12-12-1998 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
నాది నాది” అను దేహాభిమానాన్ని వదిలి బ్రహ్మబాబా అడుగులో అడుగు వేయండి.
ఈ రోజు బాప్ దాదా తమ నలువైపులా ఉన్న శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలను చూస్తున్నారు. బ్రాహ్మణులంటే బ్రహ్మముఖవంశావళి బ్రాహ్మణులు. ఒక్కొక్క బ్రాహ్మణాత్మ భాగ్యాన్ని చూచి బాప్ దాదా కూడా హర్షితమౌతున్నారు. జన్మిస్తూనే ప్రతి బ్రాహ్మణాత్మ మస్తకంలో స్వయం బ్రహ్మాబాబాయే స్మృతి తిలకాన్ని దిద్దుతారు. స్వయం భగవంతుడే తిలకధారిగా చేస్తారు. తిలకంతో పాటు ప్రతి బ్రాహ్మణాత్మకు పవిత్రతా మహామంత్రమునిచ్చి ప్రకాశ కిరీటాన్ని ధరింపజేస్తారు. ఈ కిరీటముతో పాటు ప్రతి బ్రాహ్మణాత్మను విశ్వ కళ్యాణకారిగా చేసి బాధ్యతా కిరీటాన్ని కూడా ధరింపజేస్తారు. అనగా ప్రతి బ్రాహ్మణాత్మకు రెండు కిరీటాలున్నాయి. అంతేకాక స్వయం భగవంతుడే తన హృదయ సింహాసనాన్నిచ్చి సింహాసనాధికారిగా కూడా చేస్తారు. కనుక జన్మిస్తూనే తిలకము, కిరీటము, సింహాసనాధికారులుగా అవుతారు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము మొత్తం కల్పములో ఏ ఆత్మకూ ఉండదు. కనుక బ్రాహ్మణాత్మనైన నేను జన్మిస్తూనే ఇంత గొప్ప భాగ్యశాలిగా అయ్యాననే శ్రేష్ఠ భాగ్యము మీ స్మృతిలో ఉంటుందా? బ్రాహ్మణులైన మీ గుర్తులు ప్రపంచములోనివారు కృష్ణుని రూపములో చూపించారు. అయితే కృష్ణుడు విశ్వ రాకుమారుడు కనుక రాజ్యానికి గుర్తుగా తిలకము, కిరీటము, సింహాసనము చూపించారు. అయినా కృష్ణునికి బాల్యములో తిలకము, కిరీటము, సింహాసనము లభించవు. కానీ బ్రాహ్మణులైన మీకు జన్మిస్తూనే తిలకము, కిరీటము, సింహాసనము మూడూ ప్రాప్తిస్తాయి. తండ్రి అయిన పరమాత్మ ద్వారా ఈ మూడు ప్రాప్తులు లభించుట కేవలం బ్రాహ్మణులైన మీ భాగ్యములో మాత్రమే ఉంది. కనుక బాప్ దాదా తమ ప్రతీ పిల్లల మస్తకంలో ఎంత గొప్ప నక్షత్రము ప్రకాశిస్తూ ఉందో చూస్తున్నారు. ఇటువంటి భాగ్య నక్షత్రము మీకు మీ మస్తకంలో కనిపిస్తూ ఉందా? సదా ప్రకాశిస్తూ కనిపిస్తుందా? లేక అప్పుడప్పుడు చాలా బాగా ప్రకాశిస్తూ, అప్పుడప్పుడు ప్రకాశము తక్కువైపోతూ ఉందా? ఈ భాగ్య నక్షత్రము విచిత్రమైన నక్షత్రము. కనుక బాప్ దాదా పిల్లలైన మీ అందరినీ ఎప్పుడు చూచినా, ఎప్పుడు కలిసినా ప్రతి ఒక్కరి మస్తకంలో మీ భాగ్య నక్షత్రము ప్రకాశిస్తూ ఉండుట చూచి హర్షితమౌతారు. నక్షత్రము మెరుస్తూ మెరుస్తూ ప్రకాశము ఎందుకు తగ్గిపోతుంది? అందుకు కారణము మీ అందరికీ బాగా తెలుసు!
బాప్ దాదాకు పిల్లల చార్టు చూచి నవ్వు కూడా వస్తుంది. ఎప్పుడు ఎవ్వరినైనా నీ లక్ష్యమేది? నీవు ఎలా కావాలనుకుంటున్నావు? అని అడిగితే మెజారిటీ వారి జవాబు నెంబరువగా అవ్వాలని, సూర్యవంశీయులుగా అవ్వాలనే జవాబు వస్తుంది. చంద్రవంశ రాజా - రాణి అయిన రాముడు, సీతగా అయ్యేందుకు కూడా ఇష్టపడరు. అయితే సూర్యవంశంలో నంబరువన్ గా అవ్వాలనే లక్ష్యమున్నప్పుడు అటువంటి లక్షణాలు అనగా సూర్యవంశీయుల లక్షణాలు సదా తప్పకుండా కనిపిస్తూ ఉండాలి. పిల్లల లక్ష్యము సూర్యవంశీయులుగా అవ్వడం అనగా సదా విజయులుగా అవ్వడం. సూర్యవంశీయుల నంబరువన్ గుర్తు - సదా విజయులు. సూర్యుని కళలు తగ్గుతూ-హెచ్చుతూ ఉండవు. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు అంతే. చంద్రుని వలె కళలు తగ్గిపోవు. కనుక సూర్యవంశీయుల గుర్తు - సదా ఏకరస స్థితి, సదా విజయులు. చంద్రవంశీయులను క్షత్రియులని అంటారు. క్షత్రియ జీవితములో అప్పుడప్పుడు గెలుపు, అప్పుడప్పుడు ఓటమి ఉంటాయి. ఒకసారి సఫలతామూర్తిగా, ఒకసారి శ్రమించేమూర్తిగా ఉంటారు. యుద్ధము చేయడమంటే శ్రమ చేయుట. చంద్ర వంశీయుల కళలు ఏకరసంగా ఉండవు, కనుక లక్ష్యము, లక్షణాలను సమానంగా చేసుకోండి. పిల్లలు తండ్రి సమానంగా అయ్యే లక్ష్యముంచుకున్నారు. ప్రతి పుత్రుడు తండ్రి సమానంగా అవ్వాలనే చెప్తాడు. తండ్రి సదా విజయ స్వరూపులు కదా. ఏకరస స్థితి లేకుంటే నంబరువన్ గా అవుతారా(కాగలరా)? లేక నంబరు వారి లిస్టులో వస్తారా? ఒకటేమో నంబరువన్, రెండవది నంబరు వార్. కనుక మిమ్ముల్ను మీరే నేను నంబరువన్ గా ఉన్నానా? లేక నంబరు వారి లిస్టులో ఉన్నానా? అని ప్రశ్నించుకోండి. నంబరువన్ అనగా బ్రహ్మాబాబాను అనుసరించువారు.
బ్రహ్మాబాబాను సులభంగా తక్కువ శ్రమతో అనుసరించుటకు బాప్ దాదా సహజ సాధనము తెలుపుతున్నారు. ఏ కార్యము చేయుటకైనా బ్రహ్మ పద చిహ్నాలు అనగా అడుగులున్నాయి. కనుక అడుగులో అడుగు వేసి నడుచుట సహజమైపోతుంది. కొత్త దారి వెతికే అవసరముండదు. పద చిహ్నముపై పాదము అనగా అడుగులో అడుగు వేయాలి. ఏ పని చేస్తున్నా అనగా మనసుతో సంకల్పము చేస్తున్నా, మాట మాట్లాడుతున్నా కర్మలు చేస్తూ సంబంధ-సంపర్కములోకి వస్తున్నా, మొదట బ్రాహ్మణాత్మనైన నేను చేస్తున్న ఈ కర్మ బ్రహ్మాబాబా సమానంగా ఉందా? అని ఆలోచించండి. బ్రహ్మాబాబాకు ఏ సంకల్పముండేది? నా సంకల్పము కూడా బ్రహ్మాబాబా చేసిన సంకల్పము వలె ఉందా? నా మాటలు బ్రహ్మబాబా సమానంగా ఉన్నాయా? ఒకవేళ అలా లేకుంటే మానేయండి. ఆలోచించకండి, మాట్లాడకండి, కర్మలు చేయకండి. బ్రహ్మాబాబా అడుగు ఒక విధంగా ఉంటే మీ అడుగు మరొక విధంగా ఉండకూడదు. అలా ఉంటే తండ్రి సమానంగా అయ్యే లక్ష్యము ఏదైతే ఉందో అది ఎలా నెరవేరుతుంది? ప్రతి అడుగు బ్రహ్మ సమానంగా, బ్రహ్మ అడుగులో అడుగు వేస్తూ అనుసరిస్తూ ఉంటే ఒకటేమో సదా స్వయాన్ని సహజ పురుషార్థులుగా అనుభవం చేస్తారు, రెండవది సంపూర్ణతా గమ్యానికి సమీపంగా ఉన్నట్లు అనుభవం చేస్తారు.
బ్రహ్మబాబా సమానం అనగా సంపూర్ణతా గమ్యానికి చేరుకొనుట. కనుక బ్రహ్మబాబా వతనంలో పిల్లలైన మీ అందరినీ సంపూర్ణ అవ్యక్త ఫరిస్తాలుగా తయారై రమ్మని ఆహ్వానిస్తున్నారు. బ్రహ్మబాబా మిమ్మల్ని ఆహ్వానించు పాట లేక మధురంగా ఆహ్వానించు శబ్దాలు వినిపించుట లేదా? “రండి పిల్లలారా, మధురమైన పిల్లలారా, త్వర త్వరగా వచ్చేయండి” అనే మాటలు లేక పాట వినిపించుట లేదా? బ్రహ్మబాబా శబ్దాలు వినండి, క్యాచ్ చేయండి. బ్రహ్మబాబా పిల్లలతో ఇలా అంటున్నారు - పిల్లలూ, మీరు 1999 సంవత్సరం గురించి చాలా ఆలోచిస్తున్నారు - ఏమవుతుందో! ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందే ........ ఇది అవుతుందా లేదా....... ఇది జరుగుతుంది....... ఇలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా అయితే జరగదు కదా! ఒక్కొక్కసారి జరుగుతుందని, ఒక్కొక్కసారి జరగదని ఆలోచిస్తున్నారు. ఇలా జరుగుతుంది, జరుగుతుంది అనే పాట పాడుతూ ఉన్నారు. కానీ మీ ఫరిస్తాతనపు సంపన్న సంపూర్ణ స్థితిలో తీవ్ర వేగముతో ముందుకు వెళ్లాలనే విశేష సంకల్పము తక్కువగా చేస్తున్నారు. జరుగుతుందా. ఏమి జరుగుతుంది........ ఇలా జరుగుతుంది, జరుగుతుందా, జరగదా, ఏమి జరుగుతుందో......... ఈ పాట ఎక్కువగా పాడున్నారు. తండ్రి చెప్తున్నారు - ఏది జరిగినా మీ లక్ష్యమేమి? ఏమి జరిగితే అది చూచే, వినే లక్ష్యముందా లేక బ్రహ్మాబాబా సమానం ఫరిస్తా అవ్వాలనే లక్ష్యముందా? అందుకు ఏర్పాట్లు చేసుకున్నారా? ప్రకృతి ఏ రంగులు చూపించినా మీరు ఫరిస్తాలై తండ్రి సమానం అవ్యక్త రూపధారులై ప్రకృతి చూపించే ఏ దృశ్యానైనా చూచేందుకు రెడీగా ఉన్నారా? ప్రకృతి కలిగించే అలజడి ప్రభావం నుండి ముక్తులుగా ఉండే ఫరిస్తాలుగా అయ్యారా? మీ స్థితిని తయారు చేసుకొనుటలో నిమగ్నమై ఉన్నారా? లేక ఏమి జరుగుతుందో, ఏమి జరుగుతుందో........ అనే ఆలోచనలోనే మునిగిపోయి ఉన్నారా? ఎటువంటి పరిస్థితులు వచ్చినా ప్రకృతి పతులైన మీరు మీ ప్రకృతి పతి సీటుపై సెట్ అయ్యి ఉంటారా? లేక అప్సెట్ అవుతారా? ఇదేమిటి ఇలా జరిగింది? ఇలా జరిగింది, ఇలా జరిగింది........... అని జరిగిపోయిన దృశ్యాల సమాచారాలు వింటూ, ఆలోచిస్తూ బిజీగా ఉంటారా లేక సంపన్నతా స్థితిలో స్థితమై ప్రకృతిలో ఎలాంటి అలజడి కలిగినా, వచ్చి వెళ్లిపోయే మేఘాల వలె అనుభవం చేస్తారా?
కనుక బ్రహ్మాబాబా పిల్లలను - "మీరు నా సమానంగా ఫరిస్తాలుగా సదా కాలానికి తయారయ్యారా?" అని అడుగుతున్నారు. ఎందుకంటే పిల్లలైన మీరు వ్యక్తములో ఉంటూ అవ్యక్తముగా తయారవ్వాలి. అందుకు పిల్లలు - తండ్రి ఏమో అవ్యక్తమైపోయారు, మమ్ములను కూడా అలా అవ్యక్తంగా చేయాలి కదా అని అంటున్నారు. అందుకు బ్రహ్మాబాబా “మొదట స్వయాన్ని తండ్రి ఏదైతే విశ్వకళ్యాణమనే కిరీటాన్ని ధరింపజేశారో ఆ పనిని సంపన్నము చేశామా” అని ప్రశ్నించుకోండి. విశ్వకళ్యాణకారులారా, విశ్వకళ్యాణము సంపన్నమయ్యిందా? బ్రహ్మాబాబా ఎందుకు అవ్యక్తమయ్యారంటే పిల్లలకు విశ్వకళ్యాణ కార్యమునిచ్చి బంధనాల నుండి ముక్తమై సేవా వేగాన్ని తీవ్రము చేయుటకు నిమిత్తమవ్వవలసి ఉండినది. దాని ప్రత్యక్ష స్వరూపాన్ని మీరు నలువైపులా చూస్తున్నారు. దేశములోగాని, విదేశాలలో గాని అవ్యక్త బ్రహ్మ ద్వారా సేవా వేగము తీవ్రమయ్యింది, ఇంకా కావలసి ఉంది. సేవలో తీవ్రగతికి ఆధారం బ్రహ్మబాబా నిమిత్తమవ్వవలసి ఉండినది. కానీ రాజ్యాధికారిగా ఒక్క బ్రహ్మాబాబానే కాదు, రాజ్యాధికారాన్ని పిల్లలు కూడా తీసుకోవాలి. అందువలన సాకారంలో సాకార రూపధారీ పిల్లలైన మిమ్ములను నిమిత్తంగా చేశారు. కనుక చివర్లో పిల్లలైన మీరంతా వ్యక్తములో అవ్యక్త ఫరిస్తాలై విశ్వకళ్యాణ సేవా వేగాన్ని తీవ్రము చేసి సేవను సమాప్తం చేయాలి, సంపన్నము చేయాలి. ఈ కార్యము మీరే చేయాలి.
బ్రహ్మబాబా పిల్లలను 1999లో సమాప్తం చేస్తామా? అని అడుగుతున్నారు. చప్పట్లు చరుస్తూనే ప్రకృతి సిద్ధంగా నిల్చొని ఉంది. మీరు ఫరిస్తా సమానం డబల్ లైట్ గా తయారైపోయారా? ఇటువంటి సదా విజయులుగా అనగా ఎలాంటి వ్యర్థ సంకల్పాలు, నెగటివ్ సంకల్పాలు, మాటలు, కర్మలు అనగా సర్వ సంబంధ-సంపర్కాలలో పాసైన వారు కనీసము 108 మంది అయినా తయారైనారా? వ్యర్థము లేక నెగటివ్ భారము సదా కాలానికి డబల్ లైట్ ఫరిస్తాలుగా కానివ్వవు. కనుక బ్రహ్మబాబా ఈ భారము నుండి తేలికైన ఫరిస్తాలుగా అయ్యారా? అని అడుగుతున్నారు. సదా అనే పదము అండర్లైన్ చేసుకోండి. కనీసం 108 మంది అయినా సదా ఫరిస్తా జీవితాన్ని అనుభవం చేసినపుడు బ్రహ్మబాబా సమానమగుట అని అంటారు. కనుక చపట్లు చరచమంటారా? అని తండ్రి అడుగుతున్నారు లేక 2000 సంవత్సరంలో చరచమంటారా? 2001లో చరచమంటారా? లేక చప్పట్లు చరచినప్పుడు అవుతామని అనుకుంటున్నారా? ఏమాలోచిస్తున్నారు? - చప్పట్లు చరచినప్పుడు అవుతామని అనుకుంటున్నారా? ఏం చెయ్యమంటారు? చప్పట్లు చరుస్తునా? రెడీగా ఉన్నారా? చెప్పండి, పరీక్ష పెట్టమంటారా? ఊరక మీరు నోటితో రెడీ అని చెప్తూనే అంగీకరించము. ముందు పరీక్ష పెట్టాము. టీచర్లూ, మీరు చెప్పండి. పరీక్ష తీసుకోమంటారా? అన్నీ వదిలేయాల్సి వస్తుంది. మధువనము వారు మధువనాన్ని వదలాల్సి పడ్తుంది. జ్ఞానసరోవరము వారు జ్ఞాన సరోవరాన్ని, సెంటర్ల వారు సెంటర్లను, విదేశీయులు విదేశాలను, అన్నీ వదిలేయాల్సి వస్తుంది. అందుకు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నామని అనుకుంటే చప్పట్లు కొట్టండి. రెడీగా ఉన్నారా? పరీక్ష పెట్టమంటారా? రేపు అనౌన్స్ చెయ్యమంటారా? అక్కడకు వెళ్లినా, వెళ్తామన్నా వదిలేది లేదు. అక్కడకు వెళ్లి కొంచెం సరి చేసుకొని వస్తామని అంటే అలా కుదరదు. ఎక్కడుంటే అక్కడే. అలా ఎవర్ రెడీగా ఉన్నారా? మీ ఆఫీసు గాని, మీ గది గాని, మీ అల్మైరా గాని ఏదియూ గుర్తు రాకూడదు. కొద్దిగా పని ఉంది, రెండు రోజులు ఆ పని పూర్తి చేసుకొని వస్తానని కూడా అనరాదు. ఆర్డరంటే ఆర్డరే. ఆలోచించి సరే అని చెప్పండి. లేకుంటే రేపు మీరు ఎక్కడికెళ్లాలో, ఎక్కడికెళ్లరాదో ఆర్డర్లు వచ్చేస్తాయి. ఆర్డర్లు ఇచ్చేస్తుమా? సిద్ధంగా ఉన్నారా? “సరే" అని ధైర్యంగా చెప్పడం లేదు. ఒక రోజు లభిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు కదా. నేను లేకుంటే ఇది జరగదేమో, ఇది జరగదేమో అని వ్యర్థ సంకల్పాలు కూడా చెయ్యరాదు. బ్రహ్మబాబా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు నేను లేకుంటే ఏమవుతుందో అని ఆలోచించాడా? యజ్ఞం నడుస్తుందా, లేదా అనేమైనా ఆలోచించాడా? సరే అని, ఒక డైరక్షన్ ఇస్తానని ఆ డైరక్షన్ ఇచ్చేశాడు. తన సంపన్న స్థితి ద్వారా డైరెక్షన్ ఇచ్చేశాడు, నోటితో కాదు. అలా రెడీగా ఉన్నారా? ఆర్డర్ లభిస్తూనే “వదిలేస్తే వదిలిపోతుంది” ఇలా చెయ్యాలని చెప్పాలని ఆందోళన చేస్తారా? ఆర్డరు తయారవుతుంది, అయితే అడిగి కాదు. తేది నిర్ణయించరు. ఆకస్మాత్తుగా వచ్చేయమని ఆర్డరు వస్తుంది. అంతే. వచ్చేయాలి. దీనిని డబల్ లైట్ ఫరిస్తాలని అంటారు. ఆర్డర్ వస్తూనే వెళ్లిపోవాలి. ఉదాహరణానికి మృత్యుదేవత ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏమైనా ఆలోచిస్తారా? సెంటరు చూడాలి, అల్మైరా చూడాలి, జిజ్ఞాసువులను చూడాలి, ఏరియా చూడాలి......... అని ఆలోచిస్తారా? ప్రస్తుతము ఇది నా ఏరియా, ఇది నా ఏరియా అనే చిక్కులు ఎక్కువైపోయాయి. నా ఏరియా అని అంటున్నారే. విశ్వకళ్యాణకారులకు హద్దు ఏరియా ఉంటుందా? ఇవన్నీ వదిలేయాల్సి పడుంది. అలా అనుట కూడా దేహాభిమానమే. దేహ భావము లేక దేహ భ్రాంతి తేలికైనది కాని దేహాభిమానము చాలా సూక్ష్మమైనది. నాది - నాది అనుటను దేహాభిమానమని అంటారు. నాది అనేది ఎక్కడుంటుందో అక్కడ అభిమానము తప్పక ఉంటుంది. మీ విశేషతల గురించి, నా విశేషత, నా గుణాలు, నా సేవ ఇవన్నీ 'మేరాపన్ (నాది)' దేహాభిమానమే. ఇవన్నీ ప్రభు ప్రసాదాలు, నావి కావు అని భావించాలి. ప్రభువు ప్రసాదాన్ని నాది అనుకోవడం దేహాభిమానమవుతుంది. ఈ అభిమానాన్ని వదిలేయడమే సంపన్నమగుట. అందువలన ఫరిస్తా అని దేనినైతే వర్ణిస్తున్నారో అది దేహాభిమానము కాదు, దేహ భావమూ కాదు, రకరకాల దేహ సంబంధాలూ కాదు. ఫరిస్తాలనగా ఈ దేహ సంబంధాలన్నీ సమాప్తం. కనుక ఇప్పుడు ఏ ఏర్పాట్లు చేస్తారు? బ్రహ్మబాబా శబ్దాలను బాగా గమనమిచ్చి వినండి. మిమ్ములను ఆహ్వానిస్తున్నారు. తండ్రి చెప్తున్నారు - సమాప్తి ఢంకాను మ్రోగించడం చాలా సులభం, ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్రోగించవచ్చు. అయితే కనీసం సత్యయుగ ఆదిలో వచ్చే 9 లక్షల మంది అయినా రెడీ కావాలి కదా. నంబరువారుగా అయ్యే వారైనా కావాలి కదా. నంబరువన్ గా అయ్యేవారు కొద్దిమందే ఉంటారు. కనీసం 108 మంది నంబరువన్(Number One), 16 వేల మంది నంబరు టు(Number Two), 9 లక్షలు నంబరు త్రీ (Number Three), ఇంతమంది అయినా తయారవ్వాలి కదా. ఎందుకంటే రాజధాని తయారవ్వాలి కదా.
ఇప్పుడు రిజల్టులో వర్తమాన సమయంలో మెజారిటి పిల్లలలో మాయ నెగటివ్ సంకల్పాలు, వ్యర్థ సంకల్పాల రూపంలో ఉంది. విశ్వకళ్యాణకారి స్థితి అనగా సదా బేహద్ వృత్తి, దృష్టిలో ఉండాలి. స్థితి కూడా బేహద్ స్థితి ఉండాలి. వృత్తిలో కొద్దిగా కూడా ఏ ఆత్మ పట్ల నెగటివ్ లేక వ్యర్థ భావన ఉండరాదు. నెగటివ్ మాటలను పరివర్తన చేయుట - అది వేరే విషయము. కానీ స్వయం నెగటివ్ వృత్తి గలవారు ఇతరుల నెగటివ్ ను పాజిటివ్ లోకి మార్చలేరు. అందువలన ప్రతి ఒక్కరు తమ వృత్తి, దృష్టి సర్వుల పట్ల సదా బేహద్ గా ఉందా? అని సూక్ష్మంగా పరిశీలించుకోండి. కళ్యాణ భావన తప్ప ఏ కొద్దిగానైనా హద్దు భావన, హద్దు సంకల్పాలు, హద్దు మాటలు, కనిపించకుండా సూక్ష్మంలోనైనా ఇమిడి లేవు కదా? సూక్ష్మంలో ఉన్నాయనుటకు గుర్తు - సమయం వచ్చినప్పుడు లేక సమస్య వచ్చినప్పుడు సూక్ష్మంలో ఉండేది స్థూలంలోకి వచ్చేస్తుంది. అంతా బాగానే ఉంటుంది గాని సమయం వచ్చినప్పుడు అది ఎమర్జ్ అయిపోతుంది. తర్వాత ఇది అంతే, ఈ విషయమే అటువంటిది, ఈ వ్యక్తే ఇటువంటి వాడు అని అనుకుంటారు. వ్యక్తి అటువంటివాడే కానీ నా స్థితి శుభ భావన, బేహద్ భావన గలదిగా ఉందా అని మీ తప్పులను మీరే చెక్ చేసుకోండి. అర్థమయిందా!
మాటలను చూడకండి, స్వయాన్ని చూసుకోండి. 1999 సంవత్సరంలో నా ప్రతి అడుగు బ్రహ్మాబాబా సమానంగా ఉండాలి అనే తపన ఉంచుకోండి. బ్రహ్మాబాబా అంటే అందరికీ ప్రేమ ఉంది కదా. ప్రియంగా ఉన్నవారిని అనుసరిస్తారు. తండ్రి సమానం అయ్యే తీరాలి. సరేనా! 1999 సంవత్సరంలో అందరూ తయారైపోతారా? ఇంకా ఒక సంవత్సరముంది. ఇది జరిగింది, ఇలా జరిగింది.......... అని ఆలోచించకండి. ఇది జరిగే తీరాలి. ఇది జరుగుతుందని ముందే తెలుసు. అయితే తండ్రి సమానం ఫరిస్తాగా అయ్యే తీరాలి. అర్థమయిందా, చెయ్యాలి కదా? చెయ్యగలరా? ఒక సంవత్సరంలో తయారవుతారా లేక 6 నెలలలోనే తయారవుతారా? మిమ్ములను సంపన్నం చేయుటకు బ్రహ్మాబాబా కూడా ఆహ్వానిస్తున్నాడు, ప్రకృతి కూడా వేచి ఉంది. 6 మాసాలలో ఎవర్ రెడీగా కండి. పోనీ 6 మాసాలు కాకుంటే ఒక సంవత్సరంలోనైనా కండి. ఆందోళన చెందకండి. స్థిరంగా ఉండండి. లక్ష్యాన్ని వదలకండి. ఏమి జరిగినా తండ్రి సమానంగా అయ్యే తీరాలి. కొంతమంది బ్రాహ్మణులు కదిలించినా, ఆటంకము కలిగించినా మేము సమానంగా అయ్యే తీరాలని దృఢంగా, స్థిరంగా ఉండాలి. ఈ సలహా బాగుందా? (బాప్ దాదా అందరి చేతులు ఎత్తించారు, అందరి వీడియో ఫోటో తీయించారు). ఈ ఫోటో అందరికీ పంపుతాము. ఇక్కడి మూవీలు ఎవరైనా మిస్ కావచ్చు కాని వతనంలోని మూవీలో ఎవ్వరూ మిస్ కారు. అచ్ఛా!
తండ్రి చెప్తున్నారు - అందరూ ఇప్పుడే ఒక సెకండులో విదేహీలుగా అవ్వగలరా? కనుక ఇప్పుడే ఒక సెకండులో విదేహీ స్థితిలో స్థితమైపోండి(థ్రిల్లు) అచ్ఛా, ఇప్పుడు మరలా దేహములోకి వచ్చేయండి.
ఇప్పుడు మరలా విదేహీలైపోండి. ఇలా రోజంతా మధ్య మధ్యలో ఒక సెకండు లభించినా మాటి మాటికి ఈ అభ్యాసము చేస్తూ ఉండండి. మంచిది.
సర్వ శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలకు, సదా బ్రహ్మ బాబా అడుగులో అడుగు వేసి తండ్రిని అనుసరించే ఆజ్ఞాకారి పిల్లలకు, సదా బ్రహ్మాబాబా సమానం ఫరిస్తా స్థితిలో స్థితమై ఉండే సమీప ఆత్మలకు, సదా ప్రకృతిపతులై ప్రకృతిలోని ప్రతి దృశ్యాన్ని సాక్షిగా ఉండి చూస్తూ చలించకుండా స్థిరంగా ఉండే ఆత్మలకు, సదా అనంతమైన వృత్తి, దృష్టిలో ఉండు భాగ్యశాలి పిల్లలకు బాప్ దాదా యాద్ ప్యార్ ఔర్ నమస్తే, వెలుపల దేశంలో కాని, విదేశాలలో గాని వింటున్న పిల్లలకు కూడా విశేషమైన ప్రియస్మృతులు.
Comments
Post a Comment