04-11-2001 అవ్యక్త మురళి

                04-11-2001         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సత్యవాదిగా అవ్వండి మరియు సమయం అనుసరించి బేహద్ వృత్తి, దృష్టి మరియు కృతిని తయారుచేసుకునే ధృడసంకల్పమనే దీపాన్ని వెలిగించండి. 

ఈరోజు ప్రేమసాగరుడైన బాప్ దాదా తన యొక్క అతి ప్రియమైన మధురాతి మధురమైన పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. మీరందరు కూడా కలయిక జరుపుకోవడానికి వచ్చారు కదా! పరుగు, పరుగున వచ్చారు. కనుక బాప్ దాదా కూడా పిల్లలను కలుసుకునేటందుకు పరుగు, పరుగున వచ్చారు. మీరందరు ఈ లోకం నుండి వచ్చారు మరియు బాప్ దాదా పరలోకం నుండి, సూక్ష్మలోకం నుండి వచ్చారు అయితే అందరికంటే దూరం నుండి ఎవరు వచ్చారు? అందరికంటే దూరదేశి ఎవరు? డబల్ విదేశీయులు దూరదేశీలా? కాదు. అందరికంటే దూరాతిదూరం యొక్క దూరదేశీ బాబాయే. బాప్ దాదా ఈసారి డబల్ విదేశీ మరియు భారతవాసి ప్లిలల యొక్క ఒక విషయంలో గర్వంగా ఉంది. ఏ విషయం గురించి గర్వంగా ఉంది? చెప్పండి. పిల్లల యొక్క విశేషంగా డబల్ విదేశీ పిల్లల యొక్క ధైర్యం చూసి బాప్ దాదాకి గర్వంగా ఉంది - ఎట్టి పరిస్థితులలో అయినా బాబాని కలుసుకునేటందుకు వచ్చేస్తారు. వచ్చేసారు కూడా! డ్రామా ఆట కూడా చూపించింది కానీ బాబా మరియు పిల్లల యొక్క కలయికను డ్రామా కూడా ఆపలేకపోయింది. అటువంటి ధైర్యవంతులైన పిల్లలపై బాప్ దాదా కూడా వరదానాల యొక్క పూలవర్షాన్ని కురిపిస్తున్నారు. 

ఈరోజు ఈ ఘడియలో ఏ బిడ్డకి ఏ వరదానం కావాలంటే ఆ వరదానం లభిస్తుంది. వరదానం సహజంగా లభిస్తుంది కానీ ఆ వరదానాన్ని రోజూ అమృతవేళ మరియు కర్మయోగి స్థితిలో మాటిమాటికి మనస్సుతో స్మృతి చేయండి. బలహీనం అవ్వకండి. వరదానం లభించింది కానీ ఆ వరదానం సదా నయనాలలో ఉండాలి. ఎలా అయితే స్థూల నయనాల మధ్య ఏమి మెరుస్తుంది? అందరి నయనాల మధ్య ఏమి మెరుస్తూ కనిపిస్తుంది? బిందువు మెరుస్తుంది కదా! నిరంతరం నయనాల మధ్య బిందువు మెరుస్తూ కనిపిస్తుంది కదా! లేదా అప్పుడప్పుడు మెరుస్తుందా? నిరంతరం మెరుస్తుంది కదా! అదేవిధంగా సదా నయనాలలో బాబా యొక్క బిందువు ఇమిడి ఉండాలి. ఉంచుకోగల్లుతున్నారు కదా? కష్టమా? కష్టం కాదు కదా? సహజమేనా? మంచిది. ఏవిధంగా అయితే స్థూలమైన బిందువు నిరంతరం మెరుస్తూ ఉంటుందో అదేవిధంగా నయనాలలో నిరంతరం బాబా యొక్క బిందువు ఇమిడి ఉండాలి. ఇముడ్చుకున్నారా? అమరి ఉందా? తొలగిపోవటం లేదు కదా? ఒకవేళ నయనాలలో నిరంతరం బాబా యొక్క బిందువు ఇమిడి ఉంటే ఇక ఏ వైపు నయనాలు ఆకర్పితం అవ్వవు. శ్రమ నుండి విడిపించబడతారు. ఇక వేరే వైపు దృష్టి వెళ్ళదు. పూర్తిగా రక్షణగా ఉంటారు. ఏమైపోయినా కానీ నయనాలలో సదా బాబా యొక్క బిందువు ఇమిడి ఉండాలి. సదా నయనాలలో నిండి ఉంటే మనస్సులో కూడా వారే నిండి ఉంటారు. కనుక మనస్సులో మరియు నయనాలలో ఇముడ్చుకునే విధి - బాప్ దాదాని అంటే యజమానిని రాజీ చేసుకోవాలి. యజమాని రాజీ అయ్యారా? బాప్ దాదా యజమాని మీపై రాజీ అయినట్లు మీరు భావిస్తున్నారా? రాజీ అయ్యారా? ఎంత శాతంలో రాజీ అయ్యారు? (కొంతమంది 75 శాతం కొంమంతి 99 శాతం అని చెప్పారు) 

బాప్ దాదాని రాజీ చేసుకోవటం చాలా సహజం. సహజమా లేదా కష్టమా? సహజమేనా? వెనుకవారు చెప్పండి, సహజమేనా? చేతులైతే చాలా బాగా ఎత్తారు. బాప్ దాదాని రాజీ చేసుకునే సహజమైన విధి - సత్యమైన మనస్సు. సత్యమైన మనస్సుకే యజమాని రాజీ అవుతారు. ప్రతి కర్మలో సత్యవాదిగా ఉండాలి. ఎవరైతే సత్యమైన మనస్సుతో ఉంటారో వారు సదా సంకల్పంలో, మాట మరియు కర్మలో, సంబంధ, సంపర్కంలో రాజయుక్తంగా ఉంటారు అంటే రహస్యాన్ని అర్థం చేసుకునేవారు మరియు నడిచేవారు. రాజయుక్తి అయిన వారి గుర్తు - రహస్యం తెలుసుకున్నవారు ఎప్పుడు తమ స్వస్థితిలో కోపంలోకి రారు అంటే చింతించరు. ఈ గుర్తు ద్వారా ఎంత వరకు రాజయుక్తంగా అయ్యాము అనేది పరిశీలించుకోవచ్చు. వారు సంకల్పంలో కూడా, వృత్తి ద్వారా కూడా, స్మృతి ద్వారా కూడా, దృష్టి ద్వారా కూడా ఎవరిపై కోపంలోకి రారు ఎందుకు? అందరి యొక్క మరియు తమ యొక్క స్వభావ, సంస్కారాలను తెలుసుకునే రాజయుక్తంగా ఉంటారు. కనుక బాబాని కూడా రాజీ చేసుకునే విధి - రాజయుక్తంగా అయ్యి నడవటం మరియు రాజయుక్త అంటే స్వయంపై కోపంలోకి రాకూడదు మరియు ఇతరుల పట్ల కోపంలోకి రాకూడదు. సదా సమయం అనుసరించి మీ మనస్సు, బుద్ధి, స్వప్నం వరకు కూడా సదా శుభంగా మరియు శుద్ధంగా ఉంచుకోండి. కొందమంది పిల్లలు ఆత్మిక సంభాషణలో చెప్తున్నారు - బాప్ దాదా అయితే శక్తులు ఇస్తున్నారు కానీ సమయానికి ఆ శక్తులను ఉపయోగించలేక పోతున్నాము. బాప్ దాదా విశేషంగా పిల్లలందరి యొక్క తోడు కనుక ఆ సంబంధంతో విశేషంగా అటువంటి సమయంలో ఎగస్ట్రా సహాయం ఇస్తారు. ఎందుకు? ఎందుకంటే పిల్లలను సంపన్నం చేసి వెంట తీసుకువెళ్ళటం బాబా యొక్క బాధ్యత. బాధ్యత బాబాది. కనుక అటువంటి సమయంలో తన బాధ్యతను నిలుపుకుంటారు కానీ అప్పుడప్పుడు పిల్లల యొక్క మనస్సు యొక్క క్యాచింగ్ పవర్ (గ్రహణ శక్తి) యొక్క స్విచ్ ఆఫ్ అయ్యి ఉంటుంది. అప్పుడు బాబా ఏం చేస్తారు? బాబా మరలా స్విచ్ ఆన్ చేయటానికి, తెరవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దీనిలో సమయం పట్టేస్తుంది. అందువలనే అలా స్విచ్ ఆన్ అయిన తర్వాత అంటున్నారు - చేయాలనుకోలేదు కానీ అయిపోయింది అని. కనుక సదా మీ మనస్సు యొక్క క్యాచింగ్ పవర్ దీనినే మీరు టచ్చింగ్ (ప్రేరణ) మరియు క్యాచింగ్ పవర్ అంటారు. వాటి యొక్క స్విచ్ ఆన్ చేసి ఉంచండి. మాయ ఆఫ్ చేయటానికి ప్రయత్నం చేస్తుంది. సెకనులో ఆఫ్ చేసేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సమయం చాలా నాజుకుగా అవుతూ ఉంటుంది. ఇంకా అవుతుంది. భయపడటంలేదు కదా? ఏమీ ఫర్వాలేదు. బాప్ దాదా మొదటే చెప్పారు కదా, ఈ సంవత్సరం ఏ సంవత్సరంగా జరుపుకున్నారు? సంస్కారాల పరివర్తన ద్వారా ప్రపంచ పరివర్తన. పక్కాయే కదా! జరుపుకున్నారు కదా! లేక మర్చిపోయారా? లేక జరుపుకుంటున్నారా? ప్రకృతి, బాబాని అడుగుతుంది. పిల్లలు ప్రపంచ పరివర్తన యొక్క సంకల్పం తీసుకున్నారు. అయితే పక్కాగా తీసుకున్నారు కదా? వెనుకవారు తీసుకున్నారా? సంకల్పం పక్కాయే కదా అందరి సంకల్పమే కదా? అయితే ప్రకృతి బాబాని అడుగుతుంది - నేను శుభ్రం చేయడానికి తయారవుతున్నాను కానీ శుభ్రం చేయడానికి నిమిత్తమైనవారు చేయమా, వద్దా, తొందరగా చేద్దామా లేదా నెమ్మదిగా చేద్దామా అని ఆలోచిస్తున్నారు. సంశయంలో ఉన్నారు మరి నేనేమి చేయను అని ప్రకృతి అడుగుతుంది. జవాబు ఏమిటి? బాప్ దాదా ప్రకృతికి ఏమి జవాబు చెప్పాలి? చెప్పండి. డబల్ విదేశీయులు చెప్పండి? (కొద్దిగా ఎదురుచూడమనండి) ఇది సరైన జవాబు కాదు. ఒకవేళ డబల్ విదేశీయులు ఎదరు చూస్తూ ఉంటే విమానం దొరకదు. ఇప్పుడైతే విమానం దొరికింది కదా! విమానంలో నిద్రపోతూ, నిద్రపోతూ వచ్చారు కదా! విశ్రాంతిగా వచ్చారు కదా! సభ మొత్తంలో ఎవరికైనా రావటానికి కష్టం అనిపించిందా? చేతులు ఎత్తండి! ఎవరికైనా అనిపించిందా? చేరుకున్నారు కదా? సమయానికి చేరుకున్నారు. ఇది ధైర్యంతో కూడిన విషయం. కొంచెం భయపడినవారు ఆగిపోయారు. మీరయితే వెళ్ళవలసిందే అని ధృఢసంకల్పం చేసారు, చేరుకున్నారు, కేవలం ఒక విమానమే తిరిగి వచ్చింది. అంతే కదా! అదేమీ పెద్ద విషయం కాదు. తర్వాత మంచిగా లభిస్తుంది. ఇప్పుడు ప్రకృతిని శుభ్రం చేసే విషయంలో ఆలోచనలో పడేయకండి. ఎందుకంటే స్థాపన చేసేవారు అప్పుడప్పుడు ఏమి చేయము? ఇలా చేద్దామా, వద్దా? సరిగా అవుతుందా, అవ్వదా?.... ఇలా ఆలోచిస్తున్నారు. అవునా, కాదా అనేది ఒక్కసారిగా స్పష్టం అవ్వాలి. ఇది సత్యం, ఇది అసత్యం అని స్పష్టం అవ్వాలి. మీరు ఈ సంవత్సరం జరుపుకున్న కారణంగా, ప్రకృతి అయితే తయారీలు చేస్తుంది. ఇప్పుడు కూడా చేయిస్తుంది కానీ స్థాపనకి నిమిత్తమైన ఆత్మలు ఇప్పుడు ఏదోక విషయంలో స్వయం పట్ల అయినా, ఇతరుల పట్ల అయినా ఆలోచించటంలో సమయం పోగొట్టుకోకూడదు. సెకనులో స్పష్టమైన ప్రేరణ రావాలి. 

బిందువు పెట్టటంలో ఎంత సమయం పడుతుంది? (సెకను పడుతుంది) ప్రత్యక్ష జీవితంలో బిందువు పెట్టటంలో సెకను పడుతుందా? ఏ విషయానికైనా బిందువు పెట్టటంలో లేదా బిందురూప స్థితిలో స్థితులవ్వటంలో సెకను పడుతుందా? సెకను పడుతుందా? లేదా ప్రత్యక్షంలో సెకను కంటే తక్కువ పడుతుందా? ఏదైనా విషయం మీ ఎదురుగా వచ్చినప్పుడు బిందువు పెట్టటంలో సెకను పడుతుందా? పాండవులకు సెకను పడుతుందా? (అప్పుడప్పుడు సమయం పడుతుంది అని చెప్పారు) పాండవులు అయితే బిందువు పెట్టటంలో సమయం పడుతుంది అని చెప్పారు. శక్తులలో శక్తి ఉందా? (పాండవులు సత్యం చెప్పారు అని చెప్పారు) కాదు పాండవులు, శక్తులు ఇద్దరూ సత్యమైనవారే. ఎందుకంటే వారు (పాండవులు) ఇప్పుడు బిందువు పెట్టగలరు కానీ మీరు అప్పుడు పెట్టలేరేమో అందువలనే తేడా వచ్చింది. కానీ అందరూ సత్యమైనవారే. అందరూ సత్యమైన హృదయం కలిగినవారే. హాలు అయితే నిండిపోయింది క్రింద కూడా కూర్చున్నారు. క్రింద కూర్చున్నా కానీ బాప్ దాదా ఎదురుగా ఉన్నారు. మధువనంలో బాప్ దాదా వచ్చారు అని దేశ,విదేశాలలో పిల్లలందరు ఇదే స్మృతిలో ఉన్నారు. తమ, తమ దూరదేశి దృష్టి అనే దుర్భిణి ద్వారా చూస్తున్నారు. వారు కూడా బాప్ దాదా ఎదురుగా వస్తున్నారు అంటే అటువంటి వారు దూరంలో ఉన్నా కానీ మనస్సుతో మధువనంలో ఉన్నారు. సాకారలోకం యొక్క స్థూలసాధనాలైతే అలజడి అవ్వచ్చు కానీ ఈ ఆధ్యాత్మిక దూరదృష్టి, దూరదేశీ దృష్టి ఎప్పుడూ పాడవ్వదు. ఈవిధంగా నలువైపుల ఉన్న సేవాకేంద్రాలలోని పిల్లలందరూ బాప్ దాదాకి ఎదురుగా కనిపిస్తున్నారు. మంచిది. దీపావళి జరుపుకున్నారా? సంగమయుగం అంటే జరుపుకునేయుగం. అంతర్ముఖి అయ్యి అతీంద్రియ సుఖం యొక్క మజా చేసుకోండి. సేవలో మహాదాని అయ్యి ఆత్మల కొరకు మహాదానం చేసుకుంటూ వెళ్ళండి, పరస్పరం ఆత్మికసంభాషణ చేసుకోండి. నాట్యం చేయండి లేదా సంబంధ, సంపర్కాల ద్వారా పరస్పర విశేషతలు చూడండి, విశేషతల యొక్క సువాసనను స్వీకరించండి.... ఇలా జరుపుకోవటమే జరుపుకోవటం. పోగొట్టుకునే సమయం సమాప్తి అయిపోయింది. పోగొట్టుకునే యుగం కాదు. జరుపుకునే మరియు సంపాదించుకునే యుగం. ఇలా ప్రతి పిల్లవాడు సదా జరుపుకుంటూ ఉండాలి అని బాప్ దాదా చూస్తూ ఉంటారు. ఏదోరకంగా జరుపుకుంటూనే ఉండాలి. పోగొట్టుకోవటం మరియు జరుపుకోవటం రెండింటి జ్ఞానం ఈ సంగమయుగంలోనే ఉంటుంది. పోగొట్టుకునేవారు తిరిగి జరుపుకుంటున్నారు దీనికి గొప్పతనం ఉంటుంది. ఇప్పుడు పోగొట్టుకోవడానికి బిందువు పెట్టండి. ఆపేయండి. పోగొట్టుకోకూడదు. ఒక సంకల్పం కూడా పోగొట్టుకోకూడదు. సంపాదించుకునే సమయంలో పోగొట్టుకుంటే ఇక ఎప్పుడు సంసాదించుకుంటారు? మరలా సమయం లభించదు. అన్నింటికంటే పెద్ద ఖజానా ఏది? సంకల్పం, సమయాన్ని సఫలం చేసుకోవాలి. జ్ఞానం యొక్క ఖజానా ప్రత్యక్ష జీవితంలోకి రావాలి. జ్ఞానం వినటం మరియు వినిపించటం అనేది మొదటిస్థితి కానీ జ్ఞానాన్ని ఏమంటారు? జ్ఞానాన్ని ప్రకాశం, శక్తి అని అంటారు కదా! అంటే జ్ఞానం యొక్క అర్థం - సంకల్పం, మాట మరియు కర్మలలో ప్రకాశం మరియు శక్తి ఉండాలి అప్పుడే జ్ఞానస్వరూపులు అని అంటారు. 

కుమారీలు జ్ఞానస్వరూపంగా అయ్యేవారే కదా! కేవలం కోర్సు ఒకటే చెప్పేవారిగా అవ్వకూడదు. ఉపన్యాసమే చెప్పేవారిగా కాకూడదు. జ్ఞానం యొక్క శక్తి మరియు ప్రకాశం సంకల్పం, మాట మరియు కర్మలలో వెనువెంట ఉండాలి. కుమారీలంటే బాప్ దాదాకి విశేషమైన ప్రేమ. ఎందుకు తమ జీవితం యొక్క నిర్ణయం చేసుకున్నారు. చేసుకున్నారు కదా? లేక చేసుకోవాలా? బాగా ఆలోచించుకున్నారా? పక్కాగా ఆలోచించకుంటే శుభాకాంక్షలు. అప్పుడు మీకు ఇంతమంది తయారైన సహయోగులు దొరుకుతారు. ట్రైనింగ్ అయ్యే కుమారీలు చేతులు ఎత్తండి! ఎంతమంది ఉన్నారు? (80 మంది ఉన్నారు) ఇంత వరకు సేవలో పాల్గొనివారు చేతులెత్తండి! ఎవరైతే సేవాకేంద్రాన్ని నడిపించటంలేదో వారు చేతులు ఎత్తండి! లెక్క పెట్టండి. సగం మంది ఉన్నారు. అంటే ఇంతమంది సహయోగులైతే లభిస్తారు కదా! కుడిభుజాలా లేక ఎడమభుజాలా? కుడిభుజాలుగా అవుతారు కదా! మంచిది. కుమారీలకు బాప్ దాదా సేవాకేంద్రం యొక్క ఇల్లు కూడా ఇస్తారు మరియు వరుడు అయితే లభించే ఉన్నారు. ఇల్లు మరియు వరుడు తప్పకుండా కావాలి కదా! కుమారీలకు వరుడు అయితే లభించారు, ఇప్పుడు ఇల్లు కూడా లభిస్తుంది. సేవాకేంద్రం కూడా లభిస్తుంది. కుమారులకు కూడా లభిస్తుంది. కుమారులు మేము వెనుక ఎందుకు ఉండాలి అనుకుంటున్నారు. వెనుక లేరు, ముందే ఉన్నారు. కుమారులు లేకుండా కూడా సేవ ఎంత వరకు నడుస్తుంది! ఏ సేవా కేంద్రంలోనైనా చూడండి, హార్డ్ వర్క్ చేసే కుమారుడు లేకపోతే అక్కయ్యలు కూడా ఏమీ చేయలేరు. ఇద్దరూ అవసరమే. కనుక పాండవులకు కూడా పేరు ఉంది మరియు శక్తులకు కూడా పేరు ఉంది. ఇద్దరికీ పేరు ఉంది. మంచిది. మీ అందరి మీటింగ్స్ యొక్క సమాచారం బాప్ దాదా దగ్గరికి చేరుకుంది. భారతవాసీయుల యొక్క సమాచారం మరియు విదేశీయుల యొక్క సమాచారం కూడా చేరింది. 

ఈ సంవత్సరం దేశవిదేశాలలో కాన్ఫెరెన్స్ లు మరియు స్నేహం యొక్క కలయికలు చాలా జరిగాయి మరియు విదేశంలో రకరకాలైన ప్రొజెక్టర్లు కూడా నడుస్తున్నాయి కానీ బాప్ దాదా ఏమి చూసారంటే - సేవ యొక్క సంలగ్నత కూడా ఉంది మరియు సేవ యొక్క వేగం కూడా తీవ్రంగా ఉంది రెండు ఉన్నాయి. సమయం అనుసరించి ప్రతి ప్రొజెక్ట్ లేదా కాన్ఫెరెన్స్ లేదా స్నేహం యొక్క కలయిక అనండి లేదా ఏ ప్రోగ్రామ్ జరుగుతున్నా సమయానుసారంగా ఆ రూపంతోనే టాపిక్ పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నీరు అవసరం అయిన వారికి ఆ సమయంలో 36 రకాల భోజనం పెడితే వారు స్వీకరిస్తారా? ప్రొజెక్ట్ ఏదైనా అవ్వనివ్వండి, టాపిక్ ఏదైనా అవ్వనివ్వండి కానీ ఈ సమయంలో అందరికీ కావలిసినది శాంతి మరియు స్నేహం. శాంతి యొక్క దాహంతో, స్నేహం యొక్క దాహంతో ఉన్నారు. మంచి సేవ చేస్తున్నారు, మంచి ప్లాన్స్ తయారుచేస్తున్నారు, ఏదైతే సేవ జరుగుతుందో అది మంచిగా జరుగుతుంది. ఫలితం కూడా వస్తుంది మరియు ధైర్యం ఉంది. అందువలనే బాప్ దాదా సేవ యొక్క సమాచారం వింటూ సంతోషిస్తున్నారు మరియు ఏమి పాట పాడుతున్నారు? బాప్ దాదా ఏమి పాట పాడుతున్నారు? ఓహో పిల్లలు ఓహో......మరియు ఈ సమయంలో ప్రోగ్రామ్స్ అయితే నడవాలి, ప్రోగ్రామ్స్ ఆపకూడదు. సమయం యొక్క పరిస్థితులు ప్రోగ్రామ్ ని ఆపితే ఆపనివ్వండి కానీ మీరు ప్రోగ్రామ్స్ ని ఆపకూడదు. ఒకవేళ మీరు ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు సమస్యలు వస్తే వచ్చేవారు, వెళ్ళేవారు వారే అర్థం చేసుకుంటారు. మీరెందుకు చేయకూడదు! మీరు దాత యొక్క పిల్లలు కనుక ఇవ్వటం, ప్రోగ్రామ్ చేయటం ఆపకూడదు. రండి, భలే రండి, సంతోషంతో రండి. స్వాగతం చేస్తాము అనాలి. పరిస్థితులు వచ్చినప్పుడు పరిస్థితులే వారిని ఆపేస్తాయి కానీ మీరు ఆపకండి. ఇప్పుడు చూడండి అమెరికా పీస్ విలేజ్ లో కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా! అలజడి జరిగినప్పటికీ అమెరికాలో కూడా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కదా! ఇంకా మంచిగా జరిగాయి. ఆపినా ఆగలేదు కదా! ఇప్పటి వరకు అంటే ఈ 4వ తారీఖు వరకు ఏవైతే ప్రోగ్రామ్స్ తయారుచేసారో అవి ఎవరైనా ఆపారా! బాంబ్స్ కూడా వేస్తున్నారు. వేయనివ్వండి. యుద్ధం అయితే జరుగుతుంది కదా! వింటూ ఉండండి. వినటం ద్వారా బ్రాహ్మణులైన మీ యొక్క విశేష సంస్కారం - దయాహృదయం ప్రత్యక్షం అవుతుంది మరియు ప్రత్యక్షం అవ్వటమే అవసరం. ఈ సమయంలో ప్రతి ఒక ఆత్మ పట్ల దయా హృదయులుగా, దాతగా అవ్వాలి. ఏదోకటి ఇవ్వవలసిందే. మనసాసేవ ద్వారా అయినా, శుభభావనతో అయినా, శ్రేష్ట శక్తి ఇచ్చే వృత్తి ద్వారా అయినా. ఆధ్యాత్మికశక్తి నిండిన మాట ద్వారా అయినా, మీ యొక్క సంబంధ, సంపర్కాల ద్వారా అయినా....ఏదోకటి ఇవ్వాలి కానీ ఏ ఆత్మ వంచితం కాకూడదు. దాతగా అవ్వండి, దయాహృదయులుగా అవ్వండి. అందరు అరుస్తున్నారు. బాబా ముందు ఎవరి భాషలో వారు శాంతి ఇవ్వండి, స్నేహం ఇవ్వండి అని అరుస్తున్నారు. మనస్సు యొక్క ప్రేమ ఇవ్వండి, సుఖం యొక్క కిరణాలు ఇవ్వండి అని. వారికి బాబా ఎలా ఇస్తారు? పిల్లలైన మీ ద్వారానే ఇస్తారు కదా! బాబాకి మీరందరు కుడిభుజాలు. ఏదైనా ఇవ్వాలంటే చేతుల ద్వారానే ఇస్తారు కదా! కనుక మీరందరు బాబాకి కుడిభుజాలు కదా? పాండవులు కుడిభుజాలేనా? ఇంతమంది బాబాకి కుడిభుజాలుగా ఉన్నారు. కుడిభుజాలైన మీకు స్మృతిచిహ్నం కూడా ఉంది. ఏమి స్మృతిచిహ్నమో తెలుసా? విరాటరూపం యొక్క చిత్రం చూసారా, దానిలో ఎన్ని చేతులు చూపిస్తారు? ఇది బాబాకి ఇంతమంది కుడిభుజాలైన దానికి గుర్తు. దానిలో కుమారీల యొక్క చిత్రం ఉంది కదా? కనుక ఇప్పుడు బాబా తన యొక్క కుడిభుజాల ద్వారా ఆత్మలకు సుఖం, శాంతి యొక్క బిందువు ఇప్పిస్తారు కదా! తపనతో ఉన్నవారికి బిందువు ఇవ్వకపోతే ఎంతగా తపిస్తారు! 

ఇప్పుడు అందరు హద్దు యొక్క విషయాల నుండి అతీతంగా అయిపోండి. హద్దు యొక్క విషయాలలో ,హద్దు యొక్క సంస్కారాలలో సమయం పోగొట్టుకోకండి. బాప్ దాదా ఈరోజు కూడా పిల్లలందరికీ ఇక్కడ కూర్చున్నా, సేవాకేంద్రంలో కూర్చున్నా, విదేశంలో ఉన్నా కానీ దయాహృదయం యొక్క భావనతో సైగ చేస్తున్నారు - బాప్ దాదా ప్రతి పిల్లవాడిలో ఇప్పటి వరకు హద్దు యొక్క విషయాలు, హద్దు యొక్క స్వభావ, సంస్కారాలు లేదా తుంటరితనం, లేదా చతురత యొక్క సంస్కారాలు, సోమరితనం యొక్క సంస్కారం చాలా సమయం నుండి చూస్తున్నారు. కొంతమంది పిల్లలు అందరూ అలాగే నడుస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరికి తెలుసు అని అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు బాప్ దాదా దయాహృదయులుగా ఉన్నారు. అందువలన చూస్తూ, వింటూ కూడా దయ చూపిస్తున్నారు. కానీ ఎంత వరకు ఇలా దయాహృదయులుగా ఉండమంటారు? అని బాప్ దాదా అడుగుతున్నారు. ఎంతవరకు? ఇంకా సమయం కావాలా? బాబా నుండి సహాయం అడుగుతున్నారు. కానీ ఎంత వరకు అడుగుతూ ఉంటారు? ప్రకృతి కూడా అడుగుతుంది. మీరు జవాబు ఇవ్వండి. ఇప్పుడైతే కేవలం తండ్రి యొక్క రూపం నడుస్తుంది. శిక్షకుడు మరియు సద్గురువు యొక్క రూపం అయితే ఉంది కానీ తండ్రి యొక్క పాత్ర నడుస్తుంది. క్షమాసాగరుని పాత్ర నడుస్తుంది. కానీ ధర్మరాజు యొక్క పాత్ర నడిస్తే ఏమి చేస్తారు? బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - ధర్మరాజు రూపంలో కూడా ఓహో పిల్లలు ఓహో... అనే ధ్వని చెవులలో వినిపించాలి అని. మరలా ఇక బాబాని నిందించకూడదు. బాబా మీరు చెప్పలేదు. మేము తయారవుతున్నాము కదా అని. అందువలన ఇప్పుడు హద్దు యొక్క చిన్న చిన్న విషయాలలో, స్వభావాలలో, సంస్కారాలలో సమయం పోగొట్టుకోకండి. నడుస్తున్నాము, నడుస్తాము అని కాదు, రెండు రెట్లు, మూడు రెట్లు, వంద రెట్లు జమ అయిపోతూ ఉంటుంది. నడిచిపోదు. అందువలన మనస్సులో ఈ ధృఢసంకల్పం యొక్క దీపం వెలిగించండి. హద్దు నుండి బేహద్ దృష్టి, వృత్తి, కృతి తయారుచేసుకోవాలి. అందువలనే బాప్ దాబా తయారవ్వవలసింటదే అని చెప్తున్నారు. ఈ రోజు తయారు అవ్వవలసిందే అని చెప్తున్నారు. తర్వాత ఏమంటారు? టూ లేట్ (బాగా ఆలశ్యం అయ్యింది) అంటారు. సమయాన్ని చూడండి, సేవని చూడండి, సమయం ముందుకు పరుగు పెడుతుంది, సేవ కూడా పెరుగుతుంది కానీ స్వయం హద్దులో ఉన్నారా లేక బేహద్ లో ఉన్నారా? హద్దు యొక్క విషయాల వెనుక మీరు పరుగు పెట్టకండి. అప్పుడు బేహద్ వృత్తి, స్వమానం యొక్క స్థితి మీ వెనుక పరుగు పెడుతుంది. బాప్ దాదా ఈ సంవత్సరం ఈ సమయం వరకు చేసిన దానిలో సంతుష్టం అవుతున్నారు. 

ఇప్పుడు సేవలో అనుభూతి చేయించాలి. దీపంపై దీపపు పురుగులను బలి చేయాలి, సహయోగిగా చేసినా, ఎలా తయారుచేసినా ఇప్పుడు అనుభూతి యొక్క ఖజానాను తెరవండి. బావుంది అనేంత వరకు చక్రం తిరిగే దీపపు పురుగులుగా చేయకండి. అనుభూతి యొక్క కోర్సు ద్వారా పక్కా దీపపుపురుగులుగా అవుతారు. చాలా బావుంది, స్వర్గంలా ఉంది... ఇంత వరకు అనుభవం అవుతుంది. ఇదే యదార్ధజ్ఞానం..... ఇంత వరకు సేవ యొక్క ఫలితం మంచిగా ఉంది. ఇప్పుడు అనుభూతి స్వరూపంగా అయ్యి అనుభవం చేయించండి. అనుభవం చేసుకునేవారు బాబాతో డైరెక్ట్ సంబంధం పెట్టుకునేవారు. ఈవిధమైన అనుభవీ దీపపుపురుగులను తయారుచేయండి. సహయోగులుగా చేసారు, దీనికి శుభాకాంక్షలు. ఇంకా తయారుచేయండి, ఇదే స్థానం, ఈ స్థానం నుండే ప్రాప్తి లభిస్తుంది అని ఇంత వరకు అనుభవం చేసుకుంటున్నారు కానీ బాబాతో సంబంధం జోడింపచేయండి. వారు దీపం వెనుకే తిరుగుతూ ఉండాలి. కనుక ఈ సంవత్సరం విశేషంగా బాప్ దాదా యొక్క అనుభూతి చేయించే కోర్సు సేవలో చూడాలనుకుంటున్నారు. దీని ద్వారానే సాక్షాత్కారాలు కూడా అవుతాయి మరియు సాక్షాత్ బాబా ప్రత్యక్షం అవుతారు. కనుక ఏమి చేయాలో అర్థమైందా? ప్లాన్ లభించింది కదా? ఈ సంవత్సరం ఎంతమందిని దీపమైన బాబాకి బలి చేస్తారు అనే ఫలితం చూస్తాను. స్వాహా అవ్వకపోయినా బాబా, బాబా అనే చక్రం అయితే తిరుగుతారు. మంచిది, కుమారీలు మంచిగా ఉన్నారు కదా! మంచిది. 

నలువైపుల పిల్లల యొక్క ఉత్తరాలు కూడా బాప్ దాదాకి లభిస్తున్నాయి. పిల్లలు వ్రాయటం ప్రారంభిస్తున్నారు. దాని కంటే ముందే అది బాబా దగ్గరికి చేరిపోతుంది. మనస్సు యొక్క ధ్వని కదా! ఇది అయితే చేతులతో వ్రాస్తున్నారు కానీ మొదట మనస్సు యొక్క ధ్వని మనోభిరామునికి చేరిపోతుంది. ఇది కూడా మంచిది. దీని ద్వారా కూడా బాప్ దాదా స్మృతి వస్తున్నారు కదా! సమాచారం వ్రాసే సమయంలో ఎంత ఆనందంగా ఉంటుంది! కనుక ఎవరైతే బాప్ దాదాకి ఉత్తరాల ద్వారా, ఈ మెయిల్ ద్వారా, సాధనాల ద్వారా ప్రియస్మృతులు మరియు సమాచారం పంపించారో వారందరికీ ఒక్కొక్కరి పేరు, పేరున ప్రియస్మృతులు మరియు శుభాకాంక్షలు ఇస్తున్నారు. మీరందరు అయితే సన్ముఖంగా ఇస్తున్నారు కదా! వారికైతే ఇవ్వవలసి ఉంటుంది కదా! కనుక అందరికీ నలువైపుల ఉన్న పిల్లలకు దీపావళి యొక్క శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు. ఏ దీపావళి జరుపుకోవాలో చెప్పాను కదా! మంచిది. 

నలువైపుల ఉన్న బాప్ దాదా హృదయసింహాసనాధికారి శ్రేష్టాత్మలకు, సదా హద్దు యొక్క స్వభావ, సంస్కారాలను పరివర్తన చేసుకుని బేహద్ విశ్వపరివర్తకులకు, సదా ఒక సెకను, ఒక సంకల్పం కూడా వ్యర్ధంగా పోగొట్టుకోకుండా ఉండేవారికి, జమ చేసుకునే తీవ్రపురుషార్ధి పిల్లలకు, సదా దయాహృదయులుగా అయ్యి దాతగా అయ్యి ప్రతి ఆత్మకు, బ్రాహ్మణాత్మ అయినా, దాహంతో ఉన్న ఆత్మలకు ఏదోక బిందువు ఇచ్చేవారికి, శక్తినిచ్చేవారికి, ఇటువంటి విశాలహృదయులైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments