15-12-1999 అవ్యక్త మురళి

             15-12-1999         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంకల్ప శక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని దానిని పెంచుకోండి మరియు ప్రయోగంలోకి తీసుకురండి.

ఈరోజు ఉన్నతోన్నతమైన తండ్రి తన యొక్క నలువైపుల ఉన్న శ్రేష్ట పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ఎందుకంటే విశ్వంలోని ఆత్మల కంటే పిల్లలైన మీరు శ్రేష్టమైనవారు అంటే ఉన్నతమైనవారు. ప్రపంచంలో ఉన్నతమైనవారు అని వారు అంటారు కానీ అది ఒక జన్మ కోసమే కానీ పిల్లలైన మీరు కల్పం అంతటిలో శ్రేష్టమైనవారు. కల్పమంతా మీరు శ్రేష్టంగా ఉంటారు. తెలుసు కదా? మీ అనాది కాలాన్ని చూడండి - అనాది కాలంలో కూడా ఆత్మలైన మీరందరు బాబాకి సమీపంగా ఉండేవారు. చూస్తున్నారు కదా, అనాది రూపంలో బాబాతో పాటు సమీపంగా ఉండే శ్రేష్ట ఆత్మలు. అందరూ ఉంటారు కానీ మీ స్థానం చాలా సమీపమైనది. కనుక అనాది రూపంలో కూడా ఉన్నతోన్నతమైనవారు. ఆది కాలంలో పిల్లలందరు దైవీపదవితో దేవతా రూపంలో ఉంటారు. మీ దైవీ స్వరూపం స్మృతి ఉందా? ఆది కాలంలో సర్వప్రాప్తి స్వరూపులు. తనువు, మనస్సు, ధనం మరియు జనం నాలుగు స్వరూపాలలో శ్రేష్టమైనవారు. సదా సంపన్నులు, సర్వప్రాప్తి స్వరూపులు. ఈ విధమైన దైవీ పదవి మరే ఆత్మలకి లభించదు. ధర్మాత్మలైనా, మహాత్మలైనా కానీ ఈ విధమైన సర్వప్రాప్తులతో శ్రేష్టంగా, అప్రాప్తి యొక్క గుర్తులు లేకుండా ఎవరూ అనుభవం చేసుకోలేరు. మధ్యకాలంలోకి రండి, మధ్యకాలంలో కూడా ఆత్మలైన మీరు పూజ్యులుగా అవుతున్నారు. మీ జడచిత్రాలు పూజింపబడుతున్నాయి. ఈ విధమైన విధిపూర్వక పూజ ఎవరికీ జరగదు. పూజ్యాత్మలకు జరిగేటంత విధిపూర్వక పూజ మరెవరికైనా జరుగుతుందా, ఆలోచించండి! ప్రతి కర్మకి పూజ జరుగుతుంది. ఎందుకంటే కర్మయోగిగా అవుతున్నారు. కనుక పూజ కూడా ప్రతి కర్మకి జరుగుతుంది. ధర్మాత్మలను, మహాత్మలను కూడా మందిరంలో పెడతారు. కానీ విధిపూర్వక పూజ జరగదు. కనుక మధ్యకాలంలో కూడా మీరు ఉన్నతమైనవారు అంటే శ్రేష్టమైనవారు. వర్తమాన అంతిమకాలానికి రండి. అంతిమకాలం ఇప్పుడు సంగమయుగంలో కూడా శ్రేష్టమైనవారు. మీ శ్రేష్టత ఏమిటి? స్వయం పరమాత్మ మరియు ఆది ఆత్మ అంటే బాప్ దాదా ఇద్దరి ద్వారా పాలన పొందుతున్నారు మరియు చదువు కూడా చదువుకుంటున్నారు, వెనువెంట సద్గురువు ద్వారా శ్రీమతం తీసుకునే అధికారి అయ్యారు. కనుక అనాదికాలం, ఆదికాలం మరియు ఇప్పుడు అంతిమకాలంలో కూడా ఉన్నతమైనవారు, శ్రేష్టమైనవారు. ఇంత నషా ఉంటుందా? 

ఈ స్మృతిని ప్రత్యక్షం చేయండి అని బాప్ దాదా చెప్తున్నారు. మనస్సులో, బుద్దిలో ఈ ప్రాప్తిని మరలా మరలా గుర్తు చేసుకోండి. స్మృతిని ఎంతగా ప్రత్యక్షంగా ఉంచుకుంటారో అంతగా ఆ స్మృతి ద్వారా ఆత్మిక నషా ఉంటుంది, సంతోషం ఉంటుంది, శక్తిశాలిగా అవుతారు. ఇంత ఉన్నత ఆత్మగా అయ్యారు. ఈ నిశ్చయం పక్కాగా ఉందా? మేమే ఉన్నతంగా, శ్రేష్టంగా అయ్యాము మరియు సదా అవుతూ ఉంటాము అనే నషా ఉందా? నిశ్చయం పక్కాగా ఉంటే చేతులు ఎత్తండి! టీచర్స్ కూడా ఎత్తారు. మాతలు సదా సంతోషపు ఊయలలో ఊగుతున్నారు కదా! ఊగుతున్నారా! మాతలకి చాలా నషా ఉంటుంది, ఏ నషా ఉంటుంది? మా కోసం బాబా వచ్చారు అనే నషా ఉంది కదా! ద్వాపరయుగం నుండి అందరూ క్రిందకి పడేసారు, అందువలన మాతలంటే బాబాకి చాలా ప్రేమ మరియు విశేషంగా మాతల కోసమే బాప్ దాదా వచ్చారు. సంతోషపడుతున్నారు. కానీ సదా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు చేతులు ఎత్తుతున్నారు, మరలా రైల్లో వెళ్ళిన తర్వాత కొద్ది కొద్దిగా నషా దిగిపోకూడదు. సదా ఏకరసంగా, అవినాశి నషా ఉండాలి. అప్పుడప్పుడు ఉండే నషా కాదు, సదాకాలిక నషా సదా సంతోషాన్నిస్తుంది. మాతలైన మీ ముఖం దూరం నుండే ఆత్మిక గులాబి వలె కనిపించే విధంగా ఉండాలి. ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయం యొక్క ఒక విషయం అందరికీ ఇష్టం అనిపిస్తుంది, ఒక విశేషత కనిపిస్తుంది అదేమిటంటే మాతలు ఆత్మిక గులాబీల వలె సదా వికసించిన పుష్పాలుగా ఉంటారు మరియు మాతలే బాధ్యత తీసుకుని ఇంత పెద్ద కార్యం చేస్తున్నారు అని. మహా మండలేశ్వరులు అయినా కానీ వారు కూడా అనుకుంటున్నారు - ఇక్కడ మాతలే నిమిత్తమై ఇంత శ్రేష్ట కార్యాన్ని సహజంగా నడిపిస్తున్నారని. మాతలకోసం చెప్తారు - ఇద్దరు మాతలు కలిసి ఏదైనా కార్యం చేయాలన్నా చాలా కష్టం అని. ఇది నిజం కాదు. కానీ అలా అంటారు. కానీ ఇక్కడ నిమిత్తులు ఎవరు? మాతలే కదా! ఎవరైనా కలుసుకోవడానికి వస్తే ఏమి అడుగుతారు? మాతలే నడిపిస్తున్నారా, పరస్పరం పోట్లాడుకోవటం లేదా? గొడవలు పెట్టుకోవటం లేదా? అని అడుగుతారు. కానీ వీరు సాధారణమాతలు కాదు, పరమాత్మ ద్వారా తయారైన ఆత్మలు, మాతలు, పరమాత్మ వరదానం వీరిని నడిపిస్తుంది అని వారికేమి తెలుసు! మాతలకేనా గౌరవం మాకు ఏమీ లేదా అని పాండవులు అనుకోకండి. పంచ పాండవులు అని మీ గురించి కూడా మహిమ ఉంది కదా! శక్తులతో పాటు 7 దివ్యశక్తులను మరియు వారితో పాటు ఒక పాండవుడిని కూడా చూపిస్తారు. పాండవులు లేకుండా మాతలు కూడా నడిపించలేరు, మాతలు లేకుండా పాండవులు నడిపించలేరు. రెండు భుజాలు కావాలి. కానీ మాతలను చాలా క్రిందకి పడేసారు కదా. అందువలన బాబా మాతల గురించి ప్రపంచం వారు ఏదైతే అసంభవం అని అన్నారో దానిని సంభవం చేసి చూపిస్తున్నారు. మాతలను చూసి మీకు సంతోషంగా ఉంది కదా? లేక లేదా? సంతోషమే కదా? ఒకవేళ బాబా మాతలను నిమిత్తం చేయకపోతే క్రొత్త జ్ఞానం, క్రొత్త పద్దతి కారణంగా పాండవులను చూసి చాలా కొట్లాటలు జరిగేవి. ఇది క్రొత్త జ్ఞానం, క్రొత్త విషయాలు కదా అందువలన మాతలు డాలు వంటివారు. కానీ అక్కయ్యలతో పాటు అన్నయ్యలు సదా తోడుగానే ఉంటారు. పాండవులు మరియు మాతలు తమ తమ కార్యాలలో ముందు. ఇద్దరి సలహాల ద్వారా నిర్విఘ్నంగా ప్రతి కార్యం జరుగుతుంది. బాప్ దాదా ప్రతి రోజు పిల్లల యొక్క రకరకాల కార్యాలు చూస్తూ ఉంటారు. కొత్త, కొత్త ప్లాన్స్ తయారవుతూ ఉంటాయి. సమయం అందరికీ స్మృతి ఉందా? ఉందా స్మృతి 99వ సం||రం అనే విషయం కూడా పూర్తి అయిపోయింది. 99 వచ్చేసింది, 99 వచ్చేసింది అని అనుకునేవారు కానీ మీ అందరూ సేవ చేయడానికి, నిర్విఘ్నంగా ఉండడానికి ఈ సంవత్సరం లభించింది, 99 సం||రంలోనే మౌన భట్టీలు చేస్తున్నారు కదా! ప్రపంచం అంతా భయపడుతుంది, కానీ వారు ఎంత భయపడుతున్నారో మీరు అంత స్మృతి యొక్క లోతులోకి వెళ్తున్నారు. మనస్సు యొక్క మౌనం అంటే జ్ఞాన సాగరం యొక్క లోతులోకి వెళ్ళటం మరియు క్రొత్త, క్రొత్త అనుభవాలనే రత్నాలను తీసుకురావటం. బాప్ దాదా ఇంతకు ముందు కూడా సైగ చేసారు - అన్నింటికంటే గొప్ప ఖజానా, వర్తమానం మరియు భవిష్యత్తుని తయారుచేసే శ్రేష్టఖజానా - శ్రేష్ట సంకల్పాల ఖజానా. సంకల్పశక్తి చాలా గొప్పశక్తి, పిల్లలైన మీ దగ్గర ఉన్నది - శ్రేష్టసంకల్పశక్తి. సంకల్పాలు అయితే అందరి దగ్గర ఉంటాయి కానీ శ్రేష్టశక్తి, శుభభావన, శుభకామన యొక్క సంకల్పశక్తి, మనస్సు, బుద్ధిని ఏకాగ్రం చేసే శక్తి. ఇవి మీ దగ్గరే ఉంటాయి. ఎంత ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా ఈ సంకల్ప శక్తిని ఎంతగా జమ చేసుకుంటూ ఉంటారు, వ్యర్ధంగా పోగొట్టుకోరు. వ్యర్ధంగా పోవటానికి ముఖ్య కారణం - వ్యర్ధ సంకల్పాలు. బాప్ దాదా చూసారు - ఎక్కువమంది పిల్లలలో రోజంతటిలో ఇప్పటికీ వ్యర్ధం ఉంది. ఎలా అయితే స్థూల ధనాన్ని పొదుపుగా ఉపయోగించే వారు సదా సంపన్నంగా ఉంటారు మరియు వ్యర్ధంగా పోగొట్టుకునేవారు ఎక్కడో అక్కడ మోసపోతారు. అదేవిధంగా శ్రేష్టసంకల్పంలో ఎంత శక్తి ఉందంటే దాని ద్వారా మీ గ్రహణ శక్తి, తరంగాలను అందుకునే శక్తి చాలా పెరుగుతుంది. వైర్‌లెస్, టెలిఫోన్ మొదలైన విజ్ఞాన సాధనాలు ఏవిధంగా పని చేస్తాయో అదేవిధంగా ఈ శుద్ధ సంకల్పాల ఖజానా కూడా కార్యం చేస్తుంది. లండన్ లో ఉన్న ఏ ఆత్మ యొక్క తరంగాలు అయినా మీకు ఎలా అందుతాయంటే వైర్‌లెస్, టెలిఫోన్, టి.వి. ఇలా చాలా సాధనాలు వచ్చాయి వాటి కంటే కూడా స్పష్టంగా మీరు గ్రహించగలరు. ఏకాగ్రతా శక్తి ద్వారా గ్రహణశక్తి పెరుగుతుంది. ఈ ఆధారాలన్నీ (సాధనాలు) సమాప్తి కానున్నవి. ఈ సాధనాలన్నీ దేని ఆధారంగా పని చేస్తాయి? కరెంట్ ఆధారంగా. సుఖ సాధనాలన్నింటిలో ఎక్కువ కరెంట్ ఆధారంగానే పని చేస్తాయి. మరయితే మీ ఆధ్యాత్మిక ప్రకాశం, ఆత్మిక ప్రకాశం ఈ పని చేయలేవా! దగ్గరవి లేదా దూర తరంగాలను కూడా గ్రహించగలరు. కానీ ఇప్పుడు మనస్సు, బుద్ధి రెండూ ఏకాగ్రం అవ్వాలి. ఏకాగ్రతా శక్తి ద్వారానే గ్రహణ శక్తి పెరుగుతుంది. చాలా అనుభవాలు చేసుకుంటారు. నిస్వార్థంగా, స్వచ్ఛంగా, స్పష్టంగా సంకల్పం చేయగానే అవి చాలా త్వరగా అనుభవం చేయిస్తాయి. శాంతిశక్తి ముందు విజ్ఞాన శక్తి ఒంగిపోతుంది. విజ్ఞానంలో కూడా ఏదో లోపం ఉంది దానిని తొలగించుకోవాలి అని ఇప్పుడు కూడా భావిస్తున్నారు. అందువలన బాప్ దాదా మరలా ధ్యాస ఇప్పిస్తున్నారు - ఇదే అంతిమ స్థితి మరియు అంతిమ సేవ. ఈ సంకల్పశక్తి సేవను చాలా తీవ్రం చేస్తుంది. అందువలన సంకల్పశక్తిపై మరింత ధ్యాస పెట్టండి. పొదుపు చేయండి మరియు జమ చేసుకోండి, ఇది చాలా పనికొస్తుంది. ఈ సంకల్పశక్తి ద్వారానే ప్రయోగిగా కాగలరు. విజ్ఞానానికి గొప్పతనం ఎందుకు ఉంది? ప్రయోగంలోకి వస్తుంది. కనుకనే విజ్ఞానం మంచిగా పని చేస్తుంది అని అందరు భావిస్తున్నారు. అదేవిధంగా శాంతిశక్తిని ప్రయోగించడానికి ఏకాగ్రతాశక్తి కావాలి. ఏకాగ్రతకి ముఖ్య ఆధారం - మనస్సుని అదుపులో ఉంచుకునే శక్తి. దీని ద్వారా మనోబలం పెరుగుతుంది. మనోబలానికి గొప్ప మహిమ ఉంది. మంత్రతంత్రాల వారు కూడా మనోబలం ద్వారా అల్పకాలిక అద్భుతాలు చూపిస్తారు. కానీ మీది విధిపూర్వకమైనది, మంత్రతంత్రాలు కాదు. మీరు విధిపూర్వకంగా కళ్యాణం యొక్క అద్భుతాన్ని చూపిస్తారు, అదే వారికి వరదానం అయిపోతుంది. సంకల్పశక్తి యొక్క ప్రయోగం ఆత్మలకు వరదానంగా సిద్ధిస్తాయి. కనుక మొదట మనస్సుని అదుపులో ఉంచుకునే నియంత్రణాశక్తి ఉందా అని పరిశీలించుకోండి. విజ్ఞాన శక్తి స్విచ్ ఆన్ చేస్తే సెకనులో పని చేస్తుంది, ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. అదేవిధంగా ఒక సెకనులో మనస్సుని ఎక్కడ కావాలంటే, ఎలా కావాలంటే, ఎంత సమయం కావాలంటే అంత సమయం అదుపు చేయగలుగుతున్నారా? దీని ద్వారా స్వయం కొరకు మరియు సేవ కొరకు కూడా చాలా మంచి, మంచి సిద్ది రూపాలు కనిపిస్తాయి. కానీ సంకల్పశక్తి యొక్క జమాఖాతాపై ధ్యాస ఇప్పుడు సాధారణంగా ఉన్నట్లుగా బాప్ దాదా చూశారు. ఎంత ఉండాలో అంత లేదు. సంకల్పం ఆధారంగా మాట మరియు కర్మ స్వతహాగా ఉంటాయి. వేర్వేరుగా శ్రమ చేయవలసిన అవసరం లేదు. ఈ రోజు మాటను అదుపు చేసుకోవాలి, ఈ రోజు దృష్టిపై ధ్యాస పెట్టాలి, ఈ రోజు వృత్తిపై ధ్యాస పెట్టుకుని మార్చుకోవానికి శ్రమించటం అనేది ఉండదు. సంకల్పశక్తి శక్తివంతంగా ఉంటే ఇవన్నీ స్వతహాగానే కంట్రోల్ లోకి వచ్చేస్తాయి. శ్రమ నుండి రక్షించబడతారు. కనుక సంకల్పశక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. 

ఇవన్నీ అలవాటు అవ్వాలనే విశేషంగా భట్టీలు పెడతారు. ఇక్కడి ఈ అలవాటు భవిష్యత్తుకి కూడా ధ్యాస ఇప్పిస్తూ ఉంటుంది. అప్పుడే అవినాశి అవుతుంది. గొప్పతనం ఏమిటో అర్థమైందా? బాబా ఇచ్చిన చాలా ఉన్నతోన్నత ఖజానా మీ దగ్గర ఉంది. శ్రేష్టసంకల్పం, శుభభావన, శుభకామనతో కూడిన సంకల్ప ఖజానా ఉందా? బాబా అందరికీ ఇచ్చారు. కానీ నెంబర్ వారీగా జమ చేసుకుంటున్నారు మరియు ప్రయోగంలోకి తీసుకువచ్చే శక్తి కూడా నెంబర్ వారీగా ఉంది. శుభభావన, శుభకామన దీని యొక్క ప్రయోగం ఇప్పుడు కూడా చేసారా? విధిపూర్వకంగా చేయటం ద్వారా సిద్ది అనుభవం అవుతుందా? ఇప్పుడు కొద్ది కొద్దిగా అనుభవం అవుతుంది. చివరికి మీ సంకల్పశక్తి ఎంత గొప్పది అయిపోతుందంటే - సేవలో నోటి ద్వారా సందేశం ఇవ్వడానికి సమయాన్ని, ధనాన్ని ఉపయోగిస్తున్నారు. దీని వలన అలసిపోతున్నారు మరియు అలజడిలోకి కూడా వస్తున్నారు కానీ శ్రేష్ట సంకల్పాల సేవలో ఇవన్నీ రక్షించబడతాయి. కనుక దీనిని పెంచుకోండి. ఈ సంకల్పశక్తిని పెంచుకోవటం ద్వారా ప్రత్యక్షత కూడా త్వరగా జరుగుతుంది. ఇప్పుడు 62 - 63 సంవత్సరాలు అయిపోయాయి, ఇంత సమయంలో ఎంతమంది ఆత్మలను తయారుచేసారు? 9 లక్షల మంది కూడా పూర్తి అవ్వలేదు. విశ్వమంతటికీ సందేశం అందించాలంటే ఎన్ని కోట్ల ఆత్మలు ఉన్నారు? ఇప్పటి వరకు కూడా భగవంతుడు వీరి టీచర్, భగవంతుడు వీరిని నడిపిస్తున్నారు, చేయించేవాడు పరమాత్మ .... అనేది స్పష్టం అవ్వలేదు. మంచి కార్యం, శ్రేష్ట కార్యం చేస్తున్నారు అనే మాట అయితే వచ్చింది కానీ చేయించేవారు ఇప్పటికీ గుప్తంగా ఉన్నారు. ఈ సంకల్పశక్తి ద్వారా ప్రతి ఒక్కరి బుద్ధిని పరివర్తన చేయగలుగుతున్నారా! అయ్యో ప్రభూ! అనే రూపంలో అయినా లేదా తండ్రి రూపంలో అయినా ప్రత్యక్షమవ్వాలి. కనుక బాప్ దాదా ఇప్పుడు కూడా మరలా ధ్యాస ఇప్పిస్తున్నారు - సంకల్ప శక్తిని పెంచుకోండి మరియు ప్రయోగంలోకి తీసుకువస్తూ ఉండండి. అర్దమైందా!  

మనస్సు ఏకాగ్రం అవ్వాలని బాప్ దాదా ఏదైతే అభ్యాసం చెప్పారో దానిని చేయాలి. ఎందుకంటే సమస్య అకస్మాత్తుగా వస్తుంది కనుక ఆ సమయంలోనే మనోబలం ఉంటే సమస్య సమాప్తి అయిపోతుంది, సమస్య పాఠం చదివించడానికి నిమిత్తం. రోజంతటిలో ఈ వ్యాయామాన్ని అభ్యసిస్తూ ఉండండి. మంచిది! 

నలువైపుల ఉన్నటువంటి శ్రేష్ట ఆత్మలకి, ఆది, మధ్య, అంతిమంలో శ్రేష్టపాత్ర అభినయించే ఆత్మలకు, సదా మీ శ్రేష్టసంకల్ప విధిని అనుభవం చేసుకునేవారికి, సదా సహజయోగితో పాటు వెనువెంట ప్రయోగి అయ్యేవారికి, సంకల్పశక్తి ద్వారా సదా సర్వశక్తులను పెంచుకునేవారికి, మనస్సు, బుద్ధిని నియంత్రణలో ఉంచుకునేవారికి, సదా ప్రయోగి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే, 

Comments