30-03-2000 అవ్యక్త మురళి

              * 30-03-2000         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

మనస్సును ఆరోగ్యవంతంగా ఉంచుకునేందుకు మధ్యమధ్యలో ఐదు క్షణాలైనా సమయం తీసి మనస్సు యొక్క ఎక్సర్సైజు చేయండి.

ఈ రోజు దూరదేశి అయిన బాప్ దాదా తమ సాకార ప్రపంచంలోని భిన్న, భిన్న దేశవాసులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. బాప్ దాదా భిన్న, భిన్న దేశవాసులను ఒకే దేశవాసులుగా చూస్తున్నారు. ఎవరు ఎక్కడినుండి వచ్చినా కానీ అన్నింటికన్నా ముందు అందరూ ఒకే దేశం నుండి వచ్చారు. కావున మీ అనాది దేశము గుర్తుంది కదా! అది ఎంతో ప్రియమైనది కదా! 

బాప్ దాదా ఈ రోజు పిల్లలందరి యొక్క ఐదు స్వరూపాలను చూస్తున్నారు. ఆ ఐదు స్వరూపాలేమిటో మీకు తెలుసు కదా! పంచముఖ బ్రహ్మ యొక్క పూజ కూడా జరుగుతుంది, కావున బాప్ దాదా పిల్లలందరి యొక్క ఐదు స్వరూపాలను చూస్తున్నారు.

మొదటిది - అనాది జ్యోతిరిందు స్వరూపము. మీ స్వరూపము మీకు గుర్తుంది కదా? మరచిపోవడం లేదు కదా? ఇంకొకటి ఆది దేవతా స్వరూపము. దేవతాస్వరూపములోకి చేరుకున్నారా? దేవతారూపములోకి వెళ్ళిపోయారా? మూడవది - మధ్యలోని పూజ్య స్వరూపము, అది కూడా గుర్తుందా? మీ అందరి పూజా జరుగుతుందా లేక భారతవాసీయులదే జరుగుతుందా? మీ పూజ జరుగుతుందా? కుమారులు చెప్పండి. మీ పూజ జరుగుతుందా? కావున మూడవది పూజ్య స్వరూపము. నాల్గవది - సంగమయుగ బ్రాహ్మణ స్వరూపము మరియు చివరిలోది - ఫరిస్తాస్వరూపము. మరి ఐదు రూపాలు గుర్తుకు వచ్చాయా? అచ్చా! ఒక్క క్షణములో స్వయమును ఈ ఐదు రూపాలలో అనుభవం చేసుకోగలరా? వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్... అని అయితే అనగలరు కదా! ఈ ఐదు స్వరూపాలూ ఎంత ప్రియమైనవి! ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఏ రూపములో స్థితులవ్వాలనుకుంటే ఆ రూపములో ఆలోచించగానే అనుభవం చేసుకోగలగాలి. ఇదే ఆత్మికమైన మనస్సు యొక్క ఎక్సర్‌సైజ్. ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తున్నారు? ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు కదా! ఆదిలో కూడా మీ ప్రపంచంలో, సత్యయుగములో సహజసిద్ధముగా నడుస్తూ, తిరుగుతూ ఉండే ఎక్సర్‌సైజ్ ఉండేది. అది మీ ప్రపంచమే కదా! అక్కడ వన్, టూ, త్రీ అనే ఎక్సర్‌సైజ్ ఉండదు. కావున ఇప్పుడు అంతిమంలో కూడా బాప్ దాదా మనస్సు యొక్క ఎక్సర్ సైజ్ ను చేయిస్తున్నారు. ఏ విధంగా స్థూలమైన ఎక్సర్సైజ్ ద్వారా తనువు ఆరోగ్యంగా ఉంటుందో అలా నడుస్తూ, తిరుగుతూ ఈ మనస్సు యొక్క ఎక్సర్ సైజ్ ను కూడా చేస్తూ ఉండండి. ఇందుకోసం సమయం అక్కరలేదు. ఐదు క్షణాలను మీరు ఎప్పుడైనా కేటాయించవచ్చు, లేక కేటాయించలేరా? ఐదు క్షణాలు, అంతే! ఐదు క్షణాలు కూడా కేటాయించలేనంతగా ఎవరైనా బిజీగా ఉన్నారా? అలా ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి! మరి సమయం ఉందా? ఏం చేయాలి. సమయం దొరకడం లేదు అని అయితే అనరు కదా? ఇలా అయితే అనరు కదా? సమయం దొరుకుతుందా? కావున ఈ ఎక్సర్‌సైజ్ ను మధ్యమధ్యలో చేయండి. ఏ కార్యములో ఉన్నా ఐదు క్షణాల ఈ మనస్సు యొక్క ఎక్సర్ సైజ్ ను చేయండి, తద్వారా మనస్సు సదా ఆరోగ్యవంతంగా ఉంటుంది. సరిగ్గా ఉంటుంది. ప్రతి గంటలోనూ ఈ ఐదు క్షణాల ఎక్సర్ సైజ్  చేయండి అని బాప్ దాదా అంటారు. అలా జరుగగలదా? చూడండి - అందరూ జరుగగలదు అని అంటున్నారు. ఇది గుర్తుంచుకోండి. ఓం శాంతి భవనాన్ని గుర్తుంచుకోండి, మరచిపోకండి, తద్వారా మనస్సు యొక్క భిన్న భిన్న కంప్లయింట్లు ఏవైతే ఉన్నాయో...ఏం చేయాలి, మనస్సు నిలువడం లేదు అంటూ మనస్సును ఒక మణుగు బరువుగా చేసేసుకుంటారు. అలా బరువుగా తీసుకుంటారు కదా! ఇంతకుముందు కాలంలో పావు, సేరు మరియు మణుగులు కొలతలుగా ఉండేవి. ఈ రోజుల్లో మారిపోయారు. కావున మనస్సును మణుగుగా బరువుగా చేసుకుంటారు మరియు ఈ ఎక్సర్ సైజ్ ను చేస్తూ ఉన్నట్లయితే పూర్తిగా తేలికగా అయిపోతారు. ఇది అభ్యాసమైపోతుంది. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బ్రాహ్మణులు అనగానే బ్రాహ్మణ జీవితము యొక్క అనుభవంలోకి వచ్చేయండి. ఫరిస్తా అనగానే ఫరిస్తాగా అయిపోండి. ఇందులో ఏమైనా కష్టముందా? లేదు కదా! కుమారులు చెప్పండి, ఏదైనా కష్టముందా? కాస్త కష్టముందా? మీరు ఫరిస్తాలేనా? కాదా? వారు మీరేనా లేక ఇంకెవరైనానా? ఎన్నిసార్లు మీరు ఫరిస్తాలుగా అయ్యారు? లెక్కలేనన్నిసార్లు అయ్యారు. మీరే అయ్యారా, అచ్చా లెక్కలేనన్నిసార్లు చేసిన విషయాన్ని మళ్ళీ రిపీట్ చేయడం ఏమైనా కష్టమా? అప్పుడప్పుడూ అలా అవుతుందా? ఇప్పుడు ఈ అభ్యాసం చేయండి. ఎక్కడ ఉన్నా కానీ, ఐదు క్షణాలు మనస్సును తిప్పండి, చుట్టిరండి. అంతా చుట్టిరావడమైతే మీకు నచ్చుతుంది కదా! టీచర్స్ బాగున్నారా? చుట్టిరావడం వస్తుంది కదా! అంతా చుట్టిరండి, మళ్ళీ కర్మలో నిమగ్నమైపోండి. ప్రతి గంటలోనూ అంతా చుట్టివచ్చి మళ్ళీ పనిలో పడిపోండి. ఎందుకంటే పనినైతే మీరు వదలలేరు కదా! డ్యూటీనైతే నిర్వర్తించవలసిందే, కానీ ఐదు నిమిషాలు కూడా కాదు, ఐదు క్షణాలు కేటాయించగలరా? యు.ఎన్.ఆఫీసులో సమయం తీయగలరా? మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, మరి మాస్టర్ సర్వశక్తివంతులు చేయలేనిది ఏమిటి!

బాప్ దాదాకు ఒక్క విషయంలో పిల్లలను చూసి మధురముగా నవ్వు వస్తుంది. ఏ విషయంలో? ఛాలెంజ్ చేస్తారు, కరపత్రాలు ముద్రిస్తారు, భాషణ చేస్తారు, కోర్స్ చేయిస్తారు, అందులో ఏమంటారు? మేము విశ్వాన్ని పరివర్తన చేస్తాము అని అంటారు. ఇదైతే అందరూ అంటారు కదా లేక అనరా? అందరూ అంటారా లేక భాషణ చేసేవారే అంటారా? కావున ఒకవైపేమో మేము విశ్వాన్ని పరివర్తన చేస్తాము, మాస్టర్ సర్వశక్తివంతులము అని అంటారు. అలాగే ఇంకొకవైపు మనస్సును నా మనస్సు అని అంటారు అనగా మీరు మనస్సు యొక్క అధికారులు మరియు మాస్టర్‌ సర్వశక్తివంతులు అయినా కానీ మళ్ళీ ఏమంటారు? కష్టంగా ఉంది అని అంటారు. మరి అప్పుడు నవ్వు రాదా? నవ్వు వస్తుంది కదా? కావున ఎప్పుడైతే మనస్సు అంగీకరించడం లేదు అని భావిస్తారో అప్పుడు స్వయంపై స్వయమే నవ్వుకోండి. మనస్సులో ఏదైనా విషయం వచ్చినప్పుడు మూడు గీతలు గానం చేయబడి ఉండడం బాప్ దాదా గమనించారు. ఒకటేమో నీటిపై గీతలు, నీటిపై గీతలు చూసారా? గీత వేయగానే అదే సమయంలో అది తొలగిపోతుంది. గీతలు గీస్తారు కదా! ఇంకొకటి ఏదైనా కాగితముపై లేక పలకపై ఎక్కడైనా గీతను గీయడం, ఇంకొకటి అన్నింటికన్నా పెద్ద గీత రాతిపై వేసే గీత, రాతిపై వేసే గీత చాలా కష్టంగా తొలగుతుంది. కొన్నిసార్లు పిల్లలు తమ మనస్సులో తాము రాతిపై గీతల వలే పక్కా గీతలను గీసుకుంటారు. వాటిని చెరిపేందుకు ప్రయత్నిస్తారు కానీ అవి చెరిగిపోవు. అటువంటి గీతలేమైనా మంచివా? ఇక ఇప్పటినుండి చేయము అని ఎన్నోసార్లు ప్రతిజ్ఞలు కూడా చేస్తారు. ఇక ఇప్పటినుండి జరుగవు అని అంటారు కానీ మళ్ళీ మళ్ళీ పరవశులైపోతారు. కావున బాప్ దాదాకు పిల్లలపై ద్వేషం కలుగదు, దయ కలుగుతుంది. పరవశులైపోతారు. కావున పరవశులపై దయ కలుగుతుంది కదా! ఎప్పుడైతే బాప్ దాదా పిల్లలను ఇటువంటి దయార్ధ భావముతో చూస్తారో అప్పుడు డ్రామా యొక్క పరదాపైకి ఏమి వస్తుంది? ఎప్పటివరకు? అని వస్తుంది. దీని జవాబును మీరు ఇవ్వండి, ఇస్తారా? ఎప్పటివరకూ? కుమారులు చెప్పగలరా - ఇది ఎప్పటివరకూ సమాప్తమవుతుంది? కుమారులు ఎన్నో ప్లాన్లు తయారుచేస్తారు కదా, మరి ఎప్పటివరకు? చెప్పగలరా? ఇది ఇంకా ఎన్నాళ్ళ వరకూ? చెప్పండి. ఎప్పటివరకో చెప్పగలరా? దాదీలు వినిపించండి. ఎప్పటివరకైతే సంగమయుగము ఉంటుందో అప్పటివరకూ కొద్ది కొద్దిగా ఉంటుంది. సంగమయుగము కూడా ఎప్పటివరకూ? (ఎప్పటివరకైతే ఫరిస్తాలుగా అయిపోతారో అప్పటివరకు). అది కూడా ఎప్పటివరకు? (బాబా చెప్పాలి). ఫరిస్తాలుగా అవ్వవలసింది మీరా లేక బాబానా? కావున దీనికి జవాబు ఆలోచించండి. బాబా అయితే ఇప్పుడే అని అంటారు, మరి తయారుగా ఉన్నారా? సగం మాలలో కూడా మీరు చేతులు ఎత్తలేదు. 

బాప్ దాదా సదా పిల్లలను సంపన్నరూపంలో చూడాలనుకుంటున్నారు. బాబాయే మా ప్రపంచం అని అంటారు కదా! ఇలాగైతే అందరూ అంటారు కదా! లేక ఇంకేమైనా ప్రపంచం ఉందా? బాబాయే ప్రపంచం అయినప్పుడు మరి ప్రపంచం కాక ఇంకేదైనా ఉంటుందా? కేవలం అయిదు సంస్కారాలను మార్చుకుంటే బ్రాహ్మణుల జీవితంలో మెజార్టీ విఘ్నరూపంగా అయ్యేది సంస్కారమే. మీ సంస్కారాలైనా లేక ఇతరుల సంస్కారాలైనా, జ్ఞానము అందరిలోనూ ఉంది. శక్తులు కూడా అందరి వద్ద ఉన్నాయి, కానీ కారణము ఏమిటి? ఏ శక్తి ఏ సమయంలో కార్యములోకి తీసుకురావలసి ఉంటుందో ఆ సమయంలో అది ఎమర్జ్ అయ్యేందుకు బదులుగా కాస్త తర్వాత ఎమర్ట్ అవుతుంది. ఇలా చేయకుండా, ఇలా అనకుండా ఉంటే ఎంతో బాగుండేది లేక ఇలా చేయకుండా అలా చేసి ఉంటే చాలా బాగుండేది అని తర్వాత ఆలోచిస్తారు. కానీ ఏ సమయమైతే గతించవలసి ఉంటుందో అది గతించిపోతుంది. అలా అందరూ స్వయములో శక్తులను గూర్చి ఆలోచిస్తూ ఉంటారు కూడా! ఇది సహనశక్తి, ఇది నిర్ణయ శక్తి, దీనిని ఇలా ఉపయోగించాలి అని కూడా ఆలోచిస్తారు. కానీ కేవలం కొద్ది సమయం యొక్క తేడా ఏర్పడుతుంది. ఇంకొక విషయం ఏమి జరుగుతుంది? పోనీ ఒక్కసారి సమయం వచ్చినప్పుడు శక్తి కార్యములోకి రాలేదు, తర్వాత ఇలా చేయకుండా ఇలా చేసి ఉండవలసింది అని కూడా అర్ధం చేసుకున్నారు, అది తర్వాత అర్ధమవుతుంది కానీ ఆ పొరపాటును ఒక్కసారి అనుభవం చేసుకున్నాక ఇక తర్వాత అనుభవజ్ఞులుగా అయి దానిని బాగా రియలైజ్ చేసుకొని, అది మళ్ళీ జరుగకుండా జాగ్రత్త పడినా ఉన్నతి జరుగగలదు. ఆ సమయంలో ఇది పొరపాటు, ఇది రైటు అని అర్ధమవుతుంది, కానీ అదే పొరపాటు మళ్ళీ జరుగకుండా ఉండేందుకు మీతో మీరు బాగా రియలైజ్ చేసుకోవాలి. అందులో కూడా ఇంతగా ఫుల్ పర్సెంట్ లో పాస్ అవ్వరు మరియు మాయ చాలా చతురమైనది. ఉదాహరణకు మీలో సహనశక్తి తక్కువగా ఉన్నదనుకోండి, ఏ విషయంలోనైతే మీరు సహనశక్తిని ఉపయోగించాలో ఆ విషయమును గూర్చి మీరు రియలైజ్ చేసుకున్నాక, మాయ మళ్ళీ కాస్త రూపాన్ని మార్చి మీ ముందుకు వస్తుంది. విషయం అదే కానీ ఈనాటి ప్రపంచంలో పాత వస్తువునే ఏ విధంగా పాలిష్ చేసి కొత్త దానికన్నా కొత్తగా చూపిస్తారో అలా మాయ కూడా ఆ పాత విషయాన్నే బాగా పాలిష్ చేసి తీసుకువస్తుంది. దాని వెనుక ఉన్న రహస్యం అదే ఉంటుంది. ఉదాహరణకు మీకు ఈర్ష్య వస్తే ఆ ఈర్ష్య కూడా భిన్న, భిన్న రూపాలలో ఉంటుంది. ఒక్క రూపములో ఉండదు. కావున బీజము ఈర్ష్యదే ఉంటుంది కానీ అది వేరే రూపములో వస్తుంది. అదే రూపములో రాదు. కావున, ఇంతకుముందు వచ్చిన విషయం అది కదా! ఇదైతే వేరుగా ఉంది కదా! అని ఎన్నోసార్లు ఆలోచిస్తారు కానీ బీజము అదే ఉంటుంది. కేవలం రూపమే పరివర్తితమవుతుంది. అందుకొరకు ఏ శక్తి కావాలి? పరిశీలించే శక్తి. ఇందుకు బాప్ దాదా రెండు విషయాల యొక్క అటెన్షన్ ను ఉంచండి అని ఇంతకుముందు కూడా చెప్పారు. ఒకటేమో - సత్యమైన హృదయం, సత్యత. లోపల ఉంచుకోకండి. లోపల ఉంచుకుంటే ఏమవుతుంది? గ్యాస్ బుగ్గ నిండిపోతుంది మరియు చివరికి అది ఏమవుతుంది? పగిలిపోతుంది కదా! కావున సత్యమైన హృదయాన్ని ఉంచండి. పోనీ ఆత్మల ముందు కొంత సంకోచం కలిగితే, నన్ను ఏ దృష్టితో చూస్తారో? అని సిగ్గు కలిగితే, సత్యమైన హృదయంతో బాప్ దాదాల ముందు లోపాన్ని అర్ధం చేసుకుంటూ ఈ పొరపాటు జరిగింది అని చెప్పండి. ఏదో నామమాత్రంగా ఈ పొరపాటు జరిగింది అని బాప్ దాదాకు చెప్పేసాను అని భావించడం కాదు. నాచే పొరపాటు జరిగిపోయింది అని ఆర్డర్ చేసినట్లుగా చెప్తారు కదా! అలా కాదు, లోపాన్ని అర్ధం చేసుకుంటూ సత్యమైన హృదయంతో బాప్ దాదా ముందు హృదయపూర్వకంగా అంగీకరించినట్లయితే కేవలం వివేకంతో కాదు, హృదయపూర్వకంగా అంగీకరించినట్లయితే మనస్సు ఖాళీ అయిపోతుంది మరియు చెత్త సమాప్తమైపోతుంది. మీ హృదయంలో చిన్న, చిన్న విషయాలు పోగవుతూ, పోగవుతూ వాటి వల్ల హృదయం భారీ అయిపోతుంది కదా! విషయాలు చిన్న, చిన్నవే ఉంటాయి, అవేవీ పెద్దగా ఉండవు కానీ ఖాళీగా అయితే ఉండదు కదా! కావున హృదయం ఖాళీగా లేకపోతే మరి అందులో హృదయరాముడు ఎలా కూర్చోగలడు? కూర్చునే స్థానమైతే ఉండాలి కదా! లేక అక్కర్లేదా? కావున సత్యమైన హృదయంపై తండ్రి రాజీ అవుతారు. బాబా, ఎలా ఉన్నామో అలా మేము మీకు చెందినవారము. నెంబర్ వారీగా అయితే అవ్వవలసిందేనని బాప్ దాదాకు కూడా తెలుసు. కావున వారు ఆ దృష్టితో మిమ్మల్ని చూడరు. కావున సత్యమైన హృదయం ఉండాలి. ఇంకొకటి సదా బుద్ధి యొక్క లైన్ క్లియర్ గా ఉండాలి. లైన్ లో డిస్ట్రబెన్స్ ఉండకూడదు, కటాఫ్ అవ్వకూడదు.

బాప్ దాదా సమయానుసారముగా ఎక్స్ ట్రా శక్తిని, దీవెనలను, ఎక్స్ ట్రా సహాయాన్ని ఏదైతే ఇవ్వాలనుకుంటారో అది లభించజాలదు. లైన్ క్లియర్ గానే లేకపోతే, క్లీన్ గా లేకపోతే, కటాఫ్ అయిపోతే ఏ ప్రాప్తి అయితే లభించాలో అది లభించదు. కొంతమంది పిల్లలు ఇలా అనరు కానీ మనస్సులో ఆలోచిస్తారు. కొందరు ఆత్మలకు ఎంతో సహయోగం లభిస్తుంది. బ్రాహ్మణుల సహయోగమూ లభిస్తుంది, పెద్దవారిదీ లభిస్తుంది, బాప్ దాదాలదీ లభిస్తుంది, కానీ మాకు తక్కువగా లభిస్తుంది. కారణమేమిటి? అని భావిస్తారు. బాబా అయితే దాత, సాగరుడు. ఎవరు ఎంతగా తీసుకోవాలనుకుంటే అంతగా తీసుకోవచ్చు. వారి వద్ద తాళాలు, తాళంచెవులు ఏవీ లేవు. కాపలాదారులూ లేరు. బాబా అని అనగానే జీ హాజర్ అంటారు. కావున బాబా తీసుకోండి అనే అంటారు. వారు దాత కదా! వారు దాత మరియు సాగరుడు. మరి లోటేముంటుంది? కావున సత్యమైన హృదయం, స్వచ్ఛమైన హృదయం - ఈ రెండూ ఉండాలి. చతురత చేయకండి. చతురత ఎంతో చేస్తారు. రకరకాల చతురతలు కూడా చేస్తారు. స్వచ్ఛమైన హృదయం, సత్యమైన హృదయం మరియు బుద్ధి యొక్క లైన్ సదా క్లియర్ గా మరియు క్లీన్ గా ఉంటోందా? అని పరిశీలించుకుంటూ ఉండండి. ఈ రోజుల్లోని సైన్స్ సాధనాలను కూడా చూస్తున్నారు కదా! కాస్త డిస్ట్రబెన్స్ ఉన్నా అది క్లియర్ గా ఉండనివ్వదు, కావున ఇది తప్పకుండా చేయండి. 

ఇంకొక విషయం - ఇది సీజన్ యొక్క లాస్ట్ టర్న్ కదా! కాబట్టి చెబుతున్నారు. ఇది డబుల్ విదేశీయుల కొరకే కాదు, ఇది అందరి కొరకు. ఈ లాస్ట్ టర్న్ లో మీరు ముందు ఉన్నారు కాబట్టి మీకే చెప్పవలసి ఉంటుంది కదా! బాప్ దాదా గమనించిందేమిటంటే, నేచర్ అయితే ప్రతి ఒక్కరికీ తమతమది ఉంటుంది, కానీ సర్వుల యొక్క స్నేహులుగా మరియు సర్వ విషయాలలో, సంబంధాలలో సఫలులుగా ఉండడం, మనస్సులో విజయము మరియు మధురత మొదలైనవి ఎప్పుడైతే ఈజీ నేచర్ ఉంటుందో అప్పుడే వస్తాయి. నిర్లక్ష్యముతో కూడుకున్న నేచర్ కాదు, నిర్లక్ష్యము వేరే విషయం. సమయాన్ని బట్టి, వ్యక్తిని బట్టి, పరిస్థితులను బట్టి వాటిని పరిశీలిస్తూ స్వయాన్ని ఈజీగా చేసుకోగలగడమే ఈజీ నేచర్. ఈజీ అనగా కలుపుకోలుగా ఉండడం. టైట్ నేచర్, టూమచ్ అఫీషియల్ కాదు. అఫీషియల్ గా ఉండడం మంచిదే కానీ టూమచ్ గా ఉండకూడదు. సమయానుసారముగా ఎవరైనా అఫీషియల్ గా మారిపోతే అది గుణానికి బదులుగా వారి విశేషత ఆ సమయంలో విశేషతగా కనిపించదు. స్వయాన్ని మలచుకోగలగాలి. కలుపుగోలుగా ఉండగలగాలి. చిన్నవారైనా లేక పెద్దవారైనా, పెద్దవారితో పెద్దగా నడవాలి, చిన్నవారిగా చిన్నవారిగా నడవగలగాలి. తోటివారితో తోటివారిగా నడవగలగాలి, పెద్దవారితో గౌరవపూర్వకముగా నడువగలగాలి, ఈజీగా మలచుకోగలగాలి. శరీరాన్ని కూడా ఈజీగా ఉంచుకుంటే అది ఎటు కావాలనుకుంటే అటు తిరగగలుగుతుంది, టైట్ గా ఉంటే తిరుగలేదు. నిర్లక్ష్మముగా కూడా కాదు. ఈజీగా ఉండాలి. ఒక్కోసారి ఈజీగా, ఇంకొకసారి నిర్లక్ష్యులుగా కూడా కాదు. బాప్ దాదా ఈజీగా అయిపోమన్నారు కదా! కావున మేము ఈజీగా అయిపోయాము అంటూ అలా చేయకండి, ఈజీ నేచర్ అనగా సమయాన్ని బట్టి అటువంటి స్వరూపాన్ని తయారుచేసుకోగలగాలి. అచ్చా! డబుల్ విదేశీయులకు మంచి అవకాశం లభించింది. మధువనం వారికి కూడా ఈ సీజన్లో అవకాశం లభించలేదు కానీ విదేశీయులకైతే రెండు అవకాశాలు లభించాయి. ప్రియమైనవారయ్యారు కదా! బాప్ దాదాకు కూడా డబుల్ విదేశీయులు ప్రియమనిపిస్తారు, ఎందుకంటే ధైర్యాన్ని ఉంచి ముందుకు వెళుతున్నారు. మంచి ధైర్యాన్ని ఉంచుతున్నారు. మీరు ధైర్యం కలవారే కదా? కన్ఫ్యూజ్ అయ్యే వారైతే కాదు కదా! మీరు కన్ఫ్యూజ్ అవుతారా? చిన్న చిన్న విషయాల్లో కన్ఫ్యూజ్ అవుతారా? అవుతాము అని అనడం లేదు. ఇంతకుముందు చాలా కన్ఫ్యూజ్ అయ్యేవారు. ఇప్పుడు తేడా ఉంది అని బాప్ దాదా గమనించారు. మంచి ధైర్యాన్ని ఉంచుతున్నారు మరియు ధైర్యం ఉన్న కారణముగా బాప్ దాదా యొక్క సహాయం కూడా ఉంది. తేడా అయితే ఉంది కదా! ఇంతకుముందుకు, ఇప్పటికీ తేడా ఉంది కదా! ఇప్పుడు కథలు తక్కువవుతున్నాయి కదా! క్లుప్తముగా చెప్పండి, విషయాలను సాగదీయకండి. తప్పకుండా చెప్పండి. మనస్సులో పెట్టుకోకండి, కానీ క్లుప్తంగా చెప్పండి. ఎక్కువ విస్తారమునేదైతే 10 శబ్దాలలో చెబుతారో వాటిని క్లుప్తంగా చేసి రెండు, మూడు శబ్దాలలో చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకా పెరగవలసిందే ఉంది కదా! ఇప్పుడు కూడా చూడండి. పెరిగిపోయారు కదా! డబుల్ ఫారినర్స్ యొక్క సంఖ్య పెరిగిపోయింది కదా! ఇంకా పెరగవలసిందే. కావున ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటారో అప్పుడు తప్పకుండా షార్ట్ చేయవలసి ఉంటుంది కదా! అయినా ఎంతో స్వచ్ఛమైన హృదయంతో కూడా ఉంటారు, ఏమీ దాచుకోరు, కానీ కొద్దిగా కూడా స్వభావ సంస్కారాల యొక్క, మాటలు, మనసా సంకల్పాల యొక్క పాత చెత్త కొద్దిగా కూడా ఉండకుండా ఉన్నవారినే బాప్ దాదా స్వచ్ఛమైన హృదయులు అని అంటారు. భారతవాసీయులైనా లేక డబుల్ విదేశీయులైనా ఎవరు వచ్చి కలిసినా అందరూ కేవలం లైన్లో వచ్చి ఓకే, ఓకే అనగలిగే అటువంటి రోజు ఎప్పుడు వస్తుంది? అటువంటి రోజు వస్తుందా? మీరందరూ ఒక్కొక్క క్షణము దృష్టి తీసుకుంటూ వెళతాము అని అప్లికేషన్ ఇచ్చారు కదా! ఈ రోజు మీ ఆశను పూర్ణం చేస్తాము కానీ మీరు అటువంటి రోజును కూడా తీసుకురావాలి. దాదీల వద్ద కానీ లేక బాప్ దాదా ముందు కానీ ఇలాగ లైన్లో అందరూ హృదయపూర్వకముగా ఓ.కే. అనగలగాలి, ఇది జరుగగలదా? కుమారులు - జరుగగలదా? (పూర్తి సభను అడిగారు). కావున ఈ శుభవార్త చాలా మంచిది. ఇది ఎప్పుడు జరుగుతుంది? మళ్ళీ ఎప్పుడు... అన్న ప్రశ్న వస్తుంది. చెప్పండి, మీరు చెప్పండి. పెద్ద అన్నయ్యలు ఎవరైతే ఉన్నారో వారు చెప్పండి. ఆరోజు ఎప్పుడు? (ఇప్పుడు) అచ్చా - బాప్ దాదా సమయమిస్తున్నారు. ఇప్పుడు అని అంటే, నాలో ఈ విషయం ఉంది కదా! ఇది తీసేసుకొని వస్తాము అని ఆలోచిస్తారు. కానీ, రాబోయే సీజన్లో ఇటువంటి లైన్ రావాలి. 6 నెలలు, 8 నెలలలైతే ఉన్నాయి. ఇది మంజూరేనా? మనఃపూర్వకముగా ఓ.కే. అనాలి, అంతేకానీ ఓ.కే.. ఓకే అంటూ వెళ్ళకూడదు. కుమారులలో ఎవరైతే తయారుగా ఉన్నారో వారు చేతులెత్తండి. సగం తయారుగా ఉన్నారు, సగం లేరు. మరి వీరికి ఇంకెంత సమయం కావాలి? ఎవరైతే చేతులు ఎత్తలేదో వారికి ఎంత సమయం కావాలి? పూర్తి సంవత్సరం కావాలా? ఒక్క సంవత్సరంలో తయారైపోతారా? ఒక్క సంవత్సరంలో ఎవరైతే తయారైపోతారో వారు చేతులెత్తండి, అచ్చా - ఒక్క నెల కావాలా? ఎవరైతే చేతులెత్తలేదో వారు ఎంత సమయం కావాలో చీటీ రాసి ఇవ్వండి, సరేనా? అచ్చా - అక్కయ్యలు తయారుగా ఉంటే చేతులెత్తండి. అచ్చా! ఎవరైతే ఇప్పుడే తయారుగా ఉన్నాము అని అంటారో వారు చేతులెత్తండి. (బాప్ దాదా సర్టిఫికెట్ ఇస్తే) బాప్ దాదా అయితే మాల వేసేస్తారు. మాల వేయాలి కదా! ఫారిన వారు పాస్ విత్ ఆనర్ గా అయిపోతే మాలలోకి అయితే వచ్చేస్తారు కదా! అప్పుడు మాల త్వరగా తయారైపోతుంది. పక్కాగా ఉన్నారు కదా! కచ్చాగా అవ్వకండి! అచ్చా! ఎవరైతే ధైర్యమును ఉంచుతారో వారికి సహాయం తప్పకుండా లభిస్తుంది. చూడండి, మీరు ఎవరినైతే దాదీలు అని అంటారో వారు దాదీలుగా ఎలా అయ్యారు? వారు ధైర్యమును ఉంచారు మరియు మేము చేయవలసిందే, అవ్వవలసిందేనన్న ప్రతిజ్ఞను పక్కాగా చేసారు. కావున ఈ రోజు దాదీల యొక్క లిస్టులో ఉన్నారు కదా! కావున డబుల్ విదేశీయులను 108 మాలలో ముందు ఉంచుతారు. మరి తయారైపోండి. విజయమాలలోకి వచ్చే మణుల యొక్క సెర్మనీని చేస్తారు. ఎవరైనా రండి, కేవలం ముందు కూర్చునేవారు కాదు, ఎవరైనా రావచ్చు. బాప్ దాదా సెర్మనీ చేస్తారు. విజయీ రత్నాలు అని అంటారు. ముందున్నవారు అందరూ వస్తారు కదా! రావాలి కదా! ఎందుకు రాము, మేము రాకపోతే ఇంకెవరు వస్తారు? అని అనండి, నషా ఉంచండి. నిశ్చయం ఉంచినట్లయితే అదేమంత పెద్ద విషయం? బాబాకు చెందినవారిగా అయితే అయిపోయారు కదా! ఇప్పుడు తిరిగి వెళ్ళేది అయితే లేదు. తిరిగి వెళ్ళినా, ఈ ప్రపంచానికి చెందినవారిగానూ ఉండరు, అలాగే ఆ ప్రపంచానికి చెందినవారిగానూ ఉండరు కావున తిరిగి వెళ్ళేది అయితే లేదు. ముందుకే వెళ్ళాలి. ప్రపంచమే బాబా అయిపోయినప్పుడు ఇక ఉన్నది ఏమిటి? బాప్ దాదాకు డబుల్ ఫారినర్స్ పై ఎంతో శ్రేష్ఠమైన ఆశలు ఉన్నాయి. డబుల్ విదేశీయుల నుండి లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట యొక్క లిస్ట్ కి వచ్చే ఇటువంటి రత్నాలు వెలువడతారు అన్న ఆశ ఉంది. భారతదేశం వారూ వస్తారు. కానీ ఈ రోజు డబుల్ విదేశీయులు ముందు కూర్చున్నారు కాబట్టి వారితో చెబుతున్నారు. లాస్ట్ సో ఫాస్ట్ మరియు ఫస్ట్, మరి ఎంత అద్భుతమవుతుంది! అది అవ్వవలసిందే. కేవలం ఎవరు ముందుకు వస్తారో వారు ప్రత్యక్షమవుతారు. అలా జరుగవలసిందే. సెంటర్ నివాసులు ఏమి భావిస్తున్నారు? ఫాస్ట్ గా వస్తారా? చాలా మంచిది.

ధైర్యం ఉంచేవారు తప్పకుండా విజయులుగా అవ్వవలసిందేనని బాప్ దాదాకు ఎంతో సంతోషంగా ఉంది. అవుతుందా, అవ్వదా అని కాదు. అవ్వవలసిందే. కుమారులకు ఇటువంటి విశ్వాసం తమపై ఉందా? అందరికన్నా ఎక్కువ దూరదేశం నుండి ఎవరు వచ్చారు? ఎక్కువ దూరదేశ్ బాప్ దాదాయా లేక మీరా? మీరు మేము చాలా దూరం నుండి వచ్చాము అని అన్నాకానీ బాప్ దాదా కన్నా దూరంగా అయితే ఎవరూ లేరు. మరి సంతుష్టముగా ఉందా? డబుల్ విదేశీయులు సంతృప్తి చెందారా? స్పెషల్‌గా కలుసుకున్నారు. సంతోషమేనా? ఇది జరిగింది, ఇది జరుగలేదు అని అయితే అనరు కదా, అచ్ఛా!

ఇక్కడ కూర్చున్న భారతవాసీయులు చేతులెత్తండి, మధువనంవారు చేతులెత్తండి! మధువనం వారు తెలివైనవారు.

తమకు టోలీ లభించలేదని మధువనం వారి ఫిర్యాదు వచ్చింది. ఈ సీజన్లో మీరు బాప్ దాదా ద్వారా దిల్‌కుష్ మిఠాయిని తినండి అని బాప్ దాదా అంటారు. మధువనం వారు, శాంతివనం వారు, జ్ఞానసరోవరం వారు, హాస్పిటల్ వారు... కంప్లయింట్లు ఏవీ ఉండవు అన్న వీరందరి యొక్క ప్లాన్ బాప్ దాదా వద్ద ఉంది. మధువనం వారినైతే సంతోషపెట్టాలి కదా, లేకపోతే మీరు ఎలా వస్తారు? వారి మొదటి భాగమైతే మొదటే ఉంటుంది. నలువైపులా ఎంతో కష్టపడతారు, కావున ఆ శ్రమకు ప్రత్యక్ష ఫలితమైతే లభించవలసిందే. కేవలం సమయం లేదు, లేకపోతే బాప్ దాదా అయితే మొదట మధువన నివాసులనే గుర్తు చేస్తారు. అన్నింటి కన్నా కొత్త దేశాలు ఏవి వచ్చాయి? మొదటిసారి వచ్చిన దేశాలు ఏవి? 

(అరేబియన్ వైపు నుండి కువైట్, కురుసా, ఈజిప్ట్) అభినందనలు. ఏ పరివారములోనైనా కొత్త పిల్లలు జన్మిస్తే అభినందనలు చెబుతారు. మీ పరివారములో కూడా వీరు కలిసారు, ఈ సంతోషం ఉంది కదా!

అచ్చా - ముందు సెంటర్లలో ఉండేవారు కూర్చున్నారు, చేతులెత్తండి! సెంటర్లలో ఉండేవారైతే పక్కాగా ఉన్నారు కదా! ఈ స్టాంపు వేసుకున్నారు కదా! ఆల్మైటీ గవర్నమెంట్ ద్వారా 'సదా పక్కా' అన్న ఈ స్టాంప్ వేయబడింది కదా! వేయబడిందా లేక ఏదో మామూలుగా ఉందా? అది చెరిగిపోయేదిగా ఉందా? అలాగైతే లేదు కదా! సెంటర్లలో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారు మేము అంతిమం వరకూ బాప్ దాదాతో తోడుగా ఉంటాము మరియు తోడుగానే వెళతాము అని భావిస్తున్నారా? ఇప్పుడు తోడుగా ఉంటారు, తర్వాత తోడుగా వెళతారు. ఇలా ఉంటే చేతులెత్తండి. టి.వి. తీయండి. మీ ఫోటోలను బాప్ దాదా వతనములో అలంకరించి ఉంచుతారు. చాలా బాగుంది! ముందే అంతిమంవరకూ అభినందనలు. బాగుంది కదా! తోటివారు ఒక్కరు కిందకూ, పైకీ అయినా అది బాగోదు కదా! మరి అందరూ తోడుగా నడుచుకుంటారా? ముందుకూ, వెనక్కూ వెళ్ళకండి. కలిసి వెళదాము. ఇప్పుడూ తోడుగా ఉందాము, సేవలోనూ తోడుగా ఉందాము మరియు మన ఇంటికి కూడా కలిసే వెళదాము మరియు రాజ్యములో బ్రహ్మా బాబాతో కలిసి ఉంటారు. పక్కాయే కదా! ఏమవుతారు? సఖులుగా అవుతారు కదా! కృష్ణుని సఖులుగా అవుతారా? (సోదరిగా అవుతాము) మంచిదే కదా! (బాబా వ్యక్తిగతంగా ముందు ఉన్నవారిని అడుగుతున్నారు) ఇక్కడ తోడుగా ఉన్నట్లయితే తప్పకుండా అక్కడ కూడా తోడుగా ఉంటారు. బాబా హామీనిస్తున్నారు. ఇక్కడ ఉన్నట్లయితే అక్కడ కూడా గ్యారంటీయే. వీరందరూ తోడుగా ఉంటారా లేక దూరదూరంగా ఉంటారా? అప్పుడప్పుడూ కలుసుకునేందుకు వస్తారా? శ్రీకృష్ణునితో పాటు చదువుకోవడం, నాట్యం చేయడం, కలిసి విహరించడం... పాండవులు కూడా రాస్ చేస్తారా లేక కేవలం అక్కయ్యలే చేస్తారా? ఇరువురికీ అవకాశం ఉంది. ఎవరు కావాలనుకుంటే వారు చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడింకా సీట్ సెట్ అవ్వలేదు కేవలం రెండు సీట్లే ఫిక్స్ అయ్యాయి, 3, 4 నుండి ఖాళీగా ఉన్నాయి. ఎనౌన్స్ అవ్వలేదు. మీరూ నెంబర్ తీసుకోవచ్చు. అచ్చా - కుమారులు బట్టీ బాగా చేసారా? టీచర్ ఎవరు?

(విదేశీయుల యూత్ రిట్రీట్ జ్ఞానసరోవరంలో జరిగింది). అచ్చా - అందరినీ చూసి అందరి కన్నా ఎక్కువగా ఎవరికి సంతోషం కలుగుతుంది? బాప్ దాదాకైతే కలుగుతుంది. ఆ తర్వాత ఇంకెవరికి? ప్రతి ఒక్కరూ నాకు అని అంటారు. చాలా బాగుంది, దాదీలకు చాలా సంతోషం ఉంది. వారిని అలసిపోయేలా చేయడం లేదు కదా! దాదీలకు ఎక్కువ సంతోషం కలుగుతుందా, లేక మీకు ఎక్కువ సంతోషం కలుగుతుందా? (దాదీలకు కలుగుతుంది) అచ్ఛా- ఇప్పుడు డబుల్ విదేశీయులను వ్యక్తిగతంగా కలుసుకున్నారు కదా! చిట్ చాట్ కూడా చేసారు, దూరంగా కూర్చున్నా సమీపముగా ఉన్నారు.

టీచర్లు ఎందరో ఉన్నారు. బాగుంది. డబుల్ పాత్రను అభినయిస్తున్నారు. డబుల్ పాత్రను అభినయించేవారికి డబుల్ సహాయం లభిస్తుంది. ధైర్యం బాగుంది, అచ్చా!

అందరికీ డ్రిల్ గుర్తుందా లేక మరచిపోయారా? ఇప్పుడు అందరూ ఈ డ్రిల్ ను చేయండి. ఒక్కసారి చుట్టి రండి, అచ్చా - నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ ఆత్మలకు, నలువైపుల నుండి ప్రియస్మృతులను, సమాచారాన్ని పంపినవారికి, చాలా మంచి భిన్న, భిన్న సంబంధాలతో స్నేహపూరిత పత్రాలను మరియు తమ స్థితిగతులను వ్రాసారు, సేవా సమాచారాన్ని తమ ఉల్లాసాన్ని ప్లాన్లను చాలా, చాలా బాగా వ్రాసారు, అవన్నీ బాప్ దాదాకు లభించాయి. ఏ ప్రేమతో, శ్రమతోనైతే వ్రాసారో, ఎవరెవరైతే వ్రాసారో వారు ప్రతి ఒక్కరూ తమ, తమ పేరున బాప్ దాదా యొక్క, మనోభిరాముని యొక్క హృదయాంతరాళము నుండి ప్రియస్మృతులను స్వీకరించండి. పిల్లలకు బాబా పైన ఎంతో ప్రేమ దానికి కొన్ని కోట్లరెట్లుగా బాబాకు పిల్లలపై ప్రేమ ఉంది మరియు సదా అమరముగా ఉంది. స్నేహీ పిల్లలు బాబా నుండి వేరవలేరు. అలాగే బాబా పిల్లల నుండి వేరవ్వలేరు. తోడుగా ఉన్నారు మరియు తోడుగానే ఉంటారు.

నలువైపులా ఉన్న సదా స్వయాన్ని బాబా సమానముగా తయారుచేసుకునే వారికి, సదా బాబాకు సమీపముగా నయనాలలో, హృదయములో, మస్తకములో సమీపముగా ఉండేవారికి, సదా ఒక్క బాబా యొక్క ప్రపంచములోనే ఉండేవారికి, సదా ప్రతి అడుగులోనూ బాప్ దాదాను అనుసరించేవారికి, సదా విజయులుగా ఉన్నాము, ఇప్పుడూ ఉన్నాము మరియు విజయులుగానే ఉంటాము అన్న ఇటువంటి నిశ్చయము మరియు నషాలో ఉండేవారికి, ఇటువంటి అతి శ్రేష్ఠమైన, చాలాకాలం తర్వాత కలిసిన ప్రియాతిప్రియమైన పిల్లలందరికీ బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే,

(దాదీజీ మరియు జానకీ దాది బాప్ దాదాను హృదయానికి హత్తుకున్నారు. అందరూ సంతోషిస్తున్నారు కదా! లేక మేము కూడా దాదీలుగా అయితే బాగుండేది అని భావిస్తున్నారా? అందరి ప్రేమా బాగుంది, ఇదే దీవెనలను ఇస్తుంది. ప్రేమ ఉంది కావుననే అందరికీ సంతోషం కలుగుతుంది. సంతోషంగా ఉండండి. ఎప్పుడూ మూడ్ ఆఫ్ చేసుకోకండి. సదా ఏకరసమైన, సంతోషమయమైన ముఖము ఉండాలి. ఎవరు చూసినా వారికి ఆత్మిక సంతోషము యొక్క అనుభూతి కలగాలి. ఇది సేవ యొక్క సాధనము. ముఖముపై ఆత్మిక సంతోషము ఉండాలి. సాధారణమైన సంతోషము కాదు, ఆత్మిక సంతోషము ఉండాలి. ముఖం మారకూడదు, స్థితి ఏ విధంగా అయితే ఏకరసంగా ఉండాలో అలాగే ముఖమూ ఏకరసంగా ఉండాలి. అలా జరుగగలదా? ఏకరసమైన మూడ్ ఉండగలదా? అలా ఉండగలదా? ఉండదా? ఇప్పుడు అలా ఉంటోంది కదా! ఎప్పుడైనా, ఎవరైనా అకస్మాత్తుగా మిమ్మల్ని ఫోటో తీస్తే ఇంకే ఫోటో రాకూడదు, ఆత్మిక మందహాసంతో కూడుకున్న ఫోటోయే రావాలి. పనులు చేసుకుంటున్నా సేవ యొక్క టెన్షన్ ఎంతగా ఉన్నా కానీ ముఖముపై సంతోషము ఉండాలి. అప్పుడు మీరు ఎక్కువగా కష్టపడవలసిన అవసరమూ ఉండదు. ఒక గంట చెప్పేందుకు బదులుగా మీ ముఖము ఆత్మిక మందహాసంతో కూడుకొని ఉన్నట్లయితే ఒక్క గంట చెప్పడం ద్వారా జరిగే సేవ అది ఒక్క క్షణములో చేస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా ఉండేదానికి ప్రమాణాన్ని ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఎవరు కలుసుకున్నా, ఎలా కలుసుకున్నా, తిట్టేవారు కలుసుకున్నా, ఇన్సల్ట్‌ చేసేవారు కలుసుకున్నా, గౌరవం ఉంచనివారు కలుసుకున్నా, గౌరవమర్యాదలు ఇవ్వనివారు కలుసుకున్నా మీ ముఖం మాత్రం ఏకరసంగా, ఆత్మిక మందహాసంతో ఉండాలి, ఇది జరుగగలదా? కుమారులు చెప్పండి. జరుగగలదా? పాండవులూ జరుగగలదా? తద్వారా ఇతర పురుషార్థము నుండి సురక్షితులవుతారు. శ్రమ ఏమీ ఉండదు. నేను ఆత్మిక మందహాసంనే ఉంచాలి. ఏమి జరిగినా కానీ నేను నా సంతోషాన్ని వదలకూడదు అని దృడముగా ఉండాలి, ఇది జరుగగలదా? ఆలోచిస్తున్నారు. (చేసి చూపిస్తాము) చాలా మంచిది. అభినందనలు. ఎవరైతే ముందు కూర్చున్నారో వారు చేసి తీరవలసిందే. బాగుంది కదా - స్వయమూ సంతోషిస్తారు మరియు ఇతరులు కూడా సంతోషిస్తారు. ఇంకేమి కావాలి? బాప్ దాదాలైతే సంతోషముగానే ఉంటారు. దాదీలు కూడా సంతోషిస్తారు.

బాబా, మీరు ఇలాగే కలుసుకుంటూ ఉండాలి. కలుసుకోకపోతే సంతోషం మాయమైపోతుందా? మీరు సదా ఆత్మికమందహాసంతో ఉండాలి, బాబా కలుసుకుంటూ ఉంటారు.చాలా బాగుంది.

Comments