ అప్పుడప్పుడు పెడతారు. అప్పుడు అన్ని వినిపిస్తాయి. పరస్పరం మాట్లాడుకునే విషయాలు కూడా వింటారు. అందువలనే బాప్ దాదా చెప్తున్నారు - వ్యర్థాన్ని జమ ఖాతాలోకి మార్చుకోండి. 

బ్రాహ్మణులు అంటే అలౌకికమైనవారు. బ్రాహ్మణజీవితం యొక్క గొప్పతనం చాలా ఉన్నతం! ప్రాప్తులు చాలా ఉన్నతం! స్వమానం చాలా ఉన్నతం! మరియు సంగమయుగి సమయంలో బాబా వారిగా అవ్వటం ఎంతో ఉన్నతోన్నతమైన కోటానుకోట్ల భాగ్యం! అందువలన ప్రతి ఖజానాకి గొప్పతనం ఇవ్వండి అని బాప్ దాదా చెప్తున్నారు. ఉపన్యాసంలో ఇతరులకు సంగమయుగం గురించి ఎంత మహిమ చెప్తారు! ఒకవేళ మీకు ఎవరైనా సంగమయుగం యొక్క మహిమ గురించి చెప్పమని టాపిక్ ఇస్తే ఎంత సమయం చెప్పగలరు? ఒక గంట చెప్పగలరా? టీచర్స్ చెప్పండి? చెప్పగలవారు చేతులు ఎత్తండి? ఇతరులకు గొప్పతనాన్ని చెపున్నారు మరియు మీకు కూడా బాగా తెలుసు. మీకు తెలియదు అని అయితే బాప్ దాదా చెప్పటం లేదు. ఇతరులకు చెప్పగలుగుతున్నారంటే మీకు తెలుసు కాబట్టే చెప్తున్నారు. కానీ ఏమవుతుందంటే అది గుప్తం అయిపోతుంది. స్మృతి ప్రత్యక్ష రూపంలో ఉండాలి. ఇది అప్పుడప్పుడు తక్కువ అయిపోతుంది, అప్పుడప్పుడు ఎక్కువ అవుతుంది. మీ ఈశ్వరీయ నషాను ప్రత్యక్షం చేయండి. నేను ఆవిధంగా అయిపోయాను .... అనుకోకండి. ప్రత్యక్షంలో కనిపించాలి. నిశ్చయం ఉంది కానీ నిశ్చయానికి గుర్తు - ఆత్మికనషా! సమయం అంతా నషా ఉండాలి. నేను ఎవరు? అనే ఆత్మికనషానే ఉండాలి. ఈ నషా ప్రత్యక్ష రూపంలో ఉంటే ప్రతి సెకను జమ అవుతూ ఉంటుంది. 

ఈరోజు బాప్ దాదా జమాఖాతాను చూస్తున్నారు అందువలన ఈరోజు విశేషంగా ధ్యాసను ఇప్పిస్తున్నారు - సమయం అకస్మాత్తుగా సమాప్తి అయిపోతుంది. తెలిసిపోతుంది కదా, సమయానికి తయారయిపోతాము అని అనుకోకండి. సమయం సరి చేసేస్తుంది, సమయానికి అయిపోతుంది.... ఇలా సమయాన్ని ఎవరైతే ఆధారంగా తీసుకుంటారో వారికి టీచర్ ఎవరు అయ్యారు? సమయమా లేక స్వయం పరమాత్మ అయ్యారా? పరమాత్మ ద్వారా సంపన్నంగా తయారు కాలేకపోయారు, సమయం సంపన్నం చేసింది అంటే ఏమంటారు? మీ శిక్షకులు సమయమా లేక పరమాత్మయా? కనుక డ్రామానుసారం ఒకవేళ సమయం మీకు నేర్పిస్తుంది లేక సమయం ఆధారంగా పరివర్తన అయితే ప్రాలబ్దం కూడా సమయం ఆధారంగానే లభిస్తుంది అనేది బాప్ దాదాకి తెలుసు. ఎందుకంటే సమయం టీచర్ అయ్యింది. సమయం మీ కోసం ఎదురుచూస్తుంది. మీరు సమయం కోసం ఎదురుచూడకండి. అది రచన, మీరు మాస్టర్ రచయిత. కనుక రచయిత గురించి రచన ఎదురుచూడాలి కానీ మాస్టర్ రచయితలైన మీరు సమయం కోసం ఎదురుచూడకండి. మీకు ఇష్టం ఏమి ఉంది? సహజాన్ని స్వయమే కష్టంగా చేసుకుంటున్నారు. నిజానికి కష్టం కాదు కానీ కష్టంగా చేసుకుంటున్నారు. బాబా చెప్తున్నారు - బరువు ఏదైనా ఉంటే నాకు ఇచ్చేయండి అని కానీ ఇవ్వటం రావటం లేదు. బరువు ఎత్తుకుంటున్నారు, అలసిపోతున్నారు కూడా! ఏమి చేయము, ఎలా చేయము అని మరలా బాబాని నిందిస్తున్నారు. మీపై బరువు ఎందుకు పెట్టుకుంటున్నారు? మీ భారాలన్నీ బాబాకి అర్పించండి అని బాబా అవకాశం ఇస్తున్నారు కానీ 63 జన్మల నుండి బరువు ఎత్తే అలవాటు అయిపోయింది కదా! కనుక అలవాటు కారణంగా బలహీనం అయిపోతున్నారు. అందువలన శ్రమ చేయవలసి వస్తుంది. అప్పుడప్పుడు సహజం, అప్పుడప్పుడు కష్టం అవుతుంది. ఏ కార్యం అయినా అయితే కష్టం అవుతుంది లేదా సహజం అవుతుంది కానీ అప్పుడప్పుడు కష్టం, అప్పుడప్పుడు సహజం ఎందుకు అవుతుంది? ఏదో కారణం ఉంటుంది కదా? కారణం ఏమిటంటే అలవాటుతో బలహీనం అయిపోతున్నారు. మరియు బాప్ దాదాకి పిల్లలు శ్రమ చేయటం చాలా పెద్ద విషయంగా అనిపిస్తుంది. మంచిగా అనిపించటం లేదు. మాస్టర్ సర్వశక్తివంతులు కానీ శ్రమ చేస్తున్నారు! మీకు ఇచ్చిన టైటిల్ ఏమిటి? కష్టయోగులా లేక సహజయోగులా? లేకపోతే మేము సహజ యోగులం కాదు అని మీ టైటిల్ మార్చేసుకోండి. అప్పుడప్పుడు సహజ యోగి, అప్పుడప్పుడు కష్టయోగులా? యోగం అంటే ఏమిటి? కేవలం స్మృతి చేయటమే కదా! శక్తిశాలి యోగం ముందు కష్టం ఏమి ఉండదు. యోగం అంటే సంలగ్నతా అగ్ని, అగ్ని ఎంత కఠిన వస్తువునైనా పరివర్తన చేసేస్తుంది. లోహం కూడా మలవబడుతుంది. మరయితే ఈ సంలగ్నతా అగ్ని కష్టాన్ని సహజం చేయలేదా? కొంతమంది పిల్లలు చాలా మంచి, మంచి విషయాలు చెప్తున్నారు, బాబా! ఏమి చేయము వాయుమండలం అలా ఉంది, సహయోగులు అలా ఉన్నారు, హంసలు, కొంగలు ఉన్నారు, ఏమి చేయము పాత కర్మలఖాతా! ఇలా చాలా మంచి, మంచి విషయాలు చెప్తారు. బ్రాహ్మణాత్మలైన మీరు ఏమి కాంట్రాక్ట్ తీసుకున్నారు? అని బాబా అడుగుతున్నారు. విశ్వపరివర్తన యొక్క కాంట్రాక్ట్ తీసుకున్నారు కదా? విశ్వపరివర్తన చేసేవారు తమ కష్టాన్ని తొలగించుకోలేరా? 

కనుక ఈ రోజు ఏమి చేస్తారు? జమాఖాతాను పెంచుకోండి. అప్పుడు సహజయోగి అని ఏదైతే చెప్తున్నారో దానిని జీవితం, సంగమయుగం మజాల యుగం, బరువు ఎత్తుకునే యుగం కాదు. బరువు దిగిపోయే యుగం. కనుక పరిశీలించుకోండి - జ్ఞానమనే దర్పణంలో మీ అదృష్టరేఖను బాగా చూసుకోండి. దర్పణం ఉంది కదా? లేదా? పగిలిపోలేదు కదా? అందరికీ దర్పణం లభించిందా? మాతలకు దర్పణం లభించిందా లేక ఎవరైనా దొంగలించేసారా? పాండవులు అయితే సంభాళించుకోవడంలో తెలివైనవారు కదా? దర్పణం ఉందా? చేతులు అయితే మంచిగా ఎత్తారు. మంచిది! అదృష్ట రేఖను చూసుకోండి మరియు సదా మీ అదృష్ట చిత్రాన్ని చూసుకుంటూ ఓహో నా అదృష్టం! ఓహో నా బాబా! ఓహో నా పరివారం! పరివారం కూడా ఓహో! ఓహో!! వీరు చాలా ఓహో, ఓహో, వీరు కొద్దిగా ఇలాంటి వారు అనకూడదు. ఓహో నా పరివారం, ఓహో నా భాగ్యం, ఓహో నా బాబా! బ్రాహ్మణజీవితం అంటే ఓహో, ఓహో అనాలి. అయ్యో, అయ్యో కాదు. శారీరక వ్యాధిలో కూడా అయ్యో, అయ్యో అనడం కాదు, ఓహో, ఓహో అనాలి. ఇది కూడా బరువును దించుతుంది. మీ బరువు 10 శాతం నుండి 3,4 శాతం దిగిపోయినా కానీ మంచిదేనా లేక అయ్యో, అయ్యయ్యోనా? అయ్యో నా పాత్ర ఇంతే, నన్ను వ్యాధి వదలటం లేదు. ఇలా అయ్యో అయ్యయ్యో అంటున్నారు. వ్యాధి మిమ్మల్ని వదులుతుందా లేక మీరు వ్యాధిని వదలాలా? ఓహో, ఓహో అంటూ ఉంటే వ్యాధి కూడా సంతోషం అయిపోతుంది. ఎవరినైనా మహిమ చేసేటప్పుడు ఓహో ఓహో అని అంటారు కదా! అలాగే వ్యాధికి కూడా ఓహో ఓహో అనండి. అయ్యో! ఇది నా దగ్గరికే ఎందుకు వచ్చింది, నాకే ఖాతా ఉంది! అనుకోకండి. ప్రాప్తి ముందు ఖాతా ఏమి కాదు. ప్రాప్తులను ఎదురుగా ఉంచుకోండి మరియు కర్మలఖాతాను ఎదురుగా ఉంచుకోండి. అప్పుడు ఏమనిపిస్తుంది? చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. బ్రాహ్మణ జీవితంలో ఏది జరిగినా కానీ శుభం రూపంలో చూడండి. అశుభాన్ని శుభంలోకి మార్చుకోవటం వస్తుంది కదా? అశుభం మరియు శుభం యొక్క కోర్స్ కూడా బాగా చేస్తారు కదా! కనుక ఆ సమయంలో మీకు మీరు కోర్స్ చేసుకోండి. అప్పుడు కష్టం సహజం అయిపోతుంది. 'కష్టం' అనే మాట బ్రాహ్మణుల నిఘంటువులో ఉండకూడదు. మంచిది - ఏ ఖాతా ఉన్నా, ఆత్మతో, శరీరంతో లేదా ప్రకృతితో ఉన్నా కానీ ఎందుకంటే ప్రకృతి యొక్క ఈ పంచతత్వాలు కూడా ఒకొక్కసారి కష్టాన్ని అనుభవం చేయిస్తాయి. కనుక ఏ కర్మలఖాతా అయినా కానీ యోగాగ్నిలో భస్మం చేసుకోండి. ఏమి చేయాలో అర్థమైందా? జమాఖాతాను పెంచుకోండి. మాటలు కూడా సాధారణ మాటలు కాదు, మాటలలో కూడా రకరకాల భావనలు, రకరకాల భావాలు ఉంటాయి. మరియు మాట ద్వారా భావం మరియు భావన తెలుస్తుంది. కనుక సదా ఏ మాట మాట్లాడినా దానిలో ఆత్మికభావం మరియు శుభ భావన లేదా శ్రేష్ఠభావన ఉండాలి. మాట కూడా మరియు భావన కూడా ఉండాలి. ఈర్ష్య, అసహ్యం, ద్వేషం .... ఇవన్నీ మాయా భావనలు. సదా శుభభావం మరియు భావన ఉండాలి. ఇలా ఉన్నారా? పరిశీలించుకోవాలి. సమయం యొక్క ఖజానా, మాట యొక్క ఖజానా, సంకల్పాల ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా... ఇలా ఒకొక్క ఖజానాను పరిశీలించుకోండి. ఎందుకంటే ప్రతి ఖజానా యొక్క ఖాతా జమ చేసుకోవాలి. సర్వఖజానాల ఖాతా నిండుగా ఉంటేనే పూర్తి మార్కులు పొందినట్లు అంటే పాస్ విత్ ఆనర్ అని అంటారు. ఒక ఖజానా తక్కువ జమ అయితే ఏంటి అని అనుకోకండి. పాస్ విత్ ఆనర్ అవ్వాలంటే సర్వఖజానాల ఖాతా నిండుగా ఉండాలి.. 

బాప్ దాదా ఎదురుగా కూర్చున్న మిమ్మల్నే చూడటం లేదు, దేశ, విదేశాలలో ఉన్న పిల్లలందరినీ చూస్తున్నారు. అందరూ సన్ముఖంగా లేరు కానీ మనస్సులో ఉన్నారు. ఈరోజు మీరు సన్ముఖంగా ఉన్నారు, రేపు ఇంకొకరు ఉంటారు. అలాగని బాప్ దాదా మిమ్మల్ని చూడటం లేదు అనుకోకండి. వారు మనస్సులో ఉన్నారు మరియు మీరు ఎదురుగా ఉన్నారు. అలాగని మీరు మనస్సులో లేరు అని కాదు, ఎదురుగా ఉన్నందుకు గొప్పతనం ఉంటుంది కదా! అర్థమైందా! మంచిది! 

వ్యాపారదారులు చేతులెత్తండి! వ్యాపారదారులు ఏమి ఆలోచిస్తున్నారు? విశేషంగా మీకు అవకాశం లభించింది. వ్యాపారదారులను బాబాతో కూడా వ్యాపారం చేయించండి. మీరు వ్యాపారం చేశారు మంచిదే కానీ ఇతరులచే కూడా బాబాతో వ్యాపారం చేయించండి. ఎందుకంటే ఈ రోజుల్లో వ్యాపారదారులందరు చాలా ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే సమయానుసారంగా వ్యాపారం దిగజారిపోతుంది. అందువలన ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనంతో పాటు ఏమవుతుందో అనే చింత ఉంది. కనుక వారిని చింత నుండి తొలగించి అవినాశి ఖజానా యొక్క గొప్పతనాన్ని చెప్పండి. కనుక చిన్న వ్యాపారదారులు అయినా, పెద్ద వ్యాపారదారులు అయినా వచ్చిన వ్యాపారదారులందరూ మీ తోటివారికి సంతోషానికి మార్గం చెప్పండి. ఇక్కడికి వచ్చిన వ్యాపారదారులకు చింత ఉందా? ఏమవుతుందో, ఎలా అవుతుందో ఈ చింత ఉందా! చింత లేకపోతే చేతులెత్తండి. రేపు ఏమైనా జరిగితే నిశ్చింతా చక్రవర్తిగా ఉంటారా? వ్యాపారదారులు నిశ్చింతా చక్రవర్తులేనా? కొద్దిమందే చేతులెత్తారు. కొద్దికొద్దిగా చింత ఉన్నవారు చేయి ఎత్తగలరా? లేక సిగ్గుపడతారా? బాప్ దాదా అయితే నిశ్చింతా చక్రవర్తులు అని బిరుదునిచ్చారు. విషయాలు రావటం అయితే తప్పదు, వస్తాయి కానీ ఎప్పుడైనా ఇటువంటి విషయం వస్తే మీరు నిశ్చింతా పురానికి వెళ్ళిపోవాలి. నిశ్చింతాపురంలో కూర్చుంటే చక్రవర్తిగా కూడా అయిపోతారు మరియు నిశ్చింతాపురంలో కూడా ఉంటారు. పాత ప్రపంచం వెళ్ళిపోవాలి, క్రొత్త ప్రపంచం రావాలని మీరే ఆహ్వానించారు కదా! మరయితే ఎలా వస్తుంది? అలజడి అయితేనే పాత ప్రపంచం వెళ్ళిపోతుంది కదా! కనుక ఏమైపోయినా కానీ మీరు నిశ్చింతగా ఉండాలి. పాత ప్రపంచం వెళ్ళిపోవాలని మీరే ఆహ్వానించారు కదా, మరయితే పాత ప్రపంచంలో మరియు పాత ఇంట్లో ఏం జరుగుతుంది? ఒకొక్కసారి ఒకటి ఊడిపోతుంది, ఒక్కొక్కసారి ఒకటి పడిపోతుంది. కనుక ఇది జరిగేదే కొత్తదేమీ కాదు. ప్రతి విషయంలో బ్రహ్మాబాబా కొత్తదేమీ కాదు అని అనేవారు. జరగవలసిందేదో జరుగుతుంది కానీ మనం నిశ్చింతాచక్రవర్తులం. ఇటువంటి నిశ్చింతా చక్రవర్తులేనా? నిశ్చింతా చక్రవర్తులు అయితే దివాళా తీసేవారు కూడా రక్షించబడతారు. చింతలో ఉండి సరైన నిర్ణయం తీసుకోలేకపోతే ఒక్కరోజులోనే ఎలా ఉండేవారు ఎలా అయిపోతారో తెలుసు కదా! అందువలన నిశ్చింతగా ఉంటే మంచిగా నిర్ణయం తీసుకోగలరు, అప్పుడు రక్షించబడతారు. ఇప్పటి ఈ సమయాన్ని అనుసరించి ఇది చేయాలా, వద్దా అనే ప్రేరణ కూడా అందుతుంది. అందువలన చింత ఉంటే వ్యాపారం కూడా పడిపోతుంది మరియు మీ స్థితి కూడా పోతుంది. అందువలన సదా నిశ్చింతా చక్రవర్తులం అని గుర్తు పెట్టుకోండి. అప్పుడు చింత విషయం కూడా మారిపోతుంది. ధైర్యాన్ని వదలకండి, మానసికంగా బలహీనం అవ్వకండి. ధైర్యం ద్వారా బాబా సహాయం లభిస్తూ ఉంటుంది. మీకు సహాయం చేయడానికి బంధించబడి ఉన్నారు. కానీ ధైర్యహీనులకు సహాయకారి కాదు. బాబా సహాయం మాకు లభించలేదు అని మీరు అనుకుంటారు కానీ అసలు నాకు ధైర్యం ఉందా అని ముందు మీరు ఆలోచించండి. ధైర్యం పిల్లలది, సహాయం బాబాది. సగం మాటను పట్టుకోకండి. బాబా సహాయం కావాలి కదా అని. కానీ ధైర్యం పెట్టుకున్నారా? మానసికంగా బలహీనం అవ్వకుండా ధైర్యం పెట్టుకుని నడిస్తే గుప్తంగా సహాయం అందుతూనే ఉంటుంది. అయితే చెప్పండి - ఎవరు మీరు? వ్యాపారదారులు అందరూ చెప్పండి ఎవరు మీరు? నిశ్చింతా చక్రవర్తులేనా? దీనిని గుర్తు ఉంచుకోవాలి. ధైర్యాన్ని ఎప్పుడూ వదలకూడదు, ఏమైపోయినా కానీ సహాయం లభిస్తుంది. కానీ సగమే గుర్తు పెట్టుకోకండి, పూర్తిగా గుర్తు ఉంచుకోండి. మంచిది. మాతలు వ్యాపారులు కాదా? (అవును) అయితే మాతలు నిశ్చింతా చక్రవర్తులేనా? నౌకరుగా కాకూడదు. యజమాని మరియు చక్రవర్తి అయ్యి ఉండాలి. చింత ఉంటే ఉదాశీనంగా ఉంటారు.. ఉదాశీనంగా అవ్వటం అంటే దాసీ అవ్వటం. అందువలన చక్రవర్తిగా అవ్వాలి. మంచిది. మొదటిసారి వచ్చిన క్రొత్త క్రొత్త వారు చేతులు ఎత్తండి! డ్రామానుసారం ఇప్పుడు వచ్చారు కానీ బాప్ దాదా యొక్క స్లోగన్ స్మృతి ఉందా? లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్(వేగంగా) వెళ్ళి ఫస్ట్ రావచ్చు, అవకాశం ఉంది. ఫస్ట్ కి వెళ్ళగలరా? కానీ జమ ఖాతాను ఎక్కువలో ఎక్కువగా పెంచుకోండి. మీ భాగ్యం స్మతి ఉంటుంది కదా! విశేషంగా కొత్త వారికి చెప్తున్నాను. ఎవరికైతే భాగ్యం స్మృతి ఉంటుందో వారు చేతులు ఎత్తండి! మంచిది - ఎవరైతే ఒక సెకనులో మీ సంకల్పాలను ఎక్కడ కావాలంటే అక్కడ, ఏది కావాలంటే అదే ఆలోచించగలం అని భావించేవారు చేతులు ఎత్తండి! మనస్సు ఒక్క సెకనులో కంట్రోల్ అయిపోవాలి. సెకనులో ఇలా అవుతుందా? అలా చేయగలిగితే చేతులు ఎత్తండి! అవుతుంది అని చెప్పేయటం కాదు, కంట్రోల్ అయితేనే చేతులెత్తండి. మంచిది. చేతులు ఎత్తని వారికి ఒక నిమిషం పడుతుందా? లేక దానికంటే కూడా ఎక్కువ పడుతుందా? ఇప్పుడు ఈ అభ్యాసం చాలా అవసరం. ఎందుకంటే అంతిమ సమయంలో ఈ అభ్యాసం చాలా పనికొస్తుంది. ఈ శరీరం యొక్క అవయవాలైన చేతులు, కాళ్ళను సెకనులో ఎక్కడికి తీసుకువెళ్ళాలంటే అక్కడికి తీసుకువెళ్తున్నారు. అదేవిధంగా మనస్సు మరియు బుద్దిని కూడా నావి అని అంటున్నారు కదా! మనస్సుకి అధికారులు అయినప్పుడు ఈ సూక్ష్మ కర్మేంద్రియాలపై అదుపు ఎందుకు లేదు? సంస్కారాలపై కూడా కంట్రోల్ ఉండాలి. ఎప్పుడు కావాలంటే, ఎలా కావాలంటే అలా ఈ అభ్యాసం పక్కాగా ఉంటేనే పాస్ విత్ ఆనర్ అవుతారు. అవ్వాల్సింది లక్ష్మీనారాయణులుగా. కనుక రాజ్యాన్ని కంట్రోల్ చేసేముందు స్వరాజ్యాధికారి అయినప్పుడే రాజ్యాధికారి అవుతారు. దీనికి కూడా సాధనం ఇదే - జమాఖాతాను పెంచుకోండి. అర్థమైందా! మంచిది. ఈ వాయుమండలంలో, మధువనంలో కూర్చున్నారు. మధువనం యొక్క వాయుమండలం శక్తిశాలి, ఈ వాయుమండలంలో ఈ సమయంలో మనస్సుని అదుపు చేయగలరా? నిమిషంలో చేయండి లేదా సెకనులో చేయండి కానీ అసలు చేయగలుగతున్నారా? పరంధామ నివాసి అయిపోమని మనస్సుకి ఆజ్ఞ ఇవ్వండి. మనస్సు ఆజ్ఞను పాటిస్తుందో, లేదో చూడండి. (వ్యాయామం) మంచిది. 

నలువైపుల ఉన్న సర్వఖజానాలకు యజమాని అయిన పిల్లలకు, సదా కష్టాన్ని సెకనులో పరివర్తన చేసుకునే సదా సహజయోగులకు, సదా సమయం, సంకల్పం, మాట, కర్మని శ్రేష్టంగా తయారు చేసుకునేవారికి, సదా పొదుపు ఖాతాను పెంచుకునేవారికి, సదా మనస్సు యొక్క యజమానులకు, మనస్సు, బుద్ధి, సంస్కారాలను ఆర్డర్‌లో నడిపించేవారికి, ఈ విధమైన స్వరాజ్యాధికారి పిల్లలకు, దేశంలో ఉన్నా, విదేశాలలో ఉన్నా కానీ మనస్సుతో దూరంగా లేరు ఈవిధంగా నలువైపుల ఉన్న పిల్లలందరికీ బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు సమస్తే, 

Comments