23-10-1999 అవ్యక్త మురళి

             23-10-1999         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సమయం యొక్క పిలుపు - దాతగా అవ్వండి.

ఈరోజు సర్వ శ్రేష్ట భాగ్య విధాత, సర్వశక్తుల దాత బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలందరినీ చూసి హర్షిస్తున్నారు. మధువనంలో సన్ముఖంగా ఉన్నా, దేశ, విదేశాలలో స్మృతిలో వింటున్నా, చూస్తున్నా, ఎక్కడ కూర్చున్నా కానీ మనస్సుతో సన్ముఖంగా ఉన్నారు. ఆ పిల్లలందరినీ చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. మీరందరు కూడా సంతోషిస్తున్నారు కదా! పిల్లలు కూడా సంతోషం, బాప్ దాదా కూడా సంతోషం. మనస్సు యొక్క సదా సత్యమైన ఈ సంతోషమే ప్రపంచం యొక్క దు:ఖాలన్నింటినీ దూరం చేస్తుంది. మనస్సు యొక్క ఈ సంతోషం ఆత్మలకు బాబా యొక్క అనుభూతిని చేయిస్తుంది. ఎందుకంటే బాబా కూడా సర్వ ఆత్మలకు సదా సేవాధారి మరియు పిల్లలైన మీరందరు కూడా బాబాతో పాటు సేవలో సహయోగులు. సహయోగులు కదా! బాబా యొక్క సహయోగులు మరియు విశ్వంలోని దు:ఖాలను పరివర్తన చేసి సదా సంతోషంగా ఉండే సాధనం చెప్పే సేవలో సదా ఉపస్థితులై ఉంటున్నారు! సదా సేవాధారులు. కేవలం 4 గంటలు లేదా 6 గంటలు సేవ చేసేవారు కాదు. ప్రతి సెకను సేవా వేదికపై పాత్ర అభినయించే పరమాత్మ సహయోగులు, స్మృతి ఎలా అయితే నిరంతరం ఉంటుందో అదేవిధంగా సేవ కూడా నిరంతరం ఉండాలి. మిమ్మల్ని మీరు నిరంతర సేవాధారిగా అనుభవం చేసుకుంటున్నారా? లేక 8 గంటలు, 10 గంటల సేవాధారులా? ఈ బ్రాహ్మణ జన్మయే స్మృతి మరియు సేవ కోసం. ఇంకేమైనా చేయాలా ఏమిటి? ఇదే కదా! ప్రతి శ్వాస, ప్రతి సెకను స్మృతి మరియు సేవ వెనువెంట ఉండాలా లేక స్మృతి యొక్క గంటలు వేరుగా, సేవ యొక్క గంటలు వేరుగా ఉంటాయా? కాదు కదా! మంచిది, సమానత ఉందా? ఒకవేళ 100% సేవ ఉంటే 100% స్మృతి ఉందా? రెండింటి సమానత ఉందా? తేడా ఉంటుంది కదా? కర్మయోగి అంటే కర్మ మరియు యోగం, సేవ మరియు స్మృతి యొక్క సమానత ఉండాలి అని అర్ధం. ఒక సమయంలో స్మృతి ఎక్కువగా, సేవ తక్కువగా ఇలా ఉండకూడదు. లేక సేవ ఎక్కువగా, స్మృతి తక్కువగా ఉండకూడదు. వేదికపై ఉన్నంత సేపు ఆత్మ మరియు శరీరం వెనువెంటే ఉంటాయి కదా, వేరవ్వగలవా? అలాగే స్మృతి మరియు సేవ వెనువెంట ఉండాలి. స్మృతి అంటే బాబా సమానంగా, స్వయం యొక్క స్వమానం కూడా స్మృతి ఉండాలి. బాబా స్మృతి ఉన్నప్పుడు స్వమానం యొక్క స్మృతి కూడా స్వతహాగానే ఉంటుంది. ఒకవేళ స్వమానంలో ఉండకపోతే స్మృతి కూడా శక్తిశాలిగా ఉండదు. 

స్వమానం అంటే బాబా సమానం. సంపూర్ణ స్వమానం - బాబా సమానంగా అవ్వడం. ఇలా స్మృతిలో ఉండే పిల్లలు సదా దాతగానే ఉంటారు కానీ తీసుకునేవారిగా ఉండరు. దేవత అనగా ఇచ్చేవారు. కనుక ఈ రోజు బాప్ దాదా పిల్లలందరి యొక్క దాత స్థితిని పరిశీలిస్తున్నారు - దాత యొక్క పిల్లలు ఎంత వరకు దాతగా అయ్యారు? అని. బాబా ఎప్పుడూ కూడా తీసుకోవాలనే సంకల్పం చేయరు, ఇచ్చేటటువంటి సంకల్పమే చేస్తారు. పాతవి అన్నీ ఇచ్చేయండి అని అడిగినా కానీ వాటికి బదులు కొత్తవి ఇస్తారు. బాబా తీసుకోవడం అంటే ఇవ్వడం. కనుక వర్తమాన సమయంలో బాప్ దాదాకి పిల్లల యొక్క ఒక టాఫిక్ (విషయం) చాలా మంచిగా అనిపించింది. అది ఏ టాఫిక్? విదేశీయుల టాఫిక్ అది, ఏమిటి? (సమయం యొక్క పిలుపు) బాప్ దాదా చూస్తున్నారు - పిల్లల కోసం సమయం యొక్క పిలుపు ఏమిటి? అని. మీరయితే విశ్వం కోసం, సేవ కోసం సమయం యొక్క పిలుపు ఏమిటి అని చూస్తున్నారు. బాప్ వాదా సేవలో సహయోగియే కానీ పిల్లల కోసం సమయం యొక్క పిలుపు ఏమిటి? అని చూస్తున్నారు. సమయం యొక్క పిలుపు ఏమిటి? అని మీరు కూడా ఆలోచిస్తున్నారు కదా! మీ కోసం ఆలోచించుకోండి. సేవ కోసం అయితే ఉపన్యాసం చెప్తున్నారు, చెప్తున్నారు కదా! కానీ మా కోసం సమయం యొక్క పిలుపు ఏమిటి? అని మిమ్మల్ని మీరు అడగండి. వర్తమాన సమయం యొక్క పిలుపు ఏమిటి బాప్ దాదా చూస్తున్నారు - ఇప్పుడు సమయం అనుసరించి, ప్రతి సమయం, ప్రతి బిడ్డకి దాత స్థితి యొక్క స్మృతి ఇంకా పెరగాలి. స్వ ఉన్నతి పట్ల దాత స్థితి, సర్వుల పట్ల స్నేహం ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. ఎవరు ఎలా ఉన్నా కానీ, ఏమైనా కానీ నేను ఇవ్వాలి అని అనుకోవాలి. దాతలు సదా బేహద్ వైరాగ్యవృత్తి కలిగి ఉంటారు, హద్దు ఉండదు మరియు సంపన్నంగా, నిండుగా ఉంటారు. దాతలు సదా మాస్టర్ క్షమాసాగరులుగా ఉంటారు. దీని కారణంగా హద్దులోని తమ సంస్కారాలు లేదా ఇతరుల సంస్కారాలు ప్రత్యక్షం అవ్వవు, గుప్తమైపోతాయి. ఎవరు ఇచ్చినా, ఇవ్వకపోయినా నేను ఇవ్వాలి, నేను దాతగా అవ్వాలి అని స్మృతి ఉంచుకోవాలి. ఏ సంస్కారానికి పరవశం అయిన ఆత్మకి అయినా నేను సహయోగం ఇవ్వాలి. ఎవరి యొక్క హద్దు సంస్కారం మిమ్మల్ని ప్రభావితం చేయకూడదు. ఎవరు గౌరవం ఇచ్చినా, ఇవ్వకపోయినా నేను ఇవ్వాలి. ఈ విధమైన దాత స్థితి ఇప్పుడు ప్రత్యక్షమవ్వాలి. మనస్సులో భావన అయితే ఉంది కానీ, కానీ..... అనే మాట రాకూడదు. నేను చేయవలసిందే. ఎవరైనా ఆవిధమైన నడవడిక నడుస్తున్నా, మాటలు మాట్లాడుతున్నా, ఒకవేళ అవి మీకు పనికి రాకపోతే, మంచిగా అనిపించకపోతే వాటిని తీసుకోకండి. చెడు వస్తువు తీసుకుంటారా? మనస్సులో ధారణ చేయడం అంటే తీసుకోవడం, బుద్ధి వరకు కూడా తీసుకోకూడదు. బుద్ధి వరకు కూడా రాకూడదు. అది చెడు విషయం, మంచి విషయం కానప్పుడు దానిని మనస్సు, బుద్ది వరకు తీసుకురాకండి లేదా ధారణ చేయకండి. తీసుకోవడానికి బదులు దాత అయ్యి శుభ భావన, శుభ కామన ఇవ్వండి. తీసుకోకండి, ఎందుకంటే ఇప్పుడు సమయం అనుసరించి మనస్సు, బుద్ది ఖాళీగా లేకపోతే నిరంతర సేవాధారిగా కాలేరు. మనస్సు, బుద్ధి ఇతర విషయాలలో బిజీ అయిపోతే ఇక సేవ ఏమి చేస్తారు? మరలా లౌకికంలో కొందరు 8 గంటలు, 10 గంటలు పని చేస్తారు ఇక్కడ కూడా ఈవిధంగా అయిపోతుంది. 8 గంటలు లేదా 6 గంటల సేవాధారి అవుతారు కానీ నిరంతర సేవాధారిగా కాలేరు. మనసాసేవ చేయండి, వాచా సేవ చేయండి, కర్మ అనగా సంబంధ, సంపర్కాల ద్వారా చేయండి కానీ ప్రతి సెకను దాత అంటే సేవాధారి అవ్వండి. బుద్ధిని ఖాళీగా ఉంచుకోవడం ద్వారా బాబా యొక్క సేవలో సహయోగిగా కాగలరు. మనస్సుని సదా స్వచ్ఛంగా ఉంచుకోవడం ద్వారా నిరంతరం బాబా సేవకి సహయోగిగా కాగలరు. మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటి? వెంట ఉంటాము, వెంటే వెళ్తాము అని. ప్రతిజ్ఞ చేసారు కదా? లేక నీవు ముందు వెళ్ళు, మేము వెనుక వస్తాము అని అన్నారా? లేదు కదా! వెంట ఉండే ప్రతిజ్ఞ చేసారు కదా? బాబా సేవ లేకుండా ఉంటారా? స్మృతి లేకుండా కూడా ఉండరు. బాబా స్మృతిలో ఎంత ఉంటారో అంత మీరు శ్రమతో చేస్తున్నారు. చేస్తున్నారు కానీ శ్రమతో, ధ్యాసతో చేస్తున్నారు. బాబాకి ఉన్నది ఇంకేమిటి? పరమాత్మకి ఉన్నవారు ఆత్మలే. ఆత్మలు నెంబరువారీ అయినా కానీ బాబా, పిల్లల స్మృతి లేకుండా ఉండలేరు. బాబా తన పిల్లల స్మృతి లేకుండా ఉండగలరా? మీరు ఉండగలరా? అప్పుడప్పుడు తుంటరి వారిగా అయిపోతున్నారు. ఏమి విన్నారు? సమయం యొక్క పిలుపు - దాత అవ్వండి. ఇది చాలా అవసరం. విశ్వంలోని ఆత్మలందరి పిలుపు ఏమిటంటే - ఓ మా ఇష్ట దేవతలూ! ఇష్టమైనవారు కదా! ఏదోక రూపంలో సర్వాత్మలకి ఇష్టమైనవారు. ఇప్పుడు సర్వాత్మల పిలుపు - ఓ ఇష్టదేవీ, దేవతలూ! పరివర్తన చేయండి అని. ఈ పిలుపు వినిపిస్తుందా? పాండవులకు ఈ పిలుపు వినిపిస్తుందా? విని ఏమి చేస్తున్నారు? వినబడుతున్నప్పుడు ముక్తినిస్తున్నారా లేక చేద్దామని ఆలోచిస్తున్నారా? పిలుపు వినిపిస్తుందా? సమయం యొక్క పిలుపు వినిపిస్తున్నారు మరియు ఆత్మల పిలుపు కేవలం విని ఊరుకుంటున్నారా? కనుక ఇష్టదేవీ దేవతలూ! ఇప్పుడు మీ దాతస్థితి యొక్క రూపాన్ని ప్రత్యక్షం చేయండి. అందరికీ ఇవ్వాలి, ఏ ఆత్మ వంచితం కాకూడదు. లేకపోతే నిందలమాలలు పడతాయి. నిందిస్తారు కదా! కనుక నిందల మాలను ధరించే ఇష్టదేవతాలా లేక పూలమాల ధరించే ఇష్టదేవతలా? ఎవరు? పూజ్యులు కదా? మేము వెనుక వచ్చినవాళ్ళం అని అనుకోకండి. పెద్ద, పెద్ద వారు దాతగా అవుతారు కానీ మేము ఎక్కడ అవుతాము అనుకోకండి. అందరూ దాతగా అవ్వాలి. 

ఎవరైతే మొదటిసారిగా మధువనం వచ్చారో వారు చేతులు ఎత్తండి! మంచిది - ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు దాతగా కాగలరా లేక రెండు, మూడు సంవత్సరాలలో అవుతారా? ఒక సంవత్సరం వారు దాత కాగలరా? (కాగలం) చాలా మంచి తెలివైనవారు. బాప్ దాదా ధైర్యానికి చాలా సంతోషిస్తున్నారు. ఒక నెల వారైనా, ఒక సంవత్సరం లేదా ఆరు నెలల వారు అయినా కానీ బాప్ దాదాకి తెలుసు, ఒక నెల అయినా కానీ స్వయాన్ని బ్రహ్మాకుమారి లేదా బ్రహ్మాకుమారుడు అని పిలిపించుకుంటారు కదా! కనుక బ్రహ్మాకుమారి, బ్రహ్మాకుమారులు అంటే బ్రహ్మాబాబా యొక్క వారసత్వానికి అధికారిగా అయిపోయారు. బ్రహ్మని తండ్రిగా అంగీకరించిన తర్వాతే కుమారి, కుమారులుగా అయ్యారు కదా? కనుక బ్రహ్మాకుమార్, బ్రహ్మాకుమారీలు, బ్రహ్మబాబా మరియు శివబాబా యొక్క వారసత్వానికి అధికారిగా అయ్యారు కదా! లేక ఒక నెల వారికి వారసత్వం లభించదా? వచ్చి ఒక నెల అయిన వారికి వారసత్వం లభిస్తుందా? వారసత్వం లభించినప్పుడు ఇవ్వడానికి దాత అవుతారు కదా! ఏదయితే లభించిందో దానిని ఇవ్వడం ప్రారంభించాలి కదా! తండ్రిగా భావించి సంబంధం జోడిస్తే ఒక రోజులో కూడా వారసత్వం తీసుకోవచ్చు. బావుంది, ఏదో శక్తి ఉంది, అర్ధమవుతుంది..... కేవలం ఇలా అనటం కాదు. వారసత్వానికి అధికారి అయిన పిల్లలు అర్ధం చేసుకునేవారిగా మరియు చూసేవారిగా ఉండరు. ఒక్క రోజులో కూడా మనస్సుతో తండ్రి అని అంగీకరిస్తే వారసత్వానికి అధికారిగా కాగలరు. మీరందరు అధికారులే కదా! మీరందరు బ్రహ్మాకుమారీ, బ్రహ్మాకుమారులే కదా లేక అవుతున్నారా? అయిపోయారా లేక అవ్వడానికి వచ్చారా? ఎవరూ మిమ్మల్ని మార్చలేరు కదా? బ్రహ్మాకుమారీ, కుమారులకు బదులు కేవలం కుమారీ, కుమారులుగా అవ్వండి అంటే కాలేరా? బ్రహ్మాకుమారీ, బ్రహ్మాకుమారులుగా అవ్వడంలో ఎంత లాభం ఉంది? ఒక జన్మకి కాదు, అనేక జన్మలకి లాభం ఉంది.సగం జన్మ లేదా పావు జన్మ పురుషార్ధం చేస్తున్నారు, ప్రాప్తి అనేక జన్మలకు పొందుతున్నారు. లాభమే లాభం కదా! 

బాప్ దాదా సమయం అనుసరించి వర్తమాన సమయంలో విశేషంగా ఒక విషయంపై ధ్యాస ఇప్పిస్తున్నారు. ఎందుకంటే బాప్ దాదా పిల్లల యొక్క ఫలితం చూస్తూ ఉంటారు కదా! కనుక ఫలితంలో ఏమి చూసారంటే ధైర్యం చాలా బావుంది, లక్ష్యం కూడా చాలా మంచిగా ఉంది కానీ లక్ష్యం అనుసరించి లక్ష్యం మరియు లక్షణాలలో ఇప్పటివరకు తేడా ఉంది. లక్ష్యం అందరికీ నెంబర్ వన్ అవ్వాలి అని ఉంది. బాప్ దాదా ఎవరినైనా కానీ మీ లక్ష్యం 21 జన్మల భాగ్యం పొందాలనా, సూర్యవంశీగా అవ్వాలనా లేక చంద్రవంశీ అవ్వాలనా? అని అడిగితే అందరు దేనిలో చేతులు ఎత్తుతారు? సూర్యవంశంలోనే ఎత్తుతారు కదా! చంద్రవంశీ అవ్వాలనుకున్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఇలా అనుకునేవారు ఉన్నారా? వెనుక కూర్చున్నవారు ఎవరైనా ఉన్నారా? రాముడుగా అయ్యేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరా! ఒకరైనా అవ్వండి. ఎవరొకరు రామునిగా అవ్వాలి కదా! (ఒకరు చేయి ఎత్తారు) మంచిది, లేకపోతే రాముడి సీట్ ఖాళీగా ఉండిపోతుంది. కనుక లక్ష్యం అందరికీ మంచిగా ఉంది. లక్ష్యం మరియు లక్షణాలలో సమానతపై ధ్యాస పెట్టడం చాలా అవసరం. దీనికి కారణం ఏమిటి? ఈరోజు చెప్పాను కదా - అప్పుడప్పుడు తీసుకునేవారిగా అయిపోతున్నారు. ఇది అవ్వాలి, వీరు చేయాలి, వీరు సహాయం చేయాలి, వీరు మారితే నేను మారతాను, ఈ విషయం సరయితే నేను సరిగా అవుతాను... ఇలా అనటం అంటే తీసుకునేవారిగా అవ్వడం. దాత స్థితి కాదు. ఎవరు ఇచ్చినా, ఇవ్వకపోయినా బాబా అయితే అన్నీ ఇచ్చేశారు. బాబా కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇచ్చారా? కోర్స్ అందరికీ ఒకటే కదా! 60 సంవత్సరాలవారైనా, ఒక నెల వారైనా అందరికీ కోర్స్ ఒకటే కదా! లేక 60 సంవత్సరాల వారికి వేరే కోర్స్, ఒక నెల వారికి వేరే కోర్స్ ఉందా? వారు కూడా అదే కోర్స్ తీసుకున్నారు, ఇప్పుడు కూడా అదే కోర్స్, అదే జ్ఞానం, అదే ప్రేమ, అవే సర్వశక్తులు, అన్నీ ఒకే విధమైనవి. వారికి 16 శక్తులు, వీరికి 8 శక్తులు కాదు. అందరికీ ఒకే విధమైన వారసత్వం లభిస్తుంది. బాబా అందరినీ నిండుగా చేసినప్పుడు నిండుగా ఉన్న ఆత్మ దాతగా అవుతుంది కానీ తీసుకునేవారిగా కాదు. నేను ఇవ్వాలి అనే భావన ఉంటుంది. ఎవరు ఇచ్చినా, ఇవ్వకపోయినా తీసుకునే కోరిక ఉండదు, ఇవ్వాలనే కోరికతో ఉంటారు మరియు ఎంత ఇస్తూ ఉంటారో, దాతగా అవుతారో ఖజానా అంతగా పెరుగుతూ ఉంటుంది. ఎవరికైనా మీరు స్వమానం ఇచ్చారు, ఇతరులకు ఇవ్వడం అంటే మీ స్వమానాన్ని పెంచుకోవడం. అది ఇచ్చినట్లు కాదు. ఇవ్వడం అంటే తీసుకోవడం. తీసుకోకండి, ఇస్తూ ఉండండి అదే తీసుకోవడం అయిపోతుంది. సమయం యొక్క పిలుపు ఏమిటో అర్థమైందా? దాత అవ్వండి. ఒక పదం స్మృతి ఉంచుకోవాలి. ఏ విషయం జరిగినా కానీ “దాత” అనే పదాన్ని సదా స్మృతిలో ఉంచుకోవాలి. ఇచ్ఛామాత్రం అవిద్యా అవ్వాలి. స్థూలంగా మరియు సూక్ష్మంగా కూడా తీసుకోవాలనే కోరిక ఉండకూడదు. దాత అంటే ఇచ్చామాత్రం అవిద్యా అని అర్థం. సంపన్నంగా ఉంటారు, తీసుకోవాలనే కోరిక కలగడానికి వారికి ఏ లోటు అనుభవం అవ్వదు. సర్వప్రాప్తి సంపన్నంగా ఉంటారు. అయితే లక్ష్యం ఏమిటి? సంపన్నంగా అవ్వాలని కదా? లేక ఎంత లభిస్తే అంత చాలా? సంపన్నంగా అవ్వడమే సంపూర్ణంగా అవ్వడం. ఈ రోజు విశేషంగా డబల్ విదేశీయులకు అవకాశం లభించింది. మంచిది, మొదటి అవకాశం విదేశీయులే తీసుకున్నారు, గారాభమైన పిల్లలు కదా! అందరినీ వద్దన్నారు, విదేశీయులకు ఆహ్వానం ఇచ్చారు. బాప్ దాదాకి కూడా పిల్లలందరు స్మృతి ఉంటారు అయినా కానీ డబల్ విదేశీ పిల్లలను చూసి, వారి ధైర్యాన్ని చూసి చాలా సంతోషిస్తున్నారు. ఇప్పుడు వర్తమాన సమయంలో ఎక్కువ అలజడిలోకి రావటం లేదు. ఇప్పుడు తేడా వచ్చింది. ఆదిలో ప్రశ్నలు ఉండేవి.. ఇది భారతీయ సంస్కృతి, ఇది విదేశీ సంస్కృతి అని ..... కానీ ఇప్పుడు అర్ధం అయిపోయింది. ఇప్పుడు బ్రాహ్మణ సంస్కృతిలోకి వచ్చేశారు. భారతీయ సంస్కృతి లేదు, విదేశీ సంస్కృతి లేదు. బ్రాహ్మణ సంస్కృతిలోకి వచ్చేసారు. భారతీయ సంస్కృతి కొద్దిగా గొడవ తెస్తుంది కానీ బ్రాహ్మణ సంస్కృతి సహజం కదా! బ్రాహ్మణ సంస్కృతి ఏమిటంటే స్వమానంలో ఉండండి మరియు స్వరాజ్యాధికారి అవ్వండి. ఇదే బ్రాహ్మణుల సంస్కృతి! ఇది ఇష్టమే కదా? భారతీయ సంస్కృతి ఎలా వస్తుంది, కష్టం ఇలా ప్రశ్నలు ఏమీ లేవు కదా? సహజం అయిపోయింది కదా? మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా కష్టం అని వ్రాయకూడదు. సహజం అని అయితే అనేసారు కానీ కొద్దిగా కష్టం అనిపిస్తుందా? సహజమేనా? కొద్దికొద్దిగా కష్టమా? కొంచెం కూడా కష్టం లేదా? చాలా సహజమా? ఆట అంతా పూర్తి అయిపోయింది కనుక నవ్వు వస్తుంది. ఇప్పుడు పక్కా అయిపోయారు. చిన్నతనం యొక్క ఆటలు సమాప్తి అయిపోయాయి. ఇప్పుడు అనుభవిగా అయిపోయారు. బాప్ దాదా చూస్తున్నారు - పాతవారు ఎంతెంతగా పక్కా అవుతూ ఉంటారో అంతంతగా కొత్తగా వచ్చేవారు కూడా పక్కా అయిపోతారు. మంచిది, ఒకరినొకరు మంచిగా ముందుకి తీసుకువెళ్తున్నారు. మంచిగా శ్రమిస్తున్నారు. దాదీల దగ్గరకి పోట్లాటలు అయితే తీసుకువెళ్ళడం లేదు కదా! పోట్లాటలు, కథలు దాదీల దగ్గరకి తీసుకువెళ్తున్నారా? తగ్గిపోయాయా! తేడా వచ్చింది కదా! (జానకీదాదీతో) ఇప్పుడు మీరు అనారోగ్యంగా లేరు కదా? పోట్లాటలు, కథల ద్వారా అనారోగ్యం వస్తుంది, అవి ఇప్పుడు సమాప్తి అయిపోయినవి. మంచిది. అందరిలో అన్నింటికంటే మంచి విశేష గుణం - మనస్సు యొక్క స్వచ్ఛత, లోపల ఉంచుకోరు, బయట పెట్టేస్తారు. ఏ విషయం అయినా సత్యమైన మనస్సుతో చెప్పేస్తారు. ఇలా కాదు అలా..... ఇలా తారుమారు చేయరు, ఉన్న విషయాన్ని చెప్పేస్తారు. ఈ విశేషత చాలా మంచిది. అందువలనే బాబా అంటారు - సత్యమైన మరియు స్వచ్చమైన హృదయానికి బాబా రాజీ అవుతారు. చేస్తాం అంటే చేస్తాం అంటారు, లేకపోతే లేదు అంటారు. చూస్తాం అని అనరు. కష్టంతో నడవరు, నడిస్తే పూర్తిగా నడుస్తారు, లేకపోతే లేదు. 

బాప్ దాదా దేశవిదేశాల యొక్క మీటింగ్ చూసారు. చాలా మీటింగ్లు చేసారు కదా! సమయం తీసి అందరూ ప్లాన్ తయారుచేసారు, మంచిగా శ్రమించారు మరియు మంచిగా సంఘటితం చేసారు. దీనికి బాప్ దాదా సంతోషిస్తున్నారు. సంఘటన ద్వారా ఏ కార్యం అయినా సహజంగా సఫలం అవుతుంది. డబల్ విదేశీయులు మీటింగ్ లో సంఘటనా శక్తి యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించారు. ధైర్యంతో మరియు శ్రమించి పిల్లలు తయారుచేసిన ప్లాన్స్ చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఆర్.సి.ఓ గ్రూపు వారు విశేషసేవ కోసం వచ్చారు, అలా వచ్చిన ఆర్.సి.ఓ గ్రూపు (అయిదు ఖండాల యొక్క సేవకి నిమిత్తమైన ముఖ్య సోదరీ సోదరులు) వారందరికీ బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. మంచి, మంచి ప్లాన్స్ తయారుచేసారు. ఎక్కడ ఏవిధంగా నడవగలరో, ఎంతగా నడవగలరో అంతగా నడిపించండి. పెద్ద పట్టణాలు మరియు చిన్న పట్టణాలకు తేడా అయితే ఉంటుంది కదా! కనుక ఎంతగా ధైర్యం పెట్టుకుని, సమయం ఉపయోగించి, శ్రమించారో అంతగా వాటిని (ప్లాన్) ప్రత్యక్షంలోకి తీసుకురండి. కేవలం ఒక విషయం స్మృతి ఉంచుకోవాలి - సేవ మరియు స్వ ఉన్నతి యొక్క సమానతలో తేడా రాకూడదు. ప్లాన్ ప్రత్యక్షంలోకి వచ్చిన తర్వాత సేవలో బిజీ అయిపోయిన కారణంగా స్వ ఉన్నతిలో తేడా వచ్చింది అని అనకూడదు. రెండింటి సమానత సదా ఉంచు కోవాలి. ఎందుకు? ఇతరుల సేవ చేసి స్వయం యొక్క సేవ లేకపోతే అది బావుండదు. రెండింటి సమానత ఉంచుకోవడమే సఫలత. అర్థమైందా! మంచిది. 

ఎవరైతే ఆర్.సి.ఓ లో వచ్చారో వారు చేతులు ఎత్తండి! ఇంటర్నేషనల్ సర్వీస్ గ్రూప్ (అంతర్జాతీయ సేవా గ్రూప్) వారు కూడా చేతులు ఎత్తండి! మంచిది, శుభాకాంక్షలు. సమయం తీసి భట్టీలో కూడా కూర్చున్నారు, మంచిది. మధువనంలో అవకాశం కూడా మంచిది! అందరు ఒకరికొకరు కూడా కలుసుకుంటారు. అన్నివైపుల సమాచారం కూడా అందరికీ లభిస్తుంది. కనుక బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. చాలా మంచిగా చేసారు. అందరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారో అందరికీ బాప్ దాదా స్నేహపూర్వక శుభాకాంక్షలు ఇస్తున్నారు. అందరు ప్రియస్మృతుల ఉత్తరాలు చాలా పంపించారని సమాచారం అందింది. కనుక బాప్ దాదా అయితే ఉత్తరం చేరకముందే ప్రియస్మృతులు ఇస్తున్నారు. మీరు ఉత్తరం వ్రాయాలని సంకల్పం చేస్తారు, ఆ సంకల్పం విజ్ఞాన సాధనాల ద్వారా ఉత్తరం చేరే దాని కంటే వేగంగా చేరుతుంది. అన్నింటికంటే వేగంగా ఇ - మెయిల్ చేరుకుంటుంది. కనుక ఇ-మెయిల్ ఇవ్వడం ప్రారంభిస్తారు కానీ దాని కంటే ముందుగానే మీ సంకల్పం బాప్ దాదా దగ్గరికి చేరుకుంటుంది. ఈ సాధనాలన్నీ సేవకు సహయోగం ఇవ్వడానికి లభించాయి. ఇది ఇ - మెయిల్, ఇది ఫలానా... అని వీటి యొక్క సమాచారం బ్రహ్మాబాబా విన్నప్పుడు ఓహో పిల్లలూ! ఓహో!! అని సంతోషిస్తున్నారు. ఇన్ని సహజ సాదనాలు సాకారంలో బ్రహ్మాబాబాకి కూడా లభించలేదు. కానీ పిల్లలైన మీ దగ్గర ఉన్నాయి, అందువలన బాబా సంతోషిస్తున్నారు. వీటిని కేవలం సేవాసాధనాలుగా భావించి ఉపయోగించండి. ఈ సాధనాలన్నీ సేవ కొరకు. ఎందుకంటే విశ్వకళ్యాణం చేయాలంటే ఈ సాధనాలు కూడా సహయోగం ఇస్తాయి. సాధనాలకు వశం అవ్వకూడదు కానీ సాధనాలను సేవలో ఉపయోగించాలి. ఇది మధ్య సమయం కనుక ఈ సమయంలో సాధనాలు లభిస్తాయి. ఇన్ని సాధనాలు ఆదిలో కూడా లేవు మరియు అంతిమంలో కూడా ఉండవు. ఇవి ఇప్పుటి కొరకే, సేవ పెంచడానికే. కానీ ఇవి సాధనాలు, మీరు సాధన చేసేవారు. సాధనాల వెనుక పడి సాధన తక్కువ అవ్వకూడదు. బాప్ దాదా సంతోషిస్తున్నారు - పిల్లల దృశ్యం కూడా చూస్తున్నారు. పని ఫటాఫట్ చేసేస్తున్నారు. బాప్ దాదా మీ ఆఫీస్ కి కూడా వస్తారు, ఎలా పని చేస్తున్నారో అని చూస్తారు. చాలా బిజీగా ఉంటున్నారు కదా! ఆఫీస్ మంచిగా నడుస్తుంది కదా! ఎలా అయితే ఒక సెకనులో సాధనాలను ఉపయోగిస్తున్నారో అలాగే మధ్యమధ్యలో కొంచెం సమయం సాధన కోసం కూడా తీయండి. ఒక సెకను అయినా తీయండి. ఇప్పుడు సాధనాలపై చేయి ఉంది, మరలా ఇప్పుడిప్పుడే మధ్యమధ్యలో ఒక సెకను అయినా తీసి సాధనను అభ్యసించండి. సాధనాల విషయంలో ఎంత అభ్యాసం చేస్తారో అంత సహజంగా నడిపించగలరు కదా! అలాగే ఒక సెకనులో సాధన యొక్క అభ్యాసం కూడా చేయండి. రోజంతా చాలా బిజీగా ఉన్నాము, సమయం లేదు అని చెప్పకండి. బాప్ దాదా ఈ విషయాన్ని అంగీకరించరు. ఒక గంట సాధనాలను ఉపయోగించినప్పుడు దాని మధ్యలో 5-6 సెకనులు తీయలేరా? 5 నిమిషాలు లేదా 5 సెకనులు కూడా తీయలేనంత బిజీగా ఎవరైనా ఉన్నారా? తీయగలిగితే తీయండి. 

ఈరోజు చాలా బిజీగా ఉన్నాము, చాలా బిజీగా ఉన్నాము అని ముఖాన్ని కూడా చాలా బిజీగా చేసేసుకుంటున్నారు. దీనిని బాప్ దాదా అంగీకరించరు. ఏది కావాలంటే అది చేయగలరు కానీ ధ్యాస తక్కువగా ఉంది. 10 నిమిషాలలో ఈ ఉత్తరం పూర్తి చేయాలి అని లక్ష్యం పెట్టుకుంటారు, అందువలన ఆ సమయంలో పూర్తి చేసేయాలని బిజీగా ఉంటారు కదా! అలాగే నిమిషాలలో ఈ పని కూడా చేయాలని దినచర్య తయారు చేసుకుంటారు కదా! దీనిలో ఒకటి, రెండు నిమిషాలు ఈ అభ్యాసానికి కలుపుకోండి. 6 నిమిషాలలో ఒక పని అయిపోతుంది అనుకుంటే దానికి 6 నిమిషాలు సమయం పెట్టుకోకూడదు, ఆ 6 నిమిషాలతో పాటు 2 నిమిషాలు సాధన కోసం కలిపి 8 నిమిషాలు పెట్టుకోవాలి, ఇలా చేయగలరా? 

(అమెరికా యొక్క గాయత్రి అక్కయ్యని అడుగుతున్నారు) చాలా బిజీ, చాలా బిజీ అని ఇప్పుడిక చెప్పకూడదు. బాప్ దాదా ఆ సమయంలో ముఖాన్ని కూడా చూస్తున్నారు, ఫోటో తీసేవిధంగా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా కానీ మొదట సాధనాలతో పాటు సాధనకు సమయాన్ని కలపండి. కానీ ఏం జరుగుతుందంటే, సేవ అయితే చాలా మంచిగా చేస్తున్నారు, సమయం కూడా ఉపయోగిస్తున్నారు. దీనికి శుభాకాంక్షలు. కానీ స్వ ఉన్నతి లేదా సాధన మధ్యమధ్యలో చేయని కారణంగా అలసట యొక్క ప్రభావం పడుతుంది. బుద్ధి కూడా అలసిపోతుంది, కాళ్ళు, చేతులు కూడా అలసిపోతాయి కానీ మధ్యమధ్యలో సాధనకి సమయం తీస్తే అలసట ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. సంతోషంగా ఉంటుంది! సంతోషంలో అలసట ఉండదు. పనిలో నిమగ్నం అయిపోతున్నారు, అంటే ఎక్కువ సమయం కర్మాభిమానంలో ఉంటున్నారు. ఇలా అవుతుంది కదా? కర్మ యొక్క అభిమానానికి మార్కులు అయితే లభిస్తాయి, వ్యర్ధంగా పోదు కానీ ఆత్మాభిమాని స్థితికి వచ్చే మార్కులు మరియు కర్మ యొక్క అభిమానానికి వచ్చే మార్కులకు తేడా ఉంటుంది కదా! కనుక ఇప్పుడు సమానత ఉంచుకోండి. లింక్ ని తెంచుకోకండి, జోడించి ఉంచండి ఎందుకంటే ఎక్కువగా డబల్ విదేశీయులు పనిలో డబల్ బిజీగా ఉంటున్నారు. బాప్ దాదాకి తెలుసు - శ్రమ బాగా చేస్తున్నారు కానీ సమానత ఉంచుకోండి. ఎంత సమయం తీయగలిగితే అంత సమయం తీయండి, సెకను తీయండి లేక నిమషం తీయండి ఎంతైనా కానీ తప్పక తీయండి. తీయగలరా? పాండవులు తీయగలరా? టీచర్స్ చేయగలరా? ఆఫీస్ లో పని చేసేవారు చేయగలరా? అలాగే అని చాలా బాగా అంటారు. మంచిది!  

భారతవాసీయులు ఏవైతే ప్లాన్స్ తయారు చేశారో వాటిని కూడా మంచిగా తయారు చేసారు. ఇద్దరు తమ,తమ వాయుమండలం అనుసరించి ప్లాన్స్ బావున్నాయి. 

ఏ పిల్లలైతే ప్రియస్మృతులు పంపారో, బాప్ దాదా ఆ పిల్లలందరికీ, ఉత్తరాల ద్వారా లేదా ఏదోక విధానం ద్వారా ప్రియస్మృతులు పంపారో అవన్నీ బాప్ దాదా స్వీకరించారు. వాటి బదులుగా బాప్ దాదా పిల్లలందరికీ “దాత స్థితి ” యొక్క వరదానం ఇస్తున్నారు. మంచిది - ఒక సెకనులో ఎగరగలుగుతున్నారా? రెక్కలు శక్తిశాలిగా ఉన్నాయి కదా? బాబా అనగానే ఎగిరిపోవాలి. (వ్యాయామం చేయించారు) . 

నలువైపుల సర్వ శ్రేష్ట బాబా సమానంగా దాత స్థితి యొక్క భావన ఉంచుకునే శ్రేష్టాత్మలకు, నిరంతరం స్మృతి మరియు సేవలో తత్పరులై ఉండే, పరమాత్మ సేవాసహయోగి అయ్యే పిల్లలకు, సదా లక్ష్యం మరియు లక్షణాలను సమానంగా చేసుకునే పిల్లలకు, సదా బాబా యొక్క స్నేహి, సమానమైన పిల్లలకు, సమీపంగా ఉండే బాప్ దాదా యొక్క నయన సితారలకు, సదా విశ్వ కళ్యాణం యొక్క భావనలో ఉండే దయాసాగరులు, మాస్టర్ క్షమాసాగరులైన పిల్లలకు, దూరంగా కూర్చున్నవారికి, మధువనంలో కింద కూర్చున్నవారికి మరియు బాప్ దాదా ఎదురుగా కూర్చున్న పిల్లలందరికీ ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments