18-01-2000 అవ్యక్త మురళి

            * 18-01-2000         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బ్రహ్మా బాబా సమానముగా త్యాగము, తపస్సు మరియు సేవ యొక్క వైబ్రేషన్లను విశ్వములో వ్యాపింపజేయండి.

ఈరోజు సమర్థులైన బాప్ దాదా తమ సమర్థులైన పిల్లలను చూస్తున్నారు. ఈనాటి ఈ దివసము స్మృతి దివసము మరియు సమర్ధ దివసము. ఈ రోజున పిల్లలకు సర్వశక్తులను విల్లు రూపములో ఇచ్చేరోజు. ప్రపంచంలో అనేక రకాలైన వీలునామాలు ఉంటాయి కానీ బ్రహ్మాబాబా బాబా నుండి ప్రాప్తించిన సర్వశక్తుల యొక్క విల్లును పిల్లలకు అందజేసారు. ఇటువంటి అలౌకిక విల్లును ఇంకెవరూ అందజేయలేరు. బాబా బ్రహ్మాబాబాను సాకారములో నిమిత్తముగా చేసారు మరియు బ్రహ్మాబాబా పిల్లలకు నిమిత్త భవ యొక్క వరదానమును ఇచ్చి విల్లు నామా చేసారు. ఈ విల్లు పిల్లలలో సహజముగా శక్తుల యొక్క అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఒకటేమో తమ పురుషార్ధము యొక్క శక్తి మరియు ఇది పరమాత్మ విల్లు ద్వారా శక్తి యొక్క ప్రాప్తి. ఇది ప్రభువు యొక్క దానము, ప్రభువు యొక్క వరదానము. ప్రభువే ఈ వరదానాన్ని నడుపుతున్నారు. వరదానములో పురుషార్ధము యొక్క శ్రమ అనేది ఉండదు. సహజముగా మరియు స్వతహాగానే నిమిత్తముగా చేసి నడుపుతూ ఉంటారు. ముందు కొద్దిమందే ఉన్నా బాప్ దాదా ద్వారా, విశేషముగా బ్రహ్మా బాబా ద్వారా పిల్లలకు ఈ విల్లు ప్రాప్తించింది మరియు ఏ పిల్లలకైతే బాబా విల్లు చేసారో ఆ పిల్లలందరూ (ఆది రత్నాలు మరియు సేవలో నిమిత్తమైన పిల్లలు) ఆ ప్రాప్తించిన విల్లును కార్యములో బాగా వినియోగించారు మరియు ఆ విల్లు యొక్క కారణముగా ఈ రోజు ఈ బ్రాహ్మణ పరివారము దిన ప్రతిదినము పెరుగుతూనే ఉంది. పిల్లల విశేషత యొక్క కారణముగా ఈ వృద్ధి జరుగవలసి ఉంది మరియు జరుగుతోంది.

నిమిత్తముగా అయి ఉన్న మరియు తోడుగా ఉన్న పిల్లలిరువురి యొక్క రెండు విశేషతలు చాలా బాగున్నాయి. మొదటి విశేషత - స్థాపన యొక్క ఆదిరత్నాలైనా లేక సేవ యొక్క రత్నాలైనా ఇరువురిలోనూ సంఘటితముగా అయ్యే యూనిటీ చాలా, చాలా బాగుంది. ఎవరిలోనూ ఎందుకు? ఏమిటి? ఎలా?.... అనేది సంకల్పమాత్రము కూడా లేదు. రెండవ విశేషత - ఒకరు అంటే ఇంకొకరు అంగీకరిస్తారు. ఈ ఎక్స్ ట్రా శక్తుల యొక్క విల్లు వాయుమండలములో విశేషతగా ఉంది. కావున సర్వ నిమిత్తమై ఉన్న ఆత్మలకు బాబాయే కనిపిస్తూ ఉన్నారు.

బాప్ దాదా ఇటువంటి సమయంలో నిమిత్తముగా అయి ఉన్న పిల్లలకు హృదయపూర్వకముగా ప్రేమను ఇస్తున్నారు. బాబా యొక్క అద్భుతమైతే ఉండనే ఉంది కానీ పిల్లల యొక్క అద్భుతము కూడా తక్కువేమీ కాదు మరియు ఆ సమయం యొక్క సంఘటన, యూనిటీ మనమంతా ఒక్కటే అన్న భావన, అదే ఈనాటి వరకూ కూడా సేవను పెంచుతోంది. ఎందుకు? నిమిత్తముగా అయి ఉన్న ఆత్మల యొక్క పునాది పక్కాగా ఉంది. కావున బాప్ దాదా కూడా ఈ రోజున పిల్లల యొక్క అద్భుతాన్ని గుణగానం చేస్తున్నారు. పిల్లలు నలువైపుల నుండి ప్రేమ యొక్క మాలలను ధరింపజేసారు మరియు బాబా పిల్లల యొక్క అద్భుతాన్ని గుణగానం చేసారు. ఇంతకాలం ఇది నడుస్తుంది అని ఆలోచించారా? ఎంత సమయమయ్యింది? అందరి నోటి నుండి, హృదయం నుండి ఇప్పుడిక వెళ్ళాలి అన్నదే వెలువడేది కానీ బాప్ దాదాకు ఇప్పుడిక అవ్యక్తరూపములో సేవ జరుగనున్నది అని తెలుసు. సాకారములో ఇంత పెద్ద హాలును నిర్మించారా? బాబా యొక్క అతి ప్రియమైన డబుల్ విదేశీ పిల్లలు వచ్చారా? కావున విశేషముగా డబుల్ విదేశీయుల యొక్క అలౌకిక జన్మ అవ్యక్త పాలన ద్వారా జరుగవలసి ఉంది మరియు ఇంతమంది పిల్లలు రావలసి ఉంది. కావున బ్రహ్మా బాబా తమ సాకార శరీరాన్ని కూడా వదలవలసి వచ్చింది. డబుల్ విదేశీయులకు మేము అవ్యక్తపాలనకు పాత్రులము అన్న నషా ఉందా?

బ్రహ్మా బాబా యొక్క త్యాగము డ్రామాలో విశేషముగా రచింపబడి ఉంది. ఆది నుండి బ్రహ్మా బాబా యొక్క త్యాగము పిల్లల యొక్క భాగ్యములో రచింపబడి ఉంది. అందరికన్నా నెంబర్ వన్ త్యాగానికి బ్రహ్మా బాబా ఉదాహరణగా అయ్యారు. అన్నీ ప్రాప్తిస్తూ కూడా దేనినైతే త్యాగం చేస్తారో దానినే త్యాగము అని అంటారు. సమయం అనుసారముగా, సమస్యల అనుసారముగా చేసే త్యాగము శ్రేష్ఠమైన త్యాగము కాదు. ప్రారంభం నుండే మీరు చూసారు. తనువు, మనస్సు, ధనము, సంబంధాలు సర్వమూ ఉంటూ కూడా త్యాగం చేసారు. శరీరమునూ త్యాగం చేసారు మరియు సర్వ సాధనాలు ఉంటూ కూడా స్వయం పాత ఇంట్లోనే ఉన్నారు. సాధనాలు ప్రారంభమయ్యాయి, అవన్నీ ఉంటూ కూడా సాధనలో అచలముగా ఉన్నారు. ఈ బ్రహ్మ యొక్క తపస్సు పిల్లలైన మీ అందరి యొక్క భాగ్యాన్ని తయారుచేసి వెళ్ళింది. డ్రామానుసారముగా ఇటువంటి త్యాగము యొక్క ఉదాహరణ రూపముగా బ్రహ్మయే అయ్యారు మరియు ఇదే త్యాగము సంకల్ప శక్తి యొక్క సేవకు విశేష పాత్రను తయారుచేసింది. కొత్త కొత్త పిల్లలు సంకల్ప శక్తి ద్వారా త్వరగా వృద్ధిని పొందుతున్నారు. బ్రహ్మ చేసిన త్యాగము యొక్క కథను గూర్చి విన్నారు కదా!

బ్రహ్మా బాబా చేసిన తపస్సు యొక్క ఫలము పిల్లలైన మీకు లభిస్తోంది. తపస్సు యొక్క ప్రభావము ఈ మధువన భూమిలో ఇమిడి ఉంది, తోడుగా పిల్లలు కూడా ఉన్నారు. పిల్లల తపస్సు కూడా ఉంది కానీ నిమిత్తముగా బ్రహ్మా బాబాయే అయ్యారు అని అంటారు కదా! మధువన తపస్వీ భూమిలోకి ఎవరైతే వస్తారో వారు, బ్రాహ్మణ పిల్లలు కూడా ఇక్కడి వాయుమండలము, ఇక్కడి వైబ్రేషన్లు సహయోగులుగా చేసేస్తాయి అని అనుభవం చేసుకుంటారు. యోగమును జోడించే శ్రమ లేదు, అది సహజముగానే జోడింపబడుతుంది మరియు ఎటువంటి ఆత్మలు వచ్చినా వారు ఏదో ఒకటి అనుభవం చేసుకొనే వెళతారు. జ్ఞానమును అర్ధం చేసుకోకపోయినా అలౌకిక ప్రేమ మరియు శాంతిని అనుభవం చేసుకునే వెళతారు. ఏదో ఒకటి పరివర్తన చేసుకునే సంకల్పమును చేసే వెళతారు. అది బ్రహ్మ మరియు బ్రాహ్మణ పిల్లల తపస్సు యొక్క ప్రభావము. దానితో పాటు సేవ యొక్క విధి - భిన్న భిన్న రకాల సేవలను పిల్లలతో ప్రాక్టికల్ గా చేయించి చూపించారు. అవే విధులను ఇప్పుడు విస్తారములోకి తీసుకువస్తున్నారు కావున ఏ విధముగా అయితే బ్రహ్మా బాబా యొక్క త్యాగము, తపస్సు సేవ యొక్క ఫలము పిల్లలైన మీ అందరికీ లభిస్తోందో అలాగే పిల్లలు ప్రతి ఒక్కరూ తమ త్యాగము, తపస్సు మరియు సేవ యొక్క వైబ్రేషన్లను విశ్వములో వ్యాపింపజేయాలి. ఏ విధముగా సైన్స్ యొక్క శక్తి తన ప్రభావాన్ని ప్రత్యక్ష రూపములో చూపిస్తోందో అలాగే సైన్స్ కు కూడా సైలెన్స్ యొక్క శక్తియే రచయిత. సైలెన్స్ యొక్క శక్తిని ఇప్పుడు ప్రత్యక్ష రూపములో చూపించే సమయమిది. సైలెన్స్ శక్తి యొక్క వైబ్రేషన్లను తీవ్రగతితో వ్యాపింపజేసేందుకు సాధనము - మనస్సు, బుద్ధి యొక్క ఏకాగ్రత, ఈ ఏకాగ్రత యొక్క అభ్యాసమును పెంచాలి. ఏకాగ్రత యొక్క శక్తుల ద్వారానే వాయుమండలమును తయారుచేయగలుగుతారు. అలజడి యొక్క కారణముగా శక్తిశాలీ వైబ్రేషన్లు తయారవ్వజాలవు.

బాప్ దాదా నేడు ఏకాగ్రత యొక్క శక్తి ఎంతగానో అవసరమని గమనిస్తున్నారు. పిల్లలందరికీ సోదరీ, సోదరులందరి దు:ఖము యొక్క పరిస్థితులు పరివర్తితమైపోవాలి అన్న ఒకే దృఢ సంకల్పము ఉండాలి, హృదయాంతరాల నుండి దయార్ధ భావన ఉత్పన్నమవ్వాలి. సైన్స్ యొక్క శక్తి అలజడిని వ్యాపింపజేయగలుగుతున్నప్పుడు మరి ఇంతమంది బ్రాహ్మణుల సైలెన్స్ యొక్క శక్తి దయార్థ భావన ద్వారా లేక సంకల్పము ద్వారా అలజడిని పరివర్తన చేయలేదా? చేయవలసిందే మరియు జరుగవలసిందే, మరి అలాంటప్పుడు ఈ విషయముపై విశేషమైన ధ్యానమును ఉంచండి. గ్రేట్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కు మీరు పిల్లలు. అంతా మీ యొక్క వంశమే. అందరూ శాఖలు మరియు పరివారమే. మీరే భక్తుల యొక్క ఇష్టదేవులు. మేమే ఇష్టదేవులము అన్న నషా ఉందా? భక్తులు పిలుస్తున్నారు, మరి మీరు వింటున్నారా? హే ఇష్టదేవతలారా అని వారు పిలుస్తున్నారు. మరి మీరు కేవలం వింటున్నారా? వారికి జవాబు చెప్పడం లేదా? హే భక్తుల యొక్క ఇష్టదేవతలారా! ఇప్పుడు వారి పిలుపును వినండి, బదులు చెప్పండి, కేవలం వినకండి. ఏమని జవాబు చెబుతారు? పరివర్తన యొక్క వాయుమండలాన్ని తయారుచేయండి. మీ జవాబు వారికి లభించకపోతే వారు కూడా నిర్లక్ష్యులుగా అయిపోతారు. ఆర్తనాదాలు చేస్తారు, మళ్ళీ మౌనంగా ఉండిపోతారు.

బ్రహ్మా బాబాలోని ప్రతి కార్యము యొక్క ఉత్సాహాన్ని మీరు చూసారు. ఏ విధముగా ప్రారంభంలో తాళం చేతులు కావాలి అనే ఉత్సాహం ఉండేదో అలాగే ఇప్పుడు కూడా బ్రహ్మాబాబా శివబాబాతో ఇప్పుడిక ఇంటిద్వారాలు తెరిచే తాళం చేతులను ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు కానీ వారితో పాటు తోడుగా వెళ్ళేవారు కూడా తయారవ్వాలి కదా! ఒంటరిగా వెళ్ళి ఏమి చేస్తారు? కావున ఇప్పుడు తోడుగా వెళ్ళాలి కదా! లేక వారి వెనుక వెళతారా? తోడుగా వెళ్ళాలి కదా! కావున బాబా తాళం చేతులు ఇచ్చేస్తే మీరు ఎవర్రెడీగా ఉన్నారా? అని పిల్లలను అడగండి అని బ్రహ్మా బాబా అంటారు. మీరు ఎవర్రెడీగా ఉన్నారా లేక రెడీగా ఉన్నారా? ఎవర్రెడీగా లేరా? ఎవర్రెడీగా ఉండాలి. త్యాగము, తపస్సు, సేవ మూడు పేపర్లూ తయారైపోయాయా? ప్రేమ యొక్క ఆసువులనైతే ఎన్నో కారుస్తారు మరియు బ్రహ్మా బాబా ఆ ఆసువులను ముత్యాల సమానముగా తమ హృదయములో ఇముడ్చుకుంటారు కూడా. బ్రహ్మా బాబా అది చూసి ఆనందిస్తారు కానీ అందరూ ఎవర్రెడీగా ఎప్పుడవుతారో అన్న ఒక్క సంకల్పమైతే తప్పకుండా కలుగుతుంది, మరి దానికి తారీఖు నిశ్చయించాలా? మేమైతే ఎవర్రెడీగా ఉన్నాము అని మీరు అంటారు కానీ మీ తోటివారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా తయారుచేయండి లేక వారిని వదిలేసి వెళ్ళిపోతారా? బ్రహ్మా బాబా కూడా వెళ్ళిపోయారు కదా! అని మీరు అంటారు కానీ వారు ఈ రచనను రచించవలసి ఉంది. ఫాస్ట్ గా వృద్ధి జరుపవలసిన బాధ్యత ఉంది. మరి అందరూ ఎవర్రెడీగా ఉన్నారా? ఒక్కరిని కాదు, అందరినీ తోడుగా తీసుకొని వెళ్ళాలి కదా లేక ఒంటరిగా వెళతారా? మరి అందరూ ఎవర్రెడీగా ఉన్నారా లేక ఎవర్రెడీగా అయిపోతారా? మరి చెప్పండి. తక్కువలో తక్కువ 9 లక్షల మంది అయితే తోడుగా వెళతారు కదా! లేకపోతే ఎవరిపై రాజ్యం చేస్తారు? మీపై మీరు రాజ్యం చేస్తారా? కావున బ్రహ్మా బాబాకు ఎవర్రెడీగా అవ్వండి మరియు ఎవర్రెడీగా తయారుచేయండి అనే శుభకామనయే పిల్లలందరి పైనా ఉంది. ఈ రోజు వతనములో కూడా విశేష ఆదిరత్నాలు మరియు సేవ యొక్క ఆదిరత్నాలు ఎమర్ట్ అయ్యారు. అడ్వాన్స్ పార్టీ వారు మేమైతే తయారుగా ఉన్నాము అని అంటున్నారు. ఏ విషయం కొరకు తయారుగా ఉన్నారు? వీరు ప్రత్యక్షత యొక్క ఢంకా మోగిస్తే మేమందరమూ ప్రత్యక్షమై కొత్త సృష్టి యొక్క రచనకు నిమిత్తమవుతాము. మేమైతే కొత్త సృష్టి యొక్క రచనను రచించేవారు రావాలి అని ఆహ్వానిస్తున్నాము, ఇప్పుడిక మిగిలిన పనంతా మీదే. ఢంకా మ్రోగించండి. వచ్చేసారు, వచ్చేసారు అనే ఢంకాను మ్రోగించండి. ఢంకాను మ్రోగించడం వస్తుందా? మ్రోగించవలసి ఉంది కదా! ఇప్పుడిక బ్రహ్మా బాబా ఆ తారీఖును తీసుకురండి అని అంటున్నారు. డేట్ లేకుండా పని జరుగదు అని మీరు కూడా అంటారు కదా! కావున దీని డేట్ ను కూడా నిర్ణయించండి. మీరు డేట్ ను నిర్ణయించగలరా లేక మీరే చెప్పండి అని బాబాను అంటారా? అలా అంటే ఈ రోజునే నిర్ణయించండి అని అంటారు. కాన్ఫరెన్స్  యొక్క డేట్ ను ఫిక్స్ చేసారు. అలాగే దీని యొక్క కాన్ఫరెన్స్ ను కూడా చేయండి! విదేశీయులు ఏమి భావిస్తున్నారు? డేట్ ఫిక్స్ అవ్వగలదా? మరిడేట్ ఫిక్స్ చేస్తారా? అవునో, కాదో చెప్పండి. అచ్చా - జానకీ దాదీతో సలహా తీసుకొని నిర్ణయించండి, అచ్ఛా!

దేశ, విదేశాలలోని, నలువైపులా ఉన్న, బాప్ దాదా యొక్క అతి సమీపమైన, అతి ప్రియమైన మరియు అతీతమైన పిల్లలందరూ లగ్నములో మగ్నమై లవలీన స్వరూపములో కూర్చొని ఉండడం బాప్ దాదా చూస్తున్నారు, వింటున్నారు మరియు మిలనము యొక్క ఊయలలో ఊగుతున్నారు. దూరముగా లేరు కానీ నయనాల ముందు ఉన్నారు మరియు ఇమిడియున్నారు. కావున ఈవిధంగా సమ్ముఖముగా మిలనమును జరిపే వారికి మరియు అవ్యక్తరూపములో లవలీనమై ఉన్న పిల్లలకు, సదా బాబా సమానముగా త్యాగము, తపస్సు మరియు సేవ యొక్క ప్రమాణమును చూపించే సుపుత్రులైన పిల్లలకు సదా ఏకాగ్రత యొక్క శక్తి ద్వారా విశ్వము యొక్క పరివర్తనను చేసే విశ్వపరివర్తకులైన పిల్లలకు, సదా బాబా సమానముగా తీవ్ర పురుషార్ధము ద్వారా పైకి ఎగిరే డబుల్ లైట్ పిల్లలకు బాప్ దాదా యొక్క అతి ప్రియస్మృతులు మరియు నమస్తే. 

రాజస్థాన్ సేవాధారులతో - చాలా మంచి సేవ యొక్క అవకాశము రాజస్థాన్ వారికి లభించింది. రాజస్థాన్‌కు రాజ్యస్థానము అన్న పేరు ఉన్నట్లుగా మరి ఇక్కడి నుండి రాజా క్వాలిటీ గలవారిని తయారుచేయండి. ప్రజలను కాదు, రాజ్యకుటుంబపు రాజులను తయారుచేయండి. రాజస్థాన్ అన్న పేరు ఎలాగైతే ఉందో అలాగే ఆ పేరును బట్టి అటువంటి సేవ యొక్క క్వాలిటీని తయారుచేయండి. దాగియున్న రాజులెవరైనా ఉన్నారా లేక ఇంకా మేఘాలలోనే ఉన్నారా? వ్యాపార వేత్తలు ఎవరైతే ఉన్నారో వారి సేవపై విశేషమైన ధ్యానమును ఉంచండి. ఈ మినిష్టర్లు మరియు సెక్రటరీలైతే మారుతూనే ఉంటారు కానీ వ్యాపారవేత్తలు బాబాతో కూడా వ్యాపారమును చేయడంలో ముందుకు వెళ్ళగలుగుతారు మరియు వ్యాపారవేత్తల యొక్క సేవను చేయడం ద్వారా వారి పరివారములోని మాతలు కూడా  సహజముగా రాగలుగుతారు. మాతలు ఒంటరిగా రాలేరు కానీ వారి ఇంటి స్తంభాలు ఎప్పుడైతే వస్తారో అప్పుడు పరివారము మెల్లగా దానంతట అదే పెరుగుతూ ఉంటుంది, కావున రాజస్థాన్ వారు రాజు క్వాలిటీ వారిని వెలికితీయండి. అలాంటివారు ఎవరూ లేరు అని అనకండి. కాస్త వెతకవలసి ఉంటుంది కానీ అలాంటివారు ఉన్నారు. కాస్తంత వారి కోసం సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. బిజీగా ఉంటారు కదా! వారు సమీపముగా వచ్చే విధముగా అటువంటి విధిని ఏదైనా తయారుచేయాలి. మిగిలినదంతా బాగుంది. సేవ యొక్క అవకాశం తీసుకున్నారు. ప్రతి ఒక్క జోన్ వారూ తీసుకుంటున్నారు. ఇది సమీపముగా వచ్చేందుకు మరియు దీవెనలను తీసుకునేందుకు చాలా మంది అవకాశము. మిమ్మల్ని అందరూ చూసినా, చూడకపోయినా, మిమ్మల్ని గూర్చి తెలిసినా, తెలియకపోయినా కానీ ఎంత మంచి సేవ అయితే జరుగుతుందో అంతగా దీవెనలు స్వతహాగానే వెలువడతాయి మరియు ఆ దీవెనలు చాలా త్వరగా చేరుకుంటాయి. హృదయపూర్వకమైన దీవెనలు ఉన్నాయి కదా! కావున అవి వారి హృదయములోకి త్వరగా చేరుకుంటాయి. దీవెనలను ఇవ్వండి మరియు దీవెనలను తీసుకోండి, ఇదే అన్నింటికన్నా సహజమైన పురుషార్ధము. ఎప్పుడైతే దీవెనలతో ఖాతా నిండిపోతుందో అప్పుడు నిండియున్న ఖాతాను మాయ కూడా డిస్ట్రబ్ చేయదు. జమా ఖాతా యొక్క బలము లభిస్తుంది. రాజీగా ఉండండి మరియు సర్వులనూ రాజీ పరచండి. ప్రతి ఒక్కరి స్వభావము యొక్క రహస్యాన్ని తెలుసుకొని వారిని రాజీ పరచండి. వీరు ఇలా అసంతుష్టులుగానే ఉంటారు అని అనకండి. మీరు స్వయం రహస్యాన్ని తెలుసుకోండి, దాని నాడిని తెలుసుకోండి మరియు దీవెనల యొక్క మందును ఇవ్వండి. తద్వారా అది సహజమైపోతుంది. రాజస్థాన్‌ వారు సరిగ్గా ఉన్నారు కదా! రాజస్థాన్ టీచర్లు లేచి నిల్చోండి. సేవ యొక్క అభినందనలు. కావున సహజ పురుషార్ధము చేయండి. దీవెనలు ఇస్తూ ముందుకు వెళ్ళండి. తీసుకోవాలి అనే సంకల్పము చేయకండి, మీరు ఇస్తూ ఉంటే మీకు అన్నీ లభిస్తూనే ఉంటాయి. ఇవ్వడమే తీసుకోవడం, సరేనా? అలాగే ఉన్నారు కదా! మీరు దాత యొక్క పిల్లలు కదా! ఎవరైనా ఇస్తే ఇద్దాము అన్నది కాదు, దాతలుగా అయి ఇస్తూ ఉండండి, అప్పుడు దానంతట అదే లభిస్తూ ఉంటుంది. అచ్ఛా!

ఈ కల్పములో మొదటిసారి ఎవరైతే వచ్చారో వారు చేతులెత్తండి. సగం ఇంతకుముందు వచ్చారు. సగం కొత్త వారు వచ్చారు, అచ్చా వెనుక ఉన్నవారు, చివరిలో కూర్చున్నవారు కూడా అందరూ సహజయోగులుగా ఉన్నారా? సహజయోగులుగా ఉంటే ఒక చేయి ఎత్తండి, అచ్ఛా!

వీడ్కోలు సమయంలో:-(బాప్ దాదాకు రథయాత్రల సమాచారాన్ని వినిపించారు) నలువైపులా జరుగుతున్న యాత్రల యొక్క సమాచారం సమయ ప్రతి సమయం బాప్ దాదా వద్దకు వస్తూ ఉంటుంది, బాగుంది, అందరూ ఉత్సాహ, ఉల్లాసాలతో సేవ యొక్క పాత్రను అభినయిస్తున్నారు. భక్తులకు దీవెనలు లభిస్తున్నాయి మరియు ఏ భక్తుల భక్తి అయితే పూర్తి అయ్యిందో వారికి బాబా యొక్క పరిచయం లభిస్తుంది మరియు పరిచయం పొందినవారి నుండి పిల్లలుగా అవ్వవలసినవారు ఎవరైతే ఉంటారో వారు కూడా కనిపిస్తూ ఉంటారు. సేవ అయితే బాగా జరుగుతోంది మరియు ఏ సాధనాలనైతే తయారుచేసారో ఆ సాధనాలు అందరి బాగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు రిజల్టులో ఎవరెవరు ఏ క్యాటగిరీలో వెలువడతారో అది తెలిసిపోతుంది కానీ భక్తులకు కూడా మీ అందరి యొక్క దృష్టి లభించింది, పరిచయం లభించింది. ఇది కూడా మంచి సాధనమే. ఇప్పుడు ముందుకు వెళ్ళి వారి సేవను చేసి ముందుకు తీసుకువెళుతూ ఉండండి. రథయాత్రలలో ఎవరైతే సేవ చేస్తున్నారో వారంతా అలసట లేనివారిగా అయి సేవ చేస్తున్నారు, వారందరికీ ప్రియస్మృతులు. బాప్ దాదా అందరినీ చూస్తూ ఉంటారు మరియు సఫలత జన్మసిద్ధ అధికారము, అచ్ఛా!

మారిషస్ లో మన ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి ప్రైమ్ మినిష్టర్ ద్వారా నేషనల్ యూనిటీ అవార్డ్ లభించింది:- మారిషస్ లో వి.ఐ.పి.ల సంబంధము బాగుంది మరియు దాని ప్రభావము కూడా బాగుంది కావున గుప్తముగా సేవ యొక్క ఫలము లభించింది, కావున అందరికీ విశేషమైన ప్రియస్మృతులు, అచ్చా! ఓం శాంతి.

Comments