28-03-2002 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఈ సంవత్సరాన్ని నిర్మాణం - నిర్మల సంవత్సరంగా మరియు వ్యర్ధం నుండి ముక్తి అయ్యే ముక్తి సంవత్సరంగా జరుపుకోండి.
ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లల యొక్క మస్తకంలో మెరుస్తున్నటువంటి మూడు రేఖలను చూస్తున్నారు. 1. ప్రభుపాలన యొక్క రేఖ. 2. శ్రేష్ట చదువు యొక్క రేఖ మరియు 3. శ్రేష్టమతం యొక్క రేఖ. మూడు రేఖలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఈ మూడు రేఖలు సర్వులకి భాగ్యరేఖలు. మీరందరు కూడా మీ యొక్క మూడు రేఖలను చూసుకుంటున్నారు కదా! ప్రభుపాలన యొక్క భాగ్యం బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ లభించదు. పరమాత్మ పాలన ద్వారా మీరు ఎంత పూజ్యనీయంగా అవుతున్నారు! నాకు పరమాత్మ చదువు యొక్క అధికారం లభిస్తుంది అని ఎప్పుడైనా కలలో అయినా ఆలోచించారా! కానీ ఇప్పుడు సాకారంలో అనుభవం చేసుకుంటున్నారు. స్వయం సద్గురువు అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మ యొక్క శ్రేష్టమతం ఇస్తారు మరియు కర్మబంధనకి బదులు కర్మ సంబంధంలోకి వచ్చేటందుకు శ్రీమతాన్ని ఇచ్చే నిమిత్తంగా తయారు చేస్తారు అని కలలో కూడా అనుకోలేదు కానీ ఇప్పుడు అనుభవంతో చెప్తున్నారు - ప్రతి కర్మలో శ్రీమతం ప్రకారం నడుస్తున్నాము అని. ఈ విధమైన అనుభవం ఉందా? ఈ విధంగా పిల్లల యొక్క శ్రేష్ఠభాగ్యం చూసి బాప్ దాదా కూడా ఓహో నా శ్రేష్టభాగ్యవాన్ పిల్లలూ! ... ఓహో!! అని సంతోషిస్తున్నారు. పిల్లలు ఓహో బాబా! ఓహో!! ..... అంటున్నారు. మరియు బాబా, ఓహో పిల్లలూ! ఓహో!! .... అంటున్నారు.
ఈరోజు అమృతవేళ నుండి, రెండు సంకల్పాలతో కూడిన పిల్లల యొక్క స్మృతి బాప్ దాదా దగ్గరికి చేరుకుంటుంది. 1. కొంతమంది పిల్లలకు తమ యొక్క అకౌంట్ ఇవ్వాలి అనే స్మృతి ఉంది 2. బాబా సాంగత్యం యొక్క రంగుతో హోలీ జరుపుకోవాలనే స్మృతి ఉంది. అందరు హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా! బ్రాహ్మణుల యొక్క భాషలో జరుపుకోవటం అంటే తయారవ్వటం. హోలీ జరుపుకుంటున్నారు అంటే హోలీగా (పవిత్రంగా) అవుతున్నారు. బాప్ దాదా చూస్తున్నారు బ్రాహ్మణ పిల్లలు పవిత్రంగా అవ్వటం కూడా ఎంతో ప్రియమైనది మరియు అతీతమైనది. ద్వాపరయుగం యొక్క ఆదిలోని మహాన్ ఆత్మలు మరియు సమయం అనుసరించి వచ్చిన ధర్మపితలు కూడా పవిత్రంగా, హోలీగా అయ్యారు కానీ మీ యొక్క పవిత్రత అందరికంటే శ్రేష్టమైనది మరియు అతీతమైనది కూడా! మొత్తం కల్పంలో మహాత్మలైనా, ధర్మాత్మలైనా, ధర్మపితలైనా కానీ మీ వంటి పవిత్రంగా అంటే ఆత్మ పవిత్రంగా, శరీరం కూడా పవిత్రంగా, ప్రకృతి కూడా సతో ప్రధానంగా, పవిత్రంగా ఇలా ఎవరు అవ్వలేదు మరియు అవ్వలేరు కూడా. మీ యొక్క భవిష్య స్వరూపాన్ని ఎదురుగా తెచ్చుకోండి, తెచ్చుకున్నారా? అందరి ఎదురుగా మీ భవిష్యరూపం వచ్చిందా లేక అవుతామో, లేదో తెలియదు అంటున్నారా! ఏమి అవుతాము అని! ఏవిధంగా అయినా కానీ పవిత్రంగా అయితే ఉంటారు కదా! శరీరం కూడా పవిత్రంగా, ఆత్మ కూడా పవిత్రంగా మరియు ప్రకృతి కూడా పావనంగా, సుఖదాయిగా ..... ఉంటాయి.
నిశ్చయం అనే కలంతో మీ భవిష్య చిత్రాన్ని ఎదురుగా తీసుకువస్తున్నారా! నిశ్చయం ఉంది కదా! టీచర్లకి ఉందా? మంచిది, ఒక సెకనులో మీ భవిష్యత్తు యొక్క చిత్రాన్ని ఎదురుగా తీసుకురాగలుగుతున్నారా! కృష్ణుడిగా అయితే అవ్వకపోయినా సాతీగా (వెంట ఉండేవారిగా) అయితే అవుతారు కదా! ఎంత ప్రియంగా అనిపిస్తుంది! చిత్రకారునిగా అవ్వటం వస్తుందా లేక రావటంలేదా? ఎదురుగా చూడండి అంతే. ఇప్పుడు సాధారణంగా ఉన్నాను, రేపు (డ్రామాలో రేపు) రేపు అంటే వచ్చే రేపటి రోజు అని కాదు, డ్రామాలో రేపు ఈ పవిత్ర శరీరధారిగా నేను అవ్వవలసిందే. పాండవులు ఏమని భావిస్తున్నారు? పక్కాయే కదా? అవుతామో, అవ్వమో తెలియదు అనే అనుమానం అయితే లేదు కదా! లేదు కదా? పక్కాయే కదా? రాజయోగి కనుక రాజ్యా ధికారిగా అవ్వవలసిందే. బాప్ దాదా చాలాసార్లు స్మృతి ఇప్పిస్తారు - బాబా మీ కోసం కానుక తీసుకువచ్చారు అని. ఏమి కానుక తీసుకువచ్చారు? స్వర్ణిమ ప్రపంచాన్ని, సతో ప్రధాన ప్రపంచాన్ని కానుకగా తీసుకువచ్చారు. కనుక నిశ్చయం ఉంది కదా! నిశ్చయానికి గుర్తు - ఆత్మికనషా. ఎంతగా మీ రాజ్యానికి సమీపంగా వస్తుంటారో, ఇంటికి కూడా సమీపంగా వస్తుంటారో అంతగా మాటిమాటికి మీ యొక్క స్వీట్ హోమ్ మరియు మీ యొక్క స్వీట్ రాజధాని స్పష్టంగా స్మృతి రావలసిందే. ఇదే సమీపంగా వస్తున్న దానికి గుర్తు. మీ యొక్క ఇల్లు మరియు మీ యొక్క రాజధాని స్పష్టంగా స్మృతి వస్తాయి మరియు మూడవనేత్రం ద్వారా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రోజు ఇక్కడ ఉన్నాము, రేపు అక్కడ ఉంటాము అని అనుభవం అవుతుంది. ఎన్నిసార్లు పాత్ర పూర్తి చేసుకుని మీ యొక్క ఇంటికి మరియు మీ యొక్క రాజ్యంలోకి వెళ్ళారు. ఇది స్మృతి వస్తుంది కదా! మరియు ఇప్పుడు మరలా వెళ్ళాలి.
డబల్ విదేశీయులకు స్పష్టంగా స్మృతి వస్తుందా లేక ఏమౌతామో తెలియదు, ఎలా అవుతుందో తెలియదు అంటున్నారా! స్మృతి ఉందా? వెనుక ఉన్నవారికి స్మృతి ఉందా? గ్యాలరీలో కూర్చున్న వారికి స్మృతి ఉందా? బాప్ దాదా చూస్తున్నారు - బయట కూడా కూర్చున్నారు మరియు విశ్వం యొక్క కోనకోనల్లో కూడా కూర్చున్నారు. హోలీ జరుపుకున్నారా? మీరున్నదే హోలీగా (పవిత్రంగా) ఇక హో లీ ఏమి జరుపుకుంటారు! పవిత్రత అనేది సంగమయుగం యొక్క అలంకరణ. ఇక హోలీ ఏం జరుపుకుంటారు. బాప్ దాదా ఈ రోజు అందరి యొక్క అకౌంట్ (ఖాతా) చూడాలి కదా! బాబా మర్చిపోలేదు. అందరు తమ యొక్క అకౌంట్ పెట్టుకున్నారు. ఎవరైతే తమ యొక్క యదార్ధమైన అకౌంట్ అంటే నియమప్రమాణంగా, పని అయిపోయింది అన్నట్లుగా కాకుండా, యదార్థంగా ఎలా ఉన్నా కానీ, యదార్ధ రూపంతో ఎవరైతే తమ యొక్క సత్యమైన అకౌంట్ పెట్టుకున్నారో వారు చేతులు ఎత్తండి! చేతులు పెద్దగా ఎత్తండి! వ్రాయలేదు కానీ ఎవరైతే పెట్టుకున్నారో వారు చేతులు ఎత్తండి! వెనుక ఉన్నవారిలో ఎవరైతే పెట్టుకున్నారో వారు చేతులు ఎత్తండి! కొంతమంది పెట్టుకున్నారు. డబల్ విదేశీయులు ఎవరైతే పెట్టుకున్నారో వారు నిలబడండి. మంచిది, శుభాకాంక్షలు, కూర్చోండి. మంచిది - ఎవరైతే పెట్టుకోలేదో వారిని చేతులు ఎత్తమనటం లేదు. అలా చేతులు ఎత్తమని చెప్పటం బావుండదు కదా! కానీ అకౌంట్ పెట్టుకున్న వారందరిదీ బాప్ దాదా దగ్గర స్పష్టం అవుతూ ఉంటుంది. కానీ కొంతమంది సత్యంగా మరియు కొంతమంది ఏవరేజ్ గా కూడా పెట్టుకున్నారు. యదార్ధంగా కొంతమందే వ్రాసారు మరియు పెట్టుకున్నారు అయినప్పటికీ బాప్ దాదా యొక్క ఆజ్ఞను అంగీకరించారు కనుక బాప్ దాదా వారికి రెండు రకాలుగా ఎగస్ట్రా మార్కులు ఇచ్చారు. ఎందుకంటే శ్రీమతంపై నడవటం అనేది కూడా ఒక సబ్జక్టు. కనుక శ్రీమతంపై నడిచే సబ్జక్టులో పాస్ అయ్యారు కనుక ఫస్ట్ నెంబర్ వారికి బాప్ దాదా తన వైపు నుండి 25 మార్కులు పెంచారు మరియు రెండవ నెంబర్ వారికి 15 మార్కులు పెంచారు. ఈ ఎగస్ట్రా లిఫ్ట్ బాప్ దాదా తన వైపు నుండి ఇచ్చారు. మరలా అంతిమ పేపర్ లో మీ యొక్క ఈ మార్కులు జమ అవుతాయి. పాస్ విత్ ఆనర్ అవ్వటంలో సహాయం లభిస్తుంది కానీ ఎవరైతే పెట్టుకోలేదో ఏదోక కారణంగా, సోమరితనమే అంతకంటే ఏమీ లేదు కానీ ఏదోక కారణంగా పెట్టుకోలేదో వారికి బాప్ దాదా చెప్తున్నారు - ఇప్పటి నుండి మీరు ఒక నెల అకౌంట్ పెట్టుకోండి, ఇప్పుడైనా కానీ ఒక నెల యదార్థ అకౌంట్ పెట్టుకుని నెంబర్ వన్ గా అయితే బాప్ దాదా వారి యొక్క మార్కులు కట్ చేయరు. అర్థమైందా! కట్ చేయరు కానీ మీరు తప్పకుండా చేయాలి. శ్రీమతానికి గౌరవం ఇవ్వకపోతే మార్కులు కట్ అయిపోతాయి కదా! అంతిమంలో ఎప్పుడైతే మీ యొక్క ఖాతా డ్రామానుసారం మీ మనస్సు యొక్క టీ.విలో చూస్తారో, వేరే టీ.వి ఉండదు, మీ మనస్సు అనే టీ.విలోనే బాప్ దాదా చూపిస్తారు. దానిలో ఈ శ్రీమతం అనే సబ్జక్టులో మార్కులు కట్ చేయరు. అయినా కానీ బాప్ దాదాకి ప్రేమ ఉంటుంది. చాలా జన్మల యొక్క సోమరితనం యొక్క సంస్కారం పక్కాగా ఉంది కదా! కనుక అలా అయిపోతుంది అని అనుకుంటారు. కానీ ఇప్పుడు సోమరిగా కాకూడదు. లేకపోతే ఏమౌతుందో తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పటం లేదు. ఎందుకంటే బాప్ దాదా ఇప్పుడు అందరి వర్తమానం యొక్క ఫలితం చూసారు. డబల్ విదేశీయులలో అయినా, భారతవాసీయులలో అయినా అందరిలో ఇప్పటి ఫలితంలో వర్తమాన సమయంలో సోమరితనం అనేది చాలా రకాలుగా పిల్లలలో ఉంది. అనేక రకాలుగా ఉంది. మనస్సులో మనస్సులోనే ఇవన్నీ ఇలా జరుగుతాయిలే అని ఆలోచిస్తున్నారు. ఈ రోజుల్లో అన్ని విషయాల గురించి ఇదే స్లోగన్విశేషంగా నడుస్తుంది. ఇదే సోమరితనం. వెనువెంట పురుషార్ధంలో లేక స్వయం పరివర్తనలో సోమరితనంతో పాటు కొంచెం శాతంలో నిర్లక్ష్యం కూడా ఉంది. అయిపోతుంది, చేసేస్తాము .... ఇలా క్రొత్త రకాలైన సోమరితనం యొక్క విషయాలు బాప్ దాదా చూసారు. అందువలనే మీ యొక్క సత్యమైన మనస్సుతో చార్ట్ పెట్టుకోండి, సోమరితనంతో కాదు.
ఈరోజు ఈ సీజన్ యొక్క లాస్ట్ టర్న్ కదా! కనుక బాప్ దాదా ఫలితం వినిపిస్తున్నారు. వినిపించాలి కదా! లేక కేవలం ప్రేమయే చూపించాలా? ఇది కూడా ప్రేమయే. బాప్ దాదాకి పిల్లలందరిపై ఎంత ప్రేమ ఉందంటే ప్రతి ఒక్కరు బ్రహ్మాబాబా వెంట ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు. వెనుక వెళ్ళటం కాదు, సాతీ అయ్యి వెళ్ళాలి. కనుక సమానంగా అవ్వాలి కదా! సమానంగా కాకుండా సాతీగా అయ్యి వెళ్ళలేరు. మరియు మీ రాజ్యం యొక్క మొదటి జన్మలోకి రావాలంటే మొదటే ఉండాలి కదా! ఒకవేళ రెండు, మూడు జన్మలో వచ్చి మంచి రాజుగా అయినా కానీ రెండు, మూడు అనే అంటారు కదా! వెంట వెళ్ళాలి మరియు వెనువెంట బ్రహ్మాబాబాతో పాటు మొదటి జన్మ యొక్క అధికారిగా అవ్వాలి - వీరే నెంబర్ వన్ పాస్ విత్ ఆనర్ అయినట్లు. కనుక పాస్ విత్ ఆనర్‌గా అవ్వాలా లేక పాస్ మార్క్స్ వచ్చినా పర్వాలేదా? ఎప్పుడు కూడా మేము ఏది చేస్తున్నామో లేదా ఏదైతే జరుగుతుందో దానిని బాప్ దాదా చూడటం లేదు అని భావించకండి. దీనిలో ఎప్పుడు సోమరిగా కాకూడదు. ఒకవేళ ఎవరైనా పిల్లలు బాప్ దాదాని తమ మనస్సు యొక్క చార్ట్ అడిగితే బాబా చెప్పగలరు కానీ ఇప్పుడు చెప్పటం లేదు.
బాప్ దాదా ప్రతి ఒక మహారథి, గుఱ్ఱపుసవారీలు ...... అందరి యొక్క చార్ట్ చూస్తున్నారు. ఒకొక్కసారి అయితే బాప్ దాదాకి చాలా దయ వస్తుంది వీరు ఎవరు మరియు ఏమి చేస్తున్నారు? అని కానీ బ్రహ్మాబాబా చెప్తూ ఉండేవారు కదా? ఏమి చెప్పేవారో స్మృతి ఉందా? శివబాబాకి తెలుసు, బ్రహ్మాబాబాకి తెలుసు ఎందుకంటే బాప్ దాదాకి దయ వస్తుంది కానీ అటువంటి పిల్లలు బాప్ దాదా యొక్క దయ యొక్క సంకల్పాన్ని కూడా గ్రహించడం లేదు. వారికి టచ్ అవ్వటం లేదు అందువలనే బాప్ దాదా చెప్పారు - రకరకాలైన రాయల్ సోమరితనాన్ని బాబా చూశారు అని. ఈరోజు బాప్ దాదా చెప్పేస్తారో లేక దయ చూపిస్తారో అని అనుకోకండి. కొంత మంది పిల్లలు, సత్యయుగంలో ఎవరు ఏమి అవుతామో ఎవరికి తెలియనే తెలియదు కనుక ఇప్పుడు మజాగా ఉండాలి అని భావిస్తున్నారు. ఈరోజు ఏది చేయాలనుకుంటున్నారో అది చేసేయండి అని అంటున్నారు, ఎవరు ఆపేవారు లేరు, ఎవరు చూసేవారు లేరు అనుకుంటున్నారు కానీ ఇది పొరపాటు. బాప్ దాదా పేర్లు చెప్పటం లేదు పేర్లు చెప్తే రేపు సరి అయిపోవాలి. ఈ రోజు హోలీ జరుపుకుంటున్నారు కదా! కనుక ఏమి చేయాలో అర్థమైందా? పాండవులకి అర్థమైందా, లేదా? ఎలా అంటే అలా నడిచిపోతుంది అనుకుంటున్నారా! నడిచిపోతుందా? నడవదు ఎందుకంటే బాప్ దాదా దగ్గర ప్రతి ఒక్కరిది, ప్రతి రోజు యొక్క రిపోర్ట్ వస్తుంది. బాప్ దాదాలు పరస్పరం ఆత్మికసంభాషణ కూడా చేసుకుంటారు. అయితే బాప్ దాదా మరలా పిల్లలందరికీ సైగ చేస్తున్నారు - సమయం అనేది అన్ని రకాలుగా అతిలోకి వెళ్తుంది. మాయ కూడా తన యొక్క అతి పాత్రను అభినయిస్తుంది, ప్రకృతి కూడా తన యొక్క అతి పాత్రను అభినయిస్తుంది. అటువంటి సమయంలో బ్రాహ్మణ పిల్లలకు మీపై మీకు కూడా అతిగా ధ్యాస అంటే మనసా, వాచా, కర్మణాలో అతిగా ఉండాలి. సాధారణ పురుషార్ధం కాదు. బాప్ దాదా సైగ కూడా చేసారు - 66 సంవత్సరాలలో ఇప్పటివరకు 6 లక్షల మందిని తయారుచేసారు. ఇప్పుడు 9 లక్షల మంది కూడా అవ్వలేదు. మరి విశ్వకళ్యాణి ఆత్మలైన మీరు విశ్వం యొక్క సర్వాత్మలకు కళ్యాణం ఎప్పుడు చేస్తారు? ఇంకో 66 సంవత్సరాలు కావాలా ఏమిటి? డబల్ విదేశీయులకు కావాలా? వద్దా? కనుక ఏమి చేస్తారు? ఇప్పుడు సేవ యొక్క సంలగ్నత ఉంది, అదయితే బాప్ దాదా చూసారు. సేవ కోసం ఎవరెడీగా ఉన్నారు. అవకాశం లభిస్తే సేవ కోసం ప్రేమతో ఏవరెడీగా అవుతున్నారు. కానీ ఇప్పుడు సేవలో ఎడిషన్ గా - వాణీతో పాటు మనస్సు అంటే మీ యొక్క ఆత్మను విశేషంగా ఏదోక ప్రాప్తి స్వరూపంలో స్థితులు చేసుకుని అప్పుడు వాణీతో సేవ చేయండి. ఉపన్యాసం చెప్తున్నారు అనుకోండి అంటే వాచా ద్వారా చాలా మంచిగా ఉపన్యాసం చెప్తున్నారు కానీ ఆ సమయంలో మీరు ఆత్మిక స్థితిలో స్థితులయ్యి, విశేషంగా శక్తి లేదా శాంతి లేదా పరమాత్మ యొక్క ప్రేమ ..... ఇలా ఏదోక విశేష అనుభూతి చేయించి, మనస్సు ద్వారా మీ ఆత్మీక స్థితి యొక్క ప్రభావాన్ని వాయుమండలంలో వ్యాపింపచేయండి మరియు దానితో పాటుగా వాచా ద్వారా సందేశం ఇవ్వండి మరియు మనస్సు యొక్క ఆత్మికస్థితి ద్వారా అనుభూతి చేయించండి. ఉపన్యాసం చెప్పే సమయంలో మీ మాట ద్వారా, మీ మస్తకం ద్వారా, నయనాల ద్వారా, ముఖం ద్వారా ఆ అనుభూతి యొక్క ముఖం కనిపించాలి - అంటే ఈ రోజు ఉపన్యాసం అయితే విన్నాము కానీ పరమాత్మ ప్రేమ యొక్క చాలా మంచి అనుభవం కూడా అవుతుంది అని అనిపించాలి. ఉపన్యాసం చెప్పినప్పుడు - చాలా బాగా మాట్లాడారు, చాలా బావుంది, చాలా మంచి విషయాలు చెప్పారు అని అంటారు కదా! అదేవిధంగా తమ ఆత్మస్వరూపం యొక్క అనుభూతి గురించి కూడా వారు చెప్పాలి. మానవాత్మలకు తరంగాలు అందాలి, వాయుమండలం తయారవ్వాలి. విజ్ఞాన సాధనాల ద్వారా చల్లదనాన్ని (ఏ.సి) అనుభవం చేయిస్తున్నారు కదా, భలే చల్లగా ఉంది అని అందరికీ అనుభవం అవుతుంది కదా! వెచ్చదనాన్ని కూడా అనుభవం చేయిస్తున్నారు. చలిలో వెచ్చదనాన్ని, వేడిమిలో చల్లదనాన్ని అనుభవం చేయిస్తున్నారు కదా! అయితే మీది శాంతిశక్తి. దీని ద్వారా ప్రేమ స్వరూపాన్ని, సుఖ స్వరూపాన్ని, శాంతి స్వరూపం యొక్క వాయుమండలాన్ని అనుభవం చేయించలేరా? దీని గురించి పరిశోధన చేయండి. చాలా చాలా బాగా చేశారు అని కేవలం అనటం కాదు. వారు కూడా మంచిగా అయిపోవాలి. అప్పుడే సమాప్తి సమయాన్ని సమాప్తి చేసేసి మీ రాజ్యాన్ని తీసుకురాగలరు. మీకు మీ రాజ్యం జ్ఞాపకం రావటం లేదా? సంగమయుగం శ్రేష్టమైనది, వజ్రతుల్యమైనది అది సరే, కానీ దయాహృదయులు, విశ్వకళ్యాణకారులైన ఓ పిల్లలూ! దు:ఖం, అశాంతిలో ఉన్న మీ సోదరీసోదరులపై మీకు దయ రావటం లేదా? దు:ఖమయ ప్రపంచాన్ని సుఖమయ ప్రపంచంగా చేయాలనే ఉత్సాహం రావటం లేదా? ఉల్లాసం రావటం లేదా? దు:ఖం చూడాలనుకుంటున్నారా, మీ సోదరీసోదరులు అయినప్పుడు వారి దు:ఖాన్ని మీకు చూడాలనిపిస్తుందా? మీ యొక్క స్వరూపాన్ని, కృప స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. ఈ ప్రోగ్రామ్ చేశాం, ఆ ప్రోగ్రామ్ చేశాం ...... ఇలా కేవలం సేవలోనే నిమగ్నం అవ్వకండి. సంవత్సరం పూర్తి అయిపోయింది. ఇప్పుడు దయా సాగరులుగా అవ్వండి. దృష్టి ద్వారా లేదా అనుభూతి ద్వారా లేదా ఆత్మిక స్థితి యొక్క ప్రభావం ద్వారా సేవ చేసే దయాహృదయులుగా అవ్వండి. 66 సంవత్సరాలు సమాప్తి అయిపోయినవి. తక్కువ కాదు, 66 సంవత్సరాలు. బ్రహ్మాబాబా అవ్యక్తం అయ్యి కూడా 33 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు, ఎప్పుడు అని బ్రహ్మాబాబా అంటున్నారు, ద్వారం తెరవడానికి పిల్లలు ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నారు. ఇంటి యొక్క ద్వారం బాబాతో పాటు తెరుస్తారా? లేక వెనుక వస్తారా? బాబా ఎదురుచూస్తున్నారు. అందువలన సేవలో మార్పు తీసుకురండి. ఈ విధి ప్రకారంగా మీరు సేవ చేసినట్లేతే కొంచెం సమయంలో మీ దగ్గర క్వాలిటీ ఆత్మలు తయారవుతారు అని బాప్ దాదా గ్యారంటీ ఇస్తున్నారు. వారసుల క్వాలిటీ యొక్క వర్షం కురుస్తుంది. ఇంత శ్రమ చేయవలసిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు ఈ కార్యం జరగనున్నది, దీనిలో మీరు సహయోగి అవ్వండి అని మీరు చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. మేం సహయోగం ఇస్తాం అని వాళ్ళే అంటారు. కానీ మీరు సాధారణ పురుషార్థాన్ని, సాధారణ విధి ద్వారా చేసే సేవని పరివర్తన చేయండి. చిమ్ - చిమ్ అనే మెరుపు కావాలి. ఇది అయితే జరగవలసిందే. మీరు కేవలం అనుభూతిని చేయించే విధిని ఆలోచించండి. కేవలం ఉపన్యాసం లేదా కోర్సు చెప్పటం కాదు, అవి చాలా చేశారు. వర్గీకరణ యొక్క సేవ కూడా చాలా చేశారు. ఎవరు వచ్చినా వారికి ముద్ర పడిపోవాలి. 9 లక్షలలోని వారు అని ముద్ర పడిపోవాలి. అర్థమైందా! ఏమి చేయాలి? సేవ గురించి ప్లాన్ చెప్పమని అడుగుతున్నారు. చెప్పాను కదా! ఇప్పుడు చిమ్ - చిమ్ అనే మెరుపు చూపించండి. మీరు చేసే సేవ యొక్క వేగం తక్కువ. లక్ష్మీదేవి గురించి చెప్తారు కదా - రెండు చేతులలో ధనం మిలమిల మెరుస్తున్నట్లు చూపిస్తారు కదా! అలా అనుభవం చేయించాలి. కానీ ఎవరు అనుభూతి చేయించగలరు అంటే ఎవరైతే వ్యర్థ చింతన, వ్యర్ధ దర్శనం, సమయాన్ని వ్యర్ధంగా పోగొట్టడం నుండి ముక్తులుగా ఉంటారో వారు చేయగలరు. ఈ రోజుల్లో కొంచెం - కొంచెం వ్యర్థాన్ని బాప్ దాదా చూశారు. అది కూడా చెప్పమంటారా ఏమిటి? మంచిది, ఈ రోజు అన్నీ చెప్తాను.
హోలీ కదా! హోలీకి చెడు విషయాలు మాట్లాడరు. టీచర్స్ ఈ రోజు హోలీ కదా. మంచిది - బాప్ దాదా మరో విషయం కూడా చూశారు. చెప్పడానికి ఇష్టం లేదు. అప్పుడప్పుడు కొందరు పిల్లలు, మంచి మంచి వారు కూడా ఇతరుల విషయాలలో ఎక్కువగా ఉంటున్నారు. ఇతరుల విషయాలు చూడటం, ఇతరుల విషయాలను వర్ణన చేయటం ....... మరియు చూడటం కూడా వ్యర్థ విషయాలనే చూస్తున్నారు. ఒకరికొకరి విశేషతలను వర్ణన చేయటం అనేది తక్కువగా ఉంది. ప్రతి ఒక్కరి యొక్క విశేషతను చూడటం, వర్ణన చేయటం, వారి విశేషత ద్వారా వారికి ఉత్సాహ ఉల్లసాలను ఇవ్వటం అనేది తక్కువగా ఉంది. కానీ వ్యర్థ విషయాలలో మాత్రం ఎక్కువగా ఉంటున్నారు అంటే అటువంటి విషయాలను వదిలేయండి అని బాప్ దాదా చెప్తారు. స్వయంలో ఉన్నవాటినే వదలడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇతరులలోనివి మాత్రం చూసే అలవాటు ఉంది. దానిలో సమయం చాలా వ్యర్ధం అయిపోతుంది. బాప్ దాదా విశేషంగా ఒక శ్రీమతాన్ని ఇస్తున్నారు - అవ్వడానికి సాధారణ విషయమే కానీ చాలా సమయం వ్యర్ధం అయిపోతుంది, అందువలన మాటను నిర్మాణంగా చేసుకోండి. మాటలో నిర్మాణత తక్కువ కాకూడదు. సాధారణ మాటలు మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడవలసి ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ నిర్మాణతకి బదులు అథార్టీతో అంటే నిర్మాణంగా మాట్లాడటం లేదు అంటే కార్యం యొక్క లేదా సీట్ (పదవి) యొక్క అభిమానం 5 శాతం కనిపిస్తుంది. నిర్మాణత అనేది బ్రాహ్మణ జీవితం యొక్క విశేష శృంగారం. మనస్సులో, వాచాలో, సంబంధ సంపర్కాలలో అన్నింటిలో నిర్మాణత ఉండాలి. మూడు విషయాలలో నేను నిర్మాణంగా ఉన్నాను కానీ ఒక దానిలో తక్కువగా ఉంటే ఏమయ్యింది అని అనుకోకండి. కానీ ఆ ఒక్క లోపమే పాస్ విత్ ఆనర్‌గా కానివ్వదు. నిర్మాణతయే మహానత. నిర్మాణత అంటే వంగటం కాదు వంగింప చేసుకోవటం. కొంతమంది పిల్లలు నవ్వుతూ అంటున్నారు - నేనే వంగాలా? వారు కూడా వంగాలి అంటున్నారు. కానీ ఇది వంగటం కాదు వాస్తవానికి పరమాత్మని కూడా మీపై వంగించుకోవటం అంటే ఇక ఆత్మల విషయమయితే వదిలేయండి. నిర్మాణత నిరహంకారిగా స్వతహాగానే తయారు చేస్తుంది. నిరహంకారిగా అయ్యే పురుషార్థం చేయవలసిన అవసరం ఉండదు. నిర్మాణత అనేది మీ కొరకు ప్రతి ఒక్కరి మనస్సులో మంచి స్థానాన్ని తయారుచేస్తుంది. నిర్మాణత ప్రతి ఒక్కరి మనస్సు నుండి మీకు ఆశీర్వాదాలను ఇప్పిస్తుంది. ఈ ఆశీర్వాదాలు అనేవి పురుషార్థానికి లిఫ్ట్ కూడా కాదు రాకెట్ లా అవుతాయి. నిర్మాణత అనేది అటువంటిది. ఎవరు ఎలా ఉన్నా కానీ, బిజీగా ఉండేవారు అయినా కానీ, కఠినమైన మనస్సు కల్గినవారు అయినా కానీ, క్రోధీ అయినా కానీ సర్వుల నుండి సహయోగాన్ని ఇప్పించడానికి నిర్మాణత నిమిత్తం అవుతుంది. నిర్మాణత అనేది ప్రతి ఒక్కరి సంస్కారంతో మిమ్మల్ని కలుపుతుంది. సత్యమైన బంగారంగా ఉంటారు కనుక స్వయాన్ని మలుచుకునే విశేషత ఉంటుంది. అయితే బాప్ దాదా చూశారు - మాట మరియు నడవడికలో అయినా కానీ, సంబంధ సంపర్కాలలో అయినా కానీ, సేవలో కూడా ఒకరి పట్ల మరొకరు నిర్మాణ స్వభావంతో ఉంటే అదే విజయాన్ని ప్రాప్తింపచేస్తుంది. అందువలన ఈ సంవత్సరంలో విశేషంగా బాప్ దాదా ఈ సంవత్సరాన్ని - నిర్మాణం మరియు నిర్మల సంవత్సరం అని అంటున్నారు. ఈ సంవత్సరాన్ని జరుపుకుంటారు కదా! జరుపుకోవటం అంటే తయారవ్వటం. ఈ సంవత్సరం నిర్మాణ మరియు నిర్మల సంవత్సరం అని కేవలం చెప్పటం కాదు. తయారవ్వాలి కదా! వెనుక కూర్చున్నవారు చెప్పండి - తయారవ్వాలి కదా! ఇంకా ముత్యాలను (మాటలు) మాకు చెప్పండి అని అందరూ అనే విధంగా మీరు మాట్లాడాలి. వద్దు, వద్దు చెప్పకండి అని అనకూడదు. అటువంటి వజ్రాలు, ముత్యాల వంటి మాటలు మీ నోటి నుండి రావాలి. అభిమానంతో మాట్లాడి ఇతరులకి దు:ఖాన్ని ఎందుకు ఇస్తున్నారు? అలా మాట్లాడితే దు:ఖం యొక్క ఖాతాలో జమ అవుతుంది కదా! అనేశాం ఏమయ్యిందిలే, అలా అనాల్సిందే అని మీరు అనుకుంటారు కానీ దు:ఖం ఇచ్చే ఖాతాలో జమ అయిపోతుంది. అర్ధమైందా! అందువలన ఎకౌంట్ పెట్టుకోండి. అకౌంట్ ఇచ్చేశాం అని అనుకోకండి. అకౌంట్ పెట్టుకోవటంలో లాభం ఉంది. బాప్ దాదా చూశారు. కొందరు మంచి పురుషార్ధం చేశారు. ధ్యాస పెట్టారు. అయితే ఇప్పుడు ఏమి జ్ఞాపకం ఉంచుకుంటారు? నిర్మాణంగా ఉండాలి అని జ్ఞాపకం ఉంచుకోండి. అప్పుడు నిర్మాణం యొక్క కర్తవ్యం వెంటనే అయిపోతుంది. నిర్మాణంగా అవ్వండి మరియు నిర్మాణం చేయండి. అప్పుడు మీరే అంటారు - బాబా ఇప్పుడు మెరుపు కనిపించింది అని. జరగవలసిందే. మొత్తం విశ్వంలోని ఆత్మలందరూ ఓహో ప్రభూ! అంటూ మీ ముందు వంగవలసిందే. ఈ సంవత్సరం ఏమి సేవ చేయాలో చెప్పాను కదా! ఇప్పుడు ఏ సెంటర్, ఏ జోన్ మరియు జోన్లో కూడా ఏ సెంటర్ ఈ విధి ద్వారా వారుసులను తీసుకువస్తారో చూస్తాను. ఇప్పుడు వారసుల యొక్క చిమ్ - చిమ్ మెరుపు చూపించండి. అనుభూతి చేయించడం ద్వారా ఈ సేవ జరుగుతుంది. అన్నింటికంటే అనుభవం అనేది ఉన్నతమైన అధికారం. అనుభవీలను ఎవరు మార్చలేరు. మంచిది.
డబల్ విదేశీయులకు ఏదైనా వ్యర్ధ విషయానికి, వ్యతిరేక విషయానికి, జరిగిపోయిన విషయానికి మనస్సు ద్వారా బిందువు పెట్టడం వస్తుందా? డబల్ విదేశీయులు ఎటువంటి జరిగిపోయిన విషయం అయినా, మంచి విషయం అయితే అసలు మర్చిపోవటం అనేది ఉండదు, వ్యర్థవిషయాలనే మర్చిపోవలసి ఉంటుంది, కనుక ఏ విషయాన్ని మర్చిపోవాలో దానికి సెకనులో బిందువు పెడుతున్నారా? పెడుతున్నారా? విదేశీయులు ఎవరైతే పెడుతున్నాము అంటున్నారో వారు చేతులు ఎత్తండి! పెద్దగా, నిదానంగా చేతులు ఎత్తండి! శుభాకాంక్షలు. మంచిది ఎవరైతే ఒక సెకనులో కాదు, ఒక గంట పడుతుంది అంటారో వారు చేతులు ఎత్తండి? సెకను అయితే చాలా తక్కువ కదా! ఒక గంట తర్వాత బిందువు పెట్టగలుగుతున్నాము అన్నవారు చేతులు ఎత్తండి! విదేశీయులు చాలా మంచిగా ఉన్నారు. భారతవాసీయులు ఒక గంటలో కాదు కానీ సగం రోజులో బిందువు పెట్టగలము అనేవారు చేతులు ఎత్తండి! బాప్ దాదాకి అయితే తెలుసు. బాప్ దాదా చూస్తున్నారు - చేతులు ఎత్తడం లేదు కానీ సమయం పడుతుంది. కానీ అర్ధం చేసుకోండి, సగం రోజు పడుతుంది లేదా ఒక గంట పడుతుంది అంటే అప్పుడే మీకు ఎడ్వాన్స్ పార్టీ యొక్క ఆహ్వానం వస్తే ఏం చేస్తారు? ఏమి ఫలితం ఉంటుంది? అంతిమతి సోగతి ఏమౌతుంది? తెలివైనవారు కదా? అందువలన మీ యొక్క మనస్సుని బిజీగా ఉంచుకుంటారు కదా! మనసాసేవ యొక్క దినచర్య తయారు చేసుకుంటే బిందువు పెట్టే అవసరమే ఉండదు. బిందురూపంలోనే ఉంటారు. మనస్సు సదా బిజీగా ఉంచుకోండి, ఖాళీగా ఉంచకండి. మరలా శ్రమ చేయవలసి వస్తుంది. ఉన్నతోన్నతమైన భగవంతుని యొక్క పిల్లలు కనుక మీ యొక్క ఒక్కొక్క 'సెకను యొక్క దినచర్య నిర్ణయం అయ్యి ఉండాలి. బిందువు ఎందుకు పెట్టలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటి? కొంతమంది పిల్లలు చాలా శ్రమ చేసున్నారు, బాప్ దాదా చూస్తుంటే పిల్లలు చాలా శ్రమ చేస్తున్నారు, ఇది జగరకూడదు, ఇది జగకూడదు .... అవ్వకూడదు అంటున్నారు కానీ అవుతుంది. బాప్ దాదాకి పిల్లల యొక్క శ్రమ ఇష్టమనిపించడంలేదు. కారణం ఇదే - రావణుడిని చంపుతున్నారు కూడా కానీ కేవలం చంపడం ద్వారా వదలడు. అంటిస్తున్నారు మరియు అంటిస్తారు. తర్వాత మరలా ఎముకలు ఏవైతే ఉన్నాయో వాటిని నదిలో కలిపేస్తారు. అప్పుడే సమాప్తి అవుతుంది. ఎవరైనా మనుష్యులు చనిపోయినా కానీ ఎముకలు కూడా నదిలో కలిపేస్తారు అప్పుడు సమాప్తి అంటారు. మీరేమి చేస్తున్నారు? జ్ఞానం యొక్క విషయాల ద్వారా, ధారణ యొక్క పాయింట్స్ ద్వారా ఆ విషయం అనే రావణుడిని చంపుతున్నారు కానీ యోగాగ్నిలో స్వాహా చేయటం లేదు. మరియు మరలా ఆ విషయం యొక్క కొన్ని ఎముకలు మిగిలి ఉంటాయి కదా! వాటిని జ్ఞాన సాగరుడైన బాబాకి అర్పణ చేయండి. మూడు పనులు చేయండి - ఒక పని చేయకండి. మీరయితే పురుషార్థం అయితే చేసాము కదా, మురళి కూడా చదువుకున్నాము, 10 సార్లు కూడా మురళి చదువుకున్నాము మరలా వచ్చేసింది అంటున్నారు. ఎందుకంటే మీరు యోగాగ్నిలో కాల్చలేదు, స్వాహా చేయలేదు. అగ్నిలో వేసిన తర్వాత గుర్తులన్నీ సమాప్తి అయిపోతాయి. మరలా వాటిని బాబా యొక్క సాగరంలో వేసేయండి అప్పుడు సమాప్తి అయిపోతాయి. అందువలనే ఈ సంవత్సరంలో బాప్ దాదా ప్రతి ఒక్క పిల్లవాడిని వ్యర్ధం నుండి ముక్తిగా చూడాలనుకుంటున్నారు. ముక్తి సంవత్సరం జరుపుకోండి. ఏ లోపం ఉన్నా దానికి ముక్తి నివ్వండి. ఎప్పటివరకు దానికి ముక్తినివ్వరో అప్పటివరకు బాబా వెంట ముక్తిధామానికి వెళ్ళలేరు. ముక్తినిచ్చేస్తారా? ముక్తి సంవత్సరం జరుపుకుంటారా? జరుపుకుంటాము అనేవారు చేతులు ఊపండి. జరుపుకుంటారా? ఒకరికొకరు చూసారు కదా! జరుపుకుంటారు కదా! మంచిది, ఒకవేళ ముక్తి సంవత్సరం జరుపుకుంటే కనుక వజ్రాలతో పొదిగిన పళ్ళాలతో బాప్ దాదా చాలా, చాలా శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ ఇస్తారు. మంచిది, మీకు మీరు కూడా ముక్తి చేసుకోండి. మీ యొక్క సోదరి, సోదరులను కూడా దు:ఖం నుండి దూరం చేయండి. మన తండ్రి వచ్చేశారు అని దీనుల మనస్సు నుండి సంతోషంతో ఈ మాట రావాలి.
ఇక మిగిలినది, దాదీలు అడుగుతున్నారు - బాప్ దాదా యొక్క ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? అని. బాప్ దాదా చెప్తున్నారు - ఇప్పటి వరకు ఎలా అయితే ప్రోగ్రామ్ నడుస్తుందో ఆ విధితోనే నడుస్తుంది. ఎప్పుడైనా అవసరం అయితే దాదీల ఆశను పూర్తి చేస్తాను కానీ అవసరం అయితేనే వస్తాను. బాబా రావటం అయితే సహజమే కదా, బాప్ దాదా ఎందుకు రారు అని దాదీ భావిస్తున్నారు! కానీ రథాన్ని కూడా చూడండి. 33 సంవత్సరాలు పాత్ర అభినయించడం కూడా శక్తులను ఇంత గొప్పగా ధారణ చేయటం అంటే చిన్నవిషయం కాదు. దాదీ ఏం చేస్తున్నారు అంటే ఏదైనా విషయం వస్తే ఇప్పడిప్పుడే వెళ్ళి సందేశం తీసుకురమ్మంటున్నారు. ఇప్పుడు పగలు కదా రాత్రి వెళ్తాను అని దాదీ (గుల్జార్ దాదీ) అంటే కాదు ఇప్పుడే వెళ్ళాలి అంటున్నారు. చనిపోవలసి ఉంటుంది కదా! శరీరంతో అయితే చనిపోవలసి ఉంటుంది కదా! సందేశం అయినా, బాప్ దాదా ప్రవేశానికి ఆహ్వానించటం అయినా, బాప్ దాదాని ఆహ్వానించటం అనేది పెద్ద విషయం కానీ సందేశం కొరకు కూడా అశరీరిగా అవ్వాలి కదా, చనిపోవాలి, అలా చనిపోవటం మధురమైనది అయినా కానీ చనిపోవాలి ! అందువలన అయినా బాప్ దాదాకి దాదీలంటే చాలా - చాలా - చాలా గౌరవం మరియు ప్రేమ. ప్రేమ యొక్క త్రాడుతో బందీగా అవ్వటం బాగా వచ్చు. మంచిది.
నలువైపుల ఉన్న పవిత్రమైన ఆత్మలందరికీ, సదా నిర్మాణంగా అయ్యి నిర్మాణం చేసేటటువంటి బాప్ దాదా యొక్క సమీప ఆత్మలకు, సదా తమ పురుషార్ధం యొక్క విధిని తీవ్రంగా చేసుకుని సంపన్నంగా అయ్యే స్నేహి ఆత్మలకు, సదా తమ యొక్క పొదుపు ఖాతాను పెంచుకునే తీవ్రపురుషార్థులకు, తీవ్రబుద్ది కల్గిన విశాల బుద్ధికి శుభాకాంక్షలు మరియు హోలీ యొక్క అంటే జగిరిపోయిందేదో జరిగిపోయింది అని సెకనులో బిందువు పెట్టే పిల్లలకు చాలా, చాలా ప్రియస్మృతులు, కోనకోనల్లో ఉన్న పిల్లలందరికీ బాప్ దాదా విశేష ప్రియస్మృతులు ఇస్తున్నారు. మీ లెక్కాచారం, ప్రియస్మృతులతో కూడిన ఉత్తరాలు, కార్డులు మరియు మనస్సు యొక్క సంకల్పం అన్నీ చేరుకున్నాయి. మనస్సు యొక్క ఆత్మిక సంభాషణ కూడా చేరుకుంది. వాటన్నింటికీ బదులుగా బాప్ దాదా పదమాగుణాలు (కోటానుకోట్ల రెట్లు) ప్రియస్మృతులు ఇస్తున్నారు. ప్రియస్మృతులతో పాటు పిల్లలందరికీ నమస్తే.
Comments
Post a Comment