30-03-1999 అవ్యక్త మురళి

             30-03-1999         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

తీవ్ర పురుషార్థం చేయాలనే లగ్నాన్ని జ్వాలా రూపంగా చేసుకొని అనంతమైన వైరాగ్య అలను వ్యాపింపజేయండి.

ఈ రోజు బాప్ దాదా ప్రతీ పుత్రుని మస్తకంపై మూడు రేఖలను చూస్తున్నారు. అందులో ఒక రేఖ - పరమాత్మ పాలన యొక్క భాగ్య రేఖ. ఈ పరమాత్మ పాలనా భాగ్యం మొత్తం కల్పంలో ఇప్పుడు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఈ సంగమ యుగంలో తప్ప ఈ పరమాత్మ పాలన మరెప్పుడూ ప్రాప్తించదు. ఈ పరమాత్మ పాలన చాలా కొద్దిమంది పిల్లలకు ప్రాప్తిస్తుంది. రెండవ రేఖ - పరమాత్మ చదువు యొక్క భాగ్య రేఖ. పరమాత్మ చదువు ఎంత గొప్ప భాగ్యము! స్వయం పరమాత్మయే శిక్షకులై చదివిస్తున్నారు. మూడవ రేఖ - పరమాత్మ ప్రాప్తుల రేఖ. ఎన్ని ప్రాప్తులున్నాయో ఆలోచించండి. ప్రాప్తుల లిస్టు ఎంత పెద్దదిగా ఉందో అందరికీ జ్ఞాపకం ఉంది కదా! కావున ప్రతి ఒక్కరి మస్తకంలో ఈ మూడు రేఖలు మెరుస్తూ ఉన్నాయి. స్వయాన్ని ఇంత గొప్ప భాగ్యవంతులుగా భావిస్తున్నారా? పాలన, చదువు మరియు ప్రాప్తులు. వీటితో పాటు బాప్ దాదా పిల్లల నిశ్చయం ఆధారంపై వారి ఆత్మిక నషాను కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్క పరమాత్మ పుత్రుడు ఎంత ఆత్మిక నషా కలిగిన ఆత్మగా ఉన్నారు! మొత్తం విశ్వంలో మరియు మొత్తం కల్పంలో అందరికంటే హైయెస్ట్ గానూ, మహోన్నతంగా కూడా ఉన్నారు. అంతేకాక పవిత్రంగా కూడా ఉన్నారు. దేహంతోనూ, మనసుతోనూ పవిత్రంగా ఉండే మీలాంటి ఆత్మలు దేవతా రూపంలో సర్వ గుణ సంపన్నులుగా, సంపూర్ణ నిర్వికారులుగా అవుతారు. అలా ఇంకెవ్వరూ తయారు కాలేరు అంతేకాక మీరు హైయెస్ట్, హెలీయెస్ట్  పాటు రిచ్చెస్ట్ గా కూడా ఉన్నారు. బాప్ దాదా స్థాపనా సమయంలో కూడా పిల్లలకు ఈ స్మృతినిప్పించేవారు. నషాతో "ఓంమండలి ప్రపంచంలో కల్లా ధనవంతము" అని వార్తాపత్రికల్లో కూడా వేయించారు. ఇది స్థాపనా సమయంలో మీ అందరి మహిమ. ఒక్క రోజులో గొప్పకంటే గొప్ప మల్టీ మల్టీ మిలినియర్ కావచ్చు కానీ మీలాంటి ధనవంతులు ఇంకెవ్వరూ కాలేరు. ఇంత గొప్ప ధనవంతులుగా కావడానికి సాధనం ఏమిటి? చాలా చిన్న సాధనం మానవులు ధనవంతులుగా కావడానికి ఎంతో శ్రమ చేస్తారు కానీ మీరు ఎంత సహజంగా సంపన్నంగా అవుతూ వెళతారు! సాధనం ఏమిటో తెలుసా! కేవలం చిన్న బిందువు పెట్టడం అంతే. బిందువు పెట్టారు అనగా సంపాదన జరిగినట్లే. ఆత్మా బిందువే, తండ్రి కూడా బిందువే. డ్రామా అని ఫుల్ స్టాప్ పెట్టడం కూడా బిందువే కావున బిందువైన ఆత్మను గుర్తు చేయగానే సంపాదన పెరిగిపోతుంది. అలాగే లౌకికంలో కూడా చూడండి బిందువుతోనే సంఖ్య విలువ పెరుగుతుంది. ఒకటి తర్వాత బిందువు ఉంచితే ఏమవుతుంది? 10 అవుతుంది, రెండు బిందువులు పెట్టండి, 3 బిందువులు పెట్టండి, నాలుగు బిందువులు పెట్టండి, సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కావున మీ సాధనం ఎంత సహజంగా ఉంది. “నేను ఆత్మను" - ఈ స్మృతి యొక్క బిందువు పెట్టడం అనగా ఖజానా జమా అవ్వడం తర్వాత “బాబా" అని బిందువు పెట్టండి. ఖజానా ఇంకా జమ అవుతుంది. కర్మలో సంబంధ-సంపర్కములో డ్రామా అని ఫుల్‌స్టాప్ పెట్టారు, గతించిన దానికి ఫుల్ స్టాప్ పెట్టారు ఖజానా ఇంకా పెరుగుతుంది. కావున రోజంతటిలో ఎన్నిసార్లు బిందువు పెడతారో చెప్పండి మరియు బిందువు పెట్టడం ఎంత సహజం! కష్టమా? బిందువు జారిపోతుందా ఏమిటి!

బాప్ దాదా సంపాదించుకోవడానికి సాధనం కేవలం బిందువు పెడుతూ వెళ్లండి అని నేర్పించారు. కావున అందరికీ బిందువు పెట్టడం వస్తుందా? ఒకవేళ వచ్చినట్లయితే ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. పక్కాగా ఉన్నారు కదా! లేక అప్పుడప్పుడు జారిపోతూ అప్పుడప్పుడు బిందువు అతుక్కుంటూ ఉందా? అన్నింటికంటే సహజం బిందువు పెట్టడం ఈ కళ్లు లేని గ్రుడ్డివారు కావచ్చు, పేపరు పైన పెన్సిల్ ఉంచినట్లయితే వారు కూడా బిందువు పెట్టగలరు అంతేకాక మీరు స్వయంగా త్రినేత్రులు అందువలన ఈ మూడు బిందువులను సదా ఉపయోగించండి. ప్రశ్నార్థకం ఎంత వంకరంగా ఉంటుందో వ్రాసి చూడండి, వంకరగా ఉంది కదా. బిందువు పెట్టడం ఎంత సహజం అందువలన బాప్ దాదా భిన్న భిన్న రూపాలతో పిల్లలను తన సమానంగా తయారు చేయడానికి పద్ధతులు వినిపిస్తూ ఉంటారు. విధి లేక పద్దతి - "బిందువే” ఇంకే పద్దతీ లేదు. మీరు విదేహిగా కావాలనుకున్నా పద్దతి - "బిందువుగా అగుట.” అశరీరులుగా కండి, కర్మాతీతులుగా కండి - అన్నింటికీ పద్దతి "బిందువే” అందుకే బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు - అమృతవేళలో బాప్ దాదాతో మిలనం చేస్తున్నా, ఆత్మిక సంభాషణ చేస్తున్నా, కార్య వ్యవహారాలలోకి వస్తున్నా మొదట మూడు బిందువుల తిలకం మస్తకంలో దిద్దుకోండి. ఆ ఎర్ర తిలకం పెట్టుకోవడం కాదు, స్మృతి తిలకం పెట్టుకోండి. అంతేకాక ఏ కారణంతోనూ ఈ స్మృతి తిలకం చెరిగిపోవడం లేదు కదా! అని చెక్ చేసుకోండి. అవినాశిగా, చెరిగిపోని తిలకముగా ఉందా?

బాప్ దాదా పిల్లల ప్రేమను కూడా చూస్తున్నారు. ఎంతో ప్రేమగా పరుగు పరుగున మిలనం జరుపుకోవడానికి చేరుకుంటారు. అంతేకాక ఈ రోజు మిలనం చేయుటకు ఎంతో శ్రమతో, ఎంతో ప్రేమతో నిద్రను, దప్పికను కూడా మరచి ఫస్ట్ నంబర్ లో దగ్గరగా కూర్చునే పురుషార్థం
చేస్తారు. బాప్ దాదా అన్నీ చూస్తారు. ఏమేమి చేస్తారో ఆ డ్రామా అంతా చూస్తారు. బాప్ దాదా పిల్లల ప్రేమకు బలిహారం కూడా అవుతారు. ఎలాగైతే పిల్లలను సాకారంలో కలుసుకునేందుకు పరుగు పరుగున వస్తారో అలా తండ్రి సమానంగా అగుటకు తీవ్ర పురుషార్థం కూడా చేయమని చెప్తారు. అందరికంటే ఫస్ట్ నంబర్ సీటు లభించాలని అనుకుంటారు కదా! ఇది సాకార ప్రపంచం కదా. కనుక అందరికీ సాకార ప్రపంచంలోని నియమాలు పెట్టాల్సే ఉంటుంది. ఆ సమయంలో అందరూ ముందే కూర్చోవాలని ఆలోచిస్తారు కానీ ఇది వీలవుతుందా? ఇది జరుగుతూ ఉంది కూడా, ఎలా? వెనుక కూర్చున్నవారిని బాప్ దాదా సదా నయనాలలో ఇమిడిపోయి ఉన్నట్లు చూస్తారు. అన్నింటికంటే దగ్గర ఉన్నవి కళ్ళు కనుక మీరు వెనుక కూర్చోలేదు, బాప్ దాదా నయనాలలో కూర్చున్నారు. మీరు నా కంటి పాపలు. వెనుక కూర్చున్నవారు విన్నారా? దూరంగా లేరు సమీపంగా ఉన్నారు, శరీరంతో వెనుక కూర్చున్నారు. కానీ ఆత్మ అన్నింటికంటే దగ్గరగా ఉంది. అంతేకాక బాప్ దాదా అందరికంటే ఎక్కువగా వెనుక కూర్చున్నవారినే చూస్తారు. దగ్గరగా కూర్చునేవారికి ఈ స్థూల నేత్రాలతో చూసే అవకాశం ఉంది మరియు బాప్ దాదా అందరికంటే ఎక్కువగా వెనుక కూర్చున్నవారినే చూస్తారు. దగ్గరగా కూర్చునేవారికి ఈ స్థూల నేత్రాలతో చూసే అవకాశం ఉంది. అందువలన బాప్ దాదా వారిని నయనాలలో ఇముడ్చుకుంటారు.

బాప్ దాదా నవ్వుతూ ఉంటారు, రెండు గంటలు కాగానే లైన్లో నిలబడడం మొదలవుతుంది. పిల్లలు నిలబడి నిలబడి అలసిపోతారని బాప్ దాదా అనుకుంటారు. కానీ బాప్ దాదా పిల్లలందరిని ప్రేమతో మసాజ్ చేస్తారు. కాళ్ళకు మసాజ్ అవుతుంది. బాప్ దాదా మసాజ్ ను చూశారు కదా - చాలా అతీతంగా, ప్రియంగా ఉంటుంది. కావున అందరూ ఈ సీజన్లో చివరి అవకాశం తీసుకునేందుకు నలువైపుల నుండి పరుగులు తీస్తూ చేరుకున్నారు. బాగుంది. తండ్రితో మిలనం చేయు ఉత్సాహ-ఉల్లాసాలు సదా ముందుకు తీసుకెళ్తాయి కానీ బాప్ దాదా పిల్లలను ఒక్క సెకండు కూడా మర్చిపోరు. తండ్రి ఒక్కరు, పిల్లలు అనేకమంది ఉన్నారు. అయినా అనేకమంది పిల్లలున్నా ఒక్క సెకండు కూడా మర్చిపోరు. ఎందుకంటే మీరు అపురూపమైన పిల్లలు. ఎక్కడెక్కడ దేశ విదేశాల మూలమూలల నుండి తండ్రే మిమ్ములను వెతుక్కున్నారు. మీరు బాబాను వెతకగలిగారా? భ్రమిస్తూ ఉండినారు కానీ లభించలేదు. తండ్రి భిన్న-భిన్న దేశాలు, గ్రామాలు, పట్టణాలు ఎక్కడెక్కడ తండ్రి పిల్లలున్నారో అక్కడి నుండి వెతికి పట్టుకున్నారు. తనవారిగా చేసుకున్నారు. నేను బాబా దానిని మరియు బాబా నావారు అని పాటలు కూడా పాడారు కదా. జాతిని చూడలేదు, దేశాన్ని చూడలేదు, రంగును చూడలేదు అందరి మస్తకంపై ఒక్కటే జ్యోతిర్బిందువు అనే ఆత్మిక రంగును చూశారు. డబల్ ఫారినర్స్ ఏమనుకుంటున్నారు? తండ్రి జాతిని చూశారా? నల్లగా ఉన్నారా? తెల్లగా ఉన్నారా? అందంగా ఉన్నారా? ఏదీ చూడలేదు, నావారు అని చూశారు. కావున బాబాకు ప్రేమ ఉందా లేక మీకు ప్రేమ ఉందా చెప్పండి? ఎవరికి ఉంది?(ఇద్దరికీ ఉంది) పిల్లలు కూడా జవాబు ఇవ్వడంలో తెలివిగలవారిగా ఉన్నారు. బాబా, ప్రేమ ప్రేమను ఆకర్షిస్తుందని మీరే చెప్పారు కదా. కావున మీకు ప్రేమ ఉంది కనుక మాకు కూడా ఉంది, అది మరలా మిమ్ములను ఆకర్షించింది. పిల్లలు కూడా తెలివిగలవారు. ఇంత ధైర్యము ఉత్సాహ-ఉల్లాసాలు గల పిల్లలు కావున తండ్రికి సంతోషం ఉంది.

బాప్ దాదా వద్దకు చాలామంది పిల్లల 15 రోజుల చార్టు యొక్క రిజల్ట్ వచ్చింది. బాప్ దాదా నలువైపులా ఉన్న రిజల్ట్ లో ఒక విషయం చూశారు. మెజారిటీ పిల్లలకు అటెన్షన్ బాగుంది. స్వయం ఎంత శాతం కోరుకుంటారో అంత లేదు కానీ అటెన్షన్ ఉంది. అంతేకాక హృదయపూర్వకంగా ఎవరైతే తీవ్ర పురుషార్థీ పిల్లలున్నారో వారు తమ ప్రతిజ్ఞను పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు కూడా వెళ్తునారు. వెళ్తూ వెళ్తూ గమ్యానికి తప్పక చేరుకుంటారు. మైనారిటీ పిల్లలు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు సోమరితనం మరియు నిర్లక్ష్యానికి వశమై అటెన్షన్ కూడా తక్కువగా ఇస్తున్నారు. విశేషించి వారు “అయ్యే పోతాము, పోతాము ........ పోవాలి అని కాక పోతాములే, అయ్యేపోతాములే అనే స్లోగన్ పెట్టుకుంటారు. అయిపోతుందిలే అని అనడమే సోమరితనము మేము ముందుకు వెళ్లాల్సిందే అని అనడం తీవ్ర పురుషార్థం, బాప్ దాదా ప్రతిజ్ఞలు చాలా వింటారు. ప్రతిసారి ప్రతిజ్ఞలు చాలా బాగా చేస్తారు. పిల్లలు ప్రతిజ్ఞలు చాలా మంచి ధైర్యం పెట్టుకొని చేస్తారు. ఆ సమయంలో బాప్ దాదాకు కూడా పిల్లలు దిల్ ఖుష్ మిఠాయి తినిపించేస్తారు. బాబా కూడా తినేస్తారు కానీ ప్రతిజ్ఞ అనగా పురుషార్థంలో ఎక్కువలో ఎక్కువ లాభముంటుంది. లాభము లేకుంటే ప్రతిజ్ఞ సమర్థమైనది కాదు. కనుక ప్రతిజ్ఞలు భలే చేయండి. దిల్ ఖుష్ మిఠాయి తినిపిస్తారు కదా! దీనితో పాటు తీవ్ర పురుషార్థపు తపనను(లగ్నమును) అగ్ని రూపంలోకి తీసుకొని రండి. జ్వాలాముఖిగా కండి. సమయ ప్రమాణంగా మనసులో, సంబంధ-సంపర్కాలలో మిగిలి ఉన్న పాత లెక్క ఖాతాలను జ్వాలా స్వరూపంతో భస్మం చేయండి, తపన ఉంది. ఇందులో బాప్ దాదా కూడా పాస్ చేస్తారు కానీ ఇప్పుడు ఈ తపనను అగ్ని రూపంలోకి తీసుకొని రండి.

విశ్వంలో ఒకవైపు భ్రష్టాచారము, అత్యాచారాల అగ్ని ఉంది. ఇంకొకవైపు పిల్లలైన మీ శక్తిశాలీ యోగము అనగా లగ్నము యొక్క అగ్ని జ్వాలా రూపంలో అవసరము. ఈ జ్వాలా రూపం భ్రష్టాచారాన్ని, అత్యచారాల అగ్నిని సమాప్తి చేస్తుంది. అంతేకాక సర్వాత్మలకు సహయోగం ఇస్తుంది. మీ తపన జ్వాలా రూపంగా ఉండాలి అనగా పవర్‌ఫుల్ యోగం ఉండాలి. ఈ స్మృతి అనే అగ్ని ఆ అగ్నిని సమాప్తం చేస్తుంది, మరోవైపు ఆత్మలకు పరమాత్మ సందేశం యొక్క శీతల స్వరూపాన్ని అనుభూతి చేయిస్తుంది. బేహద్ వైరాగ్య వృత్తిని ప్రజ్వలింపజేయిస్తుంది. అది ఒకవైపు భస్మం చేస్తుంది. ఇంకొకవైపు శీతలంగా కూడా చేస్తుంది. అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క అలను వ్యాపింపజేస్తుంది. నాకు యోగముంది. బాబా తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అని పిల్లలంటారు. ఇది చాలా మంచిది కానీ ఇప్పుడు సమయానుసారంగా అందరూ జ్వాలా రూపంగా కండి. స్మృతి చిహ్నాలుగా శక్తుల శక్తి రూపం, మహాశక్తి రూపం, అన్ని అలంకారాలున్న శస్త్రధారి రూపంగా చూపించారో ఆ మహాశక్తి రూపాన్ని ఇప్పుడు ప్రత్యక్షం చేయండి. పాండవులు, శక్తులు అందరూ సాగరుని నుండి వెలువడిన జ్ఞాన నదులు. సాగరం కాదు, నదులు, జ్ఞాన గంగలు. కావున జ్ఞాన గంగలు ఆత్మలను తమ జ్ఞాన శీతలత ద్వారా పాపాల అగ్ని నుండి ఇప్పుడు ముక్తులుగా చేయండి. ఇది వర్తమాన సమయంలో బ్రాహ్మణుల కర్తవ్యం.

ఈ సంవత్సరం ఏ సేవ చేయాలని పిల్లలందరూ అడుగుతారు. బాప్ దాదా మొదటి సేవ ఇదే చెప్తారు - ఇప్పుడు సమయానుసారము పిల్లలందరూ వానప్రస్థ స్థితిలో ఉన్నారు. కనుక వానప్రస్థులు తమ సమయాన్ని, సాధనాలను పిల్లలందరికీ ఇచ్చి స్వయం వానప్రస్థులుగా ఉంటారు కావున మీరు కూడా తమ సమయ ఖజానాను, శ్రేష్ఠ సంకల్పాల ఖజానాను ఇప్పుడు ఇతరుల పట్ల  వినియోగించండి. తమ పట్ల సమయము, సంకల్పాలను తక్కువగా వినియోగించండి. ఇతరుల పట్ల వినియోగించుట వలన స్వయం కూడా ఆ సేవ యొక్క ప్రత్యక్ష ఫలం తినడానికి నిమిత్తంగా అవుతారు మనసా సేవ, వాచా సేవ మరియు అన్నింటికంటే ఎక్కువగా బ్రాహ్మణులు కావచ్చు, సంబంధ-సంపర్కాలలో వచ్చినవారు కావచ్చు, వారికి మాస్టర్ దాత అయ్యి ఏదో కొంత ఇస్తూ వెళ్లండి. నిస్వార్థంగా అయ్యి సంతోషాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, ఆనందాన్ని అనుభూతి చేయించండి, ప్రేమను అనుభూతి చేయించండి. ఇవ్వాలి, ఇవ్వడం అనగా స్వతహాగానే తీసుకోవడం అవుతుంది. ఎవరు ఏ సమయంలో ఏ రూపంలో వచ్చినా సంబంధ-సంపర్క రూపంలో వచ్చినా ఏదో ఒకటి తీసుకొని వెళ్లాలి. మాస్టర్ దాతలైన మీ వద్దకు వచ్చి ఎవరూ ఖాళీగా వెళ్లరాదు. బ్రహ్మాబాబాను చూశారు కదా, నడుస్తూ, తిరుగుతూ కూడా ఏ పిల్లలు ఎదురుగా వచ్చినా ఏదో ఒక అనుభూతి చేసుకోకుండా ఖాళీగా వెళ్లిపోలేదు. ఎవరు వచ్చినా వారికేమైనా లభించిందా, మీరేమైనా ఇచ్చారా లేక ఖాళీగా వెళ్లిపోయారా? అని చెక్ చేసుకోండి. ఖజానాలతో ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారు ఇవ్వకుండా ఉండలేరు. తరగని అఖండదాతగా కండి. ఎవరైనా అడిగితే ఇద్దాము అని కాదు. దాతలు ఎప్పుడూ వీరు అడిగితే ఇద్దాములే అని అనుకోరు. తరగని మహాదానులు. మహాదాతలు స్వయమే ఇస్తారు. ఈ సంవత్సరం మొదటి సేవ మహాన్ దాతగా చేయండి. మీరు దాత ద్వారా లభించిందే ఇస్తారు. బ్రాహ్మణులు అనగా అధికారులు కాదు, సహయోగులు. కావున పరస్పరములో బ్రాహ్మణులు ఒకరు ఇంకొకరికి దానము ఇవ్వరాదు. సహయోగము ఇచ్చుకోవాలి. ఇది మొదటి నంబర్ సేవ. దీనితో పాటు బాప్ దాదా విదేశీ పిల్లల సంతోష సమాచారాన్ని కూడా విన్నారు. ఈ సృష్టిలో ధ్వనిని వ్యాపింపజేయడానికి నిమిత్తంగా బాప్ దాదా ఏదైతే మైక్ అనే పేరు ఇచ్చారో ఆ కార్యాన్ని విదేశీ పిల్లలందరూ పరస్పరము కలిసి చేశారు. ప్లాన్ తయారయ్యింది అంటే ప్రాక్టికల్ గా కూడా జరగాల్సిందే కానీ భారతదేశంలో కూడా ఏవైతే 13 జోన్లు ఉన్నాయో వాటిలో ప్రతి జోన్ నుండి కనీసం ఎవరో ఒకరు విశేషమైన సేవాధారిగా, నిమిత్తంగా కావాలి. వారిని మైకు అనండి ఇంకేమైనా అనండి ధ్వనిని వ్యాపింపజేయడానికి ఎవరినో ఒకరిని నిమిత్తంగా తయారుచేయండి. ఇది బాప్ దాదా కనీస సంఖ్యగా చెప్పారు కానీ పెద్ద పెద్ద దేశాల నుండి కూడా ఇలా నిమిత్తంగా అయ్యేవారుంటే కేవలం జోన్ వారే కాదు, పెద్ద రాజ్యాల నుండి కూడా ఇటువంటి వారిని తయారు చేసి ప్రోగ్రాం చేయాలి. బాప్ దాదా విదేశీ పిల్లలకు హృదయ పూర్వకంగా అభినందనలు తెలిపారు. ఇప్పుడు నోటితో కూడా చెప్తున్నారు. ప్రాక్టికల్ లో తీసుకొని వచ్చే ప్లాన్ ముందు బాప్ దాదా ఎదురుగా తీసుకొచ్చారు. అలాగే భారతదేశంలో ఇంకా సహజం అని బాప్ దాదాకు తెలుసు కానీ ఇప్పుడు క్వాలీటి సేవ చేసి సహయోగులను సమీపానికి తీసుకురండి. చాలామంది సహయోగులున్నారు కానీ సంఘటనలో వారిని ఇంకా సమీపంగా తీసుకురండి. 

దీనితో పాటు బాప్  దాదాకు ఈ సంకల్పం ఉంది - ప్రతీ పెద్ద పట్టణాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్దవిగా ఉంటాయి. ప్రతి ఒక్క సెంటరు వారు తమ స్థానం నుండి విశేషమైనవారిని తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమయం చాలా దగ్గరకు వస్తుంది. అంతిమ సమయంలో మీరందరూ స్వయం తమ పరిచయం ఇవ్వడం కాదు. మన వైపు నుండి వారు ఉపన్యసించాలి. వారు స్పీకర్‌గా ఉండాలి, మీరు ప్రకాశాన్ని శక్తిని ఇచ్చేవారుగా ఉండాలి. కావున ప్రతి ఒక్కరు తమ స్థానం నుండి ఇలాంటి మైకులను తయారు చేయండి. ప్రతీ స్థానంలో ఒకరు విశేషించి బిజినెస్ మేన్ కావచ్చు లేక భిన్న భిన్న వర్గాలలో ముఖ్యులుగా ఎవరైతే ఉంటారో వారిని తమ తమ సెంటర్లలో మీ స్థానం నుండి విశేష ఆత్మలుగా తయారు చేయండి. ఈ జ్ఞానం అంటే ఏమిటో వారు వినిపించాలి. ఇప్పుడు మీరు అంతిమ సమయంలో సాక్షాత్కార మూర్తులుగా, ఫరిస్తాలుగా తయారై వీరు స్పీకర్‌గా అవ్వాలని దృష్టినివ్వండి. ఉపన్యాసకులుగా అవ్వడం అందరూ నేర్చుకున్నారు. చిన్న చిన్న టీచర్లు చాలా బాగా ఉపన్యసిస్తారు. అందరూ ఉపన్యసిస్తారు. ఇప్పుడు ఇతరులను ఉపన్యాసకులుగా తయారు చేయండి. తమ దృష్టి మరియు రెండు మాటలు అందరికీ ఎటువంటి అనుభవం చేయించాలంటే చాలా సమయం నుండి ఉపన్యాసం చెప్పినట్లుగా అందరికీ అనిపించాలి. ఇలాంటి సమయం తప్పక వస్తుంది. మంచిది.

నలువైపులా పరమాత్మ పాలనకు అధికారిగా ఉన్న ఆత్మలకు పరమాత్మ చదువుకు అధికారులైన శ్రేష్ఠ ఆత్మలకు, పరమాత్మ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్న ఆత్మలకు, సదా బిందువు ఉంచే విధి ద్వారా తీవ్ర పురుషార్థులుగా ఉన్న ఆత్మలకు, సదా కష్టం నుండి ముక్తులుగా ఉంటూ ప్రేమలో ఇమిడిపోయి ఉన్న పిల్లలకు జ్వాలా స్వరూప విశేష ఆత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments